#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
ధారావాహిక రెండవ భాగం
Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 2 - New Telugu Web Series Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 23/11/2024
తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 2 - తెలుగు ధారావాహిక
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ:
హైదరాబాద్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు.
నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది.
ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 2 చదవండి..
వర్థనమ్మకి అతిగా ఉండేది, అతిగా కనిపించేది ఏదైనా సరే నచ్చదు. వ్యామోహం, ఇఛ్ఛ, వాంఛ- చివరకు పరస్పరానురాగంలో కూడా ఆమె అతితత్వాన్ని భరించదు. ఎందుకంటే ఆమెకు అతితత్వంలో కృత్రిమత్వం యెక్కువగా కనిపిస్తుంది. ఊరకేనా అన్నారు.. అతిగా ఉంటే అమృతం సహితం విషంగా మారవచ్చని! ఆమెకంతా చల్లగా నిదానంగా మోతాదుకి మించని రీతిన, కొండవాగు ప్రక్కన, పిల్లగాలుల మధ్యన సేదతీర్చుకున్నట్లుండాలి.
అంతటి తీక్షణ ఎక్స్ రే కళ్ళతో సర్వమూ పర్యవేక్షించే వర్థనమ్మకు, కరెస్పాండెంట్ పర్సనల్ వింగ్ లోని సీనియర్ అసిస్టెంటు శంకరం గుర్తుకి వచ్చాడు. స్వఛ్ఛమైన సముద్ర జలాలపైన ఏటవాలుగా వాలితే, మార్తాండుడి కాంతి నేత్రాలు రెండువందల నలభై అడుగుల లోతు వరకూ ప్రసరిస్తాయి. అంతటి లోతైన సున్నిత మనస్కురాలన్నమాట వర్థనమ్మ.
అటువంటి పుష్కలమై న మానసిక వికాసం గల ఆమెకు శంకరంలో మచ్చుకకి కూడా మచ్చకనిపించేంత అవలక్షణం గోచరించలేదు. ఇప్పటి యువతీ యువకులు కొందరు డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీకి వెళ్ళకుండానే తమకు తాముగా నటనా కౌశలం నేర్చుకోగల బంగీ జంప్ మాష్టర్లని ఆమెకు తెలుసు. వాళ్ళలో ఇంకొందరున్నారే వాళ్ళ గురించి చెప్పనే అవసరం లేదు. రివ్వు రివ్వున తేలుతూ పట్టున ప్రిదిలిపోయే రంగుల బెలూన్ల వంటి వారని కూడా తెలుసు.
మన్ననలో మాటతీరులో అణువణువునా హుందాతనం ఉంటుంది శంకరం ప్రవర్తనలో. ఆమెకెప్పుడైనా ఏదైనా కబురం దించాల్సి వస్తే, అతడు సాధారణంగా ఇంటర్ కామ్ ఉపయోగించడు. మెసేంజర్ని కూడా పంపడు. తిన్నగా ఆమె అఫీషియల్ చేంబర్ కో లేక భూక్తాయాసం తీర్చుకుంటున్న రెస్ట్ రూములోకో వచ్చి స్వయంగా చెప్పి వెళ్తాడు.
ఆమెనుండి ఆదేశాలు అక్కడికక్కడే అందుకుని నోట్ పుస్తకంలో గుర్తుంచుకుంటాడు. మరొక సారి గుర్తుచేసే అవకాశానికి తావివ్వకుండా వాటిని పూర్తిగా అమలు చేసి మళ్లీ స్వయంగా వచ్చి రిపోర్ట్ చేసి వెళ్తాడు. ఇప్పటి యుతరంలో ఎంతమందికి ఇటువంటి ఉదాత్తగుణం ఉంటుందని- సున్నితమైన సమర్థత ఉంటుందని--
ఆమె డ్యూటీలో చేరిన మొదటి రోజున స్కూలు కరెస్పాండెంటు కోదండం ఆమెకు కేటాయించిన చేంబర్ని చూపించి తను భోజనం చేయడానికి భోజనానంతరం విరామం తీసుకోవలసిన రెస్ట్ రూముకి తీసుకెళ్ళి ఆ తరవాత ఆమె అవసరాలు గమనిం చే బాధ్యతను శంకరానికి విడిచిపెట్టి వెళ్లిపోయాడు.
శంకరమే ఆ రోజంతా ముఖాన ఇసుమంత విసుగు చూపించకుండా తను లేవదీసిన రకరకాల క్వరీలను క్లియర్ చేస్తూ తనతో బాటు గడిపి- అటుపిమ్మట వెళ్లిపోయేముందు కూడా తగు అక్కర చూపిస్తూ అన్నాడు- “అప్పుడప్పుడు మీకు గెస్ట్ హౌస్ స్టాఫ్ సమయానికి అందుబాటులో ఉండకపోవచ్చు. అప్పుడు మీకేదైనా కావలసొస్తే నన్ను ఇంటర్ కామ్ ద్వారా పిలవండి. నేను స్వయంగా వస్తానండి. దీనికి అంటి పెట్టుకుని ప్రక్కగదిలోనే పర్సన ల్ కిచెన్ ఉందండి. పావనమ్మగారే దాని ఇన్ చార్జీ.
ఆమెగారు చనిపోయిన అటెండర్ బాలయ్యగారి భార్య. మీకు కావల్సినప్పుడు కాఫీ గాని టీ గాని చేసిపెడ్తుంది. షుగర్ గాని వద్దంటే మీకోసం షుగర్ లెస్ టీ-- ప్రత్యేకంగా ప్లాస్కులో పోసుంచుతుంది. ప్లీజ్—డాంట్ హెసిటేట్ టు కాల్ మీ మేడమ్! “ అంటూ సెలవు తీసుకుని నిష్క్రమించాడు.
ఆమె అతడి మాటతీరుకి మంత్రముగ్థురాలై చూస్తూ కూర్చుంది. ఆఫీసు స్టాఫ్ అయుండి, ఒక నాలగవ తరగతి అటెండర్ భార్యను ‘గారూ! ’అని గౌరవపూర్వకంగా పిలవడం వర్థనమ్మ మొదటి సారి చూస్తూంది. మొదటిసారి వింటూంది.
అతడి సద్భావ ప్రవర్తన ఆమెను ఎంతగా ఆకట్టుకుందంటే- ‘మీరు నన్ను గమనించడానికి ప్రత్యేకంగా రానవసరం లేదు శంకరం! ఇక్కడి సీనియర్ టీచర్ మాధవి నాకూతురే! ఆమె వచ్చి చూసు కుంటుందిలే’అని చెప్పి వారించాలనుకుంది గాని— మనస్కరించలేదామెకు. శంకరాన్ని మళ్ళీ చూడాలనిపించిందామెకు. మార్దవంగా ప్రాత:కాల దేవీ ప్రార్థనలా ధ్వనించే అతడి గొంతు వినాలనిపించిందామెకు. “సదైవ ప్రియ దర్శన:” అంటే ఇదేనేమో!
స్త్రీ మనస్తత్వం అటువంటిది మరి. వయసుతో అనుభవంతో సంబంధం లేకుండా మంచీ మన్ననకీ— మృదు స్వభావానికీ కరిగిపోతుంది. తరించిపోతుంది. సభ్యతా సంస్కారాలు పరిఢవిల్లే విద్యావంతుల వంశంలో సంప్రదాయక నేపథ్యం గల యింట్లోనో పుట్టి ఉంటాడు. లేక పోతే-- అంతటి సభ్యతా సంస్కారాలు ఎలా జాలువారుతాయి! సీనియర్ అసిస్టెంటు శంకరం పట్ల వర్థనమ్మ గారికేర్పడ్డ సదభిప్రాయం క్షణికమైనది కాదని సరైనదేనని వారం రోజుల్లో తేటతెల్లమైంది.
పూణేలోని ఎన్. జీ. ఓ. వాళ్లు నడపబోతూన్న వర్క్ షాపుకి గురజాడ హైస్కూలు నుండి ఒక అభ్యర్థిని పంపవలసిందిగా స్కూలు ప్రిన్స్ పాల్- కమ్- మేనేజి మెంటు కమిటీ వైస్ చైర్మన్ హేమచంద్రరావు నుండి తాకీదు వచ్చింది. లోతైన అనుభవం, లోతైన మనిషి కావడాన కొద్దిరోజుల్లోపల ఆ ఉదంతంతో అక్కడి మనుషుల మనస్తత్వాలను కొంతలో కొంతవరకు చదవగలిగిందామె.
ఇక విషయానికి వస్తే-- ఆమెకు పూణేకు వెళ్ళవలసిన అభ్యర్థిని ఎంపిక చేసి పంపించే అధికారం ప్రిన్స్ పాల్ గారు ఆమె కు కట్టబెట్టారన్న వార్త పెట్రోల్ ట్యాంకునుండి కారిన చమురు తెట్టులా వ్యాపించింది. అంతే! అంతవరకూ ఆమె చేంబర్ వేపు తొంగి కూడా చూడని టీచర్లు- ఆఫీసు సూపరింటెండెంటు- అకౌంటెంట్లూ—పనిగట్టుకుని ఆమెను పలకరించి వెళ్ళసాగారు. వర్షపు నీరుతో నిండిన చెరువు వద్దనే కదా కప్పలు చేరుతాయి. వాటి బెకబెకలు వినిపిస్తాయి!
కాని ఒక వ్యక్తి మాత్రం ఆమె గది వేపు రాలేదు. కాని వర్థనమ్మ ఊరుకోలేదు. తానే స్వయంగా రౌండ్సుకి వచ్చినట్టు పరిపాలనా విభాగంలోకి వచ్చి పలకరించింది- “అయ్యా శంకరం! బాగున్నారా? ”
“ థేంక్స్ మేడమ్. బాగున్నానండీ“అంటూ లేచి నిల్చున్నాడతను.
“ఎందుకో నాకలా అనిపించడం లేదే!”
ఆ మాట విని అతడు విస్మయంగా చూసాడు; ఎందుకలా అనుకుంటున్నారని ప్రశ్నించే విధంగా కనుబొమలెగరేస్తూ--
”కాకపోతే- నన్ను చూడాటానికి అటు మూడు రోజులుగా రాలేదుగా! ”
“సారీ మేడమ్! నేను ముందేచెప్పాగా మేడమ్. ఏదైనా కావలసొస్తే నాకు ఇంటర్ కామ్ ద్వారా కబురందించమని! “ ఆమె తేరి చూసింది. అంటే ఈ పెద్దమనిషి పనుంటేనే వస్తాడన్నమాట! ఈసారి మనసున నవ్వుకుంటూ అందామె-
“ఔను సుమా! మర్చే పోయాను. ఈ వయసు మళ్లిపోయిన వాళ్ళతో వచ్చిన తంటా ఇదేనయ్యా! చెప్పింది వెంట వెంటనే మరచిపోతుంటారు. ఇప్పుడొక సారి నా రెస్టు రూమువేపు వస్తారా! ”
“షుయర్ మేడమ్. మీరు వెళ్ళిన వెంటనే నేను చేరుకుంటానండీ! “
వర్థనమ్మ తన పర్సనల్ అసిస్టెంటుతో కలసి వెళ్లిపోయిన కొద్ది నిమిషాల తేడాతో అతడు ఆమె ముందు నిల్చున్నాడు. అతడు వెళ్ళకముందే మాధవి తల్లి ప్రక్కన కూర్చుని ఉంది. అతణ్ణి చూసి వర్థనమ్మ అడిగింది- “ఈమెవరో తెలుసా శంకరం? ”
“షుయర్ మేడమ్. సీనియర్ క్లాస్ టీచర్. బ్రిలియంట్ అకాడమిక్ రికార్డుంది. కాలేజీ గోల్ట్ మెడలిస్టు కూడాను. మాధవిగారిది చాలా ఫ్రెండ్లీ స్వభావం మేడమ్. మీలాగే చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారండి“
“మాధవి గురించి బాగానే తెలుసన్నమాట! మరి మాధవీ! నీకు శంకరం గురించి-- “
“తెలుసమ్మా! రెండు మూడుసార్లు వాళ్ళ ఆఫీసు విభాగంలోకి ఏదో పనుండి వెళ్లాను. పాయింటుకి పాయింటన్నట్టు బదులిస్తారు. మిత భాషి. ముత్యాలు రాలిపోతాయేమోనన్నట్టు మాటల్లో పొదుపుగా ఉంటారు”
“మితభాషే కాదు, హితభాషి కూడాను”అంటూ ఆమె అతడివేపు తిరిగింది- “అన్నట్టు శంకరం- మరీ అంతలావు బిగుసుకుపోయి నట్టు ఉండకూడదు. కలుపుగోరుతనంతో కాకపోయినా కొంచెం కలివిడిగా మెసలుకోవాలి. అందునా అందమైన అమ్మాయిల పట్ల అంత ఉదాసీనంగా ఉంటే యెలా? వాళ్ళు తల తీసేసినట్టు ఫీలవరూ!”
ఆ మాటతో మాధవి ముఖారవిందం మారింది. చురుగ్గా తల్లి వేపు చూస్తూ అంది- “అమ్మా! కొంచెం ఊరుకుంటావా! ఇదేంవిటి మనిల్లనుకున్నావా కూతురుతో పరాచికాలాడటానికి? ఎంతైనా కాకి పిల్ల కాకికి ముద్దే- ఇక తల్లి ప్రేమకు హద్దేముందని”
అప్పుడు శంకరం, బ్రాడ్ స్మైల్ తో తల్లీ కూతుళ్ల సంభాషణతో శృతి కలిపాడు- “ఇఫ్ యు డోంట్ మైండ్.. నేనొక మాట చెప్పనా మేడమ్! ”
మాధవి అలాగే అన్నట్టు తలూపుతూ లేచి నిల్చుంది.
“యు ఆర్ రియల్లీ బ్యూటిఫుల్ విత్ క్లాసికల్ టచ్. వర్థనమ్మగారి కుమార్తె వర్థనమ్మగారిలాగే కదూ ఉంటారు! ”
“అబ్బో! మాటలు రాని చిలకనుకున్నాను. మచ్చిక చేసుకోవడంలో మీకు మీరే సాటిలా ఉన్నారే! ”- మాధవి.
“లేదు మాధవీ! శంకరం ఆ బాపతు మనిషి కాడు” అంటూ తన ముందున్న ఫైలు నుంచి ఓ కవరు తీసి అందిచ్చింది. అతడు భవ్యంగా అందుకుని కవరులోనుంచి పేపరుని బైటకు తీసి చదివాడు. చదివి వర్థనమ్మను ఆశ్చర్యంగా చూస్తూండి పోయాడు. కొన్ని క్షణాల పాటు మాటలు రానట్టు నిశ్శబ్దంగా ఉండిపోయాడు శంకరం.
“అదేంవిటి అలా మ్రాన్పడి నిల్చుండిపోయారు! అదేంవిటి- ప్రమోషన్ ఆర్డరేమీ కాదుగా! ట్రైనింగ్ కోసం అడ్మినిస్ట్రేటివ్ వర్కుషాపుకి పంపిస్తున్నాం. ఒకరి తరవాత ఒకరిని పంపించడం రొటీన్ వ్యవహారం. మీదు మిక్కిలి మీకు ఎలిజిబిలిటీ ఉంది. అవన్నీ చూసే మిమ్మల్ని సెలెక్ట్ చేసి పంపిస్తున్నాం. ఈజిట్ ఓ. కే? ”
అప్పటికీ అతడు వెంటనే నోరు విప్పలేక పోయాడు. రవంత సేపు ఆగి అన్నాడు-
“ఔను. నాకు ఎలిజీబిలిటీ ఉన్నమాట వాస్తవం. కాని ఇది నాకు గత నాలుగేళ్ళుగా ఉన్న ఎలిజీబిలిటీయేగా. మీరు తప్ప నన్నెవ రూ ఇటువంటి ముఖ్యమైన ట్రైనింగ్ అసైన్ మెంటుకి కన్ సడర్ చేయలేదు కదండీ! మరొకటి- మీరు సెలవిస్తే చెప్తాను”
వర్థనమ్మ చెరగని నవ్వుముఖంతో తలూపింది చెప్పమన్నట్టు.
అతడప్పుడు చెప్పసాగాడు- “మీరు పెద్దవారు. మీ చూపు లో ఇది మామూ లు విషయమే కావచ్చు. కాని ఇది నాకు ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. నా ఉనికిని నేను గుర్తించ గలిగే అవకాశం ఇచ్చారు. థేంక్స్ ఎ లాట్! ”అంటూ దగ్గరకు వచ్చి వర్థనమ్మ పాదాలను తాకి వెనుతిరిగాడు.
అప్పుడు వర్థనమ్మ కూడా సీట్లో నుంచి అసంకల్పితంగా లేచింది. ”ఒక్క నిమిషం! ”
వర్థనమ్మ గొంతు విని అతడాగాడు.
“మీనాన్నగారేమి చేస్తున్నారు? మీ అమ్మగారు కూడా ఉద్యోగం చేస్తుంటారా! ”
అతడు బదులివ్వడానికి కొన్ని క్షణాలు తీసుకున్నాడు- “ఇక్కడున్న స్టాండర్డ్ హోటల్ ఉంది కదండీ. అందులో కిచెన్ మేట్ గా ఉండేవాడు. ఒకరోజు జారిపడి నడుం కొంచెం దెబ్బతిందండి. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారండి. మా అమ్మేమో నన్నూ మా బాబునీ చూసుకుంటూ ఇంట్లోనే ఉంటారండి.
మా అమ్మ కష్ట జీవండి. నేను చదువుకునే రోజుల్లో నన్ను చదివించడం కోసం పెసరట్లు- ఇడ్లీలు. గారెలూ –బూరెలూ చేసి రోడ్డు జంక్షన్ వద్ద అమ్మే వారండి. నాకు ఎలాగూ ఉద్యోగం దొరికింది కదండీ! ఇప్పుడేమో బాబుతో ఇంట్లోనే ఉంటున్నారండీ!”
లేచినది లేచినట్లుగానే వర్థనమ్మ ఆశ్చర్యంగా చూడసాగింది. అట్టడుగు సామాజిక పొరల్లోనుంచి వచ్చిన రంగుల రవ్వన్న మాట శంకరం! ఆమె విస్ఫారిత నేత్రాలతో అలా చూస్తూనే నవ్వింది. ఆమెలో కరుణ తరంగం లేచి పడింది.
అప్పుడు శంకరమే కొనసాగించాడు- “మరొకటి కూడా చెప్పాలనిపిస్తుందండి. చెప్పేదాండీ! “
ఉఁ- అందామె.
“మీరు ముందు కూర్చోండి మేడమ్. మీకు భోజనానికి వేళయేటట్టుంది. తరవాత మాట్లాడుకుందామా మేడమ్”
కాని ఆమె అతడి సలహాను స్వీకరించలేదు. చెప్పిముగించమంది.
“మాది నిజంగా వెనుకబడిన సమాజానికి చెందిన కుటుంబమండి. మా పూర్వీకులు కాటి కాపురులు. కడప నుంచి వచ్చిన వాళ్లమండి. ఒకసారేమైందంటే- మా తాతయ్య, వాళ్ల చిన్ననాటి ఫ్రెండు.. మావటి ప్రోద్బలంతో ఏనుగెక్కాడు.
కొన్ని ఏనుగులకి సారాయం వాసనంటే ససేమిరా గిట్టదండి. అది తెలుసుకోకుండా మాతాతయ్య పూటుగా తాగి ఏనుగునెత్తి ప్రక్కన కూర్చున్నాడేమో- దానికి చిర్రెత్తుకొచ్చి నేల పైకి విసిరి తొక్కేసింది. ఆయన చచ్చిపోతూ మా బాబుతో ఒక మాట అన్నాడట- ‘నువ్విక్కడుండకు. నీ కొడుకుని తాగుబోతుగా మార్చకు. పట్నం వెళ్ళిపోయి కూలో నాలో చేసుకు బ్రతుకు. వాణ్ణి చదివించు‘ అని ప్రాణం విడిచాడు. ఆ మాటతో బాబూ అమ్మా ఇక్కడకు వచ్చేసారండి.
మా తాతయ్య మాట ప్రకారం మా బాబు నన్ను తాగొద్దని పకడ్బందీగా చెప్పాడే గాని, ఆయన మాత్రం తాగుడు పూర్తిగా మానలేదు. ఇంకా చెప్పాలంటే- ఈ విషయంలో ఆయన ఫెయిల్డ్ ఐపోయారండి. ఇక్కడ కూడా చుట్టుప్రక్కల మా దూరపు బంధువులు కొందరున్నారండి. అడపా దడపా వచ్చి పోతుంటారండి. మరి నేను వెళ్ళొస్తానండి. పనుంటే సందేహించకుండా పిలవండి” అతడలా చెప్పుకుపోతూ ఒకచోట చట్టున ఆగిపోయాడు; చెప్పాలా చెప్పకూడదా అన్న సందిగ్థలో పడుతూ—
తను ప్రతిరోజు ఉదయమూ శివపురాణంలోని శివ స్తోత్రాలూ ప్రతి సాయంత్రమూ భగవద్గీత లోని పవిత్ర శ్లోకాలు పఠిస్తాడని, హైందవ ధర్మాన్ని పుణికి పుచ్చుకోవడానికి మనసా వాచా కర్మణ: పూనుకుంటాడని —ఇంకా ఇంకా చెప్పాలనిపించిందతడికి—కాని— హృదయాంకిత పొంగుని అణచుకున్నాడు. తిరిగి చూడకుండా సాగిపోయాడు.
ఒక్కొక్కప్పుడు కొందరి జీవనప్రవాహాలు చిత్రాతి చిత్రంగా మలుపులు తిరుగుతూ ఉంటాయి. కొందరిని చూస్తే మనసులోని ఆలోచనా ప్రవాహాలు మలుపు తిరిగి వాటికవే ముడుచుకుంటాయి. ఇంకొందరిని చూస్తేనేమో- వాళ్ల మనసులు వాల్తేరు కొండల్లోని వాగుల్లా పొంగి ప్రవహిస్తాయి. వర్థనమ్మలో శంకరం యేమి చూసాడో ఏది చూసి స్పందించాడో- స్వంత తల్లిముందు మనసు విప్పి చెప్పినట్టు మనసులో తారట్లాడే భావస్రవంతిని ఎక్కడా యేమాత్రమూ దాచకుండా అంతా పొంగి పొర్లించాడు.
వర్థనమ్మలో కూడా శంకరానికి తను అంతకంతకూ దగ్గరవుతున్నానన్న మృదు భావం పొడసూపింది. తల్లిలోని ఆ మృదు భావం మాధవికి స్పష్టంగా కనిపించింది. చిర్నవ్వు చిందిస్తూ తల్లిని కుదిపి డైనింగ్ టేబల్ వద్దకు తీసుకెళ్ళింది- ఇక టైమయింది- తినమంటూ--
----------------------------------------------------------------------------------------
న్యూయార్క్ చేరుకోవడానికి స్ట్రెయిట్ ఫ్లయిట్ లేదు. అబుదబీలో దిగి, అక్కడ గోడకుర్చీ వేసినట్టు రెండు విడతల సెక్యూరిటీ చెకింగ్ చేయించుకుని ఆ తరవాత అక్కడే రెండు గంటల విరామం తీసుకున్న పిమ్మటనే విమానం జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్ పోర్టుకి ఆకాశయానం చేసింది.
అది సుదీర్ఘమైన గగన యానమే సుమా! నేలపైన పిల్లిమొగ్గలు వేసే మనిషి ఒకసారి మేఘాలమధ్యకు చేరేటప్పటికి ఎంత నిస్సహాయంగా చేష్టలుడిగి ఉంటాడో! సర్వస్వమూ అక్కడి పైలట్ కో.. కో- పైలట్ కో లేక కన్నార్పకుండా అంతా చూస్తూన్న పైనున్నవాడికో తనను తను అప్పచెప్పాల్సిందే--
ప్రయాణ సమయమంతా వ్యక్తుల్నీ విషయాలనీ పరకాయించి చూస్తూన్న అతడికి నచ్చిన వైనం ఒకటుంది. అడిగినా అడగకపోయినా మేఘాల మధ్య ఉన్నామన్న స్పృహ కలిగించకుండా స్టూవార్డెర్లూ- స్టువార్డెస్ లూ సకల సదుపాయాలూ సముచిత రీతిలో గమనిస్తూండటం.
ఐనా సరే నరసింహమూర్తికి న్యూయార్క్ ప్రయాణం నిజంగానే అలసటనిపించింది. అతడి చూపు ప్రక్కనున్న స్త్రీ వేపు మరలింది. ఆవిడ ప్రయాణ బడలికతో అసహనానికి లోనవుతూ వంకర్లు పోవడం గమనించాడతను. అతడు సరళంగా ఇండియన్ ఆంగ్ల ఉఛ్చరణతో ఆమెను తీరిగ్గా ఒదిగి సేద తీర్చుకోమని చెప్పి సీట్ల మధ్యనున్న బార్ ని తీసివేసి ముందు వరసలో ఖాళీగా ఉన్న సీట్లోకి వెళ్లి కూర్చున్నాడు.
ఆకాశ వీధుల్లోనుంచి అలుపెరగని లోహపక్షి జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయంలో దిగుతున్నప్పుడు- నరసింహమూర్తి క్రూ విడిచిన హెచ్చరిక ప్రకారం యధావిథిగా తన్ సీట్లోకి వచ్చి కూర్చున్నప్పుడు ఆ అమెరికన్ మధ్య వయస్కురాలు అతడి చేతిని ఆప్యాయంగా నొక్కి- ‘థేంక్యూ మై సన్‘ అన్నప్పుడు అతడికి సాత్వికురాలు, పరమ దైవ భక్తురాలైన గోర్కీమహోశయుడి బామ్మ జ్ఞప్తికి వచ్చింది. తల్లి వర్థనమ్మ కళ్లముందు నిలచింది. అతడికి తెలియకుండానే అతడి రెండు చేతులూ ఆవిడ వీపు వెనక్కి వెళ్ళి తట్టాయి—
“ఇటీజ్ మై ప్లజర్ మేడమ్! ”అంటూ- ఆమెకు దారిచూపించాడు ముందుకి కదలడానికి వీలుగా-- .
ఆమె తదను గుణంగా స్పందిస్తూ అతడి చేతికి విజిటింగ్ కార్డు అందిస్తూ అంది- “అటు వేపు ఎప్పుడైనా వచ్చినప్పుడు మా ఇంటికి తప్పకుండా రండబ్బాయ్. మాఆయన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టి గేషన్ వింగులో సీనియర్ ఆఫీసర్. నేనేమో అసోసియేట్ ప్రొఫెసర్ గా డ్రామా అండ్ ఫెర్ ఫార్మింగ్ ఆర్ట్స్ కాలేజీలో కెరియర్ కొనసాగిస్తున్నాను” అంటూ ముందుకు సాగిపోయింది.
పిలవడమేమో పిలిచింది గాని- తను ఆమెగారి ఇల్లు చేరుకోవడం అంత మామాలు విషయమా! అతడు అయోమయంగా చూసాడు. తను అమెరికా గడ్డపైన కాలుమోపడం అదే మొదటిసారన్నది ఆమెకింకా అవగాహన కాలేదేమో! ఆమెకు ఇండిపిండెంటు ఇల్లు హోఫ్ మన్ రోడ్డులో ఉంది. ఆమెగారి పేరు మిసెస్ గ్రేసీ. ఎందుకైనా యెప్పుడైనా పనికి వస్తుందనుకుని విజిటింగ్ కార్టుని జేబులో ఉంచుకున్నాడు.
మరి కాసేటికి ఆమెను వడివడి నడకతో అందుకుని, తప్పకుండా రావడానికి ప్రయత్నిస్తానని ఓ మాట చెప్పి, ఫ్లయిట్ ప్యాసింజర్స్ కారిడార్ ద్వారా లాంజిలోకి చేరుకున్నాడు నరసింహమూర్తి. అక్కడ చోటు చేసుకున్న మరొక పొడవాటి క్యూ చూసి అతడికి దిమ్మ తిరిగినట్లయింది.
ప్లేనులో ఉన్నప్పుడే టెంపరరీ ల్యాండింగ్ వీసా ఫారమ్ లు ఇస్తూనే స్టువార్డెస్ చెప్పింది- “అక్కడ మరొక విధమైన ఇంటర్వ్యూ ఉంటుంది“అని.
కాని ఇంత పెద్ద క్యూలుంటాయని అతడు ఊహించ లేదు. మరి తనిలా ప్రతి సారీ ప్రతిచోటా క్యూలో నిల్చుంటుంటే తనిక నిర్ణీత సమయానికి ఎయిర్ బస్ అందుకో వడానికి అర్బన్ ఎయిర్ పోర్టుకి యెప్పుడు చేరుతాడని. ఒకవేపు చెకింగులు- మరొక వేపు పట్టు పట్టున యెదురయే వరసలూ ను-- ఏమిటో మరి!
ఇదంతా కాస్తంత అతిగానే తోచిందతనికి. వాతావరణం బైట శీతలంగా ఉన్నట్లనిపించినా లోపల మాత్రం అతడికి అసహనంగా ఉక్కపోతగానే తోచనారంభించింది. ఆడా మగా అన్న తేడాలేకుండా అందరి సెక్యూరిటీ గార్డుల హోల్ స్టెర్లలోనూ రివాల్వర్లు వ్రేలాడుతున్నాయి. వీటినన్నిటినీ గుది గ్రుచ్చి చూస్తే అతడికి కలిగిన భావమేమొక్కటే! అనుమానం పెనుభూతం. పలుచోట్ల సంభవిస్తూన్న హింసాత్మక సంఘటనలు ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా చేస్తున్నాయి.
నలువైపులా ఘటిల్లుతూన్న ఘోర సంఘటనలు- వాటి ద్వారా తలెత్తుతూన్న హింసాత్మక వాతావరణం నాలుగు చెరగులా విస్తరిస్తున్న ప్పుడు ఎవరు యెవర్ని నమ్మగలరు? ఎప్పుడేమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు? తీవ్రవాదులకు ప్రపంచ మంతా ఒక నాటక వేదికే. కాలగతులకు అతీతంగా ఎక్కడైనా యెలాగైనా మట్టి పొరల్ని చీల్చుకుంటూ పుట్టుకు రాగలరు. ఎక్కణ్ణించైనా అటాక్ చేయగలరు. మరప్పుడు రక్షకభటులకు కాళ్ళు కూడదీసుకునేంత వెసులుబాటు కూడా ఉండదాయె!
న్యూయార్క్ ట్రేడ్ సెంటర్ పైన జరిగిన దాడి తరవాత ఇక ముందస్తు జాగ్తత్తలకు తిరుగేలేదు. “రోజా”సినిమాలో చూపించిన సీను జ్ఞప్తికి వచ్చింది. కాశ్మీర్ లోయకు భర్తతో కొత్తగా వెళ్లిన భారతీయ గృహిణి అక్కడి పోకడ గమనించకుండా వినాయకుడి విగ్రహం ముందు కొబ్బరికాయ కొడ్తుంది. అంతే! మరుక్షణం దానిని చేతి బాంబ్ చప్పుడుగా తలపోసి పది మంది సెక్టూరిటీ గార్డులు ఒక్క సారిగా ఆమెను చుట్టుముట్టేసారు.
అప్పుడామె అంటుంది- “ఇదెక్కడి ఊరురా బాబూ! దేవుడికి కొబ్బరి కాయ కూడా కొట్టనివ్వరా వీళ్లు! ” అని.
సెక్యూరిటీ గార్డులకి కొబ్బరికాయకూ చేతి బాంబుకీ మధ్య ఉన్న తేడా తెలియదుగా మరి--
అప్పుడతనికి అబుదబీ విమానాశ్రయంలో జరిగిన సంఘటన కళ్ళముందు మెదిలింది. ఒకే ప్లేను నుండి- ఒకే చోట దిగిన తరవాత- అక్కడ అటువేపు అరబ్బు అధికారులు చెకింగ్ పూర్తిచేసిన తరవాత- ఇటు మళ్ళీ మరొకసారి అమెరికన్ సెక్యూరిటీ అధికారులు చెకింగ్ కి పూనుకోవడమేమిటి- వింతలో వింతకాకపోతే! తీవ్రవాద భావజాలం ఎంతటి అవాంఛనీయ వాతావరణాన్ని సృశ్టిస్తుందో కొందరికి మాత్రమే పూర్తి అవగాహన ఉంటుంది మరి.
ఒకానొకప్పుడు తెలుగు కార్మికులు ఇక్కణ్ణించి అటు బర్మాకి గాని మలయాకి గాని వెళ్లదలచుకుంటే- ఎంచక్కా కొల్ కొత్తావరకూ పొగబండి ఎక్కి అక్కడ కేవలం ఓడ కేవు మాత్రం కట్టి వెళ్ళొ స్తుండేవారు. ఇప్పట్లా అప్పుడు చెకింగ్ లు కౌంటర్ చెకింగ్ లూ ఏవి? అటువంటి అమాయకమైన రోజులు మళ్లీ ఎప్పుడొస్తాయో!
మొత్తానికి అతడికీ సెక్యూరిటీ చెకింగ్ క్యూలవల్ల ఎంతటి ఇబ్బంది దాపురించిందంటే- ల్యాండింగ్ వీసా కోసం ఇంటర్వ్యూకి హోజరయి సామాను బ్యాగేజి సెక్షన్ నుండి అందుకుని లాంజినుండి బైటకొచ్చేటప్పటికి రిలే సబర్బన్ కు తీసుకువెళ్ళే లోకల్ ఎయిర్ బస్ కి సాగే ట్రాన్సపొర్టేషన్ గొలుసు కట్టు తెగిపోయింది. టైమయిపోయిందంటూ అక్కడి ఎయిర్ బస్ స్టాఫ్ వాళ్ళు చేతు లెత్తేసారు. ఇక వేరే దారిలేక నరసింహమూర్తి వీల్ ట్రాలీ అందుకుని తన రెండు సూట్ కేసుల్నీ దానిలో పెట్టుకుని—వాటిని తోసుకుంటూ వెళ్ళి సర్క్యూట్ ట్రైనులోకి ఎక్కించుకుని తానే స్వయంగా బ్యాగేజీని ఎయిర్ బస్ వద్దకు తీసుకెళ్ళవలసి వచ్చింది.
దీనిని అలక్ష్యమనా లో లేక అసమర్థత అనాలా అతడికి అర్థం కాలేదు. అక్కడ ల్యాండింగ్ వీసా కోసం ఇంటర్వ్యూ జరుగుతుందన్నది ఇక్కడున్న వీళ్లకు తెలవద్దా! క్యూ ముగించుకున్నవాళ్లు ఇక్కడకు వచ్చేంత వరకూ ఇక్కడ పనిచేసే వాళ్లు ఆగవద్దా! ఎక్కడైనా ఏ ప్రాంతమైనా ఎవ్రీథింగ్ కెనాట్ బి పెర్ పెక్ట్- అన్నది తెలుస్తూనే ఉందిగా!
=======================================================================
ఇంకా వుంది
========================================================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Komentar