గమనిక : ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి 2021 కథల పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకుంది. ఎంపికలో పాఠకుల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకున్నాం.
'Uhala Rekkalu' - New Telugu Story Written By Porala Sarada
Published In manatelugukathalu.com On 30/12/2020
'ఊహల రెక్కలు' తెలుగు కథ
రచన: పోరాల శారద
రాత్రి తొమ్మిదిగంటలు అవుతుంది.
భోజనాలయ్యాక అందరం డాబా పైకి చేరాము. శ్రీవారూ, నేనూ మంచాలేసి పరుపులు పరిచాము. పిల్లలకు రోజులానే కథలు చెప్పి నిద్రపుచ్చిన తరువాత, వెళ్లి నా పక్కపై నడుం వాల్చాను.
మా డాబా చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉండడంతో చల్లని గాలి వీస్తూ మనసుకెంతో హాయిగా ఉంది. ఇంతటి హాయి ఏ ఏసీలు, కూలర్లిస్తాయి?
'ఎండాకాలంలో మాత్రమే దొరికే అదృష్టం కదూ ఇది. ఈ సీజన్లో మామిడిపండ్ల రుచీ, మల్లెల సుగంధాలు, కమ్మని ఆవకాయ తయారీ, రకరకాల వడియాలు, ఆరుబయట ఆకాశంలో పడుకుని జాబిల్లిని చుస్తూ కబుర్లు చెప్పుకోవడం ఇవన్నీ వేసవి తెచ్చే కానుకలే కదా!' అని నాలో నేను అనుకుంటూ తీరికగా నా మొబైల్ తీసుకుని 'వాట్స్ అప్' లో వచ్చిన మెసేజ్లన్నిటినీ ఓసారి ప్రశాంతంగా చూసుకుంటున్నాను.
ఇవాళ ఉదయం నుంచి స్కూల్లో, ఇంట్లో తీరికలేని పనులతో ఉన్నానేమో, అసలు "వాట్స్ అప్"నే ఓపెన్ చేయలేదు. పొద్దున్నుండి దాదాపు అందరూ ఒకే మెసేజ్ ఎక్కువ 'ఫార్వర్డ్' చేశారు. ఇవాళ "అంతర్జాతీయ పక్షుల దినోత్సవం" అట.
"ఎండాకాలం పక్షులకు నీళ్లు పెట్టండి, గింజలు చల్లండి, అంతరించే పక్షులను కాపాడుకుందాం." ఇదీ..... ఆ మెస్సేజ్ల సారాంశం.
ఈ మెసేజ్ పంపిన చాలా మందికి ఇలాంటి విషయాలు ఈ ఒక్కరోజే గుర్తుంటాయి. మరి నేనలా కాదే ! చిన్నప్పటి నుండీ నాకు పక్షులంటే బోలెడు అభిమానం. ఎన్నో ఏండ్ల నుండీ మా డాబా మీద గిన్నెల్లో నీళ్లు పెట్టడం, రోజూ ఏదో వొకరకం గింజలు చల్లడం నాకు అలవాటే! పిల్లలతో కలిసి సరదాగా, కొబ్బరి తాడు, నార లాంటి వాటిని వాడి పిచ్చుకలకు సహజంగా ఉండేలా గూళ్ళు తయారు చేయడం మాకు బోలెడు సరదా!
వాటిని మా డాబా మీదకు వంగిన చెట్ల కొమ్మలకు తాడు సాయంతో అక్కడక్కడా వేలాడదీసి, అందులో వాటి సంతతి వృద్ధి చెందుతుంటే చూసి మురిసిపోతుంటాను. ఆ గూటిలో పక్షులు పెట్టిన రంగు రంగుల చిన్ని చిన్ని గుడ్లను మా పిల్లలు మెరిసే కళ్లతో చూస్తుంటారు. వీళ్ళకేం తెలుసవన్నీ. అని మనసులో కాస్త గర్వంగా అనుకుంటూ మంచం పై ఒరిగి, అలానే ఆలోచిస్తున్నాను.
అదేంటో యాదృచ్చికంగా రేపు స్కూల్లో కూడా మా క్లాస్ పిల్లలకు పక్షుల గురించే నేను "బర్డ్స్ టాక్ " అని "పోయెమ్" చెప్పాలి. ఏ పాఠం అయినా నేను కళ్లకు కట్టినట్లూ చెప్తానంటారు మా స్టూడెంట్స్. రేపు పిల్లలకు పక్షుల గురించి ఇంకా బాగా చెప్పాలని అనుకుంటూ....రేపు చెప్పబోయే పాఠాన్నీ, నేను గీసి చూపించబోయే పక్షుల ఆకారాలనూ, మనసులోనే మననం చేసుకుంటూ నిద్రకు ఉపక్రమించాను.
* * *
ఉదయం లేచి రోజులాగే హడావిడిగా పనులు చేసుకుంటున్నాను. ఎందుకో వీపులో కాస్త నొప్పి, పోటులా అనిపిస్తుంది. కానీ మా ఆడవాళ్లకు అలవాటే కదా 'నొప్పిని అలక్ష్య' పెట్టడం.
ఇంతలో నిద్ర లేచొచ్చిన శ్రీవారికి పొగలు కక్కే కాఫీ కప్పు , ఈ రోజు పేపర్ ఇచ్చి, నాకోసం కలిపిన కాఫీ కప్ ని డైనింగ్ టేబుల్ మీద ఉంచాను. వేడి వేడి కాఫీ తాగుతూ కూర్చుంటే పనులుకావు మరి. కాస్త గోరువెచ్చబడితే గబగబా తాగెయ్యెచ్చు కదా.
ఈలోగా పిల్లలను లేపి, వాళ్ళను ఓ పక్క రెడీ చేస్తూనే, మరో పక్క దోసెలలోకి కొబ్బరి చట్నీ, మధ్యానం మా అందరి క్యారేజిల్లోకి అన్నం, పప్పు, క్యారెట్ ఫ్రై చేస్తూ చల్లారిన కాఫిని తాగలేక తాగేసి, హడావిడిగా స్నానానికెళ్లాను.
బాత్రూమ్లోకి వెళ్లి స్నానం చేస్తుంటే, నొప్పి ఇంకాస్త ఎక్కువగా వున్నట్లు అనిపిస్తుంది. రెండు మగ్గులనీళ్లు అలా ఒంటిపై గుమ్మరించుకుని, స్నానం అయ్యిందనిపించి, గబ గబా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి, కాస్త వెనుదిరిగి అద్దంలో చూసుకున్నా, కుడి భుజం దగ్గర ఎర్రగా కంది, కాస్త వాపువునట్లు కనిపించింది. సరే ఓ 'పెయిన్ కిల్లర్' వేసుకుంటే అదే పోధ్దిలెమ్మని, రెడీ అయి, టిఫిన్ తిని, అందరిని పంపేసి నేనూ రోజులాగే ఆటోలో స్కూల్కి వచ్చేశాను.
సాయంత్రాలు కూడా ఆయనకు టైమ్ ఉంటే నాకోసం మా స్కూల్కి వస్తారు. లేదంటే రోజూ ఆటోలోనే ఇంటికి రావడం నాకు అలవాటు.
స్కూల్లో కూడా చాల యిబ్బందిగా, కాస్త నొప్పిగా అనిపిస్తుంది. అయినా కూడా ఎలాగోలా క్లాస్ అయిందనిపించి, మధ్యాహ్నం భోజన విరామ సమయంలో స్టాఫ్ రూమ్లోకెళ్ళి అందరితో పాటు అన్నం తినడానికి బాక్స్ తెరిచి కూర్చున్నా.
నా పక్కన కుర్చునివున్న విశాల మేడమ్ "ఏంటి శ్వేతా మేడమ్ ! ఇవాళ చాల నీరసంగా కనిపిస్తున్నారు" అంది.
"ఏంటో మేడం మార్నీంగ్ నుండి కుడి భుజం దగ్గర కాస్త నొప్పిగా ఉండె. ఇపుడు ఎడమ పక్కకూడా బాగా నొప్పిగా ఉంది " అని చెప్పాను. దానికి ఆవిడ వెంటనే " అయ్యో! అలాగా! మీ క్లాస్ కూడా ఇవాళ నేను చూసుకుంటా! మీరు ఇంటికెళ్ళండి. ఈ పూట రెస్ట్ తీసుకొండి" అంటూ లంచ్ కాగానే నన్ను బలవంతంగా ఇంటికి పంపించేసింది.
ఇంటికి వస్తు వస్తూ ఈ బాధ పడలేక దగ్గరలోఉన్న తెలిసిన హాస్పటల్కి వెళ్లాను. డాక్టర్ పరీక్షించి ఎక్సరే తీసి, నొప్పి తగ్గడానికి ఈ పూటకి మాత్రం టాబ్లెట్స్ రాసిచ్చి, రిపోర్ట్ కోసం రేపు ఉదయం మరోసారి రండన్నాడు.
* * *
నాదంతా అచ్చం మానాన్న పోలికే! ఏదన్న ఇలాగ్గనక వచ్చిందంటే చాలు, అద్దం ముందుకు వెళ్లి పదిసార్లు చూసుకుంటుంటాను. మమ్మల్ని చూసి మా అమ్మ నవ్వుతూ అంటుంది. " మీకు ఎమన్నా వస్తే కోతికి పుండు వచ్చినట్లే" అని.
ఇంటికొచ్చాక ఫ్రెష్అప్ అయి మళ్ళోసారి అద్దం ముందు నిలుచుని వెనక్కి తిరిగి నా వీపుని
అద్దంలో చూసుకుంటే, నా భుజాలకు రెండు వైపులా ఉబ్బెత్తుగా కనిపిస్తూ ఉంది. బాగా నొప్పిగా వుండడంతో టీ తాగి, డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకున్నా. రాత్రికి కూడా రైస్ కడిగి రైస్ కుక్కర్లో పెట్టేసి వెళ్లి బెడ్ పై పడుకున్నా. వెల్లికిలా పడుకొడం కుదరడం లేదు. ఒక పక్కగా తిరిగి, మొన్ననే కొన్న "ఒంటరి పక్షి" నవల చదువుతూ పడుకున్నా.
ఇంతలో ఆఫీస్ నుండి శ్రీవారూ, స్కూల్ నుండీ పిల్లలూ వచ్చేశారు. నేను లేచి వాళ్లకు కాస్త చిరుతిండి పెట్టి పాలు కలిపిచ్చి, రేపటికోసం ఇడ్లి పిండి వేయడం, పల్లీలు వేయించుకోవడం లాంటి పనులు చేసుకుంటూవున్నాను.
ఒక పక్క పనిచేస్తున్నా, మధ్యలో ఆయన నా వైపు పదే పదే చూడడం, నేను చూసే సరికి వెంటనే చూపులు తిప్పుకోవడం గమనిస్తూనే వున్నాను. పిల్లలు కూడా నన్ను కాస్త కొత్తగా చూస్తున్నారు. "ఏంటని" అంటే సర్దుకుని "అబ్బే ఏం లేదు, ఏం లేదు" అంటున్నారు.
ఇవాళ నాకు బాగా అలసటగా ఉండడంతో అందరికి అన్నం పెట్టేసి, వంటిల్లు శుభ్రం చేసుకుని నేనూ త్వరగా తినేసి పడుకున్నా!
తరువాతి రోజు ఉదయం నేను లేచేసరికి నా భుజాలకు ఇరువైపులా జానెడు పొడవు బయటికి పొడుచుకుని వచ్చి ఎదో ఇబ్బందిగా ఉంది. మావారు కూడా నన్ను చూసి భయపడి పోయారు. పిల్లలయితే నా దగ్గరికి కూడా రాలేదు.
గబాగబా రెడీ అయి పిల్లలను స్కూల్లో దింపి, మేమిద్దరం ఆలస్యం చేయకుండా హాస్పటల్కి వెళ్లిపోయాము.
చీరకొంగు బుజాలచుట్టూ కప్పుకుని కూర్చున్న నన్ను సిస్టరొచ్చి లోపలకి రమ్మని పిలిచింది. నేను లోపలికి వెళ్లగానే డాక్టర్ వొకసారి ఎక్సరే వైపు, మరో సారి నా వైపూ మార్చి మార్చి చూస్తూ, కళ్ళజోడు సరిచేసుకుని, మరోసారి నా వెనుక వైపుగావచ్చాడు. బుజాలచుట్టూ కప్పుకున్న చీరను పక్కకి తొలగించమని సిస్టర్కి చెప్పి ఆయన నా భుజాలను మరోసారి చూశారు.
డాక్టర్ అదిరిపడడం, ఆయన చేతులు చిన్నగా వణకడం నాకు తెలుస్తూనే ఉంది. డాక్టర్ వెంటనే మా వారిని లోనికి రమ్మని పిలిచారు.
డాక్టర్ ఓ గ్లాస్ నీళ్ళు గట గటా తాగి, రిలాక్సయ్యి మాట్లాడడం మొదలు పెట్టాడు.
" నా సర్వీసు లో మొట్ట మొదటిసారి ఈ వింతను చూస్తున్నా. ఎలా చెప్పాలో కూడా నాకు అర్ధం కావడం లేదు. శ్వేతాగారూ! మీకూ ....మీకూ..." అంటూ ఆగిపోయాడు.
నేను ఆందోళనతో ఆగలేక "చెప్పండి డాక్టర్! నాకు, నాకేమైంది ??" అంటూ ఆరాటంగా అడిగాను.
మా వారు కూడా లోలోన కంగారు పడుతున్నా! పైకి మాత్రం నా చేతిని తన చేతిలోకి తీసుకుని "ఏం పరవాలేదు, బీ కూల్ " అన్నట్లూ నిమరసాగాడు.
డాక్టర్ తేరుకొని "వైద్య చరిత్రలోనే కనీ, వినీ ఎరుగని వింత ఇది. మీకు...మీకూ ..... "రెక్కలు మొలిచాయి" శ్వేతగారు" అని చెప్పి తల దించుకున్నాడు.
"వ్వాట్" అని మావారి నోటా, నా నోటా ఒకేసారి వచ్చిన అరుపుతో డాక్టర్గారి రూమ్ అంతా దద్దరిల్లింది.
"నేను చెప్పేది నాతో సహా మీరూ, ఇంకా ఈ ప్రపంచంలో ఎవరూ నమ్మలేని నిజమిది. మీ కేసుని ఇంకా కాస్త లోతుగా పరిశీలించి ట్రీట్మెంట్ మొదలు పెడదాం. స్పెషలిస్టులను కూడా కలుద్దాం. లేదంటే వాళ్లనే ఇక్కడకు రప్పిద్దాం. ఏమంటారు? అంత దాక మీరు మానసికంగా కాస్త స్ట్రాంగ్గా ఉండండి" అని చెప్పి మమ్మల్ని పంపేశాడు.
నేను మళ్లీ భుజాలచుట్టూ చీర కొంగు కప్పుకొని దిగులుగా బయటకు వచ్చాను.
మా వారు ఆఫీస్లో ఏదో అర్జెంట్ వర్క్ ఉందనీ, అది చూసుకుని త్వరగా ఇంటికి వచ్చేస్తాననీ, నన్ను ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఇంట్లో ఉండమని చెప్పి , ఇలాంటి సమయంలో కూడా నన్ను ఆటోస్టాండ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు.
నేను మొదటి నుండీ అందరిలా కాదు. నా దగ్గర ఆగిన ప్రతి ఆటో డ్రైవర్లను వొకసారి పరిశీలనగా చూసి, కాస్త "నమ్మకంగా" కనిపించిన డ్రైవర్ని చూసి మాత్రమే నేను ఆటోలో ఎక్కుతాను. అదేంటో మా ఆడవాళ్ళలో చాలమందిమి "కసాయి వాడిలా కనిపించే మంచివాళ్ళను నమ్మలేము కాని, మంచి వాడిలా కనిపించే కసాయి వాళ్లను మాత్రం వెంటనే నమ్మేస్తాము".
అసలెందుకో ఈ ఆటో డ్రైవర్లలో చాల మంది, ముఖ్యంగా ఇప్పటి తరం యువకులు "చేతులకు రంగు రంగుల పూసలు చుట్టుకుని, మెడలో రక రకాల దండలు వేసుకుని, నోట్లో గుట్కానో, వక్క పొడో వేసుకునో లేదా, తనకు (డ్రైవర్ కి) చెరో పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ ని కూర్చోబెట్టుకునుంటారు. అలా ఎందుకుంటారో నాకర్ధం కాదు. నాకు ఒక్కోసారి వాళ్ళ దగ్గరికెళ్లీ.. "బాబూ! నీకు గిరాకీ బాగా ఉండాలంటే, నీ వేషం కాస్త మార్చు రా తమ్ముడూ!" అని చెప్పాలి అనిపిస్తుంది.
ఇంతలో నా దగ్గరికి వచ్చిన ఆటోడ్రైవర్ "అక్కా ! ఎక్కడికి పోవాలి" అని అడగడంతో ... ఈ లోకంలోకొచ్చి "అక్కా " అని పిలిచాడు కదాని అతనిపై నమ్మకం కుదిరింది. పైగా కొత్త ఆటో కాబోలు అతనిలో మంచి హుషారు, ప్రయాణీకుల పట్ల వినయమూ కనిపిస్తుంది.
సరే అని ఆటోలో ఎక్కి అడ్రస్ చెప్పి కూర్చున్నా!
మళ్ళీ నా సమస్య గుర్తొచ్చి దిగులుగా కళ్లు మూసుకొని " నాకే ఎందుకిలా జరిగింది, రెక్కలు పుట్టడం ఏంటసలు, ఏమిటీ వింత" అని ఆలోచనలో పడ్డాను. ఆటో ట్రాఫిక్ దాటి కాస్త దూరం వెళ్ళగానే ఆటో అబ్బాయి పాటలు పెట్టాడు. డెక్ లో నుంచి "కొత్తగా రెక్కలొచ్చెనా " అని పెద్ద సౌండ్ తో పాట రావడం మొదలైంది .
వెంటనే నేను కళ్లు తెరిచి "ఆప రా!!"అని గట్టిగా కేక పెట్టడంతో పాపం వాడు బిత్తరపోయి సడన్గా బ్రేక్ వేశాడు. వెనక్కి తిరిగి "ఎంక్కా! రజనీ కాంత్ లాగా అట్టా కేక పెట్టినవ్" అని అడిగాడు, నాకేసి భయం భయంగా చుస్తూ.
నేను తేరుకుని "సారీ! నేను అన్నది పాటలు ఆపమని తమ్ముడూ. ఏమీ అనుకోకు. నేనేదో డిస్టర్బ్ లో ఉన్నానులే. నువ్వు పోనివ్వు" అని సర్ది చెప్పాను. వాడు ఎగాదిగా నన్నోసారి దయ్యాన్ని చూసినట్లు చుస్తూ ముందుకు కదిలాడు.
* * *
ఓ నాలుగు రోజులు స్కూల్ కి లీవ్ పెట్టి, ఇంట్లోనే ఉండిపోయాను.
గంట గంటకీ నా 'రెక్కలు ' పెరగడం నాకు తెలుస్తూనే ఉంది. అప్పటికే అవి మూరెడు నుండీ బారెడు పొడవు పెరిగాయ్.
మా శ్రీవారు పిల్లలకేంచెప్పాడో కానీ, వాళ్లూ నా దగ్గర మామూలుగానే ఉంటున్నారు. వాళ్లు నాతో అలా మునుపటిలానే ప్రవర్తించడం నాకు నిజంగా సంతోషంగా ఉంది.
నాకు టైలరింగ్ కూడా బాగా వచ్చు కనుక, రెక్కలకు అడ్డు రాకుండా నాకు తగ్గట్టుగా డ్రెస్ డిజైన్ చేసుకుని వేసుకున్నా ! నాకు మొలిచిన ఈ కొత్త రెక్కల ఈకలు పాలనురుగులా, తెల్లగా మెరిసిపోతున్నాయి. మెత్తని పట్టు కుచ్చులా ఉండి నాకు నేనే సినిమాల్లో చూసిన "దేవకాంతలా" కనపడుతున్నా!
ఎంత బయటకు తెలియకుండా ఉండాలనుకున్నా మొత్తం ఊరందరికీ, ప్రపంచానికి కూడా తెలిసిపోయింది. అదే పనిగా వచ్చి నన్ను పలకరిస్తున్నారు, అందరూ సెల్ఫీల కోసం నా చుట్టూ ఎగబడుతున్నారు.
ఇంటి చుట్టుప్రక్కలలో వారందరూ కూడా నేను బయట కనబడితే చాలు వీడియోలు, ఫోటోలు తీసి "యూట్యూబ్ లో, ఫేస్బుక్ లలో " అప్లోడ్ చేసేస్తున్నారు.
ఓ రకంగా ఈ గుర్తింపు కూడా బాగానే ఉందనిపిస్తుంది. డబ్బు కి డబ్బు. పేరుకి పేరూనూ....ఈ కొత్త రెక్కలతో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. పైగా ఇప్పుడిప్పుడే ఈ రెక్కలతో "ఎగరడం" కూడా నాకు కాస్త బాగానే అలవాటవుతుంది.
చిన్నప్పటి నుండీ "ఆడపిల్లగా పుట్టినందుకు అక్కడకు వెళ్లకూడదు, ఇక్కడకు వెళ్లకూడదు, ఒక్కదానివే ఎక్కడికీ వెళ్లకూ " అంటూ రకరకాల ఆంక్షలు. ఆడపిల్లగా పుట్టాము కనుక బయటకు వెళ్లాలంటే పది సంవత్సరాల 'మగపిల్లోడినైనా' మా వెంట తోడుగా పంపే ఈ సంఘంలో బతకాలంటేనే నాకు తెగచిరాకొచ్చేది. పోనీ... ధైర్యం చేసి ఏ సమయంలో అయినా సరే! ఒంటరిగా ప్రయాణించాలనుకున్నా కూడా కొన్ని "మానవ మృగాల" గురించిన భయమేనాయే!
ఇక పెళ్ళయ్యాక సంగతంటే సరే సరి. ఆయన గారిని "అక్కడ డ్రాప్ చెయ్యరా! ఇక్కడ ఉన్నాను పికప్ చేసుకోరూ ప్లీజ్ ! అని బతిమాలాల్సి వచ్చేది.
కానీ ఇప్పుడలా కాదు. ఎక్కడికి కావాలంటే అక్కడికి క్షణాల్లో " స్వేచ్చ" గా ఎగిరిపోవచ్చు. నాకు ఎలా నచ్చితే అలా ఉండొచ్చు. అని అనుకున్నా ఆనందంగా.
అవి "సంక్రాంతి " పండుగ రోజులు. రోజూ ఉదయాన్నే ఇంటి ముందు రంగవల్లికలు పెట్టే నాకోసం...నాకన్నా ముందే లేచి, మా గేటు దగ్గరా, పక్కింటి గోడల దగ్గరా సెల్ ఫోన్లు పట్టుకుని ఆత్రంగా అంత చలిలో కూడా ఎదురు చూసేవాళ్లు. పాపం పిచ్చి జనాలు. అంతేకాకుండా కొందరు సినీ దర్శక, నిర్మాతలు కూడా వచ్చి నాతో వొక "సినిమా" తీసే ఆలోచనలు చేస్తున్నట్లు, ఆలోచించుకుని నా నిర్ణయం కూడా త్వరలో వారితో చెప్పమని నాతో మరీ మరీ చెప్పివెళ్లారు. ఆఖరికి టీవీలలో "వండర్ ఉమెన్"గా కూడా నన్ను పదే పదే చూపిస్తూ నాతో చేసిన ఇంటర్వ్యూలని వరుసగా ప్రసారం చేయసాగారు.
. * * *
నా అందమైన రెక్కలతో సాయంత్రాలు పిల్లలను చెరో పక్క ఎత్తుకుని అలా విహారానికి కూడా వెళ్ళడం నేర్చుకున్నా. ఆకాశపు అంచుల దాకా ధైర్యంగా ఎగురుతూ వెళ్ళగలుగుతున్నాను. ఎన్నో జాతుల అందమైన పక్షుల మధ్య పోటీపడి ఎగుర గలుగుతున్నాను. రకరకాల రంగుల, బోలెడు ఆకారాలను పోలిన గాలిపటాల మధ్య ఆనందంగా తిరుగ గలుగుతున్నాను.
అలా వెళ్లేటప్పుడు విమానంలో వెళ్తున్న అనుభూతి కలుగుతుందో ఏమో, నా పిల్లలు నా మెడ చుట్టూ చేతులు వేసి, మరింత బిగించి పట్టుకుని సంబరంతో కేరింతలు కొడుతున్నారు.
ఆ రోజు సంక్రాంతి. నా ఇద్దరు పిల్లలను చక్కగ ముస్తాబు చేసుకుని, రోజు లాగే ఈరోజు కూడా సాయంత్రం కాగానే పిల్లలూ, నేనూ విహారానికి బయలుదేరాము. గుడి గాలిగోపురాల మీద కాసేపు పావురాల గుంపుతో కలిసి కూర్చుని, వాటికీ గింజలు చల్లి, ఆ తరువాత పెద్ద పెద్ద కట్టడాల మీదా, పార్కుల దగ్గరా ఆనందంగా గడిపి, అలసిపోయే వరకూ తిరిగి, చివరికి ఇంటిదారి పట్టాము.
కింద ప్లే గ్రౌండ్లో "గాలిపటాల పోటీ" పెట్టారనుకుంటా. పిల్లల కేరింతలతో, డి.జే పాటలతో ఆ ప్రాంతమంతా హోరెత్త సాగింది. ఎందుకైనా మంచిదని నేను వేగంగా రెక్కలు కదిలిస్తూ ఇంటి దిశగా ఎగరసాగాను. ఇంతలో..... ఎవరో గాలిపటానికి కట్టి ఎగరేసిన పదునైన "నైలాన్ దారం"మొకటి రివ్వున పైకి దూసుకు వచ్చి, కస్సున నా 'లేత' రెక్కలను కోస్తూ వెళ్ళింది. నేను తేరుకుని పక్కకి తప్పుకునేలోగానే, ముందు దారం కన్నా వేగంగా మరో దారమొకటొచ్చి నా రెక్కలకూ, మెడకూ చుట్టేసుకుంది. నాకు ఉపిరి అందనట్లనిపిస్తుంది. కళ్లు క్రమంగా బైర్లు కమ్ముతున్నాయి.
ఇక నాకు రెక్కలు ఆడించడం చేతకావడం లేదు. అంత పైన్నుండీ చాలా వేగంగా నేల మీదకు గిరికీలు కొడుతూ కిందకు దూసుకొస్తున్నా! పిల్లలను మరింత గట్టిగా గుండెకి హత్తుకున్నాను. ఓ వైపు కళ్లు మూసుకుపోతున్నాయి. నాలోని తల్లి మనసు చేసిన హెచ్చరికతో వొక చోట పచ్చగా, మెత్తని గుబురు పొదొకటి కనపడగానే పిల్లలను ఆ పొదలోకి పడేటట్లూ చూసి జాగ్రత్తగా జార విడిచాను. పిల్లలు "అమ్మా ! అమ్మా !" అంటూ అరుస్తున్నారు. క్రమంగా ఆ అరుపులు నాకు దూరమవ సాగాయి.
* * *
పైనుండి దబ్బున నేల మీద పడ్డ నా చుట్టూ జనం మూగి ఏదో అంటున్నారు. నన్ను వింతగా, దగ్గరగా వచ్చి చేతులతో తాకి మరీ చూస్తున్నారు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వాళ్ల మొబైల్ కి పని చెప్పారు. అంబులెన్స్ కి ఫోన్ చేస్తారేమో అని అనుకున్నాను. కాదు, ఫోటోలు, వీడియోలు, సెల్ఫీల కోసం. నా పెదవులు తడారిపోతున్నాయి. క్రమంగా స్పృహ కోల్పోవడం తెలుస్తుంది.
నా మెడ నుండి,, తెగిన నా అందమైన రెక్కల నుండీ ధారగా రక్తం ప్రవహిస్తూనే ఉంది. మెరిసే ఎర్రని రక్తపు మడుగులో "శ్వేత కపోతం" లా నేను నిస్సత్తువగా నేలమీద పడి ఉన్నాను!
అలా నేల మీద పడున్న నా పైననే, పక్షుల సమూహం మొకటి అక్కడక్కడనే గుండ్రంగా తిరుగుతూ, నన్ను చుస్తూ బాధతో అరుస్తూ, విలవిలలాడుతూ కన్నీళ్లు కారుస్తున్నాయి.
కొద్ది రోజుల సావాసం తోనే నేను వాటికీ అత్యంత చేరువయ్యాను. మనుషులలో వెతికినా కనిపించని అనురాగమేదో ఈ క్షణం ఆ మూగ ప్రాణులలో నాకు కనిపిస్తుంది. ఇంత బాధలో కూడా మనసుకు అనిర్వచనీయమైన "తృప్తి " కలిగి హాయిగా కళ్లు మూసుకున్నాను. ఈ జీవితానికీ తృప్తి చాలిక అనిపిస్తుంది.
ఇంతలో...." మొఖం పై కాస్త నీళ్లు చల్లండి, గాలి విసరండి" అంటున్నారు ఎవరో, తడి ఆరిపోయిన నా పెదవులకు చల్లని నీటిని సుతారంగా వేళ్ళతో అద్దుతున్నారు, కొన్ని నీళ్ల చుక్కలు నా గొంతులో పోశారు.
* * *
మళ్లీ వెంటనే ఎక్కడినుంచో నా ఇద్దరు పిల్లల "అమ్మా! అమ్మా! " అనే పిలుపూ, ఏడుపూ కలగలిపి వినిపిస్తుంది. ఈ ఆఖరి క్షణాలలో కూడా వాళ్ల పిలుపు నాలోని "తల్లిని" తట్టి లేపుతూ, బ్రతకాలనే ఆశని కలిగిస్తుంది. అంతలోనే అక్కడికి మా వారు కూడా వచ్చేసినట్లున్నారు. ఆయన కూడా "శ్వేతా!శ్వేతా!" అంటూ అరుస్తున్నారు.
కాదు కాదు పిలుస్తున్నారు. భుజంతట్టి లేపుతున్నారు.
బలవంతంగా కళ్లు తెరవడానికి ప్రయత్నం చేశాను. కానీ ఒక్కసారిగా వెలుతురు చూడడం నాకు వీలు కావడం లేదు. కాసేపాగి మెల్లగా కళ్లు తెరిచి చూశా!
నా మంచం పక్కనే మంచి నీళ్ల గ్లాస్ పట్టుకుని మా శ్రీవారూ, స్కూల్ డ్రెస్ లలో రెడీఅయి ముద్దుగా వున్న నా ఇద్దరు పిల్లలూ నిలబడున్నారు. ఏమైందో తెలియక ఆందోళనతో, బెదిరిన పిచ్చుక పిల్లల్లా ముగ్గురూ నన్నే చుస్తున్నారు.
ఆశ్చర్యంగా కళ్లు మరింత విప్పార్చి చూశా! నా చుట్టుపక్కల పరిసరాలను వింతగా గమనిస్తున్న నన్ను చూసి, మా వారు దగ్గరకొచ్చి మంచంపై నా పక్కనే కుర్చుంటూ. "ఏమైంది శ్వేతా!! " అంటున్నారు నా తల నిమురుతూ!
నేను తేరుకొని భుజాలు చూసుకుంటూ "నా రెక్కలు, నా రెక్కలు......." అంటున్నా!
"ఏంటి నీ రెక్కలా??? హ హా!
ఏదైనా పీడకలగానీ కన్నావా?" అంటూనే ....." "అమ్మ రెక్కలంట రా! మీరు గానీ తీశారా " అంటూ ఆటపట్టిస్తూ పిల్లలూ, ఆయనా గొల్లుమని నవ్వుతున్నారు. పిల్లలు చప్పట్లు కొడుతూ గెంతులేస్తున్నారు.
ఓహ్ ఇదంతా "క ..లా?? " రాత్రి పక్షుల గురించి ఆలోచించి ఆలోచించి పడుకున్నానేమో కల ఇలా వచ్చిందన్నమాట. నేను గట్టిగా కలువరించడంతో పాపం పిల్లలూ, ఆయనా కంగారు పడ్డట్టున్నారు.
ఇంతలో శ్రీవారు "రోజూ సూర్యుణ్ణి నిద్ర లేపే నువ్వు ఇంత పొద్దెక్కినా లేవకపోవడంతో పోనీలే అలసి పోయినట్లుంది, ఇంకాసేపు పడుకోనిద్దామని మేమే రెడీ అయ్యాము. ఇడ్లీ, చట్నీ కూడా చేసేశా తెలుసా " అన్నారు శ్రీవారు కాలర్ ఎగరేస్తూ.
"మా మంచి శ్రీవారు" అంటూ భుజం తట్టి మెచ్చుకుంటూ, ఇంకా అలాగే నన్ను చూస్తూ అల్లరిగా నవ్వుతున్న వాళ్లను మురిపెంగా చుసుకుంటూ నాలో నేనే కాస్త సిగ్గుపడ్డాను.
"ఆడపిల్లగా పుట్టినప్పటి నుంచి ఆంక్షల పురి తాడుతో కోరికల రెక్కలను కట్టిపడేసే ఈ సమాజాన్ని ఎదిరించే శక్తి లేని నేను, కనీసం ఈ "ఊహల రెక్కలలో " కల్లో ఆఖరి ఘడియల దాకా అయినా కాసేపు స్వేచ్చగా కలలోనైనా విహరించి వచ్చినందుకు నాలో నేను ఎంతో సంబరపడ్డాను."
లేచి కూర్చుని పిల్లలను హత్తుకుని "కలే కానీ.... పీడ కల కాదులెండి" ఇవాళ రాత్రి ఆ "కల" నే, నేను మీకు చెప్పబోయే సరి కొత్త కథ. సరేనా " అంటూ వాళ్లతో పాటూ నేనూ నవ్వులతో శృతి కలిపాను.
*****
రచయిత్రి పరిచయం :
నా పేరు పోరాల శారద. మా నాన్న పేరు "గడీల నారాయణ" డ్రైవరుగా ఉద్యోగం చేస్తూ సాయంత్రాలు ఇంట్లో రామాయణ,భాగవత గ్రంథాలు పారాయణం చేసేవాడు. అవి వింటూ పెరిగిన నాలో అక్షరాలపై మమకారం కలిగింది. మా అమ్మ ప్రోత్సాహంతో నా కాలేజీ రోజుల్లో కవితలు రాసి వార్తా పత్రికలకు పంపేదాన్ని. రేడియోలో ప్రోగ్రాములు చేసేదాన్ని. మా ఇంట్లో చూస్తే అచ్చమైన తెలంగాణా బాషా, సాంప్రదాయాలు ఉండేవి. కానీ నాన్న ఉద్యోగరీత్యా మేం పెరిగింది చదువుకున్నది అంతా కడపజిల్లా "బ్రహ్మంగారి మఠం"లోనే. అందుకే ఈ రెండు ప్రాంతాల మాండలికాలలో కథలు రాయడంపై మక్కువ చూపిస్తుంటాను. గత ఏడాదినుండే కథలు రాయడం మొదలుపెట్టాను. ఇప్పటిదాకా ఎనిమిది కథలు అచ్చురూపంలో కనిపించి నన్ను సంతోషపరిచాయి.
Beautiful imagination.good story.very heart touching😍
Different ga anipinchindi story.... Nice story 🙂