తెలివి ఒక్కడి సొమ్మంటే!
- Lakshminageswara Rao Velpuri
- 4 hours ago
- 8 min read
#లక్ష్మీనాగేశ్వర రావువేల్పూరి, #LakshminageswaraRaoVelpuri, #తెలివిఒక్కడిసొమ్మంటే, #TheliviOkkadiSommante, #TeluguKathalu, #తెలుగుకథలు

Thelivi Okkadi Sommante - New Telugu Story Written By Lakshmi Nageswara Rao Velpuri
Published In manatelugukathalu.com On 21/04/2025
తెలివి ఒక్కడి సొమ్మంటే! - తెలుగు కథ
రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి
ఒక చిన్న రాజ్యానికి సామంత రాజు 'ప్రదీప్ వర్మ గారు'. ఆయన ఏకచత్రాధిపత్యం గా రాజ్యాన్ని పాలిస్తూ, తమ ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ, మన్ననలు పొందేవాడు. కానీ ఆ రాజు గారికి చిరు కోపం, కొంత తెలివి తక్కువ తనం ఉండడం వల్ల మంత్రిగారు సమయస్ఫూర్తితో ప్రవర్తిస్తూ, ఆ రాజ్యానికి అండదండగా ఉండేవారు.
ఒకరోజు రాజుగారు నగరసంచారినికీ మంత్రిగారితోనూ, తగిన పరివారంతోనూ మొత్తం నగరమంతా పర్యటించ సాగారు, ప్రజలు కూడా రాజు గారి దర్శనం అవ్వగానే, జై జై 'అంటూ నినాదాలు చేస్తూ వినయంగా ఒంగి నమస్కారాలు చేసేవారు.
రాజుగారు తన గుర్రం మీద హుందాగా నవ్వుతూ, “మంత్రిగారు! మన రహదారుల పక్కన మంచి మంచి పండ్లు చెట్లు నాటించండి, రహదారుల పక్కన ఉన్న మరి చెట్లు, వేప చెట్లు కొట్టించి, అన్నిచోట్ల మంచి మంచి పండ్లు కాసే చెట్లను నాటించండి. నగరంలో ఎక్కడ ఆహారానికి లోటు రాకూడదు” అని అనగానే మంత్రిగారు అవాక్కయ్యారు.
“అయ్యా రాజుగారు!, నాదొక మనవి, రోడ్ల కీ ఇరువైపులా మంచి పండ్ల చెట్లను నాటించితే ప్రజలు కాయకష్టం చేయకుండా, రోడ్డు మీద దొరికిన పళ్ళు అన్ని తింటూ బద్ధకస్తులు అవుతారు, మన రాజ్యం ఆర్థికంగా వెనుకబడి పోతుంది. అందువల్ల పెద్ద పెద్ద మర్రి చెట్లు, వేప చెట్లు ఉండడం వల్ల ప్రజలు అలిసిపోయిన శరీరానికి నీడనిస్తూ సేద తీరుస్తాయి. కనుక మీ ఆలోచన ఉపసంహరించుకోండి.” అంటూ ప్రాధేయపడి రాజుగారి తెలివి తక్కువతనానికి ఆశ్చర్యపోతూ అన్నాడు మహామంత్రి.
“ఓహో అలాగా!, అయితే ఉండనివ్వండి” అంటూ మంత్రిగారితొ అన్నారు రాజుగారు.
మంత్రిగారు కూడా రాజుగారి తెలివి తక్కువ తనాన్ని ఎన్నో విధాలుగా రాజుగారికి కోపం రాకుండా, అటు ప్రజలకు ఇబ్బంది కాకుండా అనుక్షణం కాపాడుతుండేవారు.
అలా రాజుగారు పర్యటిస్తూ, నగర సరిహద్దుల దగ్గరకు వచ్చేసరికి, సరిగ్గా నగర ద్వారం దగ్గర ఎంతో ఎత్తయిన బరువైన ఒక 'కొండశిల' ఉండడంతో అక్కడ ఆగి, “మంత్రిగారు.. మన రాజ్య సింహద్వారం దగ్గర అడ్డంగా ఉన్న కొండ శిలను ఎందుకు తొలగించలేదు, దానివల్ల పర్యాటకులు నగరానికి వస్తున్న వాళ్ళకి, ఎంతో ఇబ్బంది కదా! దానిని వెంటనే అక్కడ నుంచి తొలగించండి”, అని అనగానే మంత్రి గారి గుండెల్లో రాయి పడింది.
“అయ్యా రాజుగారు! తరతరాల నుంచి ఆ కొండశిల విదేశీ ఆక్రమణలను నుంచి కాపాడుతుంది, వేరే రాజ్యపు సైన్యాలు తొందరగా లోపలికి జొరపడకుండా నిలువరిస్తుంది. అయినా ఇప్పుడు ఆ కొండ శిలను తొలగించడం అంటే సాధ్యం కాక ఎన్నో ప్రయత్నాలు చేసినా, ఏనుగుల చేత లాగించిన ఫలితం లేక, ఆ కొండశిల ను పక్కకు జరపడానికి చేయని ప్రయత్నం లేదు. ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలమయ్యారు. కనుక మీరు కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి,” అంటూ వినయంగా సెలవిచ్చారు మంత్రిగారు.
“మంత్రిగారు! మీరు ఏదో కారణాలు చెప్పి నా నిర్ణయాన్ని మార్చలేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కొండ శిలను కదిలించాలి” అంటూ గట్టిగా రాజుగారు కోప్పడే సరికీ, మంత్రిగారు భయపడుతూ ఎలాగైనా రాజుగారి మొండితనం, తెలివి తక్కువ తనం తెలుసు కనుక, “సరే రాజుగారు, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇవాళ్లే నగరం అంతా ప్రకటిద్దాం.. ఎవరైతే ఈ కొండశిల ని కదిపి ఒక పక్కకు పెడతారో వారికి రాజ భోగాలు కల్పించి అన్ని విధాలా జీవితాంతం రాజు గారి కొలువులో మంత్రిగా కొలువు ఇస్తాము. ఒకవేళ రాయి కదపడం లో విఫలమైనచో, వారికి 'ఉరిశిక్ష వేస్తాం', అని నగరమంతా మీ రాజ శాసనంతో ప్రకటించండి!” అని సలహా చెప్పారు మంత్రిగారు.
“భేష్ మంత్రి గారు! చక్కని ఆలోచన చెప్పారు ఈరోజే నగరంలో, మొత్తం రాజ్యంలో నా ఈ శాసనం అన్నిచోట్ల ప్రజలకు తెలిసేలా పెట్టించండి” అంటూ ఆనందంగా వెనక్కిమరిలారు ప్రదీప్ వర్మ రాజుగారు.
ఆ రాజ్యంలో ప్రజలు కూడా ఈ రాజశాసనం చదివి, “ఓరి బాబోయ్! ఎన్నో ఏళ్లగా ప్రయత్నిస్తున్న ఆ కొండ శిలను ఎవరు కదపలేకపోయారు, కచ్చితంగా విఫలమై ఉరిశిక్ష వేసుకోవడం కన్నా,
'బ్రతికుంటే బలసాకు తినొచ్చు' అన్న భావనతో
ఎవరు అందుకు సాహసించలేదు.
అలా నెలలు గడుస్తున్నా రాజుగారికి అసహనం పెరిగిపోయి “మంత్రి గారు.. మీ ఆలోచన సరిగ్గా లేదు. మన రాజ్యంలో ధైర్యవంతులు, బలవంతులు లేనే లేరా.. ఏంటి వైపరీత్యం! నాకు ఇంకొక రెండు నెలలలో ఆ కొండ శిలను కదిలించిన వారు రాకపోతే, మీ మంత్రి పదవి కూడా తీసేస్తాను” అంటూ బెదిరించారు రాజుగారు.
రాజు గారి తెలివి తక్కువ తనం నాకు చివరికి ఉద్యోగం కూడా పోయే ప్రమాదం పొంచి ఉన్నదని బెంగతో పాపం చాలా అశాంతిగా కాలం గడపసాగారు మంత్రిగారు.
మంత్రి కొలువు ఎలాగో పోతుంది, నాకు రాజ్య బహిష్కరణ కూడా విధిస్తారు ఏం చేయాలి దేవుడా! అంటూ క్షణక్షణం బెంగతో ఉన్నారు మంత్రిగారు.
ఒకరోజు 25 ఏళ్ల నవ యువకుడు, కండలు కండలు తిరిగిన బలాఢ్యుడు దూరపు బంధువు పేరు 'రవీంద్ర' అను కుర్రాడు మంత్రి గారి ఇంటికి వచ్చి “మావయ్య!” అంటూ కాళ్లకు దండం పెట్టి దీన ముఖంతో “మావయ్య, అమ్మ నాన్న ఇంటి నుంచి తగిలేశారు, నేను ఎందుకు పని చేయనని బద్ధకస్తుడనని తిడుతూ, మీ దగ్గరకు వెళ్లి ఏదైనా చిన్న ఉద్యోగం వెతకమని చెప్పి పంపించారు, నా దగ్గర దమ్మిడీ లేదు, నన్ను ఆదుకో మావయ్య!” అంటూ ప్రాధేయపడేసరికి,
మంత్రిగారు అసలే చికాకుతో ఉండగా “ఒరేయ్! చాన్నాళ్ళకి వచ్చావు. చక్కగా నాలుగు రోజులు భోజనం చేసి మీ ఊరికి పో, ఇక్కడ నాకే ఉద్యోగం ఊడిపోయేలా ఉంది, నీకు నేనేమి చేయగలను” అంటూ చెప్పేసరికి, “మావయ్య! ఎలాంటి చిన్న పనైనా నేను చేస్తాను, నన్ను మా ఊరికి పంపించకండి!” అంటూ ఏడవడం మొదలుపెట్టాడు.
“సరే సరే చూద్దాం! ముందు భోంచేసి విశ్రాంతి తీసుకో” అంటూ గబగబా బయటికి వెళ్లిపోయారు మంత్రిగారు.
ఆ రాత్రి మంత్రి గారిని మరోసారి రాజుగారు పిలిచి “ఏవండీ! మీకు ఇచ్చిన సమయం దగ్గర పడుతుంది. ఇప్పటివరకు ఎవరు కొండ శిలను తీయడానికి రాలేదు, ఇది మీ చేతకానితనానికి నిదర్శనం.. ఆలోచించుకోండి!” అంటూ బెదిరించేసరికి మంత్రి గారు ఆయన మూర్ఖత్వం, మొండితనం గురించి తెలిసే ఒక నిర్ణయానికి వచ్చారు.
ఆరుబయట పండు వెన్నెలలో పడుకున్న తన మేనల్లుడు రవీంద్రను చూసేసరికి ఆ కండలు తిరిగిన శరీరాన్ని ఆ తేజస్సును చూసి, “ఒరేయ్ రవీంద్ర, మన రాజ్యంలో ఒక పెద్ద క్లిష్ట సమస్య వచ్చి పడింది, దానితో నాకు మంత్రి పదవి ఊడిపోయి, దేశ బహిష్కరణకు కూడా సిద్ధం అవ్వాల్సి ఉంది” అంటూ రవీంద్ర తల మీద రాస్తూ బాధగా అన్నారు మంత్రి గారు.
“ఏమిటి మావయ్య! అంత పెద్ద పదవిలో ఉండి కూడా, ఎందుకు బాధపడతారు? కనీసం నావల్ల ఏమైనా అవుతుందా చెప్పండి, ప్రాణాలు తెగించైనా చేస్తాను!” అంటూ రవీంద్ర అనునయించేసరికి, “మరి ఏమీ లేదురా, రెండు నెలల క్రితం ఒక రాజశాసనం ప్రజలకు పంపించాం. అది ఏమిటంటే మన రాజ్య సింహద్వారం దగ్గర ఒక కొండ శిల పడి ఉంది. అది చాలా ఆటంకంగా ఉందని, మన తెలివి లేని మహారాజు గారు ఎవరైనా దానిని జరిపి పక్కకు పెట్టిస్తే, వారికి సర్వ భోగాలు కల్పిస్తూ, రాజు గారి కొలువులో మంత్రి పదవిని కూడా ఇస్తామని ప్రకటించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎంతమంది ప్రయత్నించినా, కదలని ఆ కొండశిలని పక్కకు జరిపితే, వారిని ఉన్నత శిఖరాలు, భోగభాగ్యాలు కల్పిస్తామని లేదా ప్రయత్నించి విఫలమైతే బహిరంగంగా 'ఉరిశిక్ష వేస్తామని ప్రకటించారు.
దానివల్ల ప్రజలు కూడా ధైర్యం చేయలేక, రాజు గారి మొండితనం భరించలేక, ఎవరు సాహసించలేకపోయారు. దానికి నేనే కారణమని, నేను ఆ కొండశిల ను కదిలించడానికి ఎవరి ని సమకూర్చలేకపోయానని నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, దేశ బహిష్కరణకు తయారుగా ఉండాలని ఆదేశించారు. దానివల్ల రాత్రి పగలు నిద్రలేక బెంగతో పడి ఉన్నాను” అంటూ బాధపడుతున్న మావయ్య ని దగ్గరగా తీసుకొని రవీంద్ర ఓదారుస్తూ, “మావయ్య! అంత పెద్ద కొండ శిలను కదిలించడానికి ఎవరు ముందుకు రాకపోతే మీకు శిక్ష ఎందుకు? మీరు బెంగపడకండి. నేను ఆలోచించి రేపు ఉదయం కల్లా మీకు చెబుతాను, హాయిగా నిద్రపోండి!” అంటూ మామయ్య ని పంపించాడు రవీంద్ర.
ఆ మర్నాడు రవీంద్ర మాట్లాడుతూ “ఏమీ లేదు మావయ్య. నేను ఎంతో కసరత్తులు చేసి ఎన్నో కుస్తీ పోటీలలో గెలిచాను. నన్ను అందరూ మహాబలుడు అంటారు, మా ఊళ్లో. నన్ను రాజు గారి సభకు తీసుకెళ్లి పరిచయం చేయండి. నేను రాజు గారి సభలో అందరి ముందు నా బలాన్ని ప్రదర్శించి రాజు గారి సమక్షంలో నేను ఆ కొండను ఎత్తి పక్కకు పెట్టగలను అని ప్రకటిస్తాను. ఎలాగా ఆ పని చేయగలవు? అని అడిగితే నన్ను 3 నెలల పాటు రాజ భోగాలతో కావలసిన ఖరీదైన భోజనం పెట్టించమని అడుగుతాను. అలా 3 నెలలు వ్యాయామం చేస్తూ, నా శరీరాన్ని అమితంగా పెంచి, ఆ కొండను జరిపి పక్కకు పెట్టగలను. లేదా మీరు నాకు 'మరణశిక్ష విధించవచ్చు' అని చెప్పి రాజు గారి అంగీకారం తీసుకుంటాను” అని రవీంద్ర అనేసరికి,
“ఒరేయ్ మూడు నెలల పాటు నిన్ను పోషించిన, నువ్వా కొండను ఎత్తను లేవు. మరెలాగా” అనగానే
“మావయ్య.. అదే రహస్యం. మీకు కూడా చెప్పను. చేసి చూపిస్తాను. లేదా మరణశిక్ష ఆనందంగా అనుభవిస్తాను.” అని రవీంద్ర అనేసరికి, ‘పోనీలే, కొంత సమయం దొరుకుతుంది. నా మేనల్లుడు ఎలాగో కదపలేడు కొండ శిలను. ఈ లోపల నేను దేశ బహిష్కరణ తప్పించుకొని మేనల్లుడిని కూడా మరణశిక్ష పడకుండా ఏదో విధంగా రాజు గారిని ఒప్పిస్తాను’ అని మనసులోనే అనుకుంటూ, “సరే రేపు రాజుగారి సభకు నాతో పాటు రా,” అంటూ కొంచెం మనశ్శాంతిగా పడుకున్నారు మంత్రిగారు.
ఆ మర్నాడు రాజు గారి సమక్షంలో మంత్రిగారు మాట్లాడుతూ, “ఓ రాజా! మనం ప్రకటించినట్లు ఒక బలశాలి, నవ యువకుడు, మన సరిహద్దులలో ఉన్న కొండ శిలను తొలగిస్తానని ముందుకు వచ్చాడు, పేరు రవీంద్ర!” అంటూ పక్కనే నిలబడి ఉన్న రవీంద్రను పరిచయం చేశారు మంత్రిగారు.
“జై జై మహారాజా! మీకు వందనాలు” అంటూ సవినయంగా వంగి నమస్కారాలు చేస్తూ, నిలబడ్డ రవీంద్ర ని చూస్తూ ఆశ్చర్యంతో, “నువ్వు చూస్తే చిన్నపిల్లాడిలా ఉన్నావు, అంత పెద్ద కొండ శిలను ఎలా కదిలిస్తావు? అది జరగకపోతే నీకు మరణ శిక్ష పడుతుంది” అంటూ హెచ్చరించేసరికి, “సరే మహారాజా! నాది ఒకే ఒక్క షరతు, రాజభోగాలతో అత్యంత రుచికరమైన భోజనంతో, మూడు నెలల పాటు నన్ను భరించండి, గడువు తీరిన మర్నాడు నేనే స్వయంగా కొండను కదిలిస్తాను, ఎలా కదిలిస్తానో ఇప్పుడు చెప్పను. ఈ షరతులకు మీరు ఒప్పుకుంటే, నేను మూడు నెలల పాటు ఇక్కడే ఉండి వ్యాయామం చేస్తూ, రుచికరమైన భోజనం తింటూ ఆ కొండ శిలను కదిలించే శక్తి సంపాదించి చూపిస్తాను” అని అన్న రవీంద్రుని చూసి సభలో కూర్చున్న వారు, రాజుగారు కూడా ఆశ్చర్యపోయారు.
“ఒరేయ్ బాబు.. నీకు నిండు నూరేళ్లు ఆయుషు ఉంది. ఎందుకు అలా తెగిస్తావు” అని రాజుగారు అనేసరికి, “అయ్యా, నాకు ధైర్యం మనోబలం, కండబలం ఉన్నాయి. నేను సాధిస్తానని నమ్మకంతోనే మీ వద్దకు వచ్చాను. దయచేసి నన్ను అనుమతించండి” అంటూ వేడుకున్నాడు రవీంద్ర.
“సరే, అలాగే మూడు నెలల పాటు నీకు రాజప్రసాదంలో మంచి రుచికరమైన భోజనం ఉంటుంది. నువ్వు తగిన సమయానికి వ్యాయామాలు చేస్తూ 3నెలల చివరి రోజున ప్రజలందరి సమక్షంలో ఆ కొండశీలని న కదిలించి
మన రాజ్య సింహద్వారానికి అడ్డు లేకుండా చేయాలి. అలా కాని పక్షంలో ఆ రోజే నీ తలను నరికి అదే సింహా ద్వారానికి వేలాడదీస్తాను” అంటూ రాజుగారు అనేసరికి ఇటు మంత్రి గారికి, అటు రవీంద్రకు గుండెలు గుభేల్ మన్నాయి.
అయినా మొక్కవోని ధైర్యంతో రవీంద్ర రాజుగారికి కృతజ్ఞతలు చెప్పి అటు మంత్రిగారికి ధైర్యం చెప్పి ఆ రోజు నుంచి జీవితంలో కని విని ఎరగని భోజనం చేస్తూ ఆనందంగా గడపసాగాడు రవీంద్ర.
మంత్రిగారు మాత్రం “ఒరే! రాజుగారు ఒప్పుకున్నారు కానీ జాగ్రత్త, అసలే మొండి పట్టుదల తో ఉన్న రాజుగారు అన్నంత పని చేస్తారు. నీ ప్రాణాలు పోతే నేను ఎవ్వరికీ జవాబు చెప్పలేను” అంటూ కళ్ళు నీళ్లు పెట్టుకున్న మంత్రిగారిని ఓదారుస్తూ, “మావయ్య, నువ్వు బెంగపడకు. మూడు నెలల తర్వాత ఆ కొండ శిలను కదిలించి నువ్వు గర్వపడేలా చేస్తాను, నన్ను ఆశీర్వదించు” అంటూ మావయ్య కాళ్లకు నమస్కారం చేసి వెళ్లిపోయాడు రవీంద్ర.
అలా మొదటి నెల షడ్రసోపేతమైన రుచికరమైన మాంసాహారం తింటూ, వ్యాయామం చేస్తూ సకల భోగాలు అనుభవిస్తూ, రవీంద్ర మంచి బలసాలిగా తయారై ఆ దేశంలో ఉన్న వస్తాదులందరినీ రాజు గారి సమక్షంలో ఓడించి, ఆయనకు ఎనలేని విశ్వాసం కల్పించాడు రవీంద్ర.
మంత్రిగారు రవీంద్రను కలిసి “ఒరే, మూడో నెల కూడా ఇట్టే గడిచిపోతున్నది, వచ్చేవారంతో నీ గడువు ముగుస్తుంది. ఏం ఆలోచించావు, ఇప్పటికైనా ఎవరికీ కనిపించకుండా పారిపో! నా పాట్లు నేను పడతాను, బతికుంటే బలసాకు తినవచ్చు, మీ అమ్మానాన్నలకు నేను ఏం జవాబు చెప్పను?, అతి పెద్ద కొండశిలను కదిలించడం నీవల్ల కాదు” అంటూ కంగారుగా మేనమామ మంత్రి గారు చెప్పేసరికి, రవీంద్ర “లేదు మావయ్య! నీకు ఎలాంటి భయం లేదు, రేపే నా చివరి రోజు. ఆ రాజుగారు అన్ని సన్నాహాలు చేశారు, రాజ్యంలోని ప్రజలందరి సమక్షంలో నేనా కొండ శిలను ఎత్తి బయట పెట్టాలి. అది జరుగుతుంది, భయపడకండి” అన్నాడు రవీంద్ర ఎనలేని మనోధైర్యంతో.
ఆ మర్నాడు సరిగ్గా పది గంటల సమయానికి మహారాజు గారు సకల ప్రజల సమక్షంలో ఎంతో బిగుతైన ఒక నిక్కరు, మంచి బనీను వేసుకుని నడుముకి పెద్ద తోలు బెల్టు పెట్టుకొని వచ్చిన రవీంద్ర ని చూసి అక్కడున్న ప్రజలందరూ హర్షద్వానాలు చేశారు. రవీంద్ర కూడా కండలు తిరిగిన తన శరీరంతో మహారాజు గారికి వందనాలు చేస్తూ, ఆ కొండశిల దగ్గరకు చేరుకున్నాడు.
మహారాజు గారు కూడా ఆనందంతో “ఒరేయ్ యువకా! నీకు ఇదే నా ఆజ్ఞ. అనుకున్న ప్రకారం ఆ కొండ శిలను తీసి పక్కకు జరిపి, మన రాజ్య సింహద్వారానికి అడ్డు తొలగించు” అనేసరికి రాజ్య డ్డంకా మోగించారు సైనికులు గుండెలదిరేటట్టు. రవీంద్ర కూడా మహారాజు గారికి, మంత్రి గారికి అక్కడున్న ప్రజానీకానికి వందనములు చేసాడు. మండుటెండలో మిల మిల మెరుస్తున్న రవీంద్ర కండలు చూసి, ఆహా ఎంత బలవంతుడు ఈ యువకుడు, అంటూ ప్రజల ఆశ్చర్యపోయారు.
రవీంద్ర కొండ శిలను తాకుతూ, గట్టిగా గుద్దుతూ చుట్టూ తిరుగుతూ, పలుమార్లు పరీక్షించి, కొండశిల ఒక కోన దగ్గర ఆగి వంగి, “ఓ మహారాజా! నేను తయారుగా ఉన్నాను, ఆ కొండను నా వీపు పైన పెట్టండి, మీరు చెప్పిన చోట దించుతాను” అనేసరికి, అక్కడ ఉన్న మహారాజు గారు ప్రజలు ఆశ్చర్య పోయారు, రాజుగారు ఎనలేని ఆగ్రహంతో “ఏరా! మేము ఈ ఆ కొండను ఎత్తి న నీ వీపుపై పెట్టాలా? అది కదిలించ లేకపోవడం వల్ల కదా, నిన్ను నియమించినది. మేము ఎలా పెడతాము?” అంటూ అడిగేసరికి,
రవీంద్ర నిర్భయంగా, “ఓ మహారాజా! మీరు చెప్పినట్లు ఆ కొండ శిలను వేరొక చోట పెట్టమని ఆదేశించారు, అది నేను కదిలించలేను గనుక, మీ పరివారము ఎలాగైనా ఆ కొండ శిలను నా వీపు పైన పెట్టండి. దాన్ని తీసుకెళ్లి వేరే ప్రదేశంలో పెడతాను” అనేసరికి, రాజుగారు ఎంతొ మౌనంగా ఆశ్చర్యపోతూ, తన తెలివి తక్కువ తనానికి, మొండితనానికి సిగ్గుపడుతూ “బాబు రవీంద్ర, నీ తెలివికి మెచ్చాను. నీకు ఆనాడు కొండని వేరే ఒక చోట పెట్టమని ఆదేశించాను. కానీ నీ తెలివి తేటలతో మూడు నెలల పాటు నా దగ్గరే ఉండి, ఎంతో మందిని ఓడించి, నా ప్రశంసలు పొంది ఈనాడు ఈ నీ యొక్క చిన్న తెలివితో మా కళ్ళు తెరిపించావు.
మంత్రిగారు కూడా ఎన్నో మార్లు చెప్పారు, ఆ కొండశిలను కదిలించడం అసాధ్యమని. అయినా నేను వినలేదు. ఆఖరికి ప్రాణం మీద ఆశ వదులుకొని, ఈ పనికి పూనుకొని ధైర్యంగా సమస్యను ఎదుర్కొని నాకు తెలియజేశావు. భేష్! నీ తెలివితేటలు మా కళ్ళు తెరిపించాయి.
ఆ కొండ శిలను కదిలించడం ఎవరివల్లా కాదు కనుక, నీకు మరణశిక్ష లేకుండా వదిలేస్తున్నాను. కానీ నువ్వు ఒక మంచి శిల్పివని మంత్రి గారి పదే పదే చెప్పారు. నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. ఆ కొండ శిలను అతి సుందరంగా చెక్కి, నీ శిల్ప నైపుణ్యంతో ఎంతో అందంగా మలిచి, ప్రపంచంలోనే మన రాజ్య శిల్పకళ నైపుణ్యానికి అన్ని దేశాలు ఆశ్చర్యపోవాలి.
నీకు ఎంతమంది సేవకులు, ఎంత సమయం కావాలో చెప్పు” అనేసరికి మంత్రి గారితో సహా అక్కడున్న ప్రజలు చప్పట్లు కొడుతూ ఆనందంతో జై మహారాజ్! జై మహారాజ్! అంటూ నినాదాలు చేస్తూ, నవ యువకుడైన రవీంద్రకు కూడా అభినందనలు తెలియజేశారు.
ఆ తరువాత కాలంలో రవీంద్ర తన శిల్పకళ నైపుణ్యానికి, మెరుగులు దిద్దుతూ అనతి కాలంలోనే ఎన్నో చిత్ర విచిత్ర శిల్పాలను, రాజ్య వైభోగాలను, కళ్లకు కట్టినట్టుగా చెక్కి దేశ విదేశాల ప్రఖ్యాతిగాంచాడు రవీంద్ర. మంత్రిగారు కూడా తన మేనల్లుడు ఘనత చూసి ఆనందంతో పొంగిపోయారు.
************
వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం :
నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
תגובות