తెలివైన రాజు
- Karlapalem Hanumantha Rao
- 3 hours ago
- 2 min read
#తెలివైనరాజు, #ThelivainaRaju, #KarlapalemHanumantha Rao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguMoralStories, #నైతికకథలు

Thelivaina Raju - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao
Published In manatelugukathalu.com On 22/04/2025
తెలివైన రాజు - తెలుగు కథ
రచన: కర్లపాలెం హనుమంతరావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఆ దేశంలో ప్రతి సంవత్సరం ప్రజలు కొత్త రాజును ఎన్నుకునే ఆచారం ఉంది. అలా ఎన్నికైన రాజు ఒక సంవత్సరం తర్వాత దేశం విడిచి శాశ్వతంగా ద్వీపాంతర వాసానికి వెళ్ళిపోవాలి.
ఆ నిబంధన ప్రకారం అప్పటి రాజు తన పదవీకాలం ముగించాక, ద్వీపానికి వెళ్ళే సమయం వచ్చింది. రాజోచిత గౌరవ మర్యాదలతో నగరమంతా ఏనుగుపై సంచారం చేసి ప్రజలకు వీడ్కోలు చెప్పి ఒక చిన్న పడవలో యధాప్రకారం ఒక నిర్జన ద్వీపానికి బయలుదేరి వెళ్ళిపోయాడా రాజు.
రాజును దిగబెట్టి తిరిగివచ్చే భటులకు దారి మధ్యలో బోల్తాపడిన పడవ చెక్క పట్టుకుని వేళ్ళాడే ఒక యువకుడు కనిపించాడు. వారు రక్షించి తెచ్చిన ఆ యువకుడిని ఆ ఏడాదికి రాజుగా జనం ఎనుకున్నారు.
దేశాచారం ప్రకారం తన వైభోగం ఏడాది ముచ్చటే అని గ్రహించాడు రాజు.
గద్దెనెక్కిన నాలుగో రోజు గతంలో రాజులు పంపబడ్డ ద్వీపాన్ని దర్శించటానికి బైలుదేరాడు. తీరా వెళ్ళి చూస్తే అదంతా ఒక నిర్జనమైన అటవీ ప్రాంతం. రేయింబవళ్ళు క్రూరమృగాల ఘోషతో దద్దరిల్లుతున్నది ఆ కారడివి. అక్కడ అక్కడక్కడాకనిపించిన కంకాళాలను బట్టి గతంలోని రాజులకు ఏ గతిపట్టిందో ఇట్టే పసిగట్టాడు రాజు.
మరో నెలకు చాలినంత సిబ్బందితో తిరిగి వచ్చి చెట్టూ చేమను కొట్టించి, క్రూరమృగాలను చంపించి ఆ ద్వీపాన్ని ఒక సుందర ప్రాంతంగా మార్పించేశాడా రాజు. అడపా దడపా కార్మికులను పంపిస్తూ అ ద్వీపాన్ని ఓ నందనవనంగా తీర్చి దిద్దాడు. గృహనిర్మాణ నిపుణుల ద్వారా కనుల పండువుగావిశ్రాంతి గృహాలూ, ఆరామాలు నిర్మించాడు. రాజు పాలన సగంలో పడే వేళకు మునుపటి దుర్భేద్యమైన ద్వీపం ఒక ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతంగా రూపాంతరం చెందింది.
మరో మూడు నెలలకు సింహాసనం దిగిపోతాడనగా ఆరాజు రోజు మార్చి రోజు ఒంటరిగా ఆ ద్వీపానికి వెళ్ళి రావడం సాగించాడు.
గతకాలపు రాజుల్లా సంపద వృథా చేయకుండా నిరాడంబరంగా జీవించే ఈరాజు అక్కడ చేసే వ్యవహారమేమిటో ప్రజలకు అంతుబట్టేది కాదు.
కనురెప్ప పడేంతలోనే కాలం పరిగెత్తినట్లు రాజు పాలన ముగిసిపోయింది. దేశాచారం ప్రకారం సర్వాలంక భూషితుడయిన రాజు హస్తి వాహనంపై నగర సంచారం చేస్తూ చిరునవ్వుతో తమకు వీడ్కోలు పలకటం చూసి జనం విస్తుపోయారు. ఈ తరహా వింత అనుభవం దేశవాసులకు కలగటం ఇదే మొదటిసారి.
ఆత్రుత ఆపుకోలేక సాహసించి అడిగిన పౌరులు కొంతమందికి ఆరాజు ఇచ్చిన సమాధానం భవిష్యత్తులో సుఖవంతమైన జీవితం గడపేందుకు పాటించవలసిన ముందస్తు జాగ్రత్తలను గూర్చి నొక్కి చెబుతుంది.
"గతంలోని రాజుల్లాగా నేను నా పాలనా సమయాన్ని భోగలాలసతో వృధా చేయలేదు. పదవి పోయి ద్వీపాంతర నివాసం ఖాయమన్న అవగాహన ఉంది కనక అధికారం చేతిలో ఉన్నప్పుడే దుర్జనారణ్యాన్ని సుందర వనంగా తీర్చిదిద్దాను భావిజీవితానికి అవసరమైన జీవితావసరాలను ఒంటరిగా వెళ్ళి ముందే ఏర్పాటు చేసుకున్నాను. అందుకే నేనిప్పుడు నిశ్చింతగా ఆ ద్వీపానికి వెళ్ళిపోతున్నాను" అన్నాడు రాజు.
రాజు ముందు చూపును అభినందించకుండా ఉండలేకపోయారు జనమంతా.
***
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోదీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.
Comentarios