top of page
Writer's picturePandranki Subramani

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 4

#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 4 - New Telugu Web Series Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 06/12/2024 

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 4 - తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి  

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్




 జరిగిన కథ:


హైదరాబాద్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు. 


నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. 


ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. 

అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది.


అమెరికా వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ ప్రోగ్రాము ఇన్ చార్జీ మిస్టర్ రస్సెల్ ను కలుస్తాడు. 

డబల్ బెడ్ రూమ్- విత్ షేరింగ్ ఫెసిలిటీ తీసుకొని, రూమ్ కు వెళ్తాడు. 



ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 4 చదవండి..


తీరా లోపలకెళ్ళిన తరవాత అతడికి ఊహించని రీతిన కలలో కూడా అనుకోని తోకచుక్క ఎదురైంది. నిజంగా అది నిప్పు లు కక్కే తోకచుక్కే! అతడు ముందే విన్నాడు, అమెరికన్లకు యురోపియన్లకూ ఒక లోపం ఉందని. అదే— పరదేశాల పట్ల అవ గాహన లేమి-- తెలుసుకోవాలన్న జిజ్ఞాస లేమి. వీళ్లలో చాలామంది-- ఆసియా ఖండ భౌగోళిక విభజన రేఖల గురించి— ఆ ప్రాం త ప్రజల మధ్య తాండవించే మౌళికమైన సాంఘిక రాజకీయ తేడాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కనబర్చరని. ఇంకా చెప్పాలంటే ఆసియా ఖండ ప్రజల పట్ల ఓ విధమైన అలసత్వం కూడా ఉంటుందని. వాళ్ళకెప్పుడూ అప్పటికే అభివృద్ది చెందిన జపాన్ దేశం, ఇటీవల కాలంలో ఎకానమిక్ జయింటుగా రూపాంతరం చెందుతూన్న రెడ్ చైనా మాత్రం కళ్లకు కనిపిస్తుంటాయి. 


ఇక జరిగిందేమంటే— ఇండియానుంచి వచ్చిన నరసింహమూర్తిని పాకిస్థాన్ నుండి వచ్చిన మరొక ఆసియన్ క్యాండిడేట్ షేక్ అహ్మద్ తో జతచేసి ఒకే రూమ్ పోర్షన్ కుదిర్చారు ఇక్కడి వాళ్లు. ఆ మాటకొస్తే— అతడితో వచ్చిన బ్యాచ్ లో పాకిస్థాన్ క్యాండిడేట్లు మాత్రమై కాదు, ఇతర ప్రాంతాలైన మయన్మార్- శ్రీలంక- బంగ్లాదేశ్- ఆఫ్గనిస్తాన్- థాయ్ ల్యాండ్ వంటి దేశాల నుంచి కూడా ట్రైనింగుకి వచ్చి వున్నారు. అంతెందుకు ఇండియా నుండే ఇద్దరు ముగ్గురు భారతీయ క్యాండిడేట్లు కూడా వచ్చి ఉన్నారు. 


మరి వీళ్ళనందరినీ విడిచి- జోలెలో మిగిలిన చివరి రొట్టె ముక్కలా అతడికి పాకిస్థానీయ క్యాండిడేట్ నే జతచేయాలా! ఏమిటో ఈ అమెరిన్ల వింత ధోరణి. సూపర్ పవర్ కి చెందిన వాళ్లు కదా! సూపర్ ఇగో-


రూములోకి ప్రవేశించిన తరవాత ఇద్దరూ లాంఛనప్రాయంగా ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు, విష్ చేసుకున్నారు. అంతేకాదు, ఇద్దరూ చేతులు కలుపుకుంటున్నప్పుడు—షేక్ అహ్మద్ కళ్లు మిలమిలా మెరవడం గమనించాడు నరసింహమూ ర్తి.. 


అతడు నిజంగానే ఒకింత అయోమయానికి లోనయాడు. ఎందుకంటే- అవి కోపంతో మండుతున్నాయా- లేక స్చఛ్చమైన స్నేహభావంతో మెరుస్తున్నాయా- అన్నది తేల్చడం అప్పటికప్పుడు కష్టమే మరి! 


ద్వేషాగ్నిలో రక్తపాతంలోనుంచి పుట్టిన దేశం లో పెరిగిన వాడు తన ముందునిల్చున్న ట్రైనీ బ్యాచ్ మేట్ షేక్ అహ్మద్. సరిహద్దు జగడాల కభ్జా కార్లు- వీళ్ళందరూ-- అతడి మనసున ఎప్పుడో చదివిన సంస్కృత శ్లోకం మెదిలింది. దుర్జనులతో వైరముగాని. ప్రేమ పూరితమైన దగ్గరితనాన్ని గాని ససేమిరా పెట్టుకోకూడదు. బొగ్గులను చల్లగా ఉన్నాయని ముట్టుకుంటే చేతుల్ని నల్లబరుస్తాయి. వేడిగా ఉన్నప్పుడు తాకితేనేమో- చేతుల్ని భగ్గున మండిస్తాయి. 


ఔరా! చిక్కుముడులు చెప్పి రావు కదా! తను కంపెనీ కోసం తాపత్రయపడిన మాట వాస్తవమే అనుకో- తోడు కోసం యిద్దరికి సరిపోయేలా పోర్షన్ కావాలని అడిగిన మాట కూడా వాస్తవమే అనుకో- కాని ద్వేషాగ్ని కురిపించే పొరుగుదేశం నుండా వీటిని కోరాడు? ఒకేచోట శత్రుదాయాదులైన కౌరవుల్నీ పాండవుల్నీ కలిపి బంధించడం వంటిది కాదూ! 


హౌస్ కీపింగ్ అసిస్టెంటు లోపల పెట్టి వెళ్ళిన సూటుకేసుల్ని తెరచి చూసి, అందులోనుంచి పెదనాన్నగారి చిన్ననాటి మిత్రుడి కోసం కొనుంచిన స్వీట్ బాక్సుని మిక్చర్ ప్యాకెట్నీ బైటకు తీసి సొరుగులో ఉంచి థర్మోప్లాస్కు నుండి కాఫీ కప్పులో పోసుకుని రెండు బిస్కట్లు ప్లేటులో పెట్టుకుని తీరిగ్గా కూర్చున్నాడు నరసింహమూర్తి. అలా కాఫీ తాగుతూ అనుకోకుండా ఎదుటి జాయింట్ పోర్షన్లో వేసున్న పడక వేపు చూసాడతను. 


అంత త్వరలో ఎప్పుడు స్నానం చేసి వచ్చాడో మరి;షేక్ అహ్మద్ తను తెచ్చుకున్న చిన్నపాటి చాపపైన వజ్రాసనం వేసుకుని నమాజ్ చేసుకుంటున్నాడు. కాసేపటికి నరసింహమూర్తి కూడా లేచాడు. షవర్ లో వేడి నీళ్ల స్నానం కానిచ్చి, దట్టమైన అంగీ వేసుకుని దానిపైన హాఫ్ స్వెట్టర్ వేసుకుని- చిన్నపాటి శ్లోకంతో దైవ ప్రార్థన చేసి కాసేపు తనతో తెచ్చుకున్న ట్రైనింగ్ ప్రోగ్రాముకి సంబందించిన పేపర్లను రోజువారీగా హాజరయే ఫ్యాకల్టీ లెక్చరర్ల వివరాలను చూసుకుని మనసున గుర్తుంచుకుని అక్కణ్ణించి కదిలాడు. 


కాలమాన పరిస్థితుల వల్ల వాటిల్లిన అంతరాలు ఎన్ని ఉన్నా— తరాల నాటి మానసికపరమైన కొండ చరియల్లాంటి అవరోధాలు ఎన్ని అడ్డొచ్చినా- విద్య అందించిన సభ్యతా సంస్కారాలు వాటినన్నిటినీ అధిగమింపచేసి ముందుకు నడిపించగలవు. మానసిక వికాసాన్ని పెంపొందించ గలవు. కొంతలో కొంత సకారాత్మక దిశా నిర్దేశం చేయగలవు కూడాను. ఆ కారణాన కడుపులో ఎలుకలు పరుగెత్తుతున్నా యనిపించినా అదుపుచేసుకుని నరసింహమూర్తి అటువేపు తొంగిచూసి- “భోజనం చేయడానికి డైనింగ్ హాలుకి వెళ్తున్నాను. వస్తారా మిస్టర్ షేక్ అహ్మద్! ” అన్నాడు.


“షుయర్-- థేంక్స్! ”అంటూ షేక్ అహ్మద్ నమాజ్ చేసి తీరుబడిగా కూర్చున్న వాడు బెడ్ పైనుంచి లేచి అతణ్ణి అనుసరించాడు. 


భోజనం ఇండియన్ స్టార్ హోటల్లలో ఆఫర్ చేసే బఫేలా- వాళ్ళకు నచ్చిన పదార్ధాలను వాళ్ళవాళ్ల ప్లేట్లలో పెట్టుకొని తినాలి. అక్కడ తళతళలాడే గిన్నెలు కావు- చెంచాలు మాత్రమే కావు- వాటిని మించి శుభ్రతే నలువైపులా మీదు మిక్కిలి మెరుస్తున్నట్లుంది. ఆకలిని రెట్టింపు చేస్తూంది. 


షేక్ అహ్మద్ కి యెదురుగా కూర్చొని తింటున్నాడన్నమాటే గాని, అతడి మనసు మాత్రం పాకిస్థానీ రూమ్ మేటు గురించే తలపోస్తూంది. నేడు కాకపోయినా- తప్పకుండా రేపోమాపో అంతర్జాతీయ స్థితి గతులపైన- ముఖ్యంగా భారతదేశ విదేశీ విధానం పైన ఏదో ఒక వ్యాఖ్యానం చేసే తీరుతాడతడు. తనను ముగ్గులోకి లాగడానికి పూనుకునే తీరుతాడు. ఇంటర్నెట్ లో పాకిస్థానీ వీరాభిమానులు భారతదేశానికి వ్యతిరేకంగా చేస్తూన్న భీకరమైన ట్విట్ లు తను చూస్తూనే ఉన్నాడుగా! 


ఆశ్చర్యం! నరిసింహమూర్తి మొదటి సారి తన ఊహాగానంలో తప్పటడుగు వేసాడు. తన స్థిరాభిప్రాయాలను తలక్రిందులు చేసాడు షేక్ అహ్మద్. ఇద్దరూ భోజనాలు కానిచ్చి డైనింగ్ హాలులోని సోఫాలో కూర్చుని వెండి పళ్లెంలో ఉన్న పిప్పర్ మెంట్ బిళ్లలను నోట్లో వేసుకుంటున్నప్పుడు షేక్ అహ్మద్ అన్నాడు- “రాత్రిపూట ఇక్కడ మరీ చల్లగా ఉన్నట్టుంది కదూ! ”


అతడేమీ మాట్లాడకుండా తలూపాడు. ఆ తరవాత అతడనుకున్నట్లే షేక్ అండ పిండ బ్రహ్మాండాన్ని బ్రద్దలు గొట్టాడు. ఎలాగని- అతను ఎదురు చూడని విధంగా! 


“ఒక వేపు హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నా- మరొక వేపు విచ్చలవిడిగా అత్యాచారాలు దొమ్మీలూ జరుగుతున్నా స్థిరమైన మీ దేశవ్యవస్థలోని వ్యవహారం నాకు మిక్కిలి ఆశ్చర్యం కలిగిస్తూంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే— అసూయ కూడా కలిగిస్తూంది మిస్టర్ మూర్తీ!”

అతడు వెంటనే స్పందించలేదు-- కావాలనే. నిదానంగా చూస్తూ- షేక్ అహ్మద్ అందరిలా కాకుండా ఆలోచనా పరుడిలా కనిపిస్తున్నాడనుకుంటూ అడిగాడు “ఏ విషయంలో?” అని. 


“ఇన్ని జాతులు, కులాలు, వివిధ భాషల మధ్య ఉంటూ- ఇంకా చెక్కుచెదరకుండా విలసిల్లుతూన్న మీ దేశ ప్రజాసామ్య వ్యవస్థను— ముఖ్యంగా నిలకడగల జుడీషియల్ సిస్టిమ్ ని తలచుకుంటే— ఇటీజ్ రియల్లీ అమేజింగ్! ”


“అదా మీ అసూయకు కారణం! ” అని పైకి చెప్పి- లోలోన ఇలా అనుకున్నాడు నరిసింహమూర్తి- ‘ఇంకేదో లేవదీస్తా డనుకున్నాను! పాకిస్థాన్ దేశం ద్వేషపు బడబాగ్నిలో పుట్టిందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. తరాలు మారుతున్నాఇంకా ద్వేషంలోనే మగ్గుతూంది. ద్వేషాగ్నిని మరల మరల పెంచుతూనే ఉంది. అలాంటప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలోని సమభావాలను సామాజిక వ్యవస్థలోని ప్రామాణిక విలువల్ని ఎలా అలవర్చు కోగలదు? పర దేశస్థుల పట్ల పరమతాల పట్ల సహన భావం యెలా చూపించ గలదు? 


అలాగని- ఇప్పుడు కూడా ఇన్ని సామాజిక అస్తవ్యస్థల మధ్య ఉదార స్వభావంగల కళాకారులు సాహితీ వేత్తలు పత్రికా విలేఖరులు ఆ దేశంలో లేక పోలేదు. కాని వాళ్లందరూ నేతి బీరకాయలోని నేతిని తియ్యడమంత! అంతదాకా ఎందుకు- సరిహద్దు గాంధీ ఖాన్అబ్తుల్ గఫర్ ఖాన్ ని వీళ్ళెలా చూసారో- ఆయనెందుకు తన చివరి రోజులవరకూ కాబుల్ లో తలదాచుకున్నారో జగతికి తెలియని విషయమా! అప్పుడూ యిప్పుడూ అని కాదు—ఎప్పుడూ భారత దేశానికి సానుకూలంగా గోచరించే యే అంశాన్నీ భరించగల స్థితిలో ఉన్నదా ఆ దేశం- ఇది కాదన లేని వాస్తవం’. 


ఆవేశానికి లోనైన అతడి మనసు అతణ్ణి అదుపు తప్పనివ్వకుండా చూసుకుంది. అతడు అలా ఆలోచిస్తూ లేచి నిల్చు నే లోపల షేక్ అహ్మద్ మళ్లీ అందుకున్నాడు- “ఈఒక్క కారణం వల్లనే కాబోలు ప్రపంచ దేశాలలోని పబ్లిక్ ఒపీనియన్ చాలా వరకు భారతదేశానికి అనుకూలంగా బలపడుతూంది”.


అప్పటికీ అతడేమీ అనకుండా తలెత్తి చూసాడు. భారతదేశ పరిపాలనా వ్యవస్థకు భావ సారూప్యానికి పునాదులు వేసింది ఎవరనుకున్నాడో మరి. మదన్ మోహన్ మాలవ్యా- టంగుటూరి ప్రకాశం పం తులుగారు- సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు- మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీగారు- సామ్యవాది పండిత్ నెహ్రూ వంటి మహాను భావులు కదూ! ఒకరా ఇద్దరా- ఎందరో మహానుభావులు! అటువంటి మహానుభావుల ఒరవడి వల్లనే కదా పరమత సహనం భారత రాజకీయ సంస్కృతిలోనే ఇమిడి పోయి విరాజిల్లుతూంది. 


అతడికిక సంభాషణలో ముందుకు సాగాలనిపించక నిశ్శబ్దంగా నవ్వుతూ లేచి కదిలాడు- “షల్ వి గో- టు అవర్ హెర్మిటేజ్! ”అంటూ. 


అహ్మద్ కూడా లేచాడు;త న రూమ్ మేటుకి వేడి వాడి సంభాషణ అంటే అంతగా గిట్టదని గ్రహిస్తూ--

------------------------------------------------------------------------------------

శంకరం వారం రోజుల పాటు పూణేలోని వర్క్ షాపుకి హాజరయి—సెలవు దినంగా వచ్చిన ఒక రోజు ఎడబాటుని ఉప యోగించుకుని చల్లని పచ్చని ఆ చుట్టుప్రక్కల ప్రదేశాలను తిరిగి చూసొచ్చాడు. సాంగ్లీ సరిహద్దున- రత్నగిరి కొండల తావున ఛత్రపతి శివాజీ మహరాజు స్వయంగా నిర్మించిన కోటల్ని, విఘ్వేశ్వరుడి ఆలయాన్నిదర్శించి మనసుని తాజాతనంతో ఉత్తేజం తో నింపుకుని ఊరుచేరాడు. 


మరునాడు డ్యూటీకి రిపోర్టు చేసి, వర్కుషాపులో చర్చకు వచ్చిన వివరాలను, ఆచరణయోగ్యమైన అంశాలను లిఖిత నోటు ద్వారా ప్రిన్సిపాల్ కి సమర్పించి, మరొకమారు మరచిపోకుండా ఆఫీసు ఇన్చార్జి వర్థనమ్మగారిని కలుసుకుని- ఆమెకు థేంక్సు చెప్పి, పెండింగ్ పేపర్లు పూర్తి చేయడంలో నిమగ్నుడయాడు. 


శంకరం సమర్పించిన నోటుని ప్రిన్సిపాల్ ఆమెకు పంపించాడు;పేరా వైస్ కమెంట్స్ ఇవ్వమని.. ఆమె వెంటనే నోటు తెరచి చూడలేదు. తన చేంబర్ కిటికీ గుండా బైటకు కన్నార్పకుండా చూస్తూండి పోయింది. రీజెస్ సమయం— కొంటెతనాన్ని పుణికి పుచ్చుకున్న స్కూలు కుర్రాళ్ళ అరుపులు- అమ్మాయిల కేరింతలు- చలాకీ తనం నింపుకున్న కంఠ స్వరాలతో- బిళ్లం గోడు ఆడుకుంటూ ముచ్చట్లాడుకుంటూన్న కొందరు అమ్మాయిల ముఖాలు- నేవళంతో మెరిసే యవ్వనవతులైన స్కూలు టీచర్ల కళైన వదనాలు- ఇవన్నీ చూస్తుంటే- ఆమెలో తొలకరి చినుకులు వంటి జ్ఞాపకాలు సుమధుర సురబిళ వీచికలై తాకాయి. గుండెల్లో గతకాల నాదస్వర నాదాలను అలలు అలలుగా రేపాయి. 


రిటైర్డు హెడ్ మిస్ట్రెస్ గా ఆమె విశాఖ నుండి హైద్రాబాదు వచ్చినప్పుడు—ఆమె గురించి విన్న స్కూలు మేనేజిమెంటు కమిటీ సభ్యులు ఆమెను వచ్చి కలుసుకున్నారు. ”మీరు గాని దయతలచి మీ అమూల్యమైన అనుభవసారాన్ని మాస్కూలు మేనేజిమెంటు వ్యవహారాలకు, ప్యాకల్టీ నిర్వహణకూ అందిస్తే మేం ఎంతో ఋణపడి ఉంటాం“ అన్నారు వినమ్రతతో. 

కాని న్యాయంగా దాపరికం లేకుండా చెప్పాలంటే— తనే వాళ్ళకు ఋణపడి ఉండాలి- కలకాలమూ ఋణపడి ఉంటుంది కూడాను. ఎలాగంటే- ఎందుకంటే— తన జీవితాన్ని రెండు భాగాలుగా విభజిస్తే— ఒక అంకం తన భర్త నరసింహులుది. మరొక అంకం- బడి తరగతులది- పిల్లల ప్రపంచానిది. అణువణువూ ఆద్యంతమూ తన జీవితాన్ని ఆ రెండు భాగాలకే అర్పించుకుంది. ఆ తరవాతనే తనకు మిగతా వాళ్లందరూనూ. 


అటు నరసింహులు గాని తనకు దూరమయ్యాడన్న తలంపు వస్తే- తనిక బ్రతక లేదు. ఇటు పిల్లల సందడి తన జీవన ప్రాంగణాన సతతమూ వినిపించకుండాపోతే తన జీవన నేపథ్యానికి పరమార్థమే కోల్పో తుంది. చెట్టు మ్రాను క్రింది భాగం భర్తయితే, పై భాగం స్కూలు జీవితం— గృహిణిగా ఉపాధ్యాయినిగా. తన బిడ్డలిద్దరూ ఆ మ్రానుకి ఇరు వైపులా విస్తరించే కొమ్మలు మాత్రమే-- 


వయసు వికసించ నారంభించినప్పుడు పెళ్ళీ పేరంటాలు దరిచేరినప్పుడు- ఆ రెండు కొమ్మలూ మరొక దిక్కున విస్తరించుకుంటూ పోవడం ఖాయమే కదా! అంతవరకూ జరిగింది- ఇకపైన జరుగబోయేది- ఇప్పుడు జరుగుతున్నదంతా ఆది మధ్యాంత రహితమైన కాలభైరవుడైన ఆ పరమాత్ముడికే కదా విదితం-- 


ఆమె అలా పిల్లల అలికిడిలోని కెరటాలు చూస్తూ— పరవళ్లు తొక్కే ఉత్సాహపూరిత గొంతులు వింటున్నప్పుడు— ఆమె లో ఓ విధమైన ఉద్వేగ భావం చెలరేగుతుంది. మధుర మనోజ్ఞ మార్దవ రాగం మనసంతటా చోటు చేసుకుంటుంది. తనకు తెలియకుండానే యేదో అదృశ్య శక్తికి లోనయినట్లు తటాలున సీట్లోనుంచి లేచి నిల్చుంటుంది. వేగంగా వెళ్ళి తన బాహువుల్ని అరటి బోదెల్లా పరచి వాళ్ళను తనివిదీర వాటేసుకోవాలనిపిస్తుంది. 


అప్పుడు పెద్దరికం అడ్డువచ్చి ఉన్నపళాన ఊద్వేగాన్ని ఆపుకుని మళ్ళీ తన సీట్లోకి జేరబడి పోతుంది. అక్కడున్న చాలామందికి తెలిసినది ఒక్కటే; తను భోజనం చేయడానికి, సేద తీర్చుకోవడానికి తనకు విడిగా రెస్ట్ రూమ్ ఒకటుందని. 


కాని మరొకటి వాళ్ళకు తెలియదు. ఆమె పర్సనల్ అసిస్టెంటుని బైటకు పంపించేసి, కూతురు మాధవిని కూడా యెక్కువ సేపు తనతో ఉండకుండా తోటి పంతులమ్మలతో లేడీ స్టాఫ్ తో కలివిడిగా ఉండమని ఉపదేశిస్తుంది, ఉదాసీనతకు చోటివ్వకుండా సీనియారిటీకి అధిక ప్రాముఖ్యత యివ్వకుండా వాళ్లు తెచ్చుకున్నవాటిని పంచుకొమ్మని చెప్తూ కలివిడిగా కళ కళగా ఉండేలా చూసుకొమ్మని పంపించేస్తుంది. 


ఆ తరవాత, యవ్వన ప్రాయ మధురోహలలో హాయిగా తేలిపోతూ తన చేంబర్ కి ఆనుకుని ఉన్న వేప- నేరేడు చెట్ల నీడన కూర్చుని పరధ్యాన నిమగ్నురాలై తను తింటుందన్నది అక్కడి వాళ్లకు తెలియదు. మొన్నమొన్నటి వరకూ కొన్ని సంవత్సరాల పాటు స్నేహ మాధుర్యాలను పంచుకుంటూ ఊసులాడుకుంటూ గడిపిన తోటి టీచర్ల మాటల్ని వాళ్ల చిలిపి చేష్టల్ని నెమరు వేసుకుంటూ భోజనం ముగి స్తుంది. 


వాళ్లలో చాలామంది జూనియర్ గ్రేడ్ టీచర్లూ సీనియర్ గ్రేడ్ టీచర్లూ తనలాగే ఈ పాటికి ఉద్యోగ విరమణ చేసి ఉద్యోగ బాధ్యతలకు వీడ్రోలు పలికి ఉంటారు. పిదప మనవళ్లు, మనవరాళ్ళతో కాలం గడుపుతూ ఉంటారు. లేదా కొడుకూ కూతుళ్ళ వెంట విదేశాలకు చెక్కేసి ఉంటారు. జీవన మహా ప్రస్థానానికున్న మహత్తర మలుపు అదే కదా! 


‘ఇదిగో ఇలా వెళ్ళి అలా రానూ!’ అంటూ బయల్దేరి మధ్యలో యెక్కడో— మరెక్కడో-- ఆగిపోవడమేగా జీవన ప్రయాణానికున్న అసలు ముగింపు-- 


జీవన మలి సంధ్యా సమయంలో మృదువైన గతకాల జ్ఞాపకాలు తలిరాకు చివరన వ్రేలాడుతూ మెరిసే మంచు బిందువుల వంటివి. ఇప్పటికిప్పుడు అరచేతిలో ఇమడకపోయినా, అవి జీవన చైతన్య ప్రాణసారాన్ని ఇంకిపోకుండా నిలుపుతాయి. 


ఎట్టకేలకామె ఆలోచనా తుంపర నుండి తప్పుకుని మంచినీటితో గొంతుని తడిచేసుకుని శంకరం సమర్పించిన నోటుని చేతులోకి అందుకుంది. డాంబికమైన పదజాలం లేకుండా సకారాత్మకమైన వివరణాత్మకమైన అతడి నోటు ఆమెకు నచ్చింది. కల్లాకపటం లేని శంకరం ముఖం కళ్లముందు మెదిలింది. 


గుండెనిండా కొండంత నిజాయితీ ఉంటేగాని ఎవ్వరూ తమ పూర్వోత్త రాల గురించి అంత బాహాటంగా, అదీను తానుగా ముందుకొచ్చి చెప్పరు. దానిని బట్టి తెలుస్తూంది; అతడికి తన పెద్దరికం పైన ఎంతటి మన్ననా మర్యాదా ఉందో! ఇక ముందుకి సాగి చూస్తే-- కాటి కాపరులంటే సత్యహరిశ్చంద్రుడి బాపతేగా! ఆ రీతిన శంకరం సత్యహరిశ్చంద్రుడికి దగ్గరి వాడేగా! 


చదువు వ్యక్తికి మంచి అర్హత ఇవ్వగలదు. తగు స్థాయిన ఉద్యోగం యివ్వగలదు. సంపాదన సమకూర్చగలదు. సమాజంలో స్థాయిని పెంచగలదు. కాని-- చదువు మాత్రమే బాంధవ్యాలను, అనుబంధాలను—ముఖ్యంగా ఉదాత్త మానవీయ విలువల్ని యివ్వలేదు. ఇంతటి ఉత్తమ గుణాంశాలుండాలంటే పూర్వ జన్మ సుకృతం కూడా కలసి రావాలి. జీవన అనుభవసారాన్ని పుణికి పుచ్చుకున్న వర్థనమ్మకు ఆ విషయం బాగా తెలుసు. నిస్సందేహంగా శంకరంలో ఇంకేదో ఊహకు అతీతమైనదేదో ఇమిడి ఉందన్నది ఆమెకు తోచింది. పూర్వ జన్మ సుకుమారమైన వాసనేమో! ఋషి వాకిట పెరిగి వ్యాపించిన గత జన్మ నేపథ్యమేమో! 


=======================================================================

                                                ఇంకా వుంది

========================================================================

 

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





41 views0 comments

Comentários


bottom of page