'Tholagina Nili Nidalu episode 2' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam
'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 2' తెలుగు ధారావాహిక
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
వెంకటరామయ్య అనే రైతు కూతురు వెన్నెల. గుడి దగ్గర ఆమెను చూసిన రవిప్రకాశ్ అనే యువకుడు ఇష్టపడతాడు. ఆమె వివరాలు స్నేహితుడు సుధాకర్ ని అడిగి తెలుసుకుంటాడు.
ఇక తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 2 చదవండి.
సాయంత్రం గాలి, సంధ్యదీపాన్ని వెలిగించినట్లు చంద్రుడు అప్పుడప్పుడే ఉదయిస్తున్నాడు. వెన్నెల, ప్రియుడి మీద అలిగివున్నట్లే మబ్బుల చాటునే ఉండిపోయింది. డాబాపై వెల్లకిలా పడుకొని తలక్రిందులుగా చేతులుంచుకుని అలలుగా కదిలిపోతున్న మేఘాలవైపు చూస్తున్నాడు రవిప్రకాశ్.
నిద్ర పట్టని తుమ్మెద ఒకటి తన గూడు లోంచి బయటకి వచ్చి అతడి మీసకట్టు చూడగానే తనలాగే నిద్రపట్టని తుమ్మెదల బారు ఎక్కడికో ప్రయాణమైందని పరుగు
పరుగున వచ్చి సత్యం తెలుసుకోగానే బిత్తరపోయి బిరబిరా ఎగిరిపోయింది.
అతని కళ్ళ ముందు ఒక మధుర స్వప్నంలోని మహారాణి ఆమె. కనురెప్పలు వాల్చాలని లేదు. కంటి తెరపై నిలుపుకున్న ఆమె రూపాన్ని తనివితీరా చూసుకుంటున్నాడు.
ఆమె వెన్నెల.
ఒక ప్రభంజనంలో ధూళి కణంలా కొట్టుకుపోవడమే ప్రేమయితే అతడు తన ఉనికిని ఎప్పుడో కోల్పోయాడు. ఆమె స్మృతుల ప్రభంజనంలో అతడు జ్ఞాపకమై కొట్టుకు పోతున్నాడు. భుజం మీద ఎవరిదోచేయి పడగానే ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి తేరుకున్నాడు. మది కదిలింది. కల చెదిరింది.
"ఏమిటీ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?" అడుగుతూ అతని ప్రక్కనే కూర్చున్నాడు సుధాకర్.
"ఏం లేదు. !" అని చెప్పి పెదవుల మీదికి చిరునవ్వు తెచ్చుకుని సర్దుకున్నాడు.
సుధాకర్ రెండు చేతులు వెనక్కి ఆన్చి, కాళ్ళు బార్లా చాపుకుంటూ "మా వూరు నచ్చిందా ?" అడిగాడు.
"చాలా ! ప్రకృతి అంటే పల్లియలు. పల్లియలంటే ప్రకృతి. ఎక్కడో చదివాను. ఈ పల్లె, పచ్చని పైర్లు, గోదావరి చూశాక ఆ మాటలు అక్షర సత్యాలుగా తోస్తున్నాయి. దినమంతా ఎండలో కష్టపడ్డా చెదరని ఆ రైతు కూలీల చిరునవ్వులు, సాయంత్రం ఇళ్ళకు వెళుతూ స్త్రీలు పాడే పాటలు. వాటికి తోడు మృదంగనాదంలా, పశువుల గిట్టల చప్పుడు. నిజంగా ఈ పల్లె జనాలెంత అదృష్టవంతులు" పరవశంగా కళ్ళు
మూసుకుని చెప్పాడు రవిప్రకాశ్. “నా కిక్కడే వుండిపోవాలనిపిస్తోంది”.
అతడి మాటలకి నవ్వాడు సుధాకర్. ఆ నవ్వు చూసి అతని వైపు ప్రశ్నర్థకంగా చూశాడు రవిప్రకాశ్.
"పల్లెటూరిని చూడటం ఇదే మొదటిసారా?" అడిగాడు సుధాకర్.
అవునన్నట్టు తలవూపాడు.
"అందుకే అంత బలంగా అనిపిస్తోంది. కానీ మనకు ఎక్కడి జీవితం అలవాటయితే అక్కడే బావుంటుంది. ముఖ్యంగా మనకు జీవనాదారం కలుగజేసే ప్రదేశంలోనే మనకు అనుబంధం ఏర్పడుతుంది. ఓ నాలుగైదు నెలలు పట్నంలో వుంటే ఎప్పుడెప్పుడు యీ ఊరు వచ్చేయాలని మనసు కొట్టుకుంటుంది.
అక్కడి స్పీడ్ ప్రపంచంలో విసుగెత్తి ఊరు వచ్చేసి హాయిగా వారంరోజులు ఉండిపోవాలనిపిస్తుంది. ఆ తరువాత నిశ్శబ్దమైన వాతావరణం, మనసులు బోర్ కొట్టడం మొద
లెడతాయి”.
సుధాకర్ మాటల్లో నిజమనిపించింది. అంతే కాదు ! ప్రతి రోజు చూస్తూవుంటే దేనికైనా విలువవుండదు. రోజూ వచ్చే సూర్యభగవానుడి కన్నా అప్పుడప్పుడూ కనిపించే చంద్రుడిపైనే మనుషులకు మక్కువ ఎక్కువ.
"చదువు పూర్తయింది కదా! వెళ్ళగానే ఉద్యోగంలో చేరతావా?”
సుధాకర్ ప్రశ్నలో ఇద్దరి భవిష్యత్తు మరలింది.
"చేరాలీ! ఇంకా ఎక్కడా అనుకోలేదు."
“అయినా నీకు ఉద్యోగం చేసే అవసరం ఏమిటి? ధనలక్మి వర పుత్రుడవు. నువ్వు జాబ్‌లో చేరతానంటే బహుశా మీ వాళ్ళు ఒప్పుకోరేమో!"
"అలా అనుకుంటే లా ఎందుకు చదువుతాను.. అయినా అలా ఎట్లా అలా మాట్లాడుతావేమిటి? నీకు చాలా సార్లు చెప్పాను. మన స్నేహంలో ఏ అంతరాలు వుండకూడదని. నేను బాగా డబ్బున్న వాడి ననే ఫీలింగ్ నీలో ఏ కోశాన కలిగినా ఈ క్షణమే వెళ్ళిపోతాను. మన స్నేహానికి రాం.. రాం..” నిష్టూరత ధ్వనించే కంఠంతో అన్నాడు రవిప్రకాశ్.
"ఛ.. ఛ.. నేను అలా అనుకోవడం లేదు. పొరపాటున కూడా నా నా నోట్లోంచి వచ్చేది కాదు. ఎందుకో అలావచ్చేసింది."
"అయితో మనసులో వుందన్నమాట".
"లేదు మహాప్రభో! నా అరికాళ్ళలో కూడా నాకా ఉద్దేశ్యం లేదు. పొరపాటయ్యింది. క్షమించు" చేతులెత్తి నమస్కరించాడు సుధాకర్.
"ఒక విషయం ఫ్రాంక్ గా చెప్పు సుధా! మొట్టమొదటి సారిగా తాతయ్య బామ్మలని వదిలి హైద్రాబాద్ కి వచ్చేశాను. అంత పెద్దవాడి నయ్యి బామ్మ ప్రక్కనే కూర్చని కబుర్లు చెబితే గాని నిద్రపోయేవాడిని కాదు. అప్పుడు నువ్వింకా రాలేదు. మొదటి రెండు నెలలు హోంసిక్ గా ఫీలయ్యాను. కానీ నువ్వు హాస్టల్‌లో చేరాక నువ్వందించిన స్నేహం వల్ల వంటరితనం వదలగలిగాను. కానీ నీ తోడువల్ల ధైర్యంగా వుండగలిగాను. నిజంగా నువ్వు లేకపోతే చదువు మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయేవాడినేమో!”
రవిప్రకాశ్ మాటల్లో సిన్సియారిటీ కి కదిలిపోయాడు సుధాకర్.
"చెప్పు సుధా! నా దగ్గరున్న ఐశ్వర్యమంతా వెచ్చించినా నీ స్నేహానికి మూల్యం చెల్లించగలనా?"
సుధాకర్ స్నేహితుడి భుజంపై చెయ్యేసి నొక్కాడు ఆప్యాయంగా. దూరంగా నది మీద చేపలు పట్టే జాలర్లు పడవలతో తెడ్డులు వేసుకుంటూ పాడేపాట గాలివాలుకు స్పష్టంగా వినబడుతోంది.
ఏలియాలా.. ఏలియాలా.. ఏలియాలా
ఐలేసా.. జేరుసెయ్యి.. ఐలేసా బారుసెయ్యి
గోదారి తల్లికి కోటి దండ్లు.. సల్లంగ సూసె మా తల్లికి
సాన దండాలు
ఐలేసా జోరుసెయ్యి.. ఐలేసా బారుసెయ్యి
గట్టుమీద పిల్లా జెల్లా వున్నారు.
జల్లలేమీ జోలెవేసి సల్లంగ సూడు తల్లీ
ఐలేస్సా!
తాటిమట్ట గుడిసెలోన తల్లిపెళ్ళామున్నారు
వల్లోన కొర్రమట్టలేసి.. కాపాడు తల్లీ
ఐలేస్సా!
క్రమ క్రమంగా పాట దూరమైంది.
"ఆమెని మరొక్కసారి చూడాలి.." హఠాత్తుగా అన్నాడు రవిప్రకాశ్.
ఆశ్చర్యంగా చూశాడు సుధాకర్. "ఎవరిని?" అడిగాడు.
"వెన్నెల". అపురూపంగా ఉచ్ఛరించాయి అతని పెదవులు.
అదిరిపడ్డాడు సుధాకర్. "ఏ.. మం.. టు.. న్నా.. వ్?"
"ఆమెని చూడాలి. ఒక్కసారి చాలు. ఎందుకో తెలీదు కానీ ఆమెని చూడాలనిపిస్తోంది. ఆమెని మరొక్కసారి చూడకుండా వెళ్ళిపోతే ఈ అసంతృప్తిని జీవితాంతం నన్ను వెన్నంటే వుంటుంది. ప్లీజ్" అర్థింపు గా చెప్పాడతను.
కళ్ళు విప్పార్చుకుని అతని వైపే ఆశ్చర్యంగా చూస్తున్న అతనికి నెమ్మదిగా ఒక విషయం అర్థమవ్వసాగింది. అది రవిప్రకాశ్, వెన్నెల ప్రేమలో పడ్డారని.
---------------------
ఆ లోగిలి లో అడుగుపెట్టడమంటే.. గుడిలో అడుగుపెట్టిన భావమే రవిప్రకాశ్ లో కలుగుతోంది.
వెన్నెల్లో.. అందమైన పూలమొక్కల మధ్య.. చల్లటిగాలి వీస్తుండగా ఆమె జ్ఞాపకాలని గుండెల్ల మోస్తూ పచ్చిక పై పడుకోవటం అతనికి ఎంత ఆనందంగా ఉంటుందో.. అంతకు వందరెట్లు ఆనందం ఆమె నెలవుండే నేలను సృష్టించడం వలన కలిగింది.
యాంత్రికంగా సుధాకర్ వెనకాల నడుస్తున్నా, అతని కన్నా ముందు అతడి మనసే లోపలికి అడుగుపెట్టింది.
ప్రియురాలి శ్వాస తాలూకు పరిమళమంతా మా ఇంటిని ఆక్రమించుకుని ఓంకారధ్వానాన్ని నినదిస్తున్నట్టు అతడి చెవులు ఆ నిశ్శబ్దావాయుతనాన్ని వీనులవిందుగా వింటున్నాయి. దానికి తోడు గుండె మృదంగమైతే సడిలేని అడుగుల సవ్వడి మువ్వల జడి అయ్యింది.
అతడి కో విషయం అర్థమైంది. నిశ్వాసం మాత్రమే తనదనీ.. ఉఛ్వాసం ఆమె పీల్చి వదిలిన వెచ్చటి వూపిరి తాలూకు ప్రాణవాయువే అని అతనికి నమ్మకం ఏర్పడింది.
అందుకే క్షణం కూడా ఊపిరి బిగబట్టడంలేదు.
హృదయం ఆమె దర్శనం కోసం తపించసాగింది.
"తా.. తై.. ధి.. ధి.. తై.."
"తా తై ధి ధి తై!!"
తా తై ధి ధి తై !!
శృతులను ఆవాహన చేసుకున్న వాయువు లీలగా ఆ శబ్దాల్ని మోసుకుని.. లోగిలి లో జతులుగా నినదిస్తోంది.
తాళం పాదమై ---- మరో తాళమైన నేలని తాకినట్టు..
పదం --పదమంజీరాల పదనిసయినట్లు
ఆహార్యమే ---ఆమె అయినట్టు
ఆమె వెన్నెల అయింది.
నటరాజు విగ్రహం ముందు నాట్యం చేస్తోంది.
నాట్యాచార్యులు' నట్టు వాంగానికి'.. ఆమె కరకంకణ "ఘలంఘల' ప్రతిధ్వానమై అన్నమయ్య కీర్తనకు.. ఆమె నర్తన సమధ్వానమై.. ఆమె రాధయై.. అభిసారికయై.. విరహిదై.. కదులుతోంది.
మండువా లోగిలి ముందున్న వసారా ఆమె నాట్యం నేర్చుకోవటం కోసం కేటాయించబడింది. ప్రతిరోజూ ఉదయం పదిగంటలకే ఆమె అక్కడ నృత్య సాధన చేసు
కుంటుంది.
నర్తనలో భాగంగా ఆమె విసురుగా కాలులేపి ప్రక్కకు వేసింది. సరిగ్గా కట్టని మువ్వలపట్టీ ఆ విసురుకి కాలునుండి వూడి గాల్లో ఎగిరింది. సరిగ్గా అదే సమయంలో రవిప్రకాశ్ స్నేహితుడితో వసారాలో అడుగుపెట్టాడు.
మువ్వలపట్టీ ముద్దుగా వెళ్ళి రవిప్రకాశ్ గుండెను తాకింది. ఉలిక్కిపడ్డాడు. అసంకల్పితంగా ఆ పట్టీని చేత్తో పట్టుకుని తలతిప్పి చూశాడు. ఘటం ఘలలు ఆగాయి. జతులూ.. శృతులూ మిన్నకుండిపోయాయి. శబ్దాలన్నీ ఆగిపోయి నిశ్శబ్దం మిగిలింది. నిశ్శబ్దం కూడా నిశ్శబ్దంగా నేరుమూసుకుంది. ఆగనిది ఒక్కటే ఆ ఇద్దరి గుండె సవ్వడి. అది మరింత స్పందించసాగింది.
ప్రియురాలి సంకేతం.. సందేశం పంపినట్టు అతడు మువ్వలపట్టీని అపురూపంగా పట్టుకున్నాడు.
చూపు.. మొదటి చూపయింది. అదే ఆమెకు తొలి ప్రేమయింది. అప్పుడు తేరుకుందామె. ఏం జరిగిందో అర్థమయ్యింది.
బుగ్గలు నును సిగ్గుల మొగ్గలు..
వాల్చిన కనురెప్పల బరువులు..
ఆమె మేను వణికింది..
తెలియని భావం ఆమెను కదిపి.. కుదిపి.. కదిలిస్తూండగా
చప్పున పద్మం లా ముడుచుకుపోయింది.
వెను దిరిగి లోనికి వెళ్ళబోయింది.
"వెన్నెలా!" సుధాకర్ పిలిచాడు.
అప్పుడు తేరుకున్నాడు రవిప్రకాశ్. అంతసేపు ఆమె అందం కలిగించిన అనుభూతి పరిమళాన్ని ఆఘ్రానిస్తూ నిలబడిన అతను.. వూహల ప్రపంచం లో నుంచి ఇవతలకు జారాడు.
సుధాకర్‌ని అప్పుడే గమనించినట్టు తడబడిందామె.
'రండి, అన్నయ్యా!’ నెమ్మదిగా ఆహ్వానం పలుకుతున్నట్టు అంది.
"ఇతను నా స్నేహితుడు రవిప్రకాశ్.."
ఆమె చేతులు జోడించింది. ప్రతి నమస్కారం చేయాలనే విషయాన్ని మరిచిపోయి ఆమెనే చూస్తున్నాడు రవిప్రకాశ్.
"లోపలికెళదాం రండి" అంటూ కదిలిందామె.
వెన్నెల కూర్చోడానికి సోఫా చూపించింది. హాలు మధ్య లో ఏర్పాటు చేసిన సోఫాలో కూర్చున్నాడు.
"అమ్మ తో చెప్పి వస్తాను" వెళ్ళబోయింది.
"ఒక్కనిమిషం"
రవిప్రకాశ్ గొంతువిని ఆమె తలతిప్పి చూసింది.
అతను లేచి నుంచున్నాడు. ఒక్కక్షణం సుధాకర్ వంక చూసి నెమ్మదిగా ఆమె వైపు కదిలాడు. అతనేం చేయబోతున్నాడో తెలీని సుధాకర్ కనుబొమలు ప్రశ్నార్థకంగా ముడిపడ్డాయి. అతడు తనవైపే రావడం.. చూసి వెన్నెల కంగారు పడిపోయింది.
ఆమె కెదురుగా వచ్చిన రవిప్రకాశ్ అడుగుదూరంలో ఆగిపోయి చేయి సాచాడు. భయంగానైనా అతని చేతివైపు చూసింది. ఒక్కసారిగా మనసులో నుండి నిట్టూర్పు బయటకు తోసుకు వచ్చింది.
కారణం.. అతడి చేతిలో ముద్దగా ఒదిగి వున్నది అంతకు ముందు ఆమె కాలినుండి విడివడిన మువ్వలపట్టీ.
ఒక్క క్షణం.. ఒకే ఒక్క క్షణం అతడి అరచేతి స్పర్శ ఆమె చూపుడు వ్రేలికి తగిలింది.
విద్యుత్తు విశ్వమంతా వ్యాపించినట్టు. ----సన్నగా కంపించింది ఆమె.
ఇక్కడ నిలువలేక.. నిలిచి అతని చూపు చూడలేక.. చూసి కదలాలనిపించక.. కదిలి గబుక్కున తలవంచుకుని లోపలికి నడిచింది.
"నిలువవే వాలు కనులదానా, వయ్యారి హంస నడక దానా" హంసగమనంతో మంచుశిఖరం మీద నుంచి హఠాత్తుగా నేలపైకి జారినట్లు మారింది రవి ప్రకాశ్ పరిస్థితి.
జానకమ్మ రాకతో పూర్తిగా తేరుకున్నాడతను.
సుధాకర్ రవిప్రకాశ్ర ని పరిచయం చేశాడు. జానకమ్మ ఆప్యాయంగా పలకరించింది. రాధ ఇద్దరికీ టిఫిన్, టీ తీసుకువచ్చి పెట్టింది. రాధ పాలేరు కూతురు.
ఆ ఇంట్లో చనువుగా తిరుగుతూ ఉంటుంది.
సుధాకర్ చదువు గురించి, ఊళ్ళో విశేషాలు అడుగుతూ మాట్లాడుతోంది జానకమ్మ.
ఆమె ప్రశ్నకు నమ్రతగా సమాధానాలిస్తున్నాడు. అప్పుడప్పుడు జానకమ్మ దృష్టి రవుప్రకాశ్ పై తిరుగుతోంది. ఆవిడ అతన్ని రెండు మూడు ప్రశ్నలు వేసింది. అన్యమనస్కంగానే జవాబిచ్చాడు అతను. అతని కళ్ళు ఆ కలకంఠి కోసం వెదుకుతున్నాయి.
వెంకటరామయ్య కూడా పొలంనుండి వచ్చాక ఆయనతో మాట్లాడిన తరువాత ఆ ఇంటినుంచి బయటకు వచ్చేశారిద్దరూ.
రవిప్రకాశ్ కి నిరాశ ఆవహించింది. వచ్చేటప్పుడు ఆనందం తిరిగి వెళ్ళేటప్పుడు లేదు. అప్పుడు ఆమెకి దగ్గరగా వస్తున్నానన్న సంతోషం.. ఇప్పుడు ఆమె కు దూరంగా వెళ్ళిపోతున్నామన్న బాధ..
సగం శరీరాన్ని వెన్నెల సమక్షం లో వదిలి వచ్చినట్టు..
తిరిగి వెదకడానికి వెళ్ళాలని వుంది.
సుధాకర్ అతని పరిస్థితి ని గమనిస్తూనే వున్నాడు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Aysola Subramanyam
Kameswararao Ayyalasomayajula ధన్యవాదములు.
Kameswararao Ayyalasomayajula
Good going Subbu
Aysola Subramanyam
Sundari Ganti ధన్యవాదములు.
Sundari Ganti
Bagundi