'The Trap Episode 19' New Telugu Web Series
Written By Pandranki Subramani
రచన : పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
గత ఎపిసోడ్ లో
పరమేశ్వర్ అంటే తనకిష్టమని అతనితోనే చెబుతుంది వినోదిని.
తనకు కూడా వినోదిని అంటే ఇష్టమని చెబుతాడు పరమేశ్వర్.
ప్రభావతి పుట్టిన రోజు ఘనంగా జరుగుతుంది.
ఇక ది ట్రాప్.. 19 వ భాగం చదవండి…
ఎప్పుడో యెక్కడో వాల్మీకి మహర్షి ధ్యాన నిమగ్నుడై ఉన్నప్పుడు స్వఛ్ఛమైన మంచితనం గురించి యిలా అన్నాడట- “మంచి మనసు గల మనిషి ప్రక్కన కూర్చుని మాట్లాడితే చల్లగా పారే స్వఛ్ఛమైన సెలయేరు ప్రక్కన ఉన్నట్లుంటుంది! ”అని-- ఆ కోవన చూస్తే గుభాళించే మంచి మనసుల్ని పూలతీగలతో పోల్చవచ్చేమో-- తీగ తీగకూ మొగ్గ నిశ్శబ్దంగా నిండుగా తొడగుతూ అడుగడుగునా పుష్పిస్తూ బ్రతుకు బాటను చైత్రరథంలా మారుస్తుంది. జీవన సారాన్ని అమృత మయం చేస్తుంది.
మొదట వేదమూర్తి దంపతులకు, ఇంటి పెద్దలు మంగళా దేవమ్మ వినాయకం దంపతులకు సంకటమైన పరిస్థితి యెదురైంది. దానిని దాటి ఎలా ముందుకు సాగాలో తెలియలేదు. వేదమూర్తి చిన్ననాటి నేస్తమూ ఫార్మా కంపెనీ ఓనర్ ఐన దివాకర్ తన కూతురు వినోదినిని తోటలోని పూల మొక్కలా వికసిస్తూ న్న విద్యావంతుడు పరమేశ్వర్ కి యివ్వడానికి కూతూహలం చూపించాడు. కాని పెద్దవాడు కామేశ్వరరావు సంగతి యెత్తనే లేదు. ఇకపోతే పెళ్ళీడుకొచ్చిన వాళ్ళ వదిన కూతురు తులసి పెళ్ళి సంగతి యెత్తుతారని ఆశించారు అప్పుడా యిప్పుడా అని, వేదమూర్తి దంపతులిద్దరూ— కాని ఎవరూ తులసి ఉనికే యెత్తలేదు. తులసి ఊసు దివాకర్ యెత్తుతాడని, అతణ్ణి మాటల్లోకి దింపుదామని భార్యాభర్తలిద్దరూ యెదురు చూసారు. కాని అలా యెదురు చూడటం అత్యాశవుతుందేమోనని జంకారు. కాని— ఆ సమస్యను కూడా దాటి విద్యావంతుడు ప్రభుత్వ ఉద్యోగి అయిన విశ్వం తన కూతురు వసంతను కామేశ్వరరావుకి యివ్వడానికి ముందుకొచ్చాడు. ఇది దైవ సంకల్పం కాదూ!
కాని—వాళ్ళ ఆశకు దైవం అంతటితో సంకెళ్ళు వేయలేదు. వేదమూర్తి అన్నయ్య కొడుకు భువనేశ్వర్ వద్దనుండి కలలో కూడా యెదురు చూడని సవివరమైన ఉత్తరం వచ్చింది అమెరికానుండి ఏదో కార్యంపైన ఇండియావచ్చిన రాము గృహస్థుడై మరలిపోవడానికి సిధ్ధ పడ్డాడని, ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తుండ టాన అతడి గురించి తనకు బాగానే తెలుసని, అతడు కమలను యిష్టపడ్డాడని-- తాతయ్యా బామ్మా- చిన్నమ్మా ఒప్పుకుంటే రాముని పెళ్ళి చూపలకు ఊరుకి తీసుకొస్తానని చెప్పాడు భువనేశ్వర్. అది చదివి వేదమూర్తికి కొన్ని క్షణాలు- కాదు- కొన్ని నిమిషాలపాటు నోట మాట రాలేదు.
భర్త అలా నిట్ట నిలువున నిల్చోవడం చూసిన కామాక్షి కంగారు పడుతూ చేతులు ఊపుతూ అడిగింది- “ఏమైందండీ! ఇంతకీ ఉత్తరం యెవరు వ్రాసారండీ?”
భువనేశ్ వ్రాసాడని చెపుతూ అసలు విషయం బయట పెట్టి భార్య స్పందన కోసం ముఖ కవళికల్ని గమనించ సాగాడు. ఆమె కూడా అదే పరిస్థతిని యెదుర్కుంది. మామూలు చదువులు పూర్తి చేసిన తన కూతురు కోసం పెద్ద ఉద్యోగంలో ఉన్న అమెరికన్ భారతీయుడు అల్లుడుగా రావడమా! ఇది నమ్మ తగునా! ఇక విషయానికి వస్తే ఇండియాకి వచ్చి భారతీయ స్త్రీలను భవ్యంగా పెళ్ళిచేసుకునే ఎన్నారైల వ్యవహారం తమకు తెలియనిదా?ఇక్కడ పెళ్లి చేసుకోవడం- మూడు రాత్రులు కొత్త పెళ్ళాంతో గడపడం— ఆ తరవాత చేతికి దొరికింది దోచుకోవడం, మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని నచ్చచెప్పి వెళ్ళిపోవడం- ఆ తరవాత చప్పుడు లేకుండా ఉండిపోవడం-- ఎలాగో ఒకలా ఆచూకీ తెలుసుకుని అడిగితేనేమో- ఇచ్చిన లాంఛనాలు చాలవని అవన్నీ తీరిస్తేనే గాని తను వచ్చి అమ్మాయిని అమెరికా తీసుకెళ్ళ లేనని మంకుతనంతో బదులి వ్వడం-- అప్పుడప్పుడు ఆ ప్రబుధ్ధుల అమ్మానాన్నలు సహితం కొడుక్కి వత్తాసుగా నిలవడమూను..
ఇవన్నీ తాము పత్రికల్లో చదవనివా లేక ఆనోటా ఈనోటా అటువంటివి తమ చెవులకు సోకనివా! కొందరు ఎన్నారైల వల్ల ఎందరి అమ్మాయిల జీవితాలు ఛిధ్రమైపోలేదని-- నమ్మడానికి మనస్కరించక పోవచ్చు గాని-- కొందరు ప్రబుధ్ధలు నోరూ వాయీలేని అమ్మాయిల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ లోకి కూడా లాగుతుంటా రని కామాక్షి విన్నది. అది నిజమా కాదా అన్నది కాదు ప్రసక్తి. అటువంటి విషపూరిత వార్త రావడమే దురదృష్టకరం కాదా! నిప్పు లేనిదే పొగరాదుకదా!
ఇక మరింత లోతుకు పోతే మరొక విషయం కూడా కామాక్షిని కుదిపేయసాగింది. అబ్బాయేమో మరీ చిన్నవాడు కాడు. చిన్న స్థాయి జీతగాడూ కాడు, అలాంట ప్పుడు ఇన్నాళ్ళూ యెందుకు ఒంటరి కాయలా మిగిలిపోయాడు?దాని కథాకమామిషూ యేమిటి? అలా తడబడుతూ తత్తరపాటుకి లోనవుతూ ఆలోచిస్తూ నిల్చున్న కామాక్షి ఉన్నపాటున తలవిదిలిస్తూ భర్త ముఖంలోకి చూసింది.
అదే సమయాన అతడు కూడా భార్య ముఖంలోకి చూసాడు లోతుగా ;యేవో అక్షరాల ను చదవడానికి ప్రయత్నిస్తున్న వాడిలా-- ఔను సుమా! ఇది భువనేశ్వర్ తెచ్చిన సంబంధం కదూ! భువనేశ్ చెప్పిన సంబంధం యెలా తల క్రిందుల వుతుంది?కమలం భువనేశ్ కి కూడా చెల్లలేగా! చెల్లెలి భవిష్యత్తు కోసం యెదురు కాబోయే ఆనుపానుల గురించి ఆపాటి ఆలోచించడా! ఇటు సూర్యడు అటు అస్తమించినా వాడు తడబడే ప్రసక్తి ఉండబోదు కదా! వాడు వేసిన అంచనా తారుమారుగా యెప్పడు మారిందని!
అలా ఆ రోజు రాత్రంతా ఇంటిల్లపాదీ కమల జీవితం గురించి సమాలోచనలు జరిపారు. ఆఖరు మెట్టుగా ఎందుకైనా మంచిదని ఓసారి భువనేశ్ భార్య ప్రభావతి తో కూడా ఫోనులో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభావతి రాము విషయమై సానుకూలంగా స్పందించడం వాళ్ళకు మనోధైర్మాన్నిచ్చింది. చివరి విడతగా పెక్కు సార్లు పెక్కు విదేశాలు తిరిగొచ్చిన వినోదిని తండ్రి దివాకర్ ని కూడా సంప్రదించారు. తమ కుటుంబానికి చెందిన భువనేశ్ ద్వారా వస్తూన్న సంబంధం కాబట్టి మరీ అనుమానాలకు తావివ్వకూడదని గంభీరంగా పలికాడు దివాకర్.
ఇక చివరి దశకు వచ్చి కమలంతో రాము సంబంధం గురించి ప్రస్తావించేటప్పటికి ఆమె సింపుల్ గా చెప్పి ముగించింది- ”ఇప్పటికి నేనేమీ చెప్పలేను నాన్నగారూ! ఒకసారి రాముగారితో సరా సరి మాట్లాడిన తరవాత నా అభిప్రాయం చెప్తాను. అంతవరకూ నాజోలికి రాకండి” ఆ మాట కమలం నోట విని దంపతులిద్దరూ దాదాపు బిత్తరపోయినట్టయారు. తమ జీవన గమనం వద్దకు వచ్చేటప్పటికి అమ్మాయిలు యెంత యెత్తుకు యెదిగిపోతారు! ఎంత లోతుగా ఆలోచిస్తారు!
కథలకు కావ్యాలకు ఒక విచిత్రమైన గుణాంశం ఉంటుంది. ముగుస్తుందనుకునేటప్పుడు పేజీని మడత పెట్టాలనుకుంటున్నప్పుడు మరొక కొత్తది మరొక కొత్త మలుపుతో పుట్టుకురావచ్చు. అంతమవు తుందనుకుంటూన్న ఉపాఖ్యానం ఉన్నపాటున మరొక కథాగమనానికి దారి తీయవచ్చు. అటూ యిటూ కాకుండా తిన్నగా నిదానంగా తపోవన శాంతితో చూపులు సారించి చూస్తే జీవితం కూడా అంతే కదా!
రాము అన్న సమయానికి పెళ్ళి చూపులకు వచ్చాడు. అతడి తరపున అతడి స్నేహితుడు భువనేశ్- భార్య ప్రభావతి పెళ్ళి పెద్దలుగా వచ్చారు. వేదమూర్తిది ఉమ్మడి కుటుంబం కావటాన కుటుంబ సభ్యులతో చావడి కిటకిటలాడిపోయింది. పూలతో అరటి తోరణాలతో కళ కళలాడుతూంది. ఎందుకైనా మంచిదని, ముహూర్త విషయంలో గడబిడగా సమస్యేదీ పుట్టుకు రాకూడదని గుడి పురోహితుణ్ణి తీసుకు వచ్చి కూర్చోబెట్టారు నట్టింట. అతడు జాతక జ్యోతిష్య పుస్తకాలతో సంసిధ్ధుడై ఉన్నాడు. సంప్రదాయ సిధ్ధంగా ఆ యింటి కోడళ్ళింకా కాకపోయినా ఆ యింట్లో పూవుకి నెత్తావిలా పాలలో వెన్నలా కలసిపోయిన వినోదినీ వసంత యిద్దరూ లాంఛనాల బాధ్యతను తీసుకుంటూ ఇద్దరూ పళ్ళేలనిండా పానీయ గ్లాసులతో చావడిలోకి వచ్చారు అందరికీ పంచడానికి.
ఆచారమంటే ఆచారమే కదా-- ఉపచారమంటే ఉపచారమే కదా! పానీయం నింపిన వెండి గ్లాసుల్ని మొదట భుననేశ్ దంపతులకు అందించి పిమ్మట రాము వేపు చాచారు పళ్ళేన్ని. రాము తల అడ్డంగా ఆడించాడు వద్దనేలా సంకేతం యిస్తూ—
అప్పుడు వసంత తమాషాగా అడిగింది- “అదేమిటి సార్ అలా తల ఆడిస్తున్నారు?ఒక గ్లాసు చాలదంటున్నారా! రెండు గ్లాసుల పానీయం కావాలంటు న్నారా”
మరొకసారి తల అడ్డంగా ఆడిస్తూ బదులిచ్చాడతను- “నేను కమలంగారితో సరాసరి మాట్లాడిన తరవాతనే దేనినైనా ముట్టుకుంటాను”
ఈసారి వినోదిని ముందుకు వచ్చింది. “ఆ మాట్లాడేదో పానీయం తీసుకుని మాట్లాడుకోవచ్చు కదా సార్! ”
అప్పుడతను స్పందించకుండా ఊరకుండిపోయాడు. ఇక పెద్దల ప్రమేయం అవసరం ఉందని తేల్చుకున్న కామాక్షమ్మ గుంపు మధ్యకు వచ్చి పురోహితుడితో ఏదో మాట్లాడి నవ్వుతూ కమల భుజాలపైన చేతులుంచి అక్కడకు రాబోతూన్న పరమేశ్వర్ ని కూర్చున్న చోటునుండి కదలకని సంజ్ఞ చేస్తూ పెరడు వేపు నడిపించింది. కమలం కదలిన తరవాత రాము కామాక్షి వేపు చూసి- “థేంక్స్ మేడమ్! ” అంటూ కమలను అనుసరించాడు.
కామాక్షి అబ్బురపడుతూ విడ్డూరంగా చూసింది. “ఇదెక్కడి ఫార్మాలిటీస్సో—పెళ్ళి చూపులప్పుడు అమ్మాయితో రెండు మాటలు విడిగా మాట్లాడుకోవడం తెలుగు వాళ్ళ కుటుంబాలకు ఆనవాయితేగా! దీనికి థేంక్స్ చెప్పడం దేనికో! ఈ అబ్బాయి విదేశాలలో మరీ యెక్కువ రోజులు గడపడం వల్ల పెక్కు తెలుగు ఆచారాలూ ఆనవాయితీలూ మరచిపోయాడేమో--
ఇంతకూ యేమి మాట్లాడబోతున్నాడు—ఎంత సేపు మాట్లాడబోతున్నాడు-- “ అని మనసున తర్జన భర్జన పడింది కామాక్షి దూరం నుంచి గుచ్చి చూస్తూన్న అత్త మంగళాదేవమ్మ వేపు నమ్మకంగా చూపులు విసురుతూ----
వేదమూర్తి తండ్రి వినాయకం కూడా మనసున వింతగా ఫీలవుతూ అనుకున్నాడు- “అమెరికన్ స్టయిల్ లో చాలా విషయాలు చాలా సేపు మనవరాలితో మాట్లాడబోతున్నాడేమో! యురోపియన్ల ఆనవాయితీల ప్రకారం కమలను డేటింగ్ కోసం పిలవాలనుకుంటున్నాడేమో! ”
కాని—వాళ్ళందరూ యెదురు చూసినట్టు అదేమీ జరగలేదు. ఆలస్యం అసలే జరగలేదు. వెళ్ళిన కొన్ని నిమిషాల లోపున ఇద్దరూ చావడిలోకి వచ్చేసారు. అందరూ అదరిపోయి చప్పున నోరు తెరచి అడిగేలోపల కమలం ముఖాన వెలిగిన నవ్వు- రాము పెదవుల పైన విచ్చుకున్న దరహాసాన్ని చూసి ఆగిపోయారు. నవ్వులో తెలుస్తూనే ఉందిగా జరగవలసిందేదో సవ్యంగా సానుకూలంగానే జరిగి ఉంటుందని-- ఇక కీడెంచడానికేముందని?
ఆ రీతిన కూర్చున్నవారందరూ చప్పుడు లేకుండా ఎక్కడివారక్కడ కూర్చుండిపో యారు కదలకుండా- మరి కాసేపటికి అందరూ అల్పాహారం తీసుకుని కాఫీలు కూడా తాగడం ముగించిన తరవాత- రాము లేచి అందరి వద్దా పేరు పేరున క్షమాపణలు చెప్పుకుంటూ తనకు సిటీలో అర్జంటు పనుందని భువనేశ్ కారుని తన కంట్రోల్ కి తీసుకుని వెళ్ళిపోయాడు.
అతడలా వెళ్ళిపోయిన తరవాత మంగళా దేవమ్మ విస్తూపోతూ వేసారిపోతూ అంది- “ఏమి అమెరికన్ లే- తలా తోకాలేని విధంగా! ఇటు వంటి ఆదరా గాబరా మగాళ్ళతో మన తెలుగమ్మాయిలు యెలా నెట్టుకువస్తారో! ”అని మనవరాలి వేపు తిరిగి అంది- “అదేమిటే పిల్లా! ఏదో చాలాసేపే మాట్లాడుకుంటా రని మేమనుకుంటే అలా వెళ్ళి యిలా వచ్చేసారేమిటి బాదం పప్పు ఒలిచి తిన్నట్టు— అసలేం జరిగిందే మీమధ్య? అసలు యేమైనా మాట్లాడుకున్నారా లేదా! చూడు అందరూ యెలా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నారో-- “
కమల కళ కళా నవ్వుతూ బామ్మ రెండు బుగ్గలూ నిమిరి భువనేశ్ ప్రభావతుల మధ్యకు వెళ్ళి కూర్చుంది. ”అన్నయ్యకు నేనడగబోయే ప్రశ్న ముందే తెలుసనుకుంటాను. ఐనా—నేనుగా చెప్తాను. ఒకే ఒక ప్రశ్న అడిగాను. ఆయన సరే అన్నారు. అంతే—విషయం సేటిల్ ఐపోయింది”
ఈసారి ప్రభావతి కలుగచేసుకుంది కమల నెత్తిన సన్నటి మొట్టికాయ పెడుతూ-- “సెటిల్ ఐపోతే సెటిల్ ఐపోయింది గాని—జరిగిందేదో నీనోట చెప్తేనే కదా అందరికీ తెలుస్తుంది”
ఆడవాళ్ళ సంభాషణంతా వింటూ కూర్చున్న వేదమూర్తి నవ్వుతూ అనుకున్నాడు- “కూతురులో చిన్నపిల్లతనం యింకా పోలేదు సుమా! ఇదంతా ఓ యింటిదయిపోతే పోతుందేమో! ”
అప్పుడు కమల మరీ లైట్ గా తీసుకోవడం పెద్దవాళ్లెవరికీ నచ్చలేదని ఊహించుకుంటూ నోరు తెరిచింది- “చెప్తాను. సావధానంగా వినండి నా పైన విసుక్కో కుండా—‘నన్ను పెళ్ళి చేసుకోవడం మీకు నిజంగా యిష్టమా అని అడిగాను. షుయర్ అని ఆంగ్లంలో బదులిచ్చారాయన. బదులు ఆంగ్లంలో కాదు. తెలుగులో కావాలన్నాను. అప్పుడాయన పరిపూర్ణంగా యిష్టమని చెప్పారు. జీవితాంతం నాతోనే కలసి ఉంటారా అని అడిగాను. దానికి ఆయన తెలుగులోనే ఔనని బదులిచ్చారు. అప్పుడు నేను అసలు ప్రశ్న వేసాను- లోడెడ్ క్వశ్నన్ అంటారే అదన్నమాట. ’అలా గయితే మీరు అక్కడనుంచి యిక్కడకు వచ్చేయమన్నాను. అప్పుడో యెప్పుడో కాదు. వెంటనే వచ్చేయమన్నాను.
ఆయన వెంటనే ఒప్పుకున్నారు. నిశ్ఛితార్థం పూర్తి చేయడానకి ఇక్కడ మరి కొన్నిరోజులు ఉండాలి కాబట్టి వాటి విషయమై ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికే అంత వేగంగా వెళ్ళారు. నిశ్ఛితార్థం పూర్తయిన తరవాత ఆయన వెంటనే అమెరికా వెళ్ళి తను చూసుకుంటూన్న అఫీషియల్ టాస్క్ కంపెనీ మేనేజ్మెంటుకి అప్పజెప్పి రావాలన్నారు. దానికి కొన్నాళ్ళు పడుతుందన్నారు. నేను కూడా ఒప్పుకున్నాను. ఆ తరవాతనే మిగతాదంతా అన్నారు. దానికీ సరే అన్నా ను—“
అప్పుడు అంతవరకూ మౌనంగా వింటూ కూర్చున్న కామేశ్వరరావు చప్పున అడిగాడు- “మిగతాది అంటే—“ కమల అన్నయ్య వేపు తిరిగింది- “అదేమీ కాదురా అన్నయ్యా—పెళ్లి పీటల పైన కూర్చోవడం- ఆ తరవాత అమెరికాకి గుడ్ బై చెప్పి మరొకసారి ఇండియాలో ఉన్న అదే కంపెనీలో అదే హోదాలో చేరడమా లేక తానుగా స్టార్టప్ ను ప్రారంభించడమా అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక ముందు రాముగారు యేమి చేయబోతున్నా పెద్దన్నయ్యకు చెప్పకుండా ముందుకు సాగరుగా! ఇంకేదైనా అడగాలా- “ అని బామ్మ ముఖంలోకి చూసిందామె.
“అబ్బో అబ్బో! బాగా యెదిగిపోయావే అమ్మడూ! మాకు తోచనివి కూడా అడిగి గట్టువేపు చేయి చూపించావే అమ్మడూ—“ అని మనవరాలిని దగ్గరకు పిలిచి అక్కున చేర్చుకుంది.
అప్పటి వరకూ మౌనమునిలా ప్రేక్షక పాత్ర వహిస్తూ కూర్చున్న పవన్ నోరు తెరిచాడు తన వంతుగా—“ఇంత వరకూ ఎవరితోనూ చనువుగా ఉండని నువ్వు ఆంగ్ల ఉఛ్చరణతో మాట్లాడే ఎన్నారై రాము గారితో అంత నిబ్బరంగా యెలా నిలదీసి మాట్లాడగలిగావే అక్కాయ్?నమ్మలేక పోతున్నానే నిజంగా- “
కమల నవ్వుతూ తలతిప్పి చూసింది- “మరీ ఆశ్చర్యపోకురా అబ్బీ! నేనింతకు ముందు ఆయనతో మాట్లాడి ఉన్నానురా—“
“మాట్లాడి ఉన్నావా! ఎప్పుడు ఎక్కడ?“
“ఇంకెక్కడ—వదినమ్మ పుట్టినరోజప్పుడు. అందరూ చూస్తుండగానే మాట్లాడాను” ఎలా—అన్నట్టు ప్రశ్నార్ధకంగా చూసాడు పవన్.
“రాముగారు వచ్చి నాతో మాట్లాడాలన్నారు. పెద్దన్నయ్యేమో వెళ్ళి మాట్లాడి రామ్మా అని చెప్పాడు. అప్పుడు ఆయనతో ఏవేవో సంగతులు చెప్పాను. కాని—ఇలా నన్ను చూడటానికి మనింటికి వస్తాడని మాత్రం సూచాయిగా కూడా చెప్పలేదు”
కూతురు చెప్పిన వైనం విని వేదమూర్తి భువనేశ్ వేపు చూసి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో బాబాయికి తనపట్ల యెంతటి ఆప్యాయత ఉందో భువనేశ్ కి మాత్రమే తెలవాలి.
జీవితం కొన్ని విషయాలను తానుగా వచ్చి నిలదీసి నడి రోడ్డున నిలిపి నేర్పుతుంది-- తానుగా యెదురొచ్చి భవిష్యత్తుకి దిశా నిర్దేశం చేస్తుంది. బ్రతుకు బాటలోని పరమార్థమూ అంతస్సారమూ అదే కదా--- అంతేకదా--
------------------------------------------------------------------------------
ఇంకా వుంది..
------------------------------------------------------------------------------
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Comments