top of page

ఉచ్చు

Writer's picture: Divakarla PadmavathiDivakarla Padmavathi

#PadmavathiDivakarla, #పద్మావతిదివాకర్ల, #Uchhu, #ఉచ్చు, #TeluguCrimeThriller


Ucchu - New Telugu Story Written By - Padmavathi Divakarla

Published In manatelugukathalu.com On 23/02/2025

ఉచ్చు - తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



'అన్నపూర్ణ కాఫీ హోటల్' నుండి బయటపడిన జయరాజ్ అటూ ఇటూ ఓ సారి చూసి, రోడ్డు మీదకు వచ్చాడు. బయట ఉన్న కిళ్ళీ దుకాణంలో సిగరెట్ కొని అక్కడే ముట్టించి, పొగ గాల్లోకి వదులుతూ కొద్దిసేపు గడిపాడు. ఎవరికోసమో ఎదురు చూస్తూన్నట్లు ఉంది అతని వాలకం. మధ్యమధ్య రోడ్డుకు ఇరువైపులా చూస్తున్నాడు. అయిదు నిమిషాల తర్వాత జయరాజ్ నిరీక్షణ ఫలించింది. అతని కళ్ళు మెరిసాయి. అతనికి కావలసిన వ్యక్తి కొద్ది దూరంలో కనిపించాడు. అంతే, కాలుతున్న సిగరెట్ కిందపడేసి, కాలితో నొక్కి గబగబ అడుగులు వేసుకుంటూ ముందుకు నడిచాడు. 


కొద్దిదూరంలో రోడ్డుకి మరోవైపు నడుచుకుంటూ పోతున్న నీలం రంగు టీ షర్ట్ ధరించిన వ్యక్తిపై జయరాజ్ దృష్టి కేంద్రీకృతమై ఉంది. అతను తన దృష్టిపధం నుండి తప్పిపోకుండా జాగ్రత్త పడుతూ గబగబా అడులేస్తున్నాడు జయరాజ్. హఠాత్తుగా ఆ వ్యక్తి ఆగాడు. వెనక్కు తిరిగి జయరాజ్ వైపు చూసి పలకరింపుగా నవ్వాడు. జయరాజ్ కూడా చిరునవ్వుతో ఆ వ్యక్తిని పలకరించాడు. రోడ్డు క్రాస్ చేసి ఆ వ్యక్తిని సమీపించాడు. పరీక్షగా అతనివైపు చూసాడు. చెదిరిన క్రాఫ్, మాసిన గడ్డంతో ఉన్న అతనే తనకు కావలసిన వ్యక్తి అని నిర్ధారించుకున్నాడు. అతనికి మాత్రమే వినిపించేలా కోడ్ వర్డ్ చెప్పాడు. 


"డబ్బులు తెచ్చావా?" అని అడిగాడు. 


తెచ్చానన్నట్లు తలూపాడు జయరాజ్. 


ఆ వ్యక్తి నవ్వుతూ, "పద! సరుకు తీసుకెళ్దువుగాని. " అని ముందుకు నడిచాడు. జయరాజ్ అతన్ని అనుసరించాడు. 


ఇద్దరూ పావుగంట సేపు సందులూ, గొందులూ తిరిగారు. అతనితో మాటలాడటానికి జయరాజ్ ఎంత ప్రయత్నించినా పెదవి విప్పలేదు ఆ వ్యక్తి మౌనవ్రతం పాటించేవాడిలా. తనతో మాట్లాడటం ఆ వ్యక్తికి ఇష్టంలేదని గుర్తించాడు జయరాజ్. 


చివరికి, "ఇంకెంత దూరం?" అనడిగాడు చిరాగ్గా. 


మౌనవ్రతం వీడాడా వ్యక్తి. 

"ఎంతో దూరం లేదు వచ్చేసాం. " అంటూ ఆ సందు చివరునున్న పెంకుటిల్లు దగ్గర ఆగి, ఫోన్ ఎత్తి ఎవరితోనో మాట్లాడాడు. 


ఆ పరిసరాలు వింతగా చూస్తూ నిలబడ్డాడు జయరాజ్. ఓ నిమిషం తర్వాత, కొద్ది దూరంలో నిలబడిన జయరాజ్ వైపు తిరిగి, "పద లోపలికి. " అన్నాడు. 


మరుక్షణం ఆ పెంకుటిల్లు ముందు తలుపు తెరుచుకుంది. సగం తలుపు తెరిచి, తలమాత్రం బయటకు పెట్టాడో పొడుగాటి గడ్డం కలిగిన వ్యక్తి. 


నీలం టీషర్ట్ వ్యక్తిని చూడగానే పలకరింపుగా నవ్వుతూ, "ఓహ్.. విక్టర్! రా!" అంటూ తలుపు పూర్తిగా తెరిచాడు. అతని పక్కనున్న జయరాజ్ వైపు ప్రశ్నార్థకంగా చూసాడు. 


"మన కష్టమరే! సరుకు కావాలని వెంటపడ్డాడు. " అని లోపలకి నడిచాడు విక్టర్. జయరాజ్ అన్నీ వింతగా గమనిస్తూ లోపలికి అడుగుపెట్టాడు. 


ముందుగది దాటి లోపలికి ప్రవేశించిన జయరాజ్ ఆ గదిలో ఉన్నవారిని చూసి ఆశ్చర్యపోయాడు. దాదాపు యాభైమంది ఉన్నారా గదిలో. అందరూ పాతికేళ్ళ లోపువాళ్ళే. బహుశా కాలేజీ, స్కూల్లో చదువుతున్నవాళ్ళై ఉంటారనుకున్నాడు. సోఫాల్లో, కింద నేల మీద, కుర్చీల్లో ఎక్కడపడితే అక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళందరూ. ఎవరి మొహాల్లోనూ కళాకాంతులు లేవు. కళ్ళు నిర్జీవంగా ఉన్నాయి. ఏదో తెలియని మత్తులో జోగుతున్నారు వాళ్ళు. పరిసరాలు గమనించే స్థితిలో లేరు వాళ్ళెవరూ. ఏదో వింతలోకంలో ఉన్నట్లున్నారు. 


"సరుకు అడిగావుకదా, నిలబడిపోయావేం! రా లోపలికి!" అన్న విక్టర్ మాటలు విని ఉలిక్కిపడ్డాడు జయరాజ్. 


విక్టర్ వెనుకే పక్కనున్న మరో గదిలోకి ప్రవేశించాడు. 


కోరమీసాలు దువ్వుతూ, చేతిలో ఉన్న విస్కీ సేవిస్తూ కనిపించాడు ఓ దృఢమైన వ్యక్తి. బనియన్, లుంగీ ధరించి సోఫాలో చేరబడి ఉన్నఆ వ్యక్తి చూడటానికి భయంకరంగా ఉన్నాడు. చేతిలో కాలుతున్న సిగరెట్ ఉంది. తారుడబ్బాలాంటి నల్లనివాడొకడు అతనికి మాలీష్ చేస్తున్నాడు. అతనికి ఇరుపక్కలా ఇద్దరు వస్తాదులు నిలబడి ఉన్నారు.


"బాస్! మరో కొత్త కష్టమర్ని తీసుకొచ్చాను. " అన్నాడు జయరాజ్ ఆ వ్యక్తికి సలాం చేస్తూ. 

జయరాజ్ ని తీక్షణంగా చూసాడు ఆ వ్యక్తి. ఆ చూపులకు భయం వేసింది జయరాజ్ కి. కంగారు పడ్డాడు. బెరుగ్గా ఆ వ్యక్తివైపు చూసాడు. 


"మనగుట్టు బయటపెట్టడు కదా? బాగా వాకబు చేసావా? నమ్మదగిన వాడేనా, సమస్యలేమీ రావు కదా?" విక్టర్ని చూస్తూ అడిగాడు. 


"అంతా వాకబు చేసే ఇక్కడికి తీసుకొచ్చాను బాస్!" అనగానే కుడివైపు నిలబడి ఉన్న వస్తాదు కేసి తిరిగి చూసి సైగ చేసాడు ఆ వ్యక్తి. జయరాజ్ ని బయటకు తీసుకెళ్ళి చేతిలో 'సరుకు' పెట్టి డబ్బులు తీసుకొని లెక్కపెట్టసాగాడు ఆ వ్యక్తి. 


తనకు అందిన సరుకు తీసుకొని జయరాజ్ జేబులో పెట్టుకున్నాడో లేదో, ముందు గదిలో ఏదో కలకలం వినిపించింది. వెంటనే అప్రమత్తమయ్యారు అక్కడడక్కడ ఉన్న వస్తాదులు. 

హఠాత్తుగా అరుపులు, కేకలతో మారుమోగిపోయిందా ప్రదేశం. ఏం జరిగిందో తెలుసుకోవాలని బయటకు వచ్చిన 'బాస్', అతని బాడీ గార్డులు నిశ్చేష్టులైయ్యారు. 


ఎదురుగుండా విజిల్స్ వేస్తూ దూసుకొస్తున్న డజనుమంది పోలీసుల్ని ప్రతిఘటిస్తున్నారు అక్కడ ఉన్న వస్తాదులు. చేతిలో ఉన్న లాఠీ కర్రలతో చితకతన్ని వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. 


ఊహాతీతంగా జరిగిన ఈ దాడికి ఆశ్చర్యపోయిన బాస్, వెంటనే పారిపోవడానికి పెరటివైపు దారితీసాడు. అయితే ఆ అవకాశం అతనికి లభించకుండా పెరట్లోంచి గోడదూకి మరో పదిమంది పోలీసులు అతన్ని చుట్టుముట్టారు. మొత్తం అక్కడున్న యావన్మందినీ వ్యాన్ ఎక్కించారు పోలీసులు. జయరాజ్ ఏం చెప్తున్నా వినిపించుకోకుండా అతన్ని కూడా వ్యాన్ ఎక్కించారు పోలీసులు. 


"అందరూ దొరికిపోయారా? ఎవరూ తప్పించుకోలేదు కదా!" అన్నాడు ఇన్సిపెక్టర్ ప్రశాంత్ కానిస్టేబుల్ నుద్దేశించి. 


"అందర్నీ లోపలేసాం సార్! యాభైమంది దాకా స్టూడెంట్స్ ఉంటారు. ఈ గ్యాంగ్ బాస్ యాకుబ్, అతని కిందపనిచేసే అరడజను మందీ పట్టుబడ్డారు. " జవాబిచ్చాడు. 


మాదకద్రవ్యాల సరఫరా కేంద్రంపై దాడి చేసిన ఆ కేసులో ఆ ప్రాంతానికి ప్రతినిధి అయిన యాకూబ్ తన అనుచరులతో పట్టుబడ్డాడు. అక్కడ వెతగ్గా దాదాపు కోటి రూపాయల విలువగల హిరాయిన్, కొకైన్ వంటి మాదకద్రవ్యాలు బయటపడ్డాయి. అందర్నీ సెల్లో వేసాడు ఇన్సిపెక్టర్ ప్రశాంత్. యాకుబ్ ని ఇంటరాగేట్ చేసేసరికి మరో ముగ్గురు అతని అనుచరులు పట్టుబడ్డారు, కానీ అతనికి ఎక్కణ్ణుంచి ఆ మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయో మాత్రం చెప్పలేకపోయాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ యాకూబ్ ని పట్టుకున్నందుకు ఇన్సిపెక్టర్ ప్రశాంత్ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నాడు. 

 ******

హోటల్ మోతీలో ఓ మూల కూర్చున్నాడు మీనన్. నవ్వుతూ వచ్చి విష్ చేసాడు బేరర్. అతని చేతిలో ఉన్న మెనూ అందుకొని తిరగేసాడు మీనన్. రెండు నిమిషాల తర్వాత, కేవలం కాఫీ మాత్రమే ఆర్డర్ చేసి నలువైపులా దృష్టి సారించాడు. అతనికి కావలసిన వ్యక్తి కనిపించలేదు. బేరర్ తెచ్చిన కాఫీ నెమ్మదిగా తాగుతూ ఓపిగ్గా వేచి ఉన్నాడు. వాచీ చూసుకున్నాడు, పదిగంటలు దాటి పది నిమిషాలైంది. ఠంచనుగా పది గంటలకు వస్తానన్న ఆ వ్యక్తి ఇంకా రాకపోవడతో కొద్దిగా అసహనానికి గురైయ్యాడు మీనన్. 


సరిగ్గా అప్పుడే హోటల్లోకి ప్రవేశించాడు ఓ వ్యక్తి. తెల్లటి చారలున్న ఫుల్ షర్ట్, నల్లటి ఫ్యాంట్ ధరించాడు. చిన్న పిల్లి గడ్డం ఉంది. లోపలికి వచ్చిన ఆ వ్యక్తి నలుమూలలా చూసాడు. అతని కోసమే ఆతృతగా ఎదురు చూస్తున్న మీనన్ కళ్ళు మెరిసాయి. కుడి చెయ్యి పైకెత్తి అతనివైపు చూపిస్తూ ఆడించాడు. మీనన్ ని చూడగానే ఆ పిల్లి గడ్డం వ్యక్తి పలకరింపుగా నవ్వి అతని వద్దకు వచ్చి, ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. దూరంగా నిలబడిన బేరర్ని పిలిచి మరో కాఫీ ఆర్డర్ చేసాడు మీనన్. కాఫీ కప్పు తెచ్చి టేబుల్ పై పెట్టి వాళ్ళకి దూరంగా నిలబడ్డాడు బేరర్. 


"ఇంతాలస్యం అయిందేం!" అన్నాడు మీనన్. 


"ఎందరి కళ్ళో కప్పి రావాలి మరి. సురక్షితంగా సరుకు చేరాలి ముందు. " అన్నాడా వ్యక్తి చిన్నగా నవ్వుతూ. 


 అక్కడే తచ్చాడుతున్న బేరర్ వైపు అనుమానంగా చూసి, "ఇక్కడ నీ మీద ఎవరికీ అనుమానం రాలేదు కదా?" మళ్ళీ అన్నాడా వ్యక్తి.. 


"లేదు. ”జవాబిచ్చాడు మీనన్. 


క్షణాల్లో ఇద్దరిమధ్యా 'సరుకు' మార్పిడి జరిగిపోయింది. మరుక్షణం ఒకరికొకరు తెలియనట్లే నటిస్తూ హోటల్ బయటకు వచ్చి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దర్నీ దూరం నుండి గమనిస్తున్న బేరర్ తన జేబులోంచి సెల్ తీసి ఎవరికో ఫోన్ చేసాడు. 


ఇద్దరూ చెరో పది అడుగులు వేసారో లేదో, అప్పటివరకూ ఎక్కడో దాగి ఉన్న పోలీసులు వాళ్ళను చుట్టుముట్టారు. ప్రతిఘటించడానికి వాళ్ళకి శక్తి యుక్తులు చాల్లేదు. చేతిలో ఉన్న సరుకుతో పోలీసులకు చిక్కిపోయారు వాళ్ళిద్దరూ. 


"తిన్నగా స్టేషన్ కి తీసుకెళ్ళండి వాళ్ళని. తగిన మర్యాదలు చేస్తే, మరింతమంది మన చేతులకు చిక్కుతారు. " అని చెప్పి వెనక్కు తిరిగి హోటల్లోకి ప్రవేశించాడు ఇన్సిపెక్టర్ ప్రశాంత్. 


ఇద్దర్నీ పోలీస్ వ్యాన్లో పడేసిన తర్వాత, టూ టౌన్ పోలీస్ స్టేషన్ వైపు కదిలిందా వ్యాన్. రెండు నిమిషాల్లో హోటల్ నుండి తిరిగి వచ్చిన ఇన్సిపెక్టర్ ప్రశాంత్ ఎక్కిన జీపు కూడా టూటౌన్ పోలీస్ స్టేషన్ వైపు కదిలింది. 

 ******

రాత్రి పదకొండు గంటలు. నగరమంతా నిద్రపోవడానికి ఉపక్రమిస్తున్నవేళ, నగరానికి కాస్త దూరంగా ఉన్న 'స్వీట్ సిక్స్ టీన్' పబ్ మాత్రం అప్పుడే మేల్కొంది. విలాసవంతమైన ఆ పబ్ బయట చీకట్లు పాలదోలడానికి చిన్న లైట్లు వెలుగుతున్నా, లోపల మాత్రం కళ్ళు జిగేలు మనిపించే వెలుగులు విరజిమ్మే లైట్లు ఏర్పాటు చెయ్యబడ్డాయి. అందర్నీ ఆ పబ్ లోకి అనుమతించరు. సాదాసీదా వాళ్ళెవరూ అందులోకి ప్రవేశించలేరు. సభ్యులకు మాత్రమే అందులో ప్రవేశం ఉంది. 


కొత్తగా ఎవరైనా సభ్యుడిగా చేరదలిస్తే, ఆ వ్యక్తి పూర్వాపరాలు పూర్తిగా విచారించిన తర్వాతే అనుమతిస్తారు. ఉదయం పెద్ద మనుషులుగా చెలమణీ అయ్యే చాలామంది రాత్రివేళ మాత్రం ఆ పబ్ లో చిన్న వాళ్ళైపోతారు. అందరూ తమని తాము 'స్వీట్ సిక్స్ టీన్ ' గా భావించుకుంటారు. ఓ పక్క జూదం జోరుగా సాగుతూంటే, మరో పక్క తాగుతూ తూలుతూ వెస్టర్న్ మూజిక్ కి అనుగుణంగా నృత్యాలు చేస్తూ అంతులేని ఆనందంలో మునిగి తేలుతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఆడమగా, చిన్నపెద్దా తేడాలేమీ లేవక్కడ. స్టేజి మీద ఎవరో నర్తకి నృత్యం చేస్తూంటే, కొందరు ఆ నృత్యాన్ని చూస్తూ మందులోని మజాని ఆస్వాదిస్తున్నారు. మధ్యమధ్య ఆ నర్తకి వీక్షకుల మధ్యకు వచ్చి వాళ్ళ హుషారు పెంచుతోంది. కొంతమంది చప్పట్లు చరుస్తూ చిందులు కూడా వేస్తున్నారు. 


"హేయ్ రీటా!" అంటూ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో కల్సి డాన్స్ చేసాడో యువకుడు. అది చూసి మరి కొంతమంది ఆమెతో నృత్యం చెయ్యడానికి తహతహలాడసాగారు. 


ఆ పబ్ లోనే మరో రహస్యగది ఉంది. అందులోకి అందర్నీ అనుమతించరు. నాజుగ్గా, వయ్యారంగా నడుచుకుంటూ అక్కడికి వచ్చింది లైలా. పాతికేళ్ళుంటాయామెకు. పచ్చటి శరీర ఛాయతో మెరిసిపోతోందామె. ఆ గది బయట నిలబడి ఉన్న సెక్యురిటీ గార్డ్ కి తన కార్డు చూపించింది లైలా. 


ఆమె అందించిన కార్డునోసారి, ఆమె వైపోసారి మార్చిమార్చి చూసి, సెల్యూట్ చేస్తూ తలుపు తెరిచాడు ఆ గార్డ్. విశాలంగా ఉన్న ఆ హాల్లోకి ప్రవేశించగానే వింత పరిమళం సోకింది ఆమె నాసికకు. లోపల లైట్లు చిన్నగా వెలుగుతున్నాయి. ఆ మసక వెలుతురుకు అమె కళ్ళు అలవాటు పడటానికి రెండు క్షణాలు పట్టింది. ఆ హాల్లో ఉన్నవాళ్ళవంక తేరిపార చూసింది లైలా. అందరూ ఏదో తెలియని మైకంలో ఉన్నారు. వింత ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. అదంతా డ్రగ్స్ మహిమ ఆమెకు బాగా తెలుసు. ఆమె కూడా అందుకోసమే అక్కడకు వచ్చింది మరి! 


"మేడం! ఇదిగో మీకు కావలసి సరుకు. " అని చెప్పి అమె చేతిలో ఓ చిన్న సైజ్ ప్యాకెట్ పెట్టాడు. 


భుజానికున్న హ్యండ్ బాగ్ తెరిచి, అందులోంచి నోట్లకట్ట తీస్తూండగా బయటున్న సెక్యూరిటీ గార్డుని తోసుకుంటూ లోపలికి ప్రవేశించారు కొంతమంది. సాదా దుస్తుల్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రివాల్వర్లు ఆ మసక వెలుతురులో మెరుస్తున్నాయి. వెంటనే నాలుగు మూలల నుండి నలుగురు బౌన్సర్లు వాళ్ళవైపు దూసుకొచ్చారు. అయితే బయట నుండి వచ్చిన ఆ పది మందీ క్షణాల్లో వాళ్ళను మట్టి కరిపించారు. సాదా దుస్తులతో వచ్చిన ఆ వ్యక్తులు పోలీసులని వాళ్ళకి అర్ధమైంది. పోలీసు దెబ్బలకు కిక్కురుమనకుండా ఆ నలుగురు వస్తాదులు లొంగిపోయారు. మైకంలో మునిగి ఉన్న అక్కడున్నవాళ్ళు సైతం ఆ ఫైటింగ్ చూస్తూ ఉండిపోయారు. తమ వద్ద ఉన్న ప్లాస్టిక్ తాళ్ళతో ఆ నలుగుర్నీ, సెక్యూరిటీ గార్డుని కట్టేసారు వాళ్ళు. 


అక్కడ జరుగుతున్నదంతా చూసిన తర్వాత భయంభయంగా బయటకు జారుకోబోయింది లైలా. 


"ఆగు! ఎక్కడికి పోతావు? ఇక్కణ్ణుంచి ఒక్కరు కూడా బయటకు పోవడానికి వీల్లేదు. " అన్నాడు ఆ ఆగంతుకుల్లో ఒకడు ఆమెవైపు రివాల్వర్ గురిపెట్టి. 


సరిగ్గా అప్పుడే ఆ పబ్ లో ఒక్కసారి కలకలం రేగింది. అక్కడి వాతావరణం గందరగోళంగా మారింది. బయట ఆగిన వ్యాను దిగి, బిలబిలా పోలీసులు ఆ పబ్ లోపలకి ప్రవేశించారు. 

"పోలీసులు, పోలీసులు!" అన్న గుసగుసలు వ్యాపించాయి. 


అక్కణ్ణుంచి తప్పించుకోవడానికి పెద్ద మనుషులుగా చాలామణి అవుతున్న వాళ్ళు తమ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక్కసారిగా చుట్టుముట్టిన పోలీసులతో వారి శ్రమ వృధా అయింది. తమ ముఖం దాచుకోవడానికి చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయి. 


ఒక్క అరగంటలోనే అక్కడి సిబ్బంది, మేనేజర్ తో సహా అందరూ పోలీసులకు లొంగిపోయారు. డ్రగ్స్ నిషాలో దొరికిన వ్యక్తులతో పాటు అందర్నీ పోలీసులు వ్యానుల్లోకి ఎక్కించారు. కేజీలకొద్దీ మాదకద్రవ్యాలు దొరికాయి అక్కడ. టూటౌన్ పోలీస్ స్టేషన్ వైపు కదిలాయా వ్యాన్లు. 


సాదా దుస్తుల్లో ఉన్న ఇన్సిపెక్టర్ ప్రశాంత్ పబ్ కి దూరంగా పార్క్ చెయ్యబడి ఉన్న జీపెక్కాడు. 


ఈ హడావుడిలో మెల్లగా తప్పించుకొని తన స్కూటీ ఎక్కబోయింది లైలా. అయితే అది గమనించాడు ఇన్సిపెక్టర్ ప్రశాంత్. వెంటనే జీపు దిగి ఆమెను ఆపాడు. 


"అంతా చేసి చివరకు తప్పించుకుందామని అనుకుంటున్నావా? ఏం పోలీసులంటే తమాషాగా ఉందా? పోలీసులంటే జోకర్లనుకున్నావా? పద పోలీసు స్టేషన్ కి. జీపెక్కు. " అన్నాడు ఆమెవైపు సీరియస్ గా చూస్తూ. 


"ఇంక చాలు గురువుగారూ! జయరాజ్ వేషం వేయించారు ఒప్పుకున్నాను, ఆ తర్వాత హోటల్ మోతీలో బట్లర్ వేషానికీ సరేనన్నాను. చివరకు లైలా వేషానిక్కూడా నేను కాక ఇంకెవరూ మీకు దొరకలేదా?" తలకున్న విగ్గు ఊడబెరికి ఇన్సిపెక్టర్ ప్రశాంత్ చేతిలో పెట్టాడు కానిస్టేబులు కనకాచలం విసూరుగా. 


నవ్వాడు ఇన్సిపెక్టర్ ప్రశాంత్. 


"మొదటి రెండు వేషాలకూ ఇంకెవరైనా సరే పనికివస్తారు. లైలా వేషానికి మాత్రం నువ్వు సరిగ్గా సరిపోయావు! ట్రై చేస్తే జబర్దస్త్ ప్రోగ్రాంలో నీకు తప్పకుండా ఛాన్సు వస్తుంది. " అంటూ లైలా.. అదే కనకాచలం బుగ్గలు గిల్లాడు ప్రశాంత్. 


"చాల్లెండీ సార్! మీ సరసమూ మీరూను! ఇదే వేషంలో ఈ రాత్రివేళలో స్కూటీలో వెళ్తే ప్రమాదమే! ఎందుకైనా మంచిది జీపెక్కేస్తా!" అని స్కూటిని అక్కడే వదిలి జీపెక్కాడు కనకాచలం. 


నగరంలోని డ్రగ్స్ మాఫియాని పట్టుకొన్నందుకు ఇన్సిపెక్టర్ ప్రశాంత్ ని అభినందించాడు పోలీస్ కమీషనర్. అతన్ని ఘనంగా సన్మానించారు. పట్టుబడినవారిని విచారిస్తే, పెద్దపెద్ద వాళ్ళ గుట్లు తెలిసాయి. సాక్ష్యాధారాలతో అందరిపైనా కేసు నమోదు చేసారు. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ రాకెట్లను వెలికితీసిన ఇన్సిపెక్టర్ ప్రశాంత్ గురించి అన్ని టివి ఛానల్స్ లోనూ వార్తలు ప్రసారమయ్యాయి. అతనిపై ప్రశంశలు వెల్లువెత్తాయి. 


"నాకు లభించిన ఈ సత్కారాలన్నీ నీకే చెందుతాయి. నీ సహాయం లేకుంటే నేను డ్రగ్స్ ముఠాల్ని పట్టుకోలేక పోయేవాణ్ణి. నీ చాకచక్యం వలనే వాళ్ళు ఉచ్చులో బిగుసుకున్నారు. నీ ప్రమోషన్ కోసం కమీషనర్ గారికి రికమెండ్ చేస్తా!" అన్నాడు ఇన్సిపెక్టర్ ప్రశాంత్ కనకాచలంతో. 


"ఏది ఏమైనా లైలా వేషం మాత్రం మరి వెయ్యను గాక వెయ్యను. " అన్నాడు కనకాచాలం బుంగమూతి పెడ్తూ. 


బిగ్గరగా నవ్వేసాడు ఇన్సిపెక్టర్ ప్రశాంత్. 


సమాప్తం


పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:


పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.


 
 
 

1 Comment


mk kumar
mk kumar
4 days ago

కథ ప్రారంభంలో ‘అన్నపూర్ణ కాఫీ హోటల్’ వాతావరణాన్ని చూపిస్తూ, పాత్రలను నెమ్మదిగా పరిచయం చేస్తుంది. రోడ్డుపై ఎదురు చూస్తున్న వ్యక్తి సిగరెట్ వెలిగించడం వంటి సన్నివేశాలు వాస్తవికంగా అనిపిస్తాయి. జయరాజ్ అనే పాత్ర మిస్టీరియస్‌గా ఉండి, అతను ఏ పాత్రలో ఉన్నాడో స్పష్టంగా తెలియదు. నీలం రంగు టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి అనుమానాస్పదంగా కనిపిస్తూ, అతని ప్రవర్తన కథలో కీలకమైన మలుపులకు దారి తీస్తుంది. యాకూబ్ ప్రధాన నేరస్తుడిగా పరిచయమవుతాడు, అతను మాదకద్రవ్యాల ముఠా నాయకుడిగా చూపించబడ్డాడు. కథ సస్పెన్స్, ఉత్కంఠతో నడుస్తూ, చివరికి పోలీసుల దాడితో మలుపుతిరుగుతుంది. ఇది సమాజంలోని నేరచర్యలను బయటపెట్టే విధంగా సాగి, మంచి చెడుపై విజయం సాధిస్తుందనే అంశాన్ని హైలైట్ చేస్తుంది. అయితే, జయరాజ్ పాత్ర ఇంకా పూర్తిగా నిగూఢంగా ఉండటం, కథలో మరిన్ని మలుపులకు దారి తీసే అవకాశం ఉంది.


Like
bottom of page