top of page
Writer's picturePalla Venkata Ramarao

తులసీ దాసు



'Tulasi Dasu' - New Telugu Story Written By Palla Venkata Ramarao

Published In manatelugukathalu.com On 24/09/2024

'తులసీ దాసు' తెలుగు కథ

రచన: పల్లా వెంకట రామారావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



 'రామ చరిత మానస్' రచించి గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన రామభక్తుడు తులసీదాసు. ఈయన ఉత్తర భారత దేశంలో క్రీ. శ. 1532 సంవత్సరంలో ఆత్మారాం, హులసీ దేవి దంపతులకు జన్మించాడు. పుట్టగానే తులసి అని నామకరణం చేశారు. పుట్టుకతోనే దంతాలతో పుట్టాడు. అదికాక అందరిలాగా ఏడవలేదు. పైగా శారీరకంగా అధిక బరువుతో ఉన్నాడు. 


ఈ లక్షణాలన్నిటిని గమనించిన చుట్టుపక్కల వారు, బంధువులు వీడు దయ్యం పిల్లాడని ఈసడించుకున్నారు. ఆత్మారాం కూడా అతని జాతకం చూసి ఇతడు ఒంటరి జీవితం గడుపుతాడు అని నిర్ణయించుకొని, ఎంతో వేదన చెంది, భార్యని ఒప్పించి, తులసీను మునియా అనే మహిళకు దత్తత ఇచ్చాడు. 


 తులసీ దూరమయ్యాడని తల్లి బాధతో కృంగి, కృషించి మరణించింది. కొన్నాళ్లకు పెంచిన తల్లి మునియా కూడా మరణించింది. అయినా సరే ఆత్మారాం కొడుకును దగ్గరకు తీయలేదు. కొన్నాళ్లకు ఆయన కూడా మరణించాడు. 


ఇప్పుడు తులసీ పూర్తిగా ఒంటరి వాడయ్యాడు. పదమూడు సంవత్సరాల వయసులో దిక్కు తోచక దేశద్రిమ్మరియై తిరుగుతున్న తులసిని నరహరి దాసు అనే ఒక సాధువు గమనించి దగ్గరకు తీసి, తండ్రిలా ఆదరించి, తన వెంటే దేశ సంచారం చేయించాడు. 


అతడు రామనామ జపం చేయిస్తూ తులసి కి 'రామ్ బోలా' అనే పేరు పెట్టాడు. అతనికి శిష్యరికం చేశాడు కాబట్టి తులసి పేరుకు దాసు కూడా చేరింది. కొన్నాళ్ళకి కాశీ చేరుకుని అక్కడ 'శేష సనాతన' అనే గురువు వద్ద తులసికి విద్యాబుద్ధులు చెప్పించాడు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు సంపూర్ణంగా అభ్యసించాడు తులసీదాసు.

 

 కాశీలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత గురువు శేష సనాతన్ ఆజ్ఞ వల్ల గృహస్థ జీవితము స్వీకరించడానికి నరహరిదాసు వద్ద సెలవు తీసుకుని తన గ్రామానికి బయలుదేరాడు తులసి. గ్రామానికి వచ్చిన తులసికి ఇళ్లయితే ఉంది కానీ అందులో ఎవరూ లేరు. ఒంటరి జీవితమే గడపాల్సి ఉంది. ఇది గమనించిన ఒక గ్రామస్తుడు దీనబంధుడనే ఒక గృహస్తు కుమార్తె రత్నావళితో పెళ్లి సంబంధం మాట్లాడాడు. పెళ్లి జరిగింది. దాంతో తులసీదాసు ఒంటరి జీవితానికి స్వస్తి పలికాడు. ఇప్పుడు అతనికి రత్నావళే లోకం. ఆమెను విడిచి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. 


 ఒకరోజు రత్నావళి దగ్గరికి వారి పుట్టింటి నుండి పనివాడు వచ్చాడు. ఇంట్లో ఏదో శుభకార్యం చేస్తున్నారని రత్నావళిని తీసుకుని రమ్మన్నారని చెప్పాడు. అప్పుడు తులసీదాసు ఇంటిలో లేడు. ఆయనకు విషయం చెప్పనిది తాను రాలేనని రత్నావళి అంది. అయితే ఆయనకు సమాచారం ఇవ్వమని పక్కింటి వారికి చెప్పి ఆమెను తీసుకువెళ్లాడు పనివాడు. తులసీదాసు వచ్చిన తర్వాత విషయం చెప్పారు పక్కింటి వారు. 


దాంతో తులసీదాసు స్థిమితంగా ఉండలేకపోయాడు. విరహం భరించలేక మామ గారి ఇంటికి బయలుదేరాడు. అయితే అప్పుడు జడివాన కురుస్తోంది. అయినా లెక్క చేయకుండా నది తీరానికి వచ్చాడు. పడవ వాడు వరద వచ్చేటట్టుగా ఉందనీ ఈ జోరు వానలో పడవ నడపలేను అని చెప్పాడు. అయినా తులసీదాసు ఆగలేదు. నదిలో దూకి ఈదడం మొదలుపెట్టాడు. తర్వాత చేతికి ఏదో తగలగా దానిపైన ఎక్కి నదిని దాటాడు. నది దాటిన తర్వాత చూస్తే అది ఒక శవం. దాన్ని ఆసరా చేసుకుని ఇంతసేపు నదిలో ఈదాడు. 


తర్వాత భార్య ఇంటికి చేరుకుని తలుపు తట్టాడు. ఎవరూ పలకలేదు. ఆ జోరు వానలో అతని పిలుపులు ఎవరికి వినిపించలేదు. దాంతో అతను చుట్టూ తిరిగి గోడ ఎక్కడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో చెట్టు మీదుగా ఒక తాడు లాంటిది వేలాడుతూ కనిపించింది. దాన్ని పట్టుకుని గోడ అవతలికి దూకాడు. తర్వాత చూస్తే అది ఒక పాము. 


 అతని రాక రత్నావళిని ఆశ్చర్యపరిచింది. ఇంత మోహావేశం పనికిరాదంటూ ఆమె అతనికి జీవిత పరమార్థాన్ని బోధించింది. తనపై ఇంత ప్రేమానురాగాలు చూపే బదులు శ్రీరాముని పైన భక్తి చూపితే ఇహపరాల్లో ఉన్నత స్థానానికి చేరగలవని బోధించింది. ఆ బోధనలు సూటిగా తులసీదాసు హృదయాన్ని చేరాయి. దాంతో తులసి కి జీవిత పరమార్ధం ఏమిటో అర్థం అయింది. 


అప్పటినుంచి ఆయన శ్రీరాముని సేవే తన జీవిత లక్ష్యంగా భావించాడు. శ్రీరాముని కీర్తనలు గానం చేస్తూ ఊరూరు తిరగ సాగాడు. ఆ సమయంలోనే అతనికి హనుమంతుని సాక్షాత్కారం లభించిందని చెబుతారు. శ్రీరాముడు కూడా దర్శనమిచ్చాడని అంటారు. 


అలా భారతదేశం మొత్తం తిరిగి దక్షిణాదిన రామేశ్వరం వరకు కూడా పర్యటించాడు. కంబర్ రామాయణం, ఏకనాథుని రామాయణం, మలయాళ రామాయణం ఇలా ఎన్నో రామాయణాలను పఠించాడు. తర్వాత రామచరిత మానస్ ను రచించి అజరామర కీర్తిని పొందాడు తులసీదాసు. 

సమాప్తం

 ---------- 

పల్లా వెంకట రామారావు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు

Profile Link:


జన్మస్థలం:     ప్రొద్దుటూరు, కడప జిల్లా. 

జననం:         1974 

తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ

చదువు:        ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)

ఉద్యోగం:       స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) 

అభిరుచి:      సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్)  travel India telugu     

                    (యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)

రచనలు:      'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,

                    వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,

                    బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల

                   ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల

                   బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

 సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం

                    మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ      

                    కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా 

                    రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ 

                    వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.

31 views2 comments

2 Comments



@VeeraboynaNavadeep

• 22 hours ago

Manchi katha

Like


@PulaAfzal

• 1 day ago

Nice

Like
bottom of page