top of page
Writer's pictureMohana Krishna Tata

ఉగాది సందడి



'Ugadi Sandadi' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 11/04/2024

'ఉగాది సందడి' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


ఆ చిన్నప్పటి రోజులే వేరు.. అవి గుర్తొచ్చినప్పుడు నాకు ఏదో గొప్ప అనుభూతి కలుగుతుంది. ఆ రోజులు చూసిన మా తరం ఎంత అదృష్టవంతులమో!


పండుగ వచ్చిందంటే.. ఒక సరదా, సందడి ఉండేవి. చెప్పాలంటే.. ఇంట్లోనే కాదు, ఊరంతా పండుగ వాతావరణం ఉండేది. ఉదయాన్నే నిద్ర లేచి, పక్కనే ఉన్న మామిడి తోటలోకి వెళ్లి, కావల్సిన మామిడి కొమ్మలు తెచ్చుకుని.. ఆ పక్కనే చెట్లకి ఉన్న పువ్వులు కోసుకుని.. ఇంటికి చేరుకునేవాళ్ళం. ఆ తర్వాత ఇంటిని మామిడి కొమ్మలు, పూలతో చక్కగా అలకరించేవాళ్ళం. తర్వాత అమ్మ పిండి వంటలు చేసి వడ్డించేది. బంధువులంతా.. ఒక చోట చేరి విందు చేస్తే, ఆ ఆనందమే వేరుగా ఉండేది. 


మాకు ఉన్న ఒక్క అబ్బాయికి పెళ్ళి చేసి.. రిటైర్ అయ్యాను. నేనూ, నా ఆవిడ సుభద్ర ఈ పల్లెటూరు లోనే ఎప్పటినుంచో ఉంటున్నాము. ఇప్పటికీ, ఈ పల్లెటూరిలో పండుగ వాతావరణం బాగుంటుంది. 


మా అబ్బాయి సిటీ లో పెద్ద కంపెనీ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తాడు. పెళ్ళైన తర్వాత నుంచి అక్కడే కాపురం. కోడలు కుడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. సిటీ లో పుట్టి పెరిగిన అమ్మాయే.. పల్లెటూరి వాసన అస్సలు తెలియని అమ్మాయి. మా అబ్బాయి ఇష్టపడ్డాడని పెళ్ళికి ఒప్పుకున్నాము. పైగా.. అమ్మాయి మెల్లగా అన్నీ నేర్చుకుంటుందని అబ్బాయి మాకు నచ్చ చెప్పాడు. సరే అన్నాం ఇద్దరము. 


సుభద్ర కి కొడుకంటే, ఎంతో ప్రేమ. కొడుకు సిటీ లో ఉద్యోగంలో చేరిన నాటి నుంచి అక్కడికి వెళ్ళాలనే దాని ప్రయత్నం. కానీ, అబ్బాయి ఎప్పుడూ రమ్మని అనలేదు. తర్వాత రావొచ్చని అనేవాడు. మేము కుడా వాడిని బలవంతం పెట్టలేదు. ఫోన్ లోనే మాట్లాడుతూ.. సరిపెట్టుకున్నాము. 


పోనీ, పండక్కి అబ్బాయి ఇంటికి వస్తాడా అంటే, ఎప్పుడూ బిజీ అనే అంటాడు.. అక్కడే ఆ పండుగలు అన్నీ చేసుకుంటాడు. పెళ్ళైన తర్వాత, ఇంకా బిజీ అయిపోయాడు. కానీ, ఒక రోజు అనుకోకుండా.. మా కోడలు నుంచి ఫోన్ వచ్చింది.. 


"హలో.. ! మావయ్యగారు! ఎలా ఉన్నారు.. ?"


"నేను బాగానే ఉన్నాను.. మీ అత్తయ్య కుడా బానే ఉంది.. మీరంతా కులాసా కదా?"


"అంతా హ్యాపీనే మావయ్యా!.. మిమల్ని, అత్తయ్యని పండక్కి పిలుద్దామని ఫోన్ చేసాను. మీ అబ్బాయి తర్వాత మీకు ఫోన్ చేస్తారు"


"సంతోషం తల్లీ! అలాగే వస్తాం.. నువ్వు ఎప్పుడు పిలుస్తావో అని మీ అత్తయ్య బ్యాగ్ సర్దేసి, ప్రతి పండక్కి రెడీ గానే ఉంటోంది.. "


మెల్లగా.. ట్రైన్ పట్టుకుని హైదరాబాద్ చేరాము. రైల్వేస్టేషన్ నుంచి అబ్బాయి కార్ లో ఇంటికి తీసుకెళ్ళాడు. భోజనం చేసాక.. తీరిగ్గా అందరూ మాటలు మొదలు పెట్టారు.. 


"రేపే ఉగాది పండుగ కదరా.. ! ఇక్కడ అన్నీ బిల్డింగ్స్ తప్ప, తోటలు ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడ మామిడి తోటలు ఎక్కడ ఉన్నాయో చేబితే, వెళ్లి కొమ్మలు కోసుకొస్తాను.. " అన్నాడు తండ్రి చాలా ఉత్సాహంగా.. 


"నాన్నా.. ! మీరు కష్టపడకండి.. అన్నీ అవే జరుగుతాయి.. "


ఈలోపు కాలింగ్ బెల్ మోగింది.. ఎవరో చుట్టాలు వచ్చేరేమో అని వెంటనే వెళ్లి తలుపు తీసాను. చూస్తే, ఒక మనిషి రెండు పెద్ద ప్యాకెట్ లు తీసుకుని వచ్చి ఇచ్చాడు. ఇంకా కొంత సేపటికి.. ఇంకో పార్సెల్ ఏదో వచ్చింది. ఎంత ఆలోచించినా, నాకేమి అర్ధం కాలేదు. మా అబ్బాయిని అడిగితే.. తర్వాత చెబుతాను అన్నాడు. సాయంత్రం లోపు ఇలాగే చాలా పొట్లాలు వచ్చాయి.. అన్నిటినీ ఇంట్లో ఒక పక్కకి పెట్టి ఉంచారు. 


తెల్లారితే పండుగ.. మా అబ్బాయి ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ.. టీవీ చూస్తూ ఉన్నాడు. అసలు పండుగ సందడి మొదలవనేలేదు. రాత్రి భోజనం చేసి అందరం పడుకున్నాము. 


మర్నాడు.. మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. వచ్చిన ఆ ఇద్దరూ ఏవో పేరున్న చొక్కాలు వేసుకుని ఉన్నారు. చక చకా.. వారు తెచ్చిన రెండు ప్యాకెట్లు చింపి.. అందులోంచి మామిడి కొమ్మలు తీసి, గుమ్మానికి అలంకరించేసారు. వాళ్ళు తెచ్చిన ఇంకో కవర్ లోంచి, పువ్వులు తీసి.. ఇల్లంతా అలంకరించేసారు. ఇదంతా.. మేము అసలు ఏమీ సాయం చెయ్యకుండానే! వాళ్ళ పని అయిపోయిన తర్వాత డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. 


తర్వాత, కోడలు ముందురోజు వచ్చిన కొన్ని ప్యాకెట్లు ఓపెన్ చేసి.. అందులోంచి నాకూ, సుభద్రకి పండక్కి కొత్త బట్టలు పెట్టింది. ఇంకో రెండు తెల్ల ప్యాకెట్లు ఓపెన్ చేసి, కొడుకు.. కోడలు కొత్త బట్టలు తీసుకున్నారు. అందరం కొత్త బట్టలు వేసుకున్న తర్వాత.. కోడలు సెల్ఫీ తీసింది. 


కొంతసేపటికి ఇంకో పార్సెల్ వచ్చింది. ఈసారి ఏమిటో అని అనుకుంటుండగా, ఈ లోపు కోడలు ఆ పార్సెల్ వంటింట్లోకి తీసుకుని వెళ్లి.. కొంతసేపటికి ఒక గిన్నె తీసుకొచ్చింది. ఏమీటో అనుకున్నాము నేనూ సుభద్ర. చెయ్యి పట్టండని చేతిలో వేసింది.. ఉగాది పచ్చడి. 


"ఇంట్లో అసలు మామిడి కాయలు కొయ్యనేలేదు, వేప పువ్వు తీసుకురాలేదు.. ఎప్పుడు చేసావు అమ్మాయి ఈ పచ్చడి?" అడిగింది అత్తగారు ఆశ్చర్యంగా.. 

"ఇది ఆన్లైన్ లో వచ్చిన పచ్చడి.. రుచి గా, సుచిగానే చేస్తారు అత్తయ్యా! కంగారు పడనవసరం లేదు.. "


"అయితే, వంట కుడా ఉండదేమో?"


"భలే గెస్ చేసారు నాన్నా.. !" అన్నాడు పక్కనే ఉన్న పుత్రరత్నం


ఇలా అనుకుంటుండగా.. మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. ఒక పెద్ద కవర్ లో ఏవో వచ్చాయి. ఊహించినట్టే.. అందరికీ భోజనం తెచ్చాడు ఆన్లైన్ మనిషి. అన్నీ ఓపెన్ చేసి.. గిన్నెలలోకి మార్చేసరికి ఒక అరగంట అయ్యింది. 


చుట్టాలు ఎవరూ రాలేదు.. సందడి లేదు. బంధువులంతా వీడియో కాల్స్ లోనే. వంట లేదు.. కష్టం లేదు. పండుగ అంతా ఆన్లైన్ లోనే.. హాయి అనాలో, బాధ పడాలో నాకు అర్ధం కాలేదు. 


*******

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


60 views0 comments

Comments


bottom of page