top of page

తాతగారి గొడుగు

#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #ThathaGariGodugu, #తాతగారిగొడుగు, #TeluguKathalu, #తెలుగుకథలు


Thatha Gari Godugu - New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 12/12/2024

తాతగారి గొడుగు - తెలుగు కథ

రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



బయట చిన్నగా చినుకులు పడుతున్నాయి. 

డాక్టర్ వికాస్ ముఖం వికసించింది. 

'దేవుడు నా మొర ఆలకించాడు. తాతగారి గొడుగు వేసుకొని బయటకు వెళ్లే అవకాశం వచ్చింది..' అనుకుంటూ గొడుగు అందుకొని బయటకు వచ్చాడు వికాస్. 


ఆ గొడుగు కర్రకు వెండితో తాపడం చేశారు. చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఆ గొడుగు. జమీందారు అయిన తాత రఘుపతి గారు వాడిన ఆ గొడుగు వేసుకొని ఊరంతా తిరగాలని, అమెరికా నుండి వచ్చిన వికాస్ కు ఆశ. 


వాచ్ మాన్ రంగయ్య పరుగున వచ్చి "ఏం కావాలి చినబాబుగారూ! వర్షం పెద్దదయేలాగా ఉంది. కావలసింది ఏమిటో చెబితే నేను వెళ్లి తెస్తాను" అన్నాడు. 


తన తాత గారి కాలంనుండి పని చేస్తున్న రంగయ్య అంటే చాలా గౌరవం వికాస్ కు. కానీ తాతగారి గొడుగేసుకొని వానలో తిరగాలన్న తన కోరికకు అడ్డు వస్తున్నాడని, కాస్త కోపం వచ్చింది. 


అయినా తమాయించుకొని, "పరవాలేదులే రంగయ్య తాతా! సరదాగా వానలో తిరగాలనుంది" అన్నాడు. 


"లా అయితే వేరే మంచి గొడుగు ఇస్తాను. అది తీసుకొని వెళ్ళండి" అన్నాడు రంగయ్య. 


"అలా కాదులే.. తాతగారి గొడుగు వేసుకొని తిరగాలని ఆశ. అడ్డు చెప్పకు" అంటూ ఆ గొడుగు వేసుకొని బయటకు నడిచాడు వికాస్. 


***

చిన్నప్పుడే తలిదండ్రులతో అమెరికా వెళ్ళాడు వికాస్. పేరెంట్స్ ఇద్దరూ డాక్టర్స్ కావడంతో తనకు కూడా ఆ వృత్తి పట్ల ఆసక్తి కలిగింది. అక్కడే మెడిసన్ పూర్తి చేశాడు. 


అతనికి ఇండియా వచ్చి స్వంత వూళ్ళో హాస్పిటల్ కట్టించి ప్రజలకు సేవ చెయ్యాలన్న ఆశ ఉంది. విదేశీ డిగ్రీతో ఇక్కడ ప్రాక్టీస్ చెయ్యాలంటే ‘ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ పరీక్ష’ పాస్ కావాలి. 


అందుకోసం ఇండియా వచ్చినప్పుడు, తాతగారిని కలిశాడు వికాస్. యన అప్పటికే అవసాన దశలో ఉన్నాడు. 


మనవడిని చూసి కన్నీళ్లు పెట్టుకుని, "మీ నాన్న అమెరికా మోజుతో నన్ను వదిలి పెట్టాడు. కానీ నువ్వు అమెరికా వదిలి ఇక్కడ ప్రాక్టీస్ పెట్టాలని వచ్చావు. చాలా సంతోషం" అన్నాడు రఘుపతి. 


మనవడి చేత తన కొడుక్కి ఫోన్ చేయించి, "నీ కొడుకు ఇక్కడ ఉండగానే నాకేదైనా అయితే వాడే నాకు కొరివి పెడతాడు. నువ్వు రావడానికి వీల్లేదు" అని కటువుగా చెప్పాడు. 


అన్నట్లుగానే మరో రెండు రోజుల్లో యన కాలం చేశాడు. శవాన్ని అంతిమ సంస్కారానికి తీసుకొని వెళ్ళేటప్పుడు రంగయ్య ఈ గొడుగు తీసుకొని వచ్చి, "తాతగారికి చాలా ఇష్టమైన గొడుగు బాబూ ఇది. దీన్ని కూడా ఆయనతో పాటు దహనం చేసేయండి" అన్నాడు. 


"ఒద్దులే. తాతయ్య గుర్తుగా నేను వాడుతాను" అన్నాడు వికాస్. 


తరువాత అమెరికా వెళ్లిపోయాడతను. 

ఆరునెలలు గడిచాక తను రాసిన పరీక్ష పాసవడంతో, తండ్రి అనుమతితో స్వంత ఊర్లో ప్రాక్టీస్ పెట్టడానికి ఇండియా వచ్చేశాడు. 


***


తాతగారి గొడుగుతో బయటకు నడిచిన వికాస్, రోడ్ లో అందరూ తనని గౌరవంగా చూడటం గమనించాడు. కొంతమంది తనని చూసి పక్కకు తప్పుకుంటున్నారు. మరికొందరు రెండుచేతులూ జోడించి నమస్కరిస్తున్నారు. 


"మా ఇంట్లోకి రండి బాబుగారూ! వాన వెలిశాక వెళ్లొచ్చు" అని ఒక పెద్దావిడ వినయంగా అడిగింది. 


ఒకరిద్దరు, గొడుగు మేము పట్టుకుంటామని అడిగినా, వికాస్ సున్నితంగా తిరస్కరించాడు. అతనికి ఈ గౌరవం కొత్తగా, కాస్త థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది. 


'అంతా తాతగారి మహిమ.. కాదు కాదు.. యన గొడుగు మహిమ' అని మనసులో అనుకున్నాడు వికాస్. 


అలా కాసేపు నాలుగు రోడ్లూ తిరిగి ఇంటికి చేరుకున్నాడు వికాస్. ఇంటి బయటే ఎదురు చూస్తున్న రంగయ్య, గొడుగు అందుకొని పక్కన పెట్టాడు. పొడి టవల్ తెచ్చి వికాస్ తల తుడవబోయాడు. వికాస్ అతన్ని వారించి, టవల్ అందుకున్నాడు. 


"మొత్తానికి ఊర్లో తాతగారికే కాదు, యన గొడుక్కి కూడా విలువ ఉందన్నమాట!" అన్నాడు తల తుడుచుకుంటూ.. 


రంగయ్య సమాధానం ఇవ్వలేదు. 


"నీకెందుకో తాతగారి గొడుగంటే ఇష్టమున్నట్లు లేదు" అన్నాడు వికాస్, రంగయ్య ముఖంలోకి చూస్తూ. 


రంగయ్య ఏదో చెప్పబోయి, ఆగాడు. సమాధానం ఇవ్వలేదు. 


"మాట్లాడవేం? ఏదైనా చెప్పడానికి తటపటాయిస్తున్నావా?" రెట్టించాడు వికాస్. 


"అయ్యా! ఇలా చెబుతున్నందుకు మరోలా అనుకోకండి. జమీందారు గారు చాలా గొప్ప వ్యక్తి అనీ, మీ నాన్నగారు ఆయన్ని వదిలి వెళ్ళిపోయి తప్పు చేశారనీ మీరు అనుకుంటున్నట్లు ఉన్నారు. మీ తాతగారికి లేని వ్యసనం లేదు. ఉన్న వ్యసనాలకు తోడు డబ్బు పిచ్చి, అహంకారం కూడా చాలా ఎక్కువ. మీ నాన్నగారికి మరో జమీందారు కూతురితో పెళ్లి చేయాలనుకున్నాడు యన. 


చెన్నైలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్న మీ నాన్నగారు, తనతో కలిసి పనిచేస్తున్న మీ అమ్మగారిని చేసుకోవాలనుకున్నారు. వాళ్ళు ఆస్తిపరులు కాకపోవడంతో మీ నాన్నగారు ఒప్పుకోలేదు. ఆమెను పెళ్లి చేసుకుంటే ఆస్తి దక్కదని బెదిరించారు మీ తాతగారు. కోట్ల విలువ చేసే జమీందారీ ఆస్తులను, హోదాను వదులుకొని వెళ్లిపోయారు మీ నాన్నగారు. తరువాత అవకాశం రావడంతో అమెరికా వెళ్లిపోయారు. ఇవన్నీ మీకు చెప్పకపోవడం వాళ్ళ సంస్కారం బాబూ!" గతం గుర్తుకు తెచ్చుకుంటూ చెప్పాడు రంగయ్య. 


"నిజంగా ఇవేవీ చెప్పలేదు నా పేరెంట్స్. ఏదో చిన్న మాట పట్టింపు తో వచ్చేశామని చెప్పేవారు" అన్నాడు వికాస్ తన తండ్రిని అపార్థం చేసుకున్నందుకు బాధ పడుతూ. 


అంతలో ఏదో గుర్తుకొచ్చినట్లు, "అది సరేగానీ ఆ గొడుగు ఏం పాపం చేసింది.. దాన్ని వాడొద్దన్నావు?" అని అడిగాడు. 


కాస్త తటపటాయింపు తరువాత ఇలా చెప్పాడు రంగయ్య. 


"మరణించిన మనిషి గురించి తప్పు చెప్పకూడదు. అయినా మీకు తెలియాలి కాబట్టి చెబుతాను. ఈ వీధి చివర ఒక చిన్న మిద్దె ఇల్లు ఉంది. అందులో 'చింతామణి' అని ఒకావిడ ఉండేది. తాతగారు తరచుగా ఆ ఇంటికి వెళ్లేవారు. 


మామూలుగా ఎండైనా, వానైనా ఎప్పుడూ యన వెంట గొడుగు పట్టుకుని వెళ్లే వాడిని. కానీ చింతామణి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయనే స్వయంగా గొడుగు వేసుకొని వెళ్లేవారు. ఆ చింతామణి కోసం ఊర్లో మరి కొందరు పెద్దమనుషులు కూడా వచ్చేవారు. జమీందారుగారు వచ్చినప్పుడు వేరేవాళ్లు వస్తే యన కోపగించుకుంటారని, యన వచ్చిన గుర్తుగా ఈ గొడుగును వసారాలో తగిలించి ఉంచేది చింతామణి. వెండి తాపడం చేసిన గొడుగు కర్రను చూసినవారు జమీందారుగారు లోపల ఉన్నట్లు గ్రహించి, అటునుంచి ఆటే వెళ్ళిపోయేవారు. 


'చింతామణి ఇంటి వసారాలో గొడుగు తగిలించడం' అనే మాట అప్పట్లో ఆనవాయితీ అయిపొయింది. మగవాళ్ళు గొడుగుతో బయటకు వెళ్తుంటే 'ఏ చూరులో తగిలించడానికి వెళ్తున్నావ్' అని ఆడవాళ్లు సరదాగా అడిగేవారు"


రంగయ్య చెప్పడం ముగించేసరికి నవ్వాగలేదు వికాస్ కు. 


ఈ గొడుగు వేసుకుని తను గొప్పగా ఫీలైనందుకు సిగ్గుపడ్డాడు. 


ఇంతలో ఓ పదిమంది ఊరివాళ్ళు ఆ భవనం ముందుకు వచ్చి నిలుచున్నారు. వారిని లోపలి రమ్మన్నాడు వికాస్. 


వారిలో ఓ నడివయసు వ్యక్తి వికాస్ తో "బాబూ! అమెరికా వదిలి ఈ ఊరిలో హాస్పిటల్ కట్టించాలని వచ్చారు. మీకు చాలా రుణపడి ఉంటాం. హై స్కూల్ లో నేను మీ నాన్నగారి క్లాస్ మేట్ ను. యన చాలా మంచి వ్యక్తి. తాతగారితో మనస్పర్థలు లేకుంటే ఆయనే ఇక్కడ హాస్పిటల్ కట్టించేవారు. మీవన్నీ యన పోలికలే. 


ఇక మేము వచ్చిన విషయం ఏమిటంటే ఊరి మధ్యలో మీ తాతగారి శిలావిగ్రహం ఉంది. కారణాలేమైనా ఎవరూ పట్టించుకోక పోవడంతో అది శిధిలావస్థలో ఉంది. మీపైన గౌరవంతో ఆ విగ్రహాన్ని బాగు చేయిచాలనుకుంటున్నాం. చుట్టూ దిమ్మ కట్టించి పెయింటింగ్ వేయిస్తాం.  మరమ్మతులు జరిగాక మీ చేత ప్రారంభోత్సవం చేయిస్తాము. ఇక మాకు సెలవు ఇప్పించండి" అని చెప్పాడు. 


అందరూ మరోసారి వికాస్ ను అభినందించి వెళ్లారు. 


"చూసారా వికాస్ బాబుగారూ! వచ్చి రెండు రోజులు కాకుండానే మీకు ఎంత గౌరవం వచ్చిందో.. కులం వల్లో వంశం వల్లో ఒక మనిషికి విలువ రాదు. మనిషి వల్లే ఆ కులానికి వంశానికీ విలువ వస్తుంది. మీ పుణ్యాన తాతగారి విగ్రహానికి గౌరవం వస్తోంది. చాలా సంతోషం" అన్నాడు రంగయ్య. 


పక్కన గోడకు ఆనించి ఉన్న గొడుగువంక చూసిన వికాస్ ‘ఈ సారి భోగి మంటల్లో ఈ గొడుగు మర్చిపోకుండా వెయ్యాలి. దీని అవసరం మా వంశంలో ఉండకూడదు’ అనుకున్నాడు. 


శుభం 


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము.

 (అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).









203 views0 comments

Comments


bottom of page