top of page
Writer's picturePandranki Subramani

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 3

#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 3 - New Telugu Web Series Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 29/11/2024 

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 3 - తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి  

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



 జరిగిన కథ:


హైదరాబాద్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు. 


నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. 


ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. 

అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది.



ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 3 చదవండి..


ఎట్టకేలకు అతడు ఎయిర్ బస్ లోకి ఎక్కికూర్చున్నాడు. ఇప్పుడతను అమెరిగా ఆకాశంలో తేలుతున్నాడు. అతణ్ణి స్పర్శిస్తూన్న గాలులూ కనిపిస్తూన్న మేఘాలూ అన్నీ అమెరికాలోనివే. ఒక్కటి కూడా తన భారత దేశానికి చెందినది కాదేమో! 


చాలా మందిలాగే చాలా మంది విద్యార్థుల్లాగే తనకు కూడా ఆదిలో అమెరికా పట్ల సముచిత అభిప్రాయం ఉండేది కాదు. తోటి బడుగు దేశాల పట్ల మన్నన చూపించరని, చిన్న చూపుతో చూస్తారని అమెరికా పట్ల అక్కసుగా ఉండేది. కాని ఎదిగిన వయసుతో కాలక్రమాణా అప్పటి ఉత్కృష్టమైన అమెరికా దేశపు సాహిత్యాన్ని—కళాత్మక విలువలకు నాంది పలికిన ఆ దేశపు కవులు, రచయితలు, తత్వవేత్తల గురించి తెలుసుకుని అప్పటి వైముఖ్యతను తగ్గించుకున్నాడు. 


భగవద్గీత ఆరాధకుడు డేవిడ్ హేన్రీ థోరో- మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీగారికంటే ముందుగానే ప్రజా విరుద్ధ ప్రభుత్వ విధానాలకు నిరసనగా అహింసాత్మక పోరాటాన్ని సాగించాడని- గాంధీ మహాత్ముడే తన తోటి కాంగ్రెస్ కార్యకర్తలను ఆ ఆమెరికన్ ఉద్యమ నాయకుడి గురించి చదివి తెలుసు కొమ్మని ఆదేశించాడని గ్రహించి అతను ఆశ్చర్యచకితుడయాడు. వాళ్ళ పట్ల గొప్పగా ఫీలయాడు. 


అప్పటి జాత్యంహకార అమెరికాలో అబ్రహం లింకన్ పిలుపందుకుని నలుపు వాళ్ల విమోచనానికై అమెరికా దేశ ప్రజలు చూపించిన సానుకూల స్పందన గ్రహించి- ఆ దేశ యంత్రాంగం పట్ల తనలో తారట్లాడే ఒకనాటి తీక్షణత తగ్గింది. 


ముఖ్యంగా నరసింహమూర్తికి జార్జి వాషింగ్టన్ అంటే మహా ఇష్టం కలిగింది. అతడి కళ్ళకు అల్లూరి సీతారామరాజులా ఆయన స్వదేశీయుడిగానే గోచరించ నారంభించ సాగాడు. ఎందుకంటే- గుప్పెడంత దీవినుండి వచ్చిన బ్రిటిష్ వాళ్లు—తమ తంత్ర మంత్రాలతో కపట కుతంత్రాలతో ఆసియా ఖండంలో పలు ప్రదేశాలను ఆక్రమించుకోగలిగారు. ఆదేశ ప్రజల ఆకాంక్షలను తమ ఇనుప పాదాల క్రింద నలిపి వేయగలిగారు. కళ్లముందు చీమ పుట్టల్లా నేలకొరిగి పోతున్నా గమనించక క్షామ పీడిత బెంగాల్ ప్రజల్ని గంగలో ముంచి- కోహినూర్ వంటి వజ్రంతో బాటు పలు భారతదేశ సంపదల్ని కొల్లగొట్టారు. 


అటువంటి పాలక తంత్రవాదుల్ని జార్జీ వాషింగ్టన్ మహాశయుడు మాటకు మాటగా దెబ్బకు దెబ్బగా సైనిక బలాన్ని పెంపొందించుకుని దురాక్రమించిన బ్రిటిష్ సైన్యాన్ని దరిదాపులకు రానంత దూరంగా తరిమి కొట్టాడు. మరి ఇటు వేపు చూసి ఆలోచిస్తే-- అంతటి గొప్ప ప్రాచీన దేశానికి చెందిన భారత ప్రజలు ఆ విధంగా ఎందుకు కట్టిడిగా బ్రిటిష్ వాళ్లను యెదిరించి నిలబడలేక పోయారో అతడికిప్పటికీ అంతు పట్టని అంశంగానే మిగిలి పోయింది. 


అల్లూరి సీతారామరాజు- భగత్ సింగ్- సుభాస్ చంద్రబోస్, తిరుప్పూర్ కుమరన్ వంటి విప్లవ వీరులు వీర ధీరత్వాలను చూపించకుండా ఉంటే- మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీగారు వకీలుగా కోల్పోబోతున్న రాబడి గురించి తలపోయకుండా దక్షిణాఫ్రికానుండి మాతృదేశానికి ఎకాయెకిన తిరిగి రాకుండా ఉండిపోతే– భారతదేశం ఇంకా ఇప్పటికీ బ్రిటిష్ ఇనుప పాదాల పాలనలోనే ఉండిపోయేదేమో! ఈ తరానికి చెందిన తన వంటి వాళ్లు కూడా బ్రిటిష్ పాలనలో పుట్టి పెరిగి విదేశీ చట్టాల క్రింద నలిగి దాస్యభావ స్రవంతిని అలవర్చుకుంటూ ఉండే వాళ్ళేమో! 

అప్పటికతడు అనుకోకుండా ఓ విధమైన ధార్మికావేశానికి లోనైనా తనను తను కుదుట పర్చుకునేందుకు ప్రయత్నిం చాడు. తెల్లవాళ్ళ పరిపాలన వల్ల దేశానికి మంచే జరగలేదన్నది తన ఉద్దేశ్యం కాదు. ఆంగ్ల భాష వల్ల వాళ్లు ప్రవేశపెట్టిన చట్టాల వల్ల చాలా మందికి ప్రపంచ పరిస్థితుల పట్ల అవగాహన కలగనారంభించింది. కాని మొత్తానికి పరిశీలించి చూస్తే తెల్లవాళ్ల పరిపాలన వల్ల దేశానికి మేలు కంటే చెడే ఎక్కువ జరిగిందనాలి. 


భారతీయ సంస్కృతిని, భారతీయుల చేతి వృత్తుల్ని సాధ్యమైనంత మేర అణగదొక్కడానికే ప్రయిత్నించారు. వాళ్ళ రాజ్యంలో వాళ్లు పాటిస్తూన్న బ్రిటిష్ పాలన ఒకటి- ఇక్కడ బ్రిటిష్ రాజ్ లో ప్రవేశ పెట్టిన పాలన మరొకటీను. అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ది బ్రిటిష్ రాజ్- అనేవారందుకే! 

భారత దేశంలో పలు ప్రాంతాలలో తాండవించి న క్షామానికి బ్రిటిష్ వాళ్ళ అవగాహన రాహిత్య ఆర్థిక విధానమే చాలా వరకు కారణమని చరిత్రకారులు ఇప్పటికీ చెప్తుంటారు. 


 అప్పుడతని ఆలోచనలకు ఉన్నపాటున అంతరాయం కలిగింది. అప్పుడు గాని ఆకాశంలో బెలూన్ లా తేలుతూన్న ఎయిర్ బస్ లో ఉన్నాడన్న స్పృహ కలగలేదతడికి. 

“ఎక్స్యూజ్ మీ సార్! విచ్ వన్ డు యూవాంట్?” 


నరసింహమూర్తి తలతిప్పి చూసాడు. మూవింగ్ వీల్ పైన పలురకాల బాటిల్స్ పెట్టుకుని మధ్య వయస్కురాలైన ఒక స్టూవర్డెస్ వచ్చి నిల్చుంది. వాటివేపు తేరి చూసాడతను. ఎర్రటి రక్త చందనం వంటి రంగుల్లో- పచ్చరంగు నీళ్లల్లో రకరకాల బాటిల్సు మూవింగ్ వీల్ పైన, క్రిందా పైనా పేర్చబడి ఉన్నాయి- 


“ప్లీజ్ గివ్ మీ ఎనీధింగ్ దట్ డస్ నాట్ కంటేయ్న్ అల్కహాల్”(ఏదైనా యివ్వండి ఆల్కహాల్ లేనిది) 


ఆమె చిన్నగ నవ్వి, క్రింది సొరుగులోనుంచి అట్ట ప్యాక్ తీసి అందులోనుంచి ఆరెంజ్ రసం అట్ట గ్లాసులో పోసి ఇచ్చింది. థేంక్సు చెప్పి అట్ట గ్లాసుని తీసుకుని నరసింహమూర్తి ఆ సన్నటి ఎయిర్ బస్ కారిడార్ ద్వారా వెళ్లిపోతూన్న ఆ అమెరికన్ స్త్రీ వేపు చూసాడు. పోల్చుకోవడం కష్టం గాని- ఆమె ఇటాలియన్ సంతతికో- బ్రిటిష్ సంతతికో- లేక యూదుల నేపథ్యానికో చెందిన స్త్రీ కావచ్చు. 


నాజుకుగ్గా నూరు శాతం గ్రూమింగ్ పొందిన ప్రొఫెషనల్ వైమానిక క్రూగా నడచుకుంటూన్న ఆమె పైపైకి ఎంత హుందాగా కనిపిస్తున్నా- లోలోపల ఆమె ఎంతటి భయాందోళనలకు లోనవుతుందో! లేక పోతే- సబర్బన్ రైల్వేస్టే షన్ వంటి ఆ చిన్నపాటి ఎయిర్ పోర్టులో కూడా మరొక సెక్యూరిటీ చెకింగా! అదీను అరగంటకుపై గానా! మూలమూలన నక్కి ఉన్న హింసాత్మక తీవ్రవాదుల్ని కనిపెట్టడమంటే అమావాస్యనాడు ఆకాశంలో నక్షత్రాలను ఎన్ని లెక్కించడమే! 


ఒకవైపు అంతటి ఊపిరి సలపనంతటి పకడ్బందీ రక్షణ ఏర్పాట్లు భరించలేకుండా ఉన్నా- మరోవేపు తీవ్రవాదులను 

ఎదుర్కోవడంలో అమెరికన్లు చూపించే దక్షత దీక్షతలను మనసున శ్లాఘించకుండా ఉండలేక పోయాడు నరసింహమూర్తి. 


న్యూయార్క్ ట్రేడ్ సెంటర్ లో వందలమందిని పొట్టన పెట్టుకున్న ఆ దురదృష్టకరమైన సంఘటన తరవాత మరొకటి-- అంతటి తీవ్రమైనది ఇంతవరకూ జరగలేదనేగా చెప్పాలి! ఇదిలా ఉండగా, అతడు అమెరికన్ల మధ్య మరొకటి గమనించాడు. ఇది అతడిలో అన్నాళ్ళూ చోటు చేసుకున్నమరొక విధమైన అపోహను చెదరగొట్టింది. 


అమెరికన్ ప్రభుత్వ విధానాలను చూసి అక్కడున్న వాళ్ళను అధికార దర్పానికి అలవాటు పడ్డ సమాజమనుకునేవాడు. కాని అది సబబు కాదు. పౌరజీవితంలో మీదు మిక్కిలి మన్నన పాటిస్తారు. ఆ సానుకూల అంశాన్ని అతడు ప్లేన్లలోను విమానాశ్రాయాలలోనూ గమనించాడు. అంచేత ఇక్కడి వాళ్ల వాలకం చూస్తుంటే తను కూడా ఇసుమంత వెనుకంజ వేయకుండా వీళ్ళలాగే ప్రతిదానికీ చిన్నపాటిదానికీ- ‘థేంక్యూ! - సారీ! ’అని చెప్తుండాలి కాబోలనుకున్నాడు. 

తను ఇండియాలో విన్నట్టు యురోపియన్లు అందునా అమెరికన్లు నిజంగానే కాస్తంత సున్నిత స్వభావుల్లాగే కనిపిస్తున్నారు. ఇక్కడున్నన్నాళ్లూ తన జాగ్రత్తలో తనుండాలి మరి. లక్ష్మణ రేఖను దాటకుండా చూసుకోవాలి, సానుకూలమైనదైనా ప్రతికూలమైనదైనా చటుక్కున కాదూ లేదూ అంటే చాలానొచ్చుకుంటారట ఇక్కడివాళ్లు. పామూ చావకూడదు. కర్రా విరక్కూడదన్నట్టు ప్రవర్తించాలి కాబోలు-- 

------------------------------------------------------------------------ 

ఎట్టకేలకు నరసింహమూర్తి రిలే- దుర్హమ్ ఎయిర్ పోర్టులో దిగాడు. 

క్యారేజీ సెక్షన్ నుండి సామాను ట్రాలీలోకి ఎక్కించుకుని ట్రావిలింగ్ బ్యాగు భుజానికి తగిలించుకుని బైటకొచ్చాడు. చలిగా లి రివ్వున సర్రున వీచి- తనిప్పుడు ఇండియాలో లేడన్న విషయాన్ని గుర్తు చేసింది. చుట్టూ చూసాడు. అతడికళ్ళకు బారులు తీర్చిన టాక్సీలేవీ కనిపించలేదు. డ్రైవర్ల అరుపులేవీ వినిపించలేదు. 


అసలు జనసందోహమేదీ! కొద్ది దూరాన టాక్సీ స్టేషన్ కనిపిం చింది. డ్రైవరేమో బ్లాక్. సామాను డిక్కీలోకి ఎక్కించుకుని టాక్సీ రేట్ల వవ్చర్ నరసింహమూ ర్తి చేతికందిచ్చి తనకివ్వాల్సిన టిప్ అదనంగా ఇరవై డాలర్లవుతుందని చెప్పి గమ్యంవేపు టాక్సీ మళ్ళించాడతను. 


అప్పటికి ఆకాశం మసకబారింది. నలువైపులా దీపాలు జంతువుల మిడిగ్రుడ్లలా మిణుకు మిణుకుమంటున్నాయి. తారు రోడ్లు పరచిన నల్ల తివాసీల్లా చదునుగా మంచుతడిలో మెరుస్తున్నాయి. మొదటిసారి అతణ్ణి మంచుగాలి తాకి చురుక్కుమని పించింది. ఉలిక్కిపడుతూ ట్రావిలింగ్ బ్యాగ్ నుండి జర్కిన్ తీసుకుని వేసుకున్నాడు; జలుబు పడిసం వంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తపడాలనుకుంటూ-- ఇంతకూ అది చలికాలమే కాదు! అంటే తనకు ముందున్నది మొసళ్ల పండగన్న మాట- 

------------------------------------------------------------------------------------------- 

నార్త్ కరోలినా సెంట్రల్ యూనివర్సిటీ కాంప్లెక్స్ రిలే ఎయిర్ పోర్టునుండి పదనాల్గు మైళ్ల దూరాన ఉంది. కొన్ని వందల ఎకరాల వ్యాప్తిలో ఆశల అవాప్తి కోసం చేతులు చాచేలా పరచుకుని ఉంది. సిటీ ఆఫ్ క్యారీలో వేక్ కౌంటీ ప్రాంతాన విస్తరించి ఉందది. రోడ్లకిరువైపులా, ఎక్కడ చూసినా నింగిలోకి తొంగిచూచే పొడవాటి చెట్లే- కన్నెల బృందావనంలో పొంగే పరువంలా వ్యాపించిన పచ్చదనమే. 


అతడి ఎరుకలో నగరాన్ని తనలోకి వాటేసుకునేలా విస్తరించిన అంతటి పచ్చదనపు ప్రదేశాన్ని అతడెప్పుడూ చూడలేదు. నగరం నడిమధ్యనా నగరం నలువైపులా అడుగడుగునా ఇంతటి సుందర సౌకుమార హరిత లావ ణ్యమా! ఢిల్లీలో దౌత్యవేత్తల ప్రత్యేక జోన్ ఐన చాణక్య నగరులో పచ్చటి చక్కదనం వెల్లివిరుస్తూంది గాని—ఇంతలా కాదేమో! 


టాక్సీ సెంట్రల్ యూనివర్సిటీ కాంప్లెక్సులోకి ప్రవేశించి, స్పోర్ట్స్ స్టేడియం ప్రక్కనున్న అడ్మినిస్ట్రేషన్ కట్టడం ఎదుట నిల చింది. డ్రైవర్ సహాయంతో సామాను దించి ఆఫీసు కారిడార్ వరకూ తీసుకెళ్ళి అక్కడ పెట్టి, టాక్సీచార్జీతో బాటు ఇరవై డాలర్ల టిప్స్ కూడా అందిచ్చి మరచిపోకుండా థేంక్స్ చెప్పాడు నరసింహమూర్తి. 


క్యాబ్ డ్రైవర్ డబ్బుల్నీ ధన్యవాదాల్నీ సంతోషంతో స్వీకరించి - “మొదట మిమ్మల్ని ఐ. టీ ప్రొఫెషనల్ అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడకు ఏతెంచే ఇండియన్స్ చాలా మంది సోఫ్ట్ వేర్ ఇంజనీర్లే! గుడ్ లక్ అండ్ గుడ్ హెల్త్“ అంటూ వెళ్ళిపోయాడతను. 


ఆ ఒక్కమాటా అతడి చెవులకు ఆప్తవ్యాక్యంగా వినిపిం చింది. దూర దేశం నుండి అన్య ప్రదేశంలోకి వచ్చిన ఏ వ్యక్తికైనా అటువంటి వాక్కు చిన్నదైనా హృదయానికి మృదువుగా తాకు తుంది. దగ్గరితనాన్ని సోకేలా చేస్తుంది. ఆ బ్లాక్ డ్రైవర్నీ అతడు తెలియజేసిన శుభకాంక్షల్నీ సున్నిత మనస్కుడైన నరసింహ మూర్తి ట్రైనింగు పూర్తిచేసుకుని గృహాభి ముఖుడయేంత వరకూ మరవడేమో! 


అతడు మరుక్షణం ఆలోచనలనుండి తేరుకుని గబగబా ఆఫీసులోపలకు వెళ్లి సెక్యూరిటీ గార్డుతో కరచాలనం చేసి స్టాఫ్ చేంబర్స్ వేపు చకచకా నడిచాడు. ప్రోగ్రాము ఇన్ చార్జి మిస్టర్ రస్సెల్ ఇంకా ఇంటికి వెళ్ళలేదు. అప్పటికింకా అడపాదడపా వస్తూనే ఉన్న వివిధ దేశాల క్యాండిడేట్సుని రిసీవ్ చేసుకుంటూ తన జూనియర్ స్టాఫ్ అసిస్టెంట్ల తోడ్పాటుతో ఒక్కొక్కరికీ హాస్టల్ రూములు కేటాయిస్తూ లిస్టుని అప్ డేట్ చేసుకుంటూ కనిపించాడు. 


కొందరికి అతగాడి అమెరిన్ ఉఛ్ఛరణ పూర్తిగా అర్థం కాక పదేపదే డౌట్సు అడుగుతూ విసిగిస్తున్నట్టున్నారు. మిస్టర్ రస్సల్ వింతగా చూస్తూనే తెచ్చిపెట్టుకున్న నవ్వుముఖంతో వాళ్ల అవసరాలు తెలుసుకుంటున్నాడు. దిశానిర్దేశం చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే —కొన్ని సందర్భాలలో అమెరికన్ ఇంగ్లీష్ అమెరికన్ మాండలీకంతో అమెరికన్ ఉఛ్ఛరణతో ఆంగ్ల భాషలాగే అగుపించదు. అందుకేగా- కొన్ని అమెరికన్ ఆంగ్ల సినిమాలలో ఆంగ్లంలో సబ్ టైటిల్సుంటాయి! 


అక్కడ కూర్చున్నది ప్రోగ్రాము ఇన్ చార్జీ మిస్టర్ రస్సెల్ అని తెలుసుకుని నరసింహమూర్తి ఊపిరి తీసుకున్నాడు. ఎందుకంటే అంతకు ముందు అతడు ఆయనతో మాత్రమే ఫోనులో మాట్లాడి ఉన్నాడు. ఆ శ్వేతజాతీయుని టోన్ ని బట్టి ఆయన నిక్కచ్చైన మనిషని ఊహించాడు నరసింహమూర్తి. ఈయన వద్ద కూడా యథా విధిగా సారీలు- థేంక్సులూ విరివిగా వాడాలే మో! 

చేంబర్ తలుపు తట్టే ముందు నరసింహామూర్తి కాస్తంత ఆగాడు. మొదటి సారి ఒక అమెరికన్ అధికారితో—అదీను అమెరి కా గడ్డపైన కరచాలనం చేయబోతున్నాడు తను. ఈ విషయమై అమెరికన్లతో ముఖ్యంగా వైట్ అమిరికన్లతో ఎలా మెసలాలో ఇండియాలో ముందస్తు శిక్షణ ఇచ్చారు. అవన్నీ అప్పటికప్పుడు గంప గుత్తుగా గుర్తుకురావు కదా! 


కరచాలనం అంటే ఎదుటివారి చేతిని అందిపుచ్చుకుని అదే పనిగా ఊపేయడం కాదు. దానికొక పధ్ధతి ఉంది. పరిమితి ఉంది. మాంఛెస్టర్ యూనివర్సిటీ సాంఘిక శాస్త్రవేత్తలు ఖారాఖండీగా నిర్దేశించారు. షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు రెండు అరచేతు లూ సరిగ్గా కలవకపోతే—కలిపే ముందు అరచేతిలో అలుముకున్న చెమటను సరిగ్గా తుడుచుకోకపోతే— ఆ క్షణంలో పరస్ప రం ఎదుటివారి కళ్ళలోకి తేరిపార చూడకపోతే— అది పరిపూర్ణమైన స్నేహపూర్వకమైన కరచాలనం అనిపించుకోదు. ఇద్దరి అరచేతులు రెండూ పరస్పరం కలుసుకుని, మూడు సెకన్ల వ్యవధిలో మూడుసార్లు ఊగితే—అదే పెర్ ఫెక్ట్ షేక్ హ్యాండ్. 


ఆ విషయాన్ని మననం చేసుకుంటూ నరసింహమూర్తి తలుపుతట్టి కొన్ని క్షణాలు ఆగి అన్నాడు- “గుడ్ ఈవినింగ్ మిస్టర్ రస్సల్ గిల్ బర్ట్! ఐ యామ్ నరసింహమూర్తి- ముచ్చటపూడి నరసింహమూర్తి. హౌ డుయూడూ! ”అంటూ అతడి టేబుల్ వద్దకు నవ్వు ముఖంతో వెళ్ళి చేతులు కలిపాడు. 


అతడి పలకరింపు మిస్టర్ రస్సల్ కి నచ్చింది. స్నేహ వాతావరణాన్ని పరిమ ళింప జేసింది. ”యా—మిస్టర్ ఎమ్. నరసింహమూర్తి కారూ—వెల్ కమ్. నేను కూడా కొంచెం కొంచెం తెలుగు పదాలు నేర్చుకోవడానికి స్ట్రగల్ చేస్తున్నాను. నేర్చుకుంటున్నాను- స్పానిష్- లాటిన్- మండారిన్ లాటిన్ లేంగ్వేజ్ లతో సహా. యు ఆర్ వెల్కమ్! ” అంటు సగం వరకూ లేచి చేయందిచ్చాడు. 


‘ఈ మొనగాడు అత్యుత్సాహంతో పూనుకుని తెలుగుని అతల కుతలం చేస్తాడేమో! ’

అనుకుంటూ నరసింహమూర్తి ఆప్యాయంగా అతడి చేతిని అందుకుని లెక్క ప్రకారం ముమ్మార్లు చేతుల్ని ఊపి- యెదుటి సీట్లో కూర్చుని తన పర్సనల్ బ్రీఫ్ కేస్ తెరచి- “దిస్ ఈజ్ ఫ్రమ్ ఇండియా- దటీజ్- ఫ్రమ్ సిటీ ఆఫ్ హైద్రాబాద్. ప్లీజ్ ఎక్సెప్ట్! “అని స్వీట్ బాక్సుని అందించాడు. 

దానికి మిస్టర్ రస్సెల్ ముఖం విప్పారింది. ఆ వెలుగు స్వీట్ బాక్స్ వల్లకాదు.


అన్యుడైన భారతీయ ట్రైనీ తన పట్ల చూపిస్తూన్న సుహృద్భావ ప్రకటనకు పరవశుడై-- ” ధేంక్స్. విత్ ప్లజర్. మీకు ఇండిపిండెంట్ రూమ్ విత్ సింగల్ బెడ్ కావాలా- లేక డబల్ బెడ్ రూమ్- విత్ షేరింగ్ ఫెసిలిటీతో కావాలా? ”


దానికి నరసింహమూర్తి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా- “మరొక అభ్యర్థితో పంచుకునే డబుల్ బెడ్ రూమ్ కావాలి“


ఇది నలువేపులా రంగుల అమెరికన్ ఫాల్స్ పరిమళించే వేళ! కొంగ్రొత్త స్నేహాలు పుష్పించే శుభ వేళ! పెదనాన్న చెప్పినట్టు కొత్త అవకాశాల్ని కొత్త అనుభవాలను కొత్త విధంగా అందిపుచ్చుకోవాలి. 


అంతేకాక- అటువంటి సువిశాలమైన పరదేశంలో ఒంటరిగా ఈసురోమని చుక్కల్ని లెక్కిస్తూ గడపడం కొన్నాళ్ళకు దుస్సహమే అవుతుంది. ఒక అపరచిత వాతావరణంలో దేనినైనా భరించ వచ్చు. కాని, ఒంటరి తన్నాన్ని భరించడం మాత్రం కష్టం; మాటామంతీ మాట్లాడుకోవడానికి మాత్రమే కాదు, ఆలోచనల్ని అభిప్రాయాల్ని పంచుకోవడం కోసం కూడా-- ఎలాగో ఒకలా తనలోని ఆలోచనల్ని ఒక కొలిక్కి తెచ్చుకుంటూ- “ఎస్ ప్లీజ్! ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ ఒన్ ఆఫ్ మై ఫెలో క్యాండిడేట్స్“ అని పదాలను మరింత నొక్కుతూ బదులిచ్చాడు నరసింహమూర్తి. 


దానికి రస్సెల్ గిల్బర్ట్ ప్రసన్నంగా నవ్వుతూ- “యేజ్ యుప్లీజ్. యూసీమ్ టుబి ఎ మ్యాన్ ఆఫ్ మ్యాస్! “అంటూ తన ముందున్న లిస్టులో పెన్సిల్ తో గుర్తుచేసుకుని మళ్ళీ ఇటు తిరిగి- “ఐ విష్ యు ఎ ప్లజంట్ స్టే ఫర్ యూ మిస్టర్ మూర్తి కారూ! అండ్ ఆల్సో మై థేంక్స్ ఫర్ యువర్ గిఫ్టాఫ్ ఇండియన్ స్వీట్స్”అంటూ మరొకసారి సగానికి లేచి నరసింహమూర్తితో కరచాలనం చేసాడు. 


అబ్బ! మానవ భాషల పట్ల అతడికున్న ఉబలాటం మాట దేవుడెరుగు- అతడి ఆంగ్లీకరణాత్మక ఉఛ్ఛరణ తెలుగు వాడి నడినెత్తిన మొట్టి కాయలు పెట్తున్నట్టుంది. పరిస్థితుల తాకిడి అటువంటిది మరి - భరించాలి మరి. నరసింహమూర్తి ప్రోగ్రామింగ్ ఇన్చార్జీతో చేతులు కలిపి, రెండడుగులు వేసి చటుక్కున ఆగిపోయాడు. ”ఎనీధింగ్ యు వాంట్ సే మిస్టర్ మూర్తీ? ”- రస్సల్. 


“నో- నథింగ్ మిస్టర్ గిల్బర్ట్. నా దొక చిన్న సందేహం. అడగవచ్చా? ”


“వైనాట్ మిస్టర్ మూర్తీ? ప్లీజ్ ఫీల్ కంపర్టబుల్ టు ఆస్క్ ఎనీధింగ్“


“మరేం లేదు మిస్టర్ గిల్బర్ట్. మీకు తెలుగు నేర్చుకోవాలన్న యావ యెప్పుడు కలిగింది? ఎందుకంటే— ప్రపంచ వ్యాప్తంగా చైనీయులున్నారు కాబట్టి- నేటి ప్రపంచ వ్యాపార రంగంలో వాళ్ళకు మిక్కిలి పరపతి ఉన్నది కాబట్టి- మీరు మాండారిన్ నేర్చుకుని ఉంటారు. స్పానిష్- ఫ్రెంచ్- జర్మన్- ఈ భాషలు తెల్ల దేశాలకు లాటిన్ దేశాలకు చెందినవి కాబట్టి వాటిని కూడా నేర్చుకుని ఉంటారు. మరి మా ప్రాచీన తెలుగు నేర్చుకోవాలన్న ధ్యాస ఎలా కలిగింది? ఎప్పుడు కలిగింది? ”


“చాలా మంచి ప్రశ్న. నా మనసుని మధురంగా తాకిందంటే నమ్మండి. మేము క్రైస్థవులమైనా నేనూ మా ఆవిడా పుట్టపర్తి వెళ్ళి సత్యసాయి బాబావారు సమాధి కాకముందు ఆయన ఆశ్రమంలో తోటి భక్త సముదాయంతో నెల్లాళ్లు గడిపాం. అక్కడ మేం తర చుగా తెలుగు మాటలు వినేవాళ్లం. బృందగానం చేస్తున్నప్పుడు, తెలుగు కీర్తనల్ని కూడా వింటుండేవాళ్ళం. 


ఆ తరవాత ఇస్రాయిల్ లో ఉన్న హిబ్రూ యూనివర్సిటీ లో విద్యాబోధన చేస్తున్న ఒక ఫ్రొఫెసర్ ని కలుసుకోవాలసిన సందర్భం యేర్పడింది. ఆయన అప్పటికే రెండు మూడు భారతీయ భాషలు నేర్చుకున్నారు. ఆయన చెప్పారు— తెలుగు చాలా అందమైన భాషని. వినసొంపైన భాషని. 


అప్పట్లో బ్రిటిష్ రెవన్యూ అధికారిగా బ్రిటిష్ రాజ్ లో పనిచేసిన చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ అనే తెల్లజాతి వ్యక్తి తెలుగు భాషాభి వృధ్ధికి, తెలుగు సాహిత్యాభివృధ్ధికి సేవలు చేసారని ఆయన ద్వారా విని తెలుగు పట్ల మక్కువ మరింత కలిగింది. ఇక్కడకు వచ్చిన తరవాత కూడా అడపాదడపా నాకు యెదురయే తెలుగువారితో మాటలు కలుపుతుండే వాణ్ణి. ఇంకేమైనా అడగాలా? ”


ఆ మాటలతో నరసింహమూర్తిలోని తెలుగు హృదయం ఉప్పొంగింది. ”థేంక్యూ సార్! థేంక్యూ వెరీమచ్ ఫర్ యువర్ ఇంట రెస్ట్ ఇన్ మై మదర్ టంగ్“అని సాభిప్రాయంగా శిరస్సు వంచి బైటకు కదిలాడు నరసింహమూర్తి. 


బైట అతడి కోసం ఒక అమెరికన్ యంగ్ లేడీ కాచుక్కూర్చుంది. ఆమె నవ్వుతూ యెదరు వచ్చి తనను తాను మిసెస్ లూసీ అని పరిచయం చేసుకుని అతడుండబోయే గదిని స్వయంగా చూపించడానికి పై మెట్లు ఎక్కసాగింది. ఆమెను వెన్నంటి నరసింహమూర్తి నడిచాడు, ఇద్దరి కోసం కేటాయించిన ఆ గది విశాలంగా ఉండి శుచీ శుభ్రత ఉట్టి పడతూ నీటుగా ఉంది. 

అలస టగా ఉందేమో అతడికి ఒక్కఉదుటన మంచం పైన బోర్లా వాలాలనిపించింది. మిసెస్ లూసీ అంతా చూపించి ఇక కట్టకడపటి దశకు రాసాగింది. 


“మీ గది పోర్షన్ లోపల మీ పర్సనల్ ధర్మో ప్లాస్కులో కాఫీ ఉంచాం- బిస్కట్ ప్యాకెట్టుతో సహా. రేపట్నించి మీకు స్నాక్స్ కూడా లభ్యమవుతాయి. ప్యాంట్రీ దీనికి క్రిందనే ఉందండి. డిన్నర్ ఏడునుండి తొమ్మిది వరకు సర్వ్ చేస్తారు. మీకు కావలసొస్తే రాత్రికి పాలు కూడా సప్లయ్ చేస్తారు. ఎనీ ధింగ్ మోర్ కెన్ ఐ డూ సార్! ”


అతడు ఆమె మృదువైన మాటలకు మైమరచి గుడ్లప్పగించి చూస్తూండి పోయాడు. 


అతడి కళ్లముందు ఢిల్లీలోని సెంట్రల్ గవర్నమెంటు ట్రైనింగ్ ఇన్సిటిట్యూట్ మెదిలింది. 

అతడొకసారి హైద్రాబాదు నుండి దూరప్రయాణం చేసి, పాలమ్ ఇంటర్నేషనల్ విమానాశ్రంయంలో దిగి పెట్టే బేడాతో ఇన్టిట్యూట్ చేరుకుని, అప్పటికతనికి అలసటగా ఉన్నట్లనిపించి ప్యాంట్రీలోకి ప్రవేశించి ఒక కప్పు టీ అడిగాడు.


అదేదో తన స్వంత ఆఫీసు భవనంలా అతడి కోసమే ఆ ప్యాంట్రీ కట్టినంత ధీమాగా బదులిచ్చాడా ప్యాంట్రీ ఉద్యోగి- “ఇప్పుడు టీ కాఫీ గట్రా దొరకదు సార్. గంటన్నర తరవాత ఏకంగా భోజనానికి వచ్చేయండి“ 


ఆ జవాబు విని తనకి అరికాలి మంట నెత్తికెక్కింది. తనకూ తోటి ట్రైనీలకూ టీ లేదనడానికి ఈ క్యాంటీను గాడెవడు? అసలు ట్రైనింగ్ ఇన్సిట్యూట్ వీళ్ళకోసం కట్టబడిందా? అందుకే మరచి పోకుండా దెబ్బకి దెబ్బ తీసినట్టు ట్రైనింగు ముగించుకుని వీడ్కోలు పుచ్చుకునేటప్పుడు ట్రైనింగు వ్యవహారాలపై అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నప్పుడు ఆ క్యాంటీను నిర్వహణపై ఎడాపెడా వ్రాసి పడేసాడు. 


మరి ఇక్కడేమో- ఈ పరదేశంలోనేమో- అడక్కుండానే అందిస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా-- ఇంకేదైనా కావాలా- అని ఆడుగుతున్నారు. అదీను ఎలాగని- ప్రతి పదమూ పన్నీరు చిలికించినట్టు. 


ఫెళ్లున ఆలోచనలనుండి తేరుకుంటూ నరసింహమూ ర్తి స్పందించాడు “వెరీ కైండాఫ్ యు మేడమ్. చటుక్కున మాఊరి తలంపులు ముప్పిరిగొంటే అదోలా ఐపోయాను. ఇక నా పోర్షన్ ఆక్యుపై చేయవచ్చా!”


 మిసెస్ లూసీ నవ్వి అతడితో చేతులు కలిపి- “విత్ ప్లజర్” అంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. 


=======================================================================

                                                ఇంకా వుంది

========================================================================

 

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





52 views0 comments

Hozzászólások


bottom of page