'Thyagaraja Kruthulu Valmiki Pokadalu' - New Telugu Article Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 10/01/2024
'త్యాగరాజ కృతులు- వాల్మీకి పోకడలు' తెలుగు వ్యాసం
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
త్యాగరాజస్వామి పేరు వినపడగానే రసజ్ఞుల హృదయాలు భక్తితో పులకించి పోతాయి. సంగీత సాహిత్యాలలో త్యాగరాజుని మించిన మహానుభావులు అరుదుగా కనిపిస్తారు. సంగీత త్రయంగా పేరుగాంచిన శ్రీత్యాగరాజస్వామి, శ్రీశ్యామశాస్త్రి, శ్రీముత్తుస్వామిదీక్షితులు కావేరిరతీరంలో ఉన్న తిరువాయుర క్షేత్రంలో జన్మించడం, వారు సమకాలీను లవడం గొప్ప విశేషం.
తిరువారూరు క్షేత్రంలో నెలకొన్న సదాశివుని పేరే త్యాగరాజేశ్వరుడు. కర్ణాటక సంగీత ఆకాశంలో త్యాగరాజస్వామి సూర్యునివలె ప్రకాశిస్తూ సంగీత లోకబాంధవుడుగా, సంగీతజ్ఞుల సంగీత రసికుల ప్రాణప్రదుడుగా, హృదయ నాధుడుగా అవతరించిన వాగ్గేయకారుడు. వీరు నేటికీ, ఎప్పటికీ కూడా నారదుడు, వాల్మీకి, శుకుడు, బ్రహ్మ, సదాశివుడుగా సంగీతలోకంలో కొలవబడు యుగపురుషుడు.
త్యాగయ్యగారు మహావాగ్గేయకారులు. వాగ్గేయకార వినీలాకాశంలో ధ్రువతార. వారి కృతులు సంగీత సాహిత్యామృత కావ్యదృశ్యాలు. వారి కృతిలోని సంగీతం సాట లేనిది. వారి కృతిసాహిత్యం కూడా అంత విశిష్టమైనది. వాటియందు భక్తి, జ్ఞాన వైరాగ్యాలు, బ్రహ్మపదార్థ వివరణ, ఛందోబద్ధ, వ్యాకరణ విశేషాలు, ధ్వనిలక్షణాలు అపారం గానూ, మనోహరంగానూ ప్రకాశిస్తున్నాయి.
త్యాగయ్యగారు భక్తాగేసరులు. వారి కృతులు రామభక్తిని లోకంలో వెదజల్లు జ్ఞానసుధా తరంగాలు. త్యాగయ్య రాముని రామబ్రహ్మముగా, అద్వీతీయునిగా(ఏకమేవ అద్వితీయం బ్రహ్మం) పరబ్రహ్మమముగా ఆరాధించి ఆ మార్గమునే జిజ్ఞాసువులకు బోధించెను.
త్యాగరాజ కృతులయందు గల మర్మమును, అర్థమును, భావమును గ్రహించు సాధకుడు సంగీత మహా విద్వాంసుడగుటయే గాక పరమజ్ఞానిగా, పరమభక్తునిగా రాగరహితుడై, రాగరసికుడై ముక్తడగుననుట నిస్సందేహము. మరియ త్యాగయ్య వారి కృతులలో వాల్మీకిమహర్షి రచించిన రామాయణ మహాకావ్యము యొక్క లక్ణాలు అంతర్లీనంగా భావార్ధవిశేషాలు ప్రస్ఫుటంగా కనబడును.
శ్రీమద్రామయణము ఆదికావ్యము. వాల్మీకి మహర్షి ఆ మహాకావ్యమున శ్రీరామచంద్రుని సర్వమంగళ సుగుణాలంకృతునిగా, పురుషోత్తమునిగా, విగ్రహవంతమైన ధర్మముగా అభివర్ణించెను. ఆ గుణములు పఠించిన పిమ్మట శ్రీరామచంద్రుని నాయకునిగా గ్రహించి కావ్యము వ్రాయవలెనని కుతూహలము కలుగని కవివరుండుండడు.
జయదేవుడు ప్రసన్నరాఘవమున " స్వసూక్తీనాం పాత్రం రఘుతిలకమేకం కలయితిం, కవీనాం కో దోషః సతు గుణ గణాన మన గుణః " అని చెప్పియుండెను. వాల్మీకి చెప్పిన రామాయణము కథనే ఇతరకవులు తిరిగి చెప్పుటకు వారి సామర్థ్యలోపము కారణము కాదనియు, రాముని గుణగణాలే అందుకు కారణమనియు పై వాజ్మయము నందలి భావము. కంకంటి పాపరాజు " జానకీజుని కథల్ రచింపక అసత్కథలెన్ని రచించి నేనియున్ వాని కవిత్వమేమిటికి, వాని వివేక మహత్వమేటికిన్" అని వాక్రుచ్చి యుండెను.
త్యాగరాజాంధ్రము నందలి వాగ్గేయకారులలో అగ్రగణ్యుడు. ఆయన కృతులలో వాల్మీకి రామాయణముకు ధీటుగా, దానికి సరిసమానముగా వాల్మీకి మహర్షే ఆ కృతులను రచించారా అన్నంతగా ఉంటాయి.
అసావేరి రాగంలో రచించిన కృతులలో ' ఏ పనికో జన్మించితివని- దాని చరణములలో వాల్మీకి ని మునులు, నరులు, నిను వర్ణించిన నా యాస దీరునా, మేల్మియై యుండు సద్భక్తులు మెచ్చుదురే త్యాగరాజ నుతి. వాల్మీకాది మునులు శ్రీరామచంద్రమూర్తిని వర్ణింప నా మనస్సు, హృదయము సంతృప్తి చెందునా?
ఈ విధముగా త్యాగరాజులవారు వాల్మీకిని తన మనస్సునందు నిలుపుకుని రసానుభూతి చెందుతూ తాదాత్మ్యముతో ఆదికవిని అనుకరిస్తూ సంప్రదాయ సంగీతములో కృతులు రచించెను.
త్యాగరాజులవారు సంగీతమార్గమునే ఎందుకు ఎన్నుకున్నారు? ఎందుకంటే సుస్వరముగా భగవంతుని అర్చించుట సులభమైన పద్దతి. వాల్మీకి రామాయణము అన్ని శ్లోకాలు పాదబద్ద, అక్షరసమూహ, తంత్రి, లయబద్ద అనగా రాగం, తానం లయబద్దంగా ఉంటాయి.
ఆదికవి అడుగుజాడలలోనే తన కృతులను త్యాగరాజుల వారు రచించారు. కదలీఫలము వంటి అత్యన్నతమైన సాహిత్యము, సుస్వరమైన సంగీతబాణీలు, ఉపనిషత్తులలాగా అధ్యాత్మికతను బోధించే, నాటినుంచి నేటివరకు రామాయణమున భక్తితో, గౌరవముతో, ఆనందముగా ఎలా అనుభవిస్తున్నారో త్యాగరాజులవారి కృతులను కూడా, ఆ విధముగా గౌరవిస్తున్నారు.
ఇంతవరకూ వాల్మీకి వారితో త్యాగరాజులవారిని బాహ్యము గా మాత్రమే స్పృశిచాము. ఇంక, అంతరంగంగా త్యాగరాజ కృతులలో వాల్మీకి ఛాయలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాము
వాల్మీకి వారే పేర్కొన్నారు. కావ్యము - రామాయణము. చరితము- సీతమ్మవారి చరితముగా కీర్తింపవచ్చును. త్యాగరాజులవారు కృతులలో ఇలా పేర్కొన్నారు.
కాంభోజి రాగంలో ' మా జానకి చెట్ట బట్టగా మహారాజైతివి రాజ రాజీవర । రాజీవాక్ష, నిను రావణారి యని రాజిల్లు కీర్తియు '. మా జానకీదేవవి సహధర్మచారిణయగుట వలన మహారాజైతివి. రాజులకు రారాజైన ఓ సార్వభౌమా। రావణుని సంహరించినావన్న కీర్తి మా జానకి వల్లనే కలిగినది.
మరియు సీతామాత వ్యక్తిత్వము, అశోకవనములో రావణుడు దుర్భాషలాడినప్పుడు ఎదురుకొన్న తీరు త్యాగరాజుల వారి మదిలో చక్కటి ముద్ర వేసింది. సుందరకాండ లోని ఒక శ్లోకము" అపందేశాత్తు రామస్య తపస శ్చాను పాలనాత్ నత్వం కుర్మి దశగ్రీవ। భస్మ భస్మార్హ తేజసా! - ఓ రావణా । రాముడు నాకు ఆజ్ఞ ఇవ్వలేదు. నే నిప్పుడు తపస్సును పాలిస్తున్నాను. అందుచేత ఓ దశకంఠా। బూడిద చేసే తేజస్సు కలిగినా, నిన్ను నేను భస్మము చేయలేదు.
మరియు రావణునితో మారీచుడు ధర్మోపదేశము, హెచ్చరించిన విధము ఎట్లనిన....
' రావణ అప్రమేయమ్ హితత్ తేజ హస్యస జనకాత్మజ!- ఓ రావణా! అగ్నిజ్వాలలను పట్టినట్లు నీవును నన్ను పట్టుకొనజాలవు. అగ్నిని ముట్టుకున్న భస్మమగుదురు కదా! నీకీ పని తగదు. రాముని కళ్ళబడున నీవు బ్రతికి బయట పడలేవు.
ఈ సన్నివేశములను వాల్మీకి మహర్షి రామాయణములో ఏ విధముగా శ్లోకబద్ధముగా చేశారో త్యాగరాజుల వారు కూడా పద్య భావయుక్తముగా " మొరాలకింప వేమి" కీర్తన దేవగాంధారి రాగంలో శ్రీరామునికి మొరపెట్టుకున్నట్లుగా ప్రార్థనకు సబంధముగా నున్నది.
ఒక వనచరు డలనాడు సహోదరు బాధలు తాళక మొఱలిడ, బ్రోచితివి తనకు సుగ్రీవుని గాదా
వానరుడైన సుగ్రీవుడు వాలిపెట్టిన బాధలు ఓర్వలేక నిను ప్రార్థింపగా బ్రోవలేదా!
విభీషణడు తన అన్న అయిన రావణునితో విభేదించి నిను శరణు కోరగా విభీషణుని బ్రోచి శరణు ఈయలేదా! కీర్తనలో ఒక ఎత్తుగడగా శుకవచనము అనగా వారి పలుకులు సుస్వరముగా చిలుక పలుకులవలె తీయగా ఉన్నవని భావము.
మరియు నా నిరంతర నీ నామస్మరణ నీకు విభీషణము గా( కఠినముగా) ఉన్నదాయని చమత్కారముగా సుగ్రీవ, విభీషణ యను పదములను వాడిరి.
సర్వలోక శరణ్యాయ రాఘవాయా మహాత్మనే
నివేదమత మాం క్షిప్రం విభీషణ ముపస్థితమ్.
సర్వలోక శరణ్యుడును, మహాత్ముడును అయిన రాముని శరణాగతి పొందుటకు రక్షణ కోరుటకు వచ్చి యున్నాడని నివేదించుము అని ప్రార్థించెను.
మిత్రసైన్యము, ఆటవిక సైన్యము, జీతము పుచ్చుకుని పనిచేయు సైన్యమును
అంగీకరింప వచ్చును కాని శత్రువుల సైన్యము స్వీకరింపరాదు. అంగద, సుగ్రీవులు
సలహా ఇచ్చిరి.
మిత్రభావమ్ సంప్రాక్తం నత్యజీమమ్ కథనంచన
ఒకమారు నీ శరగతుడను అని యాచించిన అతనికి ఎవరి వలనను భయము కలుగకుండునట్లు అభయమిచ్చుట వ్రతము. నే నతనికి అభయమిచ్చుచున్నాను.
కాన సుగ్రీవా! అతడు విభీషణుడైనను లేక రావణుడే స్వయముగా వచ్చినను వెనువెంటనే తోడ్కొని రమ్ము.
విదిత స్సహి ధర్మజ్ఞ శ్శరణాగతి వత్సలః
తేన మైత్రీ భవతే యది జీవితు మిచ్ఛసి.
రాముడు ధర్మజ్ఞుడు. శరణాగత వత్సలుడని సమస్తలోకము లందు పేరుగాంచి యున్నాడు. కావున నీవు బ్రతుకుపై ఆశయున్న రాముని స్నేహము చేయుము.
త్యాగరాజుల వారు కృతిలో సుగ్రీవ, విభీషణాదులను ఏ విధముగా బ్రోచి శరణు ఒసంగినావో మరియు ప్రహ్లాదుడు, ధ్రువుడు వారి యందు నీ కరుణ ఏ విధముగా
ప్రసరించినదో రామా యనుచు కళ్యాణి రాగంలో ఒక సుప్రసిద్ధమైన రచన చేసిరి.
ఎందుకో నీ మనసు కరుగదు, ఏమి నేరమో తెలలుపమనుచు తన అసంతృప్తిని
తెలియబరచెను. మరియొక చేట ఘూర్జరిరాగంలో
వరాలందుకొమ్మని నా యందు వంచన జేయ న్యాయమా
నా మనసంతా నీమీద భక్తితో నిండిపోయింది. కానీ నీవు నా మీద ఎందుకు కినుక వహించావు.
చ।। అవివేకముతో కలిసి తెలియకను
భవ సుఖముల కాసించిన గాని
ద్రువమైన ఫలమొసగు నీ శక్తికి
ధ్రువుడు సాక్షిగాడా రామ నను
చిన్నతనమున ధ్రువుడు తన తండ్రి అనురాగమునకై ప్రాకులాడినప్పుడు ధ్రువునికి నిత్యమైన స్థానమొసగి కాపాడలేదా! నీ అనుగ్రహమునకు సాక్షిగా ద్రువతారయై
వెలుగొందుచున్నాడు. మాకు లేక దయకై ఎదురు చూచుచున్న నన్ను కృపచూడకున్నావు.
ఈ సందర్భములోనే తోడిరాగంలో
"ఏమని మాట్లాడితివో రామ, ఎవరి మనసుక్ విధము తెలిసి"
ఎవరి మనసుకేది ఇష్టమో వారికి వశమయి ఏమని మాట్లాడితివో అనుచూ స్వాభావికముగా లోక మర్యాదతో చూపినారు.
వాల్మీకి అనేక పర్యాయములు రాముని ప్రతిచోట మృధుభాషి యని సంభోందించెను.
తోడిరాగం లోనే
ప।। ఏమని మాట్లాడితివో రామ
ఎవరి మనసు కే వితము తెలిసి
అ।। మామ, మరుదులనుజులు తల్లిదండ్రులు
భామలు పరిజనులు స్వవశమౌట
చ।। రాజులు మునులు సూరులు వరది
గ్రాజులు మరి సూరులు శశిధర, దిన
రాజులు లేబడి నడువను త్యాగ
రాజ వినుత నయభయముగ ముద్దుగ।।
అనురాగముతో కూడిన భయముతో ఏమని మాట్లాడితివో మామ, మరదులు, తల్లిదండ్రులు, భామలు, పరిజనులు మొదలగు భిన్న ప్రవృత్తులు కలవారి నంరినీ నీ వశము జేసుకొంటివయ్యా! అనుచూ రాముని మహోన్నత గుణములు స్వాభావికమగు లోక మర్యాధతో చూపినారు. శ్రీరాములవారు కైకేయిని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అంతా నిశ్శబ్దము.
ఆ నిశ్శబ్దాన్ని కఠోర వార్తతో ఏ విధముగా ఎవరు చెప్పి రాముని వనవాసమునకు పంపాలి?ఈ సందర్భములో కూడా త్యాగరాజులవారు ' ఎవరి మనసుకు ఏ విధముగా' అన్వయించుకోవచ్చును. రాముడు కైకతో ఈ విధముగా పలికెను.
" తదప్రియ మమ్త్రఘ్నో వచనం మరణోపమమ్
శ్రుత్వా న వివధ్యే రామః కాకేయీం చే మబ్రవీత్".
శత్రుంజయుడైన రాముడు, అప్రియమును, మరణము వంటిది యగు మాటలు విని కైకను జూచి ఇట్లనెను.
తల్లీ! నీవు చెప్పినట్లు చేయుదుము. నా తండ్రి మాట నిలుపుటకు అడవులకు పోయెదను. కాని పూర్వమువలె నా తండ్రి నాతో ఏల మాట్లాడడు? ఆ మాట నాతో
ఏల చెప్పడు? ఈ దుఃఖము నా హృదయమును దహించుచున్నది.
నాక మర్దపరోదేవి! లోక మావస్తుస ముత్సహవిద్ధి మా మృషిభిస్తుల్యం క్వలం ధర్మమాస్థితమ్.
దేవీ! నాకు ధనము నందాసక్తి లేదు. ఈ లోకమునగాని, ఇతర వస్తువును గాని నేను కోరను. నేను ఋషితుల్యుడను. ధర్మమును మాత్రమే అనుసరించి వున్నవాడను. ఈ విషయము నీ వెరుంగుము. పిదప శ్రీరాముడు కౌసల్య ను దర్శించుటకు వెళ్ళెను. ఆమెను తన మాటలతో సంతృప్తి పరచుచూ అడవులకు వెళ్ళెనని తనకు అనుగ్రహము ప్రాప్తించమని కో రెను.
"మయాచైవ తవత్వా చ కర్తవ్యం వచనం పితుః
రాజభర్తా గురుశ్రేష్ఠ సర్వేశా మీశ్వరం ప్రభుః.
నీవు మరియు నేను ధశరథుని ఆజ్ఞ పాలించినచో పరిస్థితులు చక్కబడును.
శబరి పుణ్యమును భాగ్యమును ఎంత చక్కగా వర్ణించారు. సంభోదనలో కూడా
"తపోధనే" మరియు " చారుభాషిణి" యనిరి.
కక్షిత్ నియమః ప్రాప్తహ కక్షిత్ మనసా సుఖమ్
కక్షిత్ గురు శుశ్రూషః సఫల చారుభాషిణి
ముఖారి రాగంలో
స!! ఎంతని నే వర్ణింతును శబరి భాగ్య
అ।।....... పర కాంతలు జగమంత నిండియుండగ
చ ।। కనులారా సేవించి కమ్మని ఫలముల నొసగ
తనువు పులకరించ పాదయుగములకు మ్రొక్కి ఇనకుల
పతి సముఖంబున పునరావృత్తి రహిత పదమును పొందిన
త్యాగరాజనుత శబరి కనులారా శ్రీరాముని దర్శించి తీయని ఫలములను, ముందు తాను రుచిచూచి శ్రీరామునికి తినిపించినది. శ్రీరాముని పాదములకు తన తనువు పులకించుచుండగా మ్రొక్కినది. శ్రీరాముడు ప్రసన్నుడై శబరికి శాశ్వత ముక్తి ప్రసాదించెను.
ఈ విధముగనే మరికొన్ని దృష్టాంతములు కలవు. కిష్కిందకాండలో శ్రీరాముడు లక్ష్మణుని సుగ్రీవుని దగ్గరకు తన మాటగా జెప్పుమని పంపెను.
న చ సంకుచిత పంధయేన
వాలి హదోగతః సమసే తిష్ఠ
సుగ్రీవ మా వాలి పతనమ్ అనవగహ
బాగుగా జ్ఞాపకము పెట్టుకొనుము. ఏ ద్వారము గుండా వాలి వచ్చెనో అది ఇంకనూ తెరిచియే యున్నది. తనకు జెప్పిన ఆజ్ఞలను సక్రమముగా పాటించుమనుము. తన
అన్నగారి రహదారిలో వెళ్ళినచో మృత్యువాత తప్పదు. స్నేహధర్మము అమలు జేయుమని చెప్పుము.
ఇక్కడ కూడా మనము వాల్మీకిరామాయణము లోని శ్లోకముతో త్యాగరాజుల వార కీర్తనతో పోల్చవచ్చును.
" ఎవరి మనసు కే వితము తెలిసి... నయభయముగ ముద్దుగా।।
------
త్యాగరాజులవారు సంగీత విద్వాంసులైన శొంఠి వెంకటరమణయ్య గారి వద్ద శిష్యరికం చేసి సంగీత విద్య నభ్యసించారు. త్యాగయ్య చిన్నతనం లోనే శ్రీరామ తారక
మంత్రములో సిద్ధుడయ్యారు. శ్రీరాముని తన దైవముగా ఆరాధించడమే కాకుండా సంగీతరచన, సాహిత్యం రచనను అత్యంత ఆశువుగా పలికే సిద్ధిని పొంది శ్రీరాముని ధ్యానం లో దర్శించి " బాలకనకమయ చేల.. ' వంటి కృతులను రచించారు. నారదులు ప్రసాదించిన ' స్వరార్ణవ గ్రంథం' ద్వారా ఎన్నో రహస్యాలను గ్రహించి, తన కీర్తనలలో పొందు పరిచారు.
ఒకనాడు గురువుగారు శొంఠివెంకటరమణయ్య గారింట్లో జరిగిన విద్వత్సభలో త్యాగరాజును పాడమని గురువుగారు ఆదేశించగానే అప్పటికప్పుడు ఆశువుగ బిళహరి రాగంలో ' దొరకునా ఇటువంటి సేవ' అని పాడి సభికులందరి చేత ప్రశంసలు పొంది, గురువుగారి ఆశీస్సులు పొందారు. త్యాగరాజు కీర్తి దశదిశలా వ్యాపించడం ప్రారంభమయ్యింది.
త్యాగయ్య గురించి విన్న తంజావూరు మహారాజు తన ఆస్థానానికి వచ్చి తనమీద కీర్తనలు వ్రాసి పాడమని కానుకలు పంపితే వాటిని సున్నితంగా తిరస్కరించి,
"నిధి చాల సుఖమా- రాముని సన్నిధి సుఖమా, నిజము తెలుపు మనసా... " అని పాడి రామునిపై వున్న భక్తిని ప్రకటించడంతో ఆయనను వాళ్ళ అన్నగారు ఇంటినుండి గెంటివేశారు.
త్యాగయ్యగారు 24, 000 పైగా కృతులు రచించినట్టు తెలుస్తోంది. కానీ నేడు మనకి 700 మాత్రము లభ్యమవుతున్నాయి. అధికబాగం భక్తిరసమే. రామకథ, శ్రీరామవైభవం, రామతత్త్వం, వేదాంతరహస్యాలు ఎన్నో ఇమిడి ఉన్నాయి. త్యాగయ్య గారు యాత్రా సందర్భంగా పలు పుణ్యక్షేత్రాలు దర్శించి పలు దేవతలపై పాడిన కీర్తనలు జగత్ప్రసిద్దాలు.
'వరదరాజ నిన్నే కోరి వచ్చేరా, మ్రొక్కెదా- కంచి,
' తెర తీయగ రాదా-తిరుపతి' ' రాగసుధాపానము చేసి రాజిల్లవే మనసా'-
' శాంతము లేక సౌఖ్యము లేదు'- ' నాదాతన్‌మనిశం శంకరం'-' అని శివుని నాదస్వరూపునిగా ఆరాధించారు.
' శివశివ యనరాదా'- ' దేవాదిదేవ సదాశివ'- అంటూ కీర్తనలతో కీర్తించారు. ' సీతమ్మ మా అమ్మ శ్రీరాముడు మాకు తండ్రి'- ' ధర్మ సంవర్ధిని కామాక్షి'- వంటి ఎన్నో ఆణిముత్యాలవంటి కీర్తనలు నేటికీ మనలకు లభిస్తున్నఒమదులకు మనము ఆనందించాలి.
వీరి పంచరత్నకృతులు
1. జగదానందకారకా-నాట రాగం.
2. సాధించనే ఓ మనసా! - అరభి రాగం
3. దుడుకుగల-గౌడరాగం.
4. కనకనరుచిరా-వరాళి రాగం.
5. ఎందరో మహానుభావులు-శ్రీరాగం.
ఇవి కాక ఘనరాగ పంచరత్న కీర్తనలు, దివ్యనామసంకీర్తనలు, ఉత్సవసంప్రదాయ
కీర్తనలు, నౌకాచరితము, ప్రహ్లాదభక్తవిజయము మున్నగునవి.
'గంధము పూయరుగా, పన్నీటి గంధము పూయరుగా, అందమైన యదు నందనుకి యన్న రసరమ్య కీర్తన ' నౌకాచరితము' లోనిది.
త్యాగయ్యగారు శ్రీరామకృష్ణానందస్వామి ఉపదేశించిన రామతారకమంత్రమును ముప్పైఎనిమిది వయస్సు వచ్చునప్పటికి తొంభైఆరుకోట్లు జపించిరి. శ్రీరాముని
ధ్యానించుచు " ఏలా నీ దయ రాదు"-, " కనకమయచేల"-" అలకలు అల్లలాడగాకని"-" శ్రీరామ జయరామ" మొదలగు కీర్తనలు రచించిరి.
ఆ నాడు యోగుపుంగవులు ఉంఛవృత్తిలో (ఉంచః కణశః ఆదానం-ఒక్కొక్క గింజ చొప్పున ఏరుకొనుట) జీవించువారు. యోగులు స్వతంత్రముగా కృషిచేసకొనుచు ఇతరుల నాశ్రయించక జీవించినట్లు త్యాగయ్యగారు ఇతరుల నాశ్రయింపక ఉంఛవృత్తితో జీవించెను.
త్యాగరాజులవారికి శ్రీరామసాక్షాత్కారం జరిగినట్లు, ఆయన ఆదేశం మేర సన్యసాన్ని స్వీకరించి, 1847 జనవరి 6 వ తేదీ( పుష్య బహుళ పంచమి) నాడు కైవల్య పదాన్ని పొందినట్లు తెలియుచున్నది.
త్యాగరాజులవారి సమాధిని తిరువాయురు లో నిర్మించారు. ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఘనంగా అక్కడ జనవరి మాసంలో జరు
గుతుంటాయి. ప్రముఖ సంగీత విద్వాంసులతో పాటు వేల సంఖ్యలో సంగీత కళాకారులు అక్కడ చేరి పంచరత్నకీర్తనలతో గానం చేస్తారు.
శ్రీత్యాగరాజులవారి సాహిత్యము అమూల్యమైన సంపదవలె వాల్మీకి రామాయణములోని అంతర్గత మూలలతో స్పృశిస్తూ వాటి భావము చెడనీయకుండా చక్కటి కృతులు రచించారు. పరంపరాగతమైన ఈ మహావిద్యకు చక్కని రూపురేఖలు గూర్చి లావణ్యవతిగా తీర్చి దిద్దిన మహానీయుడు శ్రీత్యాగరాజస్వామి.
వాల్మీకి, నారద మహర్షుల పరిపూర్ణనుగ్రహ పాత్రుడై నిరంతర శ్రీరామోపాసన పునీత మనస్కుడై శ్రీరామచంద్రుని దర్శించుచు వివిధ రాగములలో భిన్నతాళబద్ధు లైన లలిత మనోహరములు, నవరసభరితములైన కృతుల ద్వారా భక్తిరసమును సంగీతమాధుర్యమను లోకమున కందించి అమృతత్వసిద్ధిని బడసిన ధన్యజీవి
" శ్రీ త్యాగరాజ స్వామి".
-------------శుభంభూయాత్----------------------
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Aysola Subramanyam
Lalitha Sripathi ధన్యవాదములు.
Lalitha Sripathi
మంచి అంశం అండీv