'The Trap Episode 18' New Telugu Web Series
Written By Pandranki Subramani
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
గత ఎపిసోడ్ లో
పుట్టిన రోజు సందర్భంగా ఆమె దగ్గరకు వెళతారు పరమేశ్వర్, కమలం.
వినోదినిని కూడా తమతో తీసుకొని వెళతారు.
కమలాన్ని రాముకి పరిచయం చేస్తాడు భువనేశ్.
వినోదినిని గుడికి తీసుకొని వెడతాడు పరమేశ్వర్.
ఇక ది ట్రాప్. . 18 వ భాగం చదవండి…
మరి కాసేపటికి దేవీ అర్చన ముగిసింది. ఇద్దరూ కలసి అందించిన మాల దేవి విగ్రహాన్ని అలంకరించింది. ఇద్దరూ గర్భ గుడి చుట్టూ ముమ్మార్లు ప్రదిక్షణ చేసి ఆనవాయితీ ప్రకారం ఇద్దరూ వెంటనే అక్కణ్ణించి కదలకుండా గుడి మెట్ల చప్టా పైన కూర్చున్నారు. అప్పుడతను చేతిలోని కుంకుమ ఆమెకు అందించాడు.
ఆమె యేమీ అనకుండా కుంకుమ అందుకుంటూ-“ఇటు జరగండి—“ అంటూ కుంకుమ తీసి అతడి నుదట పెట్టింది-అరమోడ్పు కళ్ళతో స్వీకరిస్తూ-“థేంక్స్”అన్నాడు.
చప్పున స్పందించిందామె-“ఇదెక్కడి ఫార్మాలిటీ పరమేశ్వర్! దీనికి కూడా థేంక్స్ చెప్తారేమిటి?”
“జస్ట్ లైక్ దట్—చెప్పాలనిపించింది అంతే! ”
దెన్-ఇటీజ్ ఓకే-అంటూ వినోదిని లేవబోయింది. అప్పుడతను ఆమెను ఆపాడు. “ఆగు! గుడి మెట్లు యేక్కేముందు చెప్పావుగా నాకు చెప్పడానికి ఇంకేదో మిగిలుందని. చెప్పి వెళ్లు. ఇప్పుడింటికి వెళితే అక్కడ ఒకటే రగలగా ఉంటుంది. వదిన పుట్టిన రోజు సంబరాలు ఆరంభమయి ఉంటాయి. ”
ఔనంటూ ఆమె తలూపుతూ గుడి చప్టా పైనుండి లేవకుండా కూర్చుండిపోయింది. అలా రివ్వున కూర్చున్నప్పుడు ఆమె మెడ నుండి చీర కుచ్చెళ్ళ మడతల నుండి తెరల్లా లేచిన కమ్మటి సువాసనలు అతణ్ణి తాకాయి. అది ఉన్నపాటున చెప్పాలనిపించింది గాని;ఆగిపోయాడు. సిక్స్త్ సెన్సె పనిచేసినట్లుంది. ఇదికాదు దానికి సమయం! “ఇక నేను చెప్పేదా పరమేశ్వర్?”
ఉఁ-అన్నాడతను. “నన్ను మీ యింటికి కోడలు పిల్లగా నాన్న పంపాలని అనుకోవడాని కి మీ నాన్నకూ మానాన్నకూ మధ్య అలనాడు అలరించిన చిన్ననాటి స్నేహం కారణం కావచ్చు... ”
అతడు స్పందించాడు- “చాలా వరకు అదే కదా అసలు కారణం—“
“చాలా వరకు కారణం అదే అన్నావు చూడూ—అది సబబే--కాని అది అసలు కారణం కాదు. ”
మరి? అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసాడతను.
“కనిపించీ కనిపించని పొగ మంచువంటిది. మీ కుటుంబం పట్ల మా డాడీకి ఉన్న గౌరవ భావం. లేకపోతే—ఎంతగా బాల్య నేస్తం అలరారుతున్నా కన్న కూతుర్ని-క్వాలిఫికేషన్స్ మెండుగా ఉన్న కూతుర్ని ఫార్మా కంపెనీలో యెంతో యెత్తుకి యెదగవలసిన కూతుర్ని అలా యెత్తి ఇలా మీ యింట్లో పడేస్తాడా డాడీ! అందులో నాకోసం రెండు మూడు సంబంధాలు అప్పటికే యింటి వాకిట నిల్చున్నాయిగా---“
అంటే—అన్నట్టు పరమేశ్వర్ మరొకసారి వినోదిని వేపు చురుగ్గా చూపు సారించాడు.
“అంటే—డాడీ ఇప్పటి రోజు గురించి కాదు ఆలోచించేది. రేపు కూతురు మనుగడ యెలా ఉంటుందనే తలస్తున్నాడు. సరే—యిప్పుడు సూటిగానే తేట తెల్లం చేస్తాను. విశ్వం బాబాయిగారు సువర్చల పిన్నిగారు మీ యింట్లోనున్న అందరికన్నా యెక్కువ స్థాయినున్న విద్యావంతులు. వాళ్ళెందుకు మామూలు కిరాణా షాపు మర్చంట్ గా ఉంటూన్న మీ అన్నయ్య కామేశ్వరరావుకి తన కూతురు వసంతను యివ్వడానికి ఉబలాట పడుతున్నారు? దీనికి నేనే సమాధానం చెప్తాను. మీ యింట్లో అలరారుతూన్న కుటుంబ విలువల్ని చూసే—నిజానికి మీ నివాసం స్వర్గ వాసం కాకపోవచ్చు. కాని—కచ్చితంగా మెట్టింటికి వచ్చే ఆడపిల్లలకు నరకలోకం మాత్రం కానేరదన్న నమ్మకం—ఇప్పటి ఆధునిక సామాజిక పరిస్థితిలో వేగవంతమైన మనో లోకంలో ఆడపిల్లను కన్నవారికి అటువంటి నమ్మకం చాలా ముఖ్యం”
అతడు మౌనంగా ఉండిపోయాడు, పైనున్న జేగంటను అందుకుని మ్రోగించడానికి యాతన పడుతూన్న ఇద్దరు చిన్నబ్బాయిలను అటుపో తూన్న ఓ భక్తుడు అమాంతం యెత్తుకుని ఇద్దరికీ జేగంట అందేలా అందించాడు. కుర్రాళ్ళిద్దరూ బహు ఉషారుగా గంట మ్రోగించి వాళ్ళకోసం యెదురు చూస్తూన్న అమ్మానాన్నల వద్దకు తుర్రుమన్నారు. కుర్రాళ్ళు—తెలియని తనంతో తిరిగే చిన్న కుర్ఱాళ్ళు. అందుకే—ఎత్తుకుని జేగంటను అందించిన ఆ పెద్ద మనిషికి థేంక్స్ చెప్పాలన్న ధ్యాసలేకుండా పరుగెత్తారు. అప్పుడు వినోదిని గొంతువిని చిన్నపాటి ఉలికిపాటుతో తలతిప్పి చూసాడతను.
“అదేమిటి అంత సేపు అంత దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయారు?”
“మరేం లేదు. మా కుటుంబానికి యిరుగు పొరుగున అంతటి గౌరవం ఉందా అని—అమ్మాయిల తరపున లాంఛనాలు చేయడానికి—సంప్రదాయ బధ్ధంగా యివ్వాల్సిన వరకట్నాల ఖర్చులు తగ్గించుకోవడానికే చాలా మంది అమ్మాయిల్ని మా యింటి అబ్బాయిలకు అంటగట్టడానికి వస్తున్నారా అని అబ్బుర పడతుండేవాణ్ణి. అది మరీ ర్యాష్ ఫీలింగేమో--”
“కట్నాలు కానుకలు యివ్వడమూ యివ్వలేక పోవడమూ కాదు అసలు మేటర్. మీ నాన్నగారికీ మీ తాతయ్యగారికీ అసలటు వంటి వ్యవహారాలు ససేమిరా నచ్చవన్నది మా డాడీకి తెలుసు. విశ్వం బాబాయి గారికీ తెలుసు. మీ కుటుంబమే కాదు—ఎక్కడి కుటుంబమైనా నిరాడంబరంగా అత్యాశలకు పోకుండా నిండు గా ఒడుపుగా మనుగడ చేస్తుంటే సంస్కారవంతులైన వారెవరికైనా నమ్మకమూ గౌరవమే కదా ఉంటుంది. ఇక నా విషయానికి వస్తాను. మరి కాసేపు ఓపిక తెచ్చుకుని వింటారా! ”
“అదేం మాట?నేనిప్పుడిక్కడ కూర్చున్నది వినడానికేగా! ”
“సరే చెప్తాను. నేను ముందే చెప్పినట్టు మీ యింటికి నేనుగా రాలేదు. మాఁవగారు డాడీతో మాట్లాడి నన్నుమీ యింట్లో కొన్నాళ్లు ఉండి వెళ్ళమని పిలిచిన తరవాతనే వచ్చాను. ఇక్కడకు వచ్చిన తరవాత యేమనిపించిం దో తెలుసా! నా పట్ల మీరు యెడ తెరపి లేకుండా చూపిస్తూన్న ముభావాన్ని పంటి బిగువన భరిస్తూనే అనుకున్నాను-నేను గాని మాఁవగారి పిలుపందుకుని రాకుండా ఉండిపోతే నేను చాలా మిస్సయి ఉండేదానిని. మీరు తప్ప యింట్లోని పెద్దలూ చిన్నలు అందరూ యెంత కళ కళగా స్వఛ్ఛంగా ఉంటారని—ఆ సరదాలో ఆ వాత్సల్య వాతావరణంలో నేనెంత త్వరగా అత్తగారి నుండి కొత్త వంటలు నేర్చుకున్నానని“ అప్పుడతను చప్పున సారీ అన్నాడు.
“సారీ ఎందుకు?“ఆమె విస్ఫారిత నేత్రాలతో చూస్తూ అడిగింది,
“నేను అవధికి మంచి ఓవర్ గా నిటించానేమోనని! ”
“పాయింటుకు వచ్చారు కాబట్టి నేనిప్పుడు ఫ్రాంక్ గా ఒకటి చెప్తాను! నమ్ముతారా?” ఆసక్తిగా చూస్తూ తలూపాడతను. “చాలా మందిలా కలవారింటి అమ్మా యి కదానని అంగలార్చుకుంటూ నా వెంటబడకుండా మాయింటి చుట్టూ తిరగకుండా నీ హుందాతనం నువ్వు కాపాడుకున్నందుకు. నీయందు అభిమానమే కాదు—“ అని చటుక్కున ఆగిపోయిందామె.
అతడూరుకో లేదు--“నాయందు అభిమానమే కాక—“ ఆమె ముఖం తిప్పుకుంది.
“ఊ హుఁ నేనిప్పుడు చెప్పను. ”
అతడు విడిచిపెట్ట దలచలేదు-“కాదు—ఇప్పుడే ఇక్కడే చెప్పాలి. గర్భగుడి ముందు చెప్పాలి”
“నువ్వు మరీ మంకుతనంతో అడుగుతున్నావు కాబట్టి చెప్తాను. నాకు మరింత దగ్గరగా జరగండి”
అతడలాగే ఆమె చెప్పినట్టే ఆమె ముఖం వద్దకు వంగాడు. “ఇష్టం! ” అని చెప్తూనే వెన్వెంటనే అడిగింది-“మరి మీకు?”
“ఈరోజే నాకు మొదటి సారి నువ్వంటే యిష్టం-చాలా యిష్టం కలిగింది. ఇంతటి మోడ్రన్ ఔటులుక్ గల అమ్మాయి మోడ్రన్ లైఫ్ స్టయిల్ గల అమ్మాయి ఇంత లోతుగా నిష్పాక్షికంగా ఆలోచించగలదని నేనెన్నడూ ఊహించలేదు”
“నిజంగా! ”అని చిలిపిగా చూస్తూ లేచి నిల్చుని అతడికి చేయి అందించింది. అతడామె చేతిని అందిపుచ్చు కుంటూనే ఆమె నడుం చుట్టూ చేతులు వేసాడు. ఆమె నవ్వుతూ నిల్చుందే గాని, అతడి చేతుల్ని తొలగించలేదు.
ప్రభావతి పుట్టిన రోజు అనుకున్న ప్రకారం అదే రోజు సాయంత్రం హోటెల్ లో సందడిగా సంబరంగా జరిగింది. నలుగురు చేరితేనే కదా నవ్వులు పుడ్తాయి. నవ్వులు పుష్పిస్తేనే కదా కిలకిలారవాలు గానం చేస్తాయి. అలా గానం చేస్తేనే కదా జీవన సారానికి నాద స్వరం తోడవుతుంది—
అందరూ వాళ్ళ యిండ్లకు ప్రయాణమై వెళ్ళిపోయిన తరవాత-రాము కూడా తన హోటెల్ రూము చేరుకున్న తరవాత, వరూధిని మాత్రం కూతురుతో బాటు మిగిలిపోయింది. మందాకిని అలసటతో భువనేశ్ ని ఆనుకుని కూర్చుంది. అప్పుడు ప్రభావతి వదూధినికి యెదురుగా సోఫాలో కూర్చుంటూ అంది—“ అలసినట్లు కనిపిస్తున్నావు. మీ కారుని యింటి వరకూ డ్రైవ్ చేయమని భువనేశ్ ని అడిగేదా?”
వరూధిని తల అడ్డంగా ఆడిస్తూ బదులిచ్చింది-“లేదు. నేనూ మందాకినీ ఇక్కడే ఉండిపోతాం. అలసట వల్ల కాదు. నీకొక మంచి న్యూస్ చెప్పడానికి—“ ప్రభావతి కనురెప్పలల్లార్చింది-“గుడ్ న్యూస్ నాకా! నాపుట్టిన రోజుతో బాటు ఇప్పుడు మరొక గుడ్ న్యూసా?ఉక్కిరి బిక్కిరయేటట్లున్నాను. క్విక్-త్వరగా చెప్పి నా ఆనందాన్ని ఇనుమడింప చేయి—“
“ మరీ ఎగ్జాయిట్ ఐపోకు ప్రభా! కుదుటగా చెప్పనియ్యి-- “అంటూ పనిగత్తె అందించిన ఆరెంజ్ జ్యూస్ గ్లాసు అందుకుంది. అందరూ జ్యూస్ గ్లాసులు అందుకున్న తరవాత వరూధిని నవ్వూతూ చూసింది-“గుడ్ న్యూస్ నీకే కాదు. మీ వారికి కూడా—ఆఫీసు పైనా కట్టడం చుట్టు ప్రక్కలా కరెంట్ బిల్లు తగ్గించుకోవడానికి సోలార్ ప్లాంటు ఇన్ స్టాల్ చేయడానికి ప్రతిపాదన పంపాను. నా ప్రతి పాదన బోర్డాఫ్ డైరక్టర్స్ కి చాలా నచ్చింది-ముఖ్యంగా మా మాఁవగారికి మరీను. మెచ్చుకోలుగా నా కివ్వడానికి ఆయన హెవీ క్యాష్ రివార్డు ప్రకటించారు. మన స్నేహానికి గుర్తుగా అందులోనుంచి క్వాలిటీ వైస్ ఖరీదైన ఇండియన్ మేక్ ఇ-వెహికల్ ని ప్రజెంట్ చేయబోతున్నాను—“
ఆ మాట విన్నంతనే వావ్ అంటూ లేచి వరూధినికి చేయి అందించాడు భువనేశ్. మందాకిని లేచి ప్రభావతిని ఆనందంతో కౌగలించుకుంది“గ్రేట్ ఆంటీ! “ అంటూ—
ప్రభావతి ఆ అమ్మాయి తల నిమురుతూ అక్కున చేర్చుకుని నిదానంగా అంది-“గిఫ్టు తీసుకోవడానికి ఇది సరైన తరుణం కాదేమో వరూ! దేనికైనా ఒక శుభ ముహూర్తం—సారీ ఒక సమయం సందర్భం ఉండాలి కదా –నేనింత వరకూ నీకేదీ యివ్వలేదు. అది నాకింగా గుర్తు. ఆ వెలితిని అలా ఉంచనీయ కుండా నేను నీకు ఏదైనా గిఫ్టు మొదట యిచ్చిన తరవాత నువ్వేమి యిచ్చినా తీసుకుంటాను”
“అదేంవిటి ప్రభా—అంత తీవ్రంగా ఫార్మాలిటీస్ ఫాలో చేస్తున్నావు! మన మధ్య ఇవన్నీ యెందుకు?ఐనా—నువ్వేమీ యివ్వలేదని ఎందుకనుకుంటున్నావు—నీకు తెలియదేమో గాని—నాకు బోలెడు ఇచ్చావు. స్నేహమూ పాశమూ ఇంకా యిస్తూనే ఉన్నా వు—అందువల్ల—“ అని వాక్యాన్ని పూర్తి చేసేటప్పుడు ప్రభావతి కుడి చేతిని అడ్డం పెడుతూ అంది-“లేదు వరూ! నీకు నానుండి స్నేహ భావమూ సౌహార్ద్రమూ లభిస్తున్నాయని చెప్పినందుకు థేంక్స్-ఇప్పుడో రేపో నీనుండి ఏదో ఒక గిఫ్టు తీసుకోవడం తధ్యం. ఇప్పటికి ఆ టాపిక్ విడిచి పెట్టు—ఓకే?“ అంటూ లేచి వెళ్ళి వరూధునిని కౌగలించుకుంది.
అంత వరకూ అక్కడ నిశ్శబ్దంగా వింటూ కూర్చున్న మందాకిని ఇక ఉగ్గబట్టలేక-“అమ్మా! నాకు నిద్ర వస్తుందే—నేను లేచి ఆంటీ గదిలోకి వెళ్ళి పడుకుంటాను. సరేనా! ” అంటూ సోఫానుండి లేచింది.
అప్పుడు అదే అదనుగా భువనేశ్ లేచి ఆ పిల్లను రెండు చేతులతోనూ యెత్తుకుని గుండెలకు అదుముకుని గదివేపు నడిపించాడు. మిత్రురాండ్రి ద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వసాగారు. ఫాన్సీ గోడ గడియారం మ్యూజికల్ టోన్ తో సిగ్నల్ యిచ్చింది బెడ్ టైము దగ్గరయిందని—
--------------------------------------------------------
ఒక రోజు సాయంత్రం ప్రభావతి పూజాగదిలోకి వెళ్ళి సంధ్యాహారతి యివ్వలేక పోయింది. ఎంత ప్రయత్నించినా మనసు కుదుట పర్చుకోలేక పోతూంది. ఒకటి తరవాత ఒకటిగా మనసునీ మనుగడనీ అర్థంకాని కలత కలగా పులగం చేసింది. మొన్న జరిగిన తన పుట్టిన రోజు వేడుకలో ఎంత ఉత్సాహపూరి తంగా ఎంత ఉల్లాసపూరితంగా గడిపింది. మొదట చదివిన వార్త తనకు అప్ బీట్ గా యెమోషనల్ ఫీల్ లా ఉంది. సంతోషం ఉరకలు వేయించింది. గుజరాత్ కచ్ జిల్లాలో డబ్బై యేండ్ల వయసు స్త్రీ తల్లి అయింది. ఆమెకు యెంతటి సాహసం—మరెంతటి విశ్వాసం మాతృత్వంలో—భార్యాభర్తల పెళ్ళి నలబై ఐదేండ్ల క్రితం జరిగింది. ఇప్పుడు జివున్ బెన్ రబరి పండంటి బిడ్డకు తల్లి అయింది. అనంత ఆహ్లాదకర వార్త అది. తదుపరి వార్తలు రెండూ ఘోరంగా ఉన్నాయి.
ఆగ్రహావేశాలను తన రక్తంలో యిముడ్చుకున్న ఒకడు సైకో కిల్లర్ గా మారి, అడిగినప్పుడల్లా కాదన్న వాళ్లను అక్కడికక్కడే హత్య చేయనారంభించాడు. పుట్ పాత్ పైన ప్రక్కన పడుకోవడానికి తనకు చోటివ్వలేదన్న ఆగ్రహంతో వరుసగా ముగ్గరు బిక్షగాళ్ళను హత మార్చాడు. అడిగినప్పుడు లేదంటే కాదంటే ఆ సైకోకిల్లర్ భరించలేక పోతున్నాడు. ఎక్కడ లేని కోపంతో అగాయిత్యాలకు పాల్పడుతున్నాడు. మరొకటి కూడా అదే విధమైన కష్టం కలిగించే వార్తే—ఓసిడీతో(అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) బాధపడుతూన్న మహిళ చెట్టుకి ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. మరొక కేసులో మరొక మహిళ తనకు గర్భం దాల్చడం ఆలస్యమవుతూందని-తన భర్తకు మెట్టింటికీ న్యాయం చేకూర్చలేక పోతున్నానని నోట్ వ్రాసి ప్రాణాలు తీసుకుంది. అవన్నీ తలచుకుంటూ ప్రభావతి ఉన్నపాటున బరువుగా నిట్చూర్చింది.
తన విషయం అటువంటిది కాదు. సుభాషిణి తన కడుపున పుట్టింది పెరిగింది--ఆరేండ్ల వయసులో తనను దు:ఖ సముద్రంలో ముంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు తనూ తన భర్తా మందాకినిలో తమ కూతుర్ని చూసు కుంటూ కాలం వెళ్ళదిస్తున్నారు. కాని—ఎన్నాళ్ళని?అరువుకి తెచ్చుకు న్న ప్రేమ అరువుకి తెచ్చుకున్న నాంతాడుతో సమానమే కదా—తను మరొక మారు గర్భదాల్చడానికి కొన్ని శారీరక సమస్యలున్నాయన్నది తనకు తెలుసు. కాని—ఇక్కడున్నది అది కాదు ప్రోబ్లెమ్-భువనేశ్ అన్నీ తనకు చెప్పడం లేదు. తను మనో వ్యాకులతకు లోనవుతుందని నిర్మొహమాటంగా చెప్పడానికి సాహిసించడం లేదు. ఎక్కడో పుట్టి పెరిగిన అనాథ పాపను పెంచుకోవడం చాలామంది అనుకున్నంత సులభతరం కాదు. పాప తన స్వంతం కాదన్న వైనం డీప్ ఎమోషనల్ క్రైసెస్ కి దారి తీస్తుంది.
తనకే కాదు;భువనేశ్ కి కూడా అటువంటి కఠిన యెమోషన్సే యెదురు కావచ్చు. ప్రభావతి యిక ఆలోచించడానికి ముందుకు వెళ్ళలేక పోయింది. చప్పున లేచి గ్లాసుడు నీళ్ళ గడగడా తాగి పనిగత్తెకు ఓమాట చెప్పి చకచకా రోడ్డుపైకి వచ్చింది. అటు పోతూన్న ఆటోరిక్షాను పిలిచి త్రిపురాలయం వేపు వెళ్ళ మంది. ఏదీ తోచ నప్పుడు, ఎటూ దిక్కు తెలవనప్పుడు యింట్లో బిడ్డల అలికిడి బొత్తిగా కొరవడినప్పుడు స్త్రీ మనసూ తనువూ దైవ సాన్నిత్యానికి ప్రతిరూపమైన ఆలయ ప్రాంగణంలోనే కదా తల దాచుకుంటుంది--సున్నితమైన స్త్రీ అంతరాత్మం ఆక్రోశిస్తున్నప్పుడు దైవ చింతనే కదా ఆలంబన అందచేస్తుంది--
------------------------------------------------------------------------------
ఇంకా వుంది..
------------------------------------------------------------------------------
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Comments