top of page

 తేడా

Writer: Srinivasarao JeediguntaSrinivasarao Jeedigunta

#JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #Theda, #తేడా, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


Theda - New Telugu Story Written By - Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 14/03/2025

తేడా - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



 "యిదిగో రమా! రామారావు దంపతులు వచ్చారు, నువ్వు పూజ గది నుంచి ఒకసారి కిందకి దిగి వస్తావా” అని పిలిచాడు శేఖర్. 


“అన్నయ్య గారు, బాగున్నారా? వదినగారిని తీసుకుని రావడం చాలా సంతోషంగా వుంది” అంటూ వంటగది వైపుకి వెళ్ళబోతున్న రమాదేవి ని “ఆగవమ్మా చెల్లమ్మ, ముందు నువ్వు యిటు వచ్చి మీ ఆయన పక్కన కూర్చో” అన్నాడు రామారావు. 


“ఎప్పుడో పెళ్లి పీటలు మీద ఆయన పక్కన కూర్చున్నాను, ఆ తరువాత నుంచి తిట్టుకోవడం తోనే డబ్భై ఏళ్ళు గడిపాము” అంది భర్త పక్కన సోఫాలో కూర్చుంటూ. 


రామారావు సంచిలోనుంచి శుభలేఖ తీసి, “యిదిగో శేఖర్ గారు! మా అబ్బాయి పెళ్లి రేపు వచ్చే ఆదివారం. 35 ఏళ్ళు వచ్చే వరకు పెళ్లి అంటే ససేమిరా అన్నాడు, నెల క్రితం మీ చెల్లెలు ‘చచ్చిపోతాను నువ్వు పెళ్లి చేసుకోబోతే’ అని బెదిరించింది, వాడు ఒప్పుకోకపోతే బాగుండేది, దీని సాధింపు లేకుండా హాయిగా ఉండేవాడిని” అన్నాడు రామారావు నవ్వుతు. 


“శుభమా అంటూ శుభలేఖ యిస్తూ ఈ మాటలు ఏమిటండి, పెళ్లి అయ్యిన తరువాత మీ కోరిక తీరుస్తాలెండి” అంది కోపంగా రామారావు భార్య లలిత. 

“ఏదో హాస్యం గా అన్నాను దానికి అంత బాధపడటం ఎందుకు అంటూ శుభలేఖ చదివి “రామారావు.. పెళ్లి చాలా దూరంలో పెట్టావు, ఎండాకాలం అంత దూరం ఈ వయసులో రాగలమంటావా” అన్నాడు శేఖర్. 


“భలే వారే. మీరు రాకుండా మా యింట్లో గుమ్మం కి తోరణం కట్టిందిలేదు. అలాంటిది పెళ్ళికి రానాంటే ఎలా, మీరు రాకపోతే పెళ్ళికి అందమే రాదు, ఎలాగైనా రావలిసిందే” అన్నాడు. 


“సరే మీరు యింత బలవంతం పెడితే రాకుండా వుండలేము సరే” అన్నాడు శేఖర్. రమాదేవి యిచ్చిన చిక్కటి కాఫీ త్రాగి బయటకు నడిచారు రామారావు దంపతులు. 


“ఈ ఎండాకాలం పెళ్లిళ్లు ఏమిటో, గాడుపు కొట్టడానికి” అన్నాడు భార్య వంక చూసి. 


“పోనిలేద్దురు, పాపం అంత దూరం నుంచి వచ్చి మనల్ని పిలిచాడు, ఎప్పుడో కొన్నాళ్ళు మన పక్క యింట్లో వుండి వెళ్లిపోయారు, అయినా గుర్తుపెట్టుకుని వచ్చి పిలిచారు. వెళ్లి వస్తే సంతోషిస్తారు” అంది రమాదేవి. 


“యింకో విషయం. మన యాభైయ్ ఏళ్ళ పెళ్లి రోజు కి లలితా జ్యూవలరీస్ లో కొన్న గొలుసు కూడా వేసుకోవడానికి అవకాశం వచ్చింది చూసారా” అంది. 


“సరేలే, ఒకరోజు ముందు గుర్తుకు చెయ్యి, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లి వద్దాం” అన్నాడు. 

***


“మీరు వాకింగ్ నుంచి వచ్చేడప్పుడు ఒక గిఫ్ట్ కవర్ కొని తీసుకుని రండి, రేపే రామారావు గారి యింట్లో పెళ్లి” అంది రమాదేవి. 


వాకింగ్ పూర్తి చేసుకుని, స్టేషనరి షాపుకి వెళ్లి గిఫ్ట్ కవర్ కొనుక్కుని యింటికి చేరి, భార్య కి అయిదు వందల నోటు యిచ్చి “కవర్లో పెట్టి రేపు వాళ్ళకి యివ్వు” అన్నాడు. 


“బాగానే ఉంది, ఈ రోజుల్లో అయిదు వందలకి విలువ ఎక్కడిది అండి, యింకో అయిదు వందలు కూడా ఇవ్వండి, వెయ్యి రూపాయలు ఇవ్వకపోతే బాగుండదు” అంటూ యింకో అయిదు వందలు తీసుకుంది. 


ఉదయమే బయలుదేరి ఏ ఎస్ రావు నగర్ లో ని అడ్రస్ కి వెళ్లారు శేఖర్ దంపతులు. క్యాబ్ లో కూర్చొని భార్య మెడ వంక చూసి “గొలుసు బాగానే వుంది” అన్నాడు శేఖర్. 


ఆ మాట విని గొలుసు లోపలగా వేసుకుని, “నలుగురిలోకి వెళ్తున్నాము దిష్టి కొట్టినా కొడతారు” అంది. ఎమిటో ఈ ఆడవాళ్లు అనుకుని నవ్వుకున్నాడు శేఖర్. 


పెళ్లి హల్ కి క్యాబ్ చేరుకుంది. రామారావు ఎవరో గెస్ట్ ని రిసీవ్ చేసుకుని లోపలకి వెళ్ళిపోతో క్రీకంట శేఖర్ వాళ్ళు క్యాబ్ దిగడం చూసాడు. 


“అదేమిటి మనల్ని చూసి కూడా పలకరించకుండా లోపలికి వెళ్ళిపోతున్నాడు” అంది రమాదేవి. 


“బహుశా బాగా కావలిసినవారు అనుకుంట.. అందుకే మనల్ని హడావిడిలో పలుకరించలేదు, పద లోపలకి” అంటూ హాలు లోకి వెళ్ళాడు శేఖర్. 


హైదరాబాద్ లో పెళ్ళికి పిలిస్తే హాలు యిట్టే నిండిపోతుంది అనుకుంటూ ఇద్దరు వెళ్లి ఖాళీ గా వున్న కుర్చీలలో కూర్చున్నారు. పెళ్లి మండపం మీద రామారావు దంపతులు హడావిడిగా వున్నారు. 


శేఖర్ భార్యతో అన్నాడు, “చూడు.. టిఫిన్ తినకుండా బయలుదేరి వచ్చాము, టిఫిన్స్ ఎక్కడ పెడుతున్నారో చూడు. వెళ్లి తిని వద్దాం, నాకు షుగర్ పడిపోతే కష్టం” అన్నాడు. 


వాళ్ళ వెనుక కుర్చీలో నుంచి “టిఫిన్స్ లేవు తాతగారు, డైరెక్టుగా భోజనలే ట, మా నాన్న చెప్పాడు” అన్నాడు ఒక చంటాడు. 


“చచ్చాం రా నాయనా, ఉదయమే పెళ్లి పెట్టుకుని టిఫిన్స్ కూడా ఆరెంజ్ చెయ్యలేదు ఏమిటో ఈ ఆడపిల్ల వాళ్ళు, రామారావు కైనా ఉండాలిగా.. మా వాళ్ళు ఉదయమే బయలుదేరి వస్తారు టిఫిన్స్ కూడా ఉండాలి అని, ఏమిటో ఈ తింగరి వేషాలు, సరే పద అలా బయటకు వెళ్లి ఏదైనా తిని వద్దాం” అన్నాడు శేఖర్ భార్య తో. 


“అలా మధ్యలో వెళ్తే బాగుండదు, అటు చూడండి జ్యూస్ గ్లాసులు తీసుకుని వస్తున్నాడు, రెండు గ్లాసులు తాగి ఓపిక పట్టండి, పెళ్లి అవగానే భోజనాలు పెట్టేస్తారు. ఈ లోపు నేను అలా ముందుకి వెళ్లి తెలిసిన వాళ్ళు ఎవ్వరైనా ఉన్నారేమో చూసి వస్తాను” అంది రమాదేవి. 


“చూసి రావడానికా లేకపోతే నీ కొత్త గొలుసు చూపించడానికా” అన్నాడు శేఖర్ నవ్వుతు. 


“ఆ.. పెద్ద చేయించారు వడ్డాణమని అందరకి చూపించడానికి” అంటూ ముందుకి వెళ్ళింది. 


స్టేజి మీద వున్న రామారావు భార్య ని చూసి రెండు సార్లు నవ్వినా, ఆవిడ ఎటో చూసి నట్టు చూసి వెళ్ళిపోయింది. యిహ లాభం లేదు అనుకుని భర్త శేఖర్ ని పిలిచి “రండి. స్టేజి మీదకి వెళ్లి నాలుగు అక్షింతలు వేసి గిఫ్ట్ కవర్ యిచ్చి వెళ్ళిపోదాం” అని అంది. 


స్టేజి మీదకి వస్తున్న శేఖర్ రమాదేవి లను చూసి రామారావు నవ్వుతు వచ్చి, “మీరు రారు అనుకున్నాను ఎండలకు బయపడి., వచ్చారు సంతోషం”, ఫోటోగ్రాఫర్ తో “బాబు.. మమ్మల్ని ఫోటో తియ్యి” అని, “శేఖర్ గారు. మీ ఫోన్ ఇవ్వండి ఫోటో తీస్తాడు మనల్ని” అన్నాడు. 


పెళ్ళికొడుకు,పెళ్లికూతురు మీద అక్షింతలు వేసి కిందకి దిగి వచ్చి క్యాబ్ మాట్లాడుకుని యింటికి వచ్చేసారు. 


వస్తో వస్తో తెచ్చుకున్న టిఫిన్ ప్యాకెట్ విప్పుతో, “చివరికి భోజనం చేసి వెళ్ళండి అని కూడా అనలేదు రామారావు, ఏదో వాళ్ళకి యింత మంది చుట్టాలు వున్నారు అని చూపించుకోవడం కోసం అందరిని పిలవడం, తరువాత పట్టించుకోకుండా వుండటం” అని జేబులోనుంచి గిఫ్ట్ కవర్ తీసి అల్మారా లో పెట్టాడు. 


“అదేమిటి గిఫ్ట్ కవర్ ఇవ్వలేదా” అంది రమాదేవి. 


“లేదు. యివ్వాలి అనిపించలేదు” అన్నాడు శేఖర్. 

***


“ఏమండీ! పనిమనిషి కాంతమ్మ ఫోన్ చేసింది. కూతురు పెళ్లి మాటల కోసం వాళ్ళ ఊరు వెళ్తోందిట, ఈ రోజు రాను అంది. బయట వాచ్మాన్ ని అడిగి ఎవ్వరైనా పనిమనిషి వుంటే పంపించమని చెప్పండి” అంది రమాదేవి. 


రెండు రోజుల తరువాత కాఫీ తాగుతున్న శేఖర్ కి గుమ్మం దగ్గర అలికిడి విని చూసాడు. కాంతమ్మ, ఆమె భర్త ఇద్దరు కనిపించడం తో “ఊరు నుంచి వచ్చావా” అన్నాడు శేఖర్. 


“సార్! ఈయన మా పెనిమిటి” అని పరిచయం చేసింది. 


“ఆ.. లోపలికి రండి” అన్నాడు. 


“అమ్మగారు, మీరు కూడా యిటు వచ్చి సార్ పక్కన కూర్చోండి” అని పిలిచింది కాంతమ్మ. 


కాంతమ్మ దంపతులు శేఖర్ దంపతులకి కాళ్ళకి నమస్కారం చేసి, శుభలేఖ శేఖర్ చేతికి యిచ్చి, “సార్! మా అమ్మాయి చిన్న పిల్లగా మీ యింట్లో తిరిగింది, యిప్పుడు దానికి పెళ్లి, మొదటి శుభలేఖ వినాయకుడి దగ్గర పెట్టి, రెండవ శుభలేఖ మీకు యిస్తున్నాము. మిమ్మల్ని పెళ్ళికి రమ్మని కోరుకుంటున్నాము” అన్నారు. 


“చాలా సంతోషం కాంతమ్మ. మీ అమ్మాయి కి మంచి భర్తని చుసావు. మీ బస్తీకి వెతుకుంటూ రాలేకపోయినా మా దీవెనలు తప్పకుండా వుంటాయి” అన్నాడు శేఖర్. 


“అమ్మగారు, మీరు సార్ పెళ్ళికి వచ్చి అయిదు నిముషాలు అయిన వుండి వెళ్ళాలి” అని మరీ మరీ ప్రాధేయ పడ్డారు. 


ఈ లోపున శేఖర్ లోపల నుంచి పదివేల రూపాయలు తీసుకుని వచ్చి భార్య కి యిచ్చి కాంతమ్మ కి ఇవ్వమన్నాడు.

*** 


“ఏమంటారు.. పెళ్ళికి వెళదామా, వెళ్ళక పోతే మన యింట్లో పనికి రావడం మానేస్తుందేమో” అన్న రమాదేవి తో “ఎక్కువగా ఆలోచించకు, డబ్బు వున్న రామారావే పెళ్ళికి పిలిచి పలకరించలేదు. పాపం వీళ్ళు నాలుగు ఇళ్లలో పనిచేసుకుని వున్నదానిలో కూతురు పెళ్లి చేసుకుంటున్నారు. మనం వెళ్లకపోయినా ఏమి అనుకోరు” అన్నాడు శేఖర్. 


సాయంత్రం శేఖర్ కూతురు ఫోన్ చేసి “అమ్మ చెప్పింది, రేపు కాంతమ్మ వాళ్ళ కూతురు పెళ్ళిటగా, మీరిద్దరూ వెళ్ళండి డాడీ, ఎన్నో ఏళ్ళ నుంచి కాంతమ్మ మన యింట్లో పని చేస్తోంది, వెళ్తే సంతోషిస్తారు. పదివేలు యిచ్చి మంచి పని చేసారు” అని తండ్రికి నచ్చచెప్పింది. 


“సరే అలాగే వెళ్తాములే” అన్నాడు. 


పెళ్లిరోజు ఉదయం యింట్లో టిఫిన్ తినేసి భార్యభర్తలు యిద్దరు కారులో బయలుదేరి వెళ్లారు. మ్యారేజ్ హాలు చిన్నగా వున్నా జనం తో నిండి వుంది. లోపలికి వస్తున్న శేఖర్ దంపతులని చూసి కాంతమ్మ, కాంతమ్మ భర్త పరుగున వచ్చి “రండి సార్, చాలా సంతోషం గా వుంది” అంటూ ముందు వరస లో వున్న సోఫాలో కూర్చోపెట్టింది. 


“కాంతమ్మా! మా గురించి ఆలోచించక నీ పని చూసుకో, ఆడపిల్ల తల్లివి, నీకు బోలెడంత పని ఉంటుంది” అంది రమాదేవి. అయిదు నిమిషాల తరువాత కాంతమ్మ తో పాటు ఒక పురోహితుడు చేతిలో ప్లేట్ పట్టుకుని వచ్చారు. 


“సార్! మిమ్మల్ని మా యింట్లో భోజనం చెయ్యమని అడగలేము, మీ కోసం ఉడిపి హోటల్ నుంచి పంతులు గారిచే టిఫిన్ తెప్పించాను, కాదనకుండా స్వీకరించండి” అంది. 


“యింట్లో తిని వచ్చాము, ఎందుకు అనవసరంగా శ్రమ తీసుకున్నావు” అన్నాడు శేఖర్. 


“సార్ కి యిష్టం అని పూరి తెప్పించాను, మీకు ఇడ్లీ అమ్మా, కాదనకుండా తినాలి, పంతులు గారే తీసుకుని వచ్చారు” అంది. 


పూరీ అనగానే శేఖర్ కి మనస్సు లాగింది. “సరే నీ సంతృప్తి కోసం ఒక పూరీ తింటాను” అని ఒక పూరీ తీసుకుని తిన్నాడు. 


ముహూర్తం టైము అయ్యింది. మంగళసూత్రం కట్టటం అయిన తరువాత కూతురుని అల్లుడిని శేఖర్ వాళ్ళు వున్న చోటుకి తీసుకుని వచ్చి ఆశీర్వచనం తీసుకుంది. శేఖర్ తన జేబులో నుంచి రామారావు కి యిద్దామని అనుకున్న గిఫ్ట్ కవర్ ని కాంతమ్మ కూతురు చేతిలో పెట్టి అక్షింతలు వేసాడు. రమాదేవి తనతో పాటు తెచ్చిన చీరా, ప్యాంటు షర్ట్ కవర్ కాంతమ్మ కి యిచ్చి ‘యివి మీ కోసం’ అని చెప్పింది. పెళ్ళికి వచ్చిన జనం వీళ్ల చుట్టూ మూగి వింతగా చూస్తున్నారు. 


కారు దాకా వచ్చి కాంతమ్మ దంపతులు సాగానంపారు. కారు డ్రైవ్ చేస్తో భార్య తో అన్నాడు “డబ్బు వున్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి వున్న తేడా. రామారావు పెళ్ళికి పిలిచి పట్టించుకోలేదు, వీళ్ళు మనల్ని ఒక నిమిషం వదలకుండా మర్యాదలు చేసారు” అన్నాడు. 


 *********శుభం **********

                                 

-జీడిగుంట శ్రీనివాసరావు













 
 
 

1 Comment


@saipraveenajeedigunta8361

• 2 hours ago

Chala bagundi


Like
bottom of page