top of page
Writer's picturePandranki Subramani

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - ముందుమాట


#తరంగాలుతీరందాటితరలిపోతున్నప్పుడు, #TharangaluTheeramDatiTaralipothunnappudu, #PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

త్వరలో ప్రారంభం కాబోతున్న ధారావాహిక పరిచయం


Tharangalu Theeram Dati Taralipothunnappudu - New Telugu Web Series Introduction Written By - Pandranki Subramani 

తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు - తెలుగు ధారావాహిక - ముందుమాట

రచన : పాండ్రంకి సుబ్రమణి  

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)



జీవిత ప్రవాహానికి పలు వనరులు పలు రహదారులు. వాటి వెనుకనే పెక్కు మలుపులు. ఐతే— కొన్నాళ్ళుగా ఈ జీవిత ప్రవాహాలు; పరిస్థితుల ప్రభావం వల్ల పరిసరాల తాకిడి వల్ల ఊరుదాటి, నగర పొలిమేర దాటి, దేశ సరిహద్దులు సహితం దాటి ఊహించలేని మలుపుల్ని పెనవేసుకుని మానవ పరిమితుల్ని మించి కడువేగంతో సాగిపోతున్నాయి. 


మక్కికి మక్కీగా చెప్పాలంటే ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో పెరిగిన భౌతికావసరాల రీత్యా ఇలాజరగడం అనివార్యమేనేమో! కొందరు విజ్ఞులు ప్రాజ్ఞులు కాల ప్రవాహాల ప్రభావం వల్ల, పరిసరాల ఒరిపిడి వలన ధర్మాలు న్యాయాలు సహితం మారవచ్చంటారు. 


రాజమండ్రిలో పుట్టి పెరిగిన నరసింహమూర్తి మంచి స్థాయిలో ఇండియన్ ఎకనామిక్స్ సర్వీసులో ఉత్తీర్ణుడై కల్చరల్ ఎడ్యుకేషనల్ పరస్పర ఒప్పందం ప్రకారం మూడు నెలల ట్రైనింగ్ ప్రోగ్రాము కోసం అమెరికా వెళ్ళే అవకాశం లభిస్తుంది. నార్త్ కరోలినా సెంట్రల్ యూనివర్సిటీలో ట్రైనీలకు ట్రైనింగ్ ప్రోగ్రాము యేర్పాటు చేయబడుతుంది. అక్కడికి పలు ప్రాంతాలనుండి పలుదేశాల నుండి ట్రైనీ అభ్యర్థులు వస్తారు. నరసింహమూర్తికి అమెరికాకు వెళ్ళడం అది మొదటిసారి. కుటుంబానికి పెద్ద దిక్కు పెదతండ్రి భూషణంగారు తమ్ముడు డాక్టర్ నరసింహులు కొడుక్కి సర్పరైజ్ యిస్తాడు. నరసింహమూర్తి నిజంగానే ఆశ్చర్యపోతాడు విషయం విని. 


భూషణం గారి స్కూలు మేట్ శ్రీరామ్ నార్త్ కరోలినాలో ఉన్న న్యూజెర్సీలో ప్రముఖ వ్యాపారిగా కుటుంబ సమేతంగా స్థిరపడి ఆర్థిక సామాజిక హోదాతో జీవనం సాగిస్తాడు. అతడికి ఒక కూతురు- సుజాత. ఒక కొడుకు రామ్ మోహన్. అతడి భార్య సుగాత్రి. తమ్ముడు శ్రీలక్ష్మణ్- అతడి భార్య వైదేహి- కూతురు మోహన- అందరూ ఉమ్మడి కుటుంబంగా కలిసే ఉంటారు- నగరంలో ప్రముఖ వ్యాపార కుటుంబంగా పేరు తెచ్చుకుని-- పలు పండ్ల తోటలతో సుమారు రెండెకరాల స్థలంలో వాళ్ళిల్లు ఉంటుంది. 


ఐతే—సెంట్రల్ యూనివర్సిటీ ట్రైనీస్ హాస్టల్ లో దిగిన నరసింహమూర్తికి ఎదురుచూడని షాక్ ఢీకొడ్తుంది. అతడి పోర్షన్ రూమ్ మేటుగా ఒక పాకిస్థానీ అభ్యర్థి షేక్ అహ్మద్ తటస్థ పడతాడు. మనసులో తనలో తను తిట్టుకుంటాడు; మెరికన్ ప్రోగ్రామ్ ఆఫీసర్లకు భారతీయులకూ ఫాకిస్థానీయులకు మధ్య ఆపాటి వ్యత్యాసం తెలవద్దా అని. ఇలా తికిమక పడ్తున్నసమయంలో శ్రీరామ్ సోదురులు స్వయంగా వచ్చి నరసింహమూర్తిని వాళ్ళింటికి తీసుకు వెళతారు. అక్కడి ఆ యింటి వాతావరణం చూసి నరసింహ మూర్తి ఆనంద పడిపోతాడు. ఆశ్చర్యపోతాడు. 

అన్నదమ్ముల దివంగత తల్లి రఁవణమ్మగారి అజమాయిషీ వల్ల వాళ్ళు పాటించిన ఆచార ప్రభావాల వల్ల ఆ యింట్లో తెలుగుతనం ఉట్టి పడుతుంటుంది. అక్కడ అతడు ఇద్దరు అమ్మాయిల్ని చూస్తాడు. శ్రీరామ్ కూతురు సుజాత- శ్రీలక్ష్మణ్ కూతురు మోహన. ఇద్దరూ యవ్వనవతులే- అందగత్తెలే— అతడికి మాత్రం సుజాత దగ్గరవుతుంది. ఆకట్టుకుంటుంది. ఆమెలోని మంచీ మన్ననా ముఖ్యంగా ఆమెలోని సున్నిత స్వభావం గమనించి అతడు యిష్టపడతాడు. అటువంటి వ్యక్తిత్వం గల అమ్మాయి విద్యావేత్య అయిన తన తల్లి వర్థనమ్మకు నచ్చుతుందని తేల్చుకుంటాడు. 


ఇక విషయానికి వస్తే- అక్కయ్య సుజాతతో బాటు అమెరికాలోనే పుట్టి పెరిగిన మోహన అక్కడి అమెరికా సామాజిక సాంఘిక వాతావరణంతో మమేకమై పోతుంటుంది. తల్లి వైదేహి యెంత వారించినా ఆమె కూతురు మోహన లక్ష్యపెట్టకుండా అమెరికన్ అమ్మాయిలు యితర తెల్ల అమ్మాయిలతో నలుపు అమ్మాయిలతో చేరువవుతుంటుంది. తను అక్కడే పుట్టింది కాబట్టి. అక్కడే పెరిగి పెద్ద దయింది కాబట్టి వాళ్ళతో కలసి మెలసి వాళ్ళకు చేరువగా ఉండటంలో తప్పేమీ లేదంటుంది. నరసింహమూర్తి మోహన అభిమతంతో యేకీభవిస్తాడు. ఆమోదిస్తాడు. 

ఈ విషయంలో మోహన తల్లి వైదేహికి రెండు ఆక్షేపణలు- ఆమెకు కాబోయే అల్లుడు భారతీయుడే అయుండాలి. ఒకే రీతిన పూర్తిగా అమెరికన్ అమ్మాయిలు అబ్బాయిలతో మాత్రమే కాకుండా తోటి తెలుగు యిరుగు పొరుగులతో కూడా కలసి మెసలు తుండాలి. 


ఇక ట్రై నీ హాస్టల్ లోకి వెళ్ళి చూస్తే వయసుని బట్టో ఆలోచనా ధోరణిని బట్టో- ఇంకా పలు యితర మానసిక దృక్పథాలను బట్టి నరసింహమూర్తి, షేక్ అహ్మద్ క్రమ క్రమాన ఒకరికొకరు చేరువవుతారు. ఎంతగా అంటే, తన పాకిస్థానీ అభ్యర్థిని న్యూజెర్సీలో ఉంటూన్న శ్రీరామ్ వాళ్ళింటికి భోజనాలకు తీసుకెళ్ళేంత వరకు—


అక్కడ భాగ్యనగరంలో ఉన్న ఒక హైస్కూలులో నరసింహమూర్తి తల్లి(రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్) వర్థనమ్మకు అక్కడి హైస్కూలు లో స్టాఫ్ ఇన్ చార్జీగా ఉద్యోగంలో కుదురుతుంది. తండ్రి డాక్టర్ నరసింహులు ప్రైవేటు క్లీనిక్ ఆరంభిస్తాడు. అంతా కలిసి వచ్చేటట్లు కూతురు మాధవికి అదే గురజాడ హైస్కూలులో సీనియర్ టీచరుగా ఉద్యోగం దొరుకుతుంది. ఇక్కడే మాధవికి ముఖ్యమైన మలుపు యెదురవు తుంది. 


అక్కడ స్టాఫ్ గా పని చేస్తూన్న శంకరంతో ఆమెకు పరిచయం యేర్పడుతుంది. స్నేహంతో దగ్గరవుతుంది. శంకరం వెనుకబడిన కుటుంబానికి చెందిన వ్యక్తి. ఒకప్పుడు వాళ్ళది కటికాపరి కుటుంబం. కాని— ఇతడు భారతీయ విలువల్ని అలవర్చుకుని సంస్కారవంతుడుగా యెదుగుతాడు. ఇతడిలోని మంచీ మన్ననా సున్నిత ప్రవర్తనా మాధవినే కాక, ఆమె తల్లి వర్థనమ్మను కూడా ఆకట్టుకుంటాయి. 


అభ్యుదయ భావాలు గల వర్థనమ్మ భర్త డాక్టర్ నరసింహులుకి నచ్చచెప్పి వాళ్ళిద్దరి ప్రేమ వివాహానికి ఒప్పుకునేటట్టు చేస్తుంది. పసుపు కుంకుమ క్రింది కూతురుకి భార్యాభర్తలిద్దరూ కొత్త అపార్టుమెంటు కొనిస్తారు. దానిని అందుకుంటుంది గాని ఆ గృహంలోకి భర్త శంకరంతో ప్రవేశించదు. పెళ్ళి కాక ముందు శంకరానికి యిచ్చిన మాట ప్రకారం తను వాళ్ళుంటూన్న అదే వాడలో అత్తామామలతో కలసి ఉంటానని తీర్మానిస్తుంది. వాడలోని గుడి మేనేజ్మెంటులో ట్రస్టీగా బాధ్యతలు తీసుకుంటుంది. అక్కడి ఆడవాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకోనారంభిస్తుంది. 

నవలా రచనలో(తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు)కొన్ని చారిత్రాత్మక అంశాలు ప్రస్తావించడమైనది-- 


  1. ట్రైనింగు ప్రోగ్రాములో సహ అభ్యర్థి షేక్ అహ్మద్- నరసింహమూర్తికి మధ్య చోటు చేసుకున్న చర్చలలో ప్రస్తావించబడ్డ ఉదంతాలు. 

చాలావరకు యివన్నీ మనకు తెలిసిన అంశాలే—కాకపోతే—పాకిస్థానీ అభ్యర్థి షేక్ అహ్మద్ పాత్రకి శత్రుత్వానికి తావులేకుండా సకారాత్మక ఇమేజే యివ్వడానికి ప్రయత్నించాను. ఉదాహరణకి—ఇప్పటికీ పాకిస్థాన్ లో చాలామంది లతామంగేష్కర్ గారి పాటల్ని అభిమానంతో వింటుంటారు. (మహమ్మద్ రఫీ సంగతి సరేసరి) ఉగ్రవాద ప్రతికూల చర్యల వల్ల భారతదేశమే కాక- దానికి నెలవైన పాకిస్థాన్ లో కూడా అక్కడివారు యిక్కట్లకు లోనవుతున్నారన్నది ప్రస్తావించాను. 


2)అమెరికాకి భార్య సమేతంగా రెండు సార్లు వెళ్ళి రావడం వల్ల అక్కడ స్థిరపడ్డ కొన్ని తెలుగు కుటుంటాలతో రచయితకి పరిచయాలు పెరిగాయి. తెలుగు సంస్కృతి పట్ల- భాష పట్ల- తెలుగు వంటకాలు పట్ల వాళ్ళకున్న అభిమానాల గురించి యిష్టాల గురించి కూడా ప్రస్తావించడమైనది. అక్కడ వాళ్ళు జరుపుకునే కళాత్మక వారోత్సవాల గురించి కూడా క్లుప్తంగా వివరించాను. (వీటికి నేను స్వయంగా హాజరయాను కూడా-- )


3) ఇక మూడవది- ముఖ్యమైనది--- మొదటి ప్రపంచ యుధ్ధంలో, ఆ తరవాత రెండవ ప్రపంచ యుధ్ధంలో బ్రిటిష్ రాజ్ సైన్యంలో భాగంగా గోదావరి ప్రాంతం నుండి ఉత్తరాంధ్రం నుండి(అదే విధంగా బీహార్ నుండి బెంగాల్ నుండి కూడా)తెలుగు వారు యితర భారతీయులు బ్రిటిష్ సైన్యాధికారులు అజమాయిషీలో దేశం పొలిమేరలు దాటి విదేశాలలో యుధ్దం చేయడానికి వెళ్ళినట్టు నేను కొన్ని చరిత్రాత్మక శీర్షికలు చదివాను. అప్పుడక్కడి స్త్రీలు భారత సైనికుల శౌర్యానికి ఆకర్షితులై మోహితులై భారత సైనికులకు మానసికంగా శారీరకంగా చేరువయినట్టు కూడా చదివాను. ఇది మోతాదుకి మించకుండా ఒక రెస్టారెంటులో జరిగిన ఉదంతాన్ని ప్రస్తావించాను. (ఆసక్తికరంగా ఉండటానికి కాస్తంత కల్పితాన్ని జోడించి)


చివరిగా ఒక మాట. చాలానాళ్ళుగా నాలో గూడుకట్టుకున్న అపోహను తొలగించుకోగలిగాను, అమెరికన్లు(తెల్లవారు- నల్ల వారు)సున్నితమైన ప్రవర్తన గలవారు. అందరూ కాకపోయినా చాలామంది అమెరికన్లు మంచీ మన్నను పాటిస్తారు. జనస్సమ్మర్థం గల ప్రదేశాలలో మించిపోవాలని తోసుకుంటూ ఒరసుకుంటూ పోరు. పాదాచారులు యెప్పుడైనా అడ్డంగా వస్తే ఖంగు ఖంగున హారన్ మోగించరు. ఆగి(కారులో) దారిచ్చి నిదానంగా ముందుకు సాగిపోతారు. వాళ్ళ దైనందిన జీవన ప్రవాహంలో ఆనందం ప్రస్ఫుటించడానికి ఇదీ ఒక కారణమేమో! 

ఇంకా చెప్పాలంటే అంగళ్ళ వద్ద గాని సూపర్ మార్కెట్టులో గాని అక్కడి వాళ్ళతో మాట్లాడితే అదోవిధమైన ఆనందం కలుగుతుంది. అటు యిటూ యెటు చూసినా అమెరికన్ సాఘిక సామాజిక జీవన ప్రవాహంలో యూదుల ఉనికి యెక్కువగానే ఉన్నట్టు తోస్తుంది. చివరి మాట- ఈ నవలా రచనను మనసు పెట్టి వ్రాసాను. అచ్చు తప్పులు రాకుండా సాధ్యమైనంత మేర జాగ్రత్త తీసుకున్నాను, నాకిష్టమైన తిక్కన సోమయాజులు గారి నీతి సూత్రాన్ని మనసున పదిల పర్చుకుని రాసాను. 


ఒరులేయవి యొనరించిన 

నరవర! అప్రియమ్ము తన మనంబునకగు తా

నొరులకు అవి సేయకునికి

పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్—


చివరిమాటగా కన్ ఫ్యూషియస్ నుడివిన దివ్యమైన పలుకుని గుర్తు చేసుకుంటూ భవదీయుడు వివరణను ముగిస్తాడు—


“నిరంతరం నేర్చుకోవాలి. తరచూ ప్రశ్నించాలి. జాగ్రత్తగా విశ్లేషించాలి. అప్పుడు అలా నేర్చుకున్నదానిని తెలివిగా ఆచరణలో పెట్టాలి. ప్రశ్నించని వ్యక్తి జీవిత కాలం తెలివి తక్కువ వాడిగానే ఉండిపోతాడు"


 -- పాండ్రంకి సుబ్రమణి



50 views0 comments

コメント


bottom of page