top of page

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 21

#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 21 - New Telugu Web Series

Written By Pandranki Subramani Published In manatelugukathalu.com On 01/04/2025 

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 21 - తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి  

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


హైదరాబాద్ లో సెంట్రల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు. 


అమెరికా వెళ్లిన నరసింహ మూర్తికి రూమ్ మేట్ గా పాకిస్థాన్ కు చెందిన షేక్ అహ్మద్ ను అలాట్ చెయ్యడంతో ఖంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది. 


పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు. 


నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది. శంకరం పట్ల తన ఇష్టాన్ని వ్యక్త పరుస్తుంది మాధవి. వీరి విషయం నరసింహులు గారికి తెలుస్తుంది. ఈ విషయంపై భార్యతో సానుకూలంగా స్పందిస్తాడు.

నరసింహ మూర్తి ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తవుతుంది.



ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 21 చదవండి.. 


 నరసింహమూర్తి ట్రైనింగ్ పీరియడ్ ముగిసింది. 


మొదట ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ చార్జీకి అక్కడ సిబ్బందికీ ధన్యవాదాలు అర్పించి—విజయవంతంగా శిక్షణ పొందాడన్న గుర్తింపు పత్రాన్ని స్వీకరించి—ఆ తరవాత షేక్ అహ్మద్ ని స్నేహపూర్వకంగా కౌగలించుకున్నాడు. అహ్మద్ ఉద్వేగానికి లోనయాడు-- “నువ్వూ నాలాగే వారం రోజుల పాటు యు ఎస్ లోని వివిధ ప్రాంతాలను చూస్తావనుకున్నాను మూర్తీ! బేడ్ లక్“

“యస్ యు ఆర్ రైట్. మరేం చేస్తాం చెప్పు. కొన్ని పరిస్థితులు మన చెప్పుచేతల్లో ఉండవు కదా! అసలు విషయం ఒకటుంది” 


చెప్పండి- అన్నట్టు నరిసింహమూర్తి ముఖంలోకి చూసాడతను- 


“ఐ లవ్ మైమదర్“- నరసింహ మూర్తి బదులిచ్చాడు. 


“యు ఆర్ ఎగైన్ ఎ లక్కీ గాయ్! నాకు చిన్నప్పుడే మా అమ్మ పోయింది“


“సారీ! మీ అమ్మగారు ఎలా పోయారు? అనారోగ్యం చేసా?” అడిగాడు నరసింహమూర్తి, 


“కాదు. లాహోర్ బజారు వీధిలో ముహరమ్ పండగకని— నాకోసం మా చెల్లి కోసమని కొత్త బట్టలూ ఆట వస్తువులూ కొనుక్కురా వడానికి వీధి పొడవునా బేరమాడుతూ వెళ్ళింది. నడిరోడ్డు మధ్య ప్రాత స్కూటర్లో ఉంచిన నాటు బాంబ్ ప్రేలింది. పవర్ ఫుల్ చేతి బాంబే. మరో పదిమందితో బాటు మా అమ్మకూడా అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది” ఆ మాట చెప్తున్నప్పుడు షేక్ అహ్మద్ కళ్లలో చెమ్మదనం-- 


నరసింహమూర్తి మనసు చలించింది. ఇందుకే కాబోలు అహ్మద్ కి మహాత్మా గాంధీగారంటే— ఆయన అహింసావాదం అంటే అంతటి గౌరవం! హింస పట్ల అంతటి తీవ్ర నిరసనం! కష్టపడి గొంతు పెగల్చి అన్నాడు- “సారీ! ఐ యామ్ రియల్లీ సారీ! మరచిపోకుండా మీ చెల్లిని అడిగానని చెప్పు. ఐ చెరిష్ యువర్ ఫ్రెండ్ షిప్” 


“థేంక్స్ ఎ లాట్! ఒకసారి నీ కుడి చేతిని ఇలా చూపించు“


ఎందుకూ- అంటూ కుడిచేతిని అందిచ్చాడు నరసింహమూర్తి. 


“ఇది మన స్నేహపు జ్ఞాపకార్థానికి--” అంటూ అతను పాకిస్థాన్ నుండి తొడుక్కొచ్చిన గోల్డ్ బ్రాస్ లెట్ ని నరసింహ మూర్తికి తొడిగాడు. 


కొన్ని క్షణాల పాటు ఆశ్చర్యంగా మౌనంగా చూస్తూండిపోయాడు నరసింహమూర్తి. తనిచ్చిన లాంగ్ కోటుకి ప్రతిఫలంగా తనకు మళ్ళీ ఈ రూపంలో ఇచ్చేస్తున్నాడేమో! తను వేసుకొచ్చిన బంగారు ఉంగరం అక్కడ ముంతల రఘురామ రాయుడి మునిమనవడు ముంతల సూర్య క్రిస్టోఫర్ కి జ్ఞాపకార్థంగా ఇచ్చాడు. ఇక్కడేమో ఇది! 


అతడు మరోమారు షేక్ అహ్మద్ ని గుండెలకు హత్తుకుని మెట్లు దిగాడు. అలా దిగుతున్నప్పుడు ఆనాడు తనతో షేక్ అహ్మద్ అన్నమాటలు చెవుల్లో గింగిరు మన్నాయి- “నిన్నకాక మొన్న కలుసుకున్న మనమిద్దరమూ— మతాలు వేరయినా, నమ్మకాలు వేరయినా, భాషలు వేరయినా ఇంత క్లోజ్ గా ఉండగలిగినప్పుడు— ఒకే సబ్ కాంటినెంట్ నుండి ఉద్భవించిన మన రెండు దేశాలు- రెండు దేశాల ప్రజలూ ఎందుకు ఒకరినొకరు ఎడా పెడా దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటారు! ఎన్నాళ్లిలా ఉంటారు?” 


అతడలా ఆలోచిస్తూ మెట్లు దిగి అక్కడ తనకోసం నిరీక్షిస్తున రామ్ మోహన్ రాబర్టు వద్దకు నవ్వుకుంటూ వెళ్లి అక్కడున్న తన రెండు పెట్టెలనూ అందుకోమని సైగ చేసాడు. కొంటె తనం చూపిస్తూ రామ్ మోహన్ అన్నాడు- “ మాకోసం ఏమీ విడిచి పెట్టలేదా బావగారూ! ”

“నా హృదయాన్నే మీ ఇంట్లో విడిచి వెళ్తున్నాను. ఇంకేమి కావాలోయ్! ”

------------------------------------------------------------------------------------ 

కారు కొద్ది దూరం వెళ్ళిన తరవాత అమెరికన్ అవ్వాయి చువ్వాయిలా కనిపించే రామ్ మాహన్ రాబర్ట్ నల్లేరు పైన నడిచే బండిలా విషయాన్ని కదిపాడు- “మీకు తెలిసే ఉంటుంది. కాని చెప్పడం నా వంతు కాబట్టి చెప్తున్నాను. నాన్నా చిన్నాన్నలిద్దరూ రిచ్ క్యాటగిరీకి చెందిన వారు. రేపో మాపో అమెరికన్ సెనేట్ కో- కాంగ్రెస్ కో పోటీ పడగల పరపతిని సంపాదించు కోగలవారు. అందుకని—” అంటూ బండిని మలుపు తిప్పాడు. 


“అందుకని--- ” అని మిగిలినదానిని పూర్తిచేయ మన్నాడు నరసింహమూర్తి. 

దానితో రామ్ మోహన్ కి దారికి రాక తప్పలేదు- “అందుకని— మా అక్కయ్య పెళ్ళి వ్యవహారంలో మీరేమైనా అడగండి. అన్నదమ్ములిద్దరిదీ రిచ్ బ్యాంక్ బ్యాలెన్స్! ఎలా ఖర్చుపెట్టాలో తెలియక తికమక పడ్తున్నారనుకో! ” 


అదివిని నరసింహమూర్తి పకపక నవ్వేసాడు. 


“ఎందుకు నవ్వుతున్నారు బావగారూ! ”


“నవ్వక ఏడ్వనా? అంత దూరాన ఉన్న నాకు పిల్లనిస్తానని మీ అమ్మానాన్నలూ ఎందుకు ముందుకు వచ్చినట్టు? నన్ను చూసా? కానే కాదు. మా పెదనాన్న— శ్రీమాన్ భూషణంగారిని చూసి. ఆయనా, ఆయన తమ్ముడు- అంటే మా నాన్నగారూ చాలా మందిలా చిల్లర మల్లర విషయాల పట్ల ఆసక్తి చూపించరు. మరొకటి గుర్తుంచుకో రామ్ మోహన్- ఆస్తి పాస్తుల్లో వాళ్ళు అంత ఉన్నతులు కాకపోవచ్చు గాని- హుందాతనంలో ఎవరికీ ఏమాత్రమూ తీసిపోరు. ఇక మా అమ్మగారి గురించి చెప్పాలంటే- షి ఈజ్ ఎ వండర్ ఫుల్ హ్యూమన్ బీయింగ్! మీ అక్కయ్యకు మదర్ ఇన్లాలా కాదు. టేకిట్ ఫ్రమ్ మీ. నిజంగా మదర్ లాగేనే ఉంటుంది” 


ఆపైన రామ్ మోహన్ నోరు మెదపకుండా ఉండిపోయాడు. మనసున మాత్రం పూరింపుగా నవ్వుకున్నాడు. తను ఇండియాలో పుట్టకపోయినా అతను ఇండియోలోని కుర్రాళ్ళ తరపు వాళ్ళు వరకట్నాల గురించి లాంఛనాల గురించీ చాలా ఆశ పడ్తుంటారని విన్నాడు. అలా కాకుండా మంచి కుటుంబానికి కోడలు పిల్లగా వెళ్తూన్నఅక్కయ్య అదృష్టవంతురాలే! తను నాన్నగారి ద్వారా— చిన్నాన్నగారి ద్వారా విన్నట్టే భూషణం వాళ్ళది గొప్ప కుటుంబమే! 

---------------------------------------------------------------------- 

మరునాడు రిలే డుర్హమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళేందుకు బైట క్యాబ్ ని సిద్దంగా ఉంచారు శ్రీరామ్ గారు. 


అక్కాచెల్లెళ్లిద్దరూ సెండాఫ్ సంకేతంగా వాళ్ల ఇంటి చుట్టూ ఉన్న పూలతోటా- ద్రాక్షతోట మరోసారి ముచ్చటగా చూపించి డైనింగ్ టేబుల్ ముందు అతణ్ణి కూర్చోబెట్టారు. వాళ్ల హౌస్ మేడ్ సహాయంతో చేసిన ప్యాన్ కేకుల్ని అతడి ముందు ఉంచారు. అతడికెందుకో ఇంటినీ అమ్మానాన్నలను తలచుకున్నతోడనే కడుపంతా నిడిపోయిన ఫీలింగ్ కలిగింది. ఏదీ తినే స్థితిలో లేడు. అది చూసి సుగాత్రమ్మ అతణ్ణి సమీపించి అతడి నోటికి కేకు ముక్క చిదిమి అందిచ్చింది”ఇదంతా తింటూ కూర్చుంటే రాత్రికి భోజనం చేయలేనత్తయ్యా! అసలు ఇక్కణ్ణించి కదలి ప్లేనులోకి నడచి వెళ్ళలేనేమో! “


“ఎందుకు తినలేరు అల్లుడూ! మీది రుబ్బరోలుని తిని హరాయించుకునే వయసు. ఇలా అంటే ఎలా?”అంటూ మరొక మారు కేక్ ని చిదిమి అతడి నోటికి అందిచ్చింది. అతడు కాదనలేక పోయాడు. ఇది చాలదన్నట్టు చిన్నత్తయ్య వైదేవి అక్కడకు పరుగు వంటి నడకతో వచ్చింది- “నావంతు ముక్కకూడా తీసుకుని వెళ్ళండి అల్లుడు గారూ! ”అంటూ-- 


ఆమె కూడా కేక్ ని చిదిమి అతడి నోటికి అందిచ్చింది. అప్పుడతని కళ్లముంది తల్లి వర్థనమ్మ రూపం మెదిలింది. తన తల్లి కూడా ఇలాగే తనను చిన్నపిల్లా డిలా ట్రీట్ చేసి తిని పిస్తుంది. అతడు వాళ్ళద్దరూ అందిచ్చిందంతా తిని మెల్లగా లేచి ఇద్దరి కాళ్లకూ నమస్కరించి బైటకు నడిచాడు. 


క్యాబ్ డ్రైవర్ అంతుముందే ఒక సారి హారన్ నొక్కాడు. అప్పుడు శ్రీరామ్ ఎదురు వచ్చి అన్నాడు- “అబ్బాయి మూర్తీ టైమయిపోయినట్లుంది కదూ! “అతడాగి నవ్వుముఖంతో అతడి కాళ్ళకు నమస్కరించి”ఏదైనా చెప్పాలండీ! ”అని అడిగాడు. 


“ఔను! అది నీకు మాత్రమే చెప్తాను. వింటావు కదూ! రెండు నిమిషాల్లో ముగిస్తాను”ఇంటికి ఏదో కబురందించాలని చూస్తున్నట్టు న్నారనుకుంటూ అతడు తలాడించాడు. దూరం నుంచి శ్రీలక్ష్మణ్ తదేకంగా చూస్తూ నిల్చున్నాడు. 


శ్రీరామ్ చెప్పసాగాడు- “చిన్నప్పుడు- అంటే నా స్కూలురోజుల్లో నేనొక పొరపాటు చేసానోయ్. నిజంగా అది పొరపాటేనా —లేక చిన్ననాటి ఆకతాయి వేషమా—తేల్చుకోవడం ఇప్పటికీ కష్టతరమవుతూంది. ఒక వేపు బాధా- మరోవైపు నవ్వూనూ. అప్పుడప్పుడు ఎందుకలా చేసాన్రా అని మధన పడుతుంటాను కూడాను. నాకు నేను మొట్టికాయ పెట్టుకోవాలనుకుంటాను” 

అప్పుడు నరసింహమూర్తి కలుగజేసుకున్నాడు- “ఒక్క నిమిషం అంకుల్! మీరు ఎటువంటి పొరపాటూ చేసుండరు. ఎందుకంటే - మీ స్వభావం అటువంటిది. చేయకూడని పొరపాటు చేయనివ్వదు. మీది ఉన్నత వ్యక్తిత్వం కాబట్టే అమెరికా వంటి సోఫిస్టికేటడ్ సొసైటీలో ఇన్నాళ్లూ నిండుకుండలా మనుగడ చేయగలుగుతున్నారు-- కాదా మరి?”


శ్రీరామ్ ఈసారి దగ్గరకు వచ్చి అతడి భుజంపైన చేయివేసి అన్నాడు- “సరే—అలగే అనుకో. మరి నేను చెప్పిది విను. నేనూ మీ పెదనాన్నఒకే క్లాసులో చదువుకునే వాళ్లం. ఇంటి నుంచి ఏది తెచ్చుకున్నా ఒకరికి పెట్టకుండా మరొకరం తినేవాళ్ళం కాదు. అప్పుడప్పుడు మీ ఇంట్లోచేసిన మెట్ట పీతల పులుసు తెగ ఆబగా తినేవాణ్ణి- అంటే- మీ బామ్మగారు చేసి పంపేవారు. భలే బాగ చేసేది మీ బామ్మ. పాపం- ఇప్పుడామె ఏ స్వర్గాన ఉందో! వాడెప్పుడైనా మా ఇంటికి వస్తే మా అమ్మ వాడికి పొట్టనింప కుండా పంపించేది కాదు. 


ఇక విషయానికి వస్తాను. ఇప్పటి సంగతేమిటో తెలియదు గాని, అప్పట్లో సరస్వతీ కటాక్షం లభిస్తుంద ని పుస్తకాల మధ్య నెమలీకల్ని ఉంచుకునేవాళ్లం. అందానికి అందం- భక్తికి భక్తీనూ. కాని ఒకరోజు యేమి జరిగిందంటే- మా భూషణం ఎప్పుడూ ఎక్కడా చూడని లేత ఎరుపు రంగు పింఛం వంటి ఈకల్ని తెచ్చాడు. అవి ఎంత అందంగా ఉన్నాయంటే- క్లాసు లోని పిల్లకాయలందరూ వాటి అందానికి మురిసిపోతూ కేరింతలు కొట్టారనుకో! 


వాటి చక్కదనం నా కళ్ళను కుట్టేసింది. భోజనాల సమయం వచ్చేటప్పటికి అందరూ బైటకు వెళ్లేటప్పటికి నేను మాత్రం వాళ్ళతో వెళ్ళకుండా అక్కడే మాటువేసి భూషణం పుస్తకంలోనుండి మూడు నాలుగు ఈకల్ని తీసేసుకుని నా పుస్తకంలో పెట్టేసుకున్నాను”


“ఒక్క నిమిషం అంకుల్! ఒక్క నిమిషం అంకుల్! ఇందులో మీరు చేసిన పొరపాటేమీ లేదండీ. మీ మిత్రుడిది మీరు తీసుకున్నా రు. అంతే కదా! ఇది పొరపాటెలాగవుతుంది?”


“ఎంత మిత్రుడైతే మాత్రం! చెప్పేకదా తీసుకోవాలీ! మరి చెప్పా చెయ్యకుండా నేను చేసింది పొరపాటే కదా! ”


“నేనొప్పుకోనంటే ఒప్పుకోను! ఎందుకంటే-- అతి సంతోషంగాని అతి ఉద్వేగం గాని ముప్పిరిగొంటే టెన్షన్ తో బుర్రపని చేయదు. మీ చోట మా పెదనాన్నగారున్నాఆ ఉద్వేగ పూరిత పరిస్థితిలో వయసు పరిణతి లేని ఆ సమయంలో అదే పని చేసేవాడు. ఇదే నా జడ్జి మంట్. ప్లీజ్ ఎక్సెప్టె మై జడ్జిమెంట్ మావగారూ! “


“థేంక్స్ ఫర్ యువర్ నైస్ జడ్జిమెంట్. ఇంతకీ ఈ ఉదంతం మీకే చెప్పాలని ఎందుకనిపిస్తుందో తెలుసా?”


తల అడ్డంగా ఆడించాడు నరసింహమూర్తి. 


”మీరు అచ్చు మీ పెదనాన్నగారిలాగే ఉంటారు! ”


అది విని నరసింహమూర్తి ఒక్కపెట్టున నవ్వేసాడు. అతడితో బాటు చుట్టు ప్రక్కల నిల్చున్నవాళ్ళందరూ కలసి నవ్వేసారు. పెద్దలకు- వయసు మీరిన పెద్దలకు సహితం తారతమ్యాలకు తావు లేకుండా కొన్ని చిన్నచిన్న జ్ఞాపకాలు వెన్నంటి వస్తూనే ఉంటాయి కదూ! గుండె గూటిలో చివరి రోజుల వరకూ పదిలంగా మిగిలిపోయే వసంత కాలమది. 

మరి కాసేపట్లో నరసింహమూర్తి కూర్చున్న క్యాబ్ రోడ్డు దాటింది. 


-------------------------------------------------------------------------- 

ఊరు చేరుకున్న నరసింహమూర్తి అంతకు ముందు- అంటే రెండురోజలకు ముందే ఆస్పత్రినుండి డిస్చార్జయి ఇల్లు చేరిన తల్లిని సమీపించి రెండు చేతులూ తన చేతుల్లోకి తీసుకున్నాడు. మొదట నిభాయించుకోవాలని గట్టిగా తీర్మానించుకున్న వర్థనమ్మ కొడుకు కళ్ళలోని తడి చూసి ఉగ్గబట్టలేక పోయింది. ఉన్నపాటున చేతులు చాచి కొడుకుని అక్కున చేర్చుకుంది. నర సింహమూర్తి కళ్లు రెండూ నీటి కొలనుగా మారాయి. కొడుకు భుజంపైన చేయి వేసి నిమిరాడు. 


అప్పుడు వర్థనమ్మ కలుగ చేసు కుంది- “ఏమీ కాలేదులేరా! ఆరోగ్యం విషయంలో కొంచెం అలక్ష్యం చేసాను. మీ నాన్నగారి మాటను సీరియస్ గా తీసుకోకపోవ డం వల్ల వచ్చిన వైపరీత్యం. అదెలాగో వటుడింతయినట్టు పెద్దదయి నన్ను పడకపైన పడే సింది. ఇకపైన ఉషారుగా ఉంటాలే. మీ నాన్నగారితో బాటు ప్రతి ఉదయమూ వాకింగ్ చేస్తాను- నౌకాసనంతో బాటు ప్రాణాయామం చేస్తాను. సరేనా! ”


అప్పటికీ కొడుకు మాటా పలుకూ లేకుండా తనను తదేకంగా చూస్తూ కూర్చోవడం చూసి ఆమె తల్లి మనసు తల్లడిల్లిం ది. తను అనారోగ్యం పాలయి ఎంతమందికి కష్టాలు తెచ్చి పెట్టిందో! ఎంత మంది తనపైన ఆధారపడి ఉన్నారు! అనారోగ్యమన్నది వట్టి ఒక వ్యక్తికి సంబంధించినది కాదు;ఒక కుటుంబానికి సంబంధించిన వైనం. 


ఆమె తేరుకుంటూ మళ్ళీ అంది- “నాకేమీ కాలేద ని చెప్పాకదరా! మొదట వెళ్ళి మీ పెదనాన్నగారినీ పెద్దమ్మగారినీ పలకరించిరా! ఆ తరవాత నీవు చేసుకోబోయే అమ్మాయి గురించి చెప్దువుగాని”


అప్పుడు మాధవి కలుగచేసుకుంది- “అమెరికా అమ్మాయిని చేసుకోబోతున్నావు. పెద్దింటి అమ్మాయి కూడాను. ఆ సంతోషం నీ ముఖంలో కనిపించ వద్దా! ఇంకా తల్లి చాటు కొడుకువిగా ఉంటానంటే ఎలారా అన్నయ్యా?” అంటూ నరసింహమూర్తి రెండుకళ్ళనూ తన చేతి గుడ్డతో తుడిచి లోపలకు తీసుకెళ్ళింది. 


భూషణంగారి కాళ్ళకూ మందారమ్మగారి కాళ్ళకూ నమస్కరించి వాళ్ళ ఆరోగ్యం గురించి విచారించి చిర్నవ్వుతో ఒదిగి నిల్చున్నాడు నరసింహమూర్తి. భార్యా భర్తలిద్దరూ నరసింహమూర్తిని ఆపాదమస్తకం చూస్తూ కొద్ది సేపు ఏమీ మాట్లాడలేదు. తన ముందు పుట్టి పెరిగిన తమ్ముడి కొడుకు రూపంలో ఎదుగుదల కనిపిస్తూంది భూషణానికి. ముఖవర్ఛస్సులో మార్పు కనిపిస్తూంది. బ్రతికున్నరోజుల్లో తల్లి తనతో అన్నమాట భూషణానికి గుర్తుకు వచ్చింది; నరసింహమూర్తిని దత్తత చేసుకోవాలని. కాని నరసింహులు దంపతులకు ఉన్నది ఒక్కగానొక్క మగసంతానమన్న వాస్తవం మనసున తాకి తగ్గాడు. అతడికి తెలుసు- తనూ మాంచాలమ్మా ముందుకు వచ్చి చొరవ తీసుకుని అడిగితే వాళ్ళెవరూ కాదనరని. ఇక తల్లి వత్తాసు తనకు పూర్తిగా ఉన్నప్పుడు తమ్ముడూ మరదలూ ఎలా కాదంటారు? కాని కలిగిన కోరిక సహేతుకం అనిపించక ఊరకుండి పోయాడు తను. 


“అదేంవిటి పెదనాన్నా అలా కొత్తగా చూస్తున్నట్టు చూస్తున్నారు! “


“ఏమీ లేదోయ్. కళ్ళముందు ఉన్నట్లే ఉండి ఎంతగా ఎదిగిపోయావని తలపోస్తున్నాను! సుజాత నచ్చింది కదూ ?”


“ఫోనులో చెప్పాను కదా పెదనాన్నా నచ్చిందని! ”


“ ఔననుకో. కాని ఓసారి నీ నోటితో మాముందు చెప్తే బాగుంటుందని-- మాట అప్పుడప్పుడు గుభాళించే పూదోటగా మారితే బాగుండదూ! ”


ఆ పదజాలం విని నరసింహమూర్తి నవ్వాడు- “నచ్చింది పెదనాన్నా! నిజం చెప్పాలంటే నాకంటే మీకు బాగా నచ్చుతుందండీ! ఒక్కనిమిషం ఆగండి. ఇప్పుడే వస్తాను” అంటూ లోపలకు వెళ్లి సూట్ కేస్ తెరచి మిత్రుడి కోసం శ్రీరామ్ పంపించిన కానుకల్ని తీసి అందించాడు. ఆయన భార్యా భర్తలిద్దరికీ సమానంగానే కానుకలు ఏరి కోరి పంపించాడు. 


“మా ఇద్దరి కోసమూ నా చిన్ననాటి నేస్తం పంపించిన వస్తువులన్నమాట! ఇంతకీ వాడు బాగున్నాడా?”


“బాగున్నారు. వీటిని ఆయన చాలా అభిమానంతో పంపించారు పెదనాన్నా! ” అంటూ శ్రీరామ్ తమ చిన్ననాటి రోజుల్లో జరిగిన సంఘటన గురించి- దాని గురించి ప్రస్తావిస్తూ శ్రీరామ్ ఉద్వేగానికి లోనైన విషయం గురించి కూడా చెప్పాడు. 


అది విని భూషణం దంపతులిద్దరూ పెద్ద పెట్టున నవ్వేసారు. ఆ నవ్వుల గలగలలు చెవిన సోకి వర్ధనమ్మకూడా అక్కడకి చేరుకుంది;వాళ్ళ సంతోషాన్ని కొడుకుతోనేనా- తనతో పంచుకోరా- అని నిలదీస్తూ-- ఎందుకంటే- గాంభీర్యతకు మారు పేరైన బావగారు అంత పెట్టున నవ్వడం ఆమ ఎప్పుడూ వినలేదు. అవసరం యేర్పడితే సెలయేరులా చిరునవ్వు చిందిస్తాడేగాని, వరదొచ్చిన నదీ ప్రవాహంలా నవ్వడు. త్వరగా ఏనాడూ ఉద్వేగానికి లోనవుడు. 


నార్త్ కరోలినాలో జరిగిన ఆ విషయాన్ని నరసింహమూర్తి తల్లికీ ఆ లోపల అక్కడికి చేరుకున్న తండ్రికీ చెప్పేసరికి వాళ్లు కూడా నవ్వసాగారు. వేసవిలో చిన్నచిన్న వెన్నెల చినుకులు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయి! 


అంత పెద్ద అమెరికన్ వ్యాపారికి ఇంతటి సున్నిత మనస్తత్వమా! వాళ్ళకు నిజంగానే ఆశ్చర్యం కలిగింది. “ఆయనకు బామ్మచేసే మెట్టపీతల కూర చాలా యిష్టమట. బామ్మ వంటను చాలా మెచ్చుకున్నాడు! ”- నరసింహమూర్తి. 


భూషణం తల పంకిస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. చిన్ననాటి జ్ఞాపకాల తరంగాలు పెదనాన్నను ముప్పిరిగొన్నాయని గ్రహించాడు నరసింహమూర్తి. ఆ తరవాత గతకాల జ్ఞాపకాల దొంతర్ల నుండి విడివడుతూ ఎట్టకేలకు విషయానికి వచ్చాడాయ- 


“మీ నాన్న చెప్పాడా మీ చెల్లికి త్వరలో పెళ్ళి జరిపించేయాలని-- మేం చూసొచ్చాం. అబ్బాయి మాకు మట్టిలో పుట్టిన మాణిక్యం లా కనిపించాడు. ఇక నువ్వే మిగిలావు”


“అమ్మ చెప్పింది ఓసారి శంకరం గురించి. అందులో అమ్మ ఇటువంటి విషయాలలో చాలా సెన్సిటివ్ పెదనాన్నా! ఇక నేను చూడటానికేముంది?”


“అలా అంటే ఎలా కుదురుతుందోయ్! మాకు తోచని విషయాలు నీకు తెలుసుంటాయి కదా! మాకు కలగని అనుమానాలు నీకు కలగవచ్చుకదా! తరాల మధ్య తారతమ్యాలు ఎప్పుడూ నిలదీస్తూనే ఉంటాయి” అప్పుడు వర్థనమ్మ కలగచేసుకుని అంది- 


“ముందు పెదనాన్నా పెద్దమ్మా చెప్పిన మాట విను. ఆ తరవాత నీకు తోచింది చెప్పు”

అతడిక మాట్లాడకుండా తల ఆడిస్తూ అక్కణ్ణించి కదలి వెళ్ళిపాయాడు. 


=======================================================================

                                                ఇంకా వుంది

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 22 త్వరలో

========================================================================

 

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





Comments


bottom of page