top of page
Writer's pictureVagumudi Lakshmi Raghava Rao

టింగరోడు



'Tingarodu' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 16/07/2024

'టింగరోడు' తెలుగు కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


"కథలన్నీ కంచికే.. అంతా మన మంచికే.. కవితలన్నీ కాశీకే.. హితపథం చేరే మనిషే మనిషిలే" అన్నాడు అశ్వం. 


"మా ఆవిడ వ్రాసిన కథలకు, కవితలకు కంచికి, కాశీకి పోనవసరం లేదు రా బాబు. మా వీథి పారిశుద్ధ్య కార్మికుని కలిస్తే చాలు" అశ్వం మాటలు విని చిరుదరహాస వదనంతో అన్నాడు ఆనందం. 


 అశ్వం అసలు పేరు అశ్వతేజ. అతను ఉయ్యాలలో ఉన్నప్పుడే అతని తండ్రి గజం చనిపోయాడు. గజం అసలు పేరు గజరాజ్. అందరూ "గజం గజం" అనేవారు. తండ్రి గజం పోలికతోనే అశ్వం పుట్టాడు. గజం చనిపోయాడనేకంటే చంపబడ్డాడు అనడం సబబుగా ఉంటుంది. ఎవరిచేత, ఎందుకు, ఎలా చంపబడ్డాడు అంటే కొందరు గజం ను తన తమ్ముడే ఆస్తికోసం మద్యంలో మందు పెట్టి చంపాడు అని అంటారు. మరికొందరు గజం ను తన తమ్ముడే మద్యంలో మందు పెట్టి చంపాడు కానీ ఆస్తి కోసం కాదు తన అన్న ఉంచుకున్న ఆడదానికోసం అని అంటారు. 


ఏవరేమన్నా గజం చనిపోయాడన్నది నిజం. అతను చంపబడ్డాడు అన్నది పచ్చి నిజం. గజం అల్లరి చిల్లరిగ తిరుగుతాడన్నది నిజం. అతని ఆస్తుల లెక్కలను, అప్పుల లెక్కలను అతని తమ్ముడే చూసుకుంటాడన్నది నిజం. 


 గజం కు ఉన్న ఆస్తికంటే, గజం కు ఉన్న అప్పులు అధికం అన్న లెక్కలు చూపించి గజం తమ్ముడు వదిన ను, అశ్వం ను నడిరోడ్డుపై నిలబెట్టాడు. 


 గజం భార్య గంగ అశ్వం ను తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. అక్కడే కూలీనాలీ చేసుకుంటూ అశ్వం ను పోషించి సాగింది. ఆమె తల్లిదండ్రులు అనారోగ్యంతో కాలం చేయడంతో ఆమె ఒంటరిది అయ్యింది. 


 అశ్వం చదువు విషయంలో అశ్వంతో పాటు చదువుకున్న అతని స్నేహితుడు ఆనందం అశ్వంకు ఆర్థిక సహాయం అందించాడు. 


 ఆనందం తలిదండ్రులు ఉన్నంతలో పరోపకారం చేస్తూ వారు ఆనందంగ జీవించేవారు. ఆనందం తండ్రి తోపుడు బండి మీద కూరగాయలు అమ్మేవా డు. , పండ్లు, చేపలు అమ్మేవాడు. 🐟 అదీ ఇదీ అని లేక ఏ కాలంలో దేనికి గిరాకి ఉంటే దానిని తోపు డు బండి మీద తీసికెళ్ళి అమ్మేవాడు. ఉన్ననాడు లేనినాడు అన్ని నాళ్ళు సంతోషంగానే ఉండేవాడు. అదే అలవాటు ఆనందానికి వచ్చింది. 


 అశ్వం తల్లి గంగ ఆనందం తండ్రి బండి దగ్గర ఉండేది. ఆనందానికి పని మనిషి అవసరం లేకపోయిన గంగ మంచితనాన్ని చూచి ఆమెను తన దగ్గర పని మనిషి గా ఉంచుకున్నాడు. ఉన్నంతలో గంగ మంచి చెడులు చూసేవాడు. 


 ఆనందం, అతని తండ్రి సహాయం తో అశ్వం డిగ్రీ పూర్తి చేసాడు. డిగ్రీ పూర్తి చేయడం వలన పెద్ద పెద్ద ఉద్యోగాలు రావని అశ్వం, ఆనందం ఇరువురికి తెలుసు. 


ఆనందం తండ్రి తోపుడు బండిని చిన్న పళ్ళ షాపుగా చేసాడు. అశ్వం బతుకు తెరువు నిమిత్తం మెడికల్ షాపులో పని చేయసాగాడు. 


 ఖాళీ సమయంలో అశ్వం ఆనందంతో కాలక్షేపం చేసేవాడు.. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకునేవారు. అప్పుడప్పుడు వయసు విప్పి కూడా మాట్లాడు కునే వారు. అయితే అసభ్య మార్గంలో మాత్రం సంచరించేవారు కాదు.. వారి అమలిన శృంగార మాటలు మాటల వరకే పరిమితం అయ్యేవి. 


 ఆనందం వివాహం నిగమతో అయ్యింది. ఇద్దరిది అన్యోన్య దాంపత్యం అని వారిగురించి తెలిసిన వారందరూ అనుకునేవారు. ఇద్దరికీ తెలుగు కవిత్వం మీద కాస్త పరిచయం ఉంది. ఇద్దరూ కవిత్వం వ్రాస్తారు. 


ప్రతిరోజూ సాయంత్రం పూట ఇద్దరూ కవిత్వం గురించి ముచ్చటించుకునేవారు. వారు వ్రాసిన కవిత్వాన్ని చదివి ఒకరికి మరొకరు వినిపించుకునేవారు. ఆయా కవిత్వాలలో వారికి నచ్చిన నచ్చని అంశాల గురించి కూడా చర్చించునేవారు. అలాగే నన్నయ్య గారి కవిత్వంలోని అక్షర రమ్యత గురించి, అల్లసాని పెద్దన గారి మనుచరిత్ర లోని జిగిబిగి గురించి, చిన్నయ్య సూరి వ్యారణం గురించి కూడా మాట్లాడుకునేవారు. అప్పుడప్పుడు వారి చర్చల్లో అశ్వం కూడా పాలుపంచుకునేవారు. 


 ఆనందం వివాహం అయి సంవత్సరం తిరగక ముందే అతని తలిదండ్రులు కాలం చేసారు. తండ్రి వ్యాపారం ఆనందం చూసుకోసాగాడు. 


"నీ కవిత్వం ముందు నీ భార్య కవిత్వం హండ్రెడ్ పర్సెంట్ బెటర్ రా టింగరోడ.. నీ కవిత్వాన్ని టింగరోడి కవిత్వమంటే నీ భార్య నిగమ కవిత్వాన్ని ఆహ్లాద కవిత్వమంటారు తెలుసా?" ఆనందంతో అన్నాడు అశ్వం. 


"తెలుసు.. తెలుసు.. అదంతా నీ బిల్డప్. ఆడవారికి అగ్ర పీఠం వేసే నీలాంటి వారు ఆడవారి తుమ్మునే మంగళకర మంత్రాలు అంటారు" చిరునవ్వుతో అన్నాడు ఆనందం. 


"అదేం కాదురా. నీది మందు కవిత్వమైతే, నీ భార్య నిగమ ది అనుభవం కాసి వడబోసిన కవిత్వం. " అన్నాడు అశ్వం.

 

"కంచికి పోవే పుత్తడి బొమ్మ 

 కథలన్ని తేవే నవ్వుల కొమ్మ 

 కాశీకి పోవే వజ్రాల బొమ్మ 

 కవితలు తేవే కవనాల కొమ్ము 

 కథలోని సుధలన్ని చూడు 

 కవితంటె తక్కువ కాదు 

 బంగారు శృంగార తేజాన 

 పవళించి పరవశించే 

 అమ్మో.. అమ్మో.. బంగారు బొమ్మ.." అంటూ నేను వ్రాసే కవనాన్ని మెచ్చుకున్నట్లు, 


నా భార్య నిగమ వ్రాసే, 


"మనసున్న మనిషే మమతల కోవెల" అనే కవనం ఎంతమంది మెచ్చుకుంటారు చెప్పు?" అశ్వంను అడిగాడు ఆనందం. 


"నిజమే.. కవిత్వం లో అనుభవాన్ని, మంచిని ఆదరించేవారు ఈ రోజుల్లో స్వల్పాతి స్వల్పం. ఏదేమైనా నీ భార్య నిగమ కవిత్వం అనుభవం నుండి పుట్టిందిరా.. కరోనా సమయంలో నీ భార్య నిగమ చేసిన సేవ అనిర్వచనీయం. అప్పుడు నిగమ ఉదయం మూడు గంటలకే నిద్ర లేచేది. పదుగురి సహాయం తో రమారమి వందమందికి సరిపడ వంట వండేది.. ఉదయం పదిగంటల లోపు ఆ వంటను నిరుపేదలకు పంపిణి చేయించేది. " అన్నాడు అశ్వం.

 

"వంటను పంపిణి చేయడానికి నువ్వూ సహాయం చేసావుకదా?" అన్నాడు ఆనందం. 


"ఆయా అనుభవాలనే నిగమ కవితలుగా వ్రాసింది. " అన్నాడు అశ్వం. 


"నిగమ కవితలు చదివిన ఒక పెద్ద మనిషి పది పైసలు సహాయం చేసి పదివందలు సహాయం చేసినట్లుగా కవిత్వం ద్వారా నిగమ గొప్పలు చెప్పుకుంటుంది. అన్నాడు" గతాన్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు ఆనందం. 


"ఆ పెద్ద మనిషి మాటలు చెప్పాడు తప్పించి కరోనా సమయంలో పది పైసలు కూడా సహాయం కూడా చేయలేదు కదా? పైగా కరోనా సహాయం పేరుతో నిధులు వసూలు చేసి అందులో 75 శాతం తను మింగేసాడు" అన్నాడు అశ్వం.

 

"అందుకే ఆయన పెద్ద మనిషి అయ్యాడు. ' అన్నాడు ఆనందం. 


 "నిగమ అలాకాక తన అనుభవాన్ని కవితలుగా వ్రాసింది" అన్నాడు అశ్వం. 


"అప్పుడు నేనూ కవితలు వ్రాసానోయ్" అన్నాడు ఆనందం. 


"ఆ వ్రాసావు. అవన్నీ నేనూ చదివానులే.. అవి

 

 కరోన కరోన కరోన తిరగేస్తే 

 నరోక నరోక నరోక అంటే 

 నరః+కు.. నరః+క నరః+క

 నరః అంటే మనిషి కః అంటే ఎవరు.. 

మనిషి ఎవరు? 

మాను ఎవరు? 

అంటూ డబుల్ కాట్ మంచమెక్కి టింగరోడి లా అటూ ఇటూ దొర్లుతూ సుత్తి కవిత్వం వ్రాసావు" అన్నాడు అశ్వం. 


"ఆ సుత్తి కవిత్వమే సూపర్ హిట్ అయ్యింది రా" చిరునవ్వు తో అన్నాడు ఆనందం. 


"ఆ అయ్యింది అయ్యింది. ఎక్కడ అయ్యింది? బాత్ రూం లో అయ్యిందా? అప్పుడు ఆ సుత్తి కవిత్వం వ్రాయడం తప్ప ఇంట్లో అటు పుల్ల తీసి ఇటు పెట్టా వట్రా?" చిరు కోపంతో అన్నాడు అశ్వం. 


"ఎందుకు పెట్టలేదు రా.. నిగమ వంట వండితే రుచి చూచి పెట్టాను. నిగమ పుడ్ ప్యాకెట్ల లిష్టు వ్రాసుకుంటే, ఆ లిష్టులోని అక్షర దోషాలు చూచిపెట్టాను. నిగమ తెలుగు కవిత్వం వ్రాస్తుందన్నమాటే కానీ తెలుగు వ్రాయడం లో చాలా వీక్ రా.. కళ్యాణి వ్రాయడానికి కారంతీయ్ అని వ్రాస్తుంది. సక్కుబాయి అని వ్రాయడానికి, సంకబాయి అని వ్రాస్తుంది" నవ్వుతూ అన్నాడు ఆనందం. 


"ఏడ్చావులే.. అక్కడికేదో నువ్వు తప్పుల్లేకుండా తెలుగు వ్రాసినట్లు. అప్పుడెప్పుడో నువ్వు "కళ్ళు తెరువు అని వ్రాయడానికి కాళ్ళు తెరువు అని వ్రాయలేదా?" చిరుకోపం తో అన్నాడు అశ్వం. 


"ఒరేయ్ అశ్వం! కరోన తర్వాత నిరుద్యోగం పెరిగిపోతోంది అని నాకు ముందే తెలుసు రా.. అందుకే అప్పుడు బాగా ఆలోచించి కొత్త కొత్త ఉద్యోగాలకు రూపకల్పన చేసాను " నవ్వుతూ అన్నాడు ఆనందం. 


"ఆ ఏం చేసావు?" చిరుకోపంతో అన్నాడు అశ్వం. 


"నిరుద్యోగులంతా వీథి వీథి తిరుగుతూ, తెపాళాలకు మాట్లు వేస్తాం అన్న లెవల్ లో వండింది తినిపెడతాం.. తుమ్ము వస్తే తుమ్మి పెడతాం.. తలలో పేలు చూస్తాం.. వంటి ఉద్యోగాల రూపకల్పన" అన్నాడు ఆనందం.

 

"అందుకే నిన్ను టింగరోడు అనీ నీ కవిత్వాన్ని టింగరోడి కవిత్వమని అన్నారు " నవ్వుతూ అన్నాడు అశ్వం. 


 "ఏదేమైనా నిగమ అందమైన కవితలా నా మనసులో నిలిచిపోయింది. కరోన సమయంలో అందరికి సేవలందించిన నిగమ కరోన వచ్చి కరోనలో కలిసిపోయింది." కనులు తుడుచుకుంటూ అన్నాడు ఆనందం. 


"ఆనందం! నీ భార్య నిగమ మనుషుల్లో దేవతరా.. ఈ లోకంలో పరోపకారం గురించి మాటలు చెప్పేవారు అధికం. పరోపకారాన్ని చేతల్లో చూపించేవారు స్వల్పాతి స్వల్పం. కరోన సమయంలో అనేకమంది ఆకలి తీర్చిన నిగమ పుట్టింటికి వెళ్ళి కరోనతో మరణించింది ‌. ఇలా జరుగుతుంది అని ఎవరూ ఊహించలేదు" కొంచెం బాధ తో అన్నాడు అశ్వం. 


"ఎంత దుఃఖం ఎదురైన నవ్వుతూ నవ్విస్తూ బతకాలి అనేది రా నిగమ. నేను పెళ్లి కాక ముందు కొంచెం టింగరోడిని అయితే పెళ్లి అయ్యాక మరింత టింగరోడిని అయ్యాను. దానికి ప్రధాన కారణం నా నిగమయే. ఈ టింగరోడి నోటి మాటలు నవ్వుల పువ్వులు పూయించాలేగానీ విషాద వానలు కురిపించకూడదు అనేది. కరోన కాలం లో తన శక్తి మేర సేవ చేసిన నిగమ కరోన తో పోవడం నిజంగా బాధాకర విషయం " అన్నాడు ఆనందం. 


"కాదు. నిగమ కరోన తో కాలం చెయ్యలేదు. అదంతా పచ్చి అబద్దం" అప్పుడే అక్కడికి వచ్చిన గంగ అంది. 


 గంగ మాటలను విని ఆనందం నిశ్చేష్టుడయ్యాడు. 


అశ్వం ఆవేశంతో "అమ్మా " అన్నాడు. 


"అవును. నేను చెప్పేది పచ్చి నిజం. అశ్వం నా కన్నకొడుకు అయితే ఆనందం దేవుడిచ్చిన కొడుకు. నిగమ మనుషుల్లో దేవత. 


 కరోన సమయంలో నిగమ చేసే సహకారం గురించి చాలామందికి తెలిసింది. ఉదార స్వభావం గల మంచి మనుషులు ఆమెకు అనేక రకాల ఆర్థిక సహకారం అందించారు. అదంత కోటి రూపాయలు అయ్యింది. దానినంత నిగమ కరోన బాధితులకు అందించసాగింది. 


 నిగమ దగ్గర మంచి మనుషులు ఇచ్చిన విరాళం కోటి రూపాయల వరకు ఉన్నాయి అని ఒక పాపి గ్రహించాడు. నిగమ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆ పాపి ఆమెను అనుసరించాడు. నిగమను పుట్టింట్లో గొంతు నులిమి చంపి కరోనా తో చనిపోయిందని ప్రచారం చేసాడు" దుఃఖతో అంది గంగ. 


"ఆ పాపి ఎవరమ్మా?" అడిగాడు ఆనందం. 


"ఇంకెవరు? నువ్వే.. మనీ కోసం దేవతలాంటి భార్యనే పొట్టన పెట్టుకున్న పాపివిరా.. నువ్వు. నీ లాంటి వాడి సహాయ సహకారాలతో నేనింతవాడిని అయ్యాను. నిజమే అయ్యాను. అందుకే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. " ఆవేశం తో అన్నాడు అశ్వం. 


"నేను.. దేవతలాంటి నా భార్యను చంపానా? ఈ టింగరోడు ఇంత టింగర పని చేసాడంటే ఈ లోకం కాదు కాదు.. మీరు నమ్ముతారా?" అశ్వం, గంగలను చూస్తూ బాధతో అన్నాడు ఆనందం. 


"పాపానికి నోరెక్కువ ఆనందం. పాపం చేసే పనులు, చెప్పే మాటలే అందరిని నమ్మించే విధంగా ఉంటాయి. ఆ పాపి నువ్వు కాదు ఆనందం. నా కొడుకు అశ్వం " అంటూ గంగ పైట చాటున ఉన్న తుపాకీ ని తీసి అశ్వాన్ని కాల్చివేసింది. 


"అమ్మా.. ఇంత పని చేసావేమిటమ్మా. ? " అన్నాడు ఆనందం. 


"ఇలాంటి పాపులకు క్షమాభిక్ష పెట్టకూడదు ఆనందం. ఇలాంటి పాపులకు కథల్లో క్షమాభిక్ష ఉంటే ఉండవచ్చు. నిజానికి ఇలాంటి వారు వాస్తవ జీవితంలో క్షమాభిక్ష పెట్టినా మారరు. మరో మారణ హోమానికి బీజం వేస్తారు. 


 నిగమతో పాటు ఆమె పుట్టింటికి ఈ దుర్మార్గుడూ వెళ్ళినట్లు నిగమ తలిదండ్రులు చెప్పారు. ఇతగాడు ఆవూరిలో ఒక లాడ్జి రూం తీసుకున్నాడట. ఆ రాత్రి నిగమ గదిలో నిగమ గొంతు పిసికి చంపి లాడ్జి రూం కి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఏం తెలియనట్లు నిగమ తలిదండ్రుల యింటికి వచ్చి నిగమ కరోనతో చనిపోయినట్లు ప్రచారం చేసాడు" తను తెలుసుకున్న విషయాలన్నిటిని గంగ ఆనందానికి చెప్పింది. 


 "అవును" అన్నట్లు చనిపోయిన అశ్వం కళ్ళు ఉన్నాయి.

 

"అమ్మను మించిన దైవం లేనే లేదు రా 

 యిలలో అమ్మకు సాటి అమ్మేరా 

 బ్రహ్మ సృష్టిన అమ్మ అంటే అమ్మేరా 

 అమ్మను మించిన దైవం లేనే లేదు రా"


అంటూ ఆనందం అశ్వం చనిపోయిన చాలారోజుల తర్వాత కవిత్వం వ్రాయడం మొదలు పెట్టాడు. 


షాపులో తన కవిత్వం తాను ఒకటికి పదిసార్లు చదువుకుని "యస్ దిసీజ్ టింగరోడి కవిత్వం " అనుకున్నాడు.

 

సర్వే జనాః సుఖినోభవంతు 


వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు








37 views0 comments

Comments


bottom of page