కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
'The Trap Episode 2' New Telugu Web Series
Written By Pandranki Subramani
రచన : పాండ్రంకి సుబ్రమణి
పాండ్రంకి సుబ్రమణి గారి ధారావాహిక 'ది ట్రాప్' రెండవ భాగం
గత ఎపిసోడ్ లో
అమెరికా వెడుతున్నాడు భువనేష్.
మార్గమధ్యంలో అబుదబీ ఎయిర్పోర్ట్ లో పిల్లలతో వెడుతున్న ఒక జంటను చూస్తాడతను.
అందులోని యువతిని చూసి తన భార్య ప్రభావతిని గుర్తుకు తెచ్చుకుంటాడు.
గతంలోకి వెడతాడు.
తన ఒక్కగానొక్క కూతురు సుభాషిణి ఏడేళ్ల వయసులో మరణించడం జ్ఞాపకం చేసుకొని బాధ పడతాడు.
ఇక ది ట్రాప్..
రెండవ భాగం చదవండి...
“ఓకే ఓకే! ఇప్పుడు పెదవి విప్పి నా పెదవులతో కలప వచ్చు కదా! ”
“ పెదవి విప్పుతున్నాను వినండి. ఎక్కడ చూపు సారించినా మీ బంగారు కూతురే కనిపిస్తూంది, నా చుట్టూ అదే కొంగు పట్టుకుని తిరుగుతూంది, లాగుతూంది. మీరుంటే సరే, ఫీలింగుని మరల్చుకోగలను. మీరిప్పుడు నా యెదుట లేరుగా-- నన్నేమి చెయమంటారో చెప్పండి”.
అప్పుడు పెదవి మూయడం భువనేష్ వంత యింది. ఈ కారణాల వల్లనే అతడు సాధ్యమైనంత మేర భాగ్యనగరం విడిచి బైటకు కదలడు.చివరకు బాబాయింటికి గాని, తాతయ్యా బామ్మలను చూడటానికి కూడా కదలి వెళ్ళడు. సుభాషిణి తమను విడిచి పైలోకాలకు వెళ్ళిపోయిన తరవాత ప్రభావతి యేకాంతం భరించలేకుండా ఉంది. నిజానికామె ఆ కరాళ రాత్రివంటి ఒంటరి తనం నుండి విడివడటానికి ఊళ్ళోని అమ్మానాన్నల వద్దకు, స్కూలునాటి మిత్రురాండ్ర వద్దకు వెళ్ళి కొన్నాళ్ళు గడిపి రావడానికి ప్రయత్నించింది. కాని అక్కడ గడప లేకపోయింది. అక్కడి సందడికి అలవాటు పడలేక పోయింది.
తన వద్ద— తనకు దగ్గరగా ఉంటేనే, మనసులో మనసుంచి తనతో మాటలు కలిపితేనే ప్రభావతికి ఊరడింపుగా ఉండసాగింది. కూతురు పోయిందన్న దు:ఖం ఇద్దరిదీ ఒక్కటేగా- ఒకరి కొకరు తామిద్దరేగా.. దు:ఖాన్ని పంచుకుంటూ ఊరడిల్లాలి-- తీరని దాహంలా యెడారి ప్రయాణంలా ఇదొక తీరని దు:ఖం. ఆరని హృదయారాటం. అతడలా అందీ అందని మాటలతో యేవేవో భార్యకు చెప్పి, తను మరు నాడు కంపెనీ యూయెస్ మెయిన్ బ్రాంచీకి వెళ్ళ వలసి ఉందని నచ్చచెప్పి మేను వాల్చాడు భువనేష్, కంట తడి తుడుచుకుంటూ--
అతడలా కళ్ళు మూసుకున్నాడో లేదో మరొకసారి ముబైల్ ఖంగుమంది. ప్రభావతి తనతో ఇంకేదో చెప్పాలనుకుంటుందేమో— గుర్తుకి వచ్చి ఇప్పుడు చెప్పాలనుకుంటుందేమో--అనుకుంటూ- ”చెప్పు ప్రభా! “అన్నాడతను“.
అబ్బే—మాట్లాడేది వదిన కాదురా అన్నయ్యా! నేను—మీ తమ్ముడు పరమే శ్వర్ ని—నిద్రపోతున్నావేమిటి? రాత్రో పగలో తెలియటం లేదు. సారీరా అన్నయ్యా! ”
“సారీలు తరవాత చెప్తువు గాని— ఇది ఇంటర్నేషల్ కాల్. ఫోను బిల్ పెరిగిపోతుంది- చట్టున విషయం చెప్పు”
“మరేం లేదురా అన్నయ్యా! నాన్న స్పెషల్ ట్యూషన్ ఫీజు యివ్వడానికి తెగ యిదయి పోతున్నారు. నాకు కోడింగ్- క్లౌడింగ్- వంటి అడ్వాన్సుడ్ కోర్సుల్లో బేసిక్ నాలెడ్జి సంపాదించాలంటే స్పెషల్ కోచింగ్ తీసుకునే తీరాలి. అడిగితేనేమో— చదివింది చాలు. మా తమ్ముడు, అన్నయ్యలతో కిరాణా షాపులో చేరిపొమ్మంటున్నారు. గవర్నమెంటు లిబరల్ ఆర్థిక విధానం వల్ల జాబ్స్ బాగానే దొరికేటట్లున్నాయి. వీటిలో సరైన సర్టిఫికేట్లు లేకుండా ఎంట్రీ లెవల్ పోస్టు కూడా దొరకదురా అన్నయ్యా—“
“సరే--ఇప్పుడు నన్నేమి చేయమంటావు? ఇప్పటికిప్పుడు నేనిక్కణ్ణించి డబ్బులు పంపించలేను. వెళ్ళి మీ వదినను అడుగు. సర్దుబాటు చేస్తుంది. . నువ్వంటే ప్రభావతికి అభిమానమూ ప్రేమా కదా—“
“అబ్బే—నాకిప్పుడు డబ్బులేవీ వద్దురా అన్నయ్యా! ఇప్పటికే నాకు చాలానే చేసావు. ఇప్పుడు నీ మాట వత్తాసు ఒకటుంటే చాలు. నువ్వు గాని విసుక్కోకుండా ప్రొఫెసర్ భీమ్ సేన్ గారికి ఫోనులో ఒక మాట చెప్పావంటే నాకు ఫ్రీ కోచింగ్ యిచ్చే యేర్పా టు చేస్తారు. నువ్వు అమెరికానుండి ఏదైనా మంచి గిఫ్టు అందిస్తే సంతోష పడిపోతాడు. అది చాలు. వెంటనే ఫోను చేసి చెప్పరా! “
“ఇప్పుడా—నీకు మతిగాని పోయిందట్రా! రేపు-అంటే అమెరికన్ టైమింగ్ ప్రకారం ఫోను చేసి చెప్తాలే—నువ్విక ఫోను పెట్టి నిద్రపో! ఔనుగాని ఆ టెక్నికల్ కోచింగ్ భీమ్ సేన్ గారి వద్దే తీసుకోవాలేంటి? ఇంకా చాలామందే క్వాలిఫైడ్ కోచింగ్ మాష్టర్స్ ఉన్నారుగా ! వాళ్ళ వద్ద అదే కోచింగ్ తీసుకోవచ్చుగా—డబ్బులు నేనిస్తాగా—“
“ మేటర్ అది కాదురా అన్నయ్యా! సర్టిఫికేట్ కి ఆయన గాని ఎండోర్సుమెంటు యిస్తే దానికి విలువెక్కువని విన్నానురా అన్న యా! ఇక్కడున్న సమస్య ఫీజుగురించి మాత్రమే కాదు“
భువనేష్ రవంత సేపు మౌనం వహించి అన్నాడు తలూపుతూ— “అదన్న మాట సంగతి—సోషియల్ మీడియాలో ఫేమస్ ఐపోయినట్టు న్నారు భీమ్ సేన్ గారు. సరే-- పనయింతర్వాత నేనే నీకు ఫోను చేసి చెప్తాలే—“ అని ఫోను పెట్టేసాడు భువనేశ్. అతడు కళ్ళు మూసుకోవడానికి ప్రయత్నించాడు. కాని— భాగ్యనగరం రంగుల మ్యాపులా కళ్ళ ముందు రీలులా కదలాడింది. బాబాయి వేదమూర్తి మామూలు చిన్న వ్యాపారి. అత్యాశలకు పోని రీతైన వ్యక్తి. కిరాణా షాపు ఓనర్. పెద్ద కొడుకు కామేశ్వరరావు- రెండవ కొడుకు పరమేశ్వర్- కడపటి కొడుకు పవన్. పరమేశ్వర్ తరవాత ఒక్కగానొక్క కూతురు-కమల.
భువనేష్ తండ్రి వామనయ్య గవర్నమెంటు సర్వీసునుండి రిటైరయి ఊల్లో పొలం పనులూ తోట పనులూ చూసుకుంటాడు. అప్పుడప్పుడు హైద్రాబాదుకి తల్లితో వచ్చి వెళ్తుంటాడు. వచ్చినప్పుడల్లా ఊరి గుడి నుండి గరుడ ప్రసాదమనో అమ్మవారి అనుగ్రహ కట్టుడు చీరనో కోడలు పిల్లకి యిచ్చిపోతుంటాడు; మరొకసారి కోడలి కడుపు పండాలని.
తల్లి కాంతమ్మేమో స్వయంగా గుడి వేదాంతి ద్వారా పుణ్య ఘడియలు చూసి కోడలు పిల్లతో నోములూ వ్రతాలు చేయిపిస్తుంది. ధ్యేయం ఒక్కటే— కోడలు పిల్ల కడుపు రెండవసారి పండాలని. ఇవన్నీ అన్ని చోట్లా కనిపించే ఆనవాయితీ లేగా-- ఇకపోతే— ప్రభావితకున్న అసలు సమస్య భర్తగా తనకు మాత్రమే తెలుసు. ఇంకా చెప్పాలంటే ఆ విషయాలు చాలా వరకు గైనకాలిజిస్ట్ తనకు మాత్రమే చెప్పింది, తీసుకోవలసిన జాగ్రత్తలేవో వాటిని ఎలా తీసుకోవాలో చిట్టాలా వ్రాసిచ్చి--
భార్య మానసికంగా కలత చెందకూడదని అతను ఆమెకు కొన్ని చెప్పా డు- మరికొన్ని చెప్పకుండా మరుగు పరిచాడు. తెలిస్తే మాత్రం యేమవుతుంది గనుక— ప్రభావతికి కలత కొండంత పెరగడం తప్ప-- తమ యింటి పెద్దలు, ముఖ్యంగా తనకు జన్మనిచ్చిన తల్లి దండ్రులు గాని పుణ్యం చేసుంటే దాని ఫలితం యేదో ఒక రూపంలో తనకూ తన భార్యకూ దక్కకుండా పోతుందా— మనిషన్నవాడు యిలా ఆశాభావంతో ఆలోచించుకుంటూ సకారాత్మకంగా నిలదొక్కుకుంటూ ఉంటేనే కదా ఆశావాదిగా వాడని కొమ్మలా మిగులుతాడు-నిలకడగా జీవన పోరాటం సాగిస్తాడు. దిగులు చెందుతూ తోటివారికి దిగులుని పంచిపెడ్తూ ఉండకంటాడు వివేకానందుడు.
”రోజా పువ్వు క్రింద ముళ్ళున్నాయని ఆందోళన చెందకు. ముళ్ళ గురించే పదే పదే తలపోస్తూ దిగులు చెందకు. అదే ముళ్ళపై పూలు వికసించి ఉన్నాయన్నది మరచిపోకు. అలాగే గమ్యం చేరి విజయం సాధించాలంటే కష్ట నష్టాలుంటాయి. వాటిని అధికమిస్తూనే ముందుకు సాగాలి. అప్పుడే విజయం సాధించగలం“ అవి మాటలు కావు— చివరి వరకూ మేఘాలలోకి తేల్చే ఆణిముత్యాలు. ఉద్దీపన కలిగించే సూక్తులు.
-----------------------------------------------------------------
మరునాడు భువనేష్, రామూ యిద్దరూ రద్దీ బిజీనెస్ షెడ్యూల్ లో మునిగిపోయారు. కంపెనీ ప్రొడక్టుల మార్కటింగ్ వ్యాప్తికై పలు విభాగాల చీఫ్ లతో చర్చలు జరిపి పథకాలు రచించి సంబంధిత వ్యాపార కేంద్రాలతో అవగాహన ఒప్పందాలు పూర్తి చేసుకుని, వాటి వివరాలు హైద్రాబాదు కార్పొరేట్ హెడ్ క్వార్టుర్సుకి తెలియ చేసి వాళ్ళ ఆదేశాలను సలహాలను కూడా స్వీకరించి నిర్దేశించబడ్డ వ్యాపార లక్ష్యాలకు శ్రీకారం చుట్టి సంతకాలు పెట్టి- “అబ్బ—ఒక పనయిపోయింది--“ అని ఊపిరి పీల్చుకునేటప్పటికి భువనేశ్ కి అలా యిలా అంటూనే రెండు వారాలు దాటిపోయాయి.
అంతవరకూ తనకు ప్రక్క బలంగా ఉండి పనులు పూర్తి చేయడంలో సహకరించిన రాముకి అతడు పుష్కలంగా ధన్యవాదాలు చెప్పాడు. “ఇంత చిన్నదానికి ఇంతటి థేంక్సా— నేను నీకు సహకరిస్తున్నానంటే మన కంపెనీ పెంపుదలకు మనం సేవలు అందిస్తున్నట్లే కదా! రేపు నేనక్కడకు వస్తే నువ్వు కూడా ఇదే విధంగా నాకు సహకారం అందించవా? ”
భువనేష్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఇప్పటి పోటీ ప్రపంచపు రోజుల్లో అసూయ చాంతాడంతగా వ్యాపించి ఉంది. ఎదుటి వాడిలో జ్వలించిన కాంతిని చూసి తనకు సోకిన కాంతిలా భావించి ఉత్తేజితుడయే మనుషులు చాలా అరుదు. తన పెర్ఫార్పెమన్సు చూసి పై అధికారుల నుండి తనకు లభించిన మెచ్చుకోలు చూసి స్వయాన తనకు లభించి నట్లుగా భావిస్తూ ఆనందించగల సహోద్యోగి ఎదురవడం తనకు లభించిన మేజర్ ప్లస్ పాయింటు. ఆలోచనల నుండి తేరుకుంటూ ఎట్టకేలకు భువనేశ్ స్నేహపూరితంగా స్పందించాడు- “సరే— నువ్వు నాకు అమెరికాలో చిన్న సహాయమే చేసావనుకో-- మరి నా తరపున నీకెప్పుడు రిటార్న్ గిఫ్టుగా పెద్ద సహాయం చేయగలనంటావు? ”
రాము నోట మాట పలక్కుండా తనకదేమీ తెలియదన్నట్టు రెండు భుజాలూ పైకి యెగరేసాడు. “సరే— నీకు సహాయం చేయగలిగే పరిస్థితి గురించి తరవాత ఆలోచిస్తాను గాని— నీకొక ఉచిత సలహా పారేసి లోహ విహంగం రెక్కలపైకెక్కి స్వదేశం వెళ్ళిపోతాను.వింటావా! ” అతడు మళ్ళీ అదే రీతిన భుజాలెగరేసి మిత్రుడి ముఖంలోకి చూసాడు.
“నువ్వొక యింటివాడయేంత వరకూ ఇక్కడి తెల్ల భామామణు లకు దూరంగా ఉండు. అలా ఉండగలగడం ఇక్కడి రసవేద వాతావరణంలో కష్టమే, కాదనను. కాని దానికి కారణం ఉంది, అదేమి టంటే--జీవితంలో కొన్నిస్థిరమైనవి ప్రశస్థమైనవి సాధించాలంటే యిటు వంటివి కొన్ని విడిచి పెట్టే తీరాలి కదా –“.
రాము నవ్వి ఊరకుండిపోయాడు. మిత్రుడికి ఉపయోగకరంగా ఉండటానికి బిజినెస్ ఫైల్సు సర్దుతూ ఇండెక్స్ పెట్టసాగాడు.
“ఏమిటోయ్ యిది! నేనేమో నీ ఫ్యూచర్ లైఫ్ గురించి మాట్లాడుతుంటే నువ్వేమో నా ఫైల్స్ ని సర్ది పెడుతూ ఆలోచిస్తున్నావు. . కమ్మౌట్ విత్ ట్రూత్. . అలవాటు పడ్డ ఈ విదేశీ జీవితం చాలంటావా! పెళ్ళయిన తరవాత షడ్రుచుల ఆస్వాదన తప్పిపోతుందని దిగులు చెందుతున్నావా—“
అది కాదన్నట్టు తల విదిలించాడు రాము. “నేను ముందే చెప్పాను నీలాగే నేను కూడా పెద్ద కుటుంబం లోనే పుట్టి పెరిగానని. . బరువు బాధ్యతలతో మెసలే కుటుంబంలో ఉన్న జీవన ఔన్నత్యం గురించి నాకు కూడా తెలుసని—మరి విడిగా ఉంటూ మడికట్టుకుని ఆడదాని ఒడికి దూరంగా ఉండలేను. ఎందుకంటే పరువాలతో పొంగే కామినిలు, భామినిలు నన్ను దూరంగా ఉండనివ్వరు. ఒప్పుకుంటాను నేను పలు రుచులకు అలవాటు పడ్డ నల్ల పిల్లినని. అలాగని కుటుంబ జీవితంలోని ఔన్నత్యాన్ని తెలియని వాడిని మాత్రం కాను—
మొన్న ఓఓటీలో చూసిన తెలుగు సినిమాలోని డైలాగ్ గురించి చెప్తాను, విను. కొత్తగా స్నేహం పెంచుకున్న అమ్మాయి అబ్బాయిని అడుగుతుంది-‘నీకు పెళ్ళయి పోయిందా? ’ అని. దానికి అతడు యిలా బదులిస్తాడు-“అయిపోయిందనే అనుకుంటున్నాను. కాని నాకింకా పెళ్ళి కాలేదు’. ఇప్పుడు అసలు పాయింటుకి వస్తున్నాను. కొన్ని వేల సంవత్సరాల దీర్ఘమైన చరిత్ర-సాంస్కృతి గల భారత దేశంలోనే పరిస్థితి అలా ఉందంటే, మరి, ఇక్కడ స్వేఛ్ఛా ప్రియత్వానికి అమితంగా అలవాటు పడ్డ తెల్లవాళ్ళ సమాజంలో పరిస్థితి యెలా ఉంటుందో ఆలోచించు. ఎనీ హౌ-నేను నీకిచ్చిన మాట ప్రకారం అనువు చూసి పెళ్ళి చేసుకుంటాను. ఓ యింటి వాడినవుతాను. ఒకరిద్దరు బిడ్డలకు తండ్రిని కూడా ఔతాను.
కాని— ఎప్పుడని మాత్రం అడక్కు. ఇక్కడ ప్రేమలుంటాయి, చెలరేగి పోయే మోహాలుంటాయి. దీర్ఘకాలం పాటు సాగే-లివ్-ఇన్-రిలేషన్స్ ఉంటాయి. పెళ్లిళ్లు మాత్రం అరుదుగా జరుగుతాయి. ఇది గుర్తుంచుకో—ప్లేనెక్కిన వెంటనే మన మధ్య జరిగిన భావోద్వేగ పూరిత సంభాషణల్ని మరచిపో! ఇవన్నీ చాలా వరకు అదుపులో పెట్టలేనివి. ఎందుకంటే— ఇవన్నీ యెవరూ పని గట్టుకుని కావాలని చేయడం లేదు. పరిస్థితులు—సామాజిక, ఆర్థిక సంబంధిత పరిస్థితులు--”
అదే చివరి మాటగా చెప్పి కదలి వెళ్ళబో తూన్న మిత్రుణ్ణి ఆపుతూ తల అడ్డంగా ఆడిస్తూ భువనేష్ అన్నాడు-“నేను దేనినీ మధ్యలో విడిచిపెట్టే అలవాటే నాకు లేదు. ఇకపైన నీ కథను నువ్వు కాదు, నేను ముగిస్తాను. ఎవరికీ కష్టమూ నష్టమూ లేకుండా ముగిస్తాను-ఇక నువ్వు సోనియాను వెతుక్కుంటూ వెళ్ళవచ్చు. రేపటి ప్రయాణానికి నేను సూట్ కేసులు సర్దుకోవాలి. ముఖ్యమైన కంపెనీ పేపర్లు చెక్ చేసుకోవాలి. ఓకే! ”
అతడు అలాగేనంటూ రూమునుండి కదిలుతూ తిరిగి చూసాడు-“ఇంకేమీ చెప్పాల్సింది లేదా? మళ్ళీ యెప్పుడు కలుసుకుంటామో! ”
భువనేష్ కూడా తిరిగి చూస్తూ సమీపించాడు- “ఉంది-ఒకే ఒక మాట చెప్పాలని ఉంది- నేనేమీ పాత తరం మనిషిని కాను. నీ తరానికి చెందిన వాణ్ణే— ఐనా చెప్పాల్సింది చెప్తున్నాను. నీ జీవన పధ్ధతి నాకు నచ్చలేదు. అదే సమయంలో దాపరికం లేని నీ నిజాయితీ నాకు నచ్చింది. సూటిదనం నచ్చింది. ఇది పంచ గంగల్లో గంగోత్రి వంటిది”
రాము యెమోషనల్ ఐయాడు. థేంక్సంటూ భువనేష్ ని గుండెలకు హత్తుకున్నాడు.
ప్రయాణ పట్టీ ప్రకారం భువనేష్ స్ట్రెయిట్ ప్లేనులో శంషాబాదు చేరి, కంపెనీ సిబ్బంది సహకారంతో క్యాంపు సామగ్రితో ఇంట్లో దిగి తను ఊరు చేరిన భోగట్టా ముందస్తుగా జనరల్ మేనేజరుకి అందించి, ఆ తరవాత ఒళ్ళంతా కళ్ళు చేసుకుని యెదురు చూస్తూన్న పరమేశ్వర్ కి ప్రొఫెసర్ గారి కోసం తను తెచ్చిన గిఫ్టు గురించి చెప్పి, అలసటతో ఆకలి పుట్టక మజ్జిగన్నం మాత్రం తిన్నానని పించి మేను వాల్చాడు. ఎదురు చూసినట్టే రాత్రి పదకొండు గంటలకు అతడి ప్రక్కన ప్రభావతి కొప్పునుండి పారిజాతాలు పరిహాసాలు చేస్తూ పలకరించసాగాయి. దానికి తోడుగా జాస్మైన్ సెంటు కూడా మత్తుని రేపినట్లనిపించింది.
కాని—అతడు కదల్లేదు.లేవలేదు. మరునాడు ఉదయం కార్పొరేట్ ఆఫీసులో చేయవలసిన పనులు కుప్పలుగా ఉన్నాయి. జనరల్ మేనేజరుకి, ఎగ్జక్యూటివ్ డైరక్టరుకి సబ్మిట్ చేయాల్సి రిపోర్టులు-ముఖా ముఖి చర్చించాల్సి ముఖ్య అంశాలు రెక్కలు విదిలిస్తూన్న పక్షి రెక్కల్లా యెదురు చూస్తుంటాయి. అవన్నీ పూసగిచ్చినట్లు ప్రభావతికి వివరించేంత ఓపిక అతడికి లేదు. ఆర్డరాఫ్ ప్రియారిటీలో ఇదంతా తీరిగ్గా చూసుకోవచ్చు. నిజం చెప్పాలంటే శృంగార కావ్యరచన ఇంతకంటే బాగానే చేసుకోవచ్చు. భార్య విరహ వేదన లోని ఆవిరిని మరింత పెంపు చేయడం తమ సంగమ కావ్యానికి మరింత పదును పెడ్తుంది కదా--ఇద్దరికీ అందులోని పెంపొందే ముమ్మరం, తీవ్రం వాంఛితమే కదా--
ఇంకా వుంది..
---------------------------------------------------------
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
Commentaires