top of page
Writer's picturePitta Govinda Rao

ఉత్తమ కథలో ఉత్తమ తనయుడు

#PittaGopi, #పిట్టగోపి, #ఉత్తమకథలోఉత్తమతనయుడు, #UtthamaKathaloUtthamaThanayudu, #తండ్రికొడుకులకథ


'Utthama Kathalo Utthama Thanayudu - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 06/10/2024

'ఉత్తమ కథలో ఉత్తమ తనయుడు' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ప్రాణాలు పణంగా పెడతారు. భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకునే మన దేశంలో అనేక తారతమ్యాలు ఉన్నాయి. అలాంటి ఈ దేశంలో పిల్లల పై ఒక్క తల్లిదండ్రులు ప్రేమ మాత్రమే ఒకటి. అంటే పేదలైనా.. ధనికులైనా, చిన్న కులం అయినా, పెద్ద కులం అయినా.. వారి తల్లిదండ్రులకు వారి పిల్లల పై ప్రేమ మాత్రం ఒకటే. 


 పిల్లలపై కొంతమంది తల్లిదండ్రుల ప్రేమ ముందు విధి కూడా ఒక్కోసారి ఓడిపోతుంది. అలాంటి తల్లిదండ్రులను ఈరోజుల్లో పిల్లలు కొందరు శక్తి ఉన్నంతవరకు ఒకలా, మంచానికి పరిమితం అయ్యాక మరోలా చూస్తున్నారు. కొందరైతే వాళ్ళ ముఖం కూడా చూడకుండా వృద్ధాశ్రమంలో చేర్చుతున్నారు. తల్లిదండ్రులను చివరి రోజుల్లో శోకంలో ముంచి పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. ఎన్నంటే ఏమి లాభం? ఇలాంటి సంఘటనలు ఆగటం లేదు. ఆ పండుటాకుల బాధలు తీరటం లేదు. రోజులు అలాగే ముందుకు నడుస్తున్నాయి. ఆడపిల్లలు అయితే వేరే దగ్గర ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కొడుకుల పైనే తల్లిదండ్రులు ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ.. ! ఈరోజులను పసిగడితే ప్రతి తల్లిదండ్రులు తమకు ఎంతమంది సంతానం ఉన్నా.. తమ జీవిత కథలో తమకంటూ ఒక ఉత్తమ కొడుకు పుట్టాలని, వాడైనా తమను జీవిత చరమాంకంలో చూసుకోవాలని కోరుకుంటున్నారు. అలాంటి కోరికలు కోరే అనేకమంది తల్లిదండ్రులు వారిని పెంచి పోషించిన వృద్ద తల్లిదండ్రులను మాత్రం వృద్దాశ్రమంలో పెడుతున్నారు. ఇదెక్కడి న్యాయం. ఇదెక్కడి కోరిక. 


సత్యం ఏదో గుండె జబ్బుతో ఆసుపత్రిలో ఐసియులో ఉన్నాడు. డాక్టర్లు గ్యారెంటీ ఇవ్వటంతో ఊపిరి పీల్చుకున్నాడు. అయితే దాదాపు పదిహేను రోజులు ఆసుపత్రిలో ఉండాలన్నారు. సరేనన్నాడు పెద్ద కొడుకు ఆనంద్. ఆ మాటకు సత్యం ఆశ్చర్యపోయాడు. అసలే ప్రవేటు ఆసుపత్రి.. అందులోను ఆనంద్ కూలీ పని చేసి తండ్రిని పోషిస్తున్నాడు. ఒకరోజు ట్రీట్మెంట్ కే లక్షల రూపాయలు దండుకునే ఆసుపత్రిలు ఇవి. అలాంటిది పదిహేను రోజులు అంటే కొడుకుకు  తన పై ఉన్న ప్రేమకు, కనికరం కూడా చూపని మిగిలిన కొడుకుల మీద కోపం సత్యంకు. ఈ వయసులో ఆ భావోద్వేగాలు దాచుకోలేక కళ్ళలో దారాళంగా నీరు కార్చాడు. వాటిని తుడుచుకోవటానికి వీలు పడకుండా డాక్టర్లు రెండు చేతులకు సూదులు గుచ్చి ఉంచారు. తనయుడే వచ్చి మాట చెప్పలేని ఆ మూగ తండ్రి బాధను తెలుసుకుని కన్నీరు తుడిచి కళ్ళతోనే ధైర్యం చెప్పాడు. 


రోజు డాక్టర్లు, సిస్టర్స్ పర్యవేక్షణలో సత్యం ట్రీట్మెంట్ నడుస్తుంది. ఎంత డబ్బు గుంజే ఆసుపత్రులు అయినా.. ! రోజు అందరూ ఒక దగ్గర పని చేస్తు కలుసుకుంటున్నారు కాబట్టి పరిచయాలు, జీవితాలు గూర్చి తెలుసుకోవటం, మాట్లాడటం ఎవరికైనా షరా మాములే కదా.. ?


ఒకరోజు సత్యంనకు సెలైన్ ఎక్కాక దాన్ని తీయటానికి వచ్చి సత్యంతో మాటలు కలిపాడు. 

"ఏమయ్యా.. సత్యం గారు ఏంటీ విశేషాలు.. ? కుటుంబ నేపధ్యం ఏంటి.. ? ఒక్క కొడుకేనా.. ? కూతుళ్లు లేరా.. ? సవర్యలు అన్ని కొడుకు కోడలే చేస్తున్నారు. భార్య నిన్ను వదిలిపోయిందా.. ?” ప్రశ్నలు వర్షం కురిపించాడు. 


ట్రీట్మెంట్ పూర్తి అవ్వటానికి ఇంకా పన్నెండు రోజులు ఉంది. ఎప్పటికైనా ఇలాంటి విషయాలు చెప్పక తప్పదు అనుకుని మనసులో బాదపడతు


"ఒక్క కొడుకా.. కాదండీ. మరో నలుగురు ఉన్నారు. , కూతుళ్లు లేరు. వీళ్ళ అమ్మ పోయి ఐదారేళ్ళు అయిపోయింది" చెప్పాడు సత్యం.


 "ఇంకా నలుగురు కొడుకులు ఉన్నారా.. ? మొత్తం ఐదుగురన్నమాట. ఏం చేస్తున్నారు.. ?”


"పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు" 


" మరీ ఈ పెద్ద వాడికి ఉద్యోగం రాలేదా.. ?”


" రాకపోవటం కాదు డాక్టర్ గారు, వీడు చదువుకోలేదు. చదువుకుంటే వీడు కూడా ఉద్యోగం చేసేవాడు. కష్టపడి చదివించానుగా మరీ. " 


“పెద్దోడు చదువుకోలేదా.. ? అలాంటి వాడిని ఇంట్లో పెట్టుకుని ఎలా వచ్చావయ్యా.. నేనైతే మెడపట్టి బయటకు గెంటేసే వాడిని " ముక్తకంఠంతో చెప్పాడు. 


ఆ మాటలు విన్నాక సత్యం 

"వాడు చదువుకోవటం మానేసింది ఆ నలుగురు కోసమేనండి " 


సత్యం మాటలకు ఆనంద్ వైపు చూసి డాక్టర్ తలదించుకున్నాడు. 

"ఆ నలుగురు ఉద్యోగస్తులు ఈ సమయంలో ఎందుకు రాలేదు.. ?”


" ఇందాక మెడపట్టి భయటకు గెంటేయమన్నారు కదా డాక్టర్.. ! గెంటేస్తే ఆ నలుగురినే నేను గెంటేస్తా. "


"అంటే.. "


"అవును డాక్టర్! ఉద్యోగం వచ్చిన నుంచి వాళ్ళు తెలివిగా ఆలోచించి భవిష్యత్ ఖర్చుల కోసం నాకు కానీ.. తమ చదువులకు అండగా నిలిచిన పెద్దన్న ఆనంద్ కి కానీ రూపాయి ఇవ్వలేదు”. 


కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్ళి సత్యం ఇలా చెప్పాడు


సత్యం-సుగుణమ్మలకు ఐదుగురు సంతానం. అందరూ కొడుకులే. పేదింటి కుసుమాలు అని తన పేదరికం ఈ పిల్లలు పెద్దయ్యే సరికి అనగా నాతోనే ఆగిపోతందని ఆ తండ్రి ఉహా. 


భార్య తోడుగా రెక్కల కష్టమే అండగా పిల్లలను చదివించాడు. అందరూ బాగానే చదువుతున్నారు. ఏమైనా రాకపోతే పెద్దోడే అన్ని తానై దగ్గరుండి చెప్పేవాడు. అలా వాళ్ళంరూ పై చదువులకు వచ్చాక నా సంపాధన సరిపోయేది కాదు. రాత్రింబవళ్లు భార్యతో కలిసి కష్టపడినా.. సరిపోకపోయే సరికి నా ఇంటి పేదరికం నాతోనే ఆగిపోవాలనే ఆశ కరిగిపోతుందని దిగాలు పడుతున్న క్షణంలో నా పెద్ద తనయుడు నాన్న నీ కష్టంలో నేను తోడు ఉంటా తమ్ముళ్ల చదువుకు అండగా ఉంటా అని ముందుకు వచ్చాడు. అప్పుడు మా ముగ్గురు సంపాధన ఆ నలుగురు పిల్లలకు సరిపోగ కాస్తో.. కుస్తో.. మిగిలేది. అయితే.. !ఆనంద్ కష్టపడ్డంలో ఆనందం ఉందని తమ్ముళ్లు చదువు పట్ల త్రుప్తిగా ఉందని తన ఆలోచనలతో కొత్తగా సంపాదించేవాడు. అది పొదుపు చేయటమే కాక నా చేతలతో దానదర్మాలు కూడా చేయించేవాడు. అలా పేదోడే అయినా పదిమందికి సహాయపడుతున్నాడని నాకు ఇరుగుపొరుగు గౌరవించసాగారు. 


అలా రోజులు గడిచాక నా నలుగురు కొడుకులు అమెరికాలో ఒకడు, సింగపూర్ లో ఒకడు దుబాయ్ లో ఒకడు లండన్లో ఒకడు పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు కొట్టారు. వాళ్ళు ఉద్యోగాలు అయితే సంపాదించారు కానీ.. ఆ ఉద్యోగం వచ్చిన నుంచి కష్టపడి చదివించిన నాన్నకు కానీ.. నాన్న తర్వాత తమ చదువుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పెద్దన్న ఆనంద్ కి కానీ రూపాయి కూడా ఇవ్వలేదు. ఎలాగోలా కష్టానికే నమ్ముకుని బతకమని ఒక పిల్లని వెతికి పెళ్ళి చేశాను. ఇక మిగిలిన వాళ్ళు ఒక్కొక్కరు తాము స్థిరపడిన చోటే ఎవరినో పెళ్ళి చేసుకుని అక్కడే కాపురం పెట్టుకున్నారు. పుట్టిన ఊరు కాబట్టి అలా వచ్చి చిన్న రిసెప్షన్ పెట్టి తమ తమ భార్యలతో మరలా వెళ్ళిపోయారు "


 "అయ్యో.. మీ జీవితంలో ఇంత పెద్ద కథ ఉందా.. బాధపడకండయ్య వారి పిల్లలు కూడా వాళ్ళకి అలాగే చేస్తారు. అప్పుడు తెలుస్తుంది ఆ బాధ. "


"నేను బాధపడుతుంది వాళ్ళు ఇక్కడ లేరని, డబ్బులు పంపలేదని కాదు డాక్టరు గారు. నాన్నగా నా కష్టంతో కార్చే ప్రతి కన్నీటి బొట్టు‌, ప్రతి చెమట చుక్క వెనుక కొడుకులు ఆనందం ఉందని వాళ్ళు గ్రహించలేని చదువులు నేను చదివించినందుకు. 


ఒక తండ్రికి ఎంతమంది కూతుళ్లు ఉన్నా ఒక కొడుకు ఉంటే గర్వంగా ఫీలవుతాడు. ఏ తండ్రి ఎప్పుడూ కొడుకుని గారాభం చేయడు. ఎందుకంటే కొడుకు పై ప్రేమ లేక కాదు ఎక్కడ ప్రయోజకుడు అవకుండా పోతాడో అని. 


నిజంగా ఒక తండ్రిగా చెబుతున్నాను. నాన్న కంటే ఎక్కువ ఎవరూ ప్రేమించలేరు. కానీ.. ! నాన్న ప్రేమ ఎప్పటికీ కనపడనివ్వడు. కొడుకుగా నీ పై ఇంత ప్రేమ ఉందని చెప్పటం రాదు ప్రాణంగా ప్రేమించటం తప్పా. 


చివరగా ఆ నలుగురు కొడుకులకు ఒకటే చెబుతున్నాను. రాజులా బతికే ప్రతి కొడుకు వెనుక సిపాయిలా శ్రమించిన తండ్రి కష్టం దిగి ఉంది. తండ్రి తర్వాత తండ్రిగా పెద్దన్ననే కదా పిలుస్తారు. ఆ నలుగురు తమ్ముళ్లకి ఆనందే రెండవ తండ్రి" 


"దిగులు పడకండి సత్యం గారు మీది ఉత్తమ జీవితం. మీరు ఉత్తమ తండ్రి. భవిష్యత్ లో ఈ సమాజానికి వినపడుతుంది. "


"నా ఉత్తమ జీవితంలో ఉత్తమ తండ్రిని నిజంగా నేనే అయితే.. ఉత్తమ తనయుడు నా పెద్ద కొడుకు ఆనందే. నేను స్వర్గానింటు పోతే నా పెద్ద కొడుకు పెట్టే తలకొరివి వలనే, అతడు చేసిన పుణ్యం వలనే. నిజంగా నా పెద్ద కొడుకు జీవితమే గొప్ప. గొప్ప జీవితం అంటే సుఖంగా బతకటం కాదు ధర్మంగా బతకటం. " ముగించాడు సత్యం. 


 *** *** *** *** *** *** ***


పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

నా పేరు పిట్ట.గోపి నేను శ్రీకాకుళంలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఎం ఏ సోషల్ వర్క్ పూర్తి చేశాను. నాకు సమాజాన్ని,సమాజంలో మనుషులను గమనించటం అలవాటు. ముఖ్యంగా సమాజంలో జరిగే ఏ చిన్న మంచి-చెడులనైనా.. మంచి కథలుగా మలచటంలో నాకు నేనే సాటి.వ్రృత్తిరిత్య నేను వ్యవసాయ కుటుంభంలో మద్యతరగతికి చెందిన వ్యక్తిని.ఇప్పటికే నేను రాసిన కథలు 90కి పైగా మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ లో ప్రచూరితం అయ్యాయి.అలాగే ప్రతిలిపిలో కూడా నా కథలు అచ్చయ్యాయి. నా కథలు బహుమతులుకు ఎంపికకాకున్నా..(లాప్టాప్ లేదు) ఫోన్ లోనే టైపింగు చేయాలన్నా కథలు పంపాలనే ఆశక్తి తగ్గిపోతుంది. కానీ..! సమాజంలో జరిగే సంఘటనలకు అక్షరరూపం ఇచ్చి పదిమందికి తెలపాలనేదే నా అభిలాష. నా కథల్లో మంచి చెడులను పాఠకులు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం


33 views0 comments

Comments


bottom of page