ట్రంకు పెట్టె
- BVD Prasada Rao
- Apr 9
- 4 min read
#BVDPrasadaRao, #బివిడిప్రసాదరావు, #TrunkPette, #ట్రంకుపెట్టె, #TeluguStory, #తెలుగుకథ

Trunk Pette - New Telugu Story Written By BVD Prasada Rao
Published In manatelugukathalu.com On 09/04/2025
ట్రంకు పెట్టె - తెలుగు కథ
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
చిట్టడవిలాంటి.. గుట్టలలాంటి ఆ ప్రాంతం గుబురైన ఎత్తు చెట్లుతోను.. పొదలుతోను.. కీచు కీచు ధ్వనులుతోను భలే భలేగా అనిపిస్తోంది. ఏదో వాసనతో కూడిన గాలి తేమని వ్యాపింప చేస్తోంది.
వారాంతపు ట్రిప్ న మేమున్నాం. నాతో పాటు వచ్చిన ముగ్గురు స్నేహితులు ఉన్నారు.
దట్టమైన చెట్ల నీడలు మూలంగా సాయంకాలం వెలుగు పల్చగా అగుపిస్తోంది. వాచీ చూసుకున్నాను. ఐదవుతోంది. చలి ముదురుతోంది.
"మనం జల్దీగా పోదాం. చీకటి పడితే కష్టం. పైగా అక్కడ చోటు దొరకడం కూడా కష్టం." చెప్పాను.
"ఎత్తులెక్కలేక పోతున్నాను. పైగా రెండ్రోజుల క్రితం పెద్ద వర్షం పడిందిగా. అంచేత ఈ బంక మట్టి దారిన అడుగులు జారుతున్నాయి. ఇంతకీ ఆ ప్లేన్ ఏరియాకి ఇంకెంత దూరం." రొప్పుతూ అడిగాడు సుబ్బు.
"అదిగో ఆ కనిపిస్తున్న గుట్ట దాటితే ప్లేన్ ఏరియానే." చెప్పాడు గోవింద.
నేను.. గోవింద ఇది వరకు ఈ ప్రాంతం వైపు వచ్చి ఉన్నాం. మా ఇద్దరికి ఈ ప్రాంతంపై కొంత అవగాహన ఉంది.
"మీరు చెప్పబట్టి బయలుదేరాను. కానీ నాకు కష్టంగా ఉంది." కుండలాంటి పొట్టను అర చేతులతో పాముకుంటున్నాడు శ్యాం.
"ఆ ప్లేన్ ఏరియా చేరిపోతే ఇక ఎగబ్రాకే అవస్ధ ఉండదు." చెప్పాను.
ముప్పావు గంట లోపునే ఆ ప్లేన్ ఏరియా చేరగలిగాం. చీకటి ముదురుతోంది.
గోవిందతో కూడి నేను గుడ్డ గుడారాలు రెండు సిద్ధపరిచాను.
ఈ లోగా శ్యాం.. సుబ్బులు చిన్న మంటేసుకొని చలి కాచుకుంటున్నారు.
హెడ్ టార్చ్ లైట్ వెలుగులో మా గుడారాలు ఎర్రని దిబ్బల్లా అగుపిస్తున్నాయి. మాలా వేసుకున్న అక్కడక్కడి గుడారాల్లోని వెలుగులతో అవి తొక్కతీసిన వాటర్ మెలన్ గుట్టల్లా అనిపిస్తున్నాయి. వాటికి దరి దరిన కర్రల మంటలు ఎగుస్తున్నాయి.
"ఈ మారు జనం అంతగా పోగు కాలేదు. అంతా వచ్చి ఉంటే మనకు ఈ ప్లేస్ దొరకుండేది కాదు." అన్నాను.
"అవును. బహుశా ఈ మధ్య పడ్డ వర్షం వలన ఇటు జనాలు రాక తగ్గిందేమో." గోవింద కల్పించుకున్నాడు.
మేము మా సామానులను గుడారాల్లో సర్దుకున్నాం.
"ఈ రాత్రికి ఇక్కడ గడిపేక.. రేపు అటు వైపు వెళ్దాం. సీయింగ్ ప్లేస్ లన్నీ అటే ఉన్నాయి. వాటిని తెల్లారుతుండగా చూస్తేనే చక్కగా ఉంటుంది. భలే కనుల విందు అనుకో." చెప్పాను.
"అలా ఊరించబట్టే నేను ఉరికాను." అన్నాడు సుబ్బు.
"మరే. నేను అంతే." వెంటనే చెప్పాడు శ్యాం చొంగ తుడుచుకుంటూ.
మాతో తెచ్చుకున్న ఫలహారాలను పంచుకు తిన్నాం మా నలుగురం. చలి తప్ప.. వాతావరణం బాగుంది.
సుబ్బు.. గోవిందలు కర్రలు ఏరుకు వచ్చారు. మంటలో వేసారు. మేము నలుగురం ఆ మంట చుట్టూ కూర్చున్నాం. కబుర్లాడుకుంటున్నాం.
చాలా సేపటికి.. మేము లేచి.. ఇద్దరేసి చొప్పున రెండు గుడారాల్లోకి నిద్రకై దూరిపోయాం.
మర్నాడు.. త్వరగా లేచి తయారయ్యాం. బిస్కెట్లు.. బన్ లు తిన్నాం. గుడారాలు తీసేసి సర్దేసాం. అప్పటికే అక్కడక్కడ రాత్రి కనిపించిన గుడారాలు చాలా మేరకు తొలిగించ బడ్డాయి.
"త్వరగా పోతే.. మనమూ రద్దీలో పడక.. బాగా ఆ ప్రాంతాల్లో తిరగొచ్చు." చెప్పాను.
మేము సైట్స్ సీయింగ్ కై సిద్ధమవుతుండగా.. యూరినేషన్ కై ఎటో వెళ్లి వచ్చిన గోవింద..
"అక్కడ ఒక ట్రంకు పెట్టె ఉంది." చెప్పాడు ఆసక్తిగా.
మా ముగ్గురం అటు చూసాం.
"ఇక్కడికి అగుపించదు. నాతో వస్తే చూపుతాను." చెప్పాడు గోవింద.
వాడి అవస్తతో మేము అటు నడిచాం. ఆ పెట్టె చోటున ఆగాం.
పెట్టె పాతది. ముదురు నల్లటి రంగుతో ఉంది. అది అక్కడి నేలలో పాతిపెట్టినట్లు గుర్తించాం. ఎలానో కొద్ది భాగం బయలు పడి ఉంది.
గోవింద రమారమీ కొద్ది పాటి సాహసికుడు. వాడు దానిని తవ్వి తీద్దామంటున్నాడు.
"తెరిచి చూద్దామా" నేను అడిగాను. నా వాయిస్ నాకే బెరుకుగా వినిపించింది.
సోము.. శ్యాంలు ఏమీ అనడం లేదు.
"తెరిచి చూద్దాం." సడన్ గా అన్నాడు గోవింద.
"మనకెందుకు." వెనుక్కు లాగబోయాడు సోము. శ్యాం వాడికి వంతు పలికాడు.
"లేదు లేదు. మనని ఇక్కడ ఎవరూ చూసేది లేదు. అంతా సీయింగ్ సైట్స్ వైపు పోయే హడావిడిలో ఉన్నారు. పైగా గస్తీలు అక్కడినే ఇప్పుడు ఉంటారు. మనం దీని సంగతి చూసుకొని అటు పోదాం." చెప్పాడు గోవింద.
ఆ పెట్టె చుట్టూ మట్టిని చేతులతో తొలుస్తు్న్నాడు కూడా.
"ఏముండొచ్చు." అడిగాను.
"పెట్టె చూస్తే పురాతనమైనది. తెరిచి చూస్తే పోలే." చెప్పాడు గోవింద.
"అంతే అంటావా." ఆశ పడ్డాను.
"తెరిస్తే తేలిపోతోందిగా." వెంటనే అన్నాడు గోవింద.
శ్యాం.. సోము ఇంకా ప్రేక్షకులు మాదిరీనే కదులుతున్నారు.
"సాయపడితే ఈ ట్రంకు పెట్టెలోది సమంగా నలుగురం పంచుకుందాం." ఆశ పరుస్తున్నాడు గోవింద.
నేను కదిలాను. శ్యాం.. సోము కూడా ముందుకు వచ్చారు. మేము చాలా కష్టపడుతున్నాం. పెట్టె తాళం తెరవడం జరిగితేనే.. ఆ పెట్టె లోది తెలుస్తుంది.
"తాళం మట్టి పట్టేసింది. రాళ్ల దెబ్బలతో ఈ తాళం పగిలేలా లేదు." శ్యాం మాటలు నొక్కుతున్నాడు.
"ఎవరు పాతారో.. ఎందుకు పాతారో.. మొన్నటి వర్షానికి.. ఇది ఇలా బయలు పడినట్టుంది." అంటున్నాడు గోవింద.
నేనేమీ అనడం లేదు. వంగి వంగి పని చేయడంతో నడుము లాగేస్తోంది. నిటారుగా నిలిచాను. దీర్ఘంగా నిట్టూర్చాను.
"పట్టు వదలొద్దు. తేల్చుకుపోదాం." అన్నాడు గోవింద.
మా ఎకాఎకీ సొదన.. ఆ పెట్టె జారినట్టు కదిలి.. భళ్లున దొర్లుకుంటూ.. ఆ దరినే ఉన్న లోయలోకి పడిపోయింది. గోవింద తృటిలో పక్కకు జరగ్గలిగాడు. లేదంటే వాడిని అది ఈడ్చుకుపోయేది. మేము షాకయ్యిపోయాం.
"పదండి. ఇంకేమవుతుందో." శ్యాం.. సోములు తిరిగి గాభరయ్యారు.
మేము భారంగా కదిలిపోయాం.
సైట్స్ సీయింగ్ లో ఉన్నానే కానీ.. నా మది అంతా ఆ ట్రంకు పెట్టె వైపే ఉంది.
మిగతా ముగ్గురును నేను పట్టించుకోలేదు.
అన్యమనస్కుడుగానే నేను తిరుగు ముఖం చేపట్టాను.
ఈ మారు ట్రిప్ నన్ను బాగా నిరుత్సాహ పర్చడమే కాదు.. ఆ ట్రంకు పెట్టె మిస్టరీతో గబులయ్యాను కూడా.
ఆ తర్వాత.. రెండు రోజులకి.. వార్త ద్వారా తెలిసిన విషయంతో నా హైరానా వీడినా.. నాలో ఏదో కంగారు కరకరలాడుతోంది.
మేము వెళ్లిన ఆ ప్రాంతంలోని లోయలో గస్తీలకు ఓ ట్రంకు పెట్టె కంట పడిందని.. దానిని తెరచి చూడగా.. అది ఖాళీగా ఉందని.. ఐనా గస్తీలు వాకబులు.. గాలింపులు ముమ్మర పర్చారని.. ఆ వార్త సారాంశము.
గుబులైన నా బుర్రలోని గుజ్జును సర్రున చురుక్కుమనిపించాయి.. ఆశ పర్చిన అప్పటి గోవింద మాటలు..
'సాయపడితే ఈ ట్రంకు పెట్టెలోది సమంగా నలుగురం పంచుకుందాం.'
***
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.

Comments