#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
Tharangalu Theeram Dati Taralipothunnappudu - Part 9 - New Telugu Web Series Written By - Pandranki Subramani Published In manatelugukathalu.com On 09/01/2025
తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 9 - తెలుగు ధారావాహిక
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
హైదరాబాద్ లో అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేస్తూన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు. వెళ్లేముందు అతని పెదనాన్న భూషణం, అక్కడ తెలిసినవారి వివరాలు చెప్పి కలవమంటాడు.
నరసింహ మూర్తి తల్లి- రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్థనమ్మ గారికి ఒక స్కూల్ లో ఇన్ చార్జీ పోస్టు వస్తుంది. నరసింహ మూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది.
ఆఫీసులో పని చేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్థనమ్మ గారికి. అతనికి, కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది.
అమెరికా వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ ప్రోగ్రాము ఇన్ చార్జీ మిస్టర్ రస్సెల్ ను కలుస్తాడు. డబల్ బెడ్ రూమ్- విత్ షేరింగ్ ఫెసిలిటీ తీసుకొని, రూమ్ కు వెళ్తాడు. అతని రూమ్ మేట్ గా పాకిస్థాన్ కు చెందిన షేక్ అహ్మద్ ను అలాట్ చెయ్యడంతో ఖంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది. మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన నరసింహ మూర్తి, షేక్ అహ్మద్ ల మధ్య చర్చ నడుస్తుంది.
పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్లిన నరసింహ మూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు. సుజాత, ఆమె చెల్లెలు మోహనాలతో ఔటింగ్ వెళ్లే అవకాశం వస్తుందతనికి.
ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 9 చదవండి..
ముగ్గురూ అటు గ్యారేజి వేపు వెళ్ళగానే శ్రీరామ్ మేడ మెట్లెక్కుతూన్న తమ్ముణ్ణీ మరదల్నీ ఆపాడు. అందర్నీ హాలులోకి వచ్చి కూర్చోమని చెప్పి ఇంట్లో పనిచేస్తూన్న బ్లేక్ లేడీ సర్వెంటుకి యేవో పనులు పురమాయించి-- దానితో బాటు దగ్గరుండి మరీ మంచి కాఫీలు తయారుచేసి తీసుకురమ్మనమని భార్య సుగాత్రమ్మను కూడా కిచెన్ వేపు పంపించాడు. భర్త ఎప్పుడైనా మంచి కాఫీ పట్రమ్మని తనను స్వయంగా పురమాయించాడంటే- ఏదో ముఖ్యమైన వార్త ఉన్నట్లే.
మరి కాసేపటికి మూవింగ్ ట్రేలో లేడీ సర్వెంటు స్నాక్స్ తో బాటు కాఫీలు తీసుకొచ్చి వాళ్ళముందు ఉంచింది. లేడీ హౌస్ కీపర్ కి ధన్యవాదాలు చెప్పి అక్కణ్ణించి సాగనంపి శ్రీరామ్ సుగాత్రమ్మను ప్రక్కకు వచ్చి కూర్చోమన్నాడు. ఆమె కూర్చు న్న తరవాత శ్రీ రామ్ భార్యవేపు తదేకంగా చూసాడు.
ఆమె నవ్వుతూ కాఫీ కప్పులు అందరికీ అందిచ్చి శ్రీరామ్ ప్రక్కకు మరిం త చేరువగా జరుగుతూ- “ఉఁ- చెప్పండి” అంది.
చిక్కటి కాఫీని ఆస్వాదిస్తూ సంభాషణ ఆరంభించాడతను- “ఒక విషయం చెప్పబో తున్నాను” అని ముందుకు సాగేలోపల శ్రీలక్ష్మణ్ అడ్డు వచ్చి అందుకున్నాడు-
“భూషణంగారి తమ్ముడి కొడుకు నరసింహమూర్తికి సుజాతను ఇచ్చి వెంటనే పెళ్ళి జరిపించే విషయమేగా అన్నయ్యా! ”
“అదేమిట్రా తమ్ముడూ! అలా వేగిర పడిపోతే ఎలా? భూషణం నా చిన్ననాటి మిత్రుడే. మరి నరసింహమూర్తి తండ్రి డాక్టర్ నరసింహులుతో- ఆయన భార్యతో నాకు పరిచయమంతగా లేదుగా! ఎప్పుడో ఎక్కడో నరసింహులుని చూసినట్టు కొద్దిగా జ్ఞాపకం. అదీను ఎప్పటి మాటో! ఇది ఒక గంటలోనో రెండు గంటల్లోనో తీర్చేసి తేల్చేసే బిజినస్ డీల్ కాదుగా. సుజాత జీవిత సమస్య. సుజాతకు నూరేళ్ళ పంట.
ముఖ్యంగా దానికి ముక్కూముఖం తెలియని వాళ్ల మధ్య- విదేశీ వాతావరణంలో జీవిస్తూన్న వాళ్ళ మధ్య మెసలుతూ మరో ఊరు వెళ్ళి అంతగా తెలియని అబ్బాయితో కాపురం పెట్టడానికి ఇష్టం ఉండాలి కదా! అంతేకాక- కీడెంచి మేలెంచమన్నట్టు నరసింహులు దంపతుల గురించి కొంచెం ఆరాతీయాలి కదా! ”
అప్పుడు శ్రీలక్ష్మణ్ గొంతు వినిపించింది--
“నేనిక్కణ్ణించే యిలా కూర్చునే చెప్పగలను కచ్చితంగా- డాక్టర్ నరసింహులుగారిది చాలా మంచి సంబంధం. నిజానికి మోహనకి కూడా అటువంటి మంచి సంబంధం కోసమే ఎదురు చూస్తున్నానన్నయ్యా”
అది విని శ్రీరామ్ తమ్ముడి వేపు విస్మయంగా చూసాడు. “అంటే-- నీకు నరసింహమూర్తి ముందే తెలుసా? ”
“ఆ అబ్బాయి కాదు. వాళ్ల తండ్రి డాక్టర్ నరసింహులుగారు నాకు తెలుసు”
ఆ మాట విన్న సుగాత్రమ్మకు ఆసక్తి మిన్నుముట్టిం ది. “ఎలా మరదీ! భూషణంగారు మీ అన్నయ్యకు మిత్రుడు కాబట్టి వాళ్ల తమ్ముడు నరసింహులు గారిని నువ్వెక్కడో ఒక చోట గాలి వాటంగా చూసుండవచ్చు. మాట్లాడి కూడా ఉండవచ్చు. కాని అది అప్పటి మాట. మరి నీకెలా తెలుసు వాళ్ల కుటుంబం
గురించి- అంత కచ్చితంగా చెప్తున్నావు?”
అప్పుడు శ్రీలక్ష్మణ్ విలంబిత కాలాన్నివిరామంగా తీసుకుని నిదానంగా చూస్తూ బదులిచ్చాడు- “ఔను వదినా! మొన్నటి వరకూ మా అమ్మ ఉసురు పోకుండా ఇక్కడ తచ్చాడుతూ మన మధ్య తిరిగిందంటే- దానికి కారణం డాక్టర్ నరసింహులుగారి చలవే! ఆయనను తలచుకున్నప్పుడల్లా అమ్మ దేవుణ్ణి చూసినట్టు ఫీలయేది వదినా!”
ఆ మాటలంటున్నప్పుడు తమ్ముడి కనుకొలకుల్లో చోటు చేసుకున్న చెమ్మదనం చూసి శ్రీరామ్ కి మాటలు కరువయి మౌనం దాల్చాడు. వైదేహి కల్పించుకుని నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అడిగింది- “మీకు వాళ్ళ కుటుంబం పట్ల సదభిప్రాయం ఉందన్నది తెలుస్తూనే ఉందండీ! మరి వాళ్ళ పూర్వ పరంపర నేపథ్యం గురించి చెప్తేనే కదా మాకు అసలు విషయం తెలిసేది! ఎందు కంటే- ఒకవేళ సుజాత ఈ పెళ్ళి సంబంధం ఒప్పుకుంటే ఇక మన కళ్ళ ముందర ఉండక పోవచ్చు. ఆ పిల్ల బ్రతుకు ఫిష్ ఔటాఫ్ వాటర్ గా తయారు కాకూడుదుగా-- అందుకే బావగారు అంత లోతుగా ఆరాతీయడానికి ప్రయత్నిస్తున్నారు”
“చెప్తాను. అప్పుడు మేము రాజమండ్రి శివార్ల దరిదాపున ఉండేవాళ్ళం. అన్నయ్య అప్పుడు వ్యాపార రంగంలో ఎదగడం మాట అటుంచి— అందులో స్థిరపడనే లేదు. నాకప్పుడు వ్యాపారం గురించి ఏమీ తెలియదు; చిన్నాచితకా పనుల్లో చేయూత నివ్వడం తప్ప- కాలేజీకి వెళ్లి రావడం తప్ప-- కాలేజీ ఆర్కెస్ట్రాలో తెగ యాక్టివ్ గా ఉండేవాణ్ణి.
ఒక రోజు అన్నయ్య వ్యాపార విషయమై బాపట్ల వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఇంట్లో నేనొక్కణ్ణే ఉన్నాను. అప్పుడు అదను చూసి శత్రు దాడి జరిగినట్టు అమ్మకు పక్ష వాతం అటాక్ చేసింది. ఆ దెబ్బతో ఒక కాలు ఒక చేయీ వంకర్లు పోయాయి. దానికి తోడు ఫేసియల్ పెరాలిసిస్ కూడా వచ్చి పడింది. మాట రాక మూతి అటు తిరిగి పోయింది. అప్పుడు గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్ళి అక్కడ అమ్మను అడ్మిట్ చేయడానికి నేను పడ్డ అవస్థ అంతా ఇంతా కాదు. నాన్నగారు గాని బ్రతికుంటే ఎంత బాగుణ్ణని ఒక్కసారి రెండు సార్లు కాదు, నూరు సార్లయినా అనుకుని బాధపడ్డాననుకో.
బాధలకు, వేదనలకు మానవ దు:ఖాలకు సాంత్వన చేకూర్చే నిలయాలుగా కనిపించే ప్రభు త్వ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది కంటే దళారులు ఎక్కువగా ఉంటారని; రోగుల బ్రతుకులతో అతలకుతులమయే వాళ్ళ బంధువుల అశ్రు కణాలతో నిర్దాక్షిణ్యంగా వ్యాపారం చేస్తారని ఆరోజే తెలుసుకున్నాను. తెలుసుకోవడమేమిటి? కళ్ళారా చూసాను.
ఎంత మంది డ్యూటీ ఆఫీసర్లను కాళ్లా వ్రేళ్లాపడి ప్రాధేయ పడ్డా అమ్మకు బెడ్ దొరకలేదన్నయ్యా! నీకు కబురు పంపాలంటే ఇంట్లో ఫోను లేదు. పబ్లిక్ బూత్ నుండి ప్రయత్నిస్తే నువ్వు బసచేసిన లాడ్జిలో నీ ఆచూకీ అందలేదు.
అప్పుడు నాకేమనిపించిందంటే— నిజం చెప్తున్నాను- నాకు ఎదురొచ్చే వారందర్నీ కుమ్మేయాలనిపించింది. అలా జరిగితే నేను వెళ్లబోయేది జైలేగా! అదే నయమనిపించింది. ఆ కష్ట సమయంలో నిస్సహాయంగా స్ట్రెచ్చర్ పైన పడున్న అమ్మను చూస్తూ నాకు తెలియకుండానే ఏడుస్తూ నిల్చున్నాను కాబోలు.
అప్పుడు నా బాధను చూడలేక అటు పోతూన్న తోటీ పని వాడు నా దగ్గరకు వచ్చి నన్ను ఓరగా తీసుకెళ్ళి చెప్పాడు- “నేను సెప్పానని ఓళ్ళకీ సెప్పబోకండి. తెలిస్తే ఏజెంట్లు నన్ను కుళ్ల బొడిచేత్తారు. ఏ జాగాకి ఎళ్లినా మీ తల్లి తాయికి నాయం జరగదు. అందరికీ అన్ని సైడునా కనెక్షన్ లు ఉన్నాయి; ఒకే ఒకరికి తప్ప- ఆ పెద్దబాబే- డాక్టర్ నరసింహులు గారు. ఎలాగో ఒకలా సరిది సెప్పి ఆయన డ్యూటీ ఆఫీసరుగా పన్చేస్తున్న నలభై రెండవ బ్లాకు లో సేర్పించిండి” అని చెప్పి వెళ్ళిపోయాడతను.
ఇక ఏమాత్రం జాప్యం చేయకుండా నేను రిసెప్షన్ కౌంటర్ వద్దన నిల్చున్న వాళ్ల వద్దకు వెళ్లి నా దగ్గరున్న చేతి ఎనీకర్ వాచీని ఇచ్చి వాళ్ల చేత ఆయన పేరు వ్రాయించకుని అమ్మను నలభై రెండవ బ్లాకులో చేర్పించాను. అమ్మ స్థితి విన్న ఆయన వెంటనే పరుగున వచ్చాడు.
“ఆలస్యం చేసినట్టున్నారే! అందులో స్త్రీకదూ- తట్టుకునే శక్తి ఉండదని తెలవద్దూ!” అని మందలించా రాయన.
అప్పుడాయనను ఎక్కడో ఎప్పుడో చూసినట్లనిపించింది గాని-- నీ క్లాసు మేటన్నది పోల్చుకోలేక పోయాను. అప్పుడు మొరపెట్టుకున్నాను- “నేను కొంచెం కూడా ఆలస్యం చేయలేదు సార్. సరైన సమయానికే తీసుకొచ్చాను. కాని--”
“అర్థమైంది—అర్థమైంది. ఇకచెప్పకండి” అంటూ వారించి అమ్మను స్వయంగా లోపలకు తీసుకెళ్లి ల్యాబ్ టెస్టులు గట్రా చేయిం చి, ఇంజక్షన్ లు ఇప్పించి, గ్లూకోస్ ట్యూబ్ తగిలించి— మరునాడు మరికొన్ని మెడికల్ టెస్టులు చేపించి- బిపీతో బాటు షుగర్ లె వల్ కూడా పెరిగిందని వివరించి- హిమో గ్లోబిన్ లెవల్ కూడా పల్చబడిందని చెప్పి- నన్ను నాదారిన విడిచిపెట్టకుండా నాతో బాటు స్వయంగా ఆస్పత్రి ఫార్ససీ వరకూ తీసుకెళ్లి వాళ్ల చేత ఏదీ లేదనిపించకుండా అన్ని మందులూ ఇప్పించాడు డాక్టర్ నరసింహులు.
ఆ తరవాత మరునాడు నన్ను వాళ్ల ఇంటికి పిలిపించి ధైర్యం చెప్పాడు- “నేను చెప్పేది విని డిస్టర్బ్ అవకండి. మీ తల్లిగారు అంత త్వరగా షేపుకి రావడం కుదరకపోవచ్చు. కాని ఒకటి- ఇప్పటికి ఏమీ ఢోకా ఉండదు. కొంచెం కొంచంగా తేరుకుంటుంది. నేనిచ్చిన మెడికల్ రిపోర్టు ప్రకారం ఆస్పత్రి ఫిజియో థెరపిస్ట్ రెగ్యులర్ గా ఫిజియో థెరపీ చేయిపిస్తాడు. ఫార్మసీలో మందులు తీసుకుని మీ తల్లిగారికి వేళకు మందులు ఇస్తుండు. ఆస్పత్రి ఫార్మసీలో ఏవైనా మందులు లేవంటే నా వద్దకు రండి. నేను చూసుకంటాను. మీరు అనవసరంగా వర్రీ ఔతూ మీ అమ్మగారిని వర్రీ చేయకండి. ఓకే! ” అంటూ వాళ్లమ్మను పిలిచి నాకు కాఫీ తెమ్మని చెప్పాడు.
ఆమెగారు అటు వంటగది వేపు వెళ్లగానే నేను ఇంట్లోనుంచి తీసుకెళ్లిన చిన్నపాటి నోట్ల కట్టను జేబులోనుంచి తీసి విన యంగా వంగి ఆయనకు అందించాను. ఆయన నివ్వెరపాటుతో చూసి ఆ తరవాత పక్కున నవ్వేసాడు. నవ్వేస్తూనే అన్నాడు- “నా గురించి విన్నారు. నన్ను చూసారు. నాతో ఆ రోజంతా గడిపారు. నా బాడీ లేంగ్వేజ్ చూసారు. మరి మీకింకా అనుమానమా నేను ఆ కోవకు చెందిన వాణ్ణి కానని గ్రహించడానికి! అందరిమాటా మనకెందుకు గాని, కనీసం వడ్డించే వాడి చేతులైనా శుభ్రంగా ఉండకపోతే ఎలా శ్రీలక్ష్మణ్?” అని అడిగారు.
అప్పుడు నేను తలవంచుకుని ఇబ్బందిగా నిల్చున్నప్పుడు నన్ను కూర్చోమని చెప్పి మళ్లీ ఇలా అన్నారు- “మీకు మరొక ముఖ్యమైన విషయం తెలియదేమో- అదీ చెప్తాను. అప్పట్లో మాలో చాలా మంది మెడికల్ స్టూడెంట్లు గొప్పగా చెప్తుంటారు. దానిని సగటు మనుషులు నమ్ముతుంటారు. అదేమంటే- మావన్నీ పెయిడ్ మెడికల్ సీట్లని- బోలెడంత డబ్బు లేబ్ టెస్టులకని, వివిధ లేబరోటరీలకని ఇతరత్రా అవసరాలకు ఖర్చుచేస్తుంటామని. కాని అది చాలా వరకు అవాస్తవం.
మేము వైద్యులమవడానికి ఫీజు రూపంలో ఖర్చుపెట్టినది- ప్రభుత్వం మాకోసం వెచ్చించిన దాంట్లో పదవ వంతుకూడా ఉండదు. మరి అదంతా ప్రజలసొమ్మే కదా! అలాంట్పపుడు మేము జీవితకాలమంతా ప్రజలకు ఋణపడి ఉండాలి కదా!”
నేను మరు పలుకు లేకుండా వెళ్ళి డాక్టర్ నరసింహులుగారు అన్నమాటను అమ్మకు చెపితే అమ్మ చలించిపోయిందిరా అన్నయ్యా! నన్ను గుడికి తీసుకెళ్లమని చెప్పి ఆయనకు ఆయురారోగ్యాలు చేకుర్చేలా జగదాంబ తల్లికి అర్చన చేయించింది” అని చెప్పడం ముగించాడు శ్రీలక్ష్మణ్.
అంతావిన్న శ్రీరామ్ కళ్లలో కన్నీరు మెరవడం చూసిన సుగాత్రమ్మ ఒక్క ఉదుటున భర్త ముఖాన్ని తన వేపు తిప్పుకుని తన చీర చెంగుతో నుదురు తుడిచింది. మరి- అటువంటి ఉదాత్తమైన ఆత్మీయత కోసమేగా- పెద్దల సమక్షాన సర్వసన్నధుడై తల్లి ఆశీర్వాదంతో అతను సుగాత్రమ్మకు మూడు ముళ్లు వేసి ఆమెతో ఏడడుగులు కలసి అగ్ని గుండం చుట్టూ ప్రదక్షిణం చేసిందీ-- అటు వంటి హృదయానుభూతి మాత్రమేగా-- శరీరసౌఖ్యానికీ- మానసిక బంధానికీ అతీతమైనది. చిరకాలం నిలిచేదీ--
చిన్నాయన చెప్పిన ఆ ఉదంతానిక రామ్ మోహన్ రాబర్ట్ కూడా ఉద్వేగానికి లోనయినట్టున్నాడు.
“డాడీ! డాక్టర్ నరసింహులుగారి క్యారెక్టర్ తలచుకుని బాబాయి చాలా మూవ్ ఐనట్టున్నారు. నరసింహమూర్తిగారి తండ్రి గారి ఫోటో ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టుకుందామా డాడీ?”
శ్రీరామ్ తలూపాడు కొడుకు నెత్తిపైన చేతినుంచుతూ. అప్పుడు కాస్తంత జంకుతూనే అంది సుగాత్రమ్మ- “మరీ నెగటివ్ గా ఆలోచిస్తున్నాననుకోక పోతే ఒకటంటాను--”
చెదరని చిర్నవ్వుతో తలూపాడు శ్రీరామ్.
“తండ్రేమో అప్పటి మనిషి- అందునా భూషణంగారి తమ్ముడు. మరి నరసింహమూర్తి ఈ కాలపు వ్యక్తేగా! ఆయనలాగే కొడుకుంటాడన్న గ్యారంటీ యేమిటి? మా అత్తయ్యగారు-- అంటుండేవారు కదా- కీడెంచి మేలెంచమని. కొంచెం దర్యాప్తు చేస్తే మంచిదే కదా! అంతేకాదు. ఎంతగా అత్తయ్యగారి పెంపకంలో పెరిగిన అమ్మాయైనా ఓర్పూ నేర్వూ ఉన్న అమ్మాయయినా అక్కడి పరిస్థితులతో జీవన విధాలతో సుజాత సర్దుకు పోగలదా లేదా- అన్నది కూడా తెలుసుకోవాలిగా!”
ఆ మాట విని శ్రీరామ్ సగం నవ్వ బోయి మరి సగం గంభీరత పులుముకున్న ముఖంతో అన్నాడు- “తల్లివి కాబట్టి నీ భయం నీకుంటుంది. దీనికి ఆక్షేపించవలసిందేమీ లేదు. కాని రెండు విషయాలు చెప్పాలి. మొదట ఇక్కడి బ్లూమింగ్ సామాజిక వాతావరణంలో పుట్టి పెరిగిన సుజాత ఒప్పుకోవాలి. ఇప్పుడిప్పుడేగా వాళ్ల పరిచయం ఆరంభమైంది. ఇక రెండవది- నరసింహమూర్తి నా నేస్తం భూషణం తమ్ముడి కొడుకు. ఇంకా చెప్పాలంటే భూషణానికి కొడుకే.
అతడు ఎప్పుడూ స్వార్థ చింతనతో ఏదీ చేయడు. ఏదీ చెప్పడు. కాబట్టి నేను నరసింహమూర్తి తరపున నేను మాటిస్తున్నాను. నీ కూతురు వాళ్లింట్లో క్షేమంగా మంగ ళకరంగా ఉంటుంది. మళ్ళీ అదే షరతు. సుజాతకు నచ్చితేనే-- చాలా! ఇక నన్ను ఆపకండి” అంటూ భార్య చేతినుండి సెల్ ఫోను అందుకుని రాజమండ్రికి కనెక్టు చేసాడు.
అటునుంచి భూషణం గొంతు వినిపించింది. ”నేను మాట్లాడుతున్నాన్రా భూషణం! మీ అబ్బాయి మాయింటి కొచ్చాడు. నా ప్రోద్బలంతోనే అమ్మాయిలిద్దరూ సూపర్ మార్కెట్ కాంప్లెక్సుకి తీసుకెళ్ళారు. ఒకరినొకరు చూసుకుంటే చాలదు. నోరు తెరచి మాట్లాడుకోవాలి కదా! అంతే కాదు- ఇక్కడ పుట్టి పెరిగిన సుజాతకు కూడా మీ అబ్బాయి గురించి కొంత తెలవాలి కదా! అందుకని వాళ్ళను అటు పంపించాను.
ఇకపోతే- మాకందరికీ నరసింహమూర్తి నచ్చాడు. అతడికి కూడా సుజాత నచ్చినట్లే తోస్తూంది. కాని సుజాత అభిప్రాయం ఇంకా తెలుసుకోలేదు. ఆ విషయం తేల్చుకోవడానికి సమయం పడ్తుంది”
భూషణం కాసేపాగి బదులిచ్చాడు- “ఔనవును. ఇద్దరూ ఈ కాలపు డేషింగ్ పర్సనాలిటీ గల వాళ్ళు కదా! అసలే అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయాయె-- స్వేఛ్ఛాయుతమైన సామాజిక వాతావరణంలో పుట్టి పెరిగిన అమ్మాయి. ఇక్కణ్ణించి వెళ్ళిన వాళ్ళే నడమంత్రపు సిరికి దాసులై అక్కడనుంచి మళ్ళీ తిరిగి రానని మారాం చేస్తున్నారు. ఇది పెళ్లి సంబంధం. నూరేళ్ళ పంట. కాబట్టి నిదానంగా ఆలోచించి ఆరాతీసి ముందడుగు వేయి.
ఇక్కడ కూడా నరసింహమూర్తికి రెండు మూడు సంబంధాలు వచ్చినట్టున్నాయి. ఆ విషయమై నాతో సంప్రదించడానికి మా తమ్ముడూ మరదలూ నన్ను పిలిచారు. నేనే ఇప్పటికిప్పడు హైద్రాబాదు రాలేనని దాట వేస్తున్నాను. నీ నుండి కబురందిన తరవాతనే నేను ముందుకు సాగుతాను”
“ఇంత వరకూ బాగానే చెప్పావు. కాని ఒకటి మాత్రం విను. తొందరపడి ఏ సంబంధమూ చూసేసి ఆఁ అనేయకు. అమ్మాయిని ఎలాగై నా ఒప్పించగలమన్న నమ్మకం మాకుంది”
“నాకూ ఆ నమ్మకం ఉంది. ఎంతైనా రఁవణమ్మగారి పెంపకం కదా. మరి సంబంధం కుదిరితే పెళ్ళి తిరుపతిలో జరిపిద్దామా? ”
“దానికేం? బ్రహ్మోత్సవాల్లా బ్రహ్మాండంగా జరిపిద్దాం. కాని ఒకటి- ఎంతైనా కన్న తల్లిదండ్రులు. వాళ్ళు కూడా ఓసారి అమ్మాయిని చూడటం మంచిది కదరా భూషణం! ”
“ఓ! అదాసంగతి! అన్నీ తెలుగు సాంప్రదాయాల ప్రకారంమే జరగాలంటావు. అదీ మంచిదే! ఎలాగూ విషయం ఇంతవరకూ వచ్చింది కాబట్టి, ఎటువంటి అపోహాలకు ఆస్కారం లేకుండా నిశ్చితార్థం మీరుంటూన్న నార్త్ కరోలినాలోనే జరిపిద్దాం. సరేనా!”
“చాలా థేంక్సురా! చాలా థేంక్సరా!” ముప్పిరి గొన్న సంతోషంతో శ్రీరామ్ గొంతు సరిగ్గా పెగల్లేదు. అప్పుడు అటునుంచి కచ్చిత మైన కంఠస్వరంతో పలుకులు వినిపించాయి- “నీకేమైందిరా రామూ! మూడో మనిషికి చెప్తున్నట్టు నాకు థేంక్స్ చెప్పడం దేనికి? ఎన్ని సార్లు కలసి తిరిగాం- యెన్ని సార్లు కలసి తిన్నాం- కలసి ఎన్ని సినిమాలు చూసాం- ఎప్పుడైనా ఒకరినొకరం థేంక్స్ చెప్పుకున్నామా యేంవిటి! ఇక చెప్పొస్తే సుజాత నాకు మాత్రం కూతురు కాదా? ”
శ్రీరామ్ కి కొన్ని క్షణాల వరకూ మాటలు కరువయాయి.
“సారీరా! ఏదో మతిమరుపున అనేసినట్టున్నాను. ఇక ఉంటాను. ఆరోగ్యం చూసుకో. మీ ఆవిణ్ణి అడిగానని చెప్పు” అంటూ అతడు సెల్ ఫోను ఆపుచేసాడు. విప్పారిన భర్త ముఖం చూసి సుగాత్రమ్మ వదనం కూడా నవ్వుతో వెలిగింది. భర్త భుజం పైన చేయి వేసి అతడి కళ్ళలోకి నవ్వుతూ చూసింది.
ఎన్ని సిరిసంపదలు—మరెన్ని సౌకర్యాలుంటే మాత్రం- అమెరికా సంబంధం కదానని ఎంతమంది ముందుకు వచ్చి క్యూలో నిల్చుంటే మాత్రం- కళ్ల ముంద అల్లారు ముద్దుగా పెరిగిన కన్నకూతురుకి అనువైన సంబంధం- అనువైన సమయానికి అంది రావద్దూ! పెళ్ళంటే మాటలా! నూరేళ్ళ పాటు ఉండాల్సిన వరి మడి కదూ!
మరి సుజాత ఏమంటుందో మరి! గ్లోబుల్ టీవీ సంస్థల వాళ్ళు ఒకటా రెండా- లెక్కలేనన్ని అడ్డమైన వార్తలన్నీ భారత దే శం గురించి మోసుకొచ్చి పడేస్తుంటాయి. అక్కడి స్త్రీలకు అంతగా స్వేఛ్ఛ లేదని- ఆడ పిల్లల పొడ అక్కడి వాళ్ళకు పడదని- అ దెక్కడో రెండు మూడు రాష్ట్రాలలో ఆడపిల్లలు జనాభా నిష్పత్తి బాగా పడిపోయిందని- అక్కడి అమ్మాయిలు స్కర్ట్సు గాని జీన్స్ గాని వేసుకుని అధునాతనంగా కనిపిస్తే కొందరు ఛాందసవాదులు క్లబ్బులనుండీ పబ్బులనుండీ తరిమ తరిమి కొడ్తారని ఒకటే రభస! అతి వాదంతో నిండిన ఈ వార్తల ప్రభావం తన తోడుకోడలు కూతురు మోహన పైన మరీ తీరుగా పడిందన్నది ఆమెకు తెలుసు.
భారతీయుల్నితెగడిస్తూ- అమెరికన్ల విశ్వవ్యాపిత సంస్కృతిని పొగిడేస్తూ రెండుమూడుసార్లు వ్యాఖ్యానం చేసింది కూడాను. దాని నోరు వరదనీరుతో హోరెత్తే కృష్ణాబ్యారేజి వంటిది. ఆపడం కష్టం. మరి ఆ ప్రభావం సహవాస దోషంలా సుజాతపైనా కొంత పడకుండా ఉంటుందా! ఇక్కడేమో-- సత్సంగం కంటే స్వేఛ్ఛా శృంగారం పేరిట సాగే సహజీవనానికే కదా ఎక్కువ ప్రాముఖ్యం!
ఇంతటి స్వేఛ్ఛా వాతావరణం నుండి అటు సాగాలంటే—భారీ చెట్టుని ఉన్నపళంగా లాగి మరొక చోట ట్రాన్స్ ప్లాంట్ చేయడం వంటిదే! అంతేకాక— కొన్ని సామాజిక వర్గాల వారు అమెరికాలో వ్రేళ్ళూనిన వారు కొందరు భారత దేశానికి వ్యతిరేకంగా పెయిడ్ న్యూస్ కూడా వివిధ మాధ్యమాలలో ప్రచురిస్తుంటారని ఆమె విన్నది.
ఇప్పుడు అటువంటి నకారాత్మక వార్తల ప్రభావం సుజాత పైన యెలా పని చేయనారంభిస్తుందో! ఎంతగా రఁవణమ్మగారి పెంపకంలో పెరిగినదయినా సుజాతకు స్వేఛ్ఛా ప్రియత్వం అలవడకుండా ఉంటుందా! ఏది యేమైతే మాత్రం—తను మాత్రం కూతురి పెండ్లి విషయంలో అడుగులు జాగ్రత్తగా వేస్తూ.. ఆగి ఆగి ఆలోచిస్తూ వెళ్ళవలసిందే!
=======================================================================
ఇంకా వుంది
తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - పార్ట్ 10 త్వరలో
========================================================================
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Comments