'Thinaga Thinaga Vemu' New Telugu Story Written By Vasundhara
Published In manatelugukathalu.com On 16/04/2024
'తినగ తినగ వేము' తెలుగు కథ
రచన: వసుంధర
(ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
డిసెంబరు 10.
సమయం సాయంత్రం ఐదు.
మోహన్ కాలింగ్‌బెల్ మ్రోగించగానే చప్పున వచ్చి తలుపు తీసి, “నేను రెడీ” అంది రేవతి.
మోహన్ ఆమెను తేరిపార చూశాడు.
సన్నగా నాజూగ్గా ఉంది. దుస్తులు వంటి వంపులకు వన్నె తెచ్చేలా అమిరాయి.
కట్టు, బొట్టు, అలంకరణ అన్నీ మ్యాచింగ్.
చూస్తే కళ్లు తిప్పుకోలేనంత ఆకర్షణీయంగా ఉంది.
మోహన్ లోపల అడుగెట్టి తలుపేశాడు.
“మనం వెడుతున్నది సినిమా చూడ్డానికా, మనని ఎవరైనా చూడ్డానికా?” అన్నాడు కోపంగా.
“రెండూను” అంది రేవతి నవ్వుతూ.
మోహన్ కోపం పెరిగింది.
“నువ్వు బాగానే తయారయ్యావు. మరి నా సంగతేమిటి?" అన్నాడు ఇంకా కోపంగానే.
“మీకేం? మహారాజులా ఉన్నారు” అంది రేవతి ఇంకా నవ్వుతూనే.
“ఉన్నాను కానీ ఇప్పుడు నీ పక్కనుంటే, నన్నంతా నీ కాళ్లకి మొక్కే పనివాడని అనుకుంటారు” అన్నాడతడు స్వరం పెంచి.
“కాళ్లకి మొక్కినంత మాత్రాన పనివాళ్లైపోతారా? ఇంట్లో ఎన్నిమార్లు నువ్వు నా కాళ్లు పట్టుకోలేదూ- గుర్తు చేసుకో” అందామె చిలిపిగా.
మోహన్ మొహం ఎర్రబడింది, “అది వేరు. ఇంట్లో ఇద్దరమే ఉన్నప్పుడు దేనికైనా సంకోచం నాకూ ఉండదు, నీకూ ఉండదు. ఎందుకంటే నువ్వు నాదానివి. నేను నీ వాణ్ణి” అని సద్దుకునే ప్రయత్నం చేశాడు.
“దాందేముంది, పది నిముషాలు టైమివ్వు. బయటికెళ్లడానికి, నిన్ను నావాడిలా తయారు చేస్తాను” అంది రేవతి.
“అంటే, ఇప్పుడు నేను పనివాడిలాగే ఉన్నానంటావు. అసలు నేనలా కనపడాలనే నువ్విలా తయారయ్యావు” అంటూ పెద్దగా అరిచాడు మోహన్.
ఆ తర్వాత ఇద్దరూ మాటా మాటా అనుకున్నారు.
సినిమా ప్రోగ్రాం కాన్సిలయింది.
- - - - -
డిసెంబరు 17.
సమయం సాయంత్రం ఐదు.
మోహన్ కాలింగ్‌బెల్ మ్రోగించగానే చప్పున వచ్చి తలుపు తీసి, “నేను రెడీ” అంది రేవతి.
మోహన్ ఆమెను తేరిపార చూశాడు.
ముఖం జిడ్డోడుతోంది. కట్టిన దుస్తులు పాతగానే కాదు, బాగా నలిగి కూడా ఉన్నాయి.
అప్పుడే ఇంటిపనులన్నీ ముగించిన పనిమనిషిలా ఉందామె.
“రెడీ అవడమంటే ఇలాగేనా? నిన్నిలా చూసినవాళ్లు ఏమనుకుంటారు? పెళ్లాన్ని పనిమనిషికంటే హీనంగా చూస్తున్నానని అనుకోరూ?” అన్నాడు మోహన్.
“వెడుతున్నది సినిమా చూడ్డానికి. నలుగురూ మనని చూడ్డానికి కాదు” అంది రేవతి.
“ఒకసారి బయటికెళ్లేక, చూడొద్దన్నా నలుగురూ మనని చూస్తారని తెలియదా?”
“ఏమో- సినిమాకెళ్లేది ఇతరులు మనని చూడ్డానిక్కాదని నువ్వంటే కామోసనుకున్నాను” అంది రేవతి.
“మాటకి మాట బాగా నేర్చావ్” విసుక్కున్నాడు మోహన్.
“నేను నేర్చిందేం లేదు. అంతా నువ్వు నేర్పిందే!” రేవతి రిటార్టు.
“అర్థమైంది. నువ్వు బయల్దేరింది సినిమాకని కాదు! పాత విషయం మనసులో పెట్టుకుని పగబట్టావ్! నలుగురిలో నన్ను తల దించుకునేలా చెయ్యాలని ఇలా తయారయ్యావ్” అరిచాడు మోహన్.
రేవతి తక్కువ తినలేదు. తనూ గొంతు పెంచింది.
ఆ తర్వాత ఇద్దరూ మాటా మాటా అనుకున్నారు.
సినిమా ప్రోగ్రాం కాన్సిలయింది.
- - - - -
జనవరి 22.
సమయం రాత్రి పది.
మంచం మీద రేవతి ఒడిలో మోహన్.
అతడి జుత్తుని వ్రేళ్లతో నిమురుతూ రేవతి.
మోహన్‌కి ఆమెపై ప్రేమ పొంగుకొచ్చింది.
“రేపు మనం సాయంత్రం ఆటకి హను-మాన్ మూవీ చూద్దాం” అన్నాడు.
“ఇప్పుడిలాగే అంటావ్. రేపు సాయంత్రం ఆఫీసునుంచొచ్చి ఏదో గొడవ లేవదీస్తావ్. నువ్వరిచి, నాచేత అరిపించి, మూడంతా పాడు చేస్తావు” అంది రేవతి గోముగా.
“నా అభిమాన నటి సమంతమీద ఒట్టు. నావల్ల ప్రోగ్రాం పాడవదు” అన్నాడు మోహన్.
ఆ ఒట్టయితే తప్పడని రేవతికి నమ్మకమే.
నవ్వి ఊరుకుంది.
- - - - -
జనవరి 23.
సమయం ఉదయం తొమ్మిదిన్నర.
రేవతి మొబైల్లో నంబరు నొక్కింది. అవతల సిగ్నల్ సరిగ్గా లేదేమో, కాల్ వెళ్లడానికి పది నిముషాలు పడితే అసహనంగా ఫీలైంది. అవతల్నించి రెస్పాన్సొచ్చేక, “ఏయ్, దీపా! ఇంటి దగ్గర ఎప్పుడనగా బయల్దేరావ్! నేను రెడీ అయి పావు గంటయింది. హను-మాన్ షో పావుతక్కువ పదకొండుకని గుర్తుందా, లేదా?” అంది.
“బయల్దేరిన వేళావిశేషం. ట్రాఫిక్‌జాంలో ఇరుక్కున్నానే! ఇప్పుడే క్లియరయింది. ఇంకో పది నిముషాల్లో నీ ఇంటికొచ్చి పిక్ చేసుకుంటాగా, సినిమాకి స్లైడ్సు కూడా మిస్సవమని నాదీ హామీ” అంది అవతలి నుంచి దీప.
- - - - -
జనవరి 23.
సమయం సాయంత్రం ఐదు.
మోహన్ కాలింగ్‌బెల్ మ్రోగించగానే చప్పున వచ్చి తలుపు తీసి, “నేను రెడీ” అంది రేవతి.
మోహన్ ఆమెను తేరిపార చూశాడు.
మామూలుగా ఆధునిక దుస్తుల్లో కనబడే ఆమె అప్పుడు చీరకట్టులో, పీటలమీద వ్రతానికి కూర్చోబోయే ముత్తైదువలా ఉంది.
“థియేటరంటే నీకు దేవాలయంలా ఉన్నట్లుంది. ఏమైతేనేం, అంతా నీ ఇష్టం. ఐదు నిముషాల్లో ఫ్రెష్షయి వస్తాను. మనమీ రోజు హను-మాన్ చూస్తున్నాం. సరేనా” అన్నాడు మోహన్ శాంతంగా.
“త్వరగా రా. కానీ వెళ్లేది హను-మాన్ సినిమాకి కాదు. హనుమాన్ గుడికి” అంది రేవతి.
“సినిమాకి టికెట్లు కూడా బుక్ చేశాను. ఇప్పుడు నువ్వు గుడి అంటావేమిటి?”
“సినిమాకి అన్నప్పుడు నా ఇంట్రస్టు చూడద్దా. నీమటుక్కు నువ్వు హను-మాన్‌కి ఫిక్సయిపోతే నాకు ఓకే ఐపోతుందా? సినిమా ప్రోగ్రాం కాన్సిల్. ఐనా ఈరోజు మంగళవారం కూడాను. ఇప్పుడు మనం హనుమాన్ గుడికే వెడుతున్నాం” అరిచింది రేవతి.
“అరిచి మూడ్ పాడు చేస్తానని నామీద నింద వేసేదానివి. ఈ రోజు టికెట్లు కూడా తెచ్చి రమ్మని బ్రతిమాలుతున్నాను. ఉత్త పుణ్యాన అరిచి మూడ్ పాడు చేస్తావేం?” అన్నాడు మోహన్ కొంచెం చిరాగ్గా.
“అరుచుకుని, మూడ్ పాడు చేసుకుని, అనుకున్న ప్రోగ్రాం కాన్సిల్ చేసుకోవడం అలవాటై, అలాగైతేనే నాకు బాగుంటోం దిప్పుడు. తినగ తినగ వేము తియ్యన కదా!” అంది రేవతి తాపీగా.
---0---
వసుంధర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
వసుంధర పరిచయం:మేము- డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత్రి బిరుదు పొందారు.
Comments