#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #Thurpu Rekhalu, #తూర్పు రేఖలు, #TeluguKathalu, #తెలుగుకథలు
Thurpu Rekhalu - New Telugu Story Written By - Veereswara Rao Moola
Published In manatelugukathalu.com On 25/11/2024
తూర్పు రేఖలు - తెలుగు కథ
రచన: వీరేశ్వర రావు మూల
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
డాక్టర్ రాఘవ, పల్లిపాలెం లో తన క్లినిక్ లో కూర్చుని మెడికల్ జర్నల్ చదువుకుంటున్నాడు. ఉదయం నుండి పేషెంట్స్ ఎవరూ రాలేదు. విసుగు గా తోచి ఫ్లాస్క్ లోంచి కాఫీ కప్ లోకి ఒంపుకున్నాడు.
కారు ఆగిన శబ్దం విని అటు తిరిగాడు.
యాభై కి పైగా వయసున్న ఆవిడ కారు లోంచి దిగింది.
"అమ్మా, రా" అని ఆహ్వనించాడు రాఘవ.
"నీకు గుర్తు లేక పోయినా, నీ పుట్టిన రోజు గుర్తు పెట్టుకుని వచ్చాను"
"అందుకే అమ్మ అన్నారు!"
రాఘవ అమ్మ పెట్టిన లడ్డూ తిని, "నాన్నగారు ఏలా ఉన్నారమ్మా" అని అడిగాడు.
"ఏం చెప్పమంటావు. నువ్వు ఆయన మాట వినవు. ఆయన నీ దారికి రారు. మధ్య లో నాకు వచ్చిందిరా చావు"
"బాధ పడకమ్మా, అన్నీ సర్దుకుంటాయి. "
" ఏమోరా, ఎప్పుడు మీరిద్దరూ కలుస్తారో "
నెల క్రితం రాఘవ తన తండ్రి తో పడిన ఘర్షణ గుర్తుకు వచ్చింది.
"నీకేం ఖర్మ రా? పల్లెటూరికి పోతానంటున్నావు. నాతో
ఉండు. త్వరలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తెరుస్తున్నా. దానికి హెడ్ గా ఉందుగాని. బోర్ కొడితే బహమాస్ కి హాలిడే ట్రిప్ పోవచ్చు. కార్డియాలజిస్ట్ కనక ప్రసాద్ నీకు పిల్ల నిస్తానని అంటున్నాడు. అతనితో వియ్యమంటే నాకు అన్ని విధాల ప్లస్సే "
"సరైన వైద్య సదుపాయం లేక ఎంతో మంది చనిపోతున్నారు. చదివిన చదువు సార్ధకత పొందాలంటే పేదలికి సేవ చెయ్యాలి"
"వాళ్ళ మాట ఏమో గాని, నువ్వు పూర్ గా మిగిలిపోతావు"
రాఘవ తండ్రి మాట వినలేదు.
"నా మాట విననప్పుడు నా ఇంట్లో ఉండక్కర్లేదు" అన్నాడు రాఘవ తండ్రి శ్రీనివాస రావు.
"సరే నాన్నగారు"
ఇంటినుంచి వచ్చేసాడు రాఘవ. అమ్మ బంగారం తో చిన్న
క్లినిక్ తెరిచాడు.
"నేను వెడతాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. మీ నాన్న గారు క్లినిక్ నుండి వచ్చే టైమయ్యింది"
రాఘవ కారు దగ్గరికి వచ్చి డోర్ తెరిచాడు. రాఘవ తల్లి సుమతి కూర్చున్నాక డోర్ లాక్ చేసి చెయ్యి ఊపాడు. కారు కనుమరుగయ్యేదాక ఉండి లోపలికి వచ్చాడు.
*******
సంవత్సరాలు గడిచేకొద్దీ, రాఘవ కి తన లక్ష్యం పట్ల అంకితభావం మరింత బలపడింది. అనారోగ్యంతో ఉన్నవారికి, నిరుపేదలకు వైద్య సంరక్షణ అందించడానికి మారుమూల గ్రామాలకు ప్రయాణిస్తూ లెక్కలేనన్ని గంటలు గడిపాడు. అతని నిస్వార్థ ప్రయత్నాలు అతనికి గ్రామస్తుల గౌరవాన్ని, ప్రశంసలను సంపాదించాయి, వారు అతన్ని దేవుడు పంపిన డాక్టర్ గా భావించారు.
అయితే, రాఘవ తన లక్ష్యం పట్ల అచంచలమైన నిబద్ధత
తో ఉన్నాడు.
రాఘవ కు సంపన్న కుటుంబాల నుండి వచ్చిన అనేక వివాహ ప్రతిపాదనలను తిరస్కరించాడు, ఎందుకంటే గ్రామస్తుల పట్ల తన కర్తవ్యం కాకుండా వేరే జీవితాన్ని ఊహించలేకపోయాడు.
ఆర్థిక పోరాటాలు మరియు సామాజిక ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ, రాఘవ పేదలకు సేవ చేయాలనే తన ప్రయత్నంలో నిశ్చయంగా ఉన్నాడు. సమాన మనస్తత్వంగల వ్యక్తులు మరియు సంస్థల నుండి మద్దతును సమీకరించి, తక్కువ సేవలున్న ప్రాంతాల్లో క్లినిక్లు మరియు మొబైల్ మెడికల్ యూనిట్లను స్థాపించడానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేశాడు.
******
రాఘవ ఒక పేషంట్ కి ఎపెండిసైటిస్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఫోన్ వచ్చింది తండ్రి నుండి.
కాల్ అటెండ్ కాలేదు. ఆపరేషన్ అయ్యాక తండ్రి కి ఫోన్
చేసాడు.
"అర్జంటు గా రా. మీ అమ్మ ICU లో ఉంది"
రాఘవ హాస్పిటల్ వైపు పరుగులు తీసాడు. కాని అప్పటికే ఆలస్యమయ్యింది.
చివరి సారి గా రాఘవ తన తల్లిని చూసాడు.
బహుశా కొడుకు తో మాట్లాడదామనుకుందేమో, పెదవులు కొంచెం విడివడి ఉన్నాయి. గోరు ముద్దలు పెట్టిన చేతులు చలన రహితమయ్యాయి.
"నీ మీద బెంగ తోటే మీ అమ్మ పోయింది. మేము అక్కర్లేదు కదా. ఆ పేద వాళ్ళ తో ఊరేగు" అని నిష్టూరం గా అన్నాడు శ్రీనివాస రావు.
రాఘవ కళ్ళ ల్లో నీళ్ళు! ఆ నీళ్ల కి చితి మంటలు జ్వలించడం ఆగవుగా!
********
శ్రీనివాస రావు మళ్ళీ కనకప్రసాద్ సంబంధం ప్రస్తావన తెచ్చాడు. రాఘవ సున్నితం గా తిరస్కరించాడు. నెల తర్వాత కనక ప్రసాద్ వెడ్డింగ్ కార్డు తో వచ్చాడు.
"నీతో వియ్యమందక పోవడం మంచిదయ్యింది. నీ బాబు లాంటి సంబంధం వచ్చింది. అల్లుడు ఆస్ట్రేలియా లో కార్డియాలజిస్ట్. వచ్చే నెల ఇద్దరూ వెడుతున్నారు." అని చెప్పాడు సంతోషం గా.
శ్రీనివాసరావు ముఖం కందగడ్డ లా తయారయ్యింది. తరువాత విల్లు వ్రాయడానికి లాయర్ కి ఫోన్ చేసాడు.
"చెప్పండి సార్ "
"నేను విల్లు రాయాలి" అన్నాడు శ్రీనివాస్ రావు స్థిరంగా.
"మీకు ఒక అబ్బాయే కదా. విల్లు అవసరం పడకపోవచ్చు."
"హాస్పిటల్ నా స్వార్జితం. ఏదైనా చేసుకోవచ్చు"
"అవుననుకోండి. విల్లు ఎవరికి చెందేలా రాయాలి"
"నా తదనంతరం నా ఆస్తి నా స్నేహితుడి కొడుకు
మహీధర్ కి చెందేలా రాయాలి"
"అంటే మీ అబ్బాయి కి.." ఆగాడు లాయర్.
"అవును. నా కొడుక్కి ఏ రకమైన హక్కు లేదని విల్లు
తయారు చెయ్యండి"
"బాగా ఆలోచించుకున్నారా?"
"ఆలోచించే మీకు ఫోన్ చేసాను"
లాయర్ మాట్లాడ లేదు.
*******
చివరికి రాఘవ పట్టుదల ఫలించింది.రాఘవ అంకితభావం మరియు పరోపకారం ప్రభుత్వ అధికారుల దృష్టిని ఆకర్షించింది. వారు రాఘవ గొప్ప పనితో కదిలిపోయారు.
వారి మద్దతుతో, అందరికీ సమగ్ర ఆరోగ్య సేవలను అందిస్తూ, గ్రామంలో పూర్తిగా అన్ని సదుపాయాలు కల ఆసుపత్రిని నిర్మించాలనే తన కలను రాఘవ సాకారం చేయగలిగాడు.
ఆసుపత్రి ప్రారంభోత్సవం సమీపిస్తుండగా, రాఘవ గర్వంగా నిలబడి ఉంటే, కృతజ్ఞులైన గ్రామస్తులతో చుట్టుముట్టారు.
దారిలో తాను ఎదుర్కొన్న సవాళ్లు, త్యాగాలు ఉన్నప్పటికీ, తన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని రాఘవకు తెలుసు.
ఆసుపత్రి ఇప్పుడు సమాజానికి ఆశాజనకంగా పనిచేస్తున్నందుకు, గ్రామంలో ఎవరికీ మళ్లీ వైద్య సంరక్షణ నిరాకరించబడకుండా చూసుకుంటూ, వైద్యం మరియు కరుణ తన లక్ష్యాన్ని కొనసాగిస్తానని రాఘవ ప్రతిజ్ఞ చేశాడు.
ఒకరోజు ఒక అమ్మాయి రాఘవ ఆసుపత్రిని సందర్శించింది.
"మీరు ఈ ఆసుపత్రిని సందర్శించడానికి చాలా కష్టపడ్డారు"
"అవును, నేను జర్నలిస్ట్ ని. నాకు మీ ఇంటర్వ్యూ కావాలి "
“నేను రాజకీయ నాయకుడిని కాదు.మామూలు డాక్టర్ ని. మీకు నా ఇంటర్వ్యూ ఎందుకు అవసరం?”
"మీ గొప్ఫతనం మాకు తెలుసు "
"రాత్రి 10 గంటల తర్వాతే నేను మీకు అందుబాటులో ఉంటాను"
"ఫర్వాలేదు. నేను వేచి ఉంటాను"
"
రాత్రి 10 గంటలకు ఇంటర్వ్యూ ప్రారంభమైంది. రాఘవ తన చిన్ననాటి సంఘటనను జర్నలిస్ట్ అయిన సంహితకు వివరించాడు.
రాఘవకు 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆ సంఘటన జరిగింది,రాఘవ తాతగారింటికి వెళ్ళి నప్పుడు. పొరుగు ఇంటి మహిళ గర్భవతి మరియు తొమ్మిది నెలలు పూర్తి చేసి ప్రసవానికి సిద్ధంగా ఉంది. ప్రసవ వేదన మొదలైంది. గ్రామస్తులు మహిళను ఎద్దుల బండిలో గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగర ఆసుపత్రికి తీసుకెళ్లారు. దురదృష్టవశాత్తు, అకస్మాత్తుగా నల్లని మేఘాలు ఏర్పడి వర్షం ప్రారంభమైంది. భారీ వర్షాల కారణంగా ఎద్దుల బండి సమయానికి ఆసుపత్రికి చేరుకోలేదు.
గర్భిణీ స్త్రీకి సమస్యలు తలెత్తాయి. బిడ్డ అడ్డం తిరిగింది. చివరకు చనిపోయిన బిడ్డను ప్రసవించింది మరియు ఆమె ఊపిరి కూడా కోల్పోయింది.
“ఆ రోజే నిర్ణయించుకున్నా వైద్య సదుపాయం అందక ఎవరూ చనిపోకూడదని. పెద్దయ్యాక డాక్టరవ్వాలని”.
రాఘవ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి.
రాఘవ చెప్పడం ఆపాడు.
హృదయాన్ని తాకిన సంఘటనతో సంహిత ని కదిలింది. తరువాత రాఘవతో ఆమె ఇంటర్వ్యూ ప్రతిష్టాత్మక టైమ్ పత్రికలో ప్రచురించబడింది.
* '
సంహిత పత్రికతో వచ్చి రాఘవకు ప్రచురించిన ఇంటర్వ్యూని చూపించింది. రాఘవ, సంహితకు కృతజ్ఞతలు తెలిపారు.
తనకు జర్నలిజం పట్ల ఆసక్తి లేదని సంహిత చెప్పింది.
"ఎందుకు?". అడిగాడు రాఘవ.
"రాఘవ మిషన్లో భాగం కావడానికి"
రాఘవ ఆశ్చర్యపోయాడు.
"నా మార్గం సులభం కాదు"
"మీరు నాతో ఉన్నప్పుడు ఇది సులభం అవుతుంది". సంహిత అతని చేతిని తాకింది.
"థాంక్యూ" అన్నాడు.
రాఘవ ఆమెను కౌగిలించుకున్నాడు.
"ఈ కాగితం ఏమిటీ?" సంహిత అడిగింది.
"నాన్నగారి విల్లు"
అంతా చదివి సంహిత ఆశ్చర్యపోయింది.
"నాన్న గారి ఆస్తి కి ఆశ పడితే ఆదర్శం దెబ్బతింటుంది."
అని విల్లు పేపర్ డస్ట్ బిన్ లో పడేశాడు.
సంహిత, రాఘవ గ్రామం లో నడుస్తూంటే తూర్పు రేఖలు చీల్చుకుంటూ నూతన ఉదయం ప్రారంభమైంది!
సమాప్తం
వీరేశ్వర రావు మూల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
కవి, రచయిత. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా పనిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో కథలు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వందకు పైగా కవితలు వివిధ వెబ్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది.
Comments