top of page

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 24

#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 24 - New Telugu Web Series

Written By Pandranki Subramani Published In manatelugukathalu.com On 20/04/2025 

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 24 - తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి  

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


హైదరాబాద్ లో సెంట్రల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు. 


అమెరికా వెళ్లిన నరసింహ మూర్తికి రూమ్ మేట్ గా పాకిస్థాన్ కు చెందిన షేక్ అహ్మద్ ను అలాట్ చెయ్యడంతో ఖంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది. 

పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు. 


నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది. నరసింహ మూర్తి ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తవుతుంది. ఇండియా వచ్చిన నరసింహ మూర్తికి  శంకరం గురించి తెలుస్తుంది. మాధవి, శంకరాల వివాహం జరుగుతుంది. 

నరసింహమూర్తి చేసే కాల్స్ కి రెస్పాండ్ కాదు సుజాత.


ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 24 చదవండి.. 


ఆ రోజు రాత్రి భార్య చెప్పిన విషయం విని శ్రీరామ్ దిగ్భ్రాంతి చెందాడు. అన్నాళ్ళూ పెళ్ళి వ్యవహారం సవ్యంగానే సాగిపో తుందనుకున్నాడు. ఇలా ఉన్నట్లుండి తిరకాసు ఎదురవుతుందని ఏ మాత్రమూ ఊహించలేకపోయాడు. నిజంగానే కుదిరిన పెళ్లి సంబంధం అన్నాళ్ల తరవాత ఉన్నట్టుండి బెడిసికొడితే! ఊహించలేక పోయాడతను. అలసటతో కనురెప్పలు మూతలు పడ్డాయి.

నిజానికి భూషణంతో అతను అడపాతడపా మాట్లాడుతూనే ఉన్నాడు. తానుగా వియ్యంకురాలికి నచ్చెచెప్పి అమెరికాలో నిశ్చితార్థం జరిపి తాంబూలాలు పుచ్చుకున్న మూడు నెలల తీరుబడి తరవాత పెళ్లి తిరుపతిలో జరిగేలా చూస్తామని ఒప్పిం చాడు కూడాను. మరిప్పుడు వెనుకాడితే-- అమెరికాలోని అమ్మాయిలకు పెళ్ళివ్యవహారం తేల్చుకునే అధికారం సంపూర్ణం. అలాగని వ్యవహారం ఇంతవరకూ వచ్చి బెడిసి కొట్టడమా!


కాని శ్రీరామ్ కూతుర్ని పిలిచి మాట్లాడ దలచలేదు. ఎందుకంటే- అతడికి కూతురు గురించి బాగా తెలుసు. తన తల్లి రఁవణమ్మవద్ద మనవరాలిలా కాదు- కూతురులా పెరిగింది. తొందరపడి పొరపాటు చేయదు. అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయయినా- సుజాత అసలు ఎవరితోనూ దగ్గరితనానికి నాంది పలకదు. అటువంటి మనస్తత్వం గలవాళ్లు దగ్గరితనానికి తావిస్తే మళ్ళీ అంత త్వరగా దూరంగా తొలగిపోరు; ఏదైనా బలమైన కారణం ఉంటేగాని-- 


ఈ రీతిన అతడు ఆలోచిస్తూ-- అందరూ అక్కణ్ణించి ఉక్కుమ్మడిగా బయల్దేరి వచ్చేముంది తన కాబోయే అల్లుడు వారం రోజులు ముందుగానే వచ్చేటట్టు- న్యూ జెర్సీలోని వేంకటేశ్వర స్వామికి మొక్కుబడి చెల్లించవలసిన కార్యం ఉందని భూషణానికీ డాక్టర్ నరసింహులుకీ నచ్చచెప్పి ప్లేను టిక్కెట్టు హైద్రాబాదుకి చేరేటట్టు ఆన్ లైన్ ద్వారా ఏర్పాటు చేసాడు. లోలోన ఇబ్బందికరంగా తోచినా అతడికి అది తప్ప వేరేదారి కనిపించలేదు. 


అది చాలదన్నట్టు అతడికి మరొక కంగారు కూడా పట్టుకుంది. నరసింహమూర్తే సీనులోకి తానుగా వచ్చి- తనను అంతగా నిర్లక్ష్యం చేసిన సుజాత తనకిక అవసరం లేదని మొరాయిస్తే!ఇప్పటి అమ్మాయిలు అబ్బాయిల మూడ్స్ నీటిమీది గీతల్లా ఎప్పుడెలా మారుతుంటాయో చెప్పడం ఎవరి తరమూ కాదు. 


మొన్న మొన్న తమ ప్రాంతానికి దిగువున ఉన్న డౌన్ టౌన్ లో తనకు వ్యక్తిగతంగా తెలిసిన ఫ్రెంచ్ మిత్రడింట్లో జరిగిన సంఘటన కళ్ళముందు గిర్రున తిరిగింది. ఒక్కగా నొక్క కొడుకు కొత్తగా కొనిచ్చిన రేసింగ్ బైక్ పైన నగరానికి ఆవల వేపున్న దట్టమైన అడవుల్లోకి చొరబడి వస్తానన్నాడు. దానికి ఆ ఫ్రెంచ్ మిత్రుడు పెద్దగా ఏమీ అనలేదు. అసలు వద్దని కూడా అనలేదు. 


‘ఒంటరిగా వెళ్ళకు- మిత్రులతో కలసి వెళ్ళు. లేక పోతే ఫారెస్టు గైడ్ ని తీసుకెళ్ళు’ అన్నాడు. అంతే! దానికా కుర్రాడు- అదేదో పెద్ద అవమానం జరిగిపోయినట్టు ఫీలయిపోతూ- పూనకం వచ్చిన వాడిలా మేడ గోడన వ్రేలాడుతున్న ప్రాతకాలం నాటి కౌ బాయ్స్ గన్ తీసుకుని తనను తను కాల్చేసుకున్నాడు. ఇప్పుడు యెలాగో ఒకలా ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో యమయాతన పడుతున్నాడు. కుటుంబస్థులం దరికీ యమాయాతనకు గురిచేస్తున్నాడు. 


ఇక పోతే- అతడికి ఇటువంటి చిక్కుముడి పరాయిదేశంలో వ్యాపారం ప్రారంభించినప్పుడు కూడా తనకెదురవలేదేమో!


ఆడపిల్లను కనీ పెంచీ పెద్ద చేయడం కాదు;దానినొక అయ్యచేతిలో పెట్టడమే మహాయాగంలా సంసిద్ధులై ఉండాలేమో!


 ఆ మాటకు వస్తే తను తలచాలే గాని- తనింటికి వియ్యంకులుగా యెవరు యేతెంచరని. క్యూకట్టి మరీ వస్తారు. కాని అన్ని సంబంధాలూ భూషణం వాళ్ల సంబంధానికి ఈడు కాలేదుగా! చెడ్డ రోజులు దాపురిస్తున్నాయంటే ఇవే కాబోలు!

----------------------------------------------------------------------------------------------------------------

వర్థనమ్మ ఆ రోజు తన ఆఫీసు గదికి పిలిపించి— అమెరికా ప్రయాణానికి మాధవితో బాటు సిద్దం కమ్మని చెప్పినప్పు డు శంకరం నివ్వెరపోయాడు. “నేను అమెరికాకి రావడమా! నిజంగా అక్కడ నా ఉనికి అవసరమా మేడమ్?” అని కళ్లు పెద్దవి చేసుకుని చూసాడు. 


అతడు అత్తగారైన వర్థనమ్మను ఆఫీసులో మేడమ్ గారనే సంబోధిస్తాడు. చనువు తీసుకుని హద్దులు మీర కుండా జాగ్రత్త పడతాడు. అల్లుడి ఆశ్చర్యానికి వర్థనమ్మ ముఖాన నవ్వు పూసింది. ముందు తనకెదురుగా వచ్చి కూర్చోమని సైగ చేసింది. అతడు కూర్చున్న తరవాత అక్కడకి పావనమ్మ వచ్చి ప్రక్కనున్న ఫ్లాస్కునుండి కాఫీ కప్పులో పోసి అతడి ముందుంచింది నవ్వుతూ. 


ఆమెకు శంకరం గురించి తెలుసు. అక్కడామె రెండు మూడు సంవత్సరాలుగా లేడీ అటెండర్ గా పనిచేస్తుంది. మొన్న మొన్న జరిగిన, రీ-షఫలింగులో ఆమెను వర్థనమ్మగారి చేంబర్కి మార్చారు. ఇద్దరు బిడ్డల తల్లయిన ఆమెకు శంకరాన్ని చూస్తే ముచ్చట- ఎందుకంటే ఎంద ఎదిగినా— ఇంకా ఎదుగుతూనే ఉన్నా- ఓ పెద్దింటికి అల్లుడుగా మారినా అతడిలో కానవచ్చే వినయ వినమ్రతలు ఆమెను ఆకట్టుకున్నాయి. 


శంకరాన్ని స్ఫూర్తిగా ఆదర్శప్రాయంగా తీసుకోమని ఇంట్లోని తన బిడ్డలకూ చుట్టుప్రక్కల వాళ్లకూ చెప్తుంటుంది. శంకరంలాగే అందరూ పురాణ పఠనం సాగించాలని పోరుతుంది. 


శంకరం నిశ్శబ్దంగా కాఫీ తీసుకోవడం చూస్తూ కూర్చున్న వర్థనమ్మ నిదానంగా అంది- “టెన్షన్ అవకు శంకరం. మేం లేమా నీకు గైడ్ చేయడానికి? నిజం చెప్పాలంటే మీ పెళ్ళికి అమెరిగా నుండి శ్రీరామ్ దంపతులు వచ్చి ఆశీర్వదించి వెళ్తాన న్నారు. మేమే వద్దని ఆపుచేసాం. 


ఎందుకంటే— అబ్బాయి పెళ్ళి నిశ్చితార్థానికి మాతో బాటు మా అల్లుడూ కూతురూ ఎలాగూ రాబోతున్నారు కాబట్టి- రెండు ఖర్చులు ఎందుకని వాళ్లను రాకుండా ఆపుచేసాం. ఐనా మాటలో మాటగా చెప్పాలంటే నువ్వు రాకుండా మాధవి మాతో ఎలా వస్తుంది అల్లుడూ! ఐనా నువ్వు అనవసరంగా ఒత్తిడికి లోనవుతున్నావు గాని- అక్కడకు వెళ్ళడానికి గడువుందిగా!ఆ లోపల కావలసిన వ్యవహారాలన్నీ సెటిల్ అయిపోవూ!


అతడిక ఏమీ అనకుండా కాఫీ తాగుతూ తల దించుకున్నాడు. 


తను అమెరికా వెళ్ళడమా! నమ్మలేకపోతున్నాడు శంకరం. మాధవి సంగతి వేరు. ఆమె చిన్నప్పట్నించీ పెద్దింట్లో పుట్టి పెరిగినది. అందుబాటులో ఉన్నవన్నీ అనుభవించడానికి అర్హతులున్న స్త్రీ. తన యింటి నేపథ్యం అటువంటిది కాదు కదా! కలసి వస్తుంది కదానని- కనిపించిన ప్రతి దానినీ అల్లుకుపోవడానికి వెంపర్లాడ కూడదూ కదా! తన హద్దుల్లో తను ఉండటమే కాదు; తన వెనుక తెల్ల తోడేళ్ళలా వెంటాడుతూ వస్తూన్న ఆశల అలల్ని కూడా అదుపు చేసుకోవాలి. లక్ష్మణ రేఖల్ని దాటకుండా చూసుకోవాలి. అప్పుడు ఆమె అల్లుడి ఆలోచనలకు అడ్టు కట్టవేస్తూ అంది- “ఏం పాస్ పోర్టు లేదా? దానికేం- తత్కాళ్ పధ్ధతిన అన్నీ ఏర్పాటు చేసుకుందాం. ఆ తరవాత వీసా తానే వస్తుంది“


“అదేం కాదు మేడమ్. పాస్ పోర్టు ముందే ఉంది”


అలాగా- అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది. 


”ఔనండీ! ఉద్యోగంలో చేరకుముందు నాతో బాటు ఇంటర్వ్యూలో సెలెక్టయిన క్యాండిడేట్లందరినీ పాస్ పోర్టులు తెచ్చుకున్న తరవాతనే డ్యూటీలో చేరమన్నారు. మా నడత గురించి వాళ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయవలసిన పోలీసు విచారణ పాస్ పోర్టు సాంక్షన్ వ్యవహారంలో తేలిపోతుంది కదా-పనిలో పనిగా!”


ఆమె కొన్ని క్షణాల వరకూ ఆశ్చర్యం నుండి తేరుకోలేక పోయింది. తను టీచర్ గా ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఇటువంటివాటి ఊసు విననే లేదు. ఈ విషయంలో మాధవికి ఇబ్బింది ఎదురయి ఉండదు. మాధవి తమతో బాటు ముందే తీసుకుంది పాస్ పోర్ట్; ఒకసారి నరసింహులుతో అఖిల ప్రపంచ సర్జన్ల సమావేశానికై ఆస్ట్రేలియా వెళ్ళవలసి వచ్చినప్పుడు. 


“సరే- వాటి విషయం తరవాత మాట్లాడుకుందాం. పాస్ పోర్టుని రిన్యూవల్ చేసుండకపోతే-అదీ చేసుకుందాం ఇప్పుడు. ఇక వీసా గ్రాంట్ విషయంలో- దానికి జరగబోయే ఇంటర్వ్యూ వ్యవహారంలో కావలసినవన్నీ నరసింహమూర్తి చూసుకుంటాడులే! మీ బామ్మర్దికి ఆ విషయంలో ముందుస్తు అనుభవం ఎలాగూ ఉంది కదా! వీసా కోసం ఇంకెక్కడికో వెళ్ళడం దేనికి. అమెరికన్ కాన్సులేట్ ఇక్కడే ఉందిగా.


 మీరిద్దరూ కాస్తంత ముందుగా ఇప్పుడే సెలవుకి అప్లయ్ చేసుకోండి మేనేజిమెంటువాళ్లు కూడా లీవ్ వెకన్సీలకు తాత్కాలిమైన ఏర్పాటు చేసుకోవాలిగా. అన్నట్టు మరొకటి. మనం ఊరు విడిచి వెళ్ళేటప్పుడు మా వియ్యంకుణ్ణీ వియ్యం కురాలినీ మా ఇంటికి వచ్చి ఉండమను. ఎందుకంటే నరిసింహమూర్తిది గవర్నమెంటు క్వార్టర్సు. పకడ్బందీగానే ఉంటుందిక్కడ” 


“అలాగే మేడమ్. కాని మా బాబు మీ క్వార్టర్సుకి వచ్చే అవకాశం ఉండదేమో! ఎందుకంటే మేడమ్- ఆయన పోలేరమ్మ గుడి ట్రస్టీ. ఉత్సవ మూర్తుల ఊరేగింపూ తదితర గుడి వ్యవహారాలలో ఆయన ఉనికి అక్కడ ఉండాలి. మాధవేమో- స్త్రీల ప్రతినిధి మాత్ర మే కాక- మేనేజి మెంటు కమిటీ వైస్ చైర్మన్ కూడాను. మాధవి గాని ఉంటే ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటుది. 


మాధవి కూడా లేకపోవడం వల్ల ఆయనకు పని రద్దీ ఎక్కువవుతుందండీ“ అంటూ మాధవి ఎలక్షన్కి సంబంధించిన విషయమంతా వివరించి చెప్పాడతను. 


అప్పుడామె అడిగింది- “మరి గుడి వ్యవహారాలలో మీరు కలుగచేసుకోరా శంకరం?”


“అడపా దడపా బాబుకీ మాధవికీ చేయూతనిస్తుంటానండీ. నేను గుడి నిర్వహణ బాధ్యతలు తీసుకుంటే రెండు పడవలపైన కాళ్ళూని ప్రయాణం చేస్తున్నట్లుంటుందండీ. నేనిప్పటికే సత్య హరిశ్చంద్ర సేవా సమితిలో యాక్టివ్ రోల్ తీసుకున్నాను కదా!”


వర్థనమ్మ మరేమీ అనలేదు. అతడన్నదానితో సమ్మతమేనన్నట్టు తలూపిందామె. అతడు లేస్తూ అన్నాడు- “మాధవి గురించి ఒకటి చెప్పాలండీ”


చెప్పమన్నట్టు తలాడించింది వర్థనమ్మ. 


“మా వాడలోని వాళ్ళు తమ పిల్లల్ని అంత పకడ్బందీగా చదివించరండీ! పిల్లలు ఏదో వెళ్ళారా-వచ్చారా-అన్నట్టు దానినొక మామూలు విషయంలా ట్రీట్ చేస్తారండీ. ఇక అసలు విషయం ఏమంటే- దగ్గర్లో మంచి గవర్నమెంటు స్కూల్లు కూడా లేవండి. అంచేత మాధవే ముందుకు వచ్చి చదువులో వెలగలేని అబ్బా యిలకూ అమ్మాయిలకూ రాత్రి పూట ఇంట్లోనే స్పెషల్ ట్యూబ్ లైట్లు అమర్చి స్పెషల్ క్లాసులు తీసుకుంటుందండీ. మూడే మూడు సబ్జక్టులు తీసుకుంటుందండి. తెలుగు-ఆంగ్లం-మ్యాథ్సు. ఇంకా కొందరమ్మాయిలకు గాత్ర సంగీతం నేర్పనారింభించింది. ”


ఆమాట విన్న వర్థనమ్మ ముఖం వెలుగు రేఖలతో నిండిపోయింది. ”ఇంకేమైనా చేస్తుందా మాధవి?”


“ఔనండీ. గుడికి తరచూ వచ్చీపోయే ఆడాళ్లతో పరిచయం పెంచుకుని వాళ్ళకు వాకింగ్ చేయమని- స్త్రీలకు అనువైన యోగాసనాలు చేయమని పురమాయిస్తుంది. ఆసక్తి కనబరచే వారికి స్వయంగా నేర్పుతుంది కూడానండీ“


వర్థనమ్మ ఇక మాట్లాడకుండా సీట్లో నుండి లేచి అల్లుడి చేతిని తన చేతిలోకి తీసుకుని ఇక వెళ్లి రావచ్చన్నట్టు చూసిం ది. అతడు-- అదే నవ్వు ముఖంతో చూస్తూ మన: పూర్వకంగా ఆఫీసు ఇన్చార్జీ గారికి నమస్కరిస్తూ బైటకు కదిలాడు.


మాధవి వంటి జీవన సహచరి తన ప్రక్కన ఉండాలే గాని తను సాధించలేని దేముంటుందని!

----------------------------------------------------------------------------------------------- ----

ఎట్టకేలకు కాబోయే మామగారి కోరిక మేర తను ముందస్తుగా అమెరికా వెళ్ళడానికి షార్ట్ టార్మ్ గడువుకై కన్సలేట్ నుండి వీసా అందుకోగలిగాడు నరసింహమూర్తి. ఏది ఏమైనా గవర్నమెంటు ఆఫీసర్లకంటూ ఒక వెసులుబాటు ఉంటుంది కదా!


నార్త్ కరోలినాకి బయల్దేరడానికి వారం రోజుల ముందుగానే పై అధికారులకి సరైన విధంగా నచ్చచెప్పి నెలరోజుల ఆర్జిత సెలవు కూడా మంజూరు చేయించుకోగలిగాడు. పెళ్ళి సంబంధం కోసం కదూ వెళ్ళేది; మళ్లీ మళ్ళీ పెళ్ళికొడుకు కాలేడుగా! అంచేత తోటి సహోద్యోగులు కూడా అతడికి అండగా నిలచి అతడు చూడాల్సిన అర్జంట్ పనుల్ని తమ మధ్య పంచుకున్నారు. అలా తటాలున వెళ్ళవలసిన అవసరం రేపో మాపో తమకు మాత్రం కలగకుండా పోతుందా! అప్పుడు నరసింహమూర్తి ఆదుకోకుండా ఉంటాడా! 


ఇప్పుడతణ్ణి అద్దరివేపు నడిపిస్తున్నది- ఇగోల సరిహద్దులను దాటింపచేస్తున్నదీ- హృదయావేశం కాదు. మోహావేశం అంతకంటే కాదు. మనసు మూలన పచ్చటి కొమ్మలా మొలకెత్తిన ప్రేమ— తొలిప్రేమ. 


అందుకేగా అంటారు విజ్ఞులు- ‘వయసులో ప్రేమ చొరబడిందంటే, జీవితంలో మహోన్నతమైనవి మాత్రమే కాక- విలవిల్లాడించే విపరీతాలు కూడా జరగవచ్చు’ అని. 


అతడు ఎప్పటిలాగే న్యూయార్కులో దిగి, అక్కణ్ణించి రిలే దుర్హమ్ అంతర్జాతీయ విమానాశ్రయెం చేరుకుని-బ్యాగేజీ విభా గం నుండి సూటు కేసు అందుకుని— తన కోసం అన్నదమ్ముల్లో ఎవరైనా వచ్చి ఉంటారని ఊహిస్తూ ఆమడ దూరం వరకూ పరకాయించి చూసాడు. కాని— ఆశ్యర్యం! 


వాళ్ళెవరూ రాలేదు. తన కాబోయే బామ్మర్ది రామ్ మోహన్ రాబర్టు కూడా ఎదురు పడలేదు. సుజాత ఒక్కెతే అతడికి ఎదుర్కోలు పలకడానికి వచ్చింది. అతడి చేతినుండి ట్రావిలింగ్ బ్యాగు అందుకుని చిరున వ్వుతో-“వెల్ కమ్ వన్స్ ఎగైన్ టు నార్త్ కరోలినా! ప్రయాణం బాగానే జరిగింది కదూ!”అని అడిగింది. 


కాని అతడు ఆమెలా మామూలుగా మాట్లాడలేక పోయాడు. ఎప్పుడూ కవల పిల్లల్లా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారు అక్కాచెల్లెళ్ళిద్దరూ- కనీసం మోహన ముఖం కూడా కనిపించక పోవడం అతడిలో ఓ విధమైన వెలితిని కలుగచేసింది. కాసేపటికి తెరపిన పడి ఆలోచనల నుండి తేరుకుని బదులిచ్చాడు- “ఇటీజ్ ఫైన్” అంటూ సూట్ కేసుతో ఆమెను అనుసరించాడు. 

కారు వేపు నడుస్తూ అడిగాడతను-“మరెవ్వరూ రాలేదా సుజాతా?“ 


“ఏం? నేను కనిపించడం లేదా! ఏం- నన్ను చూస్తే మీరు కంఫర్టెబల్గా ఫీలవడం లేదా?”


ఈసారి నరసింహమూర్తి కళ్లు పెద్దవి చేసి చూసాడు. ”ఇటీజ్ ఓకే! ఇటీజ్ ఓకే! ఐనా ఎందుకిలా మరీ సూటిగా మాట్లాడుతున్నావు సుజాతా?”


“నాకు అలా మాట్లడాలని లేదు. మీరే నన్నలా మాట్లాడిస్తున్నారు”


అతడు ఆమెను తేరిచూసాడు. తమ వ్యవహారాన్ని అటో ఇటో తేల్చుకోవాలన్న తీర్మానంతోనే వచ్చినట్లుంది ఈ అమెరికన్ తెలుగు భామామణి! విషయం బైటకు వచ్చేంత వరకూ ఓపిక పట్టాలి. తను మాత్రం అగ్గికి ఆజ్యం పోసాడన్న నిందకు లోనవకుండా చూసుకోవాలి. 


చలి మునుపులా లేదు. అదే సమయాన వాతావరణం వేడిగానూ మారలేదు. నగరం చుట్టూరా పచ్చదనం పరచుకున్న చోట చల్లదనం తప్ప అతి వేడిమి ఎలా ఉంటుంది?


సామాను కారులో కుదురుగా పెట్టిన తరవాత- డోరు తెరచి లోపల కూర్చుంటూ సుజాత అడిగింది- “ఈ లోపల ఇక్కడెక్కడైనా తేలిక పాటి అల్పాహారం తీసుకుందామా మూర్తిగారూ!”


“ఎందుకూ?మనం యింటికేగా వెళ్తున్నది! అక్కడే తీసుకుంటాను”


“కాదు. మనం ఇంటికి వెళ్ళడం లేదు“


అతడు విస్తుపోయి చూసాడు. ఇంతకీ సుజాతకేమైంది? నిదానంగా చూస్తూ అడిగాడతను- “మరి మీ నాన్నగారూ అమ్మగారూ అడగరూ- తిన్నగా యింటికి తీసుకురాకుండా ఇంకెక్కడికో తీసుకెళ్ళావని!“

“చెప్పే వచ్చాను— మా ఫ్రెండ్సు వాళ్ల ఇంటికి తీసుకెళ్తున్నానని- అక్కడే రాత్రి డిన్నర్ తీసుకుని మరునాడు ఇంటికి వస్తామని. కాని వాస్తవానికి మనం అక్కడకి కూడా వెళ్లడం లేదు“


ఈసారి అతడు మరింత తెల్లబోయి చూసాడు. నడచి వచ్చే నిండు సౌందర్యంలా— సౌమ్య శుభ్ర తేజస్సు ఉట్టిపడే తెలుగాడ పడుచులా అలరిస్తూ— ఎంత అందంగా మరెంత కనుల పండువుగా ఎదురొచ్చేది సుజాత; రఁవణమ్మగారి నిజమైన వారసురాలని తనను మురిపిస్తూ-- 


ఇప్పుడేమో- అదేదో హిచ్ కాక్ సినిమాలోని థ్రిల్లింగ్ సీనుని సృష్టిస్తున్నట్టు దేనికో తయారవుతున్నట్టు కనిపించడం లేదూ! అంతలోనే ఎంత మార్పు! జవరాండ్ర చిత్తముల్ క్షణ క్షణ భంగురముల్—నిజమే కదా మరి!


అంతలో అతడి మానసిక పరిస్థితి గమనించి గావాలి సుజాత అతడి వేపు తిరిగి అడిగింది- “అదేంవిటి అలా కన్నార్పకుండా చూస్తున్నా రు! ఇంతకు మునుపెన్నడూ చూడలేదా? నా ప్రక్కన కూర్చోలేదా?”


అతడేమీ అనలేదు. రోడ్డుకి అవతల గుట్టలుగా పేరుకుపో యిన మంచు ముద్దలను చూస్తే- మునుపైతే ‘ఎన్నాళ్ళవుతుంది ఇవన్నీ కరగడానకి?’ అని అడిగేవాడు. ఎక్కడైనా జలాశయాన్ని చూస్తే చాలు- ‘ఇంత తళతళ మెరిసేలా చెరువుల్ని ఎలా ఉంచగలుగుతున్నారు మీ వాళ్ళు?’ అని ఉత్కంఠతతో ఆరాతీసేవాడు. 


ఇప్పుడతనిలో అటువంటి ఉత్కంఠత కనిపించడం లేదు. సుజాత మళ్లీ కదిపింది- “ఇంకా మీరు నేనడిగిన ప్రశ్నకు బదులివ్వలేదు”


ఏమిటన్నట్టు ఆమె వేపు తిరిగి చూసాడు నరసింహమూర్తి. 


”దారి మధ్య ఏమైనా తీసుకుందామా? కెంటకీ చికెన్ మీకిష్టం కదూ- అది తీసుకుంటారా? “


“కెంటకీ చికెనే కాదు, మొదట్లో నాకిక్కడ చాలా విషయాలు ప్రియంగానే ఉండేవి. చూసేవన్నీ ఆహ్లాదకరంగానే కనిపించేవి. ఇప్పుడలా తోచడం లేదు. యుధ్ధంలో ఫిరంగుల దెబ్బలతో శిథిలమైన యూదుల సైనాగ్ లో ఒంటరిగా నిల్చున్నట్లుంది”


ఆమె ఇటు తల తిప్పి చూడాకుండానే కారు డ్రైవ్ చేస్తూనే అంది- “ఎందుకో!”


“ఈ టీజింగ్ దాడులు మాని—మనం ఇప్పుడు ఎక్కడకి వెళ్తున్నామో చెప్తావా సుజాతా?”


“జార్డెన్ అడవుల మధ్యకు“. 


కూల్ గా ఎటువంటి తడబాటుకీ తావివ్వకుండా ఇచ్చిన ఆమె జవాబు విని కళ్ళుపెద్దవి చేసుకుని చూసాడు నరసింహమూర్తి- “ఎందుకూ!” అని అడుగుతూ--

“ఒకసారి మీరేగా అన్నారు- రాత్రి పూట క్యాంప్ ఫైర్ చూడాలని“


“అది అప్పటి మాట. ఇప్పటి మాట అదికాదు. మనసున్న మనుషులనుకున్న వాళ్ళే మండిపోతున్నప్పుడు- మధ్య క్యాంప్ ఫైర్ ఒకటి కావాలా?”


ఆమె ఏమీ అనలేదు. ఫుడ్ పాయింట్ వద్ద కారాపి తను కొద్దిగా తీసుకునేటట్టు-- నరసింహమూర్తికి కాస్తంత ఎక్కువ గా ఆర్డరిచ్చి— అంతా నిశ్శబ్దంగా ముగించుకు పేమెంటు సెటిల్ చేసి మళ్ళీ కారు స్టార్ట్ చేసి జార్టెన్ జలాశయం వేపు కారు మళ్లించింది. 


అటు ఎటో చూస్తూ కూర్చున్న నరసింహమూర్తికి హోరున వీచే గాలిలా అప్పటి తియ్యటి జ్ఞాపకం తాకింది-“కవితా! ఓ కవితా! నా యువకాశల నవపేశల సుగీతావరణంలో నిను నేనొక సుమూహర్తంలో“ 


తలచుకుంటే ఎంత హృద్యంగా ఉంది— ఆ సమయం— ఆమనోభావం ఇంకెంత మధురంగా ఉంది! ఇప్పడు అప్పటిలా ఎందుకు లేదు? రేపు కూడా యిప్పటిలా ఉండదేమో!


మరి కాసేపు కారు డ్రైవ్ చేసిన తరవాత సుజాత సాధ్యమైనంత నిదానంగా అంది- “మా ఫ్రెండ్సు ఉంటారక్కడ. ఇక్కడి వాళ్లు మనవారిలా కాదు, చాలా లైవ్లీగా ఉంటారు. అంచేత ముఖం అదోలా పెట్టుకోకండి. వాళ్లు మరోలా అనుకుంటారు“


“ఇవన్నీచెప్పనవసరం లేదు. మనసులో ఒకటి— ముఖంలో మరొకటీ పెట్టుకునే అలవాటు నాకు లేదు. అది నా నైజమూ కాదు“


“మంచిది. అదంతా తరవాత మాట్లాడుకుందాం. ఓకే !” తనతో సుజాత రాగం తీసేలా అంతదీర్ఘంగా సాగదీసి మాట్లాడదు. ఇప్పుడేమో కావాలనే చెల్లిని అనుకరించేలా ఒత్తి ఒత్తి మాట్లాడుతుందని అతడికి తెలుస్తూనే ఉంది. ఈమె నిజంగా సుజాతాయేనా!


“ఏదైనా ఎప్పుడైనా మాట్లడటానికి నేను రెడియే. కాని-ఒకటి- ఇలా కొంటె తనపు గొంతుతో వ్యంగ్య ధోరణి చూపించకు. నీ పర్సనాలిటీకి తగదు. భరించలేకుండా ఉన్నాను. ఐ యామ్ ఫీలింగ్ సఫొకేటడ్“


“నేనంత కంటే సఫోకేటడ్ గా ఫీలవుతున్నాను. ఇన్ ఫేక్ట్ ఐ ఫెల్ట్ చీటెడ్“


ఆ మాటతో నరసింహమూర్తి జెర్కింగ్ తో ఉలిక్కి పడ్డట్టయాడు. 


సుజాత చూపుల్లో చిలిపి చేష్టలే కాకుండా బడబాగ్నులు దాగుండవచ్చన్న ఊహ అప్పుడు గాని అతడికి కలగ లేదు. కారుని అడవికి కాస్తంత దూరాన ఉన్న పార్కింగ్ స్పాట్ వద్ద ఉంచి ఇద్దరూ దిగారు. 


సుజాత ఫ్రెండ్సూ- తనతో స్కూల్ లో పనిచేసే కొలీగ్సూ- వాళ్ల వాళ్ల బాయ్ ఫ్రెండ్సుతో కళకళలాడుతూ కేరింతలు కొడు తూ కనిపించారు. సుజాతను చూడగానే అందరూ గుంపుగా ఎదురొచ్చారు- “హాయ్! హాయ్ మైడియర్! యువర్ మేన్ లుక్స్ రియల్లీ గుడ్- వై- రియల్లీ హ్యాండ్ సమ్“ అంటూ అడవిలోని నిశ్శబ్దాన్ని కొన్ని క్షణాలలో చెల్లాచెదురు చేసారు. 


ఆ తరవాత నరసింహమూర్తితో కరచాలనం చేసి పలకరింపుల జల్లు కురిపించారు. నిజమే- అమెరికన్లు గుండె కవాటాలను త్వరగా విప్పి మన సుల్ని మనుషులతో కలిపి మెసలుతారేమో! అందుకేనేమో-- వాళ్ళు బోల్డుగానే కాదు; చాలా జావియల్ గా కూడా ఉంటారని పించిందతనికి. 

అక్కడి వాళ్లు నానా చిల్లర హాలీవుడ్ సినిమాలు చూసి ఏదేదో అనుకుంటారు గాని, వీళ్లలో పెక్కు పోజిటివ్ లక్షణాలే ఉన్నాయి. కొందరు తెల్లమ్మాయిలు ఇద్దరి దగ్గరకూ వచ్చి బెరుకన్నది లేకుండా ముఖం దగ్గర ముఖం ఆన్చి ఆప్యాయంగా పలకరించారు. వాళ్ల పలకరింపులతో అతడిలో అలసిన జీవం మళ్ళీ ప్రాణం పోసుకున్నట్లనిపించింది. ముఖం విప్పారింది. 


చూపు సుజాత వేపు మళ్లింది. అప్పుడు గాని అతడి కంట సుజాత వేసుకొచ్చిన వస్త్రాలంకరణ పడనే లేదు. శృంగార అధినాయకిలా నిండుగా కళకళా మెరిసి పోతూంది. వెస్ట్రన్ ఆధునిక స్టయిల్ లో బోటినా బూట్లు-హై వెయిస్టెడ్ జీన్ ప్యాంట్- పెదవులకు తాకీతాకని గుళాబీ రంగు లిప్ స్టిక్- మొత్తానికి ఆమె రూపం బోల్డుగా లాటిన్ అమెరికన్ మోడల్ లా అతడి కళ్ళను అదరగొట్టేస్తుంది. ఇందుకే కాబోలు అంటారు- కొప్పున్న ఆడది ఎలా ముడి వేసుకున్నా బాగానే ఉంటుందని!‘

ఆమె మాట తీరు-రూపం-శారీర విన్యాసం-కొత్తగా కవ్వింపు తెచ్చే తుళ్లింతలా ఉంది. ఎయిర్ పోర్టులో దిగి ఏదో మూడ్ లో ఉండి పోయి అతడదేమీ గమనించనే లేదు. మిసమిసలాడుతూ సొగసుల సౌరభాలు చిమ్ముతూ పండ్ల బరువుతో నిండుగా ఒరిగి ఉన్న గున్నమామిడి చెట్టులా ఉంది సుజాత;ఉన్నట్లుండి పరకాయ ప్రవేశం చేసిందేమో- అనిపించేలా!


జార్డెన్ ఫారెస్టు డిపార్టుమెంటు వాళ్లు బహు చక్కని ఏర్పాటు చేసినట్టున్నారు. అడవి చెట్ల వరసల మధ్య శిబిరాల పైన ఫోకస్ అయేలా లైట్లు వెలిగేలా అమర్చారు. సుజాత వాళ్ళ ఫ్రెండ్సు తెచ్చిన రంగు రంగుల బెలూన్లు- గాలిలో ఎగిరే కాగితాల పడ వలు-పొడవైన బల్లపైన హాట్ ప్యాక్ లలో అమర్చి ఉంచిన భోజన పదార్ధాలు- దూరాన మండుతూన్న క్యాంప్ ఫైర్. అక్కడి వాళ్ల నిర్వాహక సామర్థ్యం పుణికి పుచ్చుకుంటూంది.


ముందు యాపిటైజర్ ఆరగించిన తరవాత- అక్కడి వాళ్ళతో కబుర్లాడుతూ భోజనం కానిచ్చిన తరవాత- “వెల్ కమ్ బ్యాక్” అన్న ఆంగ్ల పాటను ఆలపించారు సుజాత మిత్రురాండ్రందరూ. 

సుజాతనూ నరసింహమూర్తినీ వాళ్ల కోసం అమర్చిన గుడారంలోకి తీసుకెళ్లి అటు పిమ్మట-- మరచిపోకుండా నరసింహమూర్తి ఊరునుండి తెచ్చుకున్న సూటుకేసుని కూడా లోపల ఉంచి వాళ్ళ వినోద విహారాల స్థావరాల వేపు సాగిపోయారు.


=======================================================================

                                                ఇంకా వుంది

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 25 త్వరలో

========================================================================

 

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





Comentarios


bottom of page