top of page
Writer's picturePandranki Subramani

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 5

#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 5 - New Telugu Web Series Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 12/12/2024 

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 5 - తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి  

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


హైదరాబాద్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు. 


నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. 


ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. 

అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది.


అమెరికా వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ ప్రోగ్రాము ఇన్ చార్జీ మిస్టర్ రస్సెల్ ను కలుస్తాడు. 

డబల్ బెడ్ రూమ్- విత్ షేరింగ్ ఫెసిలిటీ తీసుకొని, రూమ్ కు వెళ్తాడు. అతని రూమ్ మేట్ గా పాకిస్థాన్ కు చెందిన షేక్ అహ్మద్ ను అలాట్ చెయ్యడంతో ఖంగు తింటాడు. 




ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 5 చదవండి..


మాధవి అప్పుడప్పుడు అటు దీర్ఘమైన బడి నడవ నుంచి వడివడిగా నడుస్తూ వచ్చేటప్పుడు; స్కూలు కార్యాలయం నుంచి దస్త్రమొకటి చేత బట్టుకుని- అటునుంచి ఇటు వేగంగా నడచి వస్తూ శంకరం తారసిల్లినప్పడు పలకరింపుగా నవ్వు ముఖంతో చూసి ఆగేది- అతడి స్పందనకోసం. 


కాని ఎప్పుడూ ఎటో చూస్తూ ఇంకేదో ఆలోచిస్తూ కర్తవ్య చింతనా పరుడై దారి మళ్లించి కనుమరుగయి పోయేవాడు. మళ్ళీ ఎదురు వచ్చి కనిపించేవాడే కాడు. అప్పుడూ ఇప్పుడూ అని కాదు— ఎప్పుడూ అలానే జరుగుతుంది. ఆ రోజూ కూడా అంతే! తనను తిరిగి చూసి ప్రత్యుత్తరంగా నవ్వి పలకరిస్తాడనుకున్నామెకు కాలి బొటన వ్రేలికి ఎదురు దెబ్బ తగిలినట్లనిపించింది. 


అతడు అదేమీ గమనించకుండా తలొంచుకుని నిదానంగా కర్తవ్యమే జీవన పరమార్థ మన్నట్టు వెళ్ళిపోవడమే అతడికి అలవాటు గనుక- అలానే చేసాడు. మరొక సారేమో- తిన్నగా తనవేపు దగ్గరగా వస్తున్నట్టే వచ్చి చటుక్కున మలుపు తిరిగి ప్రక్కనున్న క్లాసులోకి రివ్వున దూసుకుపోయాడు. 


అలాగయితే అతను నిజంగానే మొహమాట పరుడైతే అందరు లేడీ టీచర్లతోనూ అలాగే దూర దూరంగానే ఉండాలి కదా! కాని అలాలేడు. వాళ్లతోనైతే మామూలుగానే మాట్లాడి వాళ్ళడిగిన వాటికి బదులిచ్చి కావలసినవి అందిచ్చి నిదానంగా ముందుకు సాగిపోతాడు. తన వద్దకు వచ్చేటప్పటికే అష్టావక్రుడిలా వంకలు పోతో మలుపు తిరిగి మటు మాయమైపోతున్నాడు-- అంటే- శంకరం కావాలనే తన పరిధి నుండి తప్పుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నా డన్నమాట!


కారణం యేమైతేనేమి-- మొత్తానికి అతడి పోకడ ఆమెకు నచ్చలేదు. అసహనం కలిగించింది. సహజంగానే ఆమె మనస్తత్వంలో భావావేశం ఆపుకోలేని అంతర్భాగం. అనంతమైన జీవన ప్రవాహం. వర్థనమ్మగారి కూతురన్న మర్యాదా లేక ‘ఈమెతో ఎందుకొచ్చిన ఇక్కట్లులే’అన్న ఉద్దేశ్యంతో అప్రమత్తంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడా! మితిమీరిన ముందుచూపు-- అకారణంగా అతి జాగ్రత్త చూపించడం వంటివి విపరీతమైన వ్యాపార దక్షత గల వాళ్లకే ఉంటాయి;రాత్రి పూట మాత్రమే బైటకొచ్చి తొంగిచేసే గుడ్లగూబల్లా-- మొత్తానికి ఆమెలో అంతుతేల్చాలన్న పట్టుదల పొడసూపింది. 

---------------------------------------------------------------------------- 

ఆ రోజు శుక్రవారం. మధ్యాహ్న భోజనాల సమయం. 

స్టాఫ్ విభాగంలో సందడి అంతగాలేని సమయం చూసి మాధవి ఏవో పేపర్లు కళ్లింతలు చేసుకుని చూస్తూన్న శంకరాన్ని వెనుకనుంచి వచ్చి పలకరించింది- “గుడ్ ఆఫ్టర్ నూన్ మిస్టర్ శంకరం! ఎంత పని రద్దీలో ఉంటే మాత్రం భోజనాల సమయాన్ని మరచిపోవడమేనా! పరిచయస్థుల ఉనికి బొత్తిగా పట్టించుకోకుండా ఉండటమేనా!”


ఎదురు చూడని రాక- ఖంగున వినిపించిన ఆమె గొంతూ విన్న శంకరం ఉలికిపాటుతో లేచి నిల్చున్నాడు. తొట్రుపడుతూ ప్రత్యుత్తరం ఇవ్వడానికి పూనుకున్నాడు- “వెరీ గుడ్ ఆఫ్టర్ నూన్ మేడమ్!” అంటూ విష్ చేసి నవ్వు ముఖంతో కంగారుని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించాడు. 


ఆమె ఏమీ అనకుండా అతడికి దగ్గరగా వచ్చి నిల్చుని కళ్ళలో కళ్లు పెట్టి చూస్తూ అంది- “డిస్టర్బ్ చేస్తున్నానా!”


“నో! నాట్ ఎటాల్ మేడమ్! రెండు అర్జంట్ పేపర్లుంటేనూ. అవి పూర్తిచేసి భోజనానికి లేద్దామని--“


“ఐ సీ! అలాగా! ఎనీహౌ- కంగ్రాట్స్— మీ వర్క్ షాపు విజిట్ విషయమై మీరు వ్రాసిచ్చిన రిపోర్టు చదివి చాలా బాగుందని మన ఆఫీసు ఇన్చార్జీగారు మెచ్చుకున్నారు“


“థేంక్స్. మీ తల్లిగారిది ఎంతైనా పెద్ద మనసు కదండీ! వెనుకా ముందూ దన్ను లేని మాబోటి వాళ్లను ప్రోత్సహిస్తుంటారు”


“అందుకే— దీనిని మీకివ్వమన్నారు. ప్రోత్సాహకర బహుమతిగా--” అంటూ ఫైల్సు మధ్య ఉంచుకున్న ప్యాకెట్ ని అందించింది. 


“ఏంవిటండీ ఇది!” అంటూ మాధవి ముఖంలోకి కళ్ళెత్తి చూసాడు శంకరం. 


“చూడండి- తెలుస్తుంది”- మాధవి. 


అతడు ప్యాకెట్ తెరిచి చూసాడు. 


నీలపు ఆకాశ రంగులో ఉన్నషర్టుని చూసి అతడి కళ్ళు తళుక్కున మెరిసాయి. ఆ రంగు అతడికి ఇష్టం. మాధవి వేపు విప్పారిన ముఖంతో చూసి- “ఇప్పుడే వెళ్ళి మేడమ్ గారికి ధన్యవాదాలు చెప్పి వస్తాను” అంటూ అక్కణ్ణించి కదలబోయాడు. 


అప్పుడామె అతణ్ణి ఆపింది. “వద్దు శంకరంగారూ! అమ్మకు ఇటువంటి చిన్నచిన్న విషయాలకు ధన్యవాదాలు చెప్పడం నచ్చదు. అందులో మీరామెకు పూణేనుండి ఏవో స్పెషల్ స్వీట్స్ తెచ్చిచ్చినట్టున్నారు. అది గుర్తుంచుకుని దీనిని మీకివ్వాలనిపించవచ్చుగా! ముఖ్యమైన విషయాలలో థేంక్స్ చెప్తే తప్పకుండా స్వీకరిస్తుంది మేడమ్”


అదీ నిజమే! చిన్నచిన్న విషయాలకుపోయి పెద్దవారైన వర్థనమ్మగారికి అసహనం కలిగించడం భావ్యం కాదు. అలా ఆలోచించుకుంటూ వెనువెంటనే స్పృహలోకి వచ్చాడు- “పెద్ద విషయమంటే --” అని అడుగుతూ చూసాడు. 


“మీరిచ్చిన నివేదికలో కొన్ని మంచి ఆచరణీయమైన సలహాలు ఇచ్చారట. అందుకోసం కాబోలు సర్వీసు రికార్డులో రెడ్ ఎంట్రీ రికార్డు చేయమని మేనేజ్మెంటు కమిటీకి సిఫార్సు చేసినట్లున్నారు ఆఫీస్ ఇన్చార్జిగారు. ఆ కబురు ఖారారయింతర్వాత నిదానంగా వెళ్లి ధన్యవాదాలర్పించి రండి. ఓ కే!”


ఈసారి శంకరం ఫెళ్ళున లేచిన ఆనందపు అలను ఆపుకోలేక పోయాడు. ఉక్కిర బిక్కిరి అయాడు. సర్వీసు రికార్డులో రెడ్ ఎంట్రీ పడటమంటే ఆశల ఆకాశం కళ్ళ ముందు తెరుచుకున్నట్టే-- తన భవిష్యత్తుకి పూలబాట పరచుకున్నట్లే. ఇక రేపో మాపో ప్రమోషన్ అన్న నవకన్య పూలనావలో ఎదుట వచ్చి నిల్చున్నట్లే. 


“థేంక్యూ- థేంక్యూ వెరీమచ్ మేడమ్!” అంటూ ఆనందావేశానికి లోనవుతూ మాధవి రెండు చేతుల్నీ అందుకుని ముమ్మార్లు ఊపేసాడు. 


నక్కినక్కి దాక్కునే శంకరం అలా తన చేతుల్ని అమాంతం అందుకుంటాడని మాధవి ఏమాత్రమూ ఎదురు చూడలేదు. 


అప్పుడామె అతణ్ణి ఇహలోకంలోకి సుతారంగా దించింది- “దయచేసి చేతులు విడిచి పెట్టండి. ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుం టారు. నేను పెళ్ళికాని కన్యను. మరచిపోకండి”


ఆ మాట విన్నంతనే విద్యుత్ శక్తినుండి విడివడ్డవాడిలా తటాలున ఆమె చేతుల్ని విడిచి పెట్టేసాడు శంకరం. ”సారీ! వెరీ సారీ! నేనేదో భావావేశంలో పడి--- !”


“సారీ మాట అటుంచుదురు గాని- మళ్లీ ఆనందావేశంలో పడి మళ్ళీ నాచేతులు అందిపుచ్చుకునేరు. చూస్తే బాగుండదు. ఇక విషయానికి వచ్చేదా?”


అతడు మాటరాని వాడిలా తలూపాడు చెప్పమన్నట్టు-- ”ఇంత మంచి షర్టు తెచ్చిచ్చినందుకు— అంతకంటే మంచి కబురు అందించినందుకూ నాకు ట్రీట్ ఏదీ ఇవ్వరా!”


“ఎందుకివ్వనూ! ప్పుడే వెళ్దాం ఉడ్ ల్యాండ్ హోటల్ కి. సరేనా?”


“ఇప్పుడు కాదు. వచ్చే ఆదివారం మధ్యాహ్నం మన మిద్దరమూ కలసి భోంచేద్దాం. సరేనా శంకరంగారూ!”


“విత్ ప్లజర్ మేడమ్. కాని ఆదివారం మధ్యాహ్నం కుదరదేమో. అదే రోజు సాయంత్రం హోటల్ జైవిలాస్ లో డిన్నర్ తీసుకుందాం. మంచి నాన్- విజ్ కూడా దొరకుతుంది. అన్నట్టు మీరు నాన్ విజ్ తీసుకుంటారు కదూ?”


“అప్పుడప్పుడు టేస్ట్ చేస్తుంటాను. మానాన్నలా మా అన్నయ్యలా మరీ ఇష్టపడి తీసుకోను. అమ్మదగ్గర పక్వంగా వండటం నేర్చుకుని మా యింటికి వచ్చి పోయే బంధువులకు ఎక్కువగా వండిపెడ్తుంటాను”


“అలాగయితే ఒక పని చేద్దాం. హోటల్ స్వాగత్ ప్యూర్ విజిటేరిన్ హోటల్. అక్కడ భోజనం చేద్దాం. ఈజిట్ ఓ కే మేడమ్!“


“చాలా ఓ కే. కాని నాదొక మాట. మాటి మాటికీ నన్ను మేడమ్ అని సంబోధించకండి. నేనంతటి పెద్దదానినా!”


శంకరం గతుక్కుమన్నాడు. గుక్క పడలేదు. ఆడాళ్ళ మాటలకు అర్థాలే వేరని చెప్తుంటారన్నది అతడికి తెలుసు. కాని వాళ్లతో మాట్లాడేటప్పుడు కూడా కత్తిపైన సాము చేస్తున్నట్టు ఆచితూచి మాట్లాడాలి కాబోలు. మేడమ్ అన్న గౌరవపూర్వమైన మాటలో ఎంతటి దీర్ఘమైన అర్థాన్ని తీసుకుందీమె!


అతడు సర్దుకుంటూ అన్నాడు- “నేననేది అది కాదు మేడమ్, మీ బయో డెటా చూసాను. చాలా మంచి క్వాలిఫికేషన్స్ మీవి. అదరిపోయాననుకోండి. అందుకే--”


“అదేమీ కాదు. ఎవరికున్నవి వారికుంటావి. ఇందులో హెచ్చుతగ్గుల ప్రసక్తి ఎక్కడిది? ఇంతకీ మీరు నన్ను మేడమ్ అన్న ఫార్మాలిటీ పిలుపుని మానుకుంటారా లేదా? ”


“ఓకే ఓకే! అలాగే మాధవిగారూ! మరి నాదొక చిన్న రిక్వెస్టు మేడమ్- సారీ- మాధవిగారూ!”


చెప్పండి అన్నట్టు చూపులు సారించిందామె. 


“సర్వీసు రికార్డులో నాకు రెడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్నది దయచేసి ఇప్పట్లో ఎక్కడా పొక్కనివ్వకండి. నా కొలీగ్స్ చాలా మంది పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండు గల పవర్ ఫుల్ వ్యక్తులు. పవర్ ఫుల్ కనెక్షన్లు ఉన్నాయి. ఎదురు చూడని విధంగా మనం ఏమాత్రమూ ఎదురు చూడని దిశ నుండి నరుక్కుంటూ రాగలరు. రాబోయే దానిని ఆపలేకపోయినా సమయానికి చేరకుండా జాప్యం జరిగేలా చేయగలరు. ప్లీజ్ అండర్ స్టాండ్!”


ఆమె అతడిలోని కంగారు చూసి పక్కున నవ్వింది. నవ్వుతూ వెనక్కి మరలింది. 

“ఒన్ మినిట్ ప్లీజ్!”


మాధవి ఆగి చూ సింది. 

“మరి వర్థనమ్మగారిని ఎలా సంతోషపెట్టాలో మీరే నాకొక ఐడియా ఇవ్వాలి మాధవిగారూ! అన్నీ ఆమెగారే ఇస్తున్నారు. నాకు మాత్రం ఒక్కటీ ఇవ్వడానికి ఛాన్స్ ఇవ్వడం లేదు”


“అదా మీ బాధ! ఎలాగూ ఆమె కొత్తగా ఇక్కడ చేరేటప్పుడు ఏవో నట్స్ ఇచ్చినట్టున్నారుగా. ఆ తరవాత పూణే సమావేశం నుండి వచ్చి ఇంకేవో స్వీట్స్ కూడా ఇచ్చినట్టున్నారుగా-- ఇంకా ఆమెను ఎలా సంతోషపెట్టాలో నేను తరవాత నిదానంగా చెప్తాను. ఇప్పటికిప్పుడు వర్రీ అవకండి. సరేనా?”


శంకరం తలూపుతూ అన్నాడు- “అది చిన్నపాటి తిరుపతి లడ్డూ ముక్కండీ! కాస్తంత బాదం పప్పండీ! తిరుపతికి వెళ్లి వచ్చిన మా బంధువు ఒకాయన తెచ్చి ఇస్తేనూ--”


“దుకాణంలో కొనిచ్చిన మిఠాయి కన్నా అది మేడమ్ కి ఇంకా ప్రీతికరం. ఐనా ఆమెను సంతోషపెట్టే సమయం రావచ్చన్నాగా!” అంటూ మాధవి అక్కణ్ణించి కదలింది. 

అతడు తలుపుతూ సీట్లో కూర్చున్నాడు. ఇప్పుడతని మనసున ఒక మృదు మదుర భావన ఉదయకాల పూదోట పరిమళంలా వ్యాపించింది. 


ఏమయిందో యేమో- అతడికి తినాలనిపించలేదు. కడుపు నిండిపోయినట్లనిపంచింది. ఇప్పుడు గాని తను తొందరపడి వర్థనమ్మగారికి యేదైనా ఇవ్వటానికి ప్రయత్నిస్తే— గంగాజలం తీసి గంగమ్మకు అభిషేకం చేసినట్లువుతుందేమో! 

-------------------------------------------------------------------- 

మరునాడు ఉదయం అనుకున్నప్రకారం నరసింహమూర్తి పెదనాన్న మిత్రుడు శ్రీరామ్ గారు, అతడి కోసం రిసెప్షన్ కౌంటర్ వద్ద కూచుక్కూర్చున్నాడు. అక్కడ ఆడా మగా అన్న తేడా గాని- దగ్గరి వారూ దూరపు వారూ అన్నది గాని చూడకుండా హాస్టల్ గదుల్లోకి బైటివారిని పోనివ్వరు. అటువంటి ఆనవాయితీ ఎందుకొచ్చిందో ఎవరికీ తెలియదు. 


నిరుడెప్పుడో-- ఏదో ఒకటి జరిగి ఉంటుంది ఎటువంటి కారణమూ లేకుండా రిస్కీ వ్యవహారం యెదురవకుండా అంతటి కట్టుదిట్టమైన ఏర్పాటు అమెరికన్స్ వంటి లిబరల్ సొసైటీలోని వారు చేయరు కదా! కబురందుకున్న నరసింహమూర్తి— ట్రైనింగ్ క్లాసుకి అవసరమైన పేపర్లను అధ్యాయన సామగ్రిని కుదురుగా పేర్చి, ట్రాలీ బ్యాగులోకి జొప్పించుకుని మరచిపోకుండా అమీర్ పేట స్వీట్ దుకాణం నుండి కొని తెచ్చిన రెండు ప్యాకెట్లను- ఒక మిక్చర్ ప్యాకెట్టునీ- ఒక పూరేకుల ప్యాకెట్టునీ అందుకుని చకచకా క్రిందకు దిగాడు. 


ఫుల్ సూటులో- గిరిజాల జుత్తుతో హుందాతనమూ ఆరిస్టోక్రాటిక్ దర్పంతో కూర్చున్న పెద్దమనిషిని చూసి- అతడే పెద నాన్న స్నేహితుడై ఉంటాడని గ్రహించాడు నరసింహమూర్తి. 

నవ్వుతూ వెళ్ళి చేతులు జోడించి- “నమస్కారం!మీరే కదూ మా పెదనాన్నగారి బాల్య మిత్రులు” 


“ ఔను. భూషణం నా బడి మిత్రుడు. చిన్ననాటి రోజుల్లోనే మీ పెదతండ్రిది పెద్దతరం. నాపేరు శ్రీరామ్. మిమ్మల్ని చూసి చాలా సంతోషం కలిగింది. ఇంకా చెప్పాలంటే- నా చిన్ననాటి నేస్తాన్ని చూస్తున్నట్లే ఉంది. వాడి ముఖఛ్ఛాయలు బాగానే కనిపిస్తున్నాయి మీలో-- 


మీ పెదనాన్నకు పిల్లల్లేరని తెలుసుకుని ఓపారి అడ్వాన్స్డ్ ట్రీట్మెంటు కోసం అమెరికా వేపు వచ్చి వెళ్ళమని అడిగాను. దానికి మీ పెదనాన్న కొంటెగా ఏమన్నాడో తెలుసా? నాతోబాటు మాగోదావరిని కూడా అక్కడకు తీసుకు రాగలవంటే నేను తప్పకుండా వస్తానన్నాడు. నాకు కూడా ఇండియా వచ్చేసి మన గోదావరి తల్లి ప్రక్కనే ఉండాలని ఉంది. ప్రతి సారీ పుష్కరాల సమయంలో నదిలో మునిగి పుణ్యస్నానాలు చేసి తరించాలని ఉంది. కాని కుదరుదుగా- ఉపాథి చూసుకోవాలిగా!” 


ప్రాతకాలపు రోజుల్నీ ప్రాతకాలపు స్నేహితుల్నీ తలచుకుని మిస్టర్ శ్రీరామ్ ఉద్వేగానికి లోనయాడని తెలుసుకున్నాడు నరసింహమూర్తి. కాసేపు విరామం ఇచ్చి బ్యాగుని క్రింద ఉంచి ఆయనతో చేతులు కలిపి- “సీయింగ్ యూ ఈజ్ మై ప్రివిలేజ్ సార్! మా పెదనాన్న మీకివ్వమన్న స్వీట్స్ ఇవే— ప్లీజ్ ఎక్సెప్ట్ సార్!” అంటూ స్వీట్స్ ప్యాకెట్లు మిక్చర్ ప్యాక్టట్టూ అందించాడు. 


శ్రీరామ్ గారి మోము ఫెళ్ళున వెలిగింది. “థేంక్యూ!థేంక్స్ ఫర్ ది ట్రబల్ యు హేవ్ టేకన్“


“దయచేసి థేంక్స్ మా పెదనాన్నగారికి చెప్పండి సార్. మీకు మీ శ్రీమతిగారికీ హైద్రాబాద్ స్వీట్స్ అంటే ఇష్టమని మరీ మరీ చెప్పి పంపించారు“ 


“ఓకే ఓకే! అలాగే చెప్తాలే! మరి నేను సాయంత్రం వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకునేదా? ”- శ్రీరామ్. 


కళ్ళు అల్లార్చి చూస్తూ అడిగాడు నరసింహమూర్తి- “ఎక్కడికండీ? ”అని. 


శ్రీరామ్ గారు బదులిచ్చారు. “ఇంకెక్కడికి? మనింటికే! భూషణం చెప్పలేదా మా ఇంటికి వెళ్ళమని? ”


“ఓ! అదా సార్! నిజానికి మీ ఇంటిల్లపాదినీ ఓ సారి చూసిరావడానికి నాకు కూడా— ఇదిగానే ఉందండి. కాని- ఇప్పుడు ఇంట్రడక్టరీ స్పీచ్ లూ పేర్లూ ఊర్లూ తెలుసుకోవడాలూ- తదితర దేశాల క్యాండిడేట్లతో పరిచయాల కార్యక్రమం ఏర్పాడు చేస్తారు. 


అటు క్లాసులు నడుస్తుండగానే- ఇటు గెట్ టు గేదర్ కలయికలతో బాటు డిన్నర్ పార్టీలు కూడా ఉంటాయి. వీటి నుండి ఎవరికీ మినహా యింపు ఉండదనుకుంటానండి. బహశ: ఈ తతంగమంతా పూర్తి కావడానికి నాలుగు రోజులయినా ఔతుందను కుంటానండి. 

ఈ లోపల క్యాంపస్ వాతావరణానికి ఈ ఊరి చలికీ కాస్తంత అలవాటు పడేలా చూసుకోవాలండీ. మీకు శ్రమనిపించకపోతే వచ్చే ఆదివారం వస్తాను. ఇక యిప్పుడు నాదొక చిన్నరిక్వెస్ట్!”


శ్రీరామ్ ఏమిటన్నట్టు తలెత్తి చూసాడు. 


“మీరు పిలిచిన వెంటనే నేను బయల్దేరి రాలేదన్న వైనం మా పెదనాన్నగారికి మాత్రం చెప్పకండి. ఆయన కొంచెం సీరియస్ మైండడ్ పర్సన్”


“దట్సాల్ రైట్- దట్సాల్ రైట్! నేను రాలేకపోతే మా తమ్ముడు లక్ష్మణుడు వస్తాడు. ఈజిట్ ఓకే!”


“అలాగే సార్. స్వీట్స్ తిన్నతరవాత ఎలాగున్నయో మా పెదనాన్నగారికి ఓమాట చెప్పండి. ఓకే సార్!”


“వైనాట్?”అంటూ వెనక్కితిరిగి మళ్ళీ ఆగాడతను. “ఒక మాట నరసింహమూర్తీ!”


ఆ మాటకు నరసింహమూర్తి ఆయన దగ్గరకొచ్చి నిల్చున్నాడు. 


“మీరు నన్ను చూసిన తోడనే- తెలుగులో నమస్కారం చెప్పారు చూడండీ! అది నాకు చాలా నచ్చింది”


“మరి నేనొక మాట చెప్పేదా సార్!”


తలూపాడు శ్రీరామ్. 


“పాశ్చాత్య సంస్కృతికి నాభి వంటి అమెరికాకు వచ్చి దశాబ్దాలు దాటుతున్నా—బైబిలికల్ వాతావరణంలో మనుగడ సాగిస్తూ కూడా తల్లి భాషను మరచిపోకుండా ఇంత చక్కటి ఉఛ్ఛరణతో తెలుగు మాట్లాడుతున్నారంటే నాకు ఆశ్చర్యంగానే కాక- గర్వకారణంగా కూడా ఉంది సార్. అదెప్పుడో టంగుటూరి కృష్ణకుమారిగారు పాడిన- ‘తెలుగు తల్లికి మెల్లె పూదండ’ గేయం మనసుని కదిపేస్తూంది సార్!”


“మీరు చెప్పింది విన్నాను. మరి దీనికి జవాబు నేనివ్వను. రాయలవారే ఇస్తారు. వింటారా!”

తలూపాడు నరసింహమూర్తి. 


“తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను

తెలుగు వల్లభుండ తెలుగొకండ

యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి

దేశభాషలందు తెలుగు లెస్స”


నరసింహమూర్తి అప్పటికప్పుడది అమెరికాలోని యూనివర్సిటీ కార్యాలయ ప్రాంగణమన్నది మరచి తప్పట్లు కొట్టసాగాడు. శ్రీరామ్ స్నేహపూర్వకంగా నరసింహమూర్తి భుజంపైన ఓ చరుపు చరచి అంగలు వేసుకుంటూ మెట్లు దిగాడు. 


అప్పుడు- ఆ ఒక్క క్షణంలోనే ఒక యువకుడికీ ఒక మధ్యవయస్కుడికీ మధ్య దగ్గరితనమనే తలిరాకు అంకురించింది. 


=======================================================================

                                                ఇంకా వుంది

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 6 త్వరలో

========================================================================

 

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





20 views0 comments

Comments


bottom of page