top of page

ఉమ మంచి మనస్సు


'Uma Manchi Manassu' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

'ఉమ మంచి మనస్సు' తెలుగు కథ

రచన, కథా పఠనం: నీరజ హరి ప్రభల

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

"అమ్మా! టిఫిన్ బాక్స్ రెడీనా! స్కూలుకు టైమవుతోంది." పెద్దగా అంటూ హడావిడిగా వచ్చింది సుమ.


"రెడీ! ఇదిగో!" అంటూ బాక్సును కూతురి చేతికిచ్చింది తల్లి యశోద. దాన్నందుకుని హడావిడిగా బయలుదేరి స్కూలుకు వెళ్లింది ఉమ.


స్కూలుకు సమీపంలోనే ఉమ ఇల్లు. స్కూలుకు ప్రతి రోజూ నడిచి వెళ్లివస్తుంది. ఉమ స్కూలుకు చేరేటప్పటికి పిల్లలందరూ క్యూ లైనులో ఆవరణ లోపలికి నడుస్తూ తమ తమ తరగతి గదులలోకి వెళుతున్నారు. ఉమ ఆఫీసు రూములోకి వెళ్లేటప్పటికి ప్రధానోపాధ్యాయుడు రాఘవయ్య, మిగిలిన సహోద్యోగులు అందరూ కూర్చుని ఉన్నారు. అందరినీ పలకరించి హాజరుపట్టిలో సంతకం చేసి తన సీట్లో కూర్చుంది ఉమ.


ఆతరువాత ఆ స్కూలు ఆవరణలో పిల్లలందరూ క్యూవరసలో నుంచున్నారు. ప్రధానోపాధ్యాయులు, మిగిలిన ఉపాధ్యాయులందరూ కలిసి ఆ ఆవరణలో నుంచోగానే ప్రార్ధనా శ్లోకాలు, జనగణమణని పిల్లందరూ ఆలపించారు. తర్వాత అందరూ క్యూ వరుసలో నడిచి వెళ్లి తమ తమ తరగతుల గదులలోకి వెళ్లి కూర్చున్నారు.


ప్యూను గంట కొట్టగానే తన తరగతి గదిలోకి వెళ్లింది ఉమ. పిల్లలందరూ లేచి నుంచుని "గుడ్ మార్నింగ్ టీచరు గారు" అనగానే ఉమ కూడా "గుడ్ మార్నింగ్ పిల్లలూ! కూర్చోండి" అన్నది. పిల్లలందరూ కూర్చోగానే హాజరుపట్టీలో పిల్లల పేర్లను పిలిచి హాజరు వేసింది ఉమ.


ఆ స్కూలులో ఉమ 2, 3, 4, 5. తరగతుల విద్యార్థులకు తెలుగు బోధిస్తుంది. ఉమ పాఠం చెప్పి అందులో విద్యార్థుల సందేహాలకు సమాధానాలిచ్చింది. విద్యార్థులకు చక్కగా వాళ్లకి అర్ధమయ్యే రీతిలో పాఠాలను బోధించే ఉమ అంటే విద్యార్థులందరికీ చాలా గౌరవాభిమానాలున్నాయి. ఇంతలో స్కూల్ గంట మ్రోగగానే ఉమ తరగతి గదినుంచి బయటకు వచ్చింది. అ తర్వాత మధ్యాహ్నం భోజన సమయంలో తోటి సహచరులతో కలిసి భోజనం ముగించి ఆతరువాత మిగిలిన తరగతుల విద్యార్థులకు పాఠాలను బోధించి సాయంత్రం ఇంటికి చేరింది.


అలసిపోయి ఇంటికి వచ్చిన ఉమకి తల్లి వేడివేడి కాఫీ అందించింది. అది త్రాగి కాసేపు తల్లితో కబుర్లు చెప్పింది ఉమ. ఇది ప్రతిరోజూ జరిగే దినచర్య. ఆ రాత్రి గతాన్ని గురించిన ఆలోచనలతో ఉమకు సరిగ్గా నిద్ర పట్టలేదు.


ఉమ తండ్రి చంద్రయ్య ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ భార్యను, కూతురిని ఉన్నంతలో ప్రేమగా చూసుకుంటూ గుట్టుగా సంసారాన్ని నడుపుతున్నాడు. ఉమ కూడా చక్కగా పెరుగుతూ చదువులో ప్రతిభతో రాణిస్తోంది. చురుకుగా ఉండే కూతుర్ని చూసి గర్వంగా ఉండేవాడు చంద్రయ్య. ఉమ మంచిమార్కులతో పదవతరగతి పాసయ్యి కాలేజీలో చేరింది. కష్టపడి చదువుతూ స్కాలర్షిప్ ను తెచ్చుకుంది. తండ్రి సంపాదనకు తోడుగా కాలేజి నుంచి ఇంటికి రాగానే తనుకూడా ఇంటివద్ద పిల్లలకు ట్యూషన్లు చెప్పేది. సంస్కారవంతమైన ఆ కుటుంబం అంటే చుట్టుప్రక్కల అందరికీ గౌరవాభిమానాలున్నాయి.


రోజులు హాయిగా గడుస్తున్నాయి. ఉమ కాలేజీలో చేరి ఇంటరు, డిగ్రీ మంచిమార్కులతో పూర్తి చేసింది. ఆరోజున ఉమ తల్లి తండ్రుల ఆనందానికి అంతులేదు. మంచి సంబంధం చూసి ఉమకి పెళ్లి చేద్దామని యశోద తన భర్తతో చెప్పగా కూతురి అభిప్రాయం ప్రకారం చేద్దామంటూ చంద్రయ్య ఉమని పిలిచి అడిగాడు. తను BEd పూర్తి చేసి ఏదైనా స్కూలులో టీచర్ ఉద్యోగం చేయాలను కుంటున్నానని ఉమ తన స్ధిర నిర్ణయాన్ని వెలిబుచ్చింది. 'సరే' అని తల్లి తండ్రులు ఉమని BEd లో చేర్చారు.


ఉమ BEd చేస్తున్న సమయంలో చంద్రయ్యకు హార్ట్ ఎటాక్ వచ్చి శాశ్వతంగా కన్నుమూశాడు. జరిగిన దారుణానికి యశోద, ఉమ గుండెలవిసేలా రోదించారు. తనకి తనే ధైర్యం చెప్పుకుని తల్లిని ఓదార్చి ఇరుగుపొరుగు వారి సాయంతో జరుగవలసిన కార్యక్రమాలను యధావిధిగా జరిపించింది ఉమ.


కొన్నాళ్లకు క్రమేణా యశోద మామూలు మనిషయింది. ఉమ BEd పూర్తి కాగానే ట్రైనింగ్ ని కూడా పూర్తి చేసి DSC పరీక్షలు వ్రాసి అదృష్టం కొద్దీ గవర్నమెంట్ స్కూలులో టీచర్ గా ఉద్యోగంలో చేరింది. ఉద్యోగంలో చేరే మొదటి రోజున తండ్రి ఫొటోకు నమస్కరించి కన్నీటిపర్యంతమైన ఉమని ప్రేమగా అక్కున చేర్చుకుని ఓదార్చింది యశోద. తర్వాత తల్లి పాదాలకి నమస్కరించిన కూతురిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది యశోద.


ఉమ యధావిధిగా ఉద్యోగం చేసుకుంటూ కొంతకాలానికి మంచి టీచరుగా పేరుతెచ్చుకుంది. ఏదో చప్పుడైతే గతంనుండి తేరుకుని క్రమేణా నిద్రలోకి జారింది ఉమ.


రోజులు గడుస్తున్నాయి. ఒకరోజున ఉమ స్కూలు నుంచి వస్తుంటే ఒక సంఘటన జరిగింది. చిరిగిన దుస్తులు, చింపిరి జుట్టుతో ఉన్న సుమారు పదేళ్ల వయస్సున్న ఒక పాప ఉమ వద్దకు వచ్చి అడుక్కుంటూ కన్పడింది. ఉమ మనసు తరుక్కుపోయింది.


ఉమ ఆ పాపని వివరాలడిగితే ఆ పాప తన గతాన్ని వివరించింది. తన పేరు యాదమ్మ అని, తన చిన్నప్పుడే తల్లీతండ్రి విడిపోయారని, తల్లి కూడా తనను చేరదీయలేదని, ఎవరో ఒకాయన చేరదీసి ఇలా అడుక్కోటానికి పంపిస్తున్నాడని, ఈ వచ్చిన డబ్బులను ఆయన తీసుకుని గుప్పెడు అన్నం పెడతాడని, ఇటీవల ఆయన కూడా చనిపోయాడని, ఇలా అడుక్కుంటూ వచ్చిన డబ్బులతో ఏదైనా కొనుక్కుని తింటానని, దయతలిచి ఎవరైనా అన్నం పెడితే తిని రాత్రిపూట ఈ దగ్గరలోని చెట్టు క్రింద అరుగుమీద పడుకుని నిద్రపోతానని చెప్పింది. అదంతా విన్న ఉమ చాలా బాధపడి ఆ పాపకేదన్నా మంచి దోవ చూపించాలని నిర్ణయించుకుంది.


"చూడు యాదమ్మా! నీవు నాతో వస్తావా? నీకు ఏ లోటూ లేకుండా చూసుకుంటాను. ఇంక నీవు అడుక్కోవాల్సిన అవసరం ఉండదు. నీకు తిండి, బట్టలు ఇచ్చి మంచిగా చదివిస్తాను. నీకు చదువంటే ఇష్టమేనా? "అని అడిగింది ఉమ.


"చదువంటే ఏంటమ్మా?" అంది యాదమ్మ.


"నాతో మాఇంటికి రా! అన్నీ నీకు వివరంగా చెబుతాను" అన్నది ఉమ.


"దండాలమ్మా" అంటున్న యాదమ్మ ముఖంలో సంతోషంతో కూడిన వెలుగు కొట్టొచ్చినట్లు కనపడింది ఉమకు.


ఉమ యాదమ్మను తన ఇంటికి తీసుకుని వెళ్లి జరిగినదంతా తన తల్లికి వివరించి చెప్పి "ఇంక నుంచి మనం ఈ పాపని చక్కగా చూసుకుందామమ్మా!" అంది ఉమ..


ఉమ మంచి మనసుకు సంతోషించి "సరే!" అంది యశోద. "యాదమ్మా!" ఇంక నుంచి నీ పేరు దీప. సరేనా! నన్ను 'అమ్మా' అని, మా అమ్మను 'అమ్మమ్మా' అని పిలు" అంది ఉమ.


"సరేనమ్మా!" అంది దీప.


దీపకి స్నానం వగైరా చేయించి జడ వేసింది యశోద. ఈలోపు దగ్గరున్న షాపుకి వెళ్లి దీపకి కొన్ని బట్టలు కొని తీసుకుని వచ్చింది ఉమ. వాటిని సంతోషంతో వేసుకుని యశోద పెట్టిన అన్నం తృప్తిగా తిని హాయిగా పడుకుంది దీప.

"పాపం! ఎన్నిరోజులైందో దీప కడుపునిండా అన్నం తిని, కంటినిండా నిద్రపోయి"! అనుకున్నారు ఉమ, యశోదలు.


ఆ మరునాడు ఉమ దీపని తనతో స్కూలుకు తీసికొని వెళ్లి రాఘవయ్య గారికి, తోటి సహోద్యోగులకు జరిగినదంతా వివరించి చెప్పింది. ఉమ చేసిన మంచి పనిని అందరూ అభినందించారు. రాఘవయ్య గారి నుంచి అప్లికేషన్ ను తీసుకుని దానిని పూర్తి చేసి ఫీజు కట్టి దీపని స్కూలులో చేర్చింది ఉమ.


దీప సంతోషంగా తరగతి గదిలోకి వెళ్లి తోటిపిల్లలతో కలిసి కూర్చుంది. అతి త్వరలోనే ఆ ఇంటివాతావరణాన్ని, ఆ స్కూలు వాతావరణానికి అలవాటు పడింది దీప. చదువులో అనేక సందేహాలను ఉమని అడిగి తెలుసుకుంటోంది. స్వతహాగా తెలివిగల దీప చక్కగా చదువుకుంటున్నది. దీపని చూసి చాలా సంతోషిస్తున్నారు ఉమ, యశోదలు. దీప మాటలు, చలాకీతనంతో ఆ ఇల్లంతా సందడి నెలకొంది.


కాలం గడుస్తున్నది. కొన్నాళ్ల తర్వాత ఉమని తన సహోద్యోగి విజయ్ ఉమని, ఆమె మంచి మనసుని ఇష్టపడ్డట్టు, ఆమె అంగీకరిస్తే పెళ్లి చేసుకుందామని తన మనసులో మాట చెప్పాడు. విజయ్ తనొక అనాధ అని, చిన్నప్పటి నుంచి అనాధాశ్రమంలో పెరిగి కష్టపడి చదివి ఈ ఉద్యోగాన్ని పొందానని తన గురించి వివరించాడు.


ఉమకి కూడా విజయ్ ప్రవర్తన, అతని నడవడిక తెలుసు కనుక అతనితో పెళ్లికి సుముఖత చూపింది. తన తల్లిని, దీపని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత తనకుందనీ, వాళ్లు మనతో పాటే ఉంటారని, అందుకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే మన పెళ్లి" అంది ఉమ. ఆమాటలకు మనస్ఫూర్తిగా తన అంగీకారాన్ని తెలిపాడు విజయ్.


ఆ సాయంత్రం ఉమ తనతో విజయ్ ని తన ఇంటికి తీసికొని వెళ్లి తల్లికి పరిచయం చేసి అతని వివరాలను చెప్పి తమ ఇద్దరి నిర్ణయాన్ని తెలిపింది. విజయ్ మాట తీరు, పెద్దలంటే మర్యాద గమనించిన యశోద సంతోషంగా వాళ్ల పెళ్లికి అంగీకరించింది.


ఒక శుభముహూర్తాన రిజిస్ట్రార్ ఆఫీసులో ఉమ, విజయ్ లు పెళ్లి చేసుకున్నారు. దీప సంతోషంగా విజయ్ ని 'డాడీ ' అని పిలుస్తూ అతనికి దగ్గరైంది. విజయ్ కూడా దీపని ప్రేమగా చూసుకుంటున్నాడు. రోజులు హాయిగా గడుస్తున్నాయి. ఉమ, విజయ్ లు అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. ప్రతిరోజూ ఇద్దరూ దీపని తీసుకుని స్కూలుకు వెళ్లి వస్తున్నారు. వాళ్లని చూసి యశోద చాలా సంతోషంగా ఉంటోంది. ఉమ సంసారాన్ని చల్లగా చూడమని భగవంతుడికి చేతులు జోడించి నమస్కరించింది యశోద.


..సమాప్తం.

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏





Comments


bottom of page