top of page
Writer's picturePandranki Subramani

తుషారం వంటి ఓ పరిష్కారం కోసం..

#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #తుషారంవంటిఓపరిష్కారంకోసం, #TusharamVantiOParishkaramKosam, #TeluguKathalu, #తెలుగుకథలు


Tusharam Vanti O Parishkaram Kosam - New Telugu Story Written By - Pandranki Subramani

Published In manatelugukathalu.com On 21/11/2024

తుషారం వంటి ఓ పరిష్కారం కోసం - తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



కృష్ణగిరి మండలం పొలిమేరన ఉంది ఆ ఊరు- గవ్వలపాలెం. కృష్ణగిరి మండలాఫీసులో అసిస్టెంటుగా చేరిన వ్యాసారావుకి ప్రక్క ఊరు మువ్వల పాలంలో పెండ్లి సంబంధం కుదిరింది. చక్కటి నైతిక ప్రవర్తనతో మంచి రెగ్యులర్ ఉద్యోగంలో ఉన్న అబ్బాయిని అమ్మాయిల్ని కన్నవారెవరూ ఉదాసీనంగా చూస్తూండరుగా! 


ఇక వ్యాసారావు దగ్గరకు వస్తే అతను మొదట్లో ముఖం చిట్టించే చెప్పాడు- “ఇప్పటికిప్పుడు పెళ్ళెందుకు నాన్నగారూ! మా డిపార్టుమెంటులో ప్రమోషన్ కమ్ మెరిట్ పరీక్షలు అలా ఇలా ఉండవు. యమ టఫ్ గా ఉంటాయి. ఇప్పట్నించే డిపార్డుమెంటు విషయాలన్నిటినీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులా చదివితే గాని గట్టెక్కడం కష్టం. ఐనా- ఇప్పుడు నా వయసెంతని ముదిరిపోయిందనడానికి–“ 


“అంటే ప్రమోషన్లు నిన్ను వెతుక్కుంటూ వచ్చేంత వరకూ నీ వయసు మిటకరించి చూస్తూ ఊరుకుంటుందంటావా! అందులో నీటిమీద గీతలవంటి ఈ కాలపు ప్రేమ వ్యవహారాలు, ఏమీ లేకుండానే కలిసి ఉండటాలూ నాకు ససేమిరా నచ్చవు. నువ్వు గాని అటు వంటివాటికి పాల్పడ్డావనుకో— ఆ పైన ఇంట్లో ఉండవనుకో--”


తండ్రి అన్న ఆ ఒక్కమాటకూ వ్యాసారావు బిత్తరపోయాడు. అమ్మానాన్నలిద్దరూ వంశ పారంపర్య సంప్రదాయాలు మిక్కిలి మెలకువతో పాటిస్తారని అతడికి తెలియనిది కాదు. అలాగని కన్నకొడుకుతో మరీ ఇంత ఘూటుగానా స్పందించడం! ఉద్యోగ పర్వంలో నిగ్రహ దీక్షతో పైకి ఎదగాలనుకోవడం పొరపాటా! 


ఐతే- ఆ తరవాతి వ్యవహారం తారుమారయింది. వ్యాసారావులో కనిపించిన చీదర చెట్టెక్కింది. మువ్వలపాలెం వెళ్ళి సుమతిని చూసి వచ్చింతర్వాత పరిస్థితి ఎంతగా పరిణామం చెందిందంటే— సుమతి రూపాన్ని కళ్లనిండా నింపుకుని ఆమె సొగసుల జ్ఞాపకాలను చెరుపుకోలేక అల్లల్లాడి పోసాగాడు వ్యాసారావు. తను గాని తొందరపడి పెళ్ళి వద్దంటూ పడమటి వేపు వెడలిపోతే జీవితంలో ఎంతటి సౌభాగ్యాన్ని ఎంతటి ఆనందాన్ని కోల్పోయేవాడో! 

అంతే కాదు- మువ్వలపాలెంలో ఉంటూన్న తన కొలీగ్ సుమతి కోసం ఒక మాటన్నాడు. ఆమాట విన్నంతనే అతడి చాతి బారెడు పెరిగింది. “ఆ అమ్మాయిలోని అందంకన్నా ఆమె లోని గుణం మిన్న” 


ఉదయ కాలపు తోట గాలిలా ఎంత చక్కటి భావ ప్రకటనం! 


మరైతే ఇప్పుడు వ్యాసారావుకి మరొక సమస్య ఎదురైంది. గవ్వలపాలెం నుంచి వెళ్ళి మువ్వలపాలెం వరకూ వెళ్ళి సుమతిని పలకరించడం ఎలా? సంపూర్ణ రూపాన ముహూర్తం కుదిరి పెండ్లి పీటల పైన కూర్చోవడానికి కనీసం నాలుగు నెలలు పట్టవచ్చు. అదీను తన కాబోయే మామగారే పీచు మిఠాయిలా తలదూర్చి ఏవేవో కారణాలు చెప్పి అంతలావు గడువు కావాలని అడిగాడు. 


ప ళ్ళెం నిండా అగర్వాల్ నేతి మిఠాయిలు ఎట్టెదుట పెట్టి చటుక్కున వెనక్కి లాక్కున్నట్లు లేదూ! అప్పుడు ముద్ద మందార పూవులా తన వేపు ఓర చూపులతో చూస్తూ లావణ్యంగా నిల్చున్న సుమతి వదనాన్ని మరచిపోగలడా! అసలు సుమతి యవ్వన రూపం తనను మరవనిస్తుందా? అతడికేమీ పాలు పోవడం లేదు. సుమతిని తను ఎలాగైనా చూడాలి. చూసి మనసులు విప్పి మాట్లాడుకోవాలి.


 అదీను, పెండ్లి పీటలపైన కూర్చొనక ముందే-- కాని ఇప్పటి పరిస్థితిలో సాధ్యపడుతుందా! తన ఇంటివాళ్ళలాగే సంప్రదాయ నాచు రాళ్ళ సరి హద్దుల్లో తిష్ట వేసుక్కూర్చున్న సొగసరి సుమతి, పిలిస్తే వస్తుందా? ఏమో— ఇప్పటిప్పుడు అది కష్టమేనని తోస్తూంది. అంతకంటే కష్టమైనది మరొకటి ఉంది. బుర్ర మీసాల ముత్యాలయ్య- తన పితరుడు తను ధైర్యం చేసి కాబోయే మామగారింట్లోకి చొరబడి వ్యవహారం చక్కబెట్టుకు వచ్చానని తెలిస్తే తనను కోపాగ్నిలో పడవేస్తాడు; తనను తను చులకన చేసుకోవడమే కాక, ఇంట్లోవాళ్ళను కూడా కాబోయే వియ్యంకుడి ముందు చులకన చేసాడని-- 


పెళ్ళంటే పెళ్లి పీటల పైన కూర్చోవడం మాత్రమేనా—కాదు. పెళ్ళికి ముందూ పెళ్ళికి ఆవతలా ఎన్నో సంగతులు ఇమిడి ఉంటాయన్నది తన మాతా పితల అసమానమైన అభిప్రాయం. పెళ్లికాక ముందే అబ్బాయి వేగిరపాటుకి లోనవుతున్నాడంటే రేపు తాము పొందబోయే మంచీ మర్యాద సమర్పణలో పట్టు వీగిపోదూ! తను కట్టుకోబోయే పెళ్ళాన్ని చూసి రావడానికి ఎదురయ్యే ప్రతిబంధకాలు ఒకటా రెండా! ఇకపోతే వ్యాసారావుకి ఆ ఆలోచనల తుంపర మధ్య పెను అనుమానం ఒకటి పుట్టుకు వచ్చింది. సుమతికి తనకున్నంత వేగిరపాటు కొంచెం కూడా ఉండదా! 


అమ్మాయిలు సాధారణంగా నిదానపరులు కాబట్టి, తనలా నిజంగా నే సుమతి కి వేగిరపాటూ విరహ దాహమూ కలగవేమో! ఎందుకంటే మువ్వలపాలెం నుంచి వచ్చే తన కొలీగ్ ఇచ్చిన సమాచారం ప్రకారం సుమతి ఎల్లప్పుడూ తెగ హడావిడిగా ఉంటుందట. ప్రతిరోజూ మువ్వల గోపాలస్వామి ఆలయ దర్శనం. పిమ్మట భవానీ అమ్మవారి ముందు దేవీ సంకీర్తనం. పదిరోజులకొక మారు తప్పనిసరిగా చెంగల్వ చెరువు నీళ్ళతో ఆలయాల మెట్ల ప్రక్షాళనం. ముఖ్యమైన పండగలప్పుడు ఇరుగు పొరుగు ఆడాళ్ళతో కలసి ఉత్సవ మూర్తులతో బాటు మాడ వీధుల్లో సంచారం చేస్తూ కోలాట ప్రదర్శనం చేయడం-- 


ఇది చాలదని ప్రతి రోజు సాయంత్రమూ వీధి పిల్లలకు హోమ్ వర్క్ చేయించడమూను-- మరి ఇంతటి యమ రద్దీగా పని చేసే అమ్మాయికి తన వంటి విరహ హృదయం గురించి ఆలోచించే వ్యవధి ఎలా ఉంటుంది? అసలామెకు పెళ్లీడుకి వచ్చిందన్న అంశమైనా గుర్తుకు వస్తుందా! సుమతికే కాదు, అప్పటికి ఎవరకైనా సరే— నిండు రూపంతో కదంబ పుష్ప వనంలా అలరారుతుంటే మితి మీరిన ఆత్మవిశ్వాసం తనకు తానుగా ఆవహిస్తుందేమో మరి- ఆపైన గుణవంతురాలన్నపేరు కూడా సముపార్జించుకున్నదాయె-- గాలిపటంలా చీరచెంగుని వ్రేలాడుదీస్తూ ఎగిరిపోదూ! 


ఆ రోజురాత్రి సగం నిద్రలోనే వ్యాసారావు తీర్మానించుకున్నాడు; ఆరు నూరైనా నూరు ఆరైనా తను తన కాబోయే సతీ మణిని చూసి రావాలని-- అలాగని చాటు మాటున నిల్చునో చెరువు గట్టున కూర్చుని తొంగి చూడటమో కాదు. తిన్నగా- సుభద్రను చూడటానికి వెళ్లిన అర్జునుడిలా సరాసరి కాబోయే అత్తామామల ఇంటికే--- 


అనుకున్నప్రకారం వ్యాసారావు స్టాఫ్ యూనియన్ మీటింగు హాజరయి యూనియన్ డిమాండ్లపై చర్చించి నాలుగింటికి సూపర్ వైజర్ నుండి స్పెషల్ పర్మిషన్ తీసుకుని కదలి వెళ్ళటానికి దస్త్రాలు సర్దుకోనారంభించాడు మువ్వలపాలెం వెళ్ళడానికి. ఆ రీతిన ప్రక్క సీటు జూనియర్ అసిస్టేంటుకి టాస్కు అప్పచెప్పుతున్నప్పుడు అక్కడకి ప్యూను వచ్చి చెప్పాడు- తన కోసం ఎవరో తెలిసిన విజిటర్ వచ్చారని. అరగంట సేపట్నించి ఎదురు చూస్తున్నారని.. విజిటర్ అంటే-- అన్నట్టు కనుబొమలెగరేసి చూసాడు వ్యాసారావు. ”ఎవరో లేడీ వచ్చారండి“ అంటూ వెళ్ళిపోయాడతను. 


ఇక బదులివ్వకుండా ట్రావిలింగ్ బ్యాగులో టిఫిన్ బాక్సుని సర్దుకుని దారమ్మట చదువుకోవడానికి తెచ్చుకున్న తెలుగు పత్రికల్ని కుక్కుకొని మేడమెట్లు దిగాడు వ్యాసారావు. అలా దిగుతూ రిసెప్షన్ కొంటర్ వద్దకు చేరేటప్పటికి వెనుక నుంచి ఎవరిదో స్త్రీ స్వరం వినిపించింది- “సారీ వ్యాసరావుగారూ! పని సమయంలో మీకు అంతరాయం కలుగచేసాను. ప్లీజ్! క్షమించండి!”


అతడు వెనక్కి తిరిగి చూసాడు. ఇంకెవరు-- సుమతి! తన స్వప్న సుందరి సుమతి! గద్వాల చేనేత చీర కట్టుకుని పొడవుగా నిండుగా తెలికాంతుల్ని విరజిమ్ముతూ ఎదురు వచ్చింది. తన కళ్లను తనే నమ్మలేక పోయాడు వ్యాసారావు. వెతక బోయిన మల్లె తీగ ఎదురు వచ్చి వాటేసుకున్నట్లనిపించింది. ఊపిరి పీల్చుకోవడానికి క్షణాలు పట్టాయి. అప్పటికి ఏదో ఒకటి అనాలి గనుక- “ఎప్పుడు వచ్చారు సుమతిగారూ! అని అడిగాడు. 


“ప్లీజ్! నన్ను బహువచన ప్రయోగం చేసి పిలవకండి. మన మధ్య ఏమీ లేనట్టు దూరం పెంచకండి” 


“ఇటీజ్ ఓ కే! ఇప్పుడు చెప్పు- ఎప్పుడు నీ ఆగమనం? ముఖ్యంగా నాకు కబురంపితే నేనే వచ్చి కలిసే వాణ్ణిగా!” 


ఆమె మాట్లాడ లేదు. నిదానంగా నడుస్తూ ఎంట్రెన్సు వేపు అడుగులు వేసింది. అతడు కూడా ఆమె ప్రక్కన నడుస్తూనే బదులిచ్చాడు- “నిజం చెప్పాలంట్ నేనిప్పుడు పర్మిషన్ తీసుకుని మీ ఊరికే బయల్దేరాను. ఐ ప్రామిస్”.


 ఆమాటతో ఆమె చప్పున ఆగిపోయింది. చివుక్కున తలతిప్పి చూసింది; విస్మయాత్మకంగా కనురెప్పల్ని అల్లార్చుతూ-- 


“ఔను. నేను నీతో మాట్లాడటానికే మువ్వలపాలెం బయల్దేరాను” 


ఆమె కళ్లు పెద్దవయాయి. అతణ్ణి తేరిపార చూస్తూండిపోయింది. ఆ తరవాత వాళ్ళద్దరి మధ్యా మాటలు కరవయాయి. వ్యాసారావు స్టాఫ్ ఫుడ్ పాయింటు వద్దకు చేరుకుని ఇద్దరికీ బిస్కట్లూ టీలూ ఆర్డరిచ్చాడు. ఆర్టరు ప్రకారం సర్వర్ అందించిన టీలు తీసుకుని ఒకటి సుమతికి అందిచ్చి మరొకటి తను తీసుకుని యధాలాపంగా అడిగాడు వ్యాసారావు- “ఉఁ చెప్పు సుమతీ! ఎందుకింత అర్జంటుగా వచ్చావు— అదీను ఒంటరిగా?”


“నేను చెప్పబోయేది అంత సంతోషకరమైన విషయం కాదేమో! ” 


బిస్కట్లు రెండూ వ్యాసారావు ప్లేటులో ఉంచి టీ మాత్రం చప్పరిస్తూ కనురెప్పలు కదపకుండా చూడసాగింది. అతడు చిన్నగా నవ్వి- “పర్వాలేదు. ఏదైనా చెప్పు. సర్వసన్నధుడనై హరాయించు కుంటాను” 


“నేను చెప్పబోయేది విని మీరు హరాయించుకోలేరేమో! ” 


అతడు చిన్నగా నవ్వి తలవిదిలిస్తూ ఆమె అనుమానాన్ని కొట్టి పడేసాడు పెదవి విప్పకుండానే-- 


“సరే చెప్తాను. మన పెళ్ళి వచ్చే శ్రావణంలో జరగదేమో! ఇంకా చెప్పాలంటే—“ 


“ఇంకా చెప్పాలంటే --” వ్యాసారావు ఆమె నోట వచ్చిన మాటను రెట్టించాడు. 


ఆమె వెంటనే బదులివ్వకుండా కళ్ళు తుడుచు కుంది. నిదానంగా చూస్తూ అతడి చేతి పైన తన చేతి నుంచి అంది- “దేనికైనా పెట్టి పుట్టాలంటారు. పూర్వజన్మ సుకృతం ఉంటాలంటారు. మనిద్దరి పెళ్ళీ జరగదని తోస్తూంది“ 


“అలా బోడిగుండుని చూపిస్తున్నట్టు చెప్తే ఎలా? ఎమోషనల్ కాకుండా నిదానంగా చెప్తేకదా విషయం తెలిసేది! ”


“గోడు చెప్పుకోవడానికి మీరు కాక మరెవ్వరున్నారని— మా ఇంటి పరిస్థితులు తారుమారాయి”

అంటే- అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసాడతడు. 


“ఆర్థిక పరిస్థితులు వికటించాయి వ్యాసారావుగారూ! చెప్తే మీరు నమ్మగలరో నమ్మలేరో నాకు తెలియదండీ! ” 


“మరి నీ ధోరణిలోనే అడుగుతున్నాను బదులియ్యి- నీవు చెప్పేది నేను నమ్మకపోతే మరింకెవరు నమ్మగలరు?” 


“సారీ! ఎవరితో మాట్లాడుతున్నానో గ్రహించకుండా ఏదేదో వాగేస్తున్నాను. ఇప్పుడు మా ఇంట్లో లేమి చోటు చేసుకుంది. ఆనాడు మీ వాళ్ళకు ఇచ్చిన మాట ప్రకారం నాన్న మాకున్న మూడెకరాల మాగాణి అమ్మి కొంత మొత్తంతో అక్కయ్య పెళ్లికోసం చేసిన అప్పు తీర్చేసి మిగతాది నా పెండ్లి లాంఛనాల కోసం అట్టే పెట్టారు. కాని అంతా హారతి కర్పూరంలా హరించుకు పోయింది” 


“ఎలా?” గొంతెత్తి అడక్కుండా ఉండలేకపాయాడు వ్యాసారావు. 


“అదీ చెప్తాను. సాధారణంగా మనిషికి దెబ్బ తగలదు. మరి తగిలిందంటే దెబ్బపైన దెబ్బ తగులుతూనే ఉంటుంది. మొదట ఊళ్ళో బామ్మ మంచాన పడ్డది. బామ్మను వ్యానులో రప్పించి వైద్యం ఇప్పించ సాగారు నాన్న. బామ్మ వైద్యం ఇంకా పూర్తి కాకుండానే దురదృష్టం వెంటాడి అమ్మ మంచాన పడ్డది” 


“అత్తయ్యకు ఏమైంది?” ఆతృతగా అడిగాడు వ్యాసారావు. 


“అమ్మకు శుక్లాలని- వెంటనే ఆపరేషన్ చేయాల్సుందని కన్ను డాక్టర్ చెప్తే అమ్మను కంటి ఆస్పత్రిలో చేర్పించాం. ముందే చెప్పాగా— మాకు దురదృష్టం వెంటాడుతూందని. అమ్మకు చూపు పూర్తిగా రాలేదు. వైద్యం ఇంకా ఇప్పిస్తున్నాం. ” 


“అదేమిటి సుమతీ, అంత సాధారణంగా చెప్తున్నావు కంటి చూపు దెబ్బతిందని! అసలేమైంది? అత్తయ్యకు ఎలా చూపు దెబ్బ తింది? ఇవన్నీ చెప్పకపోతే ఎలా తెలుస్తుంది?”


సుమతి క్షణం పాటు ఆగింది. కాబోయే అత్తగారి పట్ల అతడు చూపిస్తూన్న అక్కర ఆమెకు ఊరటనిచ్చింది. “చెప్తానండి. ఆపరేషన్ థియేటర్ చూసుకోవడమంటే మాటలు కాదు. అందులో శుచీ శుభ్రత తొణికిసలాడాలి. నెలకొక్కసారైనా ఫ్యూమిగేషన్ చేయాలి. చిన్నదీ పెద్దదీ తేడాలేకుండా ప్రతి థియేటర్ లోనూ బ్యాక్టీరియా ఫిల్టర్ లు ఉంచాలి. ఫ్లోరింగూ గోడల నిర్మాణాల విషయంలోనూ ప్రమాణాలు పాటించాలి. ముఖ్యంగా వైద్యులు నర్సమ్మలు వీటిని తప్పని సరిగా పాటించాలి. 


ఇక విషయానికి వస్తాను. అమ్మ విషయంలో మాకు తేలిందేమంటే అమ్మకళ్ళకు ఇన్ ఫెక్షన్ సోకింది. శస్త్ర చికిత్స చేసే సమయంలో కంటి శుభ్రత కోసం రింగర్ లాక్టిటేట్ అనే ద్రావణం వాడతారు. ఇందులో ప్రమాదకరమైన బ్యాక్టీరియా- అంటే క్లెబ్సియల్లా అనే బ్యాక్టీరయా ఉండటం వల్లనే అమ్మ కంటికి ప్రమాదం సంభవించి ఉంటుంది. ఇప్పటికే చాలా ఖర్చు ఐపోయిందని— కావున అమ్మకు చేయాల్సిన ట్రీట్మెంటు వ్యవహారాన్ని ఇకపైన ఆస్పత్రి మేనేజి మెంటే చూసుకోవాలని మిమోరాండం ఇచ్చాం. 


ఆస్పత్రి మేనేజిమెంట్ ఇంకా స్పందించలేదు. కాని ఈ లోపల ఇంట్లో ఉన్నదంతా కరిగిపోయింది. నన్ను నమ్మండి. నేనంతా నిజమే చెప్పాను” 


ఆ మాటకతను నవ్వి సుమతి చేతిని తన చేతిలోకి తీసుకుని అన్నాడు- “నువ్వెందుకు నాతో అబధ్ధం చేప్తావు. ఐనా- మొత్తానికి కంటి జబ్బు విషయంలో పెద్దపాటి రిసెర్చే చేసావన్నమాట. ఇక మన విషయానికి వస్తాను సూటిగా-- మన కాబోయే పెళ్లి విషయంలో రెండు మైనస్ పాయింట్లు ఒకటి ప్లస్ పాయింటుంది. ఇది నీవు తెలుసుకోవడం అత్యవసరం. 


నాకేమీ లేకండా నన్ను పెండ్లి పీటలపైన కూర్చోబెట్టడం వికారంగా ఉండ వచ్చు. రెండవది- మీ అమ్మానాన్నలిచ్చిన మాట ప్రకారం ఏమీ చేయలేదంటే మా వాళ్ళు విసుక్కుంటారు. అమ్మ దెప్పి పొడుస్తుంది. మీరందరూ కూడబల్కుకునే మొండి చేయి చూపించి దగా చేస్తున్నారనుకుంటారు. ఇక నీవేపున్న ప్లస్ పాయింటు- నువ్వంటే ఇంట్లో వాళ్ళందరకూ ఉన్న అభిమానం. నువ్వు కోడలుపిల్లగా ఇంటికి రావాలని వేగిరపడుతూంది అమ్మ. అంతేకాదు, నీ రాక కోసం యెదురు చూస్తూ మాచెల్లి పూజా గదిని విస్తరించనారంభించింది. కాబట్టి దీనికి ఒకే ఒక మార్గం ఉంది”


“చెప్పండి“ ఆదుర్దాగా అడిగింది సుమతి. 


“నన్ను నమ్మి నా మాటప్రకారం నడుచుకోవడం సెంటిమెంట్సుకి మరీ ప్రాముఖ్యత ఇవ్వకుండా—” 


ఆమె వెంటనే స్పందించింది- “మరిప్పుడు మిమ్మల్ని నమ్మకుండా ఇంకెవర్ని నమ్మగలను!”

అంటూ అతడి చేతుల్ని తన చెంపలకు ఆన్చింది.


అతడు సన్నపాటి నిట్టూర్పు విడుస్తూ ఆమెను ప్రేమగా పొదవి పట్టుకుని కాబోయే శుభకార్యానికి అప్పటికప్పుడు పథక రచన చేసాడు. 


చేసుకున్న పథక రచన ప్రకారం ఇద్దరూ సూర్యాస్తమయానికి ముందే సుమో జీపులో గజపతి నగరం చేరుకుని కార్యాలయ సహోద్యోగుల సహకారంతో శివాలయంలో పూజారి ఆశీర్వచనాలతో వివాహం చేసుకుని అదే ఊపున పధ్ధతి ప్రకారం రిజష్టర్ ఆఫీసులో వివాహ తేదీని నమోదు పూర్తి చేసుకుని పూలమాలలతో వ్యాసారావు ఇంటి గుమ్మం ముందుకు నిల్చున్నారు వధూవరులిద్దరూ. 


ఆ వేడుక చూడటానికి వీధి ముత్తయిదువులందరూ ఇంటి చుట్టూ గుమికూడారు ముసి ముసి నవ్వులు కురిపిస్తూ-- అక్కడకి మరి కాసేపట్లో గాంధర్వులు కూడా చేరిపోతారేమో వెండి మబ్బుల వాహనాలపైన తేలుతూ—పూల వర్షం కురిపిస్తూ-- 


 శుభం

  

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.






48 views1 comment

1 Comment


mk kumar
mk kumar
Nov 21

ఈ కథ, వ్యక్తిగత బాధ్యతలను, కుటుంబ విలువలతో ముడిపెట్టి చూపిస్తుంది. మనస్పూర్తిగా నిజాయితీతో ప్రేమించగలిగితే, కుటుంబ విభేదాలు, ఆర్థిక సమస్యలతో పోరాడగలమని, జీవితంలో నిజమైన సంతోషం పొందగలమని కథ బోధిస్తుంది.


ఈ కథలో పాండ్రంకి సుబ్రమణి గారు చక్కటి భావప్రకటనతో, గ్రామీణ వాతావరణం, మధ్యతరగతి కుటుంబ బాధ్యతలను చక్కగా చిత్రీకరించారు.

Like
bottom of page