top of page
Writer's pictureNagamanjari Gumma

ఉమ్మడి కుటుంబం

#NagamanjariGumma, #నాగమంజరిగుమ్మా, #UmmadiKutumbam, #ఉమ్మడికుటుంబం, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Ummadi Kutumbam - New Telugu Story Written By Nagamanjari Gumma

Published In manatelugukathalu.com On 22/11/2024

ఉమ్మడి కుటుంబం - తెలుగు కథ

రచన: నాగమంజరి గుమ్మా

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



"నీ చెంతే ఒక చెంచిత ఉంటే వెన్నెల్లో వేట అది" పాట మోగుతోంది. తడిచేతులు చీరకొంగుకు తుడుచుకుంటూ చరవాణి వైపు చూసింది. పతి దేవుడు. "ఈరోజు కూడా ఆలస్యంగా వస్తారు కాబోలు" అనుకుంటూ చరవాణి తీసింది ఆదిలక్ష్మి. 


"ఆది, నేను వచ్చేసరికి ఎనిమిది దాటుతుంది. పర్వాలేదు కదా… ఒంట్లో కులాసాగా ఉందా? వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురానా?" ఆగకుండా అడిగేసాడు రామచంద్రం. 


"నా ఒంట్లో కులాసాగానే ఉంది. మీరు నెమ్మదిగా రండి" అని చెప్పింది ఆదిలక్ష్మి. 


"సరే"నని పెట్టేసాడు రామచంద్రం.


తాము ఉంటున్నది పల్లె కాదు, పట్నము కాదు. ఒకప్పుడు పక్కా పల్లెటూరు అయినప్పటికీ, ఇప్పుడు నగరజీవిత సదుపాయాలన్నీ అందుబాటులోకి వచ్చాయి. కేబుల్ టీవీ, పది పదిహేను ఆటోలు, ఒకటో రెండో కార్లు, అన్ని రకాల వస్తువులు దొరికే దుకాణాలు, కొన్ని ఇళ్లకు ఏసీలు, వాషింగ్ మెషీన్లు, ఇలా అధునాతన సౌకర్యాలు ఇళ్లలోను, ఊళ్లోనూ కూడా అందుబాటులో ఉంటున్నాయి. 


దాదాపు పది సెంట్ల స్థలంలో ఉన్న మండువా లోగిలి రామచంద్రం వాళ్ళది. ఎప్పుడో తాతల కాలం నాడు బెల్లం, కట్టుబడి సున్నంతో కట్టించిన ఇల్లు. పది గదులు, విశాలమైన నడవ, మధ్యలో వాకిలి, వీధిలో పూల మొక్కలు, పెరటిలో చెట్లు, పెద్ద మంచినీటి బావి. వీటన్నిటికీ మించి, రామచంద్రం పెదనాన్న, చిన్నాన్నల కుటుంబాలు, తాత నాయనమ్మ, విధవరాలైన మేనత్త, ఆమె పిల్లలు, ఇలా పది గదులు నిండి కళకళ లాడుతూ ఉండేది ఇల్లు. 


రామచంద్రానికి పెద్దకొడుకు పుట్టేక తాత, నాయనమ్మ కొద్దిరోజుల తేడాలోనే స్వర్గస్తులయ్యారు. మేనత్త కొడుకుకు పూణేలో ఉద్యోగం వచ్చి, తల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు. మేనత్త కూతురుని చిన్నాన్న తన కోడలిగా చేసుకున్నారు. పెదనాన్న, చిన్నాన్నల పిల్లలు కూడా చదువులప్పుడే పట్నం వెళ్ళిపోయి, తర్వాత అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడి పోయారు. ఆడపిల్లలందరూ పెళ్లిళ్లయి భర్తలతో వేరే ఊళ్లలో కాపురాలు చేసుకుంటున్నారు. రామచంద్రం కొడుకులు ఇద్దరూ పట్నంలో ఉన్న కాలేజీల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసి, పెళ్లిళ్లు అయ్యాక విదేశాలకు వెళ్లిపోయారు. అంత పెద్ద ఇంట్లో రామచంద్రం, భార్య ఆదిలక్ష్మి, తండ్రి, తల్లి మాత్రమే ఉండేవారు. పొలాలు ఉన్నా, రామచంద్రం తాత పిల్లలందరికీ మంచి చదువులే చెప్పించాడు. చిన్నాన్న చదువుకున్నా, తండ్రితో పాటు వ్యవసాయం చూసుకునేవాడు. ఒక వర్షాకాలం సాయంత్రం చేలో చేరిన నీళ్లు బయటకు పంపడానికి బోదెలు తీస్తూఉండగా పాము కాటుకు గురై చనిపోయాడు. పిన్నిని కొడుకు తమ ఇంటికి తీసుకుపోయాడు. పెదనాన్న ఊళ్ళో బడిలో పంతులుగా పనిచేసి వృద్ధాప్యం వలన మానేశారు. పెదనాన్నని, పెద్దమ్మని కొడుకులు తమతో తీసుకుపోయారు. వాళ్ళు మళ్ళీ కాలం చేసాక, గుప్పెడు బూడిదగా మారడంకోసం మాత్రమే సొంతవూరికి వచ్చారు.


 ఎన్నో పండుగలు, పెళ్లిళ్లు, పురుళ్ళు, పుణ్యాలు, మరణాలు చూసిన ఇల్లు కాలక్రమేణా బోసిపోయింది. ఆదిలక్ష్మి కాపురానికి వచ్చింది మొదలు పెద్దవాళ్ళ అదుపు ఆజ్ఞలలో ఒద్దికగా ఉండటంతో, ఏ విషయమైనా అవసరం అయితేనే ఆదిలక్ష్మి తో చెప్పేవాడు రామచంద్రం. పెద్దవాడి పెళ్లి అయ్యాక రామచంద్రం తల్లి, చిన్నకొడుకు పెళ్లి చూడకుండానే రామచంద్రం తండ్రి కూడా మరణించారు. కానీ పిల్లలు విదేశాలకు వెళ్ళిపోయాక, తామిద్దరమే మిగిలాక ప్రతి విషయం ఆదిలక్ష్మితో చర్చించడం మొదలుపెట్టాడు రామచంద్రం.

 

పొలాన్ని కౌలుకు ఇచ్చేసి, పట్నంలో ఉద్యోగం చేసే రామచంద్రం, హౌసింగ్ బోర్డులో తోటి ఉద్యోగస్తులందరూ స్థలం కొంటూ ఉంటే తాను కూడా కొన్నాడు. అప్పటికీ ఆదిలక్ష్మి అడిగింది, "పట్నంలో స్థలం ఎందుకండీ? ఇక్కడ ఉన్నవి చాలదా" అని. 


"పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఆ స్థలం ఉపయోగపడుతుంది ఉండనీ" అన్నాడు రామచంద్రం. 


"ఊళ్ళో అందరూ కారు కొనుక్కుంటున్నారు, మీరు కూడా కారు కొనుక్కొని, ఆఫీస్ కి వెళ్ళండి" అని పోరుపెట్టేది ఆదిలక్ష్మి. 


"కారు కొంటే అది పెట్టడానికి ఇంటి ముందు ఉన్న పూల మొక్కల్ని తీసేయాలి. షెడ్ కట్టాలి, వద్దు" అనేవాడు రామచంద్రం. 


తమ తాతల నాటి ఈ ఇల్లు అంటే అతనికి ప్రాణం మరి. ఓపిక ఉన్నన్నాళ్లు స్కూటర్ మీద ఆఫీస్ కు వెళ్ళేవాడు. కాస్త చూపు మందగించి, పట్నంలో వేగంగా తిరిగే బళ్లతో పోటీ పడలేక, ఊళ్ళోనే ఉన్న ఒక ఆటో మాట్లాడుకున్నాడు. ఈ ఆటో క్రమంగా ఇంటి ఆటో గా మారిపోయింది. ఇంటినుండి అడుగు బయట పెడితే ఆటో పిలవాల్సిందే.


ఈమధ్య గత నాలుగు రోజులుగా భర్త ఆఫీస్ నుండి రావడం ఆలస్యం అవుతోంది. ఆటో కుర్రాడిని అడిగితే "బాబు సైట్ దగ్గరకు వెళ్తున్నారమ్మా" అన్నాడు. వంట పూర్తి చేస్తూ ఆలోచిస్తోంది ఆదిలక్ష్మి. హాల్లో గడియారం 8 గంటలు కొట్టింది. అంతలోనే ఆటో చప్పుడయ్యింది. గబగబా బయటకు వచ్చింది ఆదిలక్ష్మి. ఆటో దిగుతున్నాడు రామచంద్రం. భర్తకు కాళ్ళు కడుక్కోడానికి నీళ్లు అందించి, తువ్వాలు చేతితో పట్టుకుని నిల్చుంది ఆదిలక్ష్మి. 


"ఈమధ్య తరచూ అలస్యమౌతోంది" అంది ఆదిలక్ష్మి.


చిరునవ్వు నవ్వి "లోపలికి రాకుండానే" అన్నాడు రామచంద్రం.


లోపలికి వచ్చి దుస్తులు మార్చుకుని, పంచె కట్టుకుని, తువ్వాలు భుజం మీద వేసుకుని వంటగదిలోకి వచ్చాడు రామచంద్రం. ఈలోగా ఆదిలక్ష్మి కంచాలు వేసి, నీళ్లు పెట్టి, పీటలు వాల్చింది. 50 ఏళ్ళు దాటిన దగ్గరనుండి రాత్రిళ్ళు భోజనం మానేశారు దంపతులు ఇద్దరూ... మినపరొట్టి లేదా చపాతీ చేస్తుంది. ఆదివారం అయితే రాత్రి పూట పళ్ళు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. తినడం పూర్తి అయ్యాక, "వంటిల్లు సర్దేసి రా, మాట్లాడాలి" అన్నాడు రామచంద్రం. 


అప్పటివరకు ఆ కబుర్లు, ఈ కబుర్లు చెప్పుకోవడమే కానీ, అసలు విషయం చెప్పలేదు. ఉన్న ఆ నాలుగు పాత్రలు తోమేసి, చల్లారిన పాలు తోడుపెట్టి, అన్నిటిమీద మూతలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని, వంటగది కిటికీలు తెరచిపెట్టి, తలుపులు దగ్గరగా వేసి, తాంబూలం పళ్ళెం చేత పట్టుకుని బయటకు నడిచింది ఆదిలక్ష్మి.


పూల మొక్కల మధ్య రెండు కుర్చీలు, ఒక చిన్న బల్ల వేసి ఉన్నాయి. మల్లెలు, సన్నజాజుల పరిమళం సన్నగా వీస్తున్న గాలిలో తేలి వస్తోంది. పంచమి చంద్రుడు పలకరిస్తున్నాడు. తాంబూలం పళ్ళెం బల్ల మీద పెట్టి, తమలపాకుకు ఈనెలు తీసి, సున్నం, కాచు రాసి, పచ్చకర్పూరం, కస్తూరి వేసి ఇచ్చింది ఆదిలక్ష్మి. ఆకును నోట్లోపెట్టుకుని, వక్కపలుకు అందుకుని వేసుకున్నాడు రామచంద్రం. చిలకలందించే చిలకల కొలికి లాంటి భార్య వైపు ఓసారి చూసాడు.


"పట్నంలో ఉన్న స్థలంలో ఇల్లు కట్టాలనుకుంటున్నానోయ్" అన్నాడు ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా. 


"అదేం.. అక్కడే ఉండబోతామా?" అడిగింది ఆదిలక్ష్మి.


"ఊఁ. మిగతా వివరాలన్నీ కూడా చెప్తాను. అప్పుడు నేను చేస్తోంది తప్పో ఒప్పో చెప్పు" అన్నాడు రామచంద్రం.


"మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అందులో తప్పు ఇంకెక్కడుంటుంది?" ప్రశ్నించింది ఆదిలక్ష్మి.


"సొసైటీలో మనం కొన్న స్థలం చుట్టూ, మా ఆఫీస్ వాళ్ళ స్థలాలు కూడా మరో మూడు తీసుకున్నాను. ఈ మూడు కూడా నీ పేరిటే ఎల్లుండి రిజిస్ట్రేషన్ చేయిస్తాను."


"ఇప్పుడు అంత స్థలం మనమేం చేసుకుంటామండీ?" ఆశ్చర్యంగా అడిగింది ఆదిలక్ష్మి.


తన ప్లానంతా విడమరిచి చెప్పాడు రామచంద్రం. విప్పారిన కళ్ళతో భర్తనే చూస్తుండిపోయింది ఆదిలక్ష్మి. ఏ పని చేసినా ఆలోచించి చేస్తాడని తెలుసు కానీ మరీ ఇంత ముందుచూపు అని గ్రహించలేకపోయింది. "నేనేమైనా సహాయం చెయ్యనా" అంతా విన్నాక అడిగింది.

 

"రిజిస్ట్రేషన్ పూర్తయ్యి, ఇంటి పని మొదలుపెట్టనీ, నీకు శ్రమ ఎక్కువ లేకుండా ఉన్నంతవరకు నువ్వు చూసుకోవచ్చు." అన్నాడు రామచంద్రం.


"సరే! ఇంక పడుకుందాం, పది దాటుతోంది" అంది ఆదిలక్ష్మి. ఇద్దరూ లోపలికి నడిచారు.

****

భూముల రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. మొత్తం నాలుగు స్థలాలు కలిపితే, పల్లెలో ఉన్న తమ ఇంటి స్థలమంత ఉంది. వేరే ప్లాన్ వద్దని, అదే ఇంటి పద్దతిలో ఈ కొత్త ఇంటికి కూడా శంకుస్థాపన చేయించి, పునాదులు తవ్వించారు. ఉదయాన్నే వంట చేసి, తనకు, భర్తకు రెండు కేరేజీలు కట్టుకుని, అదే ఆటోలో భర్తతో పాటు బయలుదేరేది ఆదిలక్ష్మి. దగ్గరుండి ఇంటి నిర్మాణం చూసుకునేది. సాయంత్రం ఆఫీసు పని పూర్తి కాగానే, ఇద్దరికి ఫ్లాస్కుతో కాఫీ, చిరుతిండి తీసుకుని వచ్చేవాడు రామచంద్రం. తాను చేసేది భర్తకు తినిపించడమే తప్ప, ఇలా భర్త తీసుకురావడం ఎరుగని ఆదిలక్ష్మికి అపురూపంగా అనిపించేది. ఉదయం నుంచి చేసిన పనిని వివరిస్తూ, కాఫీ తాగుతూ, తెచ్చిన సమోసానో, జిలేబినో తింటూ, ఆరుగంటల వరకు ఇద్దరూ ఉండి, తర్వాత పనిని కాంట్రాక్టరుకు అప్పజెప్పి ఆటోలో ఇంటికి వెళ్లిపోయేవారు.


 ఇంటికి రాగానే స్నానం చేసి, ఆదిలక్ష్మి వంట పనిలో పడితే, ఆరోజు తాను చేసిన పనిని, ఇంకా చెయ్యవలసిన పనులను చర్చించేవాడు రామచంద్రం. ఈలోగా కొడుకులు, కోడళ్ళు చేసే ఫోన్లు, మాటలు ఉండనే ఉన్నాయి. త్వరగా ఫలహారం చేసి నిద్రపోయేవారు. 


శనివారం రాత్రి నిద్రపోయే ముందు రామచంద్రం, "రేపు వంటపని పెట్టుకోవద్దని, తెల్లవారే బయలుదేరి పట్నం వెళ్లి చాలామందిని కలవాలని" చెప్పేడు. ఉదయాన్నే లేచి తేలిగ్గా ఉంటుందని మొరుము పులిహార కలిపి సిద్ధం చేసేసింది. ఇద్దరూ ఫలహారం చేసి, ఆటోలో బయలుదేరారు. తాను సేకరించి పెట్టుకున్న చిరునామాలో ఉన్న ప్రకారం మధ్యాహ్నం వరకు నాలుగైదు ఇళ్లకు వెళ్లి మాట్లాడి వచ్చారు.


 రామచంద్రం చెప్పిన మాటకు ముందు ఆశ్చర్యపోయినా, తర్వాత తమ సంతోషం ప్రకటించి, కొందరు అంగీకారం తెలిపారు, మరికొందరు ఆలోచిస్తామన్నారు. ఎవ్వరి ఇళ్లలోనూ భోజనం చేయలేదు రామచంద్రం దంపతులు. నిమ్మకాయ నీళ్ళో, మజ్జిగో మాత్రమే పుచ్చుకునేవారు. 



భోజనం సమయానికి పట్నంలో ఉన్న పెద్ద హోటల్ కు తీసుకు వెళ్ళాడు రామచంద్రం. ఆసక్తిగా చూస్తూ, అనుసరించింది ఆదిలక్ష్మి. ఒక టికెట్ తీసుకుని తమకు కావలసిన పదార్ధాలను తామే ఎంత కావాలన్నా తినవచ్చు, లేదా సర్వర్లు వడ్డిస్తారు. అక్కడ ఉన్న ఆహార పదార్ధాలు చూసి ఆశ్చర్యపోయింది. ప్రతి ఒక్కరకం చెంచాడు చొప్పున రుచి చూసేసరికే కడుపు నిండిపోయినట్లు అనిపించింది. ఆఖరుగా ఫ్రూట్ సలాడ్, ఐస్ క్రీమ్, స్వీట్, తాంబూలం అంటూ కొసరి కొసరి భర్త తినిపించేసరికి ఎంతో సంతోషం అనిపించింది. 


ఆటో డ్రైవర్ ను కూడా తమతో భోజనం చెయ్యమన్నాడు రామచంద్రం. ఆ డబ్బుతో పిల్లలకు ఏమైనా కొని తీసుకువెళ్తానని చెప్పడంతో, భోజనం టికెట్టు డబ్బు ఆటో డ్రైవరుకు ఇచ్చేసాడు. ఆటో డ్రైవర్ కూడా బయట భోజనం చేసి, పిల్లలకు కావలసినవి కొనుక్కుని వచ్చేడు. కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకుని, మళ్ళీ బయలుదేరారు. మరికొన్ని ఇళ్ళ చిరునామాలు పట్టుకుని, వెతుక్కుని వెళ్లి, వాళ్ళ అంగీకారం కూడా తీసుకుని వచ్చేరు. 

దాదాపు ఇల్లు పూర్తి కావచ్చింది. పైకప్పు స్లాబ్ వేద్దాం అనుకున్నారు. మళ్ళీ వద్దనుకుని పెంకులు నేయిద్దామనుకున్నారు. అంత పెద్ద ఇంటికి ఇప్పుడు పెంకులు దొరకవు అంటే, ఎక్కడెక్కడికో చెదిరిపోయిన ఆ కార్మికులను పిలిపించి, చేతితోనే పెంకులను తయారుచేయించి, కాల్పించి సిద్ధం చేయించింది ఆదిలక్ష్మి. నల్లని కడప బండల నేల, ఎర్రని పెంకులు, తెల్లని గోడలు, చుట్టూ పచ్చని మొక్కలు... వెరసి పొదరిల్లు లాంటి "ఉమ్మడి కుటుంబం" ఇల్లు తయారయ్యింది. 


గృహప్రవేశానికి ముహూర్తం చూసుకుని, పిల్లలకు కబురుపెట్టారు. తమ పల్లె లోనూ, రామచంద్రం పనిచేస్తున్న ఆఫీసు లోనూ, ఇంకా తాము కలిసిన కుటుంబాల వారికి ఇలా చాలామందికి గృహప్రవేశం ఆహ్వానాలు పంచారు.

 

పల్లెలో ఉన్న మాదిరి పది గదుల కొంప, పట్నంలో కట్టడం కొందరికి ఛాదస్తంగా కనిపించింది. "అక్కడ ఒక ఇల్లు ఇదే మాదిరిగా ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా అలాంటిదే ఎందుకు? డబ్బు దండగ కాకపోతే, ముసలాళ్ళకి బుర్ర పాడైపోయింది, ఇద్దరు మనుషులు ఉండడానికి ఇంత ఇల్లు ఒకటే అనవసరం, మళ్ళీ రెండోది కూడాను… చుట్టూ మొక్కలు, చెట్లు అని చాలా స్థలం విడిచిపెట్టేశారు. ఇదంతా అపార్టుమెంట్లు కడితే ఎంత లాభం వచ్చేదో, రామచంద్రానికి బుర్ర లేకపోతే ఆదిలక్ష్మి అయినా చెప్పొద్దూ... తగుదునమ్మా అని మొగుడితో చేరి, పక్కనుండి మరీ కట్టించింది" ఇలా ఎన్నో మాటలు, గుసగుసలు దంపతులు ఇద్దరూ విన్నారు. ముఖాలు చూసుకుని నవ్వుకున్నారు. 


పిల్లలకు కూడా మనసులో ఇదే ఆలోచన... కానీ నాన్న ఏం చెప్తారో చూద్దామని వేచి ఉన్నారు. తమ మనసులో మాటలే బంధువులు, స్నేహితుల నోటి వెంట వస్తున్నాయి. అందరికీ ముందే చెప్పాడు "సత్యనారాయణ స్వామి వారి వ్రతం, భోజనాలు అయ్యాక తాను మాట్లాడవలసి ఉందని కాబట్టి ఆహ్వానితులు ఎవరు వెళ్ళిపోవద్దు" అని కోరాడు. ఆ ప్రకారమే అందరూ ఎదురుచూస్తున్నారు. మధ్యాహ్న భోజనాలు కూడా అయ్యాయి. 


అందరిని తోటలో తాటాకు పందిళ్ళు కింద వేసిన కుర్చీలలో సుఖంగా కూర్చోమని చెప్పి, చెప్పడం ప్రారంభించాడు రామచంద్రం. 

"నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన అందరికీ నా వందనాలు. మనసారా ధన్యవాదాలు. అందరికీ మనసులో ఒక ప్రశ్న తొలుస్తున్నదని నాకు తెలుసు. పల్లెలో ఒక ఇల్లు ఉండగా మళ్లీ అదే పద్ధతిలో పట్నంలో ఈ ఇల్లు ఎందుకు? మా ఇద్దరికీ ఇంత ఇల్లు అవసరమా? అన్నదే ఆ ప్రశ్న. నిజమే! ఒకప్పుడు మా తాతగారు, నాన్నగారు, చిన్నాన్న, పెదనాన్న, మేనత్త, వాళ్ల పిల్లలు ఎంతో మందితో కళకళలాడిన ఇల్లు, ఒక్కొక్కరుగా తరలిపోవడంతో బోసి పోయింది. మా పిల్లలిద్దరూ కూడా చదువులు, ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్లిపోయారు.

 

అంత పెద్ద ఇంట్లో మేమిద్దరమే మిగిలాం. ఒక విధంగా చూస్తే నా భార్య ఒక్కతే ఆ ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఒక్కరే ఉండడం ఎంత కష్టమో మీకు తెలియంది కాదు. ఉదయం నేను ఉద్యోగానికి వెళితే రాత్రి వచ్చే వరకు మాట్లాడటానికి, మనసు పంచుకోవడానికి, అవసరంలో సహాయపడటానికి ఎవరూ ఉండేవారు కాదు. ఆ విషయం నాకు ఎప్పుడూ మనసులో తొలుస్తూ ఉండేది. నాకంటే ఆఫీసులో ఉద్యోగంతో పొద్దు పోతుంది. కానీ ఆదిలక్ష్మి సంగతి ఏమిటి? అని చాలా ఆలోచించాను. దాని పర్యవసానమే ఈ ఇల్లు. నా ఆలోచనను నా భార్యతో పంచుకున్నాను. ఆమె ఆమోదించింది. 


మా ఆఫీసులోనూ, ఇంకా మా చుట్టుపక్కల ఉన్న ఆఫీసులలో పనిచేసే వాళ్లు చాలావరకూ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు. వాళ్లకు ఇంట్లో పెద్దవారి అండదండలు లేక, వారి పిల్లలకు చిన్నతనం నుంచి పెద్దవారి ఆలనా పాలనా కరువై ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నేను గ్రహించాను. నా పిల్లల చిన్నతనం వరకూ మాది ఉమ్మడి కుటుంబం కావడం వలన పిల్లలతో సహా అందరూ ధైర్యంగా ఉండేవారు. పిల్లలకు పెద్దలతో ఎలా మెలగాలి? నలుగురిలో ఎలా నడుచుకోవాలి? ఓర్పు, సహనం, మాట చాతుర్యం, సమస్య విశ్లేషణ, పరిష్కారాన్ని వెతికే మార్గం ఇవన్నీ అనుకోకుండానే పెద్దవాళ్ళతో కలసి, వాళ్ల సంభాషణలలో పాలుపంచుకోవడం వలన తెలిసి వచ్చేది. పిల్లవాళ్లకి ఏ అనారోగ్యమో చేస్తే చూసుకోవడానికి ఒకరి వెంట ఒకరుగా నలుగురూ ఆ ఇబ్బంది పంచుకునే వాళ్ళు. ఏ ఒక్కరికి బాధ అయ్యేది కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి కుటుంబాలలో పెరిగిన పిల్లలకు, నేడు ఒంటిగా పెరుగుతున్న పిల్లలకు చాలా తేడాలు చెప్పుకోవచ్చు. 


అందుకే ఈ ఉమ్మడి కుటుంబం అనే ఇంటిని కట్టించాను. ఇంట్లో 10 గదులు ఉన్నాయి. ప్రతి ఒక్క గదిలో ఒక కుటుంబం తమ కనీస అవసరాలతో హాయిగా నివాసం ఉండవచ్చు. వారి పిల్లలు లేదా తల్లిదండ్రులు ఎవరైనా ఉండవచ్చు. ఎన్ని గదులు కావాలంటే అన్ని గదులు తీసుకోవచ్చు. వంట ఇతర కార్యక్రమాలలో వారికి వీలైనప్పుడల్లా పాలు పంచుకోవచ్చు. ఇందులో నిర్బంధం ఏమీ లేదు. వారికి నచ్చినట్టుగా వారే వండుకుంటారు. ఆ అవకాశం కూడా ఉంది. అలాగే కలుషిత నీరు, గాలి, ఆహారాలకు దూరంగా ఉంచడానికి ఇంటి చుట్టూ మొక్కలు పెంచి కావలసిన కాయగూరలు, పళ్ళు పెంచే, పండించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఒక వృద్ధాశ్రమం, అనాధ శరణాలయం, శిశు విహార్ లేదా పేయింగ్ గెస్ట్ లా కాకుండా ఇక్కడ ఉన్న అందరూ ఏదో ఒక వరుసలతో పిలుచుకుంటూ ఒకే కుటుంబంలా ఉండాలన్నదే మా కోరిక. 


ఈ విషయాన్ని నా చుట్టుపక్కల పని చేసే కొందరితో పంచుకున్నాను. వాళ్ళందరూ మహదానందంగా మా ప్రతిపాదనను అంగీకరించారు. ఇక్కడ చుట్టుపక్కల పనిచేసే కాబట్టి త్వరగా ఇళ్లకు చేరుకుంటారు. తమ వారితో హాయిగా గడపగలుగుతారు. వారి పిల్లల తల్లిదండ్రుల బాధ్యతకు నా భార్యతో పాటు మరికొందరు పెద్దల, నేను నియమించే కొందరు ఉద్యోగస్తుల సహాయం కూడా ఉంటుంది. అందుకే ఇంత పెద్ద ఇంటిని ఇలా నిర్మించ వలసి వచ్చింది. ఈ పద్ధతి నచ్చితే పెద్ద దూరం లేని పల్లె లో ఉన్న మా ఇంటిని కూడా ఇలా మార్చుతాను. నా మాటలన్నీ ఓపిగ్గా విన్న మీ అందరికీ నా ధన్యవాదాలు” అని చెప్పి కూర్చున్నాడు రామచంద్ర. 


అందరూ మంత్రముగ్ధులై వింటున్నారు. రామచంద్రం కూర్చోగానే చప్పట్ల శబ్దం ఒక్కసారిగా సముద్ర ఘోషలా వినవచ్చింది. కొడుకులిద్దరూ తల్లిదండ్రుల వద్దకు వచ్చి “నాన్న! అమ్మ! మా భవిష్యత్తు మాత్రమే ఆలోచించి మీ గురించి ఆలోచించలేక పోయాము. మమ్మల్ని మన్నించండి. మీరు ఎంతటి ఒంటరితనంతో బాధపడుతున్నారో మాకు ఇప్పుడే అర్థం అయ్యింది.” అని కాళ్ల మీద పడ్డారు. 


ఇద్దరిని లేవనెత్తి “మీలాగే వీళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం సొంత ఇళ్లను, సొంత ఊరిని, తల్లిదండ్రులను వదిలి వచ్చిన వాళ్లే. వీళ్ళందరిలో మిమ్మల్ని చూసుకుంటాం. ఎవరి అభివృద్ధికి ఎవరు అడ్డం కాలేరు కదా! ఒక చోట ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నం అయిపోతే మరొకచోట ఇలా కలుపుకుందాం. ఏదైతేనేం? ఉమ్మడిగా ఉండడానికి రక్త సంబంధాలు ఉండాలా? కలుపుకు పోతే అందరూ బంధువులే” అంది తల్లి.


నేటి ఒంటరి పిల్లల మనస్తత్వాలలో, ఆలోచనలలో సరైన మార్పు రావాలంటే ఇలాంటి ఉమ్మడి కుటుంబాల ఆవశ్యకత ఎంతో ఉంది. వృద్దాశ్రమాలు సరైన ఆలోచన కాదు. పిల్లలతో మనవళ్ళతో గడపడమే వృద్దులకు ఆనందం. భవిష్యత్ లో ఇలాంటి ఉమ్మడి కుటుంబాలు రావాలని ఆశిద్దాం.


******* ********** ********** **********


నాగమంజరి గుమ్మా గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

పేరు: నాగమంజరి గుమ్మా

భర్త పేరు: పట్రాయుడు కాశీ విశ్వనాధం గారు

వృత్తి: ఆంగ్లోపాధ్యాయిని

నివాసం: శృంగవరపుకోట, విజయనగరం జిల్లా

ప్రవృత్తి: పద్యరచన, కవితలు, కథలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, నవల వంటి ఇతర సాహిత్య రూపాలలో కూడా ప్రవేశం.

వివిధ వేదికలపై శ్రీమతి బులుసు అపర్ణ గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ మేడసాని మోహన్ గారు, శ్రీ ఆముదాల మురళి గారు, శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారు, శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు, శ్రీమతి ఆకెళ్ల బాలభాను, శ్రీ తాతా సందీప్ శర్మ మొదలగు వారి అష్టావధానం, శతావధానాలలో పృచ్ఛకురాలిగా సమస్య, వర్ణన, దత్తపది, అప్రస్తుత ప్రసంగాలలో పాల్గొనడం. 

విద్యార్థులను పద్య, శ్లోక, ధార్మిక పోటీ పరీక్షలకు శిక్షణ నివ్వడం

పురాణ ప్రవచనం చేయడం

రచనలు: శ్రీ గణేశ చరిత్ర, విశ్వనాధ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి ముద్రిత రచనలు.

విహంగ విలాసం, ఫలవిలాసం, జలచరవిలాసం, భక్తిమంజరి, టేకుపూలదండ, ఖండకావ్యమంజరి అముద్రిత రచనలు.

ఆంద్రప్రదేశ్  ప్రభుత్వ Scert వారి 4 వ తరగతి తెలుగు పాఠ్య పుస్తక రచన.

68 views0 comments

コメント


bottom of page