'Thinte Garele Thinali' - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 12/06/2024
'తింటే గారేలే తినాలి' తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
రామూర్తి, చారులత యిద్దరూ ఆదర్శ దంపతులు. రామూర్తి గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం, చారులత మంచి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. ఇరవై సంవత్సరాల సంసారజీవితం గడిపేసారు. పిల్లలిద్దరు వేరే వూరిలో ఉద్యోగం లో సెటిల్ అయ్యిపోయారు.
ఒకరోజు ఉదయమే రామూర్తి మంచం మీదనుంచి లేవకుండానే ‘చారూ’ అని పెళ్ళాన్ని పిలిచాడు. అప్పటికే టిఫిన్ బాక్స్ లు సద్దుతోవున్న చారులత, ‘ఏమిటీ యివ్వాళ్ళ యింత ప్రేమగా పిలుస్తున్నారు, లేచి రెడీ అయ్యి టిఫిన్ తినండి. ఈ రోజు నేను ఆఫీసులో తొమ్మిది గంటలకల్లా ఉండాలి’ అంది.
“టిఫిన్ ఏం చేసావు” అని ఆడిగాడు.
“యింకా చెయ్యలేదు, ఫ్రీజ్ లో దోశల పిండి వుంది, రెండు దోశలు వేసుకోండి, ఈ రోజుకి ఆవకాయ వేసుకుని టిఫిన్ తినేయండి. కొబ్బరికాయ కుళ్ళిపోయింది” అంది చారులత.
“ఎప్పుడు వెధవ దోసెనా, రాశుడు ఇడ్లీ పిండి, లేదటంటే దోశ పిండి రుబ్బి ప్రిజ్ లో పడేసి రోజూ అదే టిఫిన్, ఒక రోజు గారెలు చెయ్యవ్వచ్చు గా” అన్నాడు.
“చూడండి.. నేను ఉద్యోగానికి ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరితే గాని ఆఫీసుకి టైముకి చేరుకోలేను. మీలా నాది గవర్నమెంట్ ఉద్యోగం కాదు, వెళ్లినా వెళ్లకపోయినా జరిగిపోవడానికి. అయినా మొన్న హోటల్ నుంచి గారెలు తెప్పించుకుని తిన్నారుగా” అంది మొగుడితో.
“హోటల్ వాళ్ళు గారెలు రాత్రి మిగిలిన ఉప్మా, ఇడ్లీలు కలిపి తెల్లావారి గారెలుగా వేస్తున్నారు. అవి తింటే దవడలు నొప్పి, అంత గట్టిగా వున్నాయి. నీ పేరు చారులత కదా అని రోజూ చారు కాచి వంట అయ్యింది అంటే సరిపోతుందా? భర్త కి ఇష్టమైన పూరిలో, వడలో, బిర్యాని నో చేసావా” అన్నాడు రామూర్తి.
“చూడండి.. మిక్సీ లో గారెల పిండి రుబ్బితే దూదిలా వుండవు. మా అమ్మ రుబ్బురోలు లో రుబ్బి వడలు వేస్తే, ఒక్కొక్కళ్ళం పది వడలు తినే వాళ్ళం” అంది చారులత.
“రెండు నెలలకు ఒకసారి తమరిని చూడకపోతే నిద్రపట్టదు కదా మీ అమ్మకి, ఈసారి వచ్చేప్పుడు, ఆ రుబ్బురోలు పింగళి వారి పేకి లా నెత్తిమీద పెట్టుకుని తీసుకుని రమ్మను” అన్నాడు.
“ఆరు ఎకరాల పొలం మీకే యిచ్చిందిగా, అప్పుడప్పుడు వచ్చి రెండు రోజులు మా అమ్మ ఉండకూడదా” అంది చారులత.
అలా రోజులు గడుస్తున్నాయి కానీ, చారులతకి టైము దొరకడం లేదు గారెలు వండి రామూర్తి కి పెట్టడానికి.
ఆరోజు శుక్రవారం, ఆఫీసులో తన తోటి ఉద్యోగి కృష్ణశాస్త్రి వచ్చినప్పుడు, మాటల్లో గారెలు విషయం వచ్చింది.
“మీ ఆవిడ నయ్యం రా, మా ఆవిడ ఉప్మా.. అదికూడా హాట్ వాటర్ జగ్ లో రవ్వ పోసి రెడీ అంటుంది. మీ ఆవిడకి ఉద్యోగం వుంది, మా ఆవిడ కి మోకాళ్ళ చిప్పలు, చేతి కండలు అరిగిపోయాయి అని అతి తక్కువ పని చేస్తుంది” అన్నాడు కృష్ణశాస్త్రి.
“నీకు తెలిసిన మంచి హోటల్ వుంటే చెప్పు, గారెలు దూదిలా ఉండాలి, సాంబార్ రుచిగా ఉండాలి” అన్నాడు రామూర్తి.
“అదివరకు ఆంధ్రా లో ఏ హోటల్ లో తిన్నా బాగుండేవి, యిప్పుడు వాళ్ళుకూడా రుచి పచి లేకుండా చేస్తున్నారుట. ఓపిక వుంటే మనమే చేసుకోవాలి లేదంటే నా దగ్గర ఒక ఉపాయం వుంది, నీకు నచ్చితే గారేలే గారెలు” అన్నాడు కృష్ణశాస్త్రి.
“ఏమిటో చెప్పు” అన్నాడు రామూర్తి.
“ఏమీలేదు, నాకు తెలిసిన పంతులు గారు వెంకటేశ్వర శాస్త్రి వున్నారు. ఆయన పౌరోహిత్యం చేస్తారు. నువ్వు ఒప్పుకుంటే ప్రతీ ఆదివారం ఎక్కడో అక్కడకి మన ఇద్దరిని భోక్తలుగా తీసుకుని వెళ్తాడు. అక్కడ గారెలతో పాటు ఒక వెయ్యి రూపాయలు దక్షిణ వస్తుంది, ఏమంటావ్?” అన్నాడు కృష్ణశాస్త్రి.
“వద్దులేరా, నాకు సంధ్యవంధానం చెయ్యటమే రాదు, అలాంటిది తద్దినం కి బొక్తగా వెళ్లి మంత్రం చదవకపోతే అవమానం చేసి పంపుతారు” అన్నాడు రామూర్తి.
“నాకు మాత్రం మంత్రం వచ్చా, ఏదో వినిపించి వినిపించకుండా గొ నుక్కుంటే చాలు. ఆయినా ఆ పొగలో కళ్ళు మండి ఏడుస్తోవుంటారు, మనల్ని పట్టించుకోరు, ఒకసారి ట్రై చేద్దాం, నచ్చకపోతే తరువాత వెళ్ళద్దు” అన్నాడు కృష్ణశాస్త్రి.
“ఎవ్వరికైనా తెలిస్తే బాగుండదు, ఆలా అని నోటికి అందే గారెలని వదులుకోబుద్ది కావడం లేదు, సరే కాని రేపు ఆదివారం ఎక్కడైనా తద్దినం వుంటే మన ఇద్దరిని భోక్తలుగా పిలవమని చెప్పు” అన్నాడు.
శనివారం రాత్రి రామూర్తి కి ఫోన్ చేసి “ఖైరతాబాద్ కి వెళ్ళాలి రేపు 12 గంటలకు. మూర్తి గారింట్లో తద్దినం వుంది” అన్నాడు కృష్ణశాస్త్రి.
“పెట్టాగా పెట్టగా ఖైరతాబాద్ లోనా, అక్కడ మా బావమరిది రోజంతా రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు, నన్ను చూసాడా కొంప ములుగుతుంది” అన్నాడు రామూర్తి.
“ప్రతీ దానికి భయ పడితే దూదుల లాంటి గారెలు ఎలా వస్తాయి, ఒక జత పంచెలు సంచిలో పెట్టుకుని, మా వీధి సందు చివర పార్క్ దగ్గర ఉండు, నేను వచ్చేస్తా, పార్క్ లో డ్రెస్ మార్చుకుని వెళ్దాం, విభూతి వుందా, తేవాలా” అన్నాడు కృష్ణశాస్త్రి.
“పంచెలు కూడా లేవు, నా దగ్గర మాయదారి మల్లెగాడు లుంగీలు వున్నాయి, నువ్వే తీసుకుని రా” అన్నాడు రామూర్తి.
“పంచెలు పట్టుకుని బయటకు వస్తే మా ఆవిడ యక్ష ప్రశ్నలు వేస్తుంది. అందుకే పంతులు గారికే అప్పగిస్తాను పంచెల బాధ్యత, అంతగా అయితే మన దక్షిణ లో చెరో వందా ఆయనకు యిద్దాం, మర్చిపోకుండా రా, అసలే తద్దినం కూడాను” అన్నాడు కృష్ణశాస్త్రి.
ఆదివారం అయ్యింది, ఉదయమే లేచి స్నానం చేసి వచ్చిన భర్త ని చూసి, “ఈ రోజు ఆదివారం. అప్పుడే లేచి స్నానం చేసారే” అంది భార్య అనుమానంగా చూస్తో..
“మా ఆఫీస్ లో పనిచేసే గుమస్తా వాళ్ళ నాన్నగారు పోయారుట, చూడటానికి వెళ్తున్నా” అన్నాడు రామూర్తి.
“ఎవ్వరైనా పోయిన వాళ్ళని చూసి వచ్చి స్నానం చేస్తారు గాని మీరు స్నానం చేసి చూడటానికి వెళ్తున్నారేమిటండి” అంది.
“ప్రశ్నలు బాగానే వేస్తావు, ఆ టైములో మొగుడికి మంచి టిఫిన్ చేసి పెట్టాలని వుండదు, యింతకీ ఈ రోజు టిఫిన్ మళ్ళీ ఉప్మానేనా” అన్నాడు.
“లేదు, రాత్రి అన్నం మిగిలితే, నిమ్మకాయ పులిహోర చేసాను” అంది చారులత.
“నేను రావడానికి ఆలస్యం అవుతుంది, భోజనానికి రాను, మళ్ళీ అన్నం మిగిలితే రాత్రికి టమోటో పులిహోర చేసుకో” అంటూ బయటకు వచ్చేసాడు రామూర్తి.
అనుకున్న ప్రకారం కృష్ణశాస్త్రి యింటి దగ్గర పార్క్ కి వచ్చి బెంచి మీద కూర్చుని ఆలోచిస్తున్నాడు.. ‘తను చేసే పని సరైనదా.. వెధవ గారెల కోసం భోక్తలా వెళ్లడం, అందులో సవ్యం, అపసవ్యం అంటే ఎటో తెలియదు, పాపం చేస్తున్నానా’ అని. ఇంతలో కృష్ణశాస్త్రి వచ్చేసాడు. ఆటో ఎక్కి పంతులుగారింటికి చేరుకున్నారు.
వీరికోసం చూస్తున్న పంతులు గారు, “ఆ.. త్వరగా పంచె కట్టుకోండి”, అంటూ యిద్దరి మొహాలకు విభూతి రాసి, తన వస్తువులు తెచ్చుకుని వచ్చే సరికి, రామూర్తి, కృష్ణశాస్త్రి పంచెని లుంగీలా కట్టుకుని నుంచున్నారు.
“మీరెక్కడి భోక్తలయ్యా, లుంగీ కట్టుకుని వస్తే యజమానికి మీ మీద అనుమానం రాదా” అంటూ ఆయనే వీళ్ళిద్దరికి పంచె కట్టి తన మోటార్ సైకిల్ మీద ఎక్కించుని తీసుకుని వెళ్ళాడు.
ఖైరతాబాద్ లో మూర్తి గారిల్లు పిల్లాపాపల తో సందడిగా వుంది. మూర్తిగారు పంతులుగారిని చూసి, “రండి శాస్త్రి గారు, పిల్లలు గారెలు పెట్టమని ఒక్కటే గొడవ, త్వరగా కార్యక్రమం కానివ్వకపోతే వాళ్ళు వంట గది మీద దాడి చేసేడట్లున్నారు” అన్నాడు.
“మేము రెడీ, మీరు యిలా వచ్చి పీట మీద కూర్చుంటే మొదలుపెట్టేస్తాను” అన్నారు పంతులు గారు. పంచె కట్టుకుని వచ్చి కూర్చుంటూ.
“అదివరకు వేరే భోక్తలు వచ్చేవాళ్ళు కదా” అని ఆడిగాడు మూర్తి గారు.
“వీళ్ళు వేద పండితులు, భోక్తలుగా రారు, కానీ మీరంటే నాకు ప్రత్యేక అభిమానం మూర్తి గారు, అందుకే బ్రతిమాలి తీసుకుని వచ్చాను” అన్నాడు పంతులు గారు.
“చాలా సంతోషం, అయితే భోజనాలు అయిన తరువాత వేదం చదివిద్దాం” అన్నాడు మూర్తి గారు.
యిది విని, రామూర్తి మెల్లగా కృష్ణశాస్త్రి తో “వేదం మనమెక్కడ చదవగలం రా, పారిపోదామా” అన్నాడు.
“వుండు, మనవిషయం పంతులుగారికి తెలుసుగా, ఆయనే చూసుకుంటాడు” అన్నాడు కృష్ణశాస్త్రి.
“భోక్తలకి విస్తరలు వేసి వడ్డన మొదలుపెట్టండి అమ్మా” అన్న మాట తప్ప రామూర్తి కి ఒక్కటి అర్ధం కాలేదు. కందాబచ్చాలి కూర, పనసపొట్టు కూర, తోటకూర కూర తో పాటు మూడు రకాల పచ్చళ్ళు వడ్డించారు. తరువాత వేడి వేడి గారెలు, అప్పాలు కూడా వేసారు. గారెలు విస్తరలో పడగానే ఒక గారి తుంచి తినబోతున్న రామూర్తి తొడమీద గిల్లి, “అప్పుడే ముట్టుకోకూడదు, పంతులు గారు తినమన్నప్పుడు తినాలి” అన్నాడు.
మూర్తి గారు వీళ్ళకి నమస్కరించి, “మీకు కావలిసినవి అడిగి, సంతృప్తి గా భోజనం చేసి పైలోకం లో వున్న మా నాన్నగారిని సంతృప్తిపరచండి” అన్నాడు.
మొత్తానికి యిద్దరు సంతృప్తి గానే భోజనం చేసారు.
“భోక్తలకు కాళ్ళు కడగాలి రండి” అని మూర్తి గారిని పిలిచాడు పంతులుగారు.
ఎప్పుడో తన పెళ్లప్పుడు మామగారు తన కాళ్ళు కడగటమే తప్ప, యింత శ్రద్దగా మూర్తి గారు కాళ్ళు కడిగినట్టుగా తను కడుక్కోలేదు అనుకున్నాడు రామూర్తి. తెలియకుండానే ‘దీర్ఘాయుష్మాన్ భవ:’ అని దీవించేసాడు మూర్తి గారిని.
అప్పటికే రెండు గంటలు దాటింది, అందరూ ఆకలితో నకనకలాడుతున్నారు. మూర్తిగారు పంతులు గారికి, భోక్తలు ఇద్దరికి ఘనంగా దక్షిణా, బట్టలు పెట్టి పంపించాడు. ఆకలిగా వుండటంతో యిహ వేదం గురించి మర్చిపోయారు.
బయటకు రాగానే పంతులుగారు, “నేను యిచ్చిన పంచెలతో పాటు మూర్తిగారు పెట్టిన బట్టలు, ఒక అయిదు వందలు యిటు ఇవ్వండి” అని తీసుకుని వెళ్ళిపోయాడు. కృష్ణశాస్త్రి ని దింపేసి రామూర్తి తన ఇంటికి చేరాడు.
మొహం నిండా విభూతి తో వచ్చిన భర్తని చూసి, “ఏమిటి ఆ విభూతి, శవాన్ని మోసారా” అంది చారులత.
“అబ్బే అటువంటిది ఏమిలేదు, భయం లేకుండా వుండటానికి విభూతి రాసుకున్నా, స్నానం చేసి వస్తాను” అని వెళ్ళాడు.
కొంతసేపటి కి వణుకుతో వస్తున్న భర్తని చూసి, “ఏమైంది మీకు అలా వణుకుతున్నారు” అంటూ నుదుటి మీద చెయ్యి వేసి, “కొద్దిగా వేడిగా వుంది, క్రోసిన్ టాబ్లెట్ వేసుకుని పడుకోండి, వద్దంటే వినరు, స్మశానం దాకా ఎందుకు వెళ్లారు” అంటూ క్రోసిన్ టాబ్లెట్ యిచ్చి పడుకోమంది.
“నేను కాసేపు పడుకుంటే కానీ మాములు మనిషిని అవ్వను, ఫోన్ వస్తే నువ్వు మాట్లాడి ఏదో ఒకటి చెప్పు” అని దుప్పటి కప్పుకుని పడుకున్నాడు.
రాత్రి ఎనిమిది అయ్యింది, గుర్రు పెట్టి నిద్రపోతున్న భర్తని లేపడం ఇష్టం లేక తను రెండు మెతుకులు తినేసి టీవీ చూస్తో కూర్చుంది చారులత.
రామూర్తి ఫోన్ రింగ్ అవడంతో వెళ్లి తీసి ‘హలో’ అంది.
“నమస్కారం అమ్మా, రామూర్తి గారు వున్నారా” అన్నాడు పంతులు గారు తనని పరిచయం చేసుకుని.
“పడుకున్నారండి, ఏమి చెప్పాలి?” అని అడిగింది.
“ఏమీలేదమ్మా, రేపు సుబ్బారావు గారింట్లో కి ఒక భోక్త దొరకలేదు, కృష్ణశాస్త్రి కి జ్వరం రాలేను అన్నాడు, అందుకే రేపు రామూర్తి భోక్తగా వస్తాడేమో” అని అన్నాడు పంతులుగారు.
“చూడండి, మీరు పొరపాటు నెంబర్ కి ఫోన్ చేసారు. మా వారి పేరు రామూర్తి. అంతవరకు నిజం, అయన గవర్నమెంట్ ఆఫీసులో పెద్ద ఉద్యోగం. భోక్తలుగా రావలిసిన అవసరం ఆయనకు లేదు. పైగా ఆయనకు మంత్రం రాదు” అంది.
“ఉదయం మూర్తి గారింటికి వచ్చాడు భోక్తగా, మంత్రం గురించి నేను చూసుకుంటా” అంటున్న పంతులుగారి మాటలు వినకుండా ఫోన్ కట్ చేసింది.
అంటే ఈ జ్వరంకి కారణం ఉదయం భోక్తగా వెళ్లి పొట్ట నిండా తినడం వలన అన్నమాట, అసలు భోక్తగా ఎందుకు వెళ్ళాడు అనుకుని కృష్ణ శాస్త్రి కి ఫోన్ చేసింది.
‘హలో’ అంటూ మూలుగు వినిపించింది.
“నేను అన్నయ్య, రామూర్తి గారి భార్యని, నా మీద ఒట్టు వేసి నిజం చెప్పండి, అసలు మీరిద్దరూ భోక్తలుగా ఎందుకు వెళ్లారు” అంది.
కొద్ది నిముషాలు తరువాత, “చూడమ్మా, మీ ఆయనకు దూది లాంటి గారెలు తినాలని కోరిక, నాకు కూడా అదే కోరిక కానీ మరీ అంతగా కాదు. హోటల్ లోవి నచ్చవు, నువ్వు యింట్లో చెయ్యవుట, అందుకే ఈ భోక్తల వేషం వేసుకుని ఆ గారెల కోరిక తీర్చుకున్నాము. యింట్లో దొరికితే మగడైనా ఆడవాళ్ళైనా బయట చూపులు ఎందుకు చూస్తారు. కొద్దిగా ఎక్కువ తినడం వల్ల నాకు డోకులు పట్టుకున్నాయి, యింతకీ రామూర్తి బాగానే వున్నాడా?” అని అడిగాడు.
“ఏం బాగు అన్నయ్యగారు, జ్వరం తో మూలుగుతున్నారు, అయినా యిటువంటి సలహా మీరు యివ్వడం ఇతరులని మోసం చెయ్యడం కాదా, ? అసలే పితృదేవతలతో పని” అంది.
అటువైపు నుంచి జవాబు రాకపోవడంతో ఫోన్ కట్ చేసి భర్త వున్న గదిలోకి వెళ్ళింది. జ్వరం తగ్గింది అనుకుంట గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. పాపం గారెలు కోసం ఎంత పని చేసారు. నాదే తప్పు. కొద్దిగా టైము చూసుకుని యింట్లో గారెలు వండి పెడితే సరిపోయేది.. అనుకుంటూ ఒక పావు కేజీ మినపప్పు నానపెట్టి, వచ్చి సోఫాలో పడుకుంది.
తెల్లారి ఏడుగంటలకు గాని మెలుకువ రాలేదు చారులత కి. గబగబా లేచి భర్త వున్న గదిలోకి వెళ్ళింది. నోరు తెరిచి పడుకున్నాడు, గుర్రు లేదు, ఏదో ఆపసవ్యం గా పడుకున్నట్టు తోచి, గట్టిగా కుదిపింది. అయినా కదలిక లేదు, ఒళ్ళు కూడా చల్లగా వుంది.
‘బాబోయ్ కొంప ములిగింది, నన్ను వదిలిపెట్టి పోయారా’ అని ఏడ్చుకుంటూ దగ్గరలోనే వున్న చెల్లెలికి ఫోన్ చేసింది.
“ఏమైంది అక్కా ఏడుస్తున్నావ్?” అని అడిగిన చెల్లెలితో “మీ బావ కొంపముంచి చనిపోయాడు, ఊపిరి ఆడటం లేదు, గుర్రు లేదు” అని నిన్న జరిగిన విషయం టూకిగా చెప్పింది చారులత.
“యింట్లో ఈ రోజు గారెలు వేద్దాం అనుకుని పప్పు కూడా నాన పెట్టాను, ఆయన కోరిక తీర్చలేక పోయాను” అంటూవుంటే, “వుండు అక్కా నేను మీ మరిది, పిల్లలు బయలుదేరి వస్తాము. కంగారు పడకు” అని ఫోన్ పెట్టేసింది చారులత చెల్లెలు.
బెడ్ రూంలో నుంచి “ఏమిటి నువ్వు గారెలు వండుతున్నావా?” అన్నమాట తో పాటు గుర్రు వినిపించడం తో పరుగున వెళ్లి భర్తని లేపింది.
గుర్రు ఆపేసి లేచి “ఎందుకు అలా వున్నావు” అన్నాడు లుంగీ సరిగ్గా కట్టుకుంటో.
“నా బొంద, అడ్డమైన పనులు చేసి ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. మీరు మెలుకువగా వున్న సమయంలో తప్పా ఆ గుర్రు మీతోనే ఉంటుంది, అటువంటిది గుర్రు లేదు, నోరు తెర్చేశారు, కదలడంలేదు అందుకే పోయారు అనుకున్నాను, నా గుండె ఆగిపోయింది అనుకోండి. ఏడుస్తూ మా చెల్లెలు వాళ్ళకి చెప్పాను, వాళ్ళు బయలుదేరారు, యిప్పుడు ఎలా” అంది.
“ఎలా ఏంటి, తెల్లవారు జామున తలనొప్పి తో నిద్రపట్టక, రెండు నిద్రమాత్రలు వేసుకుని పడుకున్నాను, గుర్రు లేకపోతే ప్రాణం పోయినట్టే అని ఎవ్వరు చెప్పారు, నిద్రలో నువ్వు గారెలు వండుతున్నాను అన్నమాట వినిపించి మెలుకువ వచ్చింది” అన్నాడు.
“సరేలే వాళ్ళకి ఫోన్ చేసి నేను బ్రతికే వున్నాను అని చెప్తాను, నువ్వు వెళ్లి పప్పు రుబ్బు” అన్నాడు.
ఫోన్ తీసి తోడల్లుడు కి ఫోన్ చేసాడు.
“ఆ వచ్చేసాం. యింకో అయిదు నిమిషాలలో మీ యింట్లో వుంటాం, బాధ్యతలు అన్నీ అయిపోయాయి, దేముడు పిలుపు ని ఎవ్వరు ఆపగలరు” అంటూ మాట్లాడేస్తున్నా తోడల్లుడు ని, “ఆపవయ్యా బాబూ, నేను బాగానే వున్నాను, నిద్రమాత్ర వల్ల కొద్దిగా మొద్దు నిద్ర పోయాను, మీ వదిన లేపినా లేవకపోవడం తో పోయాను అనుకుందిట” అన్నాడు రామూర్తి.
“అమ్మయ్య! నువ్వేనా అన్నయ్య, నీ మాట మళ్ళీ విన్నాను. ఎలాగో మీ ఇంటి దాక వచ్చాము, నిన్ను చూసి, కాఫీ తాగి వెళ్తాము” అన్నాడు.
“యిదిగో వాళ్ళు వస్తున్నారు, ఆ గారెలు హోటల్ వాడు వేసినట్టుగా టైర్ ఆంత వెయ్యకుండా కొద్దిగా చిన్నవి వేస్తే వాళ్ళకి పెట్టవచ్చు” అంటూ బ్రష్ చేసుకోవడానికి వెళ్ళాడు.
తొడల్లుడు వాళ్ళు వచ్చేసారు. “మొత్తానికి మా వదినని అదరకొట్టేసావు అన్నయ్య” అన్నాడు నవ్వుతూ. ఇంతలో చారులత ప్లేట్స్ లో గారెలు, కొబ్బరి చట్నీ వేసుకుని తీసుకుని వచ్చి అందరికి తలో ప్లేట్ యిచ్చి తను కూడా ఒక ప్లేట్ తెచ్చుకుని కూర్చుని, “హడావుడి గా చేసాను, రుచి తగ్గినా ఏమి అనుకోకండి” అంది.
వాళ్ళు వెళ్లిన తరువాత భార్యని అడిగాడు రామూర్తి, “ఏమిటి గారెలు హోటల్ వాడికంటే దరద్రం గా చేసావు, గట్టిగా వున్నాయి” అన్నాడు.
“మనమిద్దరమే కదా అనుకుని కొద్దిగా పప్పు నాన పెట్టాను. మంది ఎక్కువ అవడంతో రాత్రి మిగిలిన అన్నం, కొద్దిగా ఇడ్లీ పిండివుంటే అది కలిపి రుబ్బి మాట దక్కించాను” అంది గర్వంగా చారులత.
“నిన్న రాత్రి పంతులుగారు ఏ నెంబర్ నుంచి చేసారు” అన్నాడు.
“బాబోయ్, అంటే మళ్ళీ భోక్తగా మారిపోదామని అనుకుంటున్నారా? వద్దు, ఇహనుంచి ప్రతి పది రోజులకి మీకు దూదులు లాంటి గారెలు, సాంబార్ చేసి పెడతాను, అవసరం అయితే ఆ రోజు లంచ్ మానేద్దాం, అంతే తప్పా గారెలు కోసం ఎక్కడ తద్దినం జరుగుతోందా అని ఎదురు చూడటం వద్దు” అంది చారులత.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
కథ బావుంది