#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 8 - New Telugu Web Series Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 02/01/2025
తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 8 - తెలుగు ధారావాహిక
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
హైదరాబాద్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు.
నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది.
ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది.
అమెరికా వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ ప్రోగ్రాము ఇన్ చార్జీ మిస్టర్ రస్సెల్ ను కలుస్తాడు. డబల్ బెడ్ రూమ్- విత్ షేరింగ్ ఫెసిలిటీ తీసుకొని, రూమ్ కు వెళ్తాడు. అతని రూమ్ మేట్ గా పాకిస్థాన్ కు చెందిన షేక్ అహ్మద్ ను అలాట్ చెయ్యడంతో ఖంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది. మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన నరసింహ మూర్తి, షేక్ అహ్మద్ ల మధ్య చర్చ నడుస్తుంది.
పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు.
ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 8 చదవండి..
అప్పుడతని మనోహరమైన ఊహలకు కళ్ళెం వేస్తూ శ్రీరామ్ గారి గొంతు వినిపించి ఎలర్ట్ అయాడు నరసింహమూర్తి. కొన్ని క్షణాలు ఉన్నపాటున తడబడిపోయాడు. అప్పుడు వైదేహి కలుగజేసుకుంది- “అదేంవిటి అలా అవాక్కయి చూస్తున్నారు నరసింహమూర్తీ! మా ఇంటి అమ్మాయే- తెలుగుంటి అమ్మాయే! సుజాత- ఇంతకీ మీ పెదనాన్నగారు మా ఇంటి ఇద్దరమ్మాయిల గురించి ఏమీ చెప్ప లేదా? ”
అతడు అప్పటికీ నోరు మెదపలేదు. ఇదొక్కటేనా-- ఏది చెప్పారు గనుక ఇంట్లోని తమ రాజమండ్రి సంస్థానం వాళ్లు. తనతో సరాసరి సంప్రదిస్తే వాళ్ళకు పెద్దరికం తగ్గిపోదూ! ఇంట్లోని అజమాయిషీ అంతా తన చెల్లి మాధవిదే. అదేదో మహా గొప్ప ఆరిందానిలా దానితోనే అన్ని విషయాలూ చర్చిస్తారు.
ఎలాగోలా మనసులోని ఆలోచనలకు అడ్డుకట్టవేసి నరసింహ మూర్తి తేరుకున్నాడు- “అబ్బే! మరేం లేదండీ! మీ పెద్దమ్మాయిని చూస్తుంటే చాలా రోజులుగా ఇరుగు పొరుగున ఎరిగి ఉన్న అమ్మాయిలా కనిపిస్తేనూ— నా చిన్నప్రాయంలో పుష్కరాల సమయంలో గోదావరి కట్టపైన చెంగు చెంగున ఎగురుతూ తిరిగే మా రాజమండ్రి అమ్మాయిలాగే తోచింది”
అప్పుడు మోహన చెంగున ముందుకు వచ్చి అంది- “మీరు చెప్పినా చెప్పక పోయినా మా అక్కా నేనూ రాజమండ్రి అమ్మాయిలమే. మా కుటుంబం విత్తు అక్కడిదేగా మరి. ఇంతకూ మీకేమని తోచిందో ఉన్నదున్నట్లు సెలవిస్తారా మిస్టర్ ఇండియన్ ట్రైనీ గవర్నమెంట్ ఆఫీసర్! ”
“సాయంత్రం పూట చల్లని నదీ సమీరాల మధ్య గోదావరి గట్టున కూర్చున్నట్లుంది మీ ఇంట్లోకి వచ్చింతరవాత”
“కాదు. కచ్చితంగా కాదు. సగం చెప్పి సగం మ్రింగేస్తున్నారు మీరు. నిజానికి మత్స్య కన్యలా యెదుట నిల్చున్న మా అక్కయ్య అందానికి డంగైపోయారు”
అప్పుడు సుజాత చెల్లి వేపు కోపంగా చూస్తూ అంది- “ఏమిటది మోహనా! కొత్తవారితో మాట్లాడే పధ్ధతి ఇదేనా? ”
మోహన తగ్గలేదు. “ఇప్పుడిప్పుడే వచ్చారు కాబట్టి కొత్తవారు. రేపు మనతో కలసి ప్రాతవారిగా మారిపోతారు. ఔను కదా బావగారూ!”
నరసింహమూర్తి మరొక సారి ఉలిక్కి పడ్డట్టయాడు. అంత త్వరగా వరసలు కట్టేస్తుందే ఇప్పుడిప్పుడే పరిచయమైన ఈ అమెరికన్ గోరువంక! అతడికిక స్వదేశానికి తిరుగు ప్రయాణం చేపట్టేంత వరకూ ఉలికి పాట్లపైన ఉలికిపాట్లు తాకుతూనే ఉంటాయేమో!
అప్పుడు ఊరడింపుగా శ్రీరామ్ గారే కలుగచేసుకున్నారు- “మా మోహనకి చొరవెక్కువ. టేకిట్ ఈజీ! ఇక విషయానికి వస్తే మీకేర్పడ్డ అనుమానమేమిటో గ్రహించాను. అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయిల్లో ఇంతటి తెలుగు తనం- ఇంటి వాతావరణంలో ఇంతటి తెలుగు సాంస్కృతి ఎలా వెల్లి విరుస్తుందన్నదేగా మీ అనుమానానికి మూలకారణం? సుజాతా మోహనా ఇక్క డ పుట్టినా అంతా వాళ్ల బామ్మగారి పెంపకమే. కాస్తోకూస్తో మాచిన్నమ్మాయి ఇక్కడి ధోరణులు కొన్ని టిని అలవర్చుకుందేమో గాని- వాళ్ళక్కయ్యది మాత్రం మీరు ఊహిస్తున్నట్టు అచ్చు మన గోదావరి ప్రాంత పోకడే!
అంచేతే మా మోహన అప్పుడప్పుడు స్పాకి వెళ్ళో బ్యూటీ పార్లర్ కి వెళ్ళో జుత్తు ట్రిమ్ చేసుకుంటుంది. కానీ వాళ్ళక్కయ్య మాత్రం ఒక్కసారి కూడా జుత్తుని బైటికెళ్లి సరిచేసుకున్నట్టు మాకు తెలీదు. బైటకు వెళ్తున్నప్పుడు మాత్రం కాస్తో కూస్తో మేక్ ఓవర్ చేసుకుంటుందేమో గాని- ఇంట్లో ఉన్నంతసేపూ మన గోదావరి అమ్మాయే! ”
అప్పుడు మరొక మారు సీమటపాకాయలా మోహన కలుగుచేసుకుంది- “మీరు పూర్తిగా చెప్పినట్టులేదు పెదనాన్నగారూ! ’గోదావరి గట్టుందీ! గట్టుపైన చెట్టుందీ! ఆ చెట్టుపైన పిట్టుందీ!’ అన్నజమునాగారి పాటను పండగ పబ్బాలొచ్చినప్పుడు మా అక్కయ్య ఎన్ని సార్లు పాడలేదనీ! మరచిపోయారా పెదనాన్నా! ”
ఇది విన్న సుజాత ఈసారి ఊరుకోలేదు. చెల్లి నడినెత్తిన చిన్న పాటి మొట్టికాయ పెట్టింది; కళ్లతోనే ఊరుకొమ్మని హెచ్చరిక విడుస్తూ--
ఈసారి మొహమాటమేదీ లేకుండా ధైర్యంగా సుజాత వేపు కన్నార్పకుండా చూసాడు నరసింహమూర్తి. ఈ బంగారు భరిణ అమెరికాలో స్థిరపడ్డ దంపతుల కడుపున పుట్టకుండా— తనిప్పుడు ఉంటూన్న భాగ్యనగరంలోనో- గోదావరి ప్రాంతంలోనో లేక బెంగళూరులోనో ఉంటే ఎంతబాగున్ను! ఇక్కడేమో ఈమెతో పరిచయం పెంచుకోవడానికే తావులేదు. తనెలాగూ ‘నలుగురి తో నారాయణా! ’అంటూ- రేపో మాపో తట్టాబుట్టా సర్దకుని ఇండియా వెళ్ళిపోవాలిగా!
అతడి మనసు మౌనంగా బాధగా మూలిగింది. ఐనా- ఒక్క రోజులోనే ఇంతటి విరహమా! మధురమైన హృదయ రాగమా! సుందరానికి తొందరెక్కువన్నట్టు తను ఆధారం లేని విరహ తాపానికి లోనవుతున్నాడేమో!
ఎన్నాళ్ళకని-- ఎన్నాళ్ళకని తన కళ్ళకు ఇంతటి నిండైన అందం కనువిందు చేసిందని!
ఈసారి అతడి మధుర మనోభావాలను చెదరగొడ్తూ శ్రీలక్ష్మణ్ కలుగుజేసుకున్నాడు- “మూర్తీ! మీరు మీ ట్రైనింగ్ పీరియ డ్ ముగించుకుని మీరు ఊరు చేరేటప్పటికి మీకొక ప్లజంట్ సర్పరైజ్ ఎదురు చూస్తుంటుంది. ఆ ఏర్పాటు మా అన్నయ్యే చేసాడు”
ఉన్నవీ ఎదురైనవీ చాలవన్నట్టు మరొక ప్లజంట్ సర్ప్ రైజా! నరసింహమూర్తి అదోలా ముఖం పెట్టి అయామయంగా చూసాడు. తనకు కావలిసిన దానిపైన మనసు ఫిక్స్ ఐపోతున్నప్పుడు అదే మనసు మరొకదానిపై ఎలా మరలుతుందీ!
అప్పుడు శ్రీలక్ష్మణ్ మళ్ళీ అందుకున్నాడు- “భూషణం గారి తరపున మీకోసం మాఅన్న బుక్ చేయబోయే న్యూమోడల్ డేవిడ్ సన్ మోటర్ సైకిల్ రెడీగా ఉంటుంది. మీరు ఊరు చేరేలోపల బైక్ మీ ఇంటి వాకిటముందు నిల్చుంటుంది”.
ఆమాటకు ప్రయత్న పూర్వకంగా సంతోషాన్ని కొని తెచ్చుకుంటూ తనదైన ధోరణిలో స్పందించాడు నరసింహమూర్తి- “థేంక్యూ! థేంక్యూ వెరీ మచ్ సార్! ఆ బైక్ పేరు వినడమే గాని నేనింత వరకూ చూడనే లేదు. బిలీవ్ మీ! ఐతే మీరివ్పబోయే గిఫ్ట్ విషయం ఓసారి మా పెదనాన్నతోనూ మా నాన్నతోనూ మాట్లాడి చెప్తానండీ. అంత వరకూ కొంచెం ఆగమని రిక్వెస్టు చేస్తున్నాను.
ఎందుకంటే- అక్కడ మా పెదనాన్న నన్ను‘స్ప్లెండర్ బైక్ కావాలా? ’ అని అడిగారు. ఆ విషయం కనుక్కుని మీకు చెప్తాను” అంటూ ముఖాన్ని విప్పార్చుకుని వెళ్ళి అన్నదమ్ములిద్దరితోనో చేతులు కలిపాడు; మనసు పొరల మధ్య సుజాత లావణ్యాన్ని నింపుకుంటూ..
ఇకపైన అతడి మనసు అతడి మాట వినదేమో! ఒకసారి చూపు మరల్చితే క్షణకాలం కనురెప్పలు మూస్తే కమ్మని ఆ నిండురూపం తన నుండి నిరంతరంగా కనుమరుగై పోతుందేమో! ఇదొక విధమైన విరహ దాహమే కదూ!
ప్రకృతి ఎంతటి శక్తివంతమైనది. బ్మహ్మదేవుడు స్త్రీ దగ్గరకు వస్తే మాత్రం అందరిలా మట్టి ముద్దతో ఆషామాషాగా తయా రు చేయడేమో! సాంతమూ ఆకర్షనీయమైన బంగారు తొడుగుతో రత్నాల కాంతులతో వెన్నెల చల్లదనంతో మలిచాడేమో; మగ జాతిని ఊపిరి తీయలేనంతగా ఉక్కిరి బిక్కిరి చేస్తూ!
అతడి ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ శ్రీలక్ష్మణ్ మరొకసారి మధ్యకు వచ్చి అన్నాడు- “అలాగే! మీరు మీ వాళ్ల తో సంప్రదించిన తరవాతనే చెప్పండి బైక్ విషయం గురించి. ఆ తవాతనే అన్నయ్య బుక్ చేస్తాడు. భూషణంగారిని సంతోష పెట్టాలన్నది అన్నయ ఉబలాటం. మనం ముందు అల్పాహారం తీసుకుందాం. తరవాతి ప్రోగ్రాము గురించి పథక రచన చేద్దాం” అంటూ దారి చూపించాడు.
ఇంకెక్కడి అల్పాహారం? అతడిలో ఆకలి పూర్తిగా చచ్చిపో తేనూ-- నరసింహమూర్తి అలాగే అన్నట్టు తలూపి కదిలాడు సుజాత నీడన నడుస్తూ- ఆమె తలపుల జడివానలో తడుస్తూ.
ఫలహారాలలో తెలుగు వంటకాలు- కొబ్బరి బొప్పాయి లడ్డు, చిలగడ దుంప పూర్ణాలు, మెంతుల చట్నీ, ఆవకాయ పచ్చ డి. బూడిద గుమ్మడి గారెలు, సగ్గు బియ్యం పకోడీలు- వాటితో బాటు అమెరికన్ భోజన విధానం ప్రకారం నాన్ విజ్ పదార్థాలతో ఉడకబెట్టిన కోడి గ్రుడ్లు డైనింగ్ టేబల్ పైన తన కోసం ఎదురు చూస్తున్నాయి. అవన్నీ తన కోసం ప్రత్యేకంగా చేసినట్టున్నారు.
టిఫిన్ పూర్తియిన తరవాత వేడి కాఫీ తీసుకున్న తరవాత అక్కాచెల్లెళ్ళిద్దరూ అతణ్ణి మేడపైకి రమ్మని పిలిచారు. వాళ్ళ తో కొన్ని అడుగులు వేసి చటుక్కున ఆగిపోతూ అడిగాడు నరసింహమూర్తి- “సువర్ణ సుందరి సినిమాలో నాగేశ్వరరావూ అంజ లీదేవీ స్వర్గలోకం వేపు మెట్లెక్కుతున్నట్లుందండీ. ఇంతకూ నన్నెక్కడకు తీసుకువెళ్తున్నారో తెలుసుకోవచ్చా!”
“మీరు మరీ ఊహల సుదూరాలకు వెళ్ళిపోతున్నట్టున్నారు బావగారూ! మనమిప్పుడు వెళ్ళేది మా అక్కయ్య గదిలోకి వెళ్తున్నాం. సరేనా! ”
ఆ మాట విని అతడు ఆశ్చర్యంగా చూసాడు- “సుజాతగారి బెడ్ రూముకా! ఎందుకులెండి. ఇక్కడెక్కడైనా కూర్చుని మాట్లాడుకుందాం”
“అబ్బ—మీరు మరీ సిగ్గుతో మొగ్గయిపోకండి మహాశయా! ముందు వచ్చి చూడండి. ఆ తరవాత తెలుసుకోండి మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నామో!”
చెల్లి మాటకు సుజాత నవ్వుల పూబంతుల్నిపెదవుల మధ్య దాచుకునేందుకు శ్రమపడుతూంది. ఇక చేసేది లేక అతడు ఇంతులిద్దరికీ తనను తాను అప్పగించుకుంటూ అనుసరించాడు. అప్పుడప్పుడు యిష్టాష్టాలతో నిమిత్తం లేకుండా పూబంతుల వంటి ఇంతులకు సరెండర్ ఐపోవడమే ఉభయతారకమేమో!
ఆ అమెరికన్ తెలుగు కన్యలిద్దరూ ఆ గదిలోకి ప్రవేశించిన వెంటనే అక్కడి వాతావరణం అతణ్ణి ఉన్నపళాన నోస్టాలిజా లోకి తీసుకెళ్ళిపోయింది. మనసు అనుభూతి పూర్వకమైన మల్లెల వాసనలతో నిండిపోయింది. ఎందుకంటే అతడు మొదట ఊహించినది వేరు- ఇప్పుడు నేరుగా చూస్తున్నది మరొకటీను. ఖరీదైన రిక్ లైనర్ సోఫా- అంతకంటే ఖరీదైన క్యాస్పర్ సోఫా సెట్- లక్జరీ బెడ్ సెట్టూ- ఒడిస్సీ డైనింగ్ సెట్టూ- ఇంకా ఇటువంటి ఖరీదైనవాటిని ఇద్దరూ చూపించి తనను ఊపిరి సలపనంత స్థాయికి తీసుకెళ్తారనుకున్నాడు నరసింహమూర్తి. కాని అదేమీ పోష్ కేస్ రూపంలో కనిపించలేదు.
గదికి ఓరగా అమర్చిన చెక్క బీరువా- రాజమండ్రిలో అచ్చు తమింట్లో నట్టింట నిల్చున్న రంగం టేకుచెక్క పెట్టె- దానికి ఎదురు గా పోలిష్ చేయబడ్డ కలప కుర్చీలు- ఇత్తడి వాజ్ లో అమర్చిన ఎర్రటి తాజా పువ్వులూ- మెరిసే నెమలి ఈకలతో అమ ర్చి తయారు చేసిన వింజామరం- ధ్యాననిమగ్నుడై కూర్చున్న ముక్కంటి విగ్రహం ముందు సువాసనల్ని వెదజల్లుతూన్న అగ రు వత్తులు- నగిషీ చెక్కిన ప్రాతకాలపు వారణాసి ఇత్తడి చెంబు- ఆ తరవాత గది మధ్య కుదురుగా నిల్చున్న గోదావరి ప్రాంత పు పందిరి మంచం.
అంతా చూస్తే— అతడిప్పుడు ప్రత్యక్షంగా తను పుట్టి పెరిగిన రాజమండ్రి రాజావారి వీధినీ, ఆ వీధిలోని తమ స్వంత ఇంటినీ కలలో చూస్తున్నట్లే ఉందతనికి.
అతడు ఒక అద్భుత అనుపమాన మానసికపరమైన అనుభూతికి లోనయాడన్నది గ్రహించిన సుజాత అతడికి సమీపంగా వచ్చి అంది- “నిజంగా ఇది నాగది కాదండి”
అతడు తలతిప్పి, ఇంకెవరిదన్నట్టు చూపులు సారించాడు.
“ఇది మా బామ్మ రఁవణమ్మ గారిది. దీనిని ఇంటి పెద్దమ్మాయిగా నాకు ఇచ్చారు”
“వండర్ ఫుల్. మరి ఆ పెద్దావిడ కనిపించరేం? తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళ్ళారా? నేను మా పెదనాన్నగారితోనూ మా పెద్ద మ్మగారితోనూ కలసి మూడు నాలుగు సార్లు వెళ్ళాను. అందుకని అడుగుతున్నాను”
ఈ మాటతో అక్కడ నిశ్శబ్దం బరువైన పరదాలా పరచుకుంది. కొన్ని క్షణాల తరవాత మళ్లీ సుజాతే బదులిచ్చింది- “రెండేళ్ళ క్రితం పోయారు మా బామ్మ”
“పండు వయసులోకి ప్రవేశించే చనిపోయారు లెండి. మీ బామ్మగారు పుణ్యవతే” సుజాత కళ్ళలో కన్నీటిపొర చూసి చలించాడు నరసింహమూర్తి. “ఆమెగారి పార్థివ శరీరానికి భూస్థాపితం ఇక్కడే చేసారా!”
“కాదు. మా బామ్మగారి కోరిక ప్రకారం ఆమెను దహనం చేసాం. భస్మాన్ని కృష్ణా గోదావరి నదులలో కొంత- గంగానదిలో కొంత—మరి కొంత కావేరి నర్మదా నదులలోనూ కలిపేసి వచ్చారు మా నాన్నా చిన్నాన్న ఇద్దరూనూ”
అతడికి మాట్లాడలేదు. మౌనంగా నడచి వెళ్ళి గదికి కుడి వేపున వ్రేలాడుతూన్న రఁవణమ్మగారి నిలువు ఫోటో ముందు తలవంచి నమస్కరించాడు నరసింహమూర్తి.
ఆ తరవాత ఇటు తిరిగి- “థేంక్స్ సుజాతగారూ! ”అన్నాడు.
ఎందుకన్నట్టు చూసిందామె కళ్లను పెద్దవి చేసుకుని.
”పవిత్రమైన మీ బామ్మగారి గది చూపించినందుకు- స్వంత ఊళ్లో ఉన్నంతటి తన్మయత్వం కలిగించినందుకు” అంటూ అతడు మేడ మెట్లు దిగసాగాడు.
అతడు దిగీదిగక ముందే అక్కడ శ్రీరామ్ ఎదురొచ్చాడు. “నరసింహమూర్తీ! భోజనాలకు ఇంకా బోలెడంత సమయం ఉంది కాబట్టి— మీరొకసారి డౌన్ టౌన్ వేపున్న సూపర్ బజార్ కి అలా ఎందుకు వెళ్లి రాకూడదూ? ఇప్పుడిప్పుడే భూషణంతో ఫోను లో మాట్లాడాను. భూషణం కూడా మిమ్మల్ని అలా బైటకు తీసుకెళ్ళి చూపించమన్నాడు”
ఆ మాట విని నరసింహమూర్తి ముఖానికి పంట పొలాలకు కొత్తనీరు తగిలినంత కళ వచ్చింది. అతడలా మంచు గాలిలోకి మేఘంలా తేలుతూ వెళ్లిరావడానికి అదే సరైన తరుణం. మరుసటి రోజు వర్కింగ్ డే- ట్రైనింగు క్లాసులో పూర్తిగా మునిగిపోతాడు. నిజానికి అతడు కరోలినా సెంట్రల్ యూనివర్సిటీ ట్రైనింగు అకాడమీ నుండి విరామం కలిగి బైట ప్రపంచంలోకి రావడానికి మరొక ఐదు రోజుల ఎడబాటు ఎదురొస్తుంది.
“విత్ ప్లజర్ అంకుల్! మరి మనం బయలుదేరుదామా?” ఆతృత ఉట్టిపడే గొంతుతో అడిగాడతను.
అప్పుడు రామ్ మోహన్ రాబర్ట్ ముందుకు వచ్చాడు- “నేను తీసుకెళ్లనా డాడీ!”అంటూ. అంత మందిలోనూ అతగాడి గొంతున మాత్రమే అమెరికన్ ఉఛ్ఛరింపు స్పష్టంగా ధ్వనించింది. పరమ పదించిన రఁవణమ్మగారి పెంపకంలో పెరిగే అదృష్టం- తెలుగు తనం వంటబట్టించుకునే భాగ్యం ఇతడికి పరిపూర్ణంగా కలగలేదేమో!
నరసింహమూర్తి దృష్టిలో, వయసుతో నిమిత్తం లేకుండా చెప్పాలంటే— నిజమైన తెలుగింటి ఆడపడుచు దివంగతురాలైన ఆ మహాతల్లి రఁవణమ్మగారే! ఫోటోలో ఆమెగారి ముఖకళ చూస్తుంటే- అచ్చు పెద్దమ్మ మందారమ్మ గారిలాగే ఉంది. ఎందుకో మరి- అతడు రాను రాను మానసికంగానే గాక ఆత్మీయంగానూ ఆ యింటికి పెవికోల్ లా అతుక్కుపోతున్నాడేమో!
అప్రయత్నంగా తల విదిల్చాడు. ఇవన్నీ క్షణకాలపు బంధాలు. ప్రలోభపు అలలు. నీటి పైన గీతల్లా తేలే సంబంధాలు- వీటిని నమ్మి గిరిగీసుకుంటే-- మట్టిగుర్రం ఎక్కి గోదావరిలోకి దూకినట్టే. ఎప్పుడో చదివిన గీత వ్యాఖ్యానం గుర్తుకి వచ్చింది— 'విషయాల గురించిన చింతన విషయ వాంఛల పట్ల ఆసక్తి కలుగ చేస్తుంది. అటువంటి ఆసక్తి నుండి కామం ఆ తరవాత కోపం'
అప్పుడు శ్రీరామ్ గారి గొంతు వినిపించి అటు తిరిగాడు. ఆయన నవ్వుతూ కొడుకు భుజం తట్టి అన్నాడు- “నువ్వెందుకులేవోయ్! ఈ రోజు నరసింహమూర్తికి హోస్టులు మీ అక్కయ్యలే! వాళ్ళ ముగ్గురినీ కలసి వెళ్లనియ్యి”
మళ్ళీ అదే నవ్వుముఖంతో సుజాతకి కారు కీ అందిచ్చాడు తన కారులో వెళ్ళమంటూ. సుజాత చిర్నవ్పుతో దానిని అందుకుని చకచకా మేడమెట్లెక్కింది. మోహన అక్కయ్యని అనుసరించింది.
మరి కాసేపటికి అక్కాచెల్లెళ్ళిద్దరూ చీరలు విప్పి జీన్స్ వేసుకొచ్చారు. ఎత్తరి కావటాన సుజాత చక్కటి ఒంపుసొంపులతో మరీ చక్కగా ట్రిమ్ గా కనిపించింది నరసింహమూర్తి కళ్లకు.
మొన్నఆధ్యాత్మిక టీ. వీ. ప్రోగ్రాములో ఒక పెద్దాయన అన్నమాటలు మనసున మెదిలాయి. ’వేరు వేరు ప్రాంతాలను బట్టి, అక్కడి ఆచారాలు ఆనవాయితీలను బట్టి సంప్రదాయాలు మారే అవకాశం ఉంటుంది. కావున అక్కడి సంప్రదాయాలను కొద్దో గొప్పో మనతో కలుపుకుని గౌరవించడం నేర్చుకోవాలి’
అంచేత తెలుగు సంప్రదాయాల పట్ల మిక్కిలి మక్కువ చూపించే సుజాత- రఁవణమ్మగారి దత్తు పుత్రికైన సుజాత- కరోలినా రాష్ట్ర వాతావరణానికి తగ్గట్టు అలంకరణలో మేకోవర్ తెచ్చుకోవడం అతడికేమీ వ్యత్యాసంగా తోచలేదు. ఇండియా నుండి అతడిక్కడికి రాకముందు మిత్రుల ద్వారా విన్నదానిని బట్టి- కొంత మంది భారతీయ స్త్రీలు అమెరికా చేరిన వెంటనే వాళ్ల పొడవైన శిరోజాలను పట్టున కత్తిరించుకు ని, దాదాపు బాబ్డ్ జుత్తుగా మార్చుకుని కురుల్ని గాలిలోకి ఎగరేస్తూ స్టయిలిష్ గా మారిపోతుంటారు.
మరి అమెరికాలో పుట్టి పెరిగిన సుజాత అమెరికన్ పౌరురాలిగా ఉంటూన్న సుజాత అలా చేయలేదుగా! బామ్మగారి పెంపకం వల్ల జుత్తుని చలికాలపు మంచు తునకల్ని, వజవజ వణికించే చలి గాలుల్ని లెక్కచేయకుండా ఎంచెక్కా నిగనిగలాడేలా పొడవుగా పెంచుకుందని! సుజాతకు తప్ప కుండా గుణాంశం గల భారతీయుడే-- వాళ్ళ కుటుంబ స్థాయికి తగ్గ భాతీయ సంతతికి చెందిన అమెరికన్ పౌరుడే జతగాడిగా కుదురుతాడు. ఇందులో ఇసుమంత సందేహానికీ ఆస్కారం లేదు.
ఏమో ఎవరు చెప్పొచ్చారు—భారతీయత పట్ల మక్కువ ఉన్నతెల్ల అమెరికనే యువకుడే జతగాడుగా రావచ్చేమో! ఈ మధ్య తెల్ల అమెరకన్లు భారతీయ స్త్రీలను మనసార యిష్టపడి మనువాడటం తను టీ వీలలో చూస్తూనే ఉన్నాడుగా! ఏం—అటువంటి దేశ విదేశీ సంబంధాల గురించిన సినిమా కథలు కూడా వస్తున్నాయిగా!
=======================================================================
ఇంకా వుంది
========================================================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Комментарии