#PadmavathiDivakarla, #పద్మావతిదివాకర్ల, #UhinchaniVaram, #ఊహించనివరం, #TeluguHeartTouchingStories
వారం వారం బహుమతుల పథకంలో ఈ వారం ఉత్తమ కథగా (02/02/2025) ఎంపికైన కథ

Uhinchani Varam - New Telugu Story Written By - Padmavathi Divakarla
Published In manatelugukathalu.com On 01/02/2025
ఊహించని వరం - తెలుగు కథ
రచన: పద్మావతి దివాకర్ల
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
శేషగిరికి ఊపిరి అందడం లేదు. అతి కష్టం మీద ఊపిరి పీల్చుకుంటున్నాడు. కళ్ళెదుట అంతా చీకటిగా ఉంది. తలంతా దిమ్ముగా ఉంది. కాళ్ళూ చేతులూ ఆడటం లేదు. చేతులు కదిలించడానికి ప్రయత్నించాడు కాని, అవి అతనికి సహకరించలేదు. వళ్ళంతా బరువుగా ఉంది. భరించలేని నొప్పిగా ఉంది. బాధగా కనులు మూసుకున్నాడు. తన పరిస్థితి మీద తనకే జాలివేసింది.
బతికినన్నాళ్ళూ తనవారినెవరినీ శాంతిగా బతకనివ్వలేదు, అందుకే ఈ రోజు తనకీ అశాంతి. తన దుర్వ్యసనాల కారణంగా కాలేయం, ఊపిరి తిత్తులు, మూత్రపిండాలు ఒకేసారి చెడిపోయాయి. ఆస్పత్రిలో చేరిన తనకు చికిత్స జరుగుతోంది. ఏవేవో మందులు ఎక్కిస్తున్నారు. గది బయట నిలబడిన తన వాళ్ళ వైపు జాలిగా చూసాడు శేషగిరి. తన బాధను వాళ్ళతో పంచుకోవాలన్నా వీలుపడటం లేదు. నోటమాట పైకి రావడం కూడా లేదు. బాధ భరించలేక పైకి అర్చాడు. విచిత్రం! ఆ అరుపులు ఎవరికీ వినపడలేదు, చివరికి తనకి కూడా!
"హే! భగవాన్! దేవుడా, నన్ను ఈ బాధల బారినుండి విముక్తి ప్రసాదించు!" అప్రయత్నంగా అతని నోటి నుండి వెలుబడింది. ఎన్నడూ దేవుణ్ణి తలచుకోని తను ఇప్పుడు దేవుణ్ణి స్మరించడం తనకే ఆశ్చర్యాన్ని కలిగించింది.
"పిలిచావా నాయనా!" అతి మార్దవంగా, చాలా సమీపంగా వినిపించిందతనికి.
ఉలిక్కిపడ్డాడు శేషగిరి. ఎవరు పలికారో అర్ధం కాలేదు. అతి కష్టం మీద కనులు తెరిచాడు. ఎదురుగా ఎవరూ కనపడలేదు. 'అంతా తన భ్రమ!' అనుకున్నాడు మనసులో.
నోరు తెరిచి మాట్లాడటం కూడా చాలా కష్టంగా తోచింది. "ఎవరు?" బాధగా మూలిగాడు.
"ఎవరు అని అడుగుతావేమిటి నాయనా! ఇప్పుడేగా నన్ను పిల్చావు, అప్పుడే మరిచిపోయావా?" అని వినిపించింది.
మాట వినిపించింది కానీ శేషగిరి కనులకెవరూ కనపడలేదు. అప్పుడు గుర్తుకు వచ్చింది తను దేవుణ్ణి తలచుకున్నాడని. ఎప్పుడూ దేవుణ్ణి తలవని తను విచిత్రంగా దేవుణ్ణి తలవడమేమిటి, అతను పలకడమేమిటి అని విస్తుపోయాడు. తనలాంటి నాస్తికుడికి కూడా దేవుడు కనిపిస్తాడా? అయితే పలికినది రాముడా, కృష్ణుడా లేక.. శివుడా? ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు శేషగిరి! వచ్చింది తప్పకుండా యమధర్మారాజే అయి ఉంటాడు.
ఇలాంటప్పుడు వచ్చేది అతనే మరి! అసలు ఎవరూ తనకు కనపడందే! కనులు నులుముకొని చూడాలని ప్రయత్నించసాగాడు, కానీ చేతులు తన ఆధీనంలో లేవే!
"అయితే కనిపించవేమి స్వామీ?" అన్నాడు దీనంగా.
"నాయనా నేను నిరాకారుణ్ణి. నువ్వే రూపంలో కొలిస్తే ఆ రూపంలోనే కనిపిస్తాను. నీ మనో నేత్రంతో చూడటానికి ప్రయత్నించి చూడు, నన్ను కనుగొనగలుగుతావు. " అన్నాడు.
కొద్దిసేపటి తర్వాత శేషగిరి ప్రయత్నం ఫలించింది. అతని మనో నేత్రం ముందు దేవుడు ప్రత్యక్ష్యమయ్యాడు, కానీ అంతా అస్పష్టంగా అనిపించింది. అయినా తనలాంటి పాపాత్ముడికి దైవ దర్శనం ఎలా అవుతుంది.. విరక్తిగా నవ్వుకున్నాడు శేషగిరి.
"నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఎందుకు నాయనా! ఇంతకీ నువ్వు నన్ను ఎందుకు తలచుకున్నావో చెప్పావు కాదు!" అన్నాడు దేవుడు.
"అదే స్వామీ, నాలాంటి పాపాత్ముడికి, అందులోనూ నాస్తికుడికి దైవదర్శనం చేసే అదృష్టం ఎలా కలిగిందా అని ఆశ్చర్యపోతున్నాను. ఈ శరీర బాధ భరించలేక నిన్ను తలచుకున్నాను, అంతే! నా మొర ఆలకించి నన్ను ఈ బాధలనుండి త్వరగా విముక్తి కలిగించు!" వేడుకున్నాడు శేషగిరి.
"నువ్వో విషయం మరిచావు. ఇప్పుడు నువ్వు నీ భౌతిక కాయం వదిలి పంచభూతాలో లీనమయ్యావు, సరిగ్గా చెప్పాలంటే.. నా దగ్గరకు చేరుకున్నావు. పుణ్యాత్ముడైనా, పాపాత్ముడైనా చివరికి దైవ సన్నిధికి చేరుకోవలసిందే, తమ పాపాలకూ పుణ్యాలకు తగిన ప్రతిఫలం పొందవలసిందే! అందుకే నీకు నేను కనిపించాను. చూడు.. ఇప్పుడు నీ శరీరానికి ఎటువంటి బాధలు ఉండవు. నీ ఇహ బంధాలన్నీ తెగిపోయాయి. " చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు దేవుడు.
విచిత్రంగా అప్పటికి గానీ, తనకి శారీరిక బాధలనుండి విముక్తి కలిగినట్లు తెలీలేదు శేషగిరికి. ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. అంటే తను చనిపోయాడా? తన ప్రాణం పోయిందా? కానీ, తనకి ఇంకా జీవించాలని ఉందే! తన కోరికలన్నీ తీరలేదే? తన శరీరం కలిగించే బాధలు తీర్చమన్నాడు కానీ, ఇలా తననే కడతేర్చమని దేవుణ్ణి వేడుకోలేదే! అతనికి దేవుడిపై కోపమొచ్చింది.
"ఏమిటి స్వామీ, నువ్వు చేసిన పని? నా ఆశలు, కోరికలు పూర్తిగా తీరలేదు. ఇప్పుడిప్పుడే నాలో పరితాపం మొదలైంది. అంతలోనే నన్ను వ్యాధిగ్రస్థుడ్ని చేసేసావు. నేను చేసిన తప్పులు సరిదిద్దుకొనే అవకాశం ఇవ్వలేదు నువ్వు. నేను చేసిన పాపాలు ప్రక్షాళన చేసుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వు స్వామీ!" అన్నాడు శేషగిరి.
"ఓ మానవా! ఒకసారి జీవాత్మ పరమాత్మలో కలిసాక తిరిగి శరీరంలో ప్రవేశించడం కుదరదు. కావాలంటే నీ మనోనేత్రంతో జరగబోయేది మాత్రం చూడు! అంతవరకే నీ కోరిక తీర్చగలను. "
తన మనోనేత్రంతో కిందకు చూసాడు శేషగిరి. ఆసుపత్రిలో మంచంపై ఉన్న తన రూపం స్పష్టంగా కనపడసాగింది. తల దగ్గర కూర్చున్న భార్య శ్యామల తనను కుదుపుతూ, "ఏమండీ! ఏమండీ!" అని బిగ్గరగా ఏడుస్తోంది.
తన పెద్ద కొడుకు రవి పరిగెట్టుకొని వెళ్ళు పిలుచుకొని రాగా తనకు చికిత్స చేసే వైద్యుడు వైద్యనాధం వచ్చి తన నాడిని పరీక్ష చేసి చూసాడు. కనులలో వెలుతురు ప్రసరించి చూసి, పెదవి విరిచి రవితో మెల్లగా ఏదో చెప్పాడు. అతనేమి చెప్పాడో తనకు వినపడటం లేదు.
అంతే! అప్పటివరకూ బయట నిలబడిన చిన్న కొడుకు గిరి రోదిస్తూ లోపలకు వచ్చాడు. ఆసుపత్రి సిబ్బంది వారిస్తున్నా వినకుండా శ్యామల తనను ఇంకా కుదుపుతూ రోదిస్తోంది.
అప్పుడే లోపలకి వచ్చి మౌనంగా నిలబడిన తమ్ముడు శివప్రసాద్ కనిపించాడు. అతని మొహం కళా విహీనమై ఉంది. నయనాలు అశ్రుపూరితాలయ్యాయి. తను ఆస్పత్రి చేరిన దగ్గర నుండి అక్కడే ఉన్నాడు పాపం. తనకి సేవలు చేస్తున్న తమ్ముణ్ణి చూసి తన కళ్ళు చెమ్మగిల్లాయి కూడా, అతనితో మాట్లాడలని అప్పుడు విశ్వప్రయత్నం చేసాడు. ఇప్పుడైనా తనని క్షమించమని అడగాలి.
"తమ్ముడూ, నన్ను క్షమించు తమ్ముడూ! నీ భార్యకు ఒంట్లో బాగులేనప్పుడు ఆర్థిక సహాయం చెయ్యమని నన్ను బతిమాలుకున్నావు. అప్పుగానైనా సహాయం చెయ్యమని ప్రాధేయపడ్డావు. నీకు చెందవలసిన ఆస్తిలో వాటా కూడా మోసం చేసి నేను కొట్టేసి, నా వ్యసనాలకు ఖర్చు పెట్టేసాను. నీకు సహాయం చెయ్యకపోగా అనరాని మాటలన్నాను. తమ్ముడవని కూడా చూడకుండా మెడపట్టుకు గెంటాను.
సమయానికి డబ్బులు లేక, చికిత్స అందక నీ భార్య చనిపోయింది. నా పాపానికి నిష్కృతి లేదు. ఆ విషయం కూడా మనసులో పెట్టుకోకుండా ఆస్పత్రి పాలైన నాకు సేవ చేసావు. డబ్బులు కూడా ఖర్చుపెట్టావు. నేను చేసిన తప్పులకి నాకు తగిన శిక్ష పడింది. ఇప్పటికైనా నన్ను క్షమించగలవా తమ్ముడూ!.. " బిగ్గరగా ఏడుస్తూ శివప్రసాద్ చేతులు పట్టుకున్నాడు శేషగిరి.
తనని పట్టించుకోకుండా శివప్రసాద్ కళ్ళు తుడుచుకుంటూ తన పడుక్కున్న మంచం దగ్గరకు వెళ్ళాడు. అతన్ని కుదుపుతూ, "తమ్ముడూ.. తమ్ముడూ.. నన్ను క్షమించు!" కన్నీళ్ళతో మనస్పూర్తిగా వేడుకున్నాడు శేషగిరి.
నవ్వాడు దేవుడు. "శేషగిరీ! నీ మాటలు అతనికి వినపడవు. నీదంతా వృధా ప్రయాస మాత్రమే!" అనేసరికి బిత్తరపోయి చూసాడు శేషగిరి. ఒక్కసారి నీరసం ఆవహించింది.
"అయ్యో! ఎంత తప్పు చేసాను! బతికుండగా ఒక్కసారి కూడా తమ్ముడింటికి వెళ్ళలేదు. అతని భార్య పోయిన తర్వాత కనీసం ఓదార్చలేదు. డబ్బులు ఇవ్వలేదని ఎక్కడ తిడతాడో అని మొహం చాటేసుకున్నాను. " బాధగా పశ్చాత్తాపం నిండిన కంఠంతో అన్నాడు శేషగిరి.
"ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. ఇంకొద్ది సేపే నీకు సమయం ఉంది నీకు. చూడు. " చెప్పాడు దేవుడు.
మళ్ళీ అటువైపు చూసాడు శేషగిరి. తన కళ్ళ దగ్గర నిలబడిన పిల్లలిద్దరూ రవి, గిరి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. తన మృతదేహం ఇంటికి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎవరో వెళ్ళి అంతిమ యాత్ర చేసే వాహనం తెప్పించారు. అందులో తనని ఎక్కిస్తున్నారు. పిల్లలిద్దరి కళ్ళూ కన్నీళ్ళతో నిండి ఉన్నాయి. వాళ్ళనలా చూసేసరికి గుండె తరుక్కుపోయింది శేషగిరికి.
తనెప్పుడూ వాళ్ళని ప్రేమతో దగ్గరకు తీసుకోలేదు. పిల్లల బాధ్యతంతా శ్యామలే తీసుకుంది. కనీసం తను ఆమెకు సహకరించలేదు సరికదా, డబ్బుల కోసం ఆమెను మరింత పీడించాడు. పాపం, శ్యామల అష్టకష్టాలు పడి వాళ్ళని చదివించింది. వాళ్ళని చదివించడానికి ఎక్కడెక్కడ పని చేసిందో మరి! పిల్లలు కూడా బుద్ధిమంతులే! వాళ్ళ భవిష్యత్తు ఏమిటో? పై చదువులు ఎలా చదువుతారో? నవ్వు వచ్చింది శేషగిరికి. ఇన్నాళ్ళూ వాళ్ళని పట్టించుకొనే లేదు. ఇప్పుడు తన చేతిలో ఏమీ లేదు, ఏమీ చేసే అవకాశమే లేదు.
కొద్దిసేపట్లో తన దేహాన్ని కిందకి దించి ఇంట్లోకి తీసుకెళ్ళి నేల మీద పడుక్కోబెట్టారు. ఎవరో తల వద్ద నూనె దీపాన్ని వెలిగించారు. తన చిత్రం తీసుకొచ్చి, కుర్చీలో పెట్టి పూలదండ వేసి, అగరొత్తులు వెలిగించారు.
అప్పటివరకూ ఇంట్లోనే ఉన్న ఉమ ఏడుస్తూ వచ్చి తల్లిని వాటేసుకుంది. కన్నీళ్ళతో ఉబ్బిపోయి ఎర్రగా ఉన్న ఆమె కళ్ళను చూసేసరికి జాలివేసింది శేషగిరికి. పాపం పిచ్చి పిల్ల! తనంటే ఆమెకెంతో ప్రేమ! ఇంట్లో అందరూ తనను ద్వేషించినా తన దగ్గరకు వచ్చి ప్రేమతో మాట్లాడేది. ఇప్పుడు తండ్రిలేని పిల్లైంది. మళ్ళీ తనలో తాను నవ్వుకున్నాడు శేషగిరి. తనకీ ఉమంటే ప్రేమే అయినా ఆమెను ఎన్నడూ లాలించి ఎరగడు, దగ్గరకు తీసుకొని ఎరగడు. నిజమే తను దుర్మార్గుడు!
ఉమ భవిష్యత్తు ఏమిటో? పెళ్ళెలా అవుతుందో? తను పెద్ద ఉద్యోగం చేసేడన్న మాటే కానీ, తన వ్యసనాలతో వాళ్ళకి అప్పుల్ని మాత్రమే మిగిల్చాడు. చివరికి, ఆస్పత్రి పాలైన తన చికిత్స కోసం లక్షలకు లక్షలు అప్పు చేసారు కూడా. ఇల్లు కూడా తాకట్టులో ఉంది, తనని నమ్ముకున్న వాళ్ళందరికీ నిలువ నీడ లేకుండా పోయే రోజు దగ్గరలోనే ఉంది. ఏడుపొచ్చింది శేషగిరికి.
వాళ్ళందర్నీ ఎంత బాధపెట్టాడు! తను మాత్రం జీవితాంతం తన స్వార్థానికే ప్రాముఖ్యత ఇచ్చాడు. బతికి ఉన్నన్నాళ్ళూ తన వాళ్ళూ ఒక మాదిరిగా తనను ద్వేషించారు. ఇప్పుడు తను చనిపోయిన తర్వాత వాళ్ళ బాధను చూసేసరికి తిరిగి బతకాలనిపిస్తోంది. తను లేకపోతే వాళ్ళ గతి ఏమిటి? పశ్చాత్తాపంతో హృదయం దహించుకుపోతోంది! కళ్ళు తుడుచుకుంటూ దేవుడివైపు చూసాడు శేషగిరి.
అతని మనసులోని భావన దేవుడికి అర్ధమైనట్లు ఉంది.
"శేషగిరీ! నువ్వు తిరిగి బతికి వాళ్ళని ఉద్ధరించే అవకాశమే లేదు. నీకున్న అవకాశాలు ముందే జారవిడుచుకున్నావు. ఇన్నాళ్ళూ వాళ్ళని పట్టించుకోలేదు. నువ్వు మళ్ళీ బతికినా వాళ్ళను పట్టించుకుంటావన్న నమ్మకం ఎవరికీ లేదు. " అన్నాడు నవ్వుతూ.
తలవంచుకున్నాడు శేషగిరి. కింద ఏదో కలకలం వినపడటంతో అటు తిరిగి చూసాడు. తనతో కార్యాలయంలో పనిచేసే వాళ్ళు వచ్చారు. పువ్వుల దండలు శరీరంపై వేసి నమస్కరించి మౌనంగా నిలబడ్డారు. కొందరు వెళ్ళి శ్యామలను, పిల్లల్ని పరామర్శిస్తున్నారు. అందరిలాగే రామ్మూర్తి కూడా నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతన్ని చూడగానే శేషగిరికి దఃఖం కట్టలు తెంచుకుంది. కార్యాలయంలో తను చేసే అవినీతికి అడ్డుపడ్డాడని, తప్పుడు ఫిర్యాదులు చేసి అతన్ని కొన్నాళ్ళు తాత్కాలికంగా ఉద్యోగం నుండి తొలగించాడు. చాలా విధాలుగా బాధ పెట్టాడు.
తన కింద పనిచేసేవాళ్ళని వేధించాడు, పురుగుల్లా చూసాడు. రామ్మూర్తే కాదు ఇంకా అలాంటి ఎంతమందినో తను బాధపెట్టాడు. ఉద్యోగంలో పదోన్నతి కోసం ఎంతమందినో తొక్కేసాడు. ప్రమాదవశాత్తూ చనిపోయిన కైలాశరావు కుటుంబానికి నష్టపరిహారం మంజూరు చెయ్యడం కోసం లంచం తీసుకున్నాడు. పింఛను మంజూరు చెయ్యడం కోసం ఎంతమందినో క్షోభ పెట్టాడు.
ఎంత మందినో బాధపెట్టి అవినీతిలో కూరుకుపోయి, అయిన వాళ్ళను పట్టించుకోని తను చివరికి సాధించిందేమిటి? తన వ్యసనాలతో రకరకాల వ్యాధుల బారిన పడి చివరకు మరణయాతన అనుభవించాడు.
ఇప్పుడిక తను చేసిన తప్పులు దిద్దుకొనే అవకాశమే లేదు. తను చేసిన పాపాలు తన భార్యా పిల్లలను వెంటాడుతున్నాయి, వేధిస్తున్నాయి.
తన వ్యసనాల వల్ల డబ్బంతా హారతి కర్పూరంలా ఎగిరిపోయింది, చివరకు వాళ్ళకు అప్పులే మిగిలాయి. పాపం ఎలా బతుకుతారో ఏమో! తనిప్పుడు వాళ్ళపై జాలిపడినా ప్రయోజనమేమీ లేదు. దీర్ఘంగా నిట్టూర్చాడు శేషగిరి. అయిపోయింది, అంతా.. అయిపోయింది! ఇంకొద్ది గంటల్లో తన శరీరం అగ్నికి ఆహుతైపోతుంది. ఎంతటివాడైనా చివరకు పిడికెడు బూడిద అవవలసిందే కదా!
మహామహులకే తప్పలేదు, తనెంత! చూస్తూండగానే తన అంతిమ యాత్ర ప్రారంభమైంది. కన్నీళ్ళు తుడుచుకుంటూ దేవుడివైపు చూసాడు.
అతని ఉద్దేశం గ్రహించినట్లున్నాడు దేవుడు. క్షణం తర్వాత శేషగిరికి ఏమీ కనపడలేదు.
తను చేసిన పాపాలకు ఒకరోజు పూర్తిగా శిక్ష అనుభవించిన తర్వాత, తన వాళ్ళు తనకోసం ఎంత తల్లడిల్లుతున్నారో, ఎంత బాధపడుతున్నారో తెలుసుకోవాలని అనిపించింది శేషగిరికి. తమ్ముడు శివప్రసాద్ కి, రామ్మూర్తికి, కైలాసరావు కుటుంబానికి మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నాడు. వచ్చే జన్మంటూ ఉంటే వాళ్ళ ఋణం తప్పక తీర్చుకోవాలి. తన భార్య శ్యామల ఇప్పుడేం చేస్తోందో? రవి, గిరి చదువులెలా సాగుతాయో? ఉమ పెళ్ళి ఎలా అవుతుందో? భగవంతుడా వారికి దారి ఏది? మనసులోనే రోదించ సాగాడు శేషగిరి.
"పిలిచావా నాయనా?" అని వినపడేసరికి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు.
ఆశ్చర్యం! తను పాపాత్ముడైనా దేవుడు పలుకుతున్నాడు. తన మనో వేదన దేవుడి ముందుంచాడు శేషగిరి.
"స్వామీ అయినవాళ్ళందర్నీ నట్టేట ముంచాను. కేవలం నా స్వార్థం, సుఖం మాత్రమే చూసుకున్నాను. ఎంతో మందికి క్షోభ కలుగజేసాను. అలాంటి పాపాత్ముడిపై ఎంతటి దయ చూపుతున్నావు స్వామీ!" అన్నాడు శేషగిరి విస్మయంగా.
మందహాసం చేసాడు దేవుడు.
"నాకు అందరూ ఒకటే నాయనా! పాపాత్ముడైనా, పుణ్యాత్ముడైనా నాకు ఒకటే! ఎవరి కర్మ వారు అనుభవించవలసిందే, అందులో నేను కలుగజేసుకోలేను. ఇంతకీ నీ బాధేమిటి చెప్పు!" అన్నాడు దేవుడు.
"నా భార్యా, పిల్లలు ఎంత బాధ పడుతున్నారో పాపం! వాళ్ళెలా ఉన్నారో చూడాలనిపించింది స్వామీ. ఈ ఒక్కసారికీ కాదనక నా కోరిక తీర్చు స్వామీ!" అతి దీనంగా వేడుకున్నాడు శేషగిరి.
"అలాగే నాయనా!" అన్నాడు దేవుడు.
మరుక్షణం శేషగిరి మనోనేత్రాలు తెరుచుకున్నాయి
******
కళ్యాణ మంటపం కిటకిటలాడుతోంది. అత్యంత వైభవంగా పెళ్ళి జరుగుతోంది. ఎవరిదా పెళ్ళి అని ఆసక్తిగా చూసాడు శేషగిరి.
పెళ్ళిపీటలపై మంత్రాలు చదువుతున్న పురోహితుడి ఎదురుగా కూర్చున్న పెళ్ళికూతుర్ని చూసి అంతులేని విస్మయానికి గురైయ్యాడు. ఆమె మరెవరో కాదు. తన కూతురు ఉమ! పెళ్ళిపీటలపై పట్టు చీరలో మెరిసిపోతోంది! ఆమె పక్కన కూర్చున్న పెళ్ళికొడుకుపై అతని దృష్టి మరలింది. అందంగా, హుందాగా ఉన్నాడు పెళ్ళికొడుకు. ఒక్క క్షణం తనను తాను మైమరచిపోయాడు శేషగిరి. చాలా వేడుకగా సాగుతోంది పెళ్ళి. నలుగురూ వచ్చి వధూవరులపై అక్షతలు చల్లుతున్నారు.
తన పెద్ద కొడుకు రవి, గిరి కూడా ఆ పక్కనే ఉన్నారు. వాళ్ళను చూడగానే ఆశ్చర్యపోయాడు. ఇద్దరూ అంత పెద్దవాళ్ళు ఎప్పుడయ్యారో అతనికి అర్ధం కాలేదు. వాళ్ళ పక్కనే ఉన్న శ్యామలను చూడగానే అతని ఆశ్చర్యానికి అంతులేదు. మొహం బొట్టు లేక కళా విహీనంగా ఉంటుందనుకున్నాడు. బొట్టు లేకపోయినా ఆమె మొహం సంతోషంతో వెలిగిపోతోంది. బక్క చిక్కి, కృశించిపోయి ఉండే ఆమెలో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. మొహంలో ఎంతో కళ వచ్చింది.
తన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని తెలిసి శేషగిరి మనసు తేలికైంది. అయితే.. మరు క్షణం ఒక సందేహం కలిగింది. తను చనిపోయిన ఒక్క రోజులోనే ఇంత మార్పా? ఎలా సాధ్యమైందసలు? అప్పుడు గుర్తించాడు తన ఇల్లు కూడా చాలా మారిపోయింది.
పెళ్ళికి వచ్చిన మాటలెవరివో శేషగిరి చెవుల పడ్డాయి.
"భర్త బతికుండగా పాపం ఆవిడ ఎంత బాధలు అనుభవించిందో? ఆవిడకు, పిల్లలకు సరైన తిండి కూడా కరువైయ్యేది. సరైన బట్టలు కూడా ఉండేవి కావు. పెద్ద ప్రభుత్వ ఉద్యోగం చేసి రెండు చేతులా ఆర్జించి కూడా తన వ్యసనాలకే ఖర్చు పెట్టేసాడా మహానుభావుడు.
అతను చనిపోయాకే వాళ్ళ దశ తిరిగింది. ప్రభుత్వం నుండి రావలసిన బకాయిలు, డబ్బులు అంది అప్పులన్నీ తీర్చేసుకున్నారు. పిల్లలకు మంచి చదువులు చెప్పించింది. తను కష్టపడి పని చేసి, కూతుర్ని కూడా బాగా చదివించి, మంచి సంబంధం కుదిర్చింది. " చెప్పాడు తన స్నేహితుడితో.
"నిజమే! అతను బతికి ఉండి ఉంటే, జీవితమంతా దరిద్రంలోనే కొట్టుమిట్టాడేవారు. చనిపోయి కుటుంబానికి గొప్ప మేలు చేసాడుఅతను. " అన్నాడు అతని మిత్రుడు.
నిర్ఘాంతపోయాడు శేషగిరి. నిజమే! బతికినంతకాలం తనెవరికీ ఉపయోగపడలేదు. తన మరణం వాళ్ళకు ఊహించని వరం అయింది. లేకపోతే వాళ్ళు అన్నట్లుగానే జీవితాంతం బాధపడేవారు. వాళ్ళనలా చూసిన తర్వాత శేషగిరి మనోక్లేశం దూరమైంది. మనసు ప్రశాంతంగా మారింది. అయితే ఒక సందేహం అతని మదిని దొలిచేయసాగింది. కేవలం ఒక్కరోజులోనే ఇదంతా ఎలా సాధ్యపడిందసలు?
అతని భావం అర్ధమైన దేవుడు అతని సందేహాన్ని కూడా తీర్చాడు.
"నాయనా శేషగిరీ! ఇక్కడ ఒక్కరోజు, భూమి మీద పదేళ్ళతో సమానం. నీ సందేహం తీరింది కదా!" అన్నాడు.
తల ఊపాడు శేషగిరి. మరుక్షణం అతని మనోనేత్రాలు తిరిగి మూసుకున్నాయి. ఇప్పుడతనికి చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ అనుభవిస్తున్న శిక్షలు కూడా బాధించనంత ప్రశాంతంగా ఉంది అతనికి.
సమాప్తం
పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.
Comments