'Uchitham' - New Telugu Story Written By Dr. Bandari Sujatha
Published In manatelugukathalu.com On 02/11/2024
'ఉచితం' తెలుగు కథ
రచన: డా. బండారి సుజాత
“శాంతక్కా! ఎప్పుడు వచ్చినవు. యాత్రలు తిరుగుడు అయిందా” అన్నది సరోజ.
“ఆ చెల్లె” అంటూ, ముసి, ముసిగా నవ్వుతూ “అయింది చెల్లె. నా జీవితంలో ఏ దేవుని గుడి సూత్తననుకోలేదు. దేవుడు దయవల్ల సర్కారోళ్ళు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడంతో ఎందరెందరో ఆడవాళ్ళు గడప దాటి బయట సూడనివన్నీ సూత్తాండ్లు” అన్నది.
“మనూళ్ళ నుండి పోయినోళ్ళం నలుగురైదురమే కాని ఎందరెందరాడోళ్ళో ఎక్కెడెక్కడనుండో వచ్చిండ్లు. ఒకరినొకరం అడుగుతే అందరూ ఒకటే మాట. నేను ఎప్పుడు ఎక్కడికి పోలేదక్కా. సర్కోరోల్ల కడుపు సల్లగుండ ఉచిత బస్సు పెట్టిన కాడి నుంచి ఊరు ఊరు తిరుగుతానే ఉన్నామంటాండ్లు అందరు”.
“అయితే చాలామంది దోస్తులయిండ్లా…” అన్నది సరోజ.
"మనం మంచోళ్ళం అయితే అందరూ మంచోళ్లే కదా, అందరం లేనోళ్ళమే ఉన్నంతలో బతకటోళ్ళమే, లేనిపోని వేషాలతో మాట్లాడితేనే మనసు నచ్చదు” అన్నది శాంతమ్మ.
“ఉన్నోళ్లు కార్లలో, బస్ కిరాయి పెట్టుకొని బస్సులలో వస్తరు. మనసోంటి గరుబోళ్ళు ఉచిత బస్సులల్ల పోతం” అనంగనే, “ఇగో శాంతక్కా. నాకేం సమజ్ కాలే బస్సులల్ల ఉన్నోళ్లు, లేనోళ్లు అనేం లేదుకదా! అందరు ఎక్కచ్చు కదా మల్ల గట్ల మాట్లాడతానవేంది” అన్నది.
“ఓశెల్లే. ఏం ఉచిత బస్సే తల్లి, ఒక్క బస్సులో రెండు బస్సులమంది ఎక్కుతే ఆ యవ్వారం ఎట్లుంటదో చెప్పు. మనసుంటోళ్ళం తొక్కుకుంట, తోసుకుంట బస్సు ఎక్కుతం. నిలబడో, కూసుండో అనుకున్న ఊరికి పోతం. పైసలున్నోళ్లు గిసోంటి బాధలెందుకు పడతరు. గీలొల్లిల బస్సెందుకు ఎక్కుతారు{“ అన్నది శాంత.
“అదికాదక్కా! ఏవో కొన్ని బస్సులల్ల జనం బాగుంటరు. కానీ అన్ని బస్సులలో ఎందుకు ఉంటరు”. అనంగానే “ఇప్పుడు పిల్లగాళ్ళకు దసరా సెలవులు ఇచ్చిండ్లు తెలుసుకదా! ఊర్లళ్ళకు పొయ్యెటోళ్ళు, వచ్చెటళ్ళతో ఒక్క బస్సు ఖాళీలేదు. పాపం డ్రైవర్ల కండక్టర్లు మొక్కాలి. ఆపమన్న కాడల్ల ఆపెటోళ్ళు. అందరికీ జీరో టిక్కెట్ ఇయ్యబట్టిరి”.
“అరే అవునా! టిక్కెట్ కూడా ఉంటదా” అన్నది సరోజ.
“అయ్యో! మరి టిక్కెట్ లేకుంటే బస్సు ఎక్కెటోళ్లు దిగటోళ్ళు మనం ఎక్కడికి పోయేది ఎట్లా తెలుత్తది. మొన్న తుర్కోళ్ళ పండుగప్పుడు నాలుగైదు రోజులు సెలువులొచ్చి పిలగాండ్లను తీసుకుపోయి హైదరాబాద్ ల తిరిగినం. ఇగ ఈ పది రోజులల్ల ముందుగా ఎములాడ రాజన్న దగ్గరకు పోయినం. భువనగిరి దగ్గర కొత్తగా పడ్డ గుళ్ళు సూసినం. అక్కడనుండి యాదగిరి గుట్ఠ
సురేంద్రపురం కూడా చూసుకొని విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరకు పోయినం. అంతేకాదు పానకాల స్వామిని కూడా చూసి వచ్చిన” అన్నది.
“అవునా! ఆయన ఎంత పానకం పోత్తే అంత తాగుతాడట కదా!” అనంగానే, “ఒక్కలా ఇద్ధరా వేల మంది ఇత్తాంటే అయ్యగారు పోసుడే పోసుడు. దేవునికి పానకం పోసి మిగిలింది ఇత్తడు. అందరం తాగంగ మిగిలింది ఇంటికి తీసుకుపోతారు” అన్నది శాంత.
“మరి బావకు అర్జునుడికి టికెట్ కదా!” ఆనంగనే “వాళ్లకు బస్సు టికెటేగాని, అన్ని గుళ్ళళ్ళ ఉచిత దర్శనాలు చేసుకొనుడు. ఉచితంగా బువ్వ పెట్టేయాళ్ళకు అక్కడ తినడం. తినంగనే కాసేపు కూసోని ఇంకో గుడికి పోవడం చేసినం”.
“అక్కా ఈసారి నేను కూడా వస్తా మీ తోటి” అన్నది సరోజ.
“అట్లనే అందరం కలిసి పోదాం. ఏమన్నా ఎత్తుకునేదున్నదా, దించుకునేదున్నదా! ఓ నాలుగు జతల బట్టలు పట్టుకుపోయినమంటే, పది రోజులు హాయిగా తిరిగొద్దాం వచ్చే సంక్రాంతి సెలవులకు మనందరం పోదా”మన్నది శాంత.
“గట్లనే అక్క మా శెల్లెకూడ వత్తదో తెలుసుకుంట. అందరం కలిసి ఒకదగ్గరుంటే సంబరమే సంబరం కదక్కా” అంటున్న సరోజను చూస్తూ ‘అవునుమరి’ అన్నది శాంత.
అప్పుడే అక్కడకు వచ్చిన శాంత భర్త సీను “ఇప్పుడే వచ్చినవ్ మల్ల దేనికి ప్లానేత్తాన”వన్నాడు.
“అదేంలేదు మనతోపాటు ఈ సారి సరోజ వాళ్ళుకూడా వత్తమంటుంటే సరే అంటానా” అన్నది.
వీళ్ళ ఉచిత సంబరాలు చూసి పంచభూతాలు నవ్వుకున్నాయి.
ఉచితంగా ఇచ్చే ప్రకృతిని ధ్వంసం చేస్తూ.... స్వార్దానికి వాడుకొంటున్న' మనీ' మనుషులకు ఉచితవిలువ తెలిసేదెప్పుడో అనుకుంటున్నాయి.
.. సమాప్తం ..
డా.బండారి సుజాత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : https://www.manatelugukathalu.com/profile/bandari
Dr.Bandari Sujatha
పేరు : డా.బండారి సుజాత
(ప్రభుత్వ విశ్రాంత తెలుగు ఉపాధ్యాయిని)
విద్యార్హతలు : M.A(adm), B.ed, M.A (Tel), M.phil, P.hd.
తల్లిదండ్రులు: కీ.శే : బండారి లక్ష్మి,సమ్మయ్య.
సహచరుడు: ఆకుతోట ఆశయ్య
(రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ )
D.O.B :18-08-1958
వృత్తి: స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) విశ్రాంత ఉపాధ్యాయిని.
ప్రవృత్తి : కవితలు ,కథలు , వ్యాసాలు, వివిధ ప్రక్రియలలో సాహిత్యం రాయడం, చదవడం, అవసరార్ధులకు సహాయ మందించడం.
Comments