top of page
Writer's pictureDr. C S G Krishnamacharyulu

ఊహలే నిజమాయె



'Uhale Nijamaye' - New Telugu Story Written By  Dr. C. S. G. Krishnamacharyulu

Published in manatelugukathalu.com on 26/06/2024 

'ఊహలే నిజమాయెతెలుగు కథ

రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



పగలు మదిలో కదిలే వూహలు బలమైనవైతే, అవి రాత్రి నిద్రలో కలలై వెంటాడతాయి. నిద్రావస్థలో వున్నప్పుడు, సుప్త చేతన మనసు మేల్కొని ఒక క్రొత్త లోకాన్ని - అదే స్వప్న లోకాన్ని సృష్టిస్తుంది. అక్కడ మనసే బ్రహ్మ. ఉద్యానవనాలు, జలాశయాలు, పచ్చని తరులతో గిరిశిఖరాలు, మధుర సంగీతం, ఒకటేమిటి.. భావుకతకు పరిమితి లేదన్నట్లు, పగటి పూట ఊహల్లో మెరిసినదానికి మరింత మెరుగులు దిద్దుతూ, అన్నీ రూపు దిద్దుకుంటాయి. అప్పుడు హంసలా నడుస్తూ, నెమలిలా నాట్యం చేస్తూ.. కోయిలలా పాడుతూ.. ఊహా సుందరి. ఒక అందాల రాశి.. వలపు దృక్కులు సారిస్తూ, ప్రేయసియై.. చెంతకు చేరిన అనుభూతి కలుగుతుంది. ప్రేమ పరవశత్వం అతిశయించిన వేళ, మెళకువ రావడం జరుగుతుంది. 


స్వప్నానంతర స్థితి విచిత్రంగా వుంటుంది. ఒకింత ఆనందం. ఒకింత ఆశాభంగం. ప్రియురాలు చేజారిందా అన్న చింత మనసుని కలచివేస్తుంది. అప్పుడు మొదలవుతుంది విషాదస్వరంలో "ఆకలుండదు, దాహముండదు నువ్వు లేకుంటే" అన్న విరహ గానం. సాధకుడైన వాడు కలకు రూపమిచ్చి, ఆమెనెలా పొందాలన్న చింతన చేసి, ‘సాహసము శాయరా డింగరీ! రాజకుమారి దక్కురా!’ అని కోర్కెల గుర్రమెక్కి, ధైర్యమనే ఆయుధాన్ని చేబూని బయలు వెడలి, సాహసాలు చేసి ప్రేయసిని గెలుచుకుంటాడు. అందువల్లనే "ఊహల్లో తేలిపోతూ కూర్చోకు. చెయ్యాలనుకున్నది చెయ్యి. " అంటారు పెద్దలు. 


ఇవీ రాజా మదిలో మెదులుతున్న ఆలోచనలు. ఈ ఆలోచనలకు మూల కారణం శిరీష. ఆమె ముద్దొచ్చే వదనంలో, ఆమె మనసులో భావాన్ని స్పష్టంగా ప్రతిఫలించే ఆమె భృకుటి. సొగసైన, గంభీరమైన భృకుటి. అదే యోగులు వర్ణించిన ఆజ్ణా చక్రం. అదే రాజాను మధురోహల్లో తేలియాడ చేసిన మన్మధ స్థానం. 


పిహెచ్ డి తీసుకోవాలన్న కోరికయే లేకుంటే, బిజినెస్ చేస్తున్న రాజా, ఆమెను కలవడం జరిగేది కాదు. అతనికి మేనేజ్మెంట్ స్కూల్ డీన్ దగ్గరే, పార్ట్-టైం స్కాలరుగా అడ్మిషన్ లభించింది. నాలుగు సంవత్సరాల కాలవ్యవధిలో మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. పార్ట్ టైం కావడం వల్ల, అతను అప్పుడప్పుడు మాత్రమే యూనివర్సిటీకి వచ్చివెళ్ళే వాడు. అలా వచ్చి పోయే సందర్భంలో, అతను శిరీష గురించి విన్నాడే గాని కలవలేదు. కలవాల్సిన అవసరం లేక పోబట్టి, ఆమెను కలిసే ఆసక్తి చూపలేదు. 


అయితే వారిద్దరి కలయిక విధినిర్ణయం కాబోలు. కాకబోతే, ఒక రోజు డీన్ యిచ్చిన ఆదేశం, రాజా ఆమెను కలిసేలా చేసేదా ? ఇంతవరకు ఊహల్లో, కలల్లో ప్రియభామగా మెరిసిన అస్పష్ట సుందరి, చెంతనే వుందన్న విషయం అతనికి తెలిసేదా?

 ##



 ఆ రోజు వుదయం తనను కలవడానికి వచ్చిన రాజాతో డీన్ యిలా చెప్పారు. 

 "రాజా, నేను మూడు నెలలు అమెరికాలో వుండేలా వెడుతున్నాను. ఇంక నువ్వు అసిస్టెంట్ ప్రొఫెసర్ శిరీష దగ్గర గైడన్స్ తీసుకో. నేను వచ్చేటప్పటికి నీ వర్క్ పూర్తవ్వాలి"


రాజా శిరీషను కలవబోతున్నాడని తెలిసి, అడగకుండానే తోటి స్కాలర్ చెప్పాడు. 

 " నీ హనీమూన్ ముగిసినట్లే. ఆవిడ బివియస్. అంటే బ్రిలియంట్, వయొలెంట్, సైలెంట్. టార్గెట్స్ పెట్టి చంపుతుంది. ఆవిడ లేనప్పుడు, హాయిగా వుండే వాళ్ళం. వయసులో కాస్త పెద్దవారని, బిజినెస్ మాన్ అని ఆవిడ మీకు మినహాయింపులేం ఇవ్వదు. ఆవిడతో జాగ్రత్త!” 


"అంత గొప్ప ఆవిడా, అందరిపై విరుచుకు పడడానికి?


"ఆహా! అసిస్టెంట్ ప్రొఫెసర్ శిరీష.. వయసు ఇరవై యేడు. ఎంబియే గోల్డ్ మెడలిస్ట్. డీన్ దగ్గర పిహెచ్. డీ. ఆరు అంతర్జాతీయ పత్రికలలో వ్యాసాలు. సెలెక్షన్స్ టైములో, డీన్, వైస్ చాన్సెలర్ కి చెప్పిన మాట యేమిటొ తెలుసా? ఈ అమ్మాయికి, వుద్యోగమిస్తే వచ్చే ముప్పై యేండ్లకు మన యూనివర్సిటీకి ఒక మూలస్థంభాన్ని యిచ్చినట్లే. ” 


"అబ్బో ! అంత సీన్ వుందా?”


"అంతకన్న ఎక్కువే వుంది. ఆమె వుద్యోగంలో చేరిన వెంటనే డీన్ తన స్కాలర్ల బాధ్యత ఆమెకు అప్పగించాడు. మన సీనియరే గదా అని చనువు తీసుకున్నస్కాలర్లకు చుక్కలు చూపించింది. అందుకే ఆమెను ముద్దుగా బివియస్ అంటున్నాము. ” 

 

 ###


ఎందుకైనా మంచిదని, రాజా ఫోన్ చేసి, ఆమె అనుమతి తీసుకుని కలిసాడు. 

 "నమస్తే మేడం, నా పేరు రాజా. పార్ట్ టైం. ఇది ఆఖరి సంవత్సరం" అని పరిచయం చేసుకున్నాడు. 


శిరీష పరిహాసంగా అంది. 

"కూర్చోండి. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇంకా రాజాలున్నారా? రిసెర్చ్ మీరే చేస్తారా లేక మీ అమాత్యులెవరైనా? " 


 మొదలైంది రాగింగ్ అని అనుకున్నాడు రాజా. 

"ప్రజాస్వామ్యంలో రాజాలెక్కడ మేడం ? పని చేసే వాడే రాజా. డీన్ సార్ నా గురించి చెప్పే వుంటారు”. 


“ఏం చెప్పలేదే. పోనీ మీ గురించి మీరే చెప్పండి"


"నా పేరు రాజా. రాజు అంటే స్వయం ప్రకాశం లేని చంద్రుడు. జ్ణాన సూర్యుడు లాంటి మీరు కాంతిని ప్రసాదిస్తే ఒక వెలుగు వెలుగుతాను" అని ప్రసన్నంగా కనబడీ కనబడని నవ్వుతో బదులిచ్చాడు రాజా. 


 "సెటైరా! మంచి మాటకారి తనం వుంది. మరి రిసెర్చ్ సంగతి?" కనుబొమలు పైకి లేపి అడిగింది శిరీష. 


"డీన్ సర్ చెప్పినట్లు చేసాను. డేటా విశ్లేషణ చేస్తున్నాను. ఒక ఆర్టికల్ ప్రచురించాను. రెండోది మీకు చూపి, మీ అనుమతి తో ప్రచురణకు పంపమన్నారు" వినయంగా చెప్తూ, రాజా, తను అంతవరకు వ్రాసిన థీసిస్, వ్యాసం, బల్ల మీద పెట్టాడు. 


ఆమె థీసిస్ ని యదాలాపంగా తిరగేసి, వ్యాసాన్ని పరిశీలనగా చదవనారంభించింది. తీరికగా ఆమెను చూస్తున్న రాజాకు, ఆమె ముఖభంగిమలు ముచ్చటగొలిపాయి. యవ్వనకాంతులతో, ఆమె చామనచాయ ముఖం మెరిసిపోతోంది. నునుపైన బుగ్గలు, కుదురైన నాసిక, లేత గులాబి రంగు పెదవులు, ముచ్చటైన చుబుకం ఒక వింత ఆకర్షణని కలిగిస్తున్నాయి. వీటికి తోడు ఒత్తైన నల్లని కురులు. అతనికి ఒక నిమిషం మతిపోయింది. ఆమె అతని స్వప్నసుందరి. 

ఆమె వ్యాసాన్ని చదువుతున్న క్రమంలో, అప్పుడప్పుడూ భృకుటి ముడిచి, చేయవలసిన మార్పులు పెన్నుతో వ్రాసిన తీరు, ఎంతో ముచ్చటగావుంది, అతనికి ఆమె భృకుటిని ముద్దాడాలన్న ఆకాంక్ష బలంగా కలిగింది. 


ఆమె అంతలో చటుక్కున లేచి, "మీ పేపర్లు కొన్ని సార్ యిచ్చారు" అంటూ ఒపెన్ రాక్ లో వెతకసాగింది. ఆమె శరీరాకృతిని చూసి రాజా ముగ్ధుడయ్యాడు. 


"ఎక్కడ వుంచానో కనబడలేదు" అంటూ వెను తిరిగి బల్ల దగ్గరకు వచ్చేటప్పుడు, కదిలివస్తున్నసజీవ సుందర శిల్పంలా వున్నఅమెను చూసిన అతనికి శ్రీనాధుని వర్ణనలు గుర్తుకొచ్చాయి. 


 “బటువు గుబ్బల దాన, తోరంపు గటి దాన, తొడల నిగ్గుల దాన.”. అంతేనా ఇంకేమనవచ్చు అని ఆలోచించి, సోగకన్నుల దాన, సొగసైన చాన, మనసు దోచిన జాణ, అని అనుకుంటూ ఒక ఊహాలోకంలో వున్న అతడిని చూసిన ఆమె భృకుటి ముడివేసింది. 


 అతనిలో అకస్మాత్తుగా కంగారు మొదలైంది, ఎక్కడ ఆమె తన చూపులనుపసిగట్టిందోనని. కానీ జరగవలసిన నష్టమో, లాభమో జరిగిపోయింది. స్త్రీ సహజమైన అవగాహనా శక్తివల్ల, శిరీషకు అతని పరిస్థితి అవగతమైంది. ఆమె లోలోన నవ్వుకుంది. 


అప్పటికే అతని మాటలు, రిసెర్చ్ పని చేసిన తీరు నచ్చడం వల్ల, ఆమె మృదుస్వరంతో, " చాలా బాగుంది. కొన్ని మార్పులు సూచించాను. మీ పేరుతో డీన్ పేరుకలిపి, ప్రచురణకు పంపండి" అంది. 


కొద్ది సేపు ఆమె యెదుట వుండాలని వున్నా, చేసేదిలేక రాజా ఆమెకు థాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె భృకుటి ముద్దాడాలని, కలిగిన కోర్కె, ఆ రోజు నుండి, అతని ఊహల్లో సందడి చేయ సాగింది. 


రాజా గురించి డీన్ చెప్పిన మాటలవల్ల, శిరీషకు అతని పైన ఆసక్తి కలిగింది. “వ్యాపారాలు, అస్తులు వున్నా అతనిలో గర్వం లేదు, వినయం చూపిస్తాడు” అని డీన్ చెప్పిన మాటలెంత నిజమో చూడాలని కొంచెం వెటకారంగా మాట్లాడింది. ఇప్పుడు అతని విధేయత ఎంత నచ్చిందో, అతను దొంగ చూపులు చూడడం కూడా, అంతే నచ్చింది. 


 క్రమంగా ఆమె వూహల్లో అతను చోటు చేసుకున్నాడు. రాత్రి ఒంటరిగా వున్నవేళలో, చల్లగాలి తరంగాలపై రాజా వచ్చి, తన ముందు మ్రోకరిల్లి, "మేడం! రాజాని. నన్ను కరుణించరా? దయ లేదా! అలా వెళ్ళిపోతున్నారు? మీ నవ్వుల ముత్యాల కాంతిలో మీ సుందర వదనాన్ని దర్శించే భాగ్యం నాకివ్వరా? ” అని వేడుకుంటున్న భావన కలిగి, ఆమె సిగ్గుతో ముసి ముసి నవ్వులు చిందించింది. అదుపు లేకుండా చెలరేగుతున్న ఈ వూహలు మనో రంజకంగావున్నా, శిరీష వాటిని కట్టడి చేయాలని నిర్ణయించుకుంది. ఒక టీచరుగా తాను, ఒక విద్యార్ధిని ప్రేమించడం, అనైతికమని ఆమె నమ్మింది. ఆ రోజు ఆమెకు తెలియదు, రాజా కూడా ఒక విద్యార్ధిగా గురు స్థానంలో వున్న వ్యక్తిని కామ వాంఛతో చూడకూడదన్న ఆలోచనతో సతమతమవుతున్నాడని. 

 ###

 

 రెండు నెలల తర్వాత వచ్చాడు రాజా. ఒక మాగజైన్ లో ముద్రించబడిన వ్యాసాన్ని శిరీష కు చూపించాడు. అతడిని చూడడం వల్ల కలిగిన అనందాన్ని, పైకి కనబడనీయకుండా, శిరీష ఆ వ్యాసాన్ని చూసింది. ఆమె భృకుటి ముడిచి విసుగు వ్యక్తం చేస్తూ, అతడిని ప్రశ్నించింది. 


"మీ పేరు తో డీన్ పేరు జత చేసి పబ్లిష్ చేయమన్నా గదా! నా పేరు పెట్టారేంటి?”

 

"డీన్ చెప్పారు. వ్యాసాన్ని చూసింది మీరే కాబట్టి ఆ క్రెడిట్ మీకే యివ్వాలని”.

 

ఆ సమాధానం శిరీషను శాంత పరిచినట్లుంది. ఆమె మందహాసం చిందిస్తూ, 

"ఆ విషయం ముందే మీరు నాకెందుకు చెప్పలేదు? ఏమైనా గైడ్ పేరుండడమే కరక్ట్ " అంది.

 

రాజాకి ఏం చెప్పాలో తెలియలేదు. మౌనంగా వుండిపోయాడు. ఆమె కోపం, మందహాసం చూసిన అతనికి నరకాసురనితో యుద్దం చేసే వేళ సత్యభామ ప్రదర్శించిన భావాలు గుర్తుకొచ్చాయి. 


 “రోషరాగోదయా విరతభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్”

అద్భుతమైన వర్ణన చేసిన పోతనగారికి మనసులో నమస్కరిస్తూ రాజా, శిరీషవైపు చూసాడు. 


వ్యాసం చదువుతున్నఆమె భృకుటి ఒక సారి ప్రశ్నార్ధకమై, మరొక్కసారి ప్రసన్నమై, 

 అతడి మనసును నలరించింది. ఆమెనలా మురిపెంగా చూస్తున్న అతడిని, ఆమె భృకుటి ముద్దాడాలన్నకోర్కె, పలకరించింది. 


ఇంతలో ఆమె తలయెత్తి, "మీ థీసిస్ ఇమెయిల్ ద్వారా పంపండి. చెక్ చేసి సరి చేస్తాను. మీరు రానక్కర లేదు. వచ్చే నెల సినాప్సిస్ ఇవ్వండి. ఆ తర్వాతి నెలలో థీసిస్ సబ్మిట్ చేద్దురు గాని" అని ముభావంగా వేరే పుస్తకం ముందేసుకుని చడవడంలో నిమగ్నమైంది. 


 రాజా లేచి నిలబడ్డాడు గాని, అడుగు ముందుకు వేయలేక పోయాడు. ఆమె యెందుకలా వుదాసీనంగా వుందో తెలీయక అతను మధన పడ సాగాడు. “కనీసం ఒక చిరునవ్వు కైనా నేను నోచుకోలేదా?” అని నిరాశ చెందాడు. ఆమె ప్రసన్న వదనంలో తొణీకిసలాడే కాంతి రేఖలను చూడాలని అతడి మనసు ఆరాటపడింది. “ ఖండిత నాయికలా, పెడ ముఖంగా వున్న ఆమెను ప్రసన్నం చేసుకునేదెలా? నే చేసిన నేరమేమిటి? నే చేయగల సేవ ఏమిటి? ఆమె భృకుటి ముద్దాడి ఆమె చిరునవ్వు నెలా పొందాలి?” అని అతనిలో చెలరేగుతున్న ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ, శిరీష అడిగింది

"ఎందుకలా నిలబడిపోయారు?”

 

"మీ ఇంటికి ఒక సారి రావాలనుకుంటున్నాను. మీరు అనుమతిస్తే"


"నో నో వద్దు. నేను బహుమతులు తీసుకోను" అంది శిరీష. 


"సరే మేడం! " అంటూ ముఖం మాడ్చుకుని రాజా వెనుదిరిగి రెండో అడుగు వేసే లోగా శిరీష అంది. 


"మీరు థీసిస్ గురించి రావచ్చు, అదీ మీరు వ్యాపారం వొత్తిడిలో, యూనివర్సిటీకి రాలేనప్పుడు మాత్రమే" 


రాజా ముఖంలోకి నవ్వు తిరిగి వచ్చింది. ఆమెకు ధన్యవాదాలు చెప్పి అతను వెళ్ళిపోయాడు. అతడిని దూరం పెట్టాలన్న ఆమె సంకల్పం, అతని పట్ల ఆమెకున్న ఆకర్షణ ముందు ఓడిపోయింది. 


 ####

 ఏ రోజు కారోజు, రాజా వస్తాడని, ఇమెయిల్ ద్వారా థీసిస్ చాప్టర్లు పంపుతాడని శిరీష ఆశగా యెదురు చూసింది. కానీ ఆమె ఎదురుచూసినట్లు అతడు రానూ లేదు, చాప్టర్లు పంపనూ లేదు. దానితో ఆమెలో అంతర్మధనం ప్రారంభమైంది. 


"అతనికి నా మీద ఆసక్తి ఎందుకుంటుంది? డబ్బు, అందం వున్న మగవాడు అందమైన ఆడపిల్లనే కోరుకుంటాడు. అయినా ఇన్నాళ్ళు నా మనసుని చేరని ఊహలు ఇప్పుడెందుకు వస్తున్నాయి? నేను కోరకుండానే, అతనికి చేరువ కావలన్న ఆశ యెలా రెక్కలు విప్పుకుంది? నో నో ! మనసు మీద నియంత్రణ కోల్పో కూడదు. అతడిని ఒక విద్యార్ధి గా చూడడం నేర్చుకో" అని తనకి తానే చెప్పుకుంది. 


రెండు నెలలు గడిచిన తర్వాత, రాజా యూనివర్సిటీకి వచ్చాడు. సినాప్సిస్ సబ్మిట్ చేసాడు. ఆ విషయం తెలిసి, రాజా తన దగ్గరకు వస్తాడని ఎదురు చూసిన శిరీషకు నిరాశే మిగిలింది. ఇంకా థీసిస్ సబ్మిట్ చేయలేదు కదా, ఆలోపు సలహాకోసం వస్తాడని మనసుకు సర్దిచెప్పుకుంది. కానీ మనసు ఆమె మాట నమ్మలేదు. ఎదురు తిరిగి ఆమె ఆత్మ విశ్వాసానికి తూట్లు పొడిచింది. 


"నీ వెటకారం మాటలు, పొగరు బోతు ఫోజులు. నువ్వేమైనా పాలరాతి సుందరివా? చామనఛాయ బొమ్మవి. నేడు ట్రెండ్ అవుతున్న జీరో సైజు లేదు. తెలివి తేటలున్నాయన్న పొగరుతో నీలోపాలు నీకు తెలియడం లేదు" ఇలాంటి నిందారోపణలతో ఆమె కుచించుకు పోయింది.

 

 ప్రతి రోజు అతను వస్తాడని అనుకోవడం, , అతను రాక పోవడం, ఇదే ఒక నెలరోజుల పాటు ఆమె రొటీన్ గా మారింది. అలా ఆశ నిరాశాల మధ్య వూగిసలాడుతున్న ఆమెకు, ఒక రోజు రాజా వచ్చి థీసిస్ సబ్మిట్ చేసాడని తెలిసింది. ఆ శుభవార్త చెప్పడానికి, అతను తప్పక వస్తాడని ఎదురు చూసింది, కానీ అతడు రాలేదు. మళ్ళీ ఆమెకు నిరాశే మిగిలింది. 


 సాయంత్రం నీరసంగా ఇంటికి బయలుదేరింది. బిల్దింగ్ బయటికి రాగానే ఆమెకు, దూరంగా చెట్టు క్రింది కారు నానుకుని నిలబడ్డ రాజా కనిపించాడు. అతడిని చూడగానే ఆమెగుండె వేగం పెరిగింది. అతను వడి వడిగా అడుగులు వేస్తూ తన వైపు వస్తున్నాడని గ్రహించిన ఆమె తెలియని ఉద్వేగానికి లోనయ్యింది.. ఆమెకు, అతను రుక్మిణీని తీసుకొనిపోయేందుకు, రథం దిగి వస్తున్న కృష్ణుడిలా అగుపించాడు. అంతలోనే అది కేవలం నా వూహ, నిజం కాదు గదా అని దిగులుపడింది.. 


 "మేడం! ఇవాళ మీరు స్కూటీ తేలేదు కదా. రండి. నా కారులో వెడదాము" అన్నాడు రాజా. 


"మీ కెందుకు శ్రమ. యూనివర్సిటీ బస్సులో వెడతాను" అంది శిరీష.


 మర్యాదపూర్వకంగా, ఒక ప్రక్క మనసులో అతనితో వెళ్ళాలన్న కోరిక గొంతు నొక్కుతూ. 

"మీరు నాతో రావాలి మేడం. ఒక గంట నుంచి వయిట్ చేస్తున్నా!" ప్రాధేయ పడుతూ అడిగాడు రాజా. ఆమె యింక ఎదురు చెప్పలేదు. 


కారు డోర్ తీసి, "రండి మేడం. ఈ రోజు మీ పాదస్పర్శతో ఈ కారు, నేనూ ధన్యులమయ్యాము. 


"ఈ పొగడ్తలకేం గాని, ఇన్నాళ్ళూ నన్ను కలవలేదేం? ఈ వుదయం నాదగ్గరికి రాలేదేం?" ఆమె గొంతులో ఆమె అనుమతి లేకుండా నే వుక్రోషం ధ్వనించింది. 


"ఆ విషయం మీ ఇంటికి వెళ్ళాక చెప్తాను" అని రాజా దరహాసంతో బదులిచ్చాడు. 

అతని దరహాసం, అతనితో ప్రయాణం, ఆమె ఆశలను పునరుజ్జీవింప చేసాయి. అతను చెప్పే కబుర్లు వింటూ, ఆమె మంత్ర ముగ్ధలా తలూపుతూ వుండిపోయింది.

 

శిరీష యిల్లు చేరాక, తన స్టడీ రూములో అతడిని కూర్చొబెట్టింది. తల్లికి పరిచయం చేసి, టీ తీసుకువస్తానని లోనికి వెళ్ళింది. 


 రాజా శిరీష తల్లిని అడిగాడు. 


"అమ్మా! నాకు మీ అమ్మాయంటే పెళ్ళి చేసుకు నేంత యిష్టం వుంది. మీకు ఓకే అయితే మీ అమ్మాయిని అడుగుతాను. " 


ఆమె నవ్వులు చిందిస్తూ "ఆల్ ది బెస్ట్" అంది. 


ఇంతలో శిరీష వచ్చి టీ కప్పులు యిద్దరికీ యిచ్చింది. శిరీష తల్లి టీ కప్పుతో బయటికి వెళ్ళిపోయింది. శిరీష అనుమానంగా చూస్తూ రాజా నడిగింది. 


"ఏమైంది? అమ్మ అలా వెళ్ళిపోయింది?” అ ప్రశ్నను విననట్టు, రాజా యదాలాపంగా యిలా అన్నాడు. 


"కారులో అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తాను, వినండి. డీన్ వద్దన్నారు. ఎందుకంటే ఆయనకు అంత ముందు ఒక విషయం చెప్పాను. అది విని, గైడన్స్ ఆయనే యిస్తామన్నారు. అంతే కాదు రిసెర్చ్ అయ్యేవరకు మీకు దూరంగా వుండమన్నారు. " 


"అంతకు ముందు మీరేం చెప్పారు?” కుతూహలంతో అడిగింది శిరీష. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, రాజా, తన వెంట తెచ్చిన సంచీ నుండి గులాబీ గుఛ్చాన్ని తీసి ఆమెకిచ్చి ప్రపోజ్ చేసాడు. 


 ఆమె ఆలో చిస్తూ భృకుటి ముడివేసింది. 


"అలా మీరు భృకుటి ముడివేయకండి. మతి పోతోంది, త్వరగా యస్ అనండి మేడం" కంగారు పెట్టాడు రాజా. 


 "ఇన్నాళ్ళూ దూరం పెట్టారు. ఇప్పుడు మేడం అంటున్నారు. ఎలా వొప్పుకుంటాను? టీచర్, స్టూడెంటుని ప్రేమించకూడదు" అని శిరీష అభ్యంతరం తెలిపింది. 


"శిరీషా! నిన్ను చూడగానే ప్రేమలో పడిపోయానని డీన్ కి చెప్పాను. అప్పుడు ఆయన నిన్ను డిపార్టుమెంటులో కలవవద్దని సలహా యిచ్చారు. అందువల్ల, నిన్ను కలవలేదు. నీవు నాకు మేడం కాదు" అని సంతోషంగా చెప్పాడు. ఆ మాటలకు ఆమె మనసు తేలిక పడింది. 


“సరే! భృకుటి అంటున్నావేమిటి?" అని అడిగింది, యస్ చెప్పడం ఆలస్యం చేసే వుద్దేశ్యంతో, 


ఆమె కాలయాపన చేయడం కేవలం పరిహాసానికేనని రాజాకి అర్ధమైపోయింది. 

"ఇదే శిరీషా!" అంటూ అతను, నడుము పట్టుకుని, ఆమెను గిర గిరా త్రిప్పి, బల్ల మీద కూర్చుండబెట్టి, ఆమె భృకుటి మీద ముద్దుపెట్టాడు. “ఇప్పుడైనా యస్ అను నా ప్రియాతి ప్రియ మనోహరీ “అని వేడుకున్నాడు. ఆమె బల్ల దిగి, అతడిని గట్టిగా కౌగలిం చుకుంది. 


 " యస్. ఐ లవ్ యూ. ఈ రోజు నా వూహలు నిజమయ్యాయి. " అని, అతని పెదవులను గాఢంగా చుంబించింది. 


రాజా, ఆనందంతో మైమరచిపోతూ యిలా అన్నాడు. “ఇది వాస్తవమని నమ్మలేకపోతున్నాను. నా ఊహలే నిజమాయే, ఈ గడసరి నాదాయె, బ్రతుకు నందనవనమాయె. ” 


 $$$

C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

 

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి  లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో.  నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు  ప్రచురించాయి.

 ఈ మధ్యనే నాకిష్టమైన  తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను.  ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది,  చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ-  వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).


106 views0 comments

تعليقات


bottom of page