top of page

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 23

#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 23 - New Telugu Web Series

Written By Pandranki Subramani Published In manatelugukathalu.com On 13/04/2025 

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 23 - తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి  

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


హైదరాబాద్ లో సెంట్రల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు. 


అమెరికా వెళ్లిన నరసింహ మూర్తికి రూమ్ మేట్ గా పాకిస్థాన్ కు చెందిన షేక్ అహ్మద్ ను అలాట్ చెయ్యడంతో ఖంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది. 


పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు. 


నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది. శంకరం పట్ల తన ఇష్టాన్ని వ్యక్త పరుస్తుంది మాధవి. వీరి విషయం నరసింహులు గారికి తెలుస్తుంది. ఈ విషయంపై భార్యతో సానుకూలంగా స్పందిస్తాడు. నరసింహ మూర్తి ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తవుతుంది. ఇండియా వచ్చిన నరసింహ మూర్తికి  శంకరం గురించి తెలుస్తుంది. మాధవి, శంకరాల వివాహం జరుగుతుంది. 



ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 23 చదవండి.. 


వారం రోజులు గడచిపోయాయి. సుజాత నుండి ఒక్కసారీ ఫోన్ కాల్ రాలేదు. తనను మరచిపోయేంత పని రద్దీయా! తనలో తను విపరీతంగా అబ్బుర పడ్డాడు నరసింహమూర్తి. 

ఈలోపల సెలవు దినాలు అనుకూలంగా వచ్చి చేరడం వల్ల నరసింహమూర్తి అమ్మనాన్నలతో- చెల్లీ బామ్మర్దితో కలసి శ్రీశైలం వెళ్లాడు. అక్కడ కాంచీపురంలో కొనుక్కొచ్చిన కొత్త దుస్తుల్ని చీరల్ని స్వామివారి వద్ద ఉంచి తల్లి సమక్షాన సహస్ర నామార్చనలు కుంకుమార్చనలు జరిపించి వచ్చాడు. శ్రీశైలం మూడవ మాడవీధిలో పేద సాదలకు అన్న దానం జరిపించి ఒక ట్రస్టు వారికి విరాళం కూడా చదివించాడు. 


ఇక వర్థనమ్మ విషయానికి వస్తే- కూతురు తరచూ వస్తూపోతుండటం వల్ల అంతగా వెలితి తెలియ లేదన్నది వాస్తవం. ఏది ఏమైనా-లోలోపల మాధవి తన మెట్టింటి వ్యవహారాలలో క్రమ క్రమంగా మునిగిపోతుందన్న ఆలోచన ఇబ్బంది కలిగించినా; అదే చోట మరొక అమ్మాయి కోడలు పిల్లగా ఇంటికి వస్తుందన్న తలంపు కాస్తంత ఊరట కలిగించింది. ముఖ్యంగా శంకరం పంచన తన కూతురు ఉంటుందన్న వైనం ఆమెకు మరింత ఊరట కలిగించింది.


అలా రోజులు సాగుతున్న తరుణంలో నరసింహులు ఆదేశానుసారం నరసింహమూర్తి తల్లితో చేరి శంకరం వాళ్లు ఉంటూన్న వాడకు సమీపాన ఉన్న అపార్టుమెంట్ కాంప్లక్సులో టు బెడ్ రూమ్ ఫ్లేటొకటి బుక్ చేయించి మాధవి పేర రిజష్టర్ చేయించాడు. కన్న తల్లిదండ్రులుగా మెట్టింటికి వెడలి పోయిన కూతురుకి చేయాల్సింది తాము చేసే తీరాలిగా—అడిగినా అడక్కపోయినా!అది తెలుగింటి రివాజేగా!


కొత్త ఫ్లాటుకి కీ అందుకుని అందులో పాలు పొంగించి వచ్చిందే గాని మాధవి అక్కడకి వెళ్ళలేదు. ”నేనెవరికైనా బాడుగకి ఇస్తానమ్మా! నేను మాత్రం ఇప్పటికిప్పుడు అక్కడకు వెళ్ళలేనమ్మా!” అంది. 

తెల్లబోవడం వర్థనమ్మ దంపతుల వంతయింది. ”ఎందుకంట?” నరసింహమూర్తి వాళ్ల మధ్యకు వచ్చి నిలదీసాడు చెల్లెల్ని. 


“శంకరానికి మాటిచ్చాను నేనక్కడే ఉంటానని. చివరి వరకూ మా అత్తా మామలతోనే ఉంటానని. అతడేమో నేనక్కడ యెక్కువ రోజులు మనుగడ సాగించలేనని చాలెంజ్ చేసాడు. నేనా చాలెంజుని స్వీకరించాను. నేనిప్పుడు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేను. కావాలంటే ఉంటూన్న ఇంటిని రినొవేట్ చేసుకుంటాం“ 


మొదట కూతురు కొత్తింటికి వెళ్ళనని చెప్పినప్పుడు నివ్వెరపోయిన నరసింహులు కూతురి మాటతో మనసు పూరించినట్లయింది. ఆర్ద్రతతో కూతురిని అక్కున చేర్చుకుని దీవించాడు. ”వర్థనం కడుపున పుట్టినదానివి. తల్లిలాగే కదూ ఉంటావు!”


“లేదు నాన్నా! నేను డాక్టర్ నరసింహులుగారి కూతుర్ని. చివరి వరకూ ఆయనలాగే ఉంటాను”

కూతురినోట ఈ మాట విని మొదట డంగైపోయిన వర్థనమ్మ ఆ తరవాత పక్కున నవ్వేసింది- మాధవిని కౌగలించుకుంటూ. 

-----------------------------------------------------------------------------------------

ఇక శంకరం విషయానికి వస్తే-అతడు గుడి ట్రస్టీలతో కొత్తగా పావులు కదిపి మునుపు జిరిగిన చర్చలకు మలుపు తిప్పాడు. రేపోమాపో ఆలయ మేనేజింగ్ కమిటీ తనకివ్వబోయే వైస్ చేర్మన్ పోస్టు తనకిప్పుడు అవసరం లేదని- అది విద్యావంతురాలూ- ప్రగతి పూర్వక ఆలోచనలు పుణికిపుచ్చుకున్న తన భార్య మాధవికే అప్పగించవలసిందిగా కొత్త కోరిక వాళ్ల ముందుంచాడు. 

అతడి కోరిక వాళ్ల ముంగాళ్ళకు బంధాలు వేసినట్లయింది. వాళ్ళు ఎదురు చూడలేదు. కాని అదే సమయంలో కాదనలేక పోయారు. ఎందుకంటే వాళ్ళందరూ ముందే విన్నారు; మాధవి పెద్దింటి అమ్మాయయినా పుట్టింటి వారు కొత్త అపార్టుమెంటు ఇవ్వజూపినా అక్కడకు మకాం మార్చుకోకుండా తన అత్తామామలతోనే ఉంటానని కచ్చితంగా చెప్పి తమ వాడ గౌరవం కాపాడిందని. 


అంచేత ఇక పై మాధవి వాళ్ళతో కలసి మెలసి ఉంటుందని వాడ స్త్రీలతో కష్ట సుఖాలు పంచుకుంటుందన్న నమ్మకం కుదిరింది గుడి పెద్ద లందరికీ. వెంటనే సర్వసభ్య సమావేశం జరిపి మాధవిని మేనేజిమెంటు కమిటీకి వైస్ చైర్మన్ పదవిని ఇచ్చేలా పధ్ధతి ప్రకారంగా తీర్మానాలు నెరవేర్చి-చెక్ సంతకం చేయగల ఫైనాన్సియల్ పవర్సుని కూడా అందిచ్చి ఆమెకు అగ్రాసనం అందించారు. 


వాళ్లలా పకడ్బిందీగా లాయరు సలహాతో పొల్లుపోకుండా సర్వ సన్నాహాలూ పూర్తి చేయడానికి కారణం లేకపోలేదు. రేపోమాపో అటుఇటూ చూసి ఎక్కణ్ణించో వచ్చిన స్త్రీకి అంత పెద్ద పదవిని అంత త్వరగా కట్టబెట్టారని వాడలోని ఎక్స్రాగాళ్ళు ఎవరైనా తాముగానో-చెప్పుడు మాటలు వినో-తప్పుడు ప్రచారాలు చేసి అకా రణంగా రభస చేయకూడదు కదా!పెద్దలను రోడ్డు పాలు చేయకూడదు కదా!లోకల్ రాజకీయాల గురించి వాళ్ళకు తెలవనిదా? 

-------------------------------------------------------------------------------

అక్కడ-నార్త్ కరోలినా వేక్ కౌంటీలో శ్రీరామ్ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుండి ఆవిర్లు చిమ్మనారంభించాయి. సుజాత ఇండియా నుండి వచ్చే కాల్స్ కి ఏదో ఒక కారణం చేత మనసున అక్కసు పెంచుకుని అందుకోవడానికి విముఖత చూపిస్తుందన్నది మోహనకి తప్ప ఇంట్లో మెరవ్వరి దృష్టికీ రాలేదు. మోహన కూడా కావాలనే వాళ్ళ దృష్టికి రానివ్వలేదు. ఐతే-తోడు కోడళ్లిద్దరికీ అక్కడక్కడ అనుమానపు వడగాలి తాకకపోలేదు. 


మునుపులా ఉత్సాహంగా కనిపించకపోగా— నరసింహమూర్తి ఊసు ఎత్త డమే మానుకుంది సుజాత. ఆ కారణాన యిద్దరి స్త్రీలకూ నట్టింట ముళ్ళకంప పెరుగుతున్నట్లనిపించసాగింది. 

ఇక పోతే-ఉన్నట్లుండి ఒక రోజు తోడికోడళ్ళిద్దరి అనుమానమూ రూఢి అయింది. ఎవరైతే నేమి- దేనినైతే నేమి- గుప్పెట ఎన్నాళ్ళని బిగించి ఉంచగలరు? ఒకరోజు ఇద్దరూ ఏదో పనిపైన మేడపైకి మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు సుజాత గదినుండి గట్టిగా అక్కాచెల్లెళ్ళ గొంతులు వినిపించాయి. 

“మొత్తానికి నీకేమయిందే అక్కాయ్!మతి గాని భ్రమించిందా? ఉన్నట్లుండి అలా చెట్టుపైకెక్కిన భేతాళుడిలా పరకాయ ప్రవేశం చేయడంలో నీ ఉద్దేశ్యం ఏమిటి? ఇప్పటికీ సమయం మించిపోలేదు. నీకిష్టం లేక పోతే చెప్పేయరాదూ! ఎందుకలా నరసింహమూర్తి బావని ఊరించినట్లే ఊరించి ఏడిపిస్తావు?”


మోహన జడివానలా ప్రశ్నలు వేయడం బైట నిల్చున్న ఇద్దరికీ వినిపించి ఇద్దరూ చప్పున ఆగిపోయారు. గది తలుపు వద్దకు వచ్చి నిల్చున్నారు. తాముగా వెళ్ళి కదపకుండా విషయం తానుగా రావడం ఒకందుకు మంచిదే కదా!


కాని అక్కయ్య నుండి బదులు రాకపోవడం చూసి మోహన పట్టువీడని ప్రోసిక్యూషన్ లాయర్ లా మళ్ళీ అందుకుంది- “అదేంవిటే అలా మంచుముద్దలో కూరుకుపోయినట్టు బిర్రబిగుసుకు పోతున్నావు. ఇదేంవిటి ఇండియా అనుకున్నావా- నిన్ను బలవంతంగా ఇష్టం లేని వాడికి కట్టబెట్టడానికీ-- ఇటేమో- ఏర్పాట్లు చకచకా సాగి పోతున్నాయి. నిశ్ఛితార్ధానికి వర్థనమ్మగారిచ్చిన పేర్ల ప్రకారం వాళ్ళకు రానూ పోనూ ఫ్లయిట్ టిక్కెట్లు రిజర్వ్ చేయడానికి ఫ్లయిట్ కంపెనీ వాళ్లనుండి డిస్కౌంటు డీల్ కోసం మెయిల్ ద్వారా వివరాలను తెగ వెతికేస్తున్నారు నాన్నా పెదనాన్నానూ. 


అంతేనా- నీకోసం కాంచీపురం వెళ్ళి వెతికి వేసా రి ఇండియా నుండి మరిన్ని చీరలు తెస్తున్నారు. నువ్వేమో ఇక్కడ అపర సూర్యకాంతమ్మగారిలా వీరాంగణం చేస్తున్నావు! ఒకసారా రెండుసార్లా- ఎన్ని సార్లు ఫోనుచేసాడని. ఒక్కసారైనా రిస్పాన్స్ ఇచ్చావా! కాస్తంత కర్టసీ చూపించాలన్న ఇంగితమైనా నీకు ఉండవద్దూ! ఇది చాలదని కావాలనే నీ సెల్ ఫోను ఇంట్లో పెట్టి వెళ్ళిపోవడమూనూ ఏమీ తెలియని నంగనాచిలా— నీ ప్రవర్తన నాకే మాత్రమూ నచ్చిలేదే అక్కాయ్!హైలీ అబ్జక్షనేబుల్--”


“నువ్విప్పుడు మాటల వేగం తగ్గిస్తావా లేక ఒక లెంపకాయ చాచి తగిలించమంటావా?”-సుజాత. 

ఎందుకూ- అని దీర్ఘం తీసి అడిగింది మోహన. 


“ఎందుకంటే నేను నీ కంటే పెద్దదానిని. అది మరచి రెచ్చిపోతున్నావు”


“అబ్బో! రమణమ్మగారి ధోరణి అచ్చుగుద్దినట్టు బాగానే కనిపిస్తుందిలే! మనం ఇక్కడ వయసు తేడా గురించా మాట్లాడుకుంటు న్నాం? బావది చాలా మైల్డ్ టైప్. అతణ్ణి లొంగదీసినట్టు లొంగదీసుకుని యిప్పుడేమో కొత్త తతంగాన్ని చూపిస్తావా? సరే అదలా ఉంచు.. దీనికి బదులియ్యి” అంటూ ఆగిపోయి మోహన- కాస్తంత విలంబిత కాలం తరవాత మళ్లీ అందుకుంది- “హర హరా! నువ్వటు ముఖం తిప్పుకుంటే నేనెలా సూటిగా మాట్లాడేది. బాగా విను. బామ్మలా నీలా నాకు అంత బాగా తెలుగు రాక పోయినా విషయాన్ని అందుకోలేనంత అవివేకిని కాను. 


ముందేమో- మా అమ్మ పాడమని అడిగితే ఎలా పాడేదానివి- హాయిగా తీయగా పాడేదానివి. ఎటువంచి కీర్తనను పాడేదానివి- ‘కన్నార నాథుని కాంచకయున్న క్షణమైన గడపంగ జాలని నేను- శ్రిత జనావను కొల్వు సేవింపకున్న నిమిషమైన నిల్వ నేరని నేను—‘ అంటూ ఏకాంత వాసంలోని పద్యాన్ని అందుకునే దానివి -ఔనా కాదా ? 


మరి మొన్నపాడమని అడిగితే ఎలా పాడావూ- చెప్పేదా!”


ఉఁ-అంది సుజాత. 


“ఒకే ఒక కీర్తన-త్యాగయ్యవారి కీర్తన అందు కుని చటాలును ముగించిలేదూ- ‘అనురాగము లేని మనసున సుజ్ఞానము రాదు‘ అని. వాటి మధ్య ఉన్న తేడాను నేను గమనించ లేదనుకున్నావా! దానికి బోలెడంత పాండిత్యం అవసరమా!”


“నువ్వు ఫెడరల్ కోర్టులో లాయర్వి ఐతే బాగున్నే చెల్లీ! ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడుదువు“

“చాలు చాలు. నన్ను బులిపించినట్టు బులిపించి మాట మార్చకే అక్కాయ్! దీనికి బదులియ్యి. డొంక తిరుగుడుగా కాకుండా షార్ప్ గా బదులివ్వాలి. సరేనా” సుజాత తలూపింది. 


“నిన్ను చూసి బావ మాటి మాటికీ తెగ ఎమోషనల్ అయిపోవడం నేను గమనించే దానిని. అది నీకూ తెలుసు. మేమెవ్వరమూ చుట్టుప్రక్కల లేనప్పుడు నీవద్ద చనువు తీసుకోవడానికి- అంటే- నీ భాష లో నీతో మిస్ బిహేవ్ చేయడానికి ప్రయత్నించాడా?”


“నేనలా అన్నానా!”


“అదే కదా నన్ను ఆన్ లైన్ స్ట్రేంగ్యులేషన్ గేములా ఉక్కిరి బిక్కిరి చేస్తూంది. నీకు అతనంటే నిజంగానే ఇష్టం లేకపోతే— ఆరోజు కారులో నా మాటలకు రెచ్చిపోయి నిన్ను ముద్దు పెట్టుకుంటున్నప్పుడు నువ్వు కచ్చితంగా వారించి— వారించడం యేమిటి- చాచి లెంపకాయ కొట్టుండాలి కదా!


ఎంతైనా నువ్వు రమణమ్మగారి ఏకైన వారసురాలివి కదా- అలాగే నీవు చేసుండాలి, మరి అప్పుడు లేని బింకం ఇప్పుడు దేనికీ! ఒకవేళ హద్దుమీరాడే అనుకో! నిన్ను కట్టుకో బోతున్నవాడేగా! క్షమించేయవచ్చుగా!”


“నువ్వు నా చెల్లెలివే! కాదనను. కాని నాకంటూ కొన్ని వ్యక్తిగత కారణాలు నాకుంటాయి. అన్ని విషయాలూ ఉన్నదున్నట్లు నీకు చెప్పడం కుదరదు“


“నాముందు లెక్చర్లు దంచేస్తున్నావు గాని- నీ పోకడ గురించి గాని తెలిస్తే పెద్దమ్మ ఎంత నొచ్చుకుంటుందో ఆలోచించావా! సరే- దిస్ ఈజ్ మై లాస్ట్ క్వశ్చన్. ఇంతకీ నీ ఉద్దేశ్యం ఏమిటి? నరసింహమూర్తి బావతో మాట్లాడతావా లేదా?”


“మాట్లాడతాను. కాని ఫోన్లో మాత్రం కాదు“


“అంటే- నీతో మాటలు కలపడానికి ఆయన ఇప్పటికిప్పుడు యిండియా నుండి అమెరికా రావాలంటావా?”


“ఔను. అక్కర ఉంటే ఆయనే నన్ను వెతుక్కుంటూ వస్తారు. మధ్య నువ్వు చిందులు వేయకు “ 


అప్పుడు అక్కాచెల్లెళ్ళిద్దరి మధ్యా మౌనం నిశ్శబ్దంగా నేలను తాకిన మేఘంలా చోటు చేసుకుంది. 

తోడికోడళ్లిద్దరూ అక్కడే ఊపిరి బిగబట్టి నిల్చున్నారు. మళ్ళీ మోహన గొంతు వినిపించింది- “ఇదన్న మాట సంగతి! ఇగో— అంతా మేజిస్టిక్ ఇగో-- రవణమ్మగారిలా మొండితనమూ అధికార దర్పమూను. నిన్నూనీ రూపమూ చూసేవారెవ్వరూ ఇంత కఠినంగా ఉంటావంటే నమ్మనే నమ్మరే అక్కాయ్!”


“మనసు దెబ్బతిన్నప్పుడు ఏ వ్యక్తి ఐనా ఏ విధంగానైనా మారవచ్చు. దుశ్శాసనుడు చీర విప్పడానికి ప్రయత్నించి— తన మాన మర్యాదలకు భంగం కలిగించడానికి పూనుకున్నప్పుడు ద్రౌపది జుత్తు విరబోసుకుని ఏమందో తెలుసా! దుశ్శాసనుడి రక్తంతో తన జుత్తు తడుపుకున్న తరవాత గాని తను మళ్ళీ తన జత్తుకి ముడివేయనే వేయనని చెప్పింది. ఇవన్నీ నీకర్థం కావులే. పైకి నువ్వు తెలుగమ్మాయివైనా లోలోన- మనసా వాచా కర్మణ: నువ్వు వైట్ గార్లువే కదా!”


“ అబ్బో! విషయం శ్రుతి మించి రాగాన పడినట్లుందే! మధ్య నన్ను ఇరికిస్తూ నన్ను ఎటాక్ చేయనారంభించావూ! ఇక జాప్యం ఏ మాత్రమూ తగదు. ఈ విషయంలో పెదనాన్నగారి నిర్ణయమే అంతిమ నిర్ణయం. ఓకే కదూ!“


“వ్యవహారం అంత దూరం వెళ్ళనవసరం లేదు. నా అవసరం ఉందనుకుంటే నీకు కాబోయే బావగారే వెతుక్కుంటూ వస్తారు”


అప్పడు తోడి కోడళ్లిద్దరూ ప్రవేశించారు. మొదట సుగాత్రమ్మ అందుకుంది-- “అవసరం ఉంది. మీ నాన్నగారికి చెప్పవల సిన అవసరం చాలానే ఉంది. మీ నాన్నగారికి విషయం వివరించి చెప్పకపోతే- ముందుకు సాగాలా వద్దా అన్నది ఎలా తేలుతుం ది? మరొకటి గుర్తుంచుకో. నరసింహమూర్తి ఇంటి వాళ్లకు మనకున్నట్టు డాలర్లు రాశిగా పోసి ఉండకపోవచ్చు. కాని వాళ్లది మామూలు సంబంధ మాత్రం కాదని తెలుసుకో. 


నీకు లేకపోవచ్చు- వాళ్ల సంబంధ పట్ల మాకందరికీ అక్కర ఉంది. నువ్వు కోరుకుంటున్నట్లే నరసింహమూర్తి అందరితో బాటు కలసి రాకుండా ఒక వారం రోజులు ముందుగానే వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాను. ఆ తరవాత సంబంధాన్ని పదిలపర్చుకోవాలా లేదా తెంచుకోవాలా అన్నది నువ్వే తేల్చుకో. అంతవరకూ రగల చేయకుండా ఒదిగి ఉండు. 


ఇక ఆఖరి మాట. మీలా మేం ఇక్కడ పుట్టి పెరగలేదు. తెలుగు గడ్డపైన గోదావరి నదీ పరీవాహకం ప్రక్కన పుట్టి పెరిగిన వాళ్ళం. మాకంటూ కొన్ని ఆనవాయితీలుంటాయి. ఆచారాలుంటాయి. వాటితో మేం అంత తేలిగ్గా తెగతెంపులు చేసుకోలేం. ఇది గుర్తుంచుకో--”


ఆ ఒక్కమాటా అని- ఇక మరు పలుక్కి అవకాశం ఇవ్వకుండా సుగాత్రమ్మ వైదేహి చేతినందుకుని తనతో బాటు తీసుకెళ్లి పోయింది; ఇక అక్కడగాని నిల్చుంటే మరిన్ని చిక్కుముడులు పెనవేసుకుంటాయని తలపోస్తూ. 


=======================================================================

                                                ఇంకా వుంది

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 24 త్వరలో

========================================================================

 

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





Yorumlar


bottom of page