తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 22
- Pandranki Subramani
- 16 hours ago
- 10 min read
#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 22 - New Telugu Web Series
Written By Pandranki Subramani Published In manatelugukathalu.com On 07/04/2025
తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 22 - తెలుగు ధారావాహిక
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
హైదరాబాద్ లో సెంట్రల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు.
అమెరికా వెళ్లిన నరసింహ మూర్తికి రూమ్ మేట్ గా పాకిస్థాన్ కు చెందిన షేక్ అహ్మద్ ను అలాట్ చెయ్యడంతో ఖంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది.
పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు.
నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది. శంకరం పట్ల తన ఇష్టాన్ని వ్యక్త పరుస్తుంది మాధవి. వీరి విషయం నరసింహులు గారికి తెలుస్తుంది. ఈ విషయంపై భార్యతో సానుకూలంగా స్పందిస్తాడు. నరసింహ మూర్తి ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తవుతుంది. ఇండియా వచ్చిన నరసింహ మూర్తికి శంకరం గురించి తెలుస్తుంది.
ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 22 చదవండి..
నరసింహమూర్తి తల్లి పెట్టిన ఉప్మాతిని, మజ్జిగ తాగి కారు వేపు నడుస్తూ మాధవిని పిలిచి, మాటల దొంతర్లోకి లాగకుండా ఒకే ఒక ప్రశ్న వేసాడు- “నువ్వు శంక రాన్ని చాలా రోజులుగా చూస్తున్నావు గనుక నీకు అతడి గురించి బాగానే తెలుసుంటుంది. కాని దీనికి మాత్రం బదులియ్యి- శంకరంలో నీకు ప్రత్యేకంగా నచ్చిన అంశం యేమిటి మాధవీ? ఎంతటి వారినైనా వయసన్నది కళ్ళెం లేని గుర్రంలా దిక్కుతోచని దిగంతాల వేపు మోసుకు పోవచ్చు కదా!”
“మంచి మనసు. ఎదుటివారి కష్టసుఖాలను పంచుకోవాలన్నతపన. రెండవ అంశం కూడా ఒకటుందిరా అన్నయ్యా- చెప్పేదా!”
ఉఁ-అన్నాడతను.
“తోటి వారి పట్ల ముఖ్యంగా స్త్రీల పట్ల అతడికున్న గౌరవభావం”
అతడిక యేమీ అనకుండా తండ్రి నుండి కీ తీసుకుని పోర్టికో వేపు సాగి కారులో కూర్చున్నాడు.
---------------------------------------------
శంకరం ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే నరసింహమూర్తి దమయంతమ్మ కాళ్లకూ సాంబయ్యకాళ్ళకూ నమస్క రించాడు. అతడి చర్యకు దమయంతమ్మ నివ్వెరపోయింది-“మీ వాళ్లంతా చాలా పెద్దింట్లోవాళ్ళని మాకుర్రాడు చెప్పాడు బాబూ! మీరొచ్చి--మీరు కూడా గవర్నమెంటు ఆఫీసరటగా!మీరొచ్చి మా కాళ్లకు దండం పెడ్తారా!”
“పెద్దవాళ్లందరూ నాకు అమ్మానాన్నలతో సమానమే కదండీ!”
ఆ మాటకు దమయంతమ్మ గుండె ఎగిసి పడింది.పెద్దల పట్ల ఎంతటి మర్యాద-అదీను ఈ రోజుల్లో!ఈ అబ్బాయిని కన్నతల్లి కడుపు చల్లగా ఉండాలి!కాసేపట్లో ఆమె తేరుకుని చకచకా వెళ్లి రెండు పెసరట్లు చేసి రెంటినీ ప్లేటులో పెట్టి అతడికి అందిచ్చింది.అతడు ఒకటి మాత్రం తిని-“చాలా బాగుందండీ!ఇలా చేయడం మా చెల్లికి కూడా నేర్పండి“అని మెచ్చుకున్నాడు నరసింహమూర్తి.
దమయంతమ్మ నవ్వి కప్పునిండా టీపోసి అందిచ్చింది. అంతవరకూ గది మూలన ఒదిగి నిల్చున్న శంకరానికి అలవికాని ఊరట కలిగింది.అంతటి ఉన్నత సంస్కారం తనకు కాబోయే బామ్మ ర్దికి యెలా వచ్చింది? వర్థనమ్మగారి పెంపకం.పులికడుపున పులికాకుండా పిల్లి పుడుతుందా!
అతడు నరసింహమూర్తి వద్దకు వెళ్ళి చేతులు కలిపి అడిగాడు-“నాగురించి ఏమైనా అడిగి తెలుసుకోవాలా?”
తల అడ్డంగా ఆడించాడు నరసింహమూర్తి. ”మీరు నన్ను మొదటిసారిగా చూస్తున్నారు. నన్నడగాలనిపించడం లేదా!”
“మీరు మేడమ్ వర్థనమ్మగారి వద్ద ఫుల్ మార్కులు తీసుకున్నారు. ఇక నేనడగడానికేముంది? మరి మీరు మమ్మల్నేమైనా అడగాలా?”
లేదంటూ కౌగలించుకున్నాడు శంకరం.
”ఇంటి పెద్దలు మంచిరోజు చూసి కబురంపితే నిశ్చితార్థానికి సిధ్ధంగా ఉంటాం“-నరసింహ మూర్తి లేవడానకి సిద్ధమవుతూ అన్నాడు.
ఎట్టకేలకు సాంబయ్య నోరు తెరిచాడు- “తేదీ చెప్పి మా దగ్గరి బంధువులతో మాఊరి గుడి ట్రస్టీలతోకలసి వస్తాం సరేనా!”
అలాగే- అంటూ నరిసింహమూర్తి నమస్కరించి లేచాడు.
ఆ కబురుతో దమయంతమ్మ ముఖాన కాంతిరేఖలు పూచాయి.ఇంటికి అప్పటికప్పుడు పెళ్ళి కళ ఫెళ్ళుమంటూ వచ్చే సింది.కొడుకు వద్దకు వెళ్ళి ముఖాన్ని దగ్గరకు తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టుకుంది.”మంచోడికి మంచివే జరుగుతాయిరా బిడ్డా!”
తల్లికి అంతటి సంతోషం కలిగించినందుకు శంకరం లోలోన ఆత్మతృప్తి విలసిల్లింది.తనయుడికి ఇంతకంటే కావలసిం దేముంది!శంకరానికి పెద్దింటి సంబంధం వెతుక్కుంటూ వచ్చిందన్న వార్త వాడవాడంతా పూవుతావిలా వ్యాపించింది.
----------------------------------------------------------------------------------
నరసింహమూర్తి వచ్చి శంకరం పట్ల తన సానుకూల అభిప్రాయాన్ని తెలియజేసినప్పుడు భూషణం అన్నమాట ఒకటే!
“పుట్టిన వాడు పుట్టినట్లుగానే ఉండిపోతే— ప్రతి వాడూ పుట్టినట్లుగానే జీవితమంతా గడిపేయాలన్న సూత్రమొకటుంటే — మన భారతజాతికి వాల్మీకి వంటి మహర్షి ఎదురయేవాడా! ప్రపంచ శ్రేయస్సుకే మూలాధారమైన రామాయణం వంటి ఉద్గ్రం ధం లభ్యమయేదా!”
అప్పుడక్కడకు వచ్చిన నరసింహులు-“భలే బాగ చెప్పావురా అన్నయ్యా!” అంటూ అన్నయ్యను కౌగలించుకున్నాడు. అన్నదమ్ములిద్దరూ అలా కౌగలించుకోవడం చూసి తోడి కోడల్లిద్దరు కూడా జాప్యానికి తావివ్వకుండా ఒకరి నొకరు కౌగలించుకున్నారు; ప్రతిస్పందనగా-- అదంతా లోగిలి గడప వద్ద నుండి చూస్తూ నిల్చున్న మాధవి సిగ్గుతో మొగ్గయి మరింత దూరంగా తొలగి తల వంచు కుని నిల్చుంది. ఆ ఒక్కమాటతో ఆమె అప్పటికే సగం పెళ్ళి కూతురయిపోయింది. విచ్చుకుంటూన్న మొగ్గలా వికసిస్తున్న స్త్రీత్వం అది.మల్లెల సమయమని పలకరించే మాహన రాగమది. మనసున పుష్పించే రాగ సౌందర్యం--
---------------------------------------------------------------------------
పెద్దల సమక్షాన తాంబూలాలు పుచ్చుకున్న వారం రోజుల తరవాత శంకరం మాధవీ జీవన సహచరులుగా మారారు.
వియ్యంకుడు సాంబయ్య తరపున కొందరు బంధువులు, వియ్యంకురాలు దమయంతి తరపున మరికొందరూ—వాళ్ళతో బాటు-- పోలేరమ్మ గుడి ట్రస్తీలు ఇంకొందరు పెళ్ళి విందుకు వచ్చారు. నరసింహమూర్తి ఇంటిల్ల పాదీ వాళ్లను సమాదా రణతో ప్రత్తుత్థానం చేసి వాళ్ళను గౌరవించారు.అలాగ్గాని శంకరం వాళ్ళ బంధువుల్నీ వాడలోని మిత్రుల్నీ తాము సమాదరించ కపోతే రేపు కూతురు వాళ్ళ ఇల్లు చేరిన తరవాత సాంబయ్య దంపతులు వాళ్ళ మానాన వాళ్లు ఉన్నా-వాళ్ల దగ్గరి బంధువు లు తమకు వ్యతిరేకంగా ఎత్తిపొడుపులు లేవదీస్తారన్నది నరసింహులుకి తెలుసు. అలాగే శంకరానికీ తెలుసు. ఈ విషయం తన సహధర్మచారణి మాధవి చెవిన శంకరం సూచాయగా ముందే వేసాడు. ముఖ్యంగా వాడజనం అటువంటి విషయాలలో పట్టింపులుకి వెళ్తారని మాధవిని ఎలార్ట్ చేసాడు. ఇక పోతే-- వాళ్లకందరకూ అన్నీ అందాయి కానుకులతో సహా- ఒక్కటి తప్ప. శంకరం వాళ్ళ బంధువులకి అందనిది ఒక్కటే- మత్తునిచ్చే సురపానం మాత్రమే.
మొత్తానికి త్యాగయ్య వారు పలికినట్లు, సమయానికి తగు మాటలాడినట్టే డాక్టర్ నరసింహులు దంపతులు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. వియ్యంకుణ్ణి వియ్యంకురాలినీ తమతోనే కూర్చుండ బెట్టుకుని- వాళ్ళకు వేర్బాటు భావం వంటిదేదీ తలెత్తనీయకుండా పరామరిక చేసారు.
వినయవంతుడూ నిరాడంబరుడూ అయిన అల్లుడికి నిజమైన సంతోషం ఎలా కలుగుతుంతో భార్యా భర్తలిద్దరికీ తెలవదూ! పెళ్ళికి వచ్చిన స్కూలు సిబ్బందినీ- ముఖ్య అతిథుల్నీ అదే రీతిన తక్కువ కాకుండా సత్కరించారు. మాధవి వాళ్ళింటి ఏకైక పుత్రిక.ఆమెకోసం కాక మరెవ్వరికోసం వాళ్లు చేస్తారని! ఇవన్నీ ప్రక్క చూపులతో గమనించిన శంకరం శోభనం గదిలోకి వెళ్ళేముందు చేసిన మొదటి పని- తిన్నగా వెళ్ళి అత్తా మామల కాళ్లకు సాష్టంగా దండ ప్రమాణం చేయడం- వారివురి ఆశీర్వాదం పొందడం.దొరకునా అటువంటి పెద్దరికం— కుదురునా అటువంటి బంధుత్వం!
ఇంగితమూ జీవితానుభవమూ మెండుగా ఉన్న దమయంతమ్మ కూడా ఏ మాత్రమూ అజాగ్రత్తగా ఉండకుండా వియ్యంకులకు అనుకూలంగా నడచుకోవడమే కాక;భర్త చేత కూడా అలాగే మన్ననతో నడచుకునేలా చేసింది.
అంతేకాక-- వర్థనమ్మ మరచి పోకుండా భర్తతో కలసి శంకరం వాళ్ల వాడకు వెళ్లి సాంబయ్య దంపతులిద్దర్నీ పలకరించి వాళ్లతో బాటు కలసి పోలేరమ్మ తల్లి గుడి దర్శనం చేసుకుని ఆ తరవాత ఇంట్లో ఫలహారం తీసుకుని వెళ్ళారు. వియ్యంకుడు పోలేరమ్మ గుడికి ట్రస్టీ కావడం వాళ్లుకు కూడా గర్వకారణమే కదా!
అంతవరకూ దమయంతమ్మ తన జీవితంలో అంతటి పెద్దమనసుగల గౌరవనీయులైన కుటుంబీకుల్ని చూడలేదేమో!
-------------------------------------------------------------------------------
కొత్త కోడలి రాకతో ఇంటికి మార్పు రాబోతుందన్న వైనాన్ని సాంబయ్య దంపతులు త్వరలోనే పసిగట్టారు.
కోడలొచ్చిన వారం రోజుల తరవాత ఒకరోజు సాంబయ్య యధాప్రకారం రోజంతా గుడి పనులన్నీ చూసుకుని ఇల్లు చేరి పడకపైన మాగన్నుగా కళ్ళుమూసుకునే సమయాన అతడికెదురుగా గోడన వ్రేలాడుతూన్నచిత్ర పటం చూసి ఉలిక్కి పడ్డట్టయాడు. ఎవరో తనని ఒడిసి పట్టున క్రిందకు తోసినట్టు లేచి కూర్చున్నాడు. ఎదురుగా నిటారుగా తననే చూస్తూ నిల్చున్న వివేకానందుడు! ఆ చిత్రపటం ప్రక్కనే కొల్లాయి కట్టుకుని నవ్వుతూ నిల్చున్న గాంధీమహాత్ముడు!
ఇది ఎవరి పనయి ఉంటుంది చెప్మా అనుకుంటూ పెళ్ళాన్ని గట్టిగా పిలవాలని నోరుతెరవ బోయాడు సాంబయ్య. కాని వెంటనే ఆపుకున్నాడు.ఇంకెవరు? ఆ టీచరమ్మే మామగారికి నోటితో చెప్పకుండా చేతలతో చూపించి ఉంటుంది. అంతేకాక-అత డికి మరొకటి కూడా ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఎప్పుడూ గిర్రున గిర్రున చప్పుడు చేస్తూ తిరిగే రెండవ ప్రపంచ యుధ్ధకాలపు సీలింగు ఫ్యానుకి బదులు కొత్త ఫ్యాను చప్పుడు లేకుండా పైన సాఫీగా తిరుగుతూంది. తన ప్రక్కనే టీపాయ్ పైన మరొక చిన్న పాటి టేబుల్ ఫ్యాన్ కూడా అమర్చి ఉంది.గదిని చుట్టూ పరకాయించి చూస్తే- అది తనదేనా అన్నంతగా మార్పు చెంది ఉంది. చుట్టూ లేత రంగులు గల చక్కటి వాల్ పోస్టర్లతో అందంగా ఆహ్లాదకరంగా కొత్తదనం ఉట్టిపడ్తూ ఉంది. అతడు మరొకమారు అనుకోకుండా తతెత్తి చూసాడు.
తనని చూసి మహాత్ముడీ సారి గట్టిగా నవ్వుతున్న ట్టున్నాడు. “ఒరేయ్ సాంబా! వెర్రివాడా!పుణ్యభూమిలో పుట్టిన భారతీయుడా! మహాశక్తి పోలేరమ్మ గుడికి ట్రస్టీవి అయినా కూడా నగరంలోని పెద్దింటి వాళ్లకు వియ్యంకుడువి అయికూడా ఈ చాటు మాటు వ్యసనాలేమిటి? నిజమైన పెద్దమనిషిగా మారాలన్న తలంపే నీకు కలగదేమిటి? అంత మంది పెద్ద మనుషుల మధ్య నీ కన్నకొడుకు పరువు తీయాలనే కంకణం కట్టుకున్నావా యేమిటి?”
ఆతరవాత అటు చూసాడు సాంబయ్య. కాషాయ వస్త్ర ధారి చెరగని చిరునవ్వుతో అడుగుతున్నాడు- ”నువ్వెందుకు పుట్టావో తెలుసా? అసలు జీవితానికి అర్థమేమిటో యెప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నించావా!”
కాసేపటి వరకూ సాంబయ్య బుర్ర పని చేయలేదు. నిదానంగా లేచాడు. అతడికేమైందో అతడికే తెలియదు; ఆ రోజు రాత్రి భోజనం చేసి వచ్చిన సాంబయ్య మంచం క్రింద తనకోసం భార్య ఉంచిన మందుబాటిల్ ముట్టుకోలేదు. ముట్టుకోవాలనిపించలేదు. గుండెల్లో గుడిగంటలు ఘళ్ళున మ్రాగుతూనే ఉన్నాయి-రాత్రంతా--
మరునాడు ప్రొద్దుట నిద్రలేచి చూసేటప్పటికి యెదురుగా గాంధీగారు బోసి నోటితో నవ్వుతున్నారు. వివేకానందుడు గంభీరంగా చూస్తూ నిల్చున్నాడు ’నువ్వెందుకు పుట్టావో తెలుసా అని అడుగుతున్నట్టు--
--------------------------------------------------------------------------
ఆ మధ్య చెల్లి పెళ్ళి వ్యవహారంలో బిజీగా ఉన్న నరసింహమూర్తికి నార్త్ కరోలినాకి ఫోను చేయడానికి—కాబోయే అత్తా మామలతో కుదురుగా మాట్లాడటానికి వారం రోజులు పట్టాయి. సంపర్కం చేసుకోవడానికి అటూ ఇటుగా కాస్తంత ఆలస్యం కావచ్చని అతడు యు ఎస్ విడిచి వచ్చేటప్పుడు చెప్పే వచ్చాడు. కావున వాళ్ళే ఇంటి పెద్దలతో మాట్లాడేవారు- పెళ్లి ఏర్పాట్ల గురిం చి అడిగి తెలుసుకునే వారు. ఇక పోతే ఇటునుంచి తన పెదనాన్న వాళ్ళకు టచ్ లో ఉంటారని అక్కడి వాళ్ళందరకూ భరోసా ఇచ్చి మరీ వచ్చాడు.
ఆ రోజు సుగాత్రమ్మగారితో— ఆ తరవాత శ్రీరామ్ గారితో విడివిడిగా మాట్లాడిన తరవాత అతడు సుజాతకు ఫోను ఇవ్వ మన్నాడు. కాని— అప్పుడప్పుడే కారులో తను టీచింగ్ చేస్తూన్న స్కూలుకి వెళ్లిపోయిందని సుగాత్రమ్మ బదులివ్వడం విని అ తడికి నిరాశ కలిగింది. సుజాత కమ్మని కంఠ స్వరం విని చాలా రోజులయింది. అతడికలా నిస్పృహ కలగడానికి కారణం ఉంది. ఆమెకు ఒక ప్రేమపూర్వకమైన థ్రిల్లింగ్ న్యూస్ ఇవ్వాలనుకున్నాడతడు. సుజాతకు ఇష్టమైన రీతిలో నవ్యమైన పధ్ధతిలో మంగళ సూత్రం తయారు చేయడానికి పెదనాన్నగారు పెద్దమ్మగారు బాధ్యత తీసుకున్నారని; అంతేకాక,తను అమ్మానాన్న లనూ మాధవినీ వెంటబెట్టుకుని కాంచీపురం వెళ్లి,ఆమె స్కిన్ టోన్ కి నప్పేటట్టు నిశ్చితార్థనికీ పిమ్మట పెళ్ళికీ పట్టు చీరలు సెలెక్ట్ చేసాడని చెప్పడానికి తహతహలాడాడు. కాని ఆ రోజు సుజాత కాస్తంత పెందలకడే వెళ్లి పోయినట్లుంది. ఆశించినవన్నీ అనుకున్నట్టు జరగవు కదా!
అప్పుడు అక్కయ్యకు బదులు మోహన ఫోను అందుకుని సుజాత దినవారీ చర్యల గురించి వివరించింది- అక్కడి ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ కార్యకలాపాలు చూసుకోవడంతో బాటు— ఆల్ స్టోన్ విలేజీలో ఉన్న బ్రిడ్జి ఎలిమెంటరీ స్కూలులో పిల్లలకు వారానికి రెండు సార్లు డ్రాయింగ్ క్లాసులు నడుపుతుందని- మరొక వికలాంగుల స్కూలు-కమ్- కౌన్సిలింగు సెంటర్ కి వెళ్లి ఒక రోజంతా అక్కడి పిల్లలకు ఆటా పాటలు నేర్పుతుందని— యింకా టైముగాని మిగిలితే కౌంటీలో ఉన్నలేడీ వెల్ ఫేర్ సెంటరులో లేడీస్ తో చర్చలు జరిపి కూడా వస్తుందని వాళ్ల అక్కయ్యకున్న పోర్టిఫోలియోని ఉన్నదన్నుట్లు అప్పజె ప్పింది.అంతా చెప్పి అక్కడున్న ఆనవాయితీ ప్రకారం-“సారీ!”అని ముగించింది.కాని ఏది ఎలాగున్నాఅతడికి మాత్రం ఊరట కలగలేదు.తను ఆమెకు ఫోను చేయనని,కొన్నిరోజులపాటు టచ్ లో ఉండలేడని చెప్పాడు;వాస్తవమే!మరి ఇరుదేశాల కాల ప్రమాణాలు ఒకటి నొకటి ఎంతగా క్లేష్ ఐతే మాత్రం- తనే తీరిక చూసుకొని అతడికొకసారి ఫోను చేయవచ్చుగా!
కాని— వెంటనే తన మందకొడితనపు ఆలోచనలనుండి తేరుకున్నాడతను. వేక్ కొంటీలో అంతటి ప్రముఖ వ్యాపార కుటుంబంలో పుట్టిన అమ్మాయి అన్ని వ్యాపకాలు ఒక్కతీ ఎలా చూడగలుగుతుందో! ఇకపోతే-సుగాత్రమ్మ ఎంతటి డేషింగ్ పర్సనాలిటీ గల స్త్రీ ఐనా-బిజినస్ డిగ్రీ తీసుకున్న విద్యావంతురాలైనా ఆమె మాత్రం యెంత కాలమని భర్తకూ మరదికీ చేదోడుగా ఉండగలదు? సుజాత కూడా ఆమెతో చేరి సాధ్యమైనంత మేర బరువు బాధ్యతల్లో పాలు పంచుకోవాలి కదా! ఎందుకంటే సుగాత్రమ్మగారి తోడికోడలు వైదేహి అంత డేషింగ్ లేడీలా అతడి కళ్లకు కనిపించలేదు.మక్కికి మక్కీగా గాజువాక ప్రాంతానికి చెందిన అచ్చు తెలుగు గృహిణిలాగే గోచరించింది. ఇంకా చెప్పాలంటే తిరుపతి మాడ వీధిలోని పూజారుల ఇండ్ల కుటుంబ స్త్రీలాగే ఉంటుందావిడ. మరి ఏ మాటకు ఆ మాట చెప్పుకుంటే అందరూ ఒక్కలాగే ఉండరు కదా! ఏది ఏమైతే మట్టు కు-వైదేహీ మంచీ మన్ననతో ఇగోలకు దూరంగా ఉంటూ తోడికూడలితో సర్దుకు పోతుందిగా!
తను ఇండియాకి బయల్దేరుతున్నప్పుడు ఆమె తనకేదో తినడానికి ఇస్తున్న నెపంతో లోపలకు పిలిచి ఒకమాట అడిగింది. తలచుకుంటే బాధ పడాలా లేక నవ్వుకోవాలా అన్నది తేల్చుకోలేక పోతున్నాడు- “నాయనా అల్లుడూ! నీకు తమ్ముడు లేడు కదూ?”
తను లేడని బదులి చ్చాడు.
ఆమె అంతటితో ఊరుకుందా -లేదు-“మరి మీ పెదబాబుగారింట్లో తమ్ముడో అన్నయ్యో ఉండాలి కదా!” అని కూడా అడిగిందామె. తన పెదతండ్రికి బిడ్లలు లేరని చెప్పి ఆమె వేస్తూన్న ప్రశ్నల వెనుక ఉన్న అంతరార్థాన్ని గ్రహించాడు; మోహన గురించే అడిగి తెలుసుకుంటుందని. కాని అమెరికాలో పుట్టి పెరిగిన కన్న కూతురు మనోభావాల జీవన స్రవంతి గురించి జీవిత దృక్పథాల గురించి ఆమెకు పూర్తిగా తెలియదేమో!
తెలియదంటే ఎలా కుదురు తుంది.రేపో మాపో తెలిసే తీరుతుందిగా—మానసికంగా సాంస్కృతి పరంగా తన కూతురు భారతదేశంతో మమేకం కాలేదని!
మరునాడు— అతడు అమెరికా టైమింగ్స్ ని గుర్తుపెట్టుకుని— ఆఫీసు నుండి వచ్చిన వెంటనే సుజాత ఫోను చేస్తుందని-
‘సారీ మూర్తీ! నేను నా సెల్ ఫోనుని ఎక్కడో పెట్టి వెళ్లిపోయాను. ఇప్పుడు మీరెలా ఉన్నారు ప్రియా!’ అని హొయలు ఒలకబోస్తూ వయ్యారాలు చిలకరిస్తూ పలకరిస్తుందని ఎదురు చూసాడతను. కాని సుజాత ఫోను చేయలేదు. నరసింహమూర్తి మనసు కలుక్కుమంది. తనకు తెలుసు- సున్నిత హృదయురాలైన సుజాత తననెప్పటికీ అలక్ష్యం చేయదని--.
మిన్ను విరిగి పడినా- భూమి రెండు ముక్కలుగా చీలిపోయినా- తన సుజాతాయేనా తనను నిర్లక్ష్యం చేస్తుంది- కానే కాదు. ఏదో జరిగి ఉంటుంది. అక్కడంతా విపరీతంగా మంచు కురుస్తూన్న సమయం కదా- అక్కడెక్కడో కమ్యునికేషన్సుకి విఘాతం కలిగి ఉంటుంది- లేదా సుజాత ఎక్కడో మంచు తుఫానులో చిక్కుకుని ఫ్రెండ్సు వాళ్ళ ఇంట్లో తల దాచుకుని ఉంటుంది. మంచు తుఫాను కొన్నిసార్లు ఎడారి తుఫాను కంటే ఘోరంగా ఉంటుందని తను విన్నాడు.
అసహనాన్ని అణచుకుంటూ, అహాన్ని ప్రక్కన పెడుతూ తనే సుజాత సెల్ కి కనెక్ట్ చేసాడు. సూజాత ఫోను రింగవుతూ నే ఉంది గాని – అక్కణ్ణించి ఎటువంటి స్పందనా రాలేదు. ఇక ఉగ్గబట్టలేక అతను సుగాత్రమ్మగారికి కనెక్ట్ చేసాడు.పెద్దమ్మగారి తరపున ఆరిందానిలా మళ్లీ మోహన అందుకుంది. ”సారీ బావగారూ! ఆ రోజున అక్కయ్యకి మీరు ఫోను చేసిన విషయం చెప్పా ను. బహుశ: తనగదిలోకి వెళ్ళి మీతో విడిగా మాట్లాడుతుందనుకున్నాను. అంతే కాదు- మరునాడు ఆదరాబాదరాగా వెళ్తూ సెల్ ఫోను తీసుకెళ్లడం కూడా మరచి వెళ్ళిపోయింది; వికలాంగుల పిల్లలకేదో సైకియాట్రిక్ కౌన్సిలింగు ఉందంటూ--
ఈరోజు కూడా బ్రిడ్జి ఎలిమెంటరీ స్కులులో కో-ఆర్డినేటర్ గా సాయంత్రం పేరంట్స్ మీట్ ఉందని రావడం ఆలస్యం అవుతుందని చెప్పి వెళ్లింది. ఇంతకూ అక్క మీతో మాట్లాడలేదన్నమాట!”
ఆ మాటకు బదులివ్వకుండా,మాటను దాటవేస్తూ బిజినస్ టోన్ తో అడిగాడు నరసింహమూర్తి-“మీ తమ్ముడు లేడా?”
“అబ్బే!వాడూ లేడు. మానాన్నా మా పెదనాన్నా వాడికి వ్యాపార వ్వవహారాలలో ఎక్స్ పోజింగ్ ఇవ్వడానికి కస్టమర్స్ మీట్సుకి తీసుకెళ్ళిపోతుంటారు. వాడి ద్వారా కొన్ని లావాదేవీలను స్వయంగా క్లించ్ చేయిస్తుంటారు. ఈరోజు పెద్దమ్మ కూడా వాళ్లతో కలసి వెళ్ళినట్లుంది బావా!“
“మరి నువ్వుకూడా మీ తమ్ముడితో కలసి వెళ్ళి వ్యాపార కిటుకులు నేర్చుకోవచ్చు కదా! నీకు ఎలాగూ అమెరికా విడిచి ఇక్కడకు రావాలని లేదుగా! అందులో అమెరికా ప్రపంచ దేశాల ఫ్రీ-ట్రేడ్ కి కేంద్ర బిందువు కదా!“
“అబ్బో! కుదరనే కుదరదు! బాహ్య జీవితం వేరు- లోలోపల నాలో మొలకెత్తే మూడ్స్ వేరు. ఇప్పటికిప్పుడే డబ్బుల గలగలల్లో కూరుకుపోవడం నాకిష్టం లేదు. ఇక్కడున్న ఫెడరల్ సెక్యూరిటీ డిపార్టుమెంటులో ఉద్యోగం దొరకవచ్చు. అవకాశం దొరికితే గ్రాడ్వేషన్ పూర్తియిన వెంటనే ప్రొబేషనరీ ట్రైనింగ్ తీసుకుని చేరిపోతాను”
“అదేంవిటి? నువ్విక నిరంతరాయంగా అమెరికాలోనే జీవిత యాత్ర సాగించాలని తీర్మానించేసావా!“
“నేను ముందే చెప్పాగా బావా! దండోరా వేసి మరీ చెప్పాను. అమెరికాలో పుట్టాను. అమెరికాలో చదువుకున్నాను. అమెరికన్ల మధ్య పెరిగాను. వాళ్లతోనే ఉంటాను. ఇక నాకున్న భారతీయత పట్ల ఉన్న పట్టింపు మాట అంటావా- అదంతా పైలోకాలకు వెళ్లి పోయిన ఆ రఁవణమ్మగారి తర్బీదు- మా అమ్మా పెద్దమ్మగార్ల రాపిడీను.”
“అర్థమైంది. యు ఆర్ హేవింగ్ యువర్ ఓన్ స్టాండ్. సరే-మీ అక్కయ్య పనిచేసే స్కూలు ఫోను నెంబర్ చెప్తావా మోహనా!”
“రెండు మూడు ఇన్స్టి ట్యూట్సుకి వెళ్తుందది. అవేమిటో నాకు తెలియదు బావా! ఈరోజు గట్టిగా చెప్తాను- యెంత బిజీగా ఉన్నా సరే— ఎంత ఆలస్యమైనా సరే- నీకు ఫోను చేసిన తరవాతనే నిద్రకుపక్రమించాలని. ఐ ప్రామిస్.”
ఆ మాటతో అతడిక మాట్లాడకుండా దేంక్స్ చెప్పి ఫోను ఆపుచేసాడు.
ఈ లోపల కొడుకు ముఖ భావాలలో కానవస్తూన్న మార్పుని వర్థనమ్మ గమనించక పోలేదు.పెళ్ళి ఏర్పాట్ల వల్లనో లేక ఆఫీసు వ్యవహారాల వల్లనో టెన్షన్ వచ్చి ఉంటుందని భావించింది. కాని ఇష్టపడి కట్టుకోబోయే ప్రియసఖి వల్లనే కొడుకులోని మానసిక ఒత్తిడికి కారణమన్నది ఆమెకు ఇసుమంత కూడా అనిపించలేదు. అలా అనుకోవడానికి ఆస్కారమే లేదు కదా!
కాని తండ్రి నరసింహులు మాత్రం అలా వదిలేయలేదు.పిలిచి అడిగాడు- “ఏమిటి సంగతి? కొన్ని రోజులుగా బిగుతుగా కనిపిస్తున్నావు— ఎనీ ప్రోబ్లమ్ ఇన్ యువర్ ఆఫీసు?”
అతడు తండ్రికి భరోసా కలిగేలా నవ్వి- “అదేమీ లేదు నాన్నగారూ! హెడ్ క్వార్టర్స్ ఆదేశాలనుసారం రికవరీ డ్రైవ్ చేస్తున్నాం. రెండు మూడురోజలు ఇలానే ఉంటుంది“ అని దాటవేసాడు నరసింహమూర్తి.
మరి మనసు ఎప్పుడు ఎవరి మాట వింటుంది గనుక. తన ప్రియ సఖి సుజాత ఎంత వద్దనుకున్నా మాటిమాటికీ గుర్తుకు రాసాగింది. చివరకు చీకటి పూట నిద్ర వాకిట వరకూ వచ్చి నిల్చుంటుంది. తనను తేరి చూస్తూనే మౌనంగా మరలిపో తూంది. చెట్టు పైకెక్కిన పులికి మళ్లీ చెట్టు క్రిందకు దిగడం తెలియనట్టు- మనసు మనిషికి ఆశించడమే నేర్పుతుంది. నేర్పుగా తొలగిపోవడం నేర్పించదు కదా!
=======================================================================
ఇంకా వుంది
తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 23 త్వరలో
========================================================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

Comments