#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #TharatharalaAnachivetha, #తరతరాలఅణచివేత, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు

Tharatharala Anachivetha - New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 18/03/2025
తరతరాల అణచివేత - తెలుగు కథ
రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది.
ఈ సారి కూడా తానే సర్పంచిగా ఉండాలని ప్రస్తుత సర్పంచ్ రంగారావు కోరిక.
"జనాల్లో మీపైన కాస్త కోపం ఉన్నట్లుంది. గెలవడం అంత సులభం కాదు. మీ తరఫున వేరే ఎవర్నైనా పెట్టడం మేలు" అన్నాడు అతడి ప్రధాన అనుచరుడు వెంకటేశం.
"జనాలకు వేరే దిక్కు లేదు. గతంలో పోటీ చేసి ఓడిపోయిన రాజరావే ఈ సారి కూడా మనకు పోటీ. అతడి కాస్ట్ వాళ్ళు పది ఇళ్ల వాళ్లే ఉన్నారు. కాబట్టి చచ్చినా గెలవలేడు. నేనిచ్చిన డబ్బులు మధ్యలో నొక్కెయ్యకుండా ఖర్చు పెట్టు చాలు, గెలిచిపోతాను. అంతే గానీ నా పదవి మీద కన్నేయకు" అన్నాడు రంగారావు.
'ఓడిపోడానికైనా రెడీ కానీ అనుచరులను మాత్రం పైకి రానీరు ఇలాంటి వాళ్ళు. ఈ సారికి నాకు ఛాన్స్ ఇవ్వొచ్చు కదా' అనుకున్నాడు వెంకటేశం.
నామినేషన్లు వెయ్యడానికి ఆఖరి రోజు వచ్చింది. అప్పటి వరకు రంగారావు, రాజారావులే నామినేషన్లు వేశారు. ఇంకెవ్వరూ వెయ్యరనుకున్నారంతా.
అప్పుడు అందరూ ఆశ్చర్య పోయేలా ఒక సంచలనం జరిగింది.
ఊరంతా అదే మాట్లాడుకుంటున్నారు.
రాజు మాష్టారు నామినేషన్ వేసారట..
రచ్చబండ దగ్గర, గుడి దగ్గర, టీ కొట్టు దగ్గర.. ఎక్కడ చూసినా ఆ విషయం పైనే చర్చ.
ఇంకేముందీ.. మాష్టారు గెలిచినట్లే. ఆయన్ని కాదని ఊర్లో ఎవరూ వేరే వాళ్లకు ఓటు వెయ్యరు.. అని అందరూ అనుకోవడం రంగారావు అనుచరుల చెవిన పడింది.
ఆ విషయాన్ని రంగారావు చెవిన వేశారు వాళ్ళు.
ఆలోచనలో పడ్డాడు రంగారావు.
రాజు మాష్టారు ఆ వూరి వాడే. కులమతాల పట్టింపు లేకుండా అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. రిటైరయ్యాక కూడా అదే ఊర్లో వుంటూ వయోజన విద్య అంటూ నలుగురికీ చదువు నేర్పిస్తుంటాడు. రంగారావు, రాజారావులతో సహా అందరూ అయన దగ్గర ఓనమాలు దిద్దుకున్న వారే. అయన వయస్సు డెబ్భై పైమాటే.
మొదటిసారి ఓటమి భయం కలిగింది రంగారావుకు. వూళ్ళో మాస్టారి మీద ఉన్న గౌరవం ఇంతా అంతా కాదు. ఆయనలాంటి వారు పోటీ చెయ్యడమే ఒక గొప్ప విషయంగా అనుకుంటున్నారు అందరూ.
ఆ ఊర్లో ఎన్ని వోట్లున్నాయో, కాలనీలో కూడా అన్ని వోట్లున్నాయి. కాలనీ వాళ్ళని గంపగుత్తగా తనవైపు తిప్పుకుంటే గానీ తను గెలవలేడు. మనసులో ఒక పథకం వేసుకొని కాలనీలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసాడు రంగారావు.
"రాజు మాస్టారంటే గురువుగా నాకు కూడా గౌరవమే. కానీ రాజకీయాలంటే ఎన్నో ఎత్తులు, పైఎత్తులు వెయ్యాలి. అవన్నీ ఆయనకు తెలీదు. ఒకవేళ గెలిచినా పదవిలో నెగ్గుకు రాలేడు. పైగా మాస్టారు కులం ఏమిటో మీకు తెలుసు. ఆ కులం వాళ్ళు మిమ్మల్ని తరతరాలుగా ఎంతగా అణగ దొక్కారో మీకు తెలుసు. ఇప్పటి కుర్రాళ్లకు తెలియక పోతే మీ పెద్దలను అడగండి. మీరు ఇలా వెనుకబడటానికి ఆ కులం వాళ్లే కారణం. వాళ్ళు పదవిలో వుంటే మీరు మళ్ళీ వెనకటి కాలానికి వెళతారు. మీ పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. కాబట్టి మీరంతా నాకే ఓటు వేసి నన్ను గెలిపించండి. "
ఉపన్యాసం ముగించాడు రంగారావు.
చప్పట్లు మారు మోగాయి.
తను అప్పుడే గెలిచేసినట్లు ఫీలయ్యాడు.
అయినా నిర్లక్ష్యం పనికి రాదు అనుకున్నాడు. కాలనీలోని తన ముఖ్య అనుచరులను ఇంటికి పిలిపించాడు. ఓటర్లకు డబ్బు ఇచ్చే బాధ్యతను వారికి అప్పగించాడు. తన గెలుపుకు ఇంకా ఏంచెయ్యాలో వారిని సలహా అడిగాడు.
"అయ్యా! మా కాలనీ పెద్ద శివయ్య తాత మాటంటే మా అందరికీ గురి. అయన అప్పట్లోనే విప్లవ కారులతో తిరిగేవారట. ఆయన్ని ఒక్కసారి కలవండి." అని సలహా ఇచ్చారు వాళ్ళు.
అయన ఉంటున్న గుడిసె దగ్గరకు వెళ్ళాడు రంగారావు.
గుడిసె బయట నులక మంచం మీద కూర్చొని ఉన్నాడు శివయ్య తాత. అయన వయస్సు తొంభై ఐదేళ్లు.
అయినా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నాడు అయన.
ఈయన చేత చెప్పిస్తే తన పని అయిపోయినట్లేనని అనుకున్నాడు రంగారావు.
"నమస్కారం శివయ్య తాతగారూ! పెద్దవారు. మీకన్నీ తెలుసు. ఆ మాస్టారు కులం వాళ్ళు మీ వాళ్ళను తరతరాలుగా అణగదొక్కుతున్నారు. ఈ విషయం ఇప్పటి వాళ్లకు మీరే చెప్పాలి." అని అడిగాడు.
శివయ్య తాత చిన్నగా నవ్వి, "నేను మీ తాత గారి దగ్గర పని చేసాను. మీ గురించి నాకు బాగా తెలుసు. ఆ రాజు మాస్టారి సంగతీ తెలుసు. మొట్ట మొదటి సారి అయన పోటీలోకి వచ్చారు. మమ్మల్ని అణచివేస్తున్న వారిని ఓడించే అవకాశం ఇన్నాళ్లకు వచ్చింది. వదిలిపెట్టము. మా ఓటు శక్తి చూపిస్తాము. మీరు వెళ్ళిరండి. అంతా నేను చూసుకుంటాను" అన్నాడు.
ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాడు రంగారావు.
***
ఎన్నికల ముందు రోజు ఓటర్లకు డబ్బులు విరివిగా పంచాడు రంగారావు. సారా ప్యాకెట్లు ఒక వ్యాన్ నిండా తెప్పించి అడిగిన వాళ్లందరికీ ఇచ్చాడు.
ఎన్నికలు ముగిసాయి.
ఓట్ల లెక్కింపు మొదలైంది.
మొదటి రౌండ్ లో రాజు మాస్టారికి ఇరవై ఓట్ల ఆధిక్యత వచ్చింది.
'ఇది రాజారావు బంధువులు ఉన్న వార్డు. అయన ఎలాగూ గెలవడని, వాళ్లంతా మాస్టారుకు ఓటేసి ఉంటారు" అనుకున్నాడు రంగారావు.
రెండో రౌండ్ కు రాజు మాస్టారు మెజారిటీ యాభైకి పెరిగింది.
మూడో రౌండ్ కు మెజారిటీ ఎనభై..
సగం రౌండ్లు పూర్తయ్యాయి. మెజారిటీ నూటముప్పై.
అయినా రంగారావు ధైర్యంగా ఉన్నాడు.
ఎందుకంటే మిగిలింది కాలనీ ఓట్లు.
'తరతరాల అణచివేత' అన్న తన డైలాగ్ బాగా పనిచేస్తుదని తన అనుచరులు చెప్పారు. పైగా డబ్బు, సారా పంపిణీ..
తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు..
తదుపరి రౌండ్ లో దాదాపు అన్ని ఓట్లు మాస్టారుకే.
చెమటలు పట్టాయి రంగారావుకు.
తరువాత రౌండ్లు కూడా అంతే.
కాలనీలో రాజు మాస్టారు క్లీన్ స్వీప్ చేశారు.
మంచి మెజారిటీతో మాస్టారు గెలిచారు.
రంగారావు, రాజారావులకు డిపాజిట్ దక్కలేదు.
తల దించుకుని బయటకు నడిచాడు రంగారావు.
దాదాపు వారం రోజులు ఇల్లు కదల్లేదు.
ఎన్నికలకు ముందు తనకు వంత పాడిన అనుచరులు ఒక్కరు కూడా ముఖం చూపలేదు.
శివయ్య తాతను కలవాలనుకుంటున్నట్లు కబురు పంపాడు.
"ఇక్కడికి రావాలంటే మీకు ఇబ్బందిగా ఉంటుందేమో.. నేనే వస్తాను" అన్నాడు శివయ్య తాత.
శివయ్య వచ్చేసరికి వాకిట్లో అరుగు మీద కూర్చొని ఉన్నాడు రంగారావు.
శివయ్యను చూస్తూనే కళ్ళ నీళ్లు పెట్టుకుని, "మీ వాళ్ళు నన్ను నట్టేట ముంచారు. వాళ్ళు నీ మాట వినలేదా?" అడిగారు.
"అయ్యా మీ డైలాగు- 'తరతరాల అణచివేత' మా వాళ్లకు బాగా వంట పట్టింది. ఎక్కడ చూసినా దాని గురించే చర్చ.
'తరతరాలుగా ఎవరు ఎవర్ని అణచివేస్తున్నారు' అని వాళ్లలో వాళ్లే మాట్లాడుకున్నారు.
మీ తరాల గురించి చూస్తే..
నేను మీ తాత గారి దగ్గర పని చేసేవాడిని.
మీ వాళ్ళ అమ్మాయితో మా కుర్రాడొకడు మాట్లాడుతున్నాడని చెట్టుకు కట్టేసి చింత బరికలతో బాదారు అయన. కొద్ది రోజుల తరువాత చెరువులో శవమై తేలాడు ఆ కుర్రాడు.
"చేసిన తప్పు బయట పడటంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఆ కుర్రాడు" అన్నారు మీ తాతగారు.
నిజం తెలిసిన నేను అయన దగ్గర పని మానేసాను.
ఇక మీ నాన్నగారు పేదలకు వడ్డీకి అప్పులిచ్చి, వాటికి చక్రవడ్డీ కట్టి, దొంగ లెక్కలు వేసి మా వాళ్ళ భూములు చాలావరకు ఆక్రమించుకున్నారు.
ఇక మీరు మా వాళ్ళ పేర్లతో బినామీ పట్టాలు చేసుకున్నారు. పేరు మాత్రం మా వాళ్ళది. అనుభవం మీది.
ఇప్పుడు రాజు మాస్టారి తరాల గురించి చూద్దాం.
మాస్టారు గారి తాత ఆయుర్వేద వైద్యులు. మాలాంటి వాళ్లకు ఉచితంగా వైద్యం చేసే వాళ్ళు.
మాస్టారి నాన్న పోస్టుమాస్టర్.
తీరిక ఉన్నప్పుడు చదువు రాని వారికి మంచి చెడ్డ చెప్పేవారు. అయన దగ్గరే నేను నాలుగు ముక్కలు నేర్చుకుని, మీలాంటి వాళ్లతో ఇలా మాట్లాడగలుగుతున్నాను. మర్యాద, మన్నన నేర్చుకున్నాను.
ఇక రాజు మాష్టారు చదువులో వెనకబడ్డ మా వాళ్ళ పిల్లలకు ఇంటి దగ్గర ఉచితంగా చదువు చెప్పేవాళ్ళు.
మీరు చెప్పిన తరతరాల అణచివేత, దోపిడీ వాళ్ళ వల్ల జరగలేదు. ఇంకా ముందు తరాలకు వెళ్లి వెదకాల్సిన అవసరం మాకు లేదు.
మామూలుగా మీ కోసం వచ్చిన వాళ్ళను మేడ మీద గదిలో కలుస్తారు మీరు. నేనెక్కడ లోపలికి వచ్చేస్తానోనని, నేను వచ్చేసరికి బయట అరుగు మీద కూర్చొని ఉన్నారు.
పెంపుడు కుక్కకు బిస్కెట్లు వేసి శత్రువుల పైకి ఉసిగొల్పినట్లు 'అణచివేత' పదం వాడి, మద్యం, డబ్బు పంపిణీ చేసి మమ్మల్ని వాడుకోవాలని చూసారు మీరు. అందుకే మూకుమ్మడిగా మాస్టారికి ఓట్లు వేసాము. అసలు ఆయనని నిలబడమని కోరిందే మేము.
జరిగిన మంచిని మేము ఎప్పటికీ గుర్తుకు ఉంచుకుంటాము. కులాలతో మాకు పని లేదు.
మన ఊరిపేరు వెంకటరెడ్డి పాలెం. పాలేగారుగా వున్న వెంకటరెడ్డి గారు తన భూములన్నీ పేదలకు పంచడంతో ఈ ఊరికి అయన పేరును పెట్టుకున్నారు.
మన చెరువు పేరు నాయుడోళ్ల చెరువు.
అప్పట్లో రామన్న చౌదరి అనే అయన పిల్లలు లేకపోవడంతో తన ఆస్తులు అమ్మి ఆ డబ్బులతో చెరువు తవ్వించాడు.
మేము మంచిని గుర్తుంచుకుంటాము గానీ కక్షలు కట్టము. మేము మామూలు మనుషులమే కానీ ఏది మంచి, ఏది చెడు తెలిసిన వాళ్ళం. రేపటి రోజున మీ కుమారుడు పోటీ చేస్తే అతను యోగ్యుడైతే గెలిపిస్తాము. అలాగే మాస్టారు గారి అబ్బాయి అయోగ్యుడైతే అతన్ని ఓడిస్తాము.
చివరిగా ఒక్కమాట. మమ్మల్ని మనుషులుగా చూడండి. మీ వోట్ బ్యాంకులుగా చూడొద్దు. ఇక నాకు సెలవు ఇప్పించండి" అంటూ బయటకు నడిచాడు ఒకప్పటి విప్లవ కారుడు శివయ్య తాత.
శుభం
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.
Comments