'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 11' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 16/10/2023
'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 11' తెలుగు ధారావాహిక
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
వెంకటరామయ్య అనే రైతు కూతురు వెన్నెల. గుడి దగ్గర ఆమెను చూసిన రవిప్రకాశ్ అనే యువకుడు ఇష్టపడతాడు. కానీ తలిదండ్రులు వేరే సంబంధం చూస్తూ వుంటే తన మనసులో మాట బయటకు చెప్పలేక పోతుంది వెన్నెల. ఆమె వివాహం చంద్రంతో జరుగుతుంది.
వ్యసనపరుడైన చంద్రంతో విడిపోవాలను కుంటున్నట్లు చెబుతుంది వెన్నెల. ఇరువైపుల పెద్దలూ కలుస్తారు. కొడుకునే సమర్థిస్తారు చంద్రం పేరెంట్స్. కనపడకుండా పోయిన చంద్రం మాజీ ప్రియురాలు మనోరమ గురించి రవళిని ప్రశ్నిస్తాడు యాది రెడ్డి.
ఇక తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 11 చదవండి.
ఆమె ఫ్లాట్ కు వెళ్ళి తలుపు తీసుకుని మంచినీళ్ళు గడగడా తాగేసి కుర్చీలో కూలబడింది. చచ్చేంత నీరసంగా ఉంది. వస్తూ ఏదన్నా తిందామనుకుంది. కానీ సరాసరి ఇంటికి వచ్చేసింది. ఆ వెంటనే ఫోన్ రింగయ్యింది. దిలీప్ ఫోన్.
“పోలీస్‌స్టేషన్ లో ఏం చెప్పావు?” అనడిగాడు.
దిలీప్ ప్రశ్నలతో నివ్వెరపోయింది. తను పోలీస్‌స్టేషన్ కి వెళ్ళినట్లు అతని కెలా తెలుసు?అనుకున్నది. అప్పుడు గానీ ఆమెకి అర్థము కాలేదు. వాళ్ళు ఎక్కడో ఉండి తన మీద నిఘా పెట్టారు. ఆ ఆలోచన రాగానే వణికిపోయిందామె. లేనిపోని సమస్యలో ఇరుక్కున్నానని.
"రవళీ! పోలీస్‌స్టేషన్ లో ఏం అడిగారు? నువ్వేం చెప్పావు?” దిలీప్ కంగారుగా అడిగాడు.
“ప్రశ్నలతో చంపేశారు.. నేను..” ఆమె అదో చెప్పబోయింది.
“అది సరే! ఏం చెప్పావక్కడ?” రెట్టించాడు అసహనంగా.
"ఏం చెబుతాను.. అక్కడ జరిగింది చెప్పాను..”
" అంటే?"
“మనం పార్టీ చేసుకున్నట్లు!.. మీరు వెళ్ళి పోయినట్లు..”
"పార్టీ అని చెప్పి చచ్చావా? అసలు మిమ్మల్ని పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇమ్మని ఎవరు చెప్పారు? బుద్దిలేకపోతేనూ". అని ఫోన్ పెట్టేశాడు.
ఆమెకు ఏం చెయ్యాలో తోచడంలేదు. భయంభయంగా ఉంది. ఇప్పుడు తనకి సలహా ఇచ్చేవారు ఎవరూ కనబడలేదు. ఈ మనోరమ ఏమైనట్లు? ఎక్కడికి వెళ్ళి చచ్చినా ఈ పాటికి ఫ్లాట్ కి వచ్చి చావాలి కదా! దానికి బుద్ది లేదు.. అసలు కంప్లయింట్ ఇవ్వకుండా ఉంటే బావుండేది. ఎవరికీ ఈ విషయం తెలిసేది కాదు. కంప్లయింట్ ఇద్దాం
అని ఈ ఊర్మిళ చేసింది అంతానూ.. ఛీ అని నెత్తి కొట్టుకుంటూ తిట్టుకుంది.
-----------------
ఊరంతా శ్రీరామనవమి ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. రామాలయాలలోనూ, అపార్ట్‌మెంట్ల లోనూ పెద్ద పెద్ద పందిళ్ళు వేసి ఎంతో ఘనాతిఘనంగా జరుపుకుంటున్నారు. అందులో " సీతకథ ఎల్లరకూ పాఠమే".
రాక్షసవధలో విరామమెరుగని రాముని, రామకథను ముందుకు నడిపించిన సీతా మహత్ చరితమే రామాయణం. కథానాయకుడు రాముడైనా, కథంతా సీతదే.
ప్రకృతి యావత్తు పసిపాప రూపమై, బీడు వారిన గుండెలతో నిరీక్షిస్తున్న జనకుని చేరి సీతగా మిథిలాపురిని మురిపించినా, ప్రాచీన వైవాహిక సంప్రదాయాలకు మారు
రూపుగా చెప్పే శివధనువును పునరిద్ధరించే ప్రయత్నము చేసినా శ్రీరాముని చేయందుకుని దాంపత్య ధర్మ ప్రతిష్టాపనలో తన వంతు బాధ్యతను సక్రమంగా
నిర్వర్తించినా సీతకే చెల్లింది.
సమస్త మాననీయ విలువలకు, ఉద్వేగ నిరూపణలకు
ధర్మరక్షణకు అపురూపమైవడన కుటుంభ సంబంధాలకు కోరిక-త్యాగాలకునూ, ప్రకృతికి- మనిషికీ, నిస్వార్థ పరమార్థాలకు వెన్నుదన్నుగా నిలిచి నేటికీ, ఏ నాటికీ
కీర్తిని పొందేది రామాయణమైతే, అంతటి సుందర రామకథా మణిహారంలో కలికి తురాయి సీత. ఒక్క మాటలో చెప్పాలంటే సీత పరిపూర్ణిత స్త్రీత్వానికి ప్రతీక. తరాలు
మారినా తరగని విలువల గని. ఆమె నుంచి మనం స్ఫూర్తి పొందవలసిన అంశాలెన్నో!..
జ్ఞానభూమిలో పుట్టి జనక రాజర్షి కనుసన్నలలో పెరిగిన సీత. బ్రహ్మవాదిని గార్గి చేత ప్రభావితమైంది. తద్వార సకల ధర్మశాస్త్రాలలో అపార జ్ఞాన సముపార్జితురాలైంది.
ప్రశ్నించే తత్వాన్ని ఆకళింపు చేసుకుంది. ఆ తత్వమే ఆమె వ్యక్తిత్వ వికాసానికి పునాది రాయి.
తనదే నిర్ణయం;: సీత -- తాను తీసుకున్న నిర్ణయాలతో తనకెదురైన అన్ని పరిస్థితులకూ స్వయంసిద్ధంగా ఉందే కానీ దేనికీ మరొకరిని కారణంగా చూపించలేదు. అది అయోధ్యను వదిలి అడవికి వెళ్ళటమైనా, లక్ష్మణ రేఖ దాటడమైనా, కడలి దాటించగలనన్న హనుమ వినతిని తిరస్కరించటమైనా, సుతులతో తిరిగి రాజ్యానికి రమ్మన్న రాముని కాదని, భూమాత ఒడికి చేరుకోవడమైనా, ప్రతి సందర్భము లోనూ ఆమె తన నిర్ణయానికే కట్టుబడి ఉంది.
ధైర్యశాలి: శింశుపావనంలో ఘోర రక్కసులు తనను చుట్టుముట్టినా, రావణుడంతటివాడు తన ఎదుట నిలిచి సామ, దాన, భేద, దండోపాయములను ప్రయోగించినా అతనికి లొంగలేదు. సహజ క్షమాగుణంతో రావణుని ప్రవర్తనలో మార్పు కోరింది కానీ రాక్షస కుల వినాశనాన్ని కోరలేదు.
వివేకవంతురాలు: రావణుడు మాయోపాయంతో తనను లంకకు ఎత్తుకుపోయే సమయంలో తనకున్న కొద్దిపాటి నగలను జారవిడిచి తన ఉనికిని సూచించింది.
మరోసారి మోసపోకూడదన్న ముందు జాగ్రత్తతో.. పరిపూర్ణ విశ్వాసం కలిగించిన తరవాతే హనుమతో మాట కలిపింది.
ఆత్మగౌరవం: తన కోసం నిరీక్షించిన భర్తకోసం, ఆ నాటి పరిస్థితుల ప్రకారం అగ్ని పరీక్షకు అంగీకరించింది. కానీ, నిండు గర్భిణైన తనను అడవులు పాలు చేసిన రాముడు, అయోధ్య ప్రజలు తనను రమ్మని ఎంత బ్రతిమిలాడినా అంగీకరించలేదు. భూమాత ఒడికి చేరుకుంటుంది. ఆమె ఏ పని చేసినా తన ఆత్మసంతృప్తి కేగాని సమాజ అభ్యంతరాలకు లొంగి కాదు.
ప్రజలూ-పరిస్థితులూ వారి మనోభావాలుసీత జీవితం లోని ఒక భాగమే కానీ వాటి కోసం తన వ్యక్తిత్వం ఏనాడూ మార్చుకో
లేదు. భార్యాభర్తల బంధం సజావుగా సాగటానికి చివరి వరకూ కొనసాగించింది.
నమ్మకం: సీతకూ భర్త పరాక్రమము పై నమ్మకమూ ఎక్కువే. అందుకే రాముడు వస్తాడని, తనను సగౌరవంగా తీసుకెళతాడనీ రావణునితో సవాల్ చేయగలిగింది.
గడ్డిపోచ కన్నా హీనంగా రావణున్ని చూడగలిగింది. ఏక పత్నీవ్రతుడైన తన భర్త చేతిలో రావణుడికి తగిన దండన తప్పదంది. అన్నట్టుగానే దానిని నిలుపుకున్నాడు రాముడు. అందుకే వారు ఆదర్శదంపతులైనారు.
స్వావలంబన: ఇది సీత సొంతం. ఎంతటి గడ్డు పరిస్థితులలోనూ తనను తానూ నిలుపుకున్న తీరూ అద్భుతం. ఆమె తనపై తాను ఆధారపడ్డంతగా ఎవరిపైనా ఆధారపడలేదు. ఇది వాస్తవం కూడా. నాటి సీత చేసి, చూపించింది.
మన తరాలకి అనుసరణీయం. ఆ బాటలో నడుద్దాం.
-------------------------------------
ఉగాదులు లేవు. ఉషస్సులు లేవు. శ్రీరామనవమి ఉత్సవాలూ లేవు. అన్నీ ఉపద్రవాలే వెన్నెల జీవితంలో ప్రత్యక్షంగా పరోక్షంగా.
మిట్టమధ్యాహ్నం మూడు గంటలకు గెస్ట్ హౌస్ దగ్గరకు పోలీస్ జీపు వచ్చి ఆగింది. వాచ్‌మెన్ యాదయ్య కంగారు పడ్డాడు. పైకి ఎగ్గట్టిన లుంగీ క్రిందికి వదిలి వినయంగా నిలబడ్డాడు.
ఇక్కడ వాచ్‌మెన్ నువ్వేనా? జీప్ దిగుతూ ఏసీపీ యాదిరెడ్డి అడిగాడు.
అతడితో బాటు ఇద్దరు కానిస్టేబుల్సు వచ్చారు. వాళ్ళు కూడా జీప్ దిగారు.
"నేనే సార్.. వినయంగా తలూపుతూ చెప్పాడు యాదయ్య.
జీపూ, తనభర్త యాదయ్య అక్కడ నిల్చోవడం చూసి మల్లమ్మ గబగబా వచ్చి భర్త ప్రక్కనే నిలబడింది.
నాలుగురోజుల క్రిందట ఐదుగురు( ముగ్గురు ఆడాళ్ళు, ఇద్దరు మగాళ్ళు) కలిసి పార్టీ చేసుకున్నారు గుర్తుందా?.. అనడిగాడు యాదిరెడ్డి గెస్ట్‌హౌస్ వైపు నడుస్తూ.
"గుర్తున్నది, సారూ.. చేతులు కట్టుకునే వినయంగా తలూపుతూ అతడిని అనుసరిస్తూ చెప్పాడు యాదయ్య.
"ఇక్కడేనా వాళ్ళు పార్టీ చేసుకున్నది?" తలుపు తియ్యమని సంజ్ఞ చేస్తూ అడిగాడు యాదిరెడ్డి.
మల్లమ్మ పరుగు లాంటి నడకతో వెళ్ళి తాళాలు తీసుకొచ్చి భర్త చేతికిచ్చింది. యాదయ్య గెస్ట్‌హౌస్ తలుపులు తీశాడు. యాదిరెడ్డి లోపలికి వెళ్ళాడు. చాలా నీట్‌గా ఉందక్కడ.
గోడమీద కానీ, క్రింద గోడ మీదల గానీ ఏ రకమైన మరకలు కనిపించడము లేదు. వారం పదిరోజుల క్రిందట పెయింట్ వేసినట్లుంది.
'కొత్తగా పెయింట్ వేశారా?' అనడిగాడు అంతా నిశితంగా పరిశీలిస్తూ.
“అవును సార్.. మినిస్టర్ గారు వస్తే ఇక్కడ శ్యానా మంది కూకుంటారు కదా. సారూ.. మాసిపోయిందని రంగేసినారు సారూ..” చెప్పాడు యాదయ్య.
యాదిరెడ్డి చూపులు టీపాయ్ ఇవతలికి ఎడం చేతి ప్రక్కన గోడమీద పడ్డాయి.
అక్కడ పరిశీలిస్తున్నట్లు కాకుండా తల అటుఇటుగా పరిశీలించాడు. అక్కడ అరచేతి కన్నా కాస్త పెద్దదిగా మరక కనిపించింది అస్పష్టంగా.
సింగిల్ కోటింగ్ పెయింట్. హడావుడిగావెయ్యడం వలన ఆ మరక పోలేదు. ' సంథింగ్ హాపెండ్.. అనుకున్నాడు మనస్సులోనే. తన టీం మెంబర్స్ కు ఆ మరక
దగ్గర సాంపిల్స్ మరియు దాని ఫోటో తీసుకొమ్మని ఆజ్ఞాపించాడు.
“ఆ రోజు వచ్చిన వాళ్ళలో మనోరమ అన్న ఆమె కనిపించకుండా పోయిందని కప్లైంట్ ఇచ్చారు. వాళ్ళంతా ఎప్పుడు ఇక్కడ నుంచి బయటి కెళ్ళారు”.
“ఆరి పేర్లు తెలవదండీ.. కానీ.. అంతా యెల్లిపోనారండీ..”
“సరే! నువ్వోసారి స్టేషన్ రావాలి.. కబురు చేసినప్పుడు రా.. స్టేట్‌మెంట్ ఇద్దువుగానీ..” అన్నాడు యాదిరెడ్డి కాస్త కఠినంగా.
"అయ్యబాబోయ్.. నా కేంతెల్దండి.. నేను వాచ్‌మెన్ నండీ.. ఆళ్ళు చెప్పింది చెయ్యడమే కాని నాకేటి తెల్దండి బాబయ్య.. యాదయ్య ఏసీపీ యాదిరెడ్డి కాళ్ళమీద పడ్డాడు.
“ఏం కాదు.. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అక్కడ స్టేషన్ లో చెబుదువు గానీ. రాసుకోవాలిగా..” అన్నాడు యాదిరెడ్డి. పరిశీలించి చూసి వస్తూ బయటికి వచ్చి ఒక సారి ఆపరిసరాలు చుట్టూ చూశాడు. అందమైన గెస్ట్‌హౌస్ లోపల ఫర్నీచర్ అమరిక కూడా బాగుంది అనుకున్నాడు.
యాదయ్య కళ్ళలో ఒకసారి సూటిగా చూశాడు. వాడి
కళ్ళలో ఏదో భయం, బెరుకు స్పష్టంగా కనిపించిందతనికి. జీపెక్కి వెళ్ళిపోయాడు.
ఆఫీసుకు వచ్చి తన ఛాంబర్ లో కూర్చుని ' సమ్‌థింగ్ హాపెండ్..’ అని రెండు మూడు సార్లు అనుకున్నాడు మనసులో, కాకపోతే మనోరమ అత్యాచారం జరిగి
హత్యకు గురైందా.. లేక వేరే ఏదో కారణాల వల్ల హత్యకు గురయ్యిందా అనేదే ఇక్కడ తేలాల్సిన విషయం. లేదా వేరే కారణం చేత మనోరమ ను కిడ్నాప్ చేశారా అనేది తేలాలి అనుకున్నాడు.
ఇంతలో కానిస్టేబుల్ వచ్చి రవళి ఇచ్చిన, మిగిలిన వాళ్ళ సెల్‌నంబర్లు, నోట్ చేసిన కాగితం అతడికి ఎదురుగా టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. ఆ కాగితం చూసి ముందుగా దిలీప్ నంబర్‌కి ఫోన్ చేశాడు. పని చేయడం లేదు అని సమాధానం వచ్చింది. అంటే దిలీప్ సెల్ నెంబర్ మార్చేశాడన్నమాట అనుకున్నాడు. ఇంకో వ్యక్తి చంద్రం కి రింగ్ చేశాడు. ఆ వ్యక్తి ప్రస్తుతం కవరేజి ఏరియా లో లేడని సమాధానం వచ్చింది.
అంటే వీరెవరూ సిటీలో లేరన్నమాట అనుకున్నాడు.
ఆ తరవాత చేయలిసిన పనులు చేశాడు. మరునాడు కూడా దిలీప్ కీ, చంద్రానికీ ఫోన్ లు చేశాడు. అదే సమాధానం వచ్చింది.
-------------------------------
మనోరమ కనిపించకుండా పోయిందని కంప్లయింట్ ఇచ్చి పదిరోజుల పైనే అయ్యింది. ఇంత వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ఇప్పటి వరకూ ఆమె ఆచూకీ గానీ, తెలిసిందని గానీ పోలీసులు ఏ విషయం చెప్పడము లేదు. అదే వార్త ఒక
ప్రముఖ దిన పత్రిక లో వచ్చింది. ఆ వార్తని యాదిరెడ్డి సీరియస్‌గా చదువుతున్నాడు.
మరో ప్రముఖ క్రైమ్ రిపోర్టర్ యోగేశ్ ఆ సమయంలో అక్కడే ఉన్నాడు.
“ఇంతవరకూ దాని మీద మీ స్పందన ఏమిటి సార్?” అని అడిగాడు. ఆ రిపోర్ట్సు చదవడం పూర్తయ్యాక పేపర్ టేబుల్ మీద పడేస్తున్న యాదిరెడ్డిని యోగేశ్ అడిగాడు.
యోగేశ్ అంటే యాదిరెడ్డికి మంచి గురి ఉంది. అతను సంచలనాల గురించి నిర్దిష్టమైన ప్రమాణాలు పాటిస్తాడు. అతడు ఇచ్చిన వార్త చదివాక పాఠకుడు గందరగోళంలో పడే ప్రసక్తే లేదు. కొందరు వార్త నిస్తే హెడ్డింగ్ ఒకటి. లోపల సారాంశము ఒకటిగా ఉంటుంది. మరో రెండు పత్రికలు చదివితే గానీ ఆ వార్త ఏమిటో అర్థం కాదు. కాని యోగేశ్ వార్త ఇచ్చాడంటే అది స్పష్టంగా ఉంటుంది. అందుకే యోగేశ్ అంటే యాదిరెడ్డి ఇష్టపడతాడు.
“హడావుడిగా ఏదో చెప్పడం, ఎవరినో అరెస్టు చేసినట్లు చూపించడం ఇవన్నీ నాకు ఇష్టం లేదు. కొన్ని సందర్భాలలో వేగం పని చేయదు. కొన్ని కేసుల లో నిధానం
ప్రదానం. కొన్నిటిలో నిధానం పనికిరాదు. అన్నింటినీ ఒకేలా చూడకూడదు. వాళ్ళేదో రాశారని నేను హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టి ఏదో చెప్పడం నాకు అస్సలు ఇష్టం వుండవు. ఒక కేసు గురించి పూర్తిగా అప్పుడు మొదలెడుతాను. ప్రస్తుతానికి నేను చెప్పేది ఒక్కటే ! కేసును ధర్యాప్తు చేస్తున్నాం. అది తొందరలో ఛేదిస్తాం..” అన్నాడు యాదిరెడ్డి.
"అలాగే రాయమంటారా?” అనడిగాడు యోగేశ్.
“తప్పకుండా.. ప్రస్తుతానికి అంతే.. ఆ క్రైమ్‌రిపోర్టర్ క్ వేరే వార్తలు ఏవీ లేవంటారు..” అన్నాడు నవ్వుతూ. యాదిరెడ్డి అతని నవ్వుతో శృతి కలిపాడు.
“ఆఫ్ ది రికార్డ్ అడుగుతున్నాను.. అసలు ఏం అనుకుంటున్నారు సార్.. ఆ కేసు గురించి?” యోగేశ్ అడిగాడు.
"ఏ కేసు?"
“అదే సర్, మనోరమ కేసు. మిస్సింగ్ వ్యవహారం”
“అనుకోవడానికేముంది.. రేప్ చేసి చంపేశారా?.. లేక వేరే ఏదైనా గొడవతో చంపేశారా?.. లేదా ఎత్తుకుపోయారా?.. అన్నదే మిలియన్‌డాలర్ ప్రశ్న. ఈ మూడింటిలో ఏదైనా కావచ్చు. మొదటి, రెండింటి మీదనే నాఅనుమానం”
చెప్పాడు సాలోచనగా యాదిరెడ్డి.
"ఈ మధ్య సిటీలో ఇలాంటి కేసులు చాలా పెరిగిపోయాయి. సర్.. " యోగేశ్ అన్నాడు.
"విచ్చలవిడితనం, మనిషిని ఎంతైనా తెగించేట్లు చేస్తోంది. ఏవి చూసినా ఇవే. బిఎఫ్, జీఎఫ్ కల్చర్ రోడ్లమీద తిరగడం, అసభ్యంగా ప్రవర్తించడం, రోడ్లమీద కురచ దుస్తులతో తిరగడం, తల్లిదండ్రుల బాధ్యాతారాహిత్యం. వీటన్నింటికీ సినిమాలే కారణం. ఏమైనా అడిగితే ప్రేక్షకులు చూస్తున్నారని మేము తీస్తున్నామంటారు. అస్సలు బాధ్యతారాహిత్యం మాటలు.
ధనార్జనే పరమావది. ఇంకా రియాల్టీషోల పేరిట ఐదైళ్ళ అయినా లేని పిల్లలతో బూతుపాటల నృత్యాలు. ఇలా చేయకూడదని ప్రజాప్రయేజనము పేరిట కోర్టులు
ఆదేశిస్తే తల్లిదండ్రులే తిరగబడడమూ. మళ్ళీ వీళ్ళ కేమైనా అయితే ప్రభుత్వమేమి చేస్తోంది ? ప్రభుత్వం పనిచేయడము లేదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడతారు. ఇంక పబ్ కల్చర్ సంగతి ఏంటీ? మాదకద్రవ్యాల మాట ఏంటి? మత్తు మాయలో పడి చిన్నా పెద్దా ఆడా మగా తేడా లేకుండా రోడ్లమీద ఆక్సిడెంట్లు చేయడము, పోలీసులు అరెస్టులు చేయడం. ఆపై పలుకుబడి కలిగిన తల్లితండ్రులు వాళ్ళని విడిపించడం.
పైగా పోలీసులతోనే గొడవపడి వాళ్ళ పిల్లలు అమాయకులని వాదించడం. తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఏమీ మందలించకపోవడం. ఇంక వాళ్ళకి ఈ పని చేయ
కూడదు, ఆ పని చేయకూడదు అనే ఇంగితజ్ఞానం ఉండటము లేదు. అంతా చదువుకున్న మూర్ఖులు. కొంతమంది చదువు కొనిన మూర్ఖులు. అరెస్ట్ చేస్తే ఎవడిదో
ఫోన్. మరీ దరిద్రం. అరెస్ట్ చేయకపోతే వీడేం డ్యూటీ చేస్తున్నాడంటారు. కానీ చాలా మందికి ఇలా అంటే కోపం వస్తోంది. క్రమశిక్షణ, అస్సలు లేదు. పెద్దంత్రం, చిన్నంత్రం. అనే తేడా లేకుండా పోయింది. అంతా విచ్చలవిడితనం.
ఇంక చెత్తాచెదారం సంగతి. ధూమపానం రోడ్లమీద చేయొద్దు అని చెప్పినా బహిరంగంగా రోడ్లమీద కాల్చివేయడం. పళ్ళు తిని రోడ్లమీద తొక్కలు వేయడం..
ప్లాస్టిక్ సంచులు వాడకూడదు అంటే ఖచ్చితంగా వాడతారు. పట్టుకుని జరీమానా వేస్తే సోకాల్డ్ లెటర్‌హెడ్ నాయకులు ఉధ్యమాలు లేవదీస్తారు. పర్యావరణానికి చాలా ముప్పు అన్నా పట్టించుకోరు” యాదిరెడ్డి ఆవేశంగా మాట్లాడుతుంటే యోగేశ్ చిరునవ్వు నవ్వాడు.
"నవ్వుతున్నావేం యోగీ ?.. నేనన్నది నిజం కాదా. ?”
"ఖచ్చితంగా నిజం సార్.. కానీ రాజకీయపార్టీలు ప్రస్తావన వచ్చింది కాబట్టి నేనోమాట చెబుతాను. మద్దతు వెంటనే తెలియజేయకపోతే తామెక్కడ వెనకబడి పోతామో నన్న భయం సర్.. "
“ఖచ్చితంగా అంతే..”
“వస్తా సర్..” అని యోగేశ్ వెళ్ళిపోయాడు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
留言