top of page

తృప్తి - పార్ట్ 1

Writer's picture: Lalitha SripathiLalitha Sripathi

విజయదశమి 2024 కథల పోటీలో విశిష్ట(ప్రత్యేక) బహుమతి పొందిన కథ

శ్రీమతి శ్రీపతి లలిత గారి పెద్దకథ 'తృప్తి' మొదటి భాగం


'Thrupthi Part 1/2' - New Telugu Story Written By Sripathi Lalitha

Published In manatelugukathalu.com On 08/01/2024 

'తృప్తి - పార్ట్ 1/2'  పెద్ద కథ ప్రారంభం

రచన: శ్రీపతి లలిత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



"అమ్మా!" గుమ్మం లో నిలబడ్డ ఆదిత్యని చూసి, కళ్లనుంచి నీళ్లు కారాయి సుభద్రకు.


ఎలా ఉండే పిల్లాడు ఎలా అయిపోయాడు అనుకుంటూ "ఆదీ! రా నాన్నా!" అంటూ చెయ్యిపట్టుకుని లోపలికి తీసుకుని వచ్చింది.


"నాన్న ఏమన్నా అంటారేమో?" అంటూ చూస్తున్న ఆదిత్యకి లోపల దిగులుగా చూస్తున్న రాజారాం కనిపించాడు.


"అయామ్ సారీ నాన్నా, మిమ్మల్ని నిరాశపరిచాను" కళ్ళనీళ్ళతో అంటున్న కొడుకుతో "ఆదీ! నీకంటే మాకు ఏదీ ఎక్కువ కాదు నాన్నా!" అంటూ హత్తుకున్నాడు రాజారాం ఆదిత్యని.


అమెరికాలో మంచి ఉద్యోగం వదిలి వచ్చినందుకు తల్లి, తండ్రి ఏమి అంటారో అంటూ భయపడుతూ వచ్చిన ఆదిత్యకి ధైర్యం వచ్చింది.


"అమ్మా! ఆకలి దంచేస్తోంది. సరిగ్గా భోంచేసి వారమైంది, ఏం చేసావు వంట?" అంటూ భోజనాల బల్ల మీద చూసాడు.


"అన్నీ నీకిష్టమైనవే" అని తల్లి అంటుంటే ఒకో గిన్నె మూత తీసి "వావ్! వంకాయ కూర, మామిడికాయ పప్పు, కొబ్బరి పచ్చడి. నేను స్నానం తర్వాత చేస్తాను. అన్నం పెట్టేయి" అని చెయ్యి కడుక్కుని కూర్చున్నాడు.


ఆదిత్య తినే పద్దతి చూసి సుభద్ర, రాజారామ్ కి కళ్ళలో నీళ్లు తిరిగాయి. తిని వారం కాదు.. సంవత్సరం అయినట్టు, తిండికి ముఖం వాచినట్టు, మాటా, పలుకూ లేకుండా తింటుంటే బాధగా అనిపించింది.


ముగ్గురికీ వండిన వంట అంతా తనే తినేసి" అమ్మా! అంతా నేనే తిన్నట్టున్నాను. మళ్ళీ వండుకో " అంటూ తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టి, తండ్రిని హత్తుకుని "నేను పడుకుంటాను, లేపకండి. సరి అయిన నిద్ర పోయి ఎన్ని రోజులయిందో" అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు.


ఆదిత్య లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాక సుభద్ర దుఃఖం ఆపుకోలేకపోయింది.


"ఊరుకో భద్రా! వచ్చేసాడుగా, ఇంక వాడి సంగతి మనం చూసుకుందాము" అంటూ ఓదార్చాడు కానీ, అతనికీ కంటి నుంచి నీరు కారుతూనే ఉంది.


ఆదిత్య వీళ్ళకి ఒక్కగాని ఒక్క కొడుకు. పదోక్లాస్, ఇంటర్ లో స్టేట్ ఫస్ట్, ఐఐటీ లో మొదటి రాంక్, క్యాంపస్ లోనే అమెరికాలో పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ వాళ్ళు దాదాపు రూపాయల్లో సంవత్సరానికి రెండు కోట్ల జీతంతో ఉద్యోగం ఇచ్చారు. అన్ని పేపర్ల లోనూ ఆదిత్య ఫొటోలే.


చిన్నప్పటి నుంచి తన అంతట తనే చదువు మీద శ్రద్ధతో బాగా చదివేవాడు. అమ్మా, నాన్నా, చదువు తప్ప వేరే లోకం లేదు, పెద్ద స్నేహితులు లేరు.


సుభద్ర కానీ, రాజారామ్ కానీ, పెద్దగా స్నేహితులతో ఆడుకోమనీ, తిరగమనీ ప్రొత్సాహించిందీ లేదు. చదువుకోమని వెనక పడాల్సి రాకపోయినా, సినిమాలకి కానీ బంధువుల ఇళ్లలో పెళ్లి, పేరంటాలకు కానీ తీసుకెళ్లకుండా, చదువు తప్ప వేరే లోకం లేకుండానే పెంచారు.


ఎవరైనా పిల్లలు దగ్గరికి వద్దామని ప్రయ్నతించినా, వాళ్లు అల్లరి పిల్లలు, పెద్ద చదవరు అంటూ దూరం పెట్టేవారు. తాము ఇంట్లో టీవీ చూసినా, సినిమాకి వెళ్లినా ఆది కి ఇబ్బంది అని వీళ్ళు ఎక్కడికీ వెళ్లేవారు కాదు.


అమెరికా వెళ్లిన కొత్తల్లో వారానికి రెండు,మూడు సార్లు ఫోన్ చేసి తల్లి తండ్రులతో బాగా కబుర్లు చెప్పేవాడు. జీతంలో తన ఖర్చులకు ఉంచుకుని, అంతా తండ్రికే పంపేవాడు.


రాజారామ్ కూడా ఆ డబ్బులతో మంచి విల్లా, రెండు, మూడు స్థలాలు కొన్నాడు. వికారాబాద్ వేపు ఫార్మ్ హౌస్ కోసం రెండు ఎకరాల స్థలం కొని అందులో ఒక రెండు బెడ్ రూంల ఇల్లు, పనివాళ్ళకోసం ఒక చిన్న ఇల్లు కట్టించి, ఆ స్థలంలో మామిడి, జామ, కొబ్బరి చెట్లు కొన్ని వేయించాడు.


ఉద్యోగంలో చేరిన మూడేళ్ళలో రెండు సార్లు వచ్చి ఒక రెండు రోజులు ఉండి వెళ్ళాడు ఆదిత్య.


అది కూడా ఆఫీస్ పని మీదే. రాను రాను ఫోన్లు తగ్గాయి. చేసినా కూడా "ఎలా ఉన్నారు?" అని అడిగి పెట్టేసేవాడు.


ఒకసారి విడియో కాల్ లో చూసి సుభద్ర అడిగింది "అలా ఉన్నావేమిటి ఆదీ? సరిగ్గా తింటున్నావా? నీ ముఖం చూస్తే చాలా అలసటగా ఉంది" అంది.


"నాకేమిటో జీవితంలో ఆనందం, తృప్తి ఉండటం లేదమ్మా?" అన్నాడు ఆది.


ఇంకోసారి "ఎందుకమ్మా? నన్ను చూస్తే అందరూ దూర దూరంగా వెళతారు? నాతో ఎవరూ కలవరు? " అడిగాడు తల్లిని.


"నువ్వు మంచి చదువు, ఉద్యోగం కదా! వాళ్ళందరూ ఏదో సామాన్యమైన వాళ్లు. నువ్వు పెద్ద బాధ పడక్కర్లేదు, నీ లెవెల్ వాళ్లతో కలు" సలహా చెప్పింది సుభద్ర.


"నా లెవెల్ వాళ్ళు అంతా పెద్దవాళ్ళు. వాళ్ళు నన్ను చూస్తూనే చికాకు పడతారు." కోపంగా అంటూ ఫోన్ పెట్టేసేడు.


రాజారామ్ తో కూడా మధ్యలో ఒకసారి "నేను ఉద్యోగం మానేస్తాను నాన్నా! నాకు ఇక్కడ చాలా ఒత్తిడి గా ఉంది" అంటే ఆయన కోప్పడ్డాడు.


తరవాత వారం అయినా ఆదిత్య ఫోన్ చెయ్యలేదు. వీళ్ళు చేసినా ఎత్తలేదు.


ఇద్దరూ భయపడ్డారు. ఇంకో రోజు సుభద్ర ఆపకుండా ఫోన్ చేస్తే "నాకు చచ్చిపోవాలని ఉంది అమ్మా!" అంటూ ఫోన్ పెట్టేసాడు.


సుభద్రకి గుండె ఆగినంత పని అయింది. రాజారాం కూడా ఆదిత్య మాట్లాడినది విని హతాశుడయ్యాడు. "భద్రా! వాడిని వచ్చేయమని చెప్పు" అన్నాడు. 



"అవునండీ! నాకూ అలానేఉంది. ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, పిల్లాడు దక్కితే చాలు" అంది భద్ర.


"ఆదిత్యా! నువ్వు సంతోషంగా ఉండడం మాకు కావాలి, నీ సంపాదన కాదు. మేమూ ఏమీ అనము, నువ్వు ఇంటికి వచ్చెయ్యి" అంటూ విడియో మెసేజ్ పెట్టింది.


అంతే, వెంటనే "జాబ్ రిజైన్ చేశాను" అని మెసేజ్ పెట్టాడు. నెల తిరిగేలోగా ఇండియాకి వచ్చాడు. తిని పడుకున్నవాడు దాదాపు పదిగంటలు నిద్ర పోయాడు. నిద్ర లేచాక, టీ తాగుతూ చెప్పడం మొదలు పెట్టాడు.


"అమ్మా! నాన్నా! మీ ఇద్దరికీ నేను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నానో తెలీదు కదా. చిన్నప్పటినుంచి నేను చదువు మీదే దృష్టి పెట్టాను, ఆటలు లేవు, స్నేహితులు లేరు.


మీరూ, చదువు తప్ప నాకు వేరే లోకం లేదు. ఉద్యోగం లో చేరాక, నేను, నా వయసు వాళ్లతో మాట్లాడదామంటే వాళ్ళు దూరంగా వెళ్లేవారు. ఒకరు, ఇద్దరు మాట్లాడదామని ప్రయత్నించినా నా వయసు వారికి తెలిసిన సినిమాలు, పాటలు, ఆటలు ఏవీ తెలీవు.


నాకు ఉద్యోగం తప్ప వేరే లోకం లేదు, ఎప్పుడూ దాంట్లోనే మునిగి ఉండేవాణ్ణి.


ఈ మధ్య కంపెనీలో కొంతమంది ఉద్యోగాలు పోయాయి, దానితో, నేను ఏ తప్పు చేస్తే నా ఉద్యోగం పోతుందో, అప్పుడు నా సంగతి ఏమిటి? అందరూ నన్ను ఎగతాళి చేస్తారు, మీరు బాధ పడతారు, ఇదే నా ఆలోచన.


దానితో నాకు చాలా డిప్రెషన్ వచ్చింది, నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయి. అప్పుడే నేను సైకియాట్రిస్ట్ ని కలిసాను.


ఆయన సలహా మీద, నేను ఉద్యోగం మానేసి, నాకు సంతోషంగా ఉండే విషయాల మీద దృష్టి పెట్టదలుచుకున్నాను.


ముందు కొన్నిరోజుల పాటు అన్ని ప్రదేశాలు తిరుగుదామనుకుంటున్నాను. మీరు కూడా నా చదువు కోసం ఎక్కడికీ వెళ్లకుండా నాతోనే ఉన్నారు, అమ్మా! ఇప్పుడు మనం ముగ్గురం అలా కొంచెం తిరిగి వద్దాము. దగ్గరలో మన బంధువులు ఉంటే వాళ్ళనీ కలుద్దాము" అన్నాడు ఆది.


"అలాగే వెళదాం. నువ్వు క్షేమంగా వస్తే దుర్గమ్మకి పూజ చేయిస్తాను అని మొక్కుకున్నా. నాన్న అక్క, జయ అత్తయ్యా వాళ్ళు విజయవాడలోనే ఉంటారు. పక్కనే గుంటూరులో, మా అన్నయ్యా వాళ్ళు ఉంటారు.


అందరూ, వాళ్ళ ఇంటికి రమ్మని అడిగి, అడిగి విసిగి పోయారు. అందర్నీ చూసి వద్దాము" సంతోషంగా అంది సుభద్ర.


రెండు రోజుల తరవాత, కారులో విజయవాడ బయలుదేరారు ముగ్గురూ. అక్కడ హోటల్ లో రూమ్ తీసుకుని, అమ్మవారి దర్శనం చేసుకుని, సాయంత్రం రాజారామ్ వాళ్ళ అక్క ఇంటికి బయలుదేరారు.


"ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు నాన్నా? అత్తయ్య వాళ్ళ పిల్లలు, వేరే ఊళ్ళో ఉంటారు కదా?" అన్నాడు ఆది.


"అవును, ఈ ఇల్లు మా బావగారి నాన్న కట్టించిన ఇల్లు.


ఇది వదిలి పెట్టడం ఇష్టం లేక మా అక్క, బావగారు, వాళ్ళ తమ్ముడు కుటుంబం, ఇక్కడే ఉంటారు. మా బావగారు రిటైర్ అయ్యారు కానీ, వాళ్ళ తమ్ముడు ఇక్కడే ఏదో ప్రైవేటులో ఉద్యోగం. వాళ్ళకి ఆలస్యంగా పుట్టాడు అబ్బాయి.


ఆ పిల్లాడిది ఇప్పుడు డిగ్రీ అయిపోయిందనుకుంటా" అన్నాడు రాజారామ్.


"అమ్మా! ఇక్కడ మంచి బట్టల షాపులు ఉన్నాయి. అత్తయ్య వాళ్ళకి బట్టలు, కొన్ని పళ్ళు, స్వీట్స్ తీసుకు వెళదాం" అన్నాడు ఆది.


ఆ ఆలోచన తనకి రానందుకు తిట్టుకుంది భద్ర. దార్లో షాపుల దగ్గర ఆపి, అన్నీ తీసుకున్నారు.


కార్ గుమ్మం ముందు ఆగాక, ఆశబ్దానికి రాజారామ్ బావగారు నారాయణ బయటికి వచ్చాడు.


వీళ్ళ రాక ఏమాత్రం ఊహించని ఆయనకి ఒక నిమిషం అర్థం కాలేదు.


"జయా! ప్రళయం వస్తుంది జాగ్రత్త, చూడు మన ఇంటికి ఎవరు వచ్చారో" అంటూ, "రండి, రండి. ఏదో దారి తప్పి వచ్చారు అమెరికా దొరవారు మనఇంటికి." 


నారాయణ మాటలకి నవ్వుతూ రాజారామ్ " అనండి బావా ! మీకు కాక ఇంకెవరికి ఆ అధికారం ఉంది" అంటూ లోపలికి వెళ్ళగానే జయ సంతోషంగా బయటికి వచ్చింది.


" రాజా! ఇన్నాళ్ళకి వచ్చారు. ఏదో పెళ్లి, పేరంటాలకు తప్ప ఉత్తప్పుడు రానే రారు. ఏమిటి విశేషం?" అంటూ పలకరించింది.


ముందు కొద్దిగా బెట్టుగా మాట్లాడినా, నారాయణ కూడా చక్కగా మాట్లాడాడు.


ఆదిత్య ఉద్యోగం మానేసి వచ్చాడు అని తెలిసాక "అదేమిటి ఆదీ! మేము అందరికీ నీ గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటాము. ఎందుకు అలా మానేసావు?"

అని ఖంగారుపడ్డాడు.


"ఏం కాదు మామయ్య గారు. కొన్ని రోజులు రిలాక్స్ అయ్యి మళ్ళీ చేస్తాను." అన్నాడు ఆది.


ఆది తెచ్చిన బట్టలు చూసి మురిసిపోయారు ఇద్దరూ. వాళ్ళ తమ్ముడిని, మరదలిని పిలిచి చూపించారు నారాయణగారు.


వాళ్ళకీ, తెచ్చిన స్వీట్స్ కొన్ని, పళ్ళు కొన్నీ ఇచ్చింది సుభద్ర.


మాటల్లో వాళ్ళ అబ్బాయి ఇంజీనిరింగ్ అయిపోయిందనీ, అమెరికాలో చాలా మంచి కాలేజి అయిన MIT లో MS సీట్ వచ్చిందనీ, అక్కడ స్కాలర్షిప్ వచ్చినా, పై ఖర్చులు పెట్టుకోవడం కష్టమని సీట్ వదిలేస్తామని చెప్పారు.


ఆదిత్య వెంటనే "మామయ్యగారూ, మీ అబ్బాయి ఉంటే పిలుస్తారా?" అని అడిగాడు నారాయణ గారి తమ్ముడిని.


"తప్పకుండా" అంటూ ఆయన వాళ్ళ అబ్బాయి రాహుల్ ని పిలిచారు.


ఆదిత్య కొంచెంసేపు ఆ అబ్బాయి తో మాట్లాడి, వెంటనే తన ఫోన్లో ఎవరితోనో మాట్లాడి అప్పుడు వీళ్లందరినీ ఉద్దేశించి అన్నాడు.


"మామయ్య గారూ, రాహుల్ కి వచ్చిన అవకాశం చాలా అరుదుగా వస్తుంది. డబ్బులు లేవు అని, ఆ అవకాశం వదలకూడదు. అతను అమెరికా వెళ్ళడానికి, అక్కడ ఉండి చదువుకోడానికి తగ్గ ఏర్పాట్లు నేను చేస్తాను.


అదే ఊళ్ళో మా ఫ్రెండ్ ఉన్నాడు, అతను కూడా ఏదైనా సాయం కావాలంటే చేస్తాడు. నేను, ఇదంతా రాహుల్ కి అప్పుగా ఇస్తున్నాను. అతను ఉద్యోగం లో చేరాక నా అప్పు తీరుస్తాడు.


దీనితో మీకెవరికీ ఏ సంబంధం లేదు. అంతేకదా రాహుల్." అన్నాడు రాహుల్ వేపు చూసి.


"థాంక్స్ అన్నా!" కళ్ల నీళ్లు ఆపుకుంటూ ఆదిత్య చేయిపట్టుకుని ఊపుతూ అన్నాడు రాహుల్.

========================================================================

ఇంకా వుంది..


======================================================================== 

***


శ్రీపతి లలిత  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.

నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.

నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.

నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.

అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.

నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.

ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.

నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.

పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.


 
 
 

Kommentare


bottom of page