'Treatment' - New Telugu Story Written By Vijayasundar
Published In manatelugukathalu.com On 11/02/2024
'ట్రీట్మెంట్' తెలుగు కథ
రచన: విజయా సుందర్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"ఇడియట్! ఎక్కడ ఏడుస్తున్నావు? చెవుడు వచ్చిందా?" ఆఫీస్ మీటింగ్ లో ఉన్న మహిమ, మొగుడి అరుపులు వినబడగానే తలుపు గడియ వేసి, మనసును చిక్కబర్చుకుని, తన పనిలో నిమగ్నమయింది. మాటిమాటికీ తలుపు వైపు చూస్తున్నది భయంగా, తన భర్త, బాబుని తీసుకువచ్చి తలుపు కొడతాడేమో అని. మరి ఏమనుకున్నాడో.. సన్నగా వినిపించే బాబు ఏడుపు తప్ప అతని అలికిడి వినబడలేదు. ఊపిరి పీల్చుకున్నది మహిమ!
మీటింగ్ అవగానే పరుగున బాబు దగ్గరకు పరిగెత్తుకెళ్లింది మహిమ. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లినట్లు, పాడు చేసుకున్న పక్క మీదనే పడుకుని నిద్రపోతున్నాడు బాబు. కడుపులో తిప్పేసింది.. ఏడుపుని గొంతులోనే ఆపుకుని, బాబుని శుభ్రం చేసి, పాలిచ్చి పడుకోబెట్టి వంటపని చూసుకోవడానికి లేచింది.
ముందు గదిలో కూర్చుని తాగుతున్న భర్తని ఏహ్యంగా చూసింది. 'వీడు ఈ పిల్లవాడికి తండ్రి అయ్యాడు.. లేకపోతేనా?'
మహిమ నవ్వుకున్నది, తను ఆలోచించే విధానానికి. 'ఏం చేసేది.. ఏమీ చెయ్యలేదు' అనుకుని నిట్టూర్చింది!
కొంతమంది స్వార్థపరుల అత్యాశలకి పండంటి మహిమ జీవితం, బాధ్యతలేని వ్యసనపరుడైన సాగర్ పాలబడ్డది. మొదటి భార్య సాగర్ సాడిజం తట్టుకోలేక విడిచేసిందన్న చేదు నిజం తెలిసేప్పటికి బాబు కడుపున పడ్డాడు. నిలదీసినా, పోట్లాడినా జరగాల్సిన అనర్థం జరిగిపోయాక చేయగలిగింది ఏమీ లేదని, బీద కుటుంబంలోని తల్లిదండ్రుల ఆశ లేక, మోసగాళ్లయిన అత్తవారిని చేరలేక, అడకత్తెరలో పోకచెక్కలాగా నలిగిపోతున్నది మహిమ!
డాక్టర్ చదువుతున్న సాగర్, డాక్టర్ అన్న ముద్రతో పెళ్ళికొడుకయ్యాడు. కట్నం వద్దన్నారన్న ఆనందం, సంబంధం చెప్పింది తమ దగ్గర బంధువు అన్న నమ్మకంతో మహిమ తల్లిదండ్రులు అడుసులో కాలు వేసారు.. అంటిన అశుద్ధం మహిమ పాలిట కాలనాగయ్యింది!
పోనీ జరిగిందేదో జరిగింది, ఆ చదువు పూర్తి చేసి ఎక్కడో అక్కడ ఉద్యోగం చేయమంటే, అంత కెపాసిటీ లేని సాగర్, మహిమ పాదం మంచిది కాదు కనుకనే తనకి ఏమీ కలిసి రావడం లేదని, ఎదురుదాడికి దిగాడు. బలాదూర్ గా తిరిగి మంచి మార్కులు రాక, ఏదో అవకాశం తనని వెతుక్కుంటూ వస్తుందని, రెండేళ్ల డాక్టర్ చదువు గాలికి వదిలేసి, స్నేహితుడనబడే కాలసర్పం, మురళి మప్పిన చెడు అలవాట్లకు బానిస అయ్యాడు.
పెరిగే పిల్లవాడు, వాడి ఆలనా, పాలనా, ఎవ్వరి అండదండలూ లేకుండా మహిమ ఏటికి ఎదురు ఈదినట్లుగా నిభాయించుకుంటున్నది.
****
వంట చేసి పిల్లవాడికి అన్నీ సర్ది ఆఫీస్ దగ్గర ఉన్న క్రష్ లో, పిల్లవాణ్ణి దింపి ఆఫీస్ కి వెళ్తుంది. పొరపాటున కూడా సాగర్ ఏ పనీ చెయ్యడు. తన పనికి అడ్డు రాకపోతే చాలనుకుంటుంది మహిమ.
ఆఫీస్ కి బైల్దేరుతున్నది మహిమ.
"నాకు వెయ్యి రూపాయలు కావాలి" ఉరమని పిడుగులా, తన జీతమేదో దాచిపెట్టినట్లు అడుగుతున్న సాగర్ కి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆమెకి. ఎలా చెప్పినా గొడవే చేస్తాడు. నెలాఖరులో అంత డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు.
మహిమ మౌనం చూసి, సాగర్, "ఏమిటి ఇవ్వకుండా ఉండడానికి ఏమి సాకు చెప్పాలా అని ఆలోచిస్తున్నావా? ఏం మొగుడు సంపాదిస్తే పెళ్ళాం తినటల్లా? అన్నీ మారిపోయినట్లే ఇదీ మారిపోయింది. తే తే.. అవతల అప్పిచ్చిన వాళ్ళు నా పీక తెగ్గోస్తామంటున్నారు. " సిగరెట్ నుసి నలుపుతూ అంటున్నాడు.
'పీడా వదిలిపోతుంది' అని మనసులో అనుకుని, అప్పుడింకో రకం కష్టాలని వెంటనే అనుకుంది మహిమ. కొద్దో గొప్పో ఇస్తే గానీ ఆఫీస్ కి వెళ్ళనియ్యడని, "ఇంతే ఉన్నది" అంటూ 500 చేతిలో పెట్టింది.
ఆ డబ్బు విసిరి కొట్టి, "మొగుడికి ముష్టి వేస్తున్నావుటే పాపిష్టిదానా? నీ బిడ్డకి తండ్రిని నేనేనా? అంత ఘనకార్యం చేసిన నాకు విలువ లేదా? నీతో నాకు మాటలేమిటీ?" అంటూ చేతిలోని బాగ్ లాక్కుని అందులోనుండి, వెయ్యి రూపాయలు, కింద పడేసిన 500 కూడా తీసుకుని, "అడగ్గానే ఇస్తే వెయ్యితో సరిపోయేది. నకరాలు దొబ్బితే ఇంకో 500 నీకే బొక్క" అంటూ వికృతంగా నవ్వుతున్న సాగర్ చొక్కా పట్టుకుని ఆపి, "అవి పిల్లవాడి పాల డబ్బాల కోసం ఉంచినవి.. ప్లీజ్ జీతం వచ్చాక ఇస్తాను" అంటుంటే,
"చొక్కా పట్టుకుంటావా? ఎంత ధైర్యమే నీకు" అంటూ వంగదీసి గుద్దులు గుద్దుతూ, "నీ దగ్గర ఉన్నాయి గదే పాలు?" మొదట్లో కొడితే ఎదురు తిరిగేది. అసహ్యంగా కేకలు పెట్టి చుట్టు పక్కలవాళ్ళకి మహిమే తనని కొడుతున్నదని చెప్పేవాడు. అప్పట్నుంచీ ఆ అవకాశం ఇవ్వకుండా ఉన్నా, ఒక్కోసారి తప్పట్లేదు.
" పిల్లాడు పెరుగుతున్నాడు. సరిపోవడం లేదు. వేరే ఆహారం కూడా పెట్టాలి" రకరకాలుగా బ్రతిమాలింది. ఒక్క తోపు తోసి వెళ్ళిపోయాడు.
గుడ్లనీళ్లు కుక్కుకుంటూ, ఏడుస్తున్న పిల్లవాణ్ణి సముదాయించి చెదిరిన జుట్టు, బట్టలు సరిచేసుకుని పిల్లవాణ్ణి దింపి, ఆఫీస్ కి వెళ్ళింది.
"ఏమిటే అంత నీరసంగా ఉన్నావు? ఏమీ తినలేదు కదూ? మళ్లీ గొడవేనా? రోజూ చచ్చేవాడికి ఎందుకే నువ్వు తిండి మానటం?" మెత్తగా చీవాట్లేస్తూ, అనునయంగా భుజం తడుతూ, తన బాగ్ నుండి ఆపిల్ తీసి పెడుతున్న ప్రాణస్నేహితురాలు ప్రతిమ ఓదార్పు, ఉగ్గబట్టుకున్న మహిమ కన్నీళ్ళు కారిపోయేట్లు చేసింది.
"నన్ను కొట్టాడని కాదే.. పిల్లవాడి పాలడబ్బా, వాడి డ్రాప్స్ కొనటానికి ఉంచిన డబ్బులు బలవంతంగా తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు ఎలాగో అర్థం కావట్లేదు" బిక్కమొహంతో దిక్కులు చూస్తున్న మహిమ మీద కోపం ముంచుకొచ్చింది ప్రతిమకి.
"అసలు నీకు బుద్ధి లేదే. ఎందుకు ఇంకా వాణ్ణి ఇంట్లో ఉండనిస్తున్నావో నాకు అర్థం కాదు. నువ్వు కష్టపడి సంపాదించింది వాడు తగలెయ్యడానికా? అరే, పిల్లవాడి నోటి దగ్గర కూడు లాక్కునే తండ్రిని క్షమించి, ఏ గొప్ప పట్టా పొందుదామనో నాకైతే బోధపడటం లేదే. " ప్రతిమ ఆవేశం చూసి, తన మీద ఆమెకి ఉన్న ప్రేమకి సంతోషిస్తూ మహిమ, "ప్రతిమా! నేనేమీ మదర్ థెరిసానీ, మహాత్మా గాంధీనీ కాదే. నా స్వార్థం కోసమే వాణ్ణి భరిస్తున్నాను. నీకు మాత్రం తెలియదా ఒంటరి ఆడదాని అగచాట్లు? నామమాత్రంగానన్నా మొగుడు, అనే మగాడు ఉంటే, ఒక కంచె మన చుట్టూ ఉన్నట్లు ఉంటుంది. లేకపోతే ప్రతి వెధవా ఉద్దరించడానికి తయారు. " అన్నది.
"ఏ పోవే ఇంకా ఈ రోజుల్లో ఇవన్నీ ఎవడికి పట్టిందిట! మన జాగ్రత్తలో మనం ఉంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు" ప్రతిమ మాటని ఖండిస్తూ మహిమ, "ఏ రోజులైనా ఇదే కథ నడుస్తోంది. మనం రైట్ సైడ్ లో వెళ్తున్నా రాంగ్ సైడ్ లో వెహికిల్ వచ్చి ఆక్సిడెంట్ చేసినట్లు, మన బ్రతుకు మనం బతుకుదామన్నా, బ్రతకనివ్వరే. అంతదాకా ఎందుకు, సాగర్ స్నేహితుడని చెప్పబడే, మగమృగం మొన్న ఒకరోజు ఈయన లేనప్పుడు, వచ్చి సాగర్ గురించి తేలికగా మాట్లాడి, తాను నాకు అండగా నిలబడతాడట. దగ్గర దగ్గరకి వస్తున్న అతన్నుండి అప్పుడే వచ్చిన మా పనమ్మాయి రక్షించింది. మొగుడు ఉంటేనే ఇలా ఉన్నది, ఇంకా లేకపోతే"..
మహిమని పూర్తి చెయ్యనిచ్చి ప్రతిమ, "చూడు ఏం జరిగిందో.. నీ సహనం ఏమి ఒరగబెట్టింది? ఇలా ఎక్కడైనా, ఎప్పుడైనా జరగవచ్చు కదా. వదిలించుకోవే.. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ.. " ప్రతిమని అడ్డుకుంటూ, "హాయి.. ఆ పదం ఇంక ఈ జీవికి లేదులే గానీ.. ఒక జీవితాన్ని బద్దలు చేసుకోవడానికి క్షణం చాలు. పెళ్లి అయిన కొత్తల్లో, సాగర్ మొదటి పెళ్లి విషయం, అతని చదువు విషయం బైట పడేదాకా నిజంగా స్వర్గాన్ని చూపాడు కదే. ఆ మనిషిలోని మనిషి ఎలా మృగమయ్యాడో అస్సలు అంతుపట్టటంలేదు.
నా కొడుక్కి తండ్రి ప్రేమ దక్కించాలని, అందుకు నేను ఎంత మూల్యమైనా చెల్లించాలని ఓర్పు వహిస్తున్నాను ప్రతిమా! ఆ మనిషిలోని మనిషిని నిద్ర లేపి నావాణ్ణిగా చేసుకోవాలని తల్లక్రిందులుగా తపస్సు చేస్తున్నాను.. "భారంగా ముగించిన స్నేహితురాలిని పొదివి పట్టుకుని ప్రతిమ, "సారీనే.. నీ మనసు నొప్పించాను. కానీ నీ తపస్సు ఫలించాలంటీ మార్గం ఇది కాదు. నేను చెప్పినట్లు చేస్తావా ఈ రోజునుండి?" అన్నది.
"నా సాగర్ నాకు దక్కుతాడంటే దేనికైనా సిద్ధమే" అన్నది మహిమ కళ్ళు తుడుచుకుని.
ఇద్దరూ ఆఫీస్ లాంజ్లోనుండి తమ డిపార్టుమెంట్ కి వెళ్లి పనిలో నిమగ్నమయ్యారు.
***
అన్నంలోకి తనకి నచ్చినవి లేవని కంచం విసిరి కొడుతున్న సాగర్ ని తిరస్కారంగా చూస్తూ మహిమ, "అది విసిరి కొట్టేసావు.. హు ఇంక తినడానికి ఏమీ లేవు" అంటూ కామ్ గా తాను అన్నం తినసాగింది. ఇది ఊహించని సాగర్ కి, మొదటి ఝట్కా బలంగా తగిలింది! ఆకలి కడుపుని చేతకాని అరుపులతో నింపుకున్నాడు.
సాగర్ అరుపులకి భయపడకుండా, చెయ్యి ఎత్తితే చాలు మహిళా పోలీసులకి కంప్లైంట్ చేస్తానని, దయతలచి ఇస్తున్నానని రోజుకి 50 రూపాయలు మాత్రం ఇచ్చి, ఇంటికి తాళం వేసుకు వెళ్తున్న మహిమను ఏ రకంగానూ సాధించలేకపోతున్నాడు సాగర్.
ఆమె పదిన్నరకి ఆఫీస్ కి వెళ్లే లోపల వండిన వంటతో బుద్ధిగా భోజనం చేస్తే సరే, లేకపోతే ఆ రోజుకి పస్తే. మొండిగా అప్పులు చెయ్యటం మొదలు పెట్టాడు సాగర్. ఒక్క నెల తీర్చింది. తరవాత పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేసింది, అతను చేసే అప్పులతో తనకి ఎటువంటి సంబంధమూ లేదని.
ఇంక అన్ని వైపుల్నుండి అష్టదిగ్బంధనమైపోయింది సాగర్ కి.
వ్యసనాలు ఊపిరి సలుపుకోనివ్వడం లేదు. ఎక్కడా ఎర్రని ఏగాని అప్పు పుట్టట్లేదు. స్నేహితులంతా మొహం చాటేస్తున్నారు. ఒకొక్కసారి ఆకలితో కడుపులో పేగులు మెలిపెడుతున్నాయి. పలకరించే దిక్కు లేక పిచ్చెక్కుతున్నది. అవతారం పిచ్చివాడిలా, బిచ్చగాడిలా తయారయ్యింది.
ఆ రోజు తిరిగి తిరిగి, ఇంక తిరిగే ఓపిక లేక, పార్కులో ఓ బెంచీ మీద పడుకున్నాడు. ఇద్దరు బిచ్చగాళ్ళు అడుక్కు తెచ్చుకున్న అన్నం, కూరలు మూట విప్పారు. కమ్మని వాసన ముక్కు పుటాలను తాకి, ఖాళీ కడుపులో ఆకలి కరకరలాడింది.
వాళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నారు..
మొదటి బిచ్చగాడు, "ఎక్కడనుండో మొత్తం కూర, పప్పు సంపాయించావే"
రెండో బిచ్చగాడు, "ఆ పోస్టుబాక్సు పక్కన మేడ మీద చిన్న పోర్షన్ లో అమ్మగారు ఈ మధ్య అప్పుడప్పుడూ గిట్లనే మొత్తం గిన్నె బోర్లవేస్తుందిరా" అన్నాడు.
వద్దన్నా వినిపిస్తున్న ఆ మాటలకి ఉలిక్కిపడ్డాడు సాగర్. ఆ ఇల్లు తమదే.. తాను తినని వంట అది. అసంకల్పితంగా తలెత్తి చూసాడు సాగర్. అతని కళ్ళలో ఆకలి చూసిన ఆ బిచ్చగాళ్ళు అతని వాలకం చూసి, ఎక్కడా తిండి దొరకలేదని జాలిపడి బలవంతంగా కాస్త అన్నం కూరలు పెట్టారు.
ముందు 'ఛీ' అనుకున్నా, ఆకలి గెలిచి ఆవురావురుమని తిన్నాడు. విధి చేయు వింత గాక, మహిమ డబ్బు ఇవ్వనప్పుడు తన ఇంట్లోనే ఎన్నోసార్లు దొంగయ్యాడు, దౌర్జన్యం చేసాడు.. ఇప్పుడు భిక్షగాడు కూడా అయ్యాడు. అవకాశం లేక వ్యసనాలు ఆగిపోగా, అతనిలోని మనిషి కొద్దికొద్దిగా మేలుకోసాగాడు!
మధ్యాన్నం టీ, సిగరెట్ లేక పిచ్చెక్కిపోతోంది సాగర్ కి. మార్కెట్ లో అటు ఇటు తిరుగుతున్నాడు. ఎవరో పెద్దావిడ కూరల సంచీ మొయ్యలేక సాగర్ ని, "బాబూ! మా ఇల్లు రెండు వీధుల అవతల, 20 రూపాయలిస్తాను కాస్త ఈ సంచీ తెచ్చి పెడతావా?" అని అడిగితే, బుస్సున కోపం వచ్చింది.
అంతలో తన కాలి చెప్పుకి పెట్టిన పిన్నీసు ఊడి గుచ్చుకుంటుంటే, తన అవతారం చూసుకున్నాడు. మాట్లాడకుండా తల ఊపి సంచీ చేత పట్టుకున్నాడు. ఆ తల్లి చూపించిన దారి రోజుకు అలా ఓ 100 రూపాయలు సంపాదించుకోగలుగుతున్నాడు. 'అరె, ఇదేమిటీ ఇంత హాయిగా ఉన్నది తనకి!' తనలో తానే ఆనందపడ్డాడు. జాగ్రత్తగా టీకి, రెండే సిగరెట్లకి వాడుకుంటున్నాడు.
***
ఆరోజు సాగర్ ఒక కారు ఆసామీకి పెద్ద సూట్ కేసులు మోసుకొచ్చాడు అపార్ట్మెంట్లోకి. డబ్బులిస్తూ సాగర్ ని తేరిపార చూసిన అతను, "సాగర్! నువ్వు.. నువ్వేమిటిలా?" అని హడావుడిగా అడుగుతుంటే, అప్పుడే సాగర్ కూడా అతన్ని తన ప్రాణస్నేహితుడు అనిల్ గా గుర్తుపట్టి తప్పించుకోబోయాడు తాను సాగర్ కాదని. కానీ అనిల్ ఊరుకోలేదు.
అనిల్ తో మాట్లాడాక, సాగర్ కి తన జీవితాన్ని ఎందుకిలా నాశనం చేసుకున్నానా అని ఏడుపొచ్చింది. అనిల్ తో అనవసరమైన స్పర్ధ తెచ్చుకుని, మురళి సాంగత్యంలో జారుడు మెట్లమీద దిగజారిన తన జీవితాన్ని సింహావలోకం చేసుకున్నాడు. తాను అండగా ఉంటాను, జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి స్నేహహస్తమందించిన అనిల్ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు సాగర్.
మధ్యలో ఆపిన చదువుకు తగ్గ ఉద్యోగమేమీ రాదని అర్థం చేసుకుని, నేల మీద నడవటం మొదలు పెట్టిన సాగర్, అనిల్ క్లినిక్ లో అతని గైడెన్స్ తో కాంపౌండర్ గా చేరాడు.
***
ఆ రోజు బాబు మొదటి పుట్టినరోజుకు బట్టలు కొనుక్కుని ఇంటికి వచ్చిన మహిమ, 'ప్చ్.. అన్నీ బాగుంటే అందరు కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాల్సిన పండగ, ఇలా ఒక్కదాన్నీ.. 'నిర్వేదంగా లోపలకు వచ్చింది.
కాలింగ్ బెల్ మోతకి ఉలిక్కిపడి, లేచి తలుపు తీసి, ఎదురుకుండా ఉన్న తన తల్లిని చూసి, సంతోషంతో నోట మాట రాలేదు. ఆమె వెనకాలే సాగర్, అతని ప్రాణస్నేహితునిగా పెళ్లి అయిన కొత్తల్లో పరిచయం చేసిన అనిల్.. మహిమ అవాక్కయింది! సాగర్ నీట్ గా షేవ్ చేసుకుని నవ్వుతూ, చేతిలో ఏవో పేకట్లతో.. అంతా కలలా ఉన్నది.
తల వంచుకు కూర్చున్న సాగర్ భుజం తట్టి అనిల్, "మా చెల్లాయ్ అంత మనసు లేని మనిషి కాదోయ్. అందుకే నీ ఆటలు సాగాయి. లేలే.. మీ యంగ్ హీరోకి బట్టలు సరిపోయాయో లేదో చూడు. " అంటూ సందడి చేసాడు.
మహిమ అసలు సాగర్ రాకపోకలు గుర్తించడం లేదు. స్నేహితురాలి సలహా ప్రకారం సాగర్ ని కట్టడి చేసిందే గానీ రోజులు రోజులు ఇంటికి రాని అతను, ఇంకా ఎంత దిగజారుతున్నాడో అని అనుకుంటోంది. అందుకే ఇప్పుడీ వాస్తవం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.. నిజంగా నిజమేనా అని!
సాగర్ మహిమతో అర్జెంట్ గా మాట్లాడాలంటూ ఆమెని గదిలోకి తీసుకువెళ్లాడు.. ఇంక వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో.. నవ్వుతూ వచ్చారు బయటకు.
మహిమ తల్లికి ఫోన్ చేసాడట సాగర్ రమ్మని. ఆ సాయంత్రానికి సాగర్ తల్లిదండ్రులూ, తోబుట్టువులు, మహిమ తండ్రి, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ వచ్చారు. బాబిగాడి మొదటి పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా జరిగాయి!
ప్రతిమని వాటేసుకుని మహిమ, "ఊరికే సహనంగా ఉంటే సరిపోదు, బాధ్యత తెలియాలంటీ తగిన ట్రీట్మెంట్ అవసరం తెలియ చెప్పి నా సంసారం నిలబెట్టావే" అంటే ప్రతిమ,
"నీ మొహం! నువ్వు ఆశావాదిగా ఉండి, సహనం చూపకపోతే ఏ మంత్రమూ పనిచేసేది కాదే. బాగా చెప్పావు, ఏ బంధమైనా తెంచుకోవడం సులువు, ఉంచుకోవడమే నిజమైన గెలుపు! సహజీవనం అంటేనే సర్దుబాటు, దిద్దుబాటు అని అన్ని బంధాల్లోనూ అవగాహన చేసుకుని నిలుపుకుంటే వసుధైక కుటుంబమని చాటి చెప్పావు. చెలియా! నీకు హాట్సాఫ్!" అంటూ గట్టిగా చప్పట్లు కొట్టింది.
ఆ ఇంట్లో నవ్వుల పువ్వులు విరిసాయి.
సమాప్తము.
విజయా సుందర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/vijayasundar
నా పేరు వారణాశి వెంకట విజయలక్ష్మి. కలం పేరు 'విజయాసుందర్'. నేను ముఖపుస్తక మాధ్యమాలలో రచనలు చేస్తుంటాను. గత 5 సంవత్సరముల నుండియే నేను వ్రాస్తున్నాను. ప్రముఖ ముఖపుస్తకము భావుకలో రెండు గొలుసు కథలు, రెండు సీరియల్స్, అనేక కథలు వ్రాసాను. పలు పోటీల్లో పాలుపంచుకుని అడపా దడపా బహుమతులు గెలుచుకున్నాను. భావుకథసలు పేరిట అచ్చు అయిన పుస్తకంలో నా కథ ' బాజా భజంత్రీలు' ఈనాడు పుస్తకపరిచయంలో చోటు చేసుకున్నది. 'కథాకేళి', 'ప్రియమైన నీకు, పిల్లలు చెప్పిన పాఠాలు' పుస్తకాలలో న కథలు అచ్చు అయ్యాయి. 'భావుక' లో 'బిజ్జు బామ్మ కబుర్లు' అనే శీర్షిక కొన్నాళ్ళు నడిపాను.మన కథలు మన భావాలు, ముఖపుస్తకం లో కూడా ఎన్నో కథలు రకరకాల కాన్సెప్ట్స్ కి తగ్గ రచనలు చేస్తూ ఉంటాను.
'లీడర్', 'ఉదయం', ఇంకా కొన్ని వెబ్ పత్రికలలో నా కథలు చాలా అచ్చయ్యాయి, పలువురి ప్రశంసలు అందుకున్నాయి. నా సాహితీ ప్రయాణంలో పలువురు సీనియర్ రచయితల సూచనలను అంది పుచ్చుకుంటూ నా రచనలను మెరుగు పర్చుకునే దిశలో ప్రయాణిస్తున్నాను. నమస్సులు!
Comments