#JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #ThindiPichhi, #తిండిపిచ్చి, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Thindi Pichhi - New Telugu Story Written By - Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 08/02/2025
తిండి పిచ్చి - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అర్ధరాత్రి.. జోరున వర్షము. అంత వర్షం లో కూడా, విసుగులేని విక్రమార్కుడు భేతాళుడిని భుజాన వేసుకుని నడుస్తున్నాడు.
భుజం మీద వున్న భేతాళుడు “రాజా! రాబోయే కాలం లో జరిగే సంఘటన ఒకటి వినిపిస్తాను, విని నా సందేహం తీర్చు” అని కథ చెప్పడం మొదలుపెట్టాడు.
“అది ఒక నగరం. ఆ నగరంలో సీతారామయ్య, మహాలక్ష్మి దంపతులు వారి స్వంత యింటిలో సగభాగం అద్దెకు యిచ్చి, మిగిలిన సగభాగం లో వీళ్ళు వుంటున్నారు అన్నాడు” భేతాళుడు.
“ఆగవయ్య భేతాళా, రాబోయే కాలం లో జరిగే కథని నువ్వు చెప్పటం కంటే, నాకు కనిపించేడట్లు చేస్తే నాకు బాగా అర్ధం అవుతుంది, నీ సందేహం తీర్చగలను, నువ్వు యిప్పుడు నా భుజం మీద ఒక కునుకు తీయవచ్చు” అన్నాడు విక్రమార్కుడు.
“సరే అయితే నువ్వే చూడు” అన్నాడు భేతాళుడు.
***
“యిదిగో! ఏమిటి ఆ భుజం మీద భేతాళుడిని మోసుకుని వస్తున్నట్టు ఆ బూడిద గుమ్మడి కాయ? వేసవి కాలం వస్తే చాలు, బూడిదగుమ్మడి కాయ ని పట్టుకుని తయారు అవుతారు. నా వల్ల కాదు తరగడం, వడియాలు పెట్టడం” అంది మహాలక్ష్మి.
“ప్రతీదానికి ఎందుకు కంగారు పడతావు, వడియాలు, అప్పడాలు లేని ఇల్లూ ఒక ఇల్లే..? యిప్పుడు పెట్టుకున్న వడియాలు రేపు వానాకాలం లో కూరగాయలు తెచ్చుకోలేకపోయినా, ఉపయోగం పడతాయి” అన్నాడు గుమ్మడి కాయని టేబుల్ మీద పెట్టి ఆయాసపడుతో.
“ఎలాగో మీ వదినగారు పెడుతుంది కదా, వాళ్ళ పిల్లలకి అమెరికా పంపించడానికి, మీరు నాలుగు వడియాలు అడిగి తెచ్చుకుంటే సరిపోతుంది” అంది.
“చాల్లే! క్రిందటి ఏడాది అడిగితే యిస్తాను రమ్మని, నా చేత ఏనుగు లాంటి బూడిదగుమ్మడి కాయ తరిగించింది. యిదిగో అప్పుడు తెగిన వేళ్లు ఎలా మచ్చలు పడ్డాయో” అన్నాడు చేతికి అంటిన బూడిద తుడుచుకుంటూ.
“అయితే మినప్పప్పు నానాపెడతాను, మీరు ఆ గుమ్మడి కాయ తరిగి ఇవ్వండి” అంది.
“ఈసారి తెగితే ఏకలవ్యుడు అవుతానేమోనే” అన్నాడు తప్పించుకోవడానికి.
“అదేమి కుదరదు. వడియాలు కావాలంటే, ముక్కలు తరగండి. లేదంటే యింటి ముందు గుమ్మం కి కట్టండి. దిష్టి తగ్గుతుంది. మనమేదో ఇల్లు అద్దెకు యిచ్చి బాగుపడి పోతున్నామని కొందరు అనుకుంటున్నారు” అంది.
“చాల్లే, చచ్చి చెడి మోసుకుని వస్తే, గుమ్మం కి కట్టమంటావా, అయినా నువ్వు వున్నావుగా గుమ్మడి కాయాలా.. ఇంటికి యింకా దిష్టి ఎక్కడ వుంటుంది?” అన్నాడు సీతారామయ్య.
“అవును, మీరు తెచ్చిపెట్టిన జీడిపప్పులు తిని యిలా లావు అయ్యాను. సోద్యం కాకపోతే పండగనాడు పరవన్నాం లోకి జీడిపప్పు తెమ్మంటే, పెరటి లోని బాదంపప్పు తెచ్చారు. నాకు యింకా గుర్తువుంది మీ పిసినారితనం” అని దులపరించింది భర్తని.
లంచ్ అయిన తరువాత ఒక కునుకుతీసి, లేచి కత్తిపిట తీసుకొని గుమ్మడి కాయ మొత్తం తరిగి, “యివిగో ముక్కలు. చాలా ఈ పని, లేదంటే పిండి కూడా రుబ్బాలా” అన్నాడు సీతారామయ్య.
“అక్కర్లేదు. రేపు ఉదయమే నేను రుబ్బి అంతా తయారుచేసి యిస్తాను. నలుగురు లేచి చూసేలోపు మేడమీదకి వెళ్లి వడియాలు పెట్టేసుకుని రండి” అంది మహాలక్ష్మి.
“నీ చీర కూడా ఒకటి యివ్వు, కట్టుకుని వడియాలు పెడతాను. వెధవది నోరు కట్టుకోలేక వడియాలు పెట్టమన్నందుకు శాస్తి బాగా జరిగింది” అన్నాడు.
***
“చూస్తున్నావా..” అన్న భేతాళుడి ప్రశ్నకి, “చూస్తున్నా మొగుడు పెళ్ళాలా గొడవ, మా రాణి గారే నయ్యం” అన్నాడు.
సరే చూడు అని నిద్రలోకి వెళ్ళిపోయాడు భేతాళుడు.
***
తెల్లవారిజామున మహాలక్ష్మి సీతారామయ్యలు లేచి మేడమీద వడియాలు పెట్టేసారు. సాయంత్రం సీతారామయ్య మెల్లగా మేడమీదకి వెళ్లి నాలుగు ఎండి ఎండని వడియాలు వలుచుకుని వద్దామని చూస్తే, అప్పటికే ఎవ్వరో ఆరు వడియాలు పీకేసి తీసుకుని పోయారు. బహుశా తనకంటే ముందుగానే తన భార్య తీసుకొని వచ్చి వుంటుంది అనుకుని మేడ దిగి వచ్చి భార్య ని ఆడిగాడు, నువ్వు ఏమైనా కొన్ని వడియాలు తీసుకుని వచ్చావా అని.
“ఉదయం వంగి వడియాలు పెట్టేసరికి నడుం విరిగి కదలకుండా పడున్నాను, యింకా మేడమీదకి ఏం వెళ్తాను” అంది.
“అయితే కాకులు ఆరు వడియాలు ఎత్తుకుపోయాయి” అన్నాడు.
“ఇప్పటికైనా లోపలికి తీసుకుని వచ్చారా, కాకుల కోసం అక్కడే వుంచారా” అంది.
“తెచ్చి పైన గదిలో పెట్టాను. రేపు మళ్ళీ ఎండపెట్టినప్పుడు అక్కడే నీడలో కూర్చొని చూస్తా, కాకి ఎలా వస్తుందో” అన్నాడు.
రెండో రోజు ఉదయం నుంచి మేడమీదనే వుండి వడియాలకి కాపలా వున్నాడు.
“అన్నం తినటానికి రండి, ఈ ఎండలో పక్షులు రావు” అని భార్య పిలుపు క్రిందకి దిగి వెళ్లి భోజనం చేసి మళ్ళీ పైకి వెళ్లి చూస్తే, సగం వడియాలు లేవు.
“కొంపములిగింది, మళ్ళీ వడియాలు పోయాయి” అన్నాడు పైనుండి.
“మిగిలినవి క్రిందకు తీసుకుని రండి, రేపు మన గుమ్మం ముందు వచ్చే ఎండలో ఎండపెడదాం, కాకులు వస్తే కాళ్ళు విరగకొడతాను” అంది మహాలక్ష్మి.
రెండవ రోజు తన మడి బట్ట ఆరవేసుకోవడానికి మేడమీద కి వెళ్ళిన సీతారామయ్య కి అద్దికున్న వాళ్ళు పెద్ద బట్ట మీద చాలా వడియాలు పెట్టుకుని వుండటం కనిపించింది. పాపం వీళ్ళ వడియాలు కూడా ఉష్ కాకి అనుకున్నాడు.
వెళ్లి వాళ్ళని హెచ్చరించుదామానుకుని, మావి పోలేదా, వాళ్ళవి పోతే నాకెందుకు అనుకుని వచ్చి, “పక్కన అద్దికున్న వాళ్ళు కూడా వడియాలు పెట్టుకున్నారోయ్” అన్నాడు భార్య తో.
రోజు సాయంత్రం మేడమీదకి వెళ్లి చూసేవాడు సీతారామయ్య, వాళ్ళ వడియాలు కాకులు ఎత్తుకువెళ్ళయో లేదో అని. పెట్టిన వడియాలు పెట్టినట్టు వుండేవి. భార్య కి చెప్పి, “బహుశా వాళ్ళు కారం ఎక్కువ వేసుకొని వుంటారు, నువ్వు వేయమంటే మీకు బీపీ అని చెప్పి నడిచప్పిడి గా చేసావు” అన్నాడు సీతారామయ్య.
నాలుగు రోజుల తరువాత, అద్దెకున్న వాటలోని మూర్తిగారు చేతిలో ఒక పొట్లంతో వచ్చి, టేబుల్ మీద పెట్టాడు.
“ఏమిటి మూర్తి గారు ఆ పొట్లం” అన్నాడు సీతారామయ్య.
“ముందు మీరు నన్ను క్షమించాలి, మీరు బూడిదగుమ్మడి కాయ కొనడం చూసి, నేను కూడా బూడిదగుమ్మడి కాయ కొని మా ఆవిడ కిచ్చి వడియాలు పెట్టమని చెప్పాను. అయితే అందరు భార్యలు అనే విధంగానే తను కూడా ‘నడుం నొప్పి, వడియాలు పెట్టలేను’ అంది. దానికి ‘మా మహాలక్ష్మి అక్కయ్య గారు వడియాలు పెడుతున్నారు, మనకి కూడా పెట్టి యిమ్మంటాను, నీకు రాదు అని చెప్పి అడుగుతాను’ అన్నాను.
తరువాత ఆ కాయ విషయం, వడియాలు విషయం మర్చిపోయాను. నాలుగు రోజుల క్రితం సాయంత్రం మేడమీదకి వెళ్ళినప్పుడు వడియాలు చూసి, ‘అరే పాపం.. నేను పెట్టలేను అని వడియాలు పెట్టేసింది’ అనుకుని, పచ్చి వడియాలు వేయించుకుని తింటే బాగుంటాయి అని కొన్ని వడియాలు తీసుకుని వేయించుకుని తిన్నాను.
అయితే అప్పుడు మా ఆవిడ తాంబూలం తీసుకోవడానికి పక్క వీధిలో కి వెళ్లడం తో తనకి ఈ విషయం తెలియదు.
రుచి మరిగిన నోరు వూరుకోదు అని, మర్నాడు కూడా కొన్ని వడియాలు తీసుకుని నా భార్యకిచ్చి వేయించమన్నాను.
తను ఈ వడియాలు ఎవ్వరు యిచ్చారని అడిగితే, ‘నువ్వు పెట్టావుగా’ అన్నాను.
‘అయ్యే రాత, అటు చూడండి ఆ టేబుల్ క్రింద’ అంది.
మా బూడిదగుమ్మడి కాయ ముసముసి నవ్వులు నవ్వుతు కనిపించింది. అయితే ఈ వడియాలు మన యింటి యజమాని గారివి అన్నమాట, కొంపములిగింది అనుకుని, అప్పటికప్పుడు మా ఆవిడ చేత వడియాలు పెట్టించి, ఎండిన తరువాత యిప్పుడు కొన్ని మీకు తీసుకొని వచ్చాను. నా పొరపాటు కి క్షమించండి” అన్నాడు మూర్తి.
“మేము కాకులు ఎత్తుకుపోయాయి అనుకున్నాము. తెలియక చేసినదానికి క్షమించడం లాంటి పెద్ద మాటలు ఎందుకు మూర్తి గారు” అన్నాడు.
***
“ఆ ఆగు, కథ బాగుంది కదా అని చూసేస్తున్నావు, అసలు వడియాలు ఎవరు కనిపెట్టారు, వాటిని ఏమి చేసుకుంటారో చెప్పు, జవాబు తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది” అన్నాడు ఆవలిస్తో భేతాళుడు.
నిజానికి విక్రమార్కుడుకి ఈ కథలో ఎందుకు వాళ్ళు కంగారు పడుతున్నారో, ఆ వడియాలు ఏమిటో, ఎండపెట్టడం ఏమిటో ఒక్క ముక్క అర్ధం కాలేదు. తనకి రాజకుమారులు వేటకు వెళ్లి చేపలు ఎండపెడతారని తెలుసు అంతే అనుకుని మాట్లాడకుండా వున్నాడు.
“ఏదో ఒక జవాబు చెప్పవయ్యా రాజా, నేను త్వరగా చెట్టు మీదకి ఎగరాలి” అన్నాడు భేతాళుడు.
కాలం గడిచి అడివిలో నుంచి బయటకు వచ్చేస్తున్నాడు తప్పా విక్రమార్కుడు ఒక్క మాట మాట్లాడలేదు. అంతలో భుజం మీద వున్న భేతాళుడు విక్రమార్కుడికి ఎదురుగా నిలబడి, “రాజా నువ్వే గెలిచావు. యిహనుంచి నేను నీ అదుపులో వుంటాను, నువ్వు చెప్పింది చేస్తాను” అన్నాడు వినయంగా.
“భేతాళా! నువ్వు నీ చెట్టు మీదనే వుండి, ఈ దారిన వెళ్తున్నవారికి శ్రమ తెలియకుండా కథలు చెప్పి, వాళ్ళు ఏమి జవాబు చెప్పారో నాకు ప్రతీ ఉదయం చెప్పాలి. ఆ కథలు మా కవులకి నేను చెప్పి పరీక్ష పెడతాను” అని చెప్పి, “యిప్పుడు ముందుగా ఆ దంపతుల యింటికి వెళ్లి ఆ వడియాలతో వాళ్ళు ఏమి చేసుకున్నారో అవి తీసుకుని రా” అన్నాడు.
ఆజ్ఞ అంటూ భేతాళుడు మాయం అయ్యాడు. విక్రమార్కుడు యింటికి చేరి భోజనం కి కూర్చుని, మహారాణికి ఈ వడియాల గురించి చెప్పుతోవుండగా, భేతాళుడు నాలుగు గిన్నెలు తో ప్రవేశించి “మహారాజా! యివిగో వాళ్ళు చేసుకున్న వంటలు. వడియాలు వేసిన పనసపోట్టు కూర, ఉల్లిపాయలు వడియాల పులుసు, వేయించిన వడియాలు, ఎందుకైనా మంచిది అని కొన్ని వడియాలు కూడా తీసుకుని వచ్చాను, మీకు మహారాణి గారు వండి పెట్టడానికి” అన్నాడు భేతాళుడు.
ఆ మాట విని మహారాణి కోపంగా చూసింది భేతాళుడు వంక.
***
“ఆమ్మో! భేతాళుడు మన వడియాలు ఎత్తుకుపోతున్నాడు” అంటూ పెద్ద కేక పెట్టాడు సీతారామయ్య.
“పడుకోండి మీ వడియాలు పాడుగాను, నిద్రలో కూడా తిండి పిచ్చే. యింకా తెల్లారలేదు” అని కసిరింది మహాలక్ష్మి.
శుభం

-జీడిగుంట శ్రీనివాసరావు
Comments