top of page
Writer's pictureParimala Kalyan

తియ్యని బంధం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.




'Thiyyani Bandham' written by Parimala Kalyan

రచన : పరిమళ కళ్యాణ్

కొద్దిరోజుల్లో చనిపోతామన్న విషయం తెలిసిన ఏ మనిషైనా సరే తట్టుకోవటం కష్టమే. కానీ ఇప్పుడు నేను అదే స్థితిలో ఉన్నాను. బ్రతుకుతానన్న గ్యారంటీ లేదంటున్నారు డాక్టర్లు.

వెల్లకిలా పడుకుని ఉన్న నాకు పైన సీలింగ్ కి ఫ్యాన్ స్పీడుగా తిరుగుతూ కనిపిస్తోంది. ఆ ఫ్యాను వేగంతో పాటే నా ఆలోచనలు కూడా అంతే వేగంగా పరుగెడుతున్నాయి. ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి కానీ ఏదీ ఒక కొలిక్కి రావటం లేదు.

ఇల్లు, పిల్లలు బాగా గుర్తొస్తున్నారు. నా కూతురు శర్వాణి ఫోర్త్ చదువుతోంది, అయినా ఆరిందాలా మాట్లాడుతుంది. సెకండ్ క్లాస్ చదివే నా కొడుకు మోక్షజ్ఞ బుర్రనిండా తెలివితేటలే. వాళ్ళిద్దర్నీ ఎలా వదిలిపెట్టి పోవాలో అర్ధం కావట్లేదు.

"అమ్మా! లేమ్మా! లే!" అంటూ వాడు వచ్చి లేపుతున్నట్టు గానే ఉంది. వాడికి నేనే కలిపి తినిపించాలి,

ఇప్పుడెలా తింటున్నాడో మరి?

"అమ్మా! స్కూల్కి లేట్ అవుతుంది. నా షూస్, బాక్స్ రెడీనా?" అని అడిగే నా కూతురు, రేపు నేను పోతే అవన్నీ ఎవరితో చేయించుకోవాలి? ఎవరిని అడగాలి?

"అమ్మాయీ! ముందు కాఫీ తాగి, అప్పుడు చేసుకో ఆ పని!". అంటూ మెత్తగా మందలించే అత్తగారు. నిజంగా అత్తగారు అంటే అత్తగారి లానే ఉండదు, కానీ ‘అమ్మాయీ! అది చేద్దాం, ఇది చేద్దాం’ అంటూ నన్ను కూడా ఆవిడతో పాటు కలిపేసుకుని పని చేయిస్తుంది. అప్పుడు ఆవిడ చెప్పే పనులన్నీ చిరాగ్గా తోచేవి నాకు. కానీ ఇప్పుడు గుర్తొస్తే బాధేస్తోంది.

అలాంటి అత్తగారు నిజంగా అందరికీ దొరకదు. నా స్నేహితురాళ్ళు అందరూ వాళ్ళ అత్తగార్ల గురించి, వాళ్ళ కష్టాల గురించీ చెప్పుకుంటూ ఉంటే నేనూ ఓమాట అనేదాన్ని.

"అవునే! ఈ అత్తగార్లందరూ అంతే కాబోలు!" అని.

"నీకేమి! మీ అత్తగారు నిజంగా చాలా బెటర్. అలాంటి అత్తగారు మాకు దొరికితే బాగుణ్ణు!" అనుకునేవారు.

"సరేలేవే... పడేవాళ్లకే తెలుస్తుంది ఆ బాధ" అంటూ మాట దాటవేసేదాన్ని.

కానీ నాకు ఈ వింత రోగం వచ్చిన దగ్గరనుంచీ ఆవిడకి కంటిమీద కునుకులేదు. నా కోసం ఎన్ని పూజలు చేస్తోందో? ఎన్ని దేవుళ్ళకు మొక్కుతోందో? ఏ దేవుడైనా ఆవిడ మొర విని నన్ను బ్రతికిస్తే! ఆ ఆలోచనే ఎంతో హాయినిస్తోంది. మరుక్షణమే ఆ అవకాశం ఉందా అని ప్రశ్న నా మదిలో తొలిచేస్తుంది.

ఇంక మావారు నేనంటే పంచ ప్రాణాలు అని చెప్పలేను కానీ, నా మీద ప్రేమ చాలా ఉంది. కానీ బయటపడనివ్వరు. "మీకసలు నా మీద ప్రేమే లేదు" అంటూ ఉంటా అప్పుడప్పుడూ.

దానికి సమాధానంగా "పిచ్చిదానా! ప్రేమనేది మనసులో ఉండాలి. అది నీకూ, నాకూ తెలిస్తే చాలు. బయట అందరికి, ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు" అంటారు ఆయన.

కానీ చుట్టుపక్కల వాళ్లంతా తమ భర్తలతో సరదాగా సినిమాలు, షికార్లు అంటూ తిరిగుతూ ఉంటే నాక్కూడా వాళ్ళ లాగా జంట పక్షుల్లా నేనూ మా వారూ తిరగాలని అనిపించేది. కానీ పిల్లలు, అత్తమామలు అందరూ ఉంటారుగా. "వాళ్ళందరిని వదిలిపెట్టి మనమెలా తిరుగుతాం?" అనేవారు.

నా గోల పడలేక ఏ నెలకో, రెణ్ణెళ్లకో సినిమాకి మాత్రం తీసుకుని వెళ్ళేవారు. ఇదుగో ఏడాది పైగా ఈ

మాయదారి కరోనా వచ్చిన సందర్భంగా అందరికీ సినిమాలు, షికార్లు అన్నీ బందు చేసింది కదా మరి!

కాస్తో కూస్తో తగ్గింది అనుకునేలోపు, మళ్ళీ విజృంభించింది. రేపు మళ్ళీ థర్డ్ వేవ్ అంటోంది. అది ఇంకెంత బలంగా వస్తుందో?! ఈసారి మాత్రం ప్రతి ఇంటిని పలకరించి మరీ వెళ్తున్నట్టుంది దాని మర్యాద పాడు గాను! ఎంతో జాగ్రత్తగా కూరలు కడిగి, సరుకులు ఎండలో పెట్టుకుని మరీ వాడినప్పటికి ఎలా వచ్చిందో నాకు అర్ధం కాలేదు.

విపరీతమైన జ్వరం, వాంతులు, మోషన్స్ అవ్వటంతో గత్యంతరం లేక హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది.

మునుపెప్పుడైనా ఇంట్లో పనులు చెయ్యలేక విసుగొస్తే "ఎక్కడికైనా పారిపోవాలి" అనుకునేదాన్ని.

"మీతో పడలేను నేను, ఎటో పోతాను" అనేదాన్ని. కానీ ఇప్పుడు హాస్పిటల్ నుంచీ ఎప్పుడు బయట పడతానా? ఎప్పుడు ఇంటికి వెళ్తానా? అని ఆలోచిస్తూనే ఉన్నాను.

ఆక్సిజన్ అందక పైప్ పెట్టీ అందిస్తూ, మందులు వేస్తున్నారు నర్సులు రోజూ. అయినా గుండె అప్పుడప్పుడూ ఎగిసిపడుతోంది. ఇంజక్షన్ ఇచ్చి కంట్రోల్ చేస్తున్నారు అప్పటికప్పుడు. ఈ గుండె ఎప్పుడు ఆగిపోతుందో అన్నట్టుంది.

ICU బయటే మా వారు PPE కిట్ వేసుకుని పచార్లు కొడుతూ ఉన్నారు. నా కండిషన్ చూసినప్పటి నుంచీ విశ్రాంతి లేదు ఆయనకి. "నా మీద అసలు ప్రేమే లేద"న్నాను ఒకప్పుడు. ఇప్పుడు ఆయన ప్రేమనంతా నాకోసం మూట కడుతున్నారు.

పిల్లలు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అని తలచుకోగానే గుండె వేగంగా కొట్టకోసాగింది. ఏదో చెప్పాలని అనుకుంటూ నోట మాట రాక ఏవేవో సైగలు చేసి చూపించాను.

"ఏంటి మీ వారిని చూడాలా?" అని అర్థం చేసుకుంది నర్స్. "కుదరదమ్మా" అని చెప్పేసింది.

"ప్లీజ్" అంటున్నట్టు అభ్యర్థనగా మొహం పెట్టడంతో ‘సరే’ అని ఆయన్ని లోపలకి పిలిచింది.

లోపలకి రాగానే నా చేతిలో చెయ్యి వేసి "నీకేం కాదు అపర్ణా! రిలాక్స్డ్ గా ఉండు. అంతా బాగానే ఉంది. త్వరలోనే నయం అయిపోతుంది. పిల్లలూ, నేనూ అమ్మా నాన్నా అందరం బాగానే ఉన్నాం. నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ విషయం గుర్తుంచుకో! నువ్వు తొందరగా కోలుకుని ఇంటికి తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇంకేం ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. సమయానికి మందులు వేసుకో. నీకు తోడుగా మేమున్నాం. నీకు ఏమీ కాదు, కానివ్వను!" అంటూ భరోసా ఇచ్చారు.

అయితే నిజంగానే త్వరగా కోలుకుంటానేమో అన్న ఆశ నాలో చిగురించి, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. త్వరగా నయమయ్యి ఇంటికి వెళ్ళిపోవాలనే తాపత్రయం నాలో పెరిగింది. కుటుంబం, భర్త అనే *తియ్యని బంధం* నన్ను అటువైపు లాగుతోంది. "నా పిల్లల్ని, అత్తా మామలని చూసుకోవటానికి నేను ఉండాలి" అనీ గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇక మిగిలింది ఆ పైవాడి దయ!..

#సమాప్తం#

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.


లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం :

నా పేరు పరిమళ. పరిమళ కళ్యాణ్ పేరుతో కథలు, కవితలు రాస్తూ ఉంటాను. ఇప్పటివరకూ ప్రతిలిపి, మొమ్స్ప్రెస్సో లాంటి సోషల్ ఆప్స్ లో, ఫేస్బుక్ గ్రూప్స్ లోనూ అనేక కథలు రాసాను. తపస్విమనోహరం అనే కొత్త వెబ్ మ్యాగజైన్ కి కూడా కథలు అందిస్తున్నాను. ఈ మధ్యనే పత్రికలకి కథలు పంపటం మొదలు పెట్టాను. నా కథల్లో ఒకటి స్నేహ వార పత్రికలోను, భూమిక మరియు మాలిక వెబ్ పత్రికల్లో ఒక్కొక్క కథ ప్రచురితం అయ్యాయి. కథలే కాకుండా కవితలు, పేరడీ పాటలు కూడా రాస్తూ ఉంటాను. హస్యానందం పత్రికలో పేరడీ పాటల పోటీలో నా పాట బహుమతి గెలుచుకుంది. అలాగే ఆడియో కథలు కూడా చేస్తూ ఉంటాను. అలాగే నాకు దొరికిన కథలు అన్నీ చదువుతూ ఉంటాను.


128 views0 comments

Comments


bottom of page