top of page
Writer's pictureAyyala Somayajula Subramanyam

తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 6


'Tholagina Nili Nidalu episode 6' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam

'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 6' తెలుగు ధారావాహిక

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


వెంకటరామయ్య అనే రైతు కూతురు వెన్నెల. గుడి దగ్గర ఆమెను చూసిన రవిప్రకాశ్‌ అనే యువకుడు ఇష్టపడతాడు. ఆమె వివరాలు స్నేహితుడు సుధాకర్ ని అడిగి తెలుసుకుంటాడు. ఆ వూరు వదిలి వెళ్లాలనిపించదు అతడికి.


వెన్నెలను కలిసి తన భావాలు వ్యక్తపరుస్తాడతడు. మౌనంతో తన అంగీకారం తెలుపుతుందామె. తలిదండ్రులు వేరే సంబంధం చూస్తూ వుంటే తన మనసులో మాట బయటకు చెప్పలేక పోతుందామె. వెన్నెల వివాహం చంద్రంతో జరుగుతుంది.


చంద్రం మాజీ ప్రియురాలు మనోరమ కనబడలేదనే వార్త గురించి మాట్లాడుకుంటారు వెన్నెల, ఆమె స్నేహితురాలు యమున.

ఇక తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 6 చదవండి.


రాత్రి పదకొండు గంటలు కావస్తోంది. చంద్రం డైనింగ్‌ టేబిల్‌ మీద గిన్నెలు మూతలు తీసి పదార్థాలు కంచంలో పెట్టుకుని భోజనం చేశాడు. ఆ గిన్నెలు అంతా వదిలేసి తిన్న కంచం వాష్‌బేసిన్‌ లో వేశాడు. కాస్త తూలుతూ బెడ్‌ రూమ్‌కెళ్ళాడు."వెన్నూ.. వెన్నూ.."అని పిలిచాడు.


మంచం మీద పడుకుంటూ.. వెన్నెల పలకలేదు. పదిన్నరకి కాలింగ్‌బెల్‌ మ్రోగితే తలుపు తీసి మౌనంగా లోపలికి వచ్చేసింది. భర్త చంద్రం ఆ సమయం లో ఇంటికి వచ్చాడంటే ఎలాంటి పరిస్థితుల్లో ఇంటికొస్తాడో ఆమెకు బాగా తెలుసు. అలాంటప్పుడు దగ్గరుండి భర్తకి భోజనం కూడా ఆమె పెట్టదు. అసలు మాట్లడదు కూడా. ఈ పరిస్థితి వారంలో మూడు నాలుగు రోజులు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న తంతే.


అతడు తలుపు తీసి వెళ్ళిపోతూంటే అతడు ఏదో చెప్పబోతుండగా, ఆ మాట వినిపించుకోలేదు. వేరే గదిలోకి వెళ్ళి పడుకుండిపోయింది. అతడు బట్టలు మార్చుకుని బాత్‌రూమ్‌ కు వెళ్ళి వచ్చి టేబుల్‌ దగ్గర కూర్చన్నాడు. తనకి భోజనం వడ్డించడానికి భార్య వస్తుందేమోనని ఐదునిమిషాలు చూశాడు.


ఆమె లేవలేదు. విసుక్కుంటూనే తానే పెట్టుకుని తిన్నానని పించాడు. బెడ్‌రూమ్ లో పడుకున్న భార్యని చంద్రం పిలిచాడు. ఆమె నుంచి ఉలుకూ పలుకూ లేదు. పావుగంట చూసి ఆమె దగ్గరకి వెళ్ళాడు చంద్రం.


"ఏయ్‌ వెన్నలా.. వెన్నెలా.. ఆ గదిలోకి వచ్చి పడుకో" అని ఆమెని తట్టి పిలిచాడు.


"మీ కంపు నేను భరించలేను.. వెళ్ళి పడుకోండి." అన్నదామె.. కళ్ళు తెరవకుండా.


ఆమె కళ్ళు మూసుకుని అటు తిరిగి పడుకున్నది.


"కంపేం వుంది. కొంచెం తాగాను.." అన్నాడు చంద్రం కొంచెం మాట తడబడుతూనే.


"కొంచెం తాగారా? నోరు తెరిస్తే గుప్‌ మని వాసన వస్తోంది. కంపు.. నడుస్తుంటే తూలుతున్నారన్న సంగతి మీకు తెలుసా?" ఇటు తిరిగి గయ్‌ మన్నది.


"ఎందుకంత గట్టిగా అరుస్తావ్‌? కొంచెమే తీసుకున్నానని చెబుతున్నాగా..”

"సరే వెళ్ళి పడుకోండి.. ఆ బ్రాందీ విస్కీల కంపు నేను భరించలేను.." అనేసి మళ్ళీ అటు తిరిగి కళ్ళు మూసుకున్నదామె.


"ఏంటీ నేనేదో ఘోరం చేసినట్లు మాట్లాడుతావు.. ఎంతమంది తాగట్లేదు? ఇదిప్పుడు కామన్‌".


"ఎవరు తాగుతున్నారో, ఎవరు తాగడం లేదో నా కనవసరం.. మీరు తాగడం నా కిష్టం లేదు. ఈ విషయం మీకు చాలాసార్లు చెప్పాను. మీరు ప్రామిసు చేశారు. తాగనని గతంలో చాలా సార్లు చేశాక.. ఏం లాభం.. మాట మీద నిలబడకలేరు, కనీసం ఒక గంట కూడా. ఇంక మాటలనవసరం. వెళ్ళి పడుకోండి.." అనేసి కళ్ళు మూసుకుని పడుకుందామె.


"సొసైటీ గురించి నీకు తెలీదు. తెలీకుండా ఏమిటో మాట్లాడుతున్నావ్‌. పట్టణాల్లో నూటికి తొంభైశాతం పైగా ఓ పెగ్గు తీసుకోకుండా ఉండరు." అంటూ ఆమె ప్రక్కన మంచం మీద పడుకున్నాడు చంద్ర మంచం చాలకపోయినా సర్దుకుంటూ.


"ఒకసారి చెబితే బుద్దుండాలి".. అని రివ్వున మంచం మీద నుంచి లేచి దిండు పట్టుకుని హాల్లోకి వచ్చింది వెన్నెల. సోఫాలో దిండు వేసుకుని పడుకుంది.


"మరీ ఇంత మొండితనం పనికిరాదు." అని సణుక్కుంటూ చంద్రం మరో బెడ్‌రూమ్ లోకి వెళ్ళాడు.


వారానికొకసారైనా వాళ్ళిద్దరూ ఇలా గొడవ పడుతూండడం అలవాటు అయిపోయింది. ఆమె పోరు పెడుతున్నందుకైనా కాస్త పరిమితంగా నైనా తీసుకుని ఇంటికి రాడు. ఎప్పుడూ ఫుల్‌ డోస్‌. ఆ స్థితిలో కూడా బండి తనే నడుపుకుంటూ రాత్రి వేళ ఇంటికి వస్తాడు. జరగరానిది ఏదైనా జరిగితే ? ఏమిటి పరిస్థితి.. అని ఆమె మొత్తుకుంటూ ఉంటుంది. పరిమితంగా అప్పుడప్పుడు తీసుకోమంటుంది.


నెలలో వారమో పదిరోజుల కొకసారో తీసుకోమంటుంది. నెలలో ఓ పది రోజులు క్యాంపులకు వెళతాడు. అప్పుడెలాగూ కావలసినంత పుచ్చుకుంటాడని వేరే చెప్పనక్కరలేదు.


క్యాంపులో బండి నడిపే అవసరమే ఉండదు. కనుక కాస్తంత ప్రాణానికి హాయి గా ఉంటుంది. ఆర్‌& బీ లో ఏఈ పోస్టు. జీతానికి జీతం కాక పై సంపాదన దండి గానే ఉంటుంది. క్యాంపులో ఉన్నప్పుడే జీపు దొరుకుతుంది.


పెళ్ళి చూపులకు ముందు నాన్న అతడి వివరాలు ఎంక్వయిరీ చేస్తే తాగుడు, పొగపీల్చడం అలవాట్లేవీ లేవని తెలిసి చాలా సంతోషించింది. ప్రేమ బాధ నణుచుకుని. కానీ పెళ్ళయి శోభనం జరిగిన వారం రోజులకు ఆయనగారి అసలు బండారం బయటపడింది. ఏదో ఫ్రెండ్స్‌ బలవంతం మీద.. అప్పుడప్పుడు కొంచెం అన్నాడు.


పదిహేను రోజులకే ఆ కొంచెం అన్నది అబద్దమని తేలిపోయింది. అప్పటినుంచి చిటపటలు ఆరంభమయ్యాయి. తన భర్త ఇలా చేస్తున్నాడని ఆమె ఎవరికీ చెప్పలేదు. చెప్పడానికి ఆమె మనసు అంగీకరించలేదు.


భర్త అలాంటి వాడేనని చెప్పుకోవడం ఆమెకు సిగ్గుగా, చిన్నతనంగా అనిపించింది. కానీ పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుని, ఎవరూ నన్ను చూడడం లేదను కున్నట్లుంది చంద్రం నిర్వాకం. ఆ ఫ్లాట్స్‌ లో చూడనే చూశారు. ఆ తరవాత చెవులు కొరుక్కున్నారు. అంతే కాదు వెన్నెల తన కాపురం ఎంత గుట్టుగా ఉంచాలనుకున్నా.. అంతలా బట్టబయలయిపోయింది.


నాలుగు నెలల క్రిందట రాత్రి తొమ్మిది గంటలు దాటిన పిదప అనుకోకుండా వెన్నెల నాన్నగారు వెంకటరామయ్య వచ్చారు.


"గోవిందు మామయ్య కు బాగులేక అక్కడ డాక్టర్లకు చూపిస్తే గుండె జబ్బన్నారు. ఆపరేషన్‌ చెయ్యాలన్నారు. ఇక్కడ కిమ్స్‌ లో వాళ్ళకి తెలిసున్న డాక్టర్‌ శశికాంత్ ఉన్నాట్ట. ఎందుకైనా మంచిదని ఇక్కడ కూడా చూపిద్దామని తీసుకు వచ్చారు. వాళ్ళు గోవిందుని హాస్పిటల్‌ అడ్మిట్‌ చేశారు ఓ సారి చూసిపోదామని వచ్చానమ్మా” అన్నాడు తండ్రి వెంకటరామయ్య తన ఆకస్మిక ఆగమనం గురించి.


కాసేపు కబుర్లు చెప్పుకున్నాక, ఆయన బాత్‌రూమ్‌ కెళ్ళి స్నానం చేసి వచ్చాడు.


“ఎప్పుడనగా వచ్చావో.. నువ్వు భోజనం చేసి పడుక్కో నాన్నా". అంటూ వెన్నెల డైనింగ్‌ చేబుల్‌ మీద ఆయనకి వడ్డించటానికి సిద్ధం చేస్తూంటే ఆయనన్నాడు.

"అల్లుడు గారు రానీ అమ్మా, వచ్చాక అంతా కలిసి తిందాము" అని.


ఆ మాటకి వెన్నెల కంగారు పడింది. రాత్రి పది గంటల తరువాత తన మొగుడు ఎలా వస్తాడో తనకి బాగా తెలుసు. ఆ పరిస్థితి లో అతడిని వెంకటరామయ్య చూడడం ఆమెకు ఇష్టం లేదు. తన సంసారం లో ఓ చేదునిజం బయట పడుతుందని ఆమె గాబరా పడింది.


“ ఆయన కోసం చూడక్కరలేదు నాన్నా, .. ఆయన వచ్చే సరికి చాలా ఆలస్యమవుతుంది. నువ్వు భోజనం చేసి పడుకొందువు గాని..” అన్నదామె.


“లేదులే వెన్నూ.. ఆయన్ని పలకరించకుండా నా మానాన నేను భోజనం చేసి పడుకోవడం మర్యాద కాదులే.. ఫరవాలేదు. నేను అక్కడ కాంటీన్‌లో టీ తో పాటు టిఫిన్‌

కూడా తిన్నానులే.. వచ్చాక ఆయన్ని పలకరించి అప్పుడు భోజనం చేస్తాను’.

"ఆయనేమీ అనుకోలేరులే నాన్నా, నువ్వు తినేసేయ్‌".. తండ్రిని బలవంతం చేయబోయిందామె. కానీ వెంకటరామయ్య ససేమిరా ఒప్పుకొనలేదు. ఎంత ఆయన పట్టించుకోకపోయినా అల్లుడి కివ్వాల్సిన మర్యాద ఇవ్వల్సిందే నన్నాడు.


ఇంక చేసేదేమిలేక ఉస్సూరుమంటు కూర్చున్నది వెన్నెల. చంద్రం ఈ రోజైనా తాగకుండా వస్తే బాగుండును.. అని పరి పరి విధముల అనుకున్నది. కానీ ఎప్పటి లాగానే చంద్రం

తూలుతూ వచ్చాడు. హాల్లో మామగారిని చూసి రెండు చేతులు జోడించి ఎదురొచ్చాడు. ' మావయ్యా గారూ' అని ముద్దగానే అడిగాడు.


అల్లుడి పరిస్థితి వెంకటరామయ్యకు అర్థమయ్యింది. ఇందాకటి నుంచి తన కూతురు తనను ముందు ఎందుకు భోజనం చేయమందో, వెంటనే ఎందుకు పడుకోమందో - తనని ఇంతలా ఎందుకు తొందర పెట్టిందో పూర్తిగా అవగతమయ్యింది.


చంద్రం బట్టలు మార్చుకుని ముఖం కడుక్కుని వచ్చాడు. ఇద్దరికీ అన్నం వడ్డించింది వెన్నెల. చంద్రం తలా తోకా లేని విషయాలు అడుగుతూ, అన్నం కెలుకుతూ

అడ్డదిడ్డంగా మాట్లాడుతూ తింటున్నాడు. ఏదో అడుగుదామని అనుకుని అసందర్భ ప్రేలాపన లాగా వాగుతున్నాడు. వెంకటరామయ్య క్లుప్తంగా సమాదానలిస్తు

న్నాడు. తిన్నాననిపించుకుని వెంకటరామయ్య మౌనంగా వెళ్ళి పడుకున్నాడు.


తండ్రి సరిగా భోజనం చేయలేదని గ్రహించింది వెన్నెల. చంద్రం ఇంకా ఏదో అడగబోతుంటే అడ్డుపడి పడక్కగదిలోకి లాక్కుపోయింది వెన్నెల.


ఈ విషయం ఎంత గుట్టుగా ఉంచుదామనుకుంగో అంతగా బట్టబయలయిపోయింది. అదీ తన తండ్రి దగ్గర. మరునాడు వెంకటరామయ్య ఆ విషయమేదీ అడగ లేదు. రాత్రి ఏమీ జరగనట్టు చంద్రం మామగారితో మాట్లాడాడు. ముభావంగానే వెంకటరామయ్య మాట్లాడాడు. భర్త చంద్రం ఉదయం మామూలుగా మాట్లాడుతుంటే వెన్నెలకి ఎలాగో అనిపించింది. అతడు భార్యమీద జోకులేస్తున్నాడు.


"వెన్ను ఒట్టి అమాయకురాలండి. ఇతరులని తొందరగా నమ్మేస్తుంది. ఒట్టి భోళామనిషండి" అని చంద్రం అంటున్నప్పుడు వెంకటరామయ్య తో పాటు వెన్నెల కూడా ఆశ్చర్యపోయారు.


అతడు కావాలని, రాత్రి జరిగిన సంఘటనను మరిపించడానికి భార్యను తాను చాలా అభిమానంగా చూసుకుంటున్నానని చెప్పడానికి అలా నటించి మాట్లాడు

తున్నాడని ఆ ఇద్దరికీ చక్కగా అర్థమయ్యింది.


తన కూతురు ఎంత జాగ్రత్తపరురాలో, ఒద్దికైన మనషో, ఇతరులని అంచనా వేయడంలో ఎంతటి సమర్థురాలో వెంకటరామయ్యకి తెలియంది కాదు. తన తత్వం ఏమిటో, ఎలా ప్రవర్తిస్తుందో వెన్నెలకి తెలియంది కాదు. చంద్రం తన మీద చూపించే అభిమానం, మన్ననా.

"వెన్నూ, మీ నాన్నగారికి మరో రెండు దోశెలు వేయి.." అంటూ మామగారి మీద అతడు చూపించే అభిమానం ఎంత నిఖార్సయిందో అర్థం చేసుకోలేని వెర్రిబాగుల్ది కాదు వెన్నెల. చంద్రం అతిగా చేస్తున్నాడని వెంకటరామయ్యకు అర్థమయ్యింది.


అర్థమయ్యాక వెంకటరామయ్య కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు.. అప్పటికప్పుడు మనసులో. వెన్నెలకి పసుపు, కుంకుమ ల కింద ఇచ్చిన పొలం మీద వచ్చే శిస్తు ఇకనుంచి వెన్నెల పేరుమీద బ్యాంకు లో డిపాజిట్‌ చెయ్యాలని, అల్లుడికి తను ఇద్దామనుకున్న కానుకలను ప్రస్తుతం ఏదో కారణాలు చెప్పి నిలుపుదల చెయ్యాలని నిశ్చయించుకుని, టిఫిన్‌ తినేసి వెళ్ళిపోయాడు వెంకటరామయ్య.

పొలం మీద శిస్తు రాకపోయేసరికి ఓ రోజు వెన్నెలని అడిగాడు. ' పొలం బాపతు శిస్తు డబ్బు మీ నాన్న ఇంకా వేసినట్లు లేదు"- అని.


ఆ విషయమై వెన్నెల తండ్రికి ఫోన్‌ చేసి అడిగింది. దానికి సమాధానంగా ఆయన నేరుగా అల్లుడుతోనే మాట్లాడాడు.


"ఇప్పట్లో మీకు ఆ సొమ్ము అవసరం లేదు కదా బాబూ! అందుకని అమ్మాయి పేరు మీద బ్యాంకులో రికరింగ్‌ డిపాజిట్‌ చేస్తున్నాను” అని వెంకటరామయ్య చెప్పటంతో చంద్రం ఇంక మాట్లాడలేకపోయాడు.


భార్య ఏమంటుందో చూద్దాం అన్నట్లు ఆ విషయం ఆమెతో చెప్పాడు. ఆమె ఏ వ్యాఖ్యానం చేయకుండా విని ఊరుకుంది.

"నువ్వేమైనా మీ నాన్నకి చెప్పావా, అలా చేయమని?” అనడిగాడు.


“లేదు.. మనకి ఇంతింత జీతాలు వస్తున్నాయి కదా! అందుకని ఆలోచంచి మా నాన్న ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు” అన్నదామె, భర్త ముఖం లోకి సూటిగా చూస్తూ.


ఆమె చూపులు ఇబ్బందిగా అనిపించాయి తనకి. ఏదో మాట్లాడాలి కనుక అన్నాడు.. “అదే! అదే !” అని.


తండ్రి చేసిన పనికి వెన్నెల ఎంతో సంతోషించింది. ఎంత డబ్బు సంపాదిస్తున్నా మంచినీళ్ళలా ఖర్చు పెట్టేస్తున్నాడు. చంద్రంకి అన్నీ కలిపి ఓ లక్ష వరకూ వస్తుంది. ఆమెకు ఓ యాభైవేలు వస్తాయి. ముప్పై వేలు ఆమె చేతి కిస్తాడు. దానికి తోడు చంద్రం మహా ఖర్చు మనిషి. గొప్పలకు పోతూ ఉంటాడు. క్లబ్బులు, పబ్బులు, మందు పార్టీలు అంటూ దారాళంగా ఖర్చు

చేస్తాడు.


ఇద్దరూ కలిసి లక్షన్నరా కు పైగా సంపాదిస్తున్నా నెలకు పదివేలైనా పొదుపు చేయలేక పోతున్నామని బాధ. చంద్రంకి అదేం పట్టదు. వెనక ఆస్తిపాస్తులు ఏమీ లేవు. కుర్రాడు బావుంటాడు, మంచి ఉద్యోగం, మంచి జీతం అని ఆ సంబంధం చేశాడు నాన్న.

ఇవన్నీ తెలుసుకుని అతడు పరిస్థితి తలచుకుని వెన్నెల కుతకుత లాడిపోతూ ఉంటుంది. గదిలో పడుకున్న చంద్రం ఇంకా సణుగుతునో ఉన్నాడు. మధ్య మధ్య వెన్నూ, వెన్నూ అని పిలుస్తూనే ఉన్నాడు. ఎంత రాత్రయినా భార్య పక్కలో ఉండాల్సిందే చంద్రంకి. వెన్నెల నిద్రపోవడం లేదు. అయినా పలకడం లేదు.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.








68 views0 comments

Comments


bottom of page