top of page
Writer's pictureSurekha Puli

తోరణం



'Thoranam' - New Telugu Story Written By Surekha Puli

Published In manatelugukathalu.com On 08/07/2024

'తోరణం' తెలుగు కథ

రచన: సురేఖ పులి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“అమ్మ నీ దగ్గరే వుంది, నీకు తెలియకుండా వీలునామా ఎలా రాయగల్గుతుంది?” శేఖర్ తమ్ముడిని అనుమానంగా ప్రశ్నించాడు. 


“అదే.. నాకూ అర్థం కావడం లేదు. అయిపోయిందేదో అయిపోయింది, ఇప్పుడు మనిద్దరం ఈ పంపకాల గురించి మార్చుకోవచ్చు కదన్నయ్యా?” శుభకర్ ఆశగా అన్నాడు. 


“అంటే.. ?” కనుబొమ్మలు ముడిపడ్డాయి. 


“జస్ట్ రివర్స్.. ఇల్లు వున్న పోర్షన్ నేను తీసుకుంటాను, ఖాళీ స్థలం నువ్వు తీసుకుందువు గాని.. ” విషయం విశదీకరించాడు. 


“ఎందుకు? అమ్మ తన ఇష్టంగా రాసింది.. వద్దు.. ” అయిష్టం వెలిబుచ్చాడు. 

 

“నువ్వు ఎలాగూ కెనడాలో వుంటున్నావ్, అప్పుడప్పుడు ఇండియా వస్తావు.. పైగా ఖాళీ స్థలంలో ఉన్న చెట్లు కొట్టించి నేను కొత్తగా నా కోసం ఇల్లు కట్టుకునే బదులు.. పూలు, పళ్ళు, కూరగాయలతో కళ కళ లాడే స్థలం నీ వంతుగా, ఆల్రెడీ కట్టిన పాత ఇల్లు నా వంతుగా మార్చుకుందాం” శుభకర్ ప్రాధేయపడుతూ అడిగాడు. 


ఫ్యామిలీతో సహా విదేశాల్లో వుంటున్న శేఖర్ తమ్ముడి అభ్యర్థన అంగీకరించలేదు, తన వాటా అద్దెకిచ్చి వెళ్లిపోయాడు. 


శుభకర్ ఆఫీసు నుండి హౌసింగ్ లోన్, దాచుకున్న ఎఫ్. డి. లతో పచ్చటి చెట్లు నరికించి ఇల్లు నిర్మించుకున్నాడు. 

 

“మనకు అన్ని విధాలా సహకరించే పచ్చని చెట్లను కొట్టేస్తే నాకు చాలా బాధగా వుంది” కొడుకు శ్రేయాన్ని నిద్ర పూస్తూ రక్షిత భర్త శుభకర్ తో అంది. 

 

“తప్పని పరిస్థితుల్లో అలా చేయక తప్పలేదు, అప్పటికి అన్నకు ఎంత నచ్చచెప్పినా, నా మాటను వినిపించుకోలేదు. ”


అక్షిత చదువు పూర్తి చేసి రీడింగ్ టేబల్ సర్ది, బుక్స్ బాగ్లో పెట్టుకొని పడుకోటానికి సిద్దమైంది. “నాన్నా ప్రతి పండుగ నాటికి మనం మామిడి ఆకుల తోరణం, దేవుడి కోసం పువ్వులు అన్నీ మన ఇంట్లో వుండేవి, ఇప్పుడు లేవు.. చాలా వెలితిగా ఉంది. ” 


“అవును.. మన కోసం ఇల్లు కట్టుకున్నాం కదా, టెంకాయతో పాటు ఆకులు, పూలు రేపు మార్కెట్లో కొందాము. పొద్దున్నే లేవాలి, తొందరగా పండుగ పనులు చేసుకుంటే చాలా ఫ్రీ టైమ్ దొరుకుంది; హాలిడే ఎంజాయ్ చేయవచ్చు. ” 


“నాన్నా, నేను కూడా మార్కెట్ వస్తాను” యింకా నిద్ర పోకుండా శ్రేయన్ అన్నాడు. 


“అలాగే వద్దువు గానీ.. ముందు పడుకో.. ” తండ్రి ఇచ్చిన హామీ నచ్చింది. 

 

“నాన్నా.. మనం చెట్ల నుండి స్వచ్ఛమైన వాతావరణం పోగొట్టుకున్నాం, యింకా డబ్బులు పెట్టి కొనుకుంటున్నాం” ఆర్థికశాస్త్రం చదువుతున్న అక్షిత మనసులోని మాట అనేసింది. 


“ప్రతీ చిన్న విషయాన్ని పట్టించుకోవద్దు, పడుకోండి” సంభాషణ పెంచలేదు. 


***

అలసి పోయిన అందరూ నిద్ర పోయారు. కానీ శ్రేయన్ మనసులో ఆలోచనలు చక్రంలా తిరుగుతున్నాయి. ఇంట్లో మామిడి చెట్టు కున్న ఆకులు గడప తోరణం కోసం, పండుగ రోజు చేసే భోజనం కోసం అరటి ఆకులు, దేవుని పూజ కోసం తులసి ఆకులు, తమలపాకులు, ఎన్నో రంగు రంగుల పూలు, ఈ సారి పండుగ రోజు లేవు. సంక్రాంతి ఐయితే కైట్స్, దీపావళి ఐయితే క్రాకర్స్.. ఎంతో ఎంజాయ్మెంట్! 

ఈ పండుగ ఎక్సయిట్మెంట్ ఏమి లేదు. కానీ నాకు అక్కకు కొత్త బట్టలు కొన్నారు, అంటే.. పండుగ ముఖ్యమైందే! డబ్బులకు ఇబ్బందని అమ్మ నాన్న కొత్త బట్టలు కొనుక్కోలేదు. నేను, నా వంతుగా సహాయం చేయాలి. ఏం చేయాలి?? 


అందరి కంటే ఆలస్యంగా నిద్ర లేచే శ్రేయన్ ముందు లేచాడు. అమ్మ స్నానం చేసి తన పనుల్లో నిమగ్నమైంది. నాన్న డాబా పైన ఎక్సర్సైజ్, మెడిటేషన్ చేస్తున్నారు. సర్పంచ్ గారి ఇంట్లో అన్ని రకాల మొక్కలు ఉన్నాయి; పండుగకు కావాల్సిన ఆకులు, పువ్వులు నేను తీసుకొచ్చి ఇంట్లో సర్ప్రైస్ ఇస్తే! 


ఉడుతా భక్తి ప్రదర్శించే క్రమంలో శ్రేయన్ చిన్న సంచి తీసుకొని ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం ఇంటికి తిరిగి రాలేక పోయాడు. 


“మీతో పాటు ఎక్సర్సైజ్ చేస్తున్నడనుకున్న.. ” కొడుకు కనపడలేదని గాబరా పడింది రక్షిత. 


“శ్రేయాన్, శ్రేయా.. ” అని శుభకర్ ఇంటి బయటికి వచ్చి అరుస్తున్నాడు. కొంటె పనులకు పెట్టింది పేరని అన్ని గదులు మరొక మారు చూశారు. అల్మార, మంచాల కింద దాక్కున్నాడేమో అని వెతికారు.. లేడు, శ్రేయన్ ఎక్కడా లేడు. చిన్నారి తమ్ముడు కనిపించలేదని అక్షితకు దుఃఖం ఆగలేదు. స్కూటీ కీ తీసుకుంది. 


“అక్షితా, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్లి వెళతా.. ” హడావిడిగా తండ్రి, కూతురు వారి వారి టూ వీలర్ రోడ్డెక్కించారు. 

 

“ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేయండి.. ” అంటూ అరిచింది రక్షిత. 


“శ్రేయ కనపడగానే చెప్తాను, ఇంతలో వాడు ఇంటికి వస్తే నువ్వు మా ఇద్దరికీ ఫోన్ చేయి.. ” వెహికల్స్ వెళ్ళాయి. 


“తప్పకుండా.. ” ఉబికి వస్తున్న కన్నీరు తుడుచుకుంది. వంటింట్లో కాగే నూనెలో ఈత కొట్టాలని గారెల పిండి రెడీగా వుంది. ఉడికిన శెనగపప్పు, బెల్లం భక్షాల తయారీకి మేము రెఢీ అని ఎదురుచూస్తున్నాయి. అన్నిటి కంటే ముందు ఘుమ ఘుమ వ్యాపించలేదేమని పులిహోర చిన్నబోయింది. 


బయటికి వెళ్లిన వారి నుండి ఎటువంటి కబురు రాలేదు. రక్షిత మనసుకు ఓపిక నశించింది. అలంకరణ కోసం దేవుడి గది ఎదురు చూస్తుంది. “భగవంతుడా.. మేము పచ్చని చెట్లు కొట్టించినందుకు ఇంతటి ఘోరమైన శిక్షగా మాకు కడుపు కోత పెడుతున్నవా తండ్రీ? తలదాచుకునేందుకు ఇల్లు కట్టుకున్నాం కానీ జీవమున్న మాట్లాడలేని మొక్కలపై మాకెందుకు కక్ష! మమ్మల్ని క్షమించి శ్రేయన్ క్షేమంగా ఇంటికి రప్పించు ప్రభు!! ఫోన్ మోగింది, కానీ వార్త సుముఖంగా లేదు. 


సూర్యుడు తేజోవంతమైనాడు, జనసంచారం పెరిగింది. ట్రాఫిక్ పోలీస్ తన డ్యూటిలో హాజరు అయ్యాడు. చుట్టు ప్రక్క వాడలు-వీధులు తిరుగుతూ కనబడని బాలుడి కోసం కన్నులు అలసి పోయాయి, శరీరం కంది పోయింది. 


భూమి గుండ్రంగా ఉందని కూడలి వద్ద శుభకర్, అక్షిత కలుసుకున్నారు. ఒకరినొకరు పట్టుకొని బోరుమని విలపించారు. ట్రాఫిక్ పోలీస్తో తన పరిచయం చేసుకున్నాడు. తెల్లవారుజాము నుంచి కనబడని శ్రేయన్ గురించి బొంగురు పోయిన కంఠంతో చెప్పాడు. 


“మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ” అరగంట కంఠశోషకు ఒక్క ముక్కలో జవాబు ఇచ్చి తన పనిలో నిమగ్నమై నాడు. 


“నాన్న.. పోలీస్ అంటే.. ఏమైనా సిరీస్ అని అర్థమా?.. ” 


“నాలో జీవం లేదమ్మా, ఎవరిని అర్థిస్తే నా కన్నయ్య కనబడతాడో వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకుంటాను. పద పోలీస్ స్టేషన్ వెళ్దాం. ”


***


నగరంలో ఇంచుమించు పోలీస్ స్టేషన్లు పునః నిర్మించారు. ‘రక్షక భట నిలయం’ పరిశుభ్రంగా, విశాలంగా, పద్దతిగా ఉంది. పండుగ అని జనాలు లేరు. శుభకర్ రిసెప్షన్లో జరిగిన సంఘటన వివరించాడు. 


“సార్.. మీరు ఆన్లైన్లో మీ కేసు రిజిస్టర్ చేయాలి, మీకు ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ను బేస్ చేసుకుని మేము మా వంతుగా యాక్షన్ తీసుకుంటాము. ” 


వాదించే ఓపిక లేదు; అక్షిత అక్కడ వరుసగా ఉన్న కుర్చీలో కూర్చుని శుభకర్ ఫోన్ ద్వారా ఆన్లైన్ కంప్లైంట్ కోసం ప్రయత్నిస్తుంది. 


ఎస్. పి గారు రూమ్ బయటకు వచ్చి “ఏమైంది, ఎవరి బాబు కనబడలేదు?” అన్నాడు. 


శ్రీమహావిష్ణు గజేంద్ర మోక్షంలో ఏనుగుకు చేయూత నిచ్చినట్లు శుభకర్ ఒంట్లో శక్తి ప్రాణం పోసుకుంది. 


“సార్.. నేను.. నా పేరు.. ” అంటూ శుభకర్ మరొక మారు తన అలజడిని ఆలపించాడు. 


“లోపలికి రండి.. ” అంటూ తన కేబిన్ వైపు దారి తీసాడు. లోపల శ్రేయన్ బిక్క ముఖంతో, ఎండి పోయిన కన్నీటి చారలతో “నాన్నా.. ” తండ్రిని గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. అక్షిత తమ్ముడిని అక్కున చేర్చుకొని ముద్దాడింది. ఎస్. పి గారు కూర్చోమని కుర్చీ చూపించారు. శుభకర్ కొడుకును అదిమి పట్టుకుని ఒళ్లో కూర్చో బెట్టుకొని కుర్చీలో సర్దుకొని కూర్చున్నాడు. 


“సార్.. చాలా థాంక్స్.. ” ఇంతకు మించి మాటలు ఏమీ రాలేదు. 


“మీ కొడుకు సర్పంచ్ గారి ఇంటి కాంపౌండ్ గోడ ఎక్కి మామిడాకులు దొంగతనం చేశాడని, వాచ్మాన్ ఫోన్ చేస్తే మా వాళ్ళు ఇక్కడికి తెచ్చి కూర్చోబెట్టారు. 


పోలీసులు పట్టుకున్నారని మా ఇంట్లో తెలిస్తే ఎట్లా అంటూ మీ వాడు అసలు విషయం చెప్పి బాగా ఏడ్చాడు. ఇంటి అడ్రసు చెప్పమని ఎంత అడిగినా చెప్పలేదు, భయపడుతున్నాడు. పిల్లల ముందు మీరు మీ ఇంటి అవసరాలు, మీరు ఎదుర్కొన్న కష్టనష్టాలు చెప్పొద్దు. పసి మనసులు మీకు ఏ విధంగా సహాయం చేయాలని, మంచి చెడులు మర్చిపోయి.. ఇదిగో ఇలా దొంగతనం చేస్తారు. ” 


“అమ్మా.. తమ్ముడు దొరికాడు. పోలీస్ స్టేషన్లో భద్రంగా వున్నాడు. మేము వస్తున్నాము” అక్షిత తల్లికి ఫోన్ చేసింది. 


“ఎస్పీ సార్.. మీకు మరో మారు దండం పెడుతున్నాను. నా కొడుకును ఇంటికి తీసుకు వెళ్లాలంటే.. ఏమైనా ఫార్మాలిటీ.. ”


“అవును.. ఇదిగో ఈ ఫారం నింపి, మీ కొడుకును మీరు క్షేమంగా, ఆరోగ్యంగా ఎటువంటి హింస జరుగలేదని ఒక అప్లికేషన్ రాయండి, మీ పర్సనల్ ప్రూఫ్ ఏదైనా ఒక కాపీ జత చేసి మాకు యిచ్చి తీసుకెళ్లండి. ” 


***


శ్రేయన్ ఒక్క ఉదుటున వెహికల్ నుండి దిగి గేటు బయట ఎదురుచూస్తున్న తల్లిని గట్టిగా వాటేసుకున్నాడు. “అమ్మా.. అసలు ఏమైందంటే.. ” సంజాయిషీ ఇవ్వబోయాడు. 


“నాకు తెలుసు, ముందు స్నానం చేద్దువు గాని.. ” తలంటు స్నానం చేయించి, కొత్త బట్టలు వేసి, దేవుడి గది ముందు నిలబెట్టి బొట్టు పెట్టింది. 


“అమ్మా.. పండుగ కదా ఇంటి గుమ్మాలకు పచ్చ తోరణం కట్టాలి. ” వూహ తెలిసినప్పటి నుండి శుభకర్ కొడుకు చేత ఉదయాన్నే మామిడి ఆకుల తోరణం కట్టించడం, అక్షిత ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయడం అలవాటుగా మారిపోయింది. 


“ఇప్పుడు మధ్యాన్నం మూడు దాటింది. ఇంటి ‘తోరణం’ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు మనం ఆకలి కడుపును శాంత పరచాలి, భక్షాలు చేస్తాను మనం అందరం తిందాం. ” 


“అంత వరకు ఆకలి ఆగదమ్మా, భక్షాల పూర్ణం తింటాను” శ్రేయన్ దీనంగా అన్నాడు. 


“అలాగే, తిందువు గాని, ఈ పూటకు మనకు పళ్ళు పాలు చాలు” అని పొద్దున్నే చేయాల్సిన దేవుడి పూజ సంధ్య వేళ జరుపుకున్నారు. 


“నేను నాన్నంత పెద్దగా అయినప్పుడు పూలు, పళ్ళు యిచ్చే మొక్కలు ఇంట్లో నాటుకుంటాను. ఇల్లు చిన్నగా వున్నా సరే.. ఇంటి తోట మాత్రం ఎప్పుడు పచ్చగా పెద్దగా ఉండాలి” కొడుకు భవిష్యత్తు కల విని మురిసి పోయారు తల్లీదండ్రులు. 


“ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే మన ఇంటి చుట్టూ మొక్కలు నాటుకోవాలి” అక్షిత సలహా ఇచ్చింది. 

“ఇంటి చుట్టూ చిన్న చిన్న మొక్కలు నాటవచ్చు గాని వృక్షాలకు స్థలం సరిపోదు” రక్షిత జవాబు ఇచ్చింది. 


“దానిదేముంది, మనం వేరే చోటు ఇల్లు కట్టుకొని ‘గ్రీనరీ’ పెంచుదాం. ” 


శుభకర్ అడ్డుకున్నాడు “ఎక్కడున్నాయి ఖాళీ స్థలాలు?.. మనిషి వసతి కోసం అపార్ట్మెంట్ సంఖ్య పెరిగి పోతున్నది. అయినా, నా వంతుగా ఒకసారి ఇల్లు కట్ట గలిగాను. ఇప్పుడు మీ చదువు ముఖ్యం. ఫ్యూచర్ లో మీరు మీకు అనుకూలంగా ఇంటితో పాటు తోట కూడా వేసుకోండి. నేను, మీ అమ్మ హాయిగా మీతో పాటు స్వచ్ఛమైన వాతావరణంలో వుంటాము. ”


“ఎస్, నాన్న.. ” అంటూ శ్రేయన్ అమ్మానాన్నల మధ్య వొదిగి నిద్రపోయాడు. 


*****


సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

 

పేరు :సురేఖ  ఇంటి పేరు: పులి

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

వయసు : 70 సంవత్సరాలు. పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

మా అమ్మనాన్నలు స్వర్గీయ లక్ష్మి అర్జున్ రావు గార్లు నా మార్గదర్శకులు.

ప్రస్తుత నివాసం బెంగళూరు  విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను.  స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008  లో స్వచ్ఛంద పదవీ విరమణ.

చందమామ, యువ, స్వాతి,  ఈనాడు,  మన తెలుగుకథలుడాట్ కాం, నెచ్చెలి, ఉష పత్రిక, కెనడా డే  లలో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి. కొన్నిటికి బహుమతులు కూడా వచ్చాయి. మూడు నవలలు మాత్రమే రాశాను. అందులో “కల్పతరువు” నవలకు మన తెలుగు కథలు డాట్ కాం వారి బహుమతి లభించింది. మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నది నా ఆశయం.

Surekha Puli 




55 views3 comments

3 Comments



Bhanu Priya

4 days ago

👌🥳👌🙏

Like
Surekha Arunkumar
Surekha Arunkumar
Aug 06, 2024
Replying to

మీ స్పందనకు థాంక్స్ ❤️

Like


@divikg5573

• 14 hours ago

Awareness of Greenery. Congrats 🫶

Like
bottom of page