top of page

వధూసర



'Vadhusara' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 28/07/2024

'వధూసర' తెలుగు కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



సీతారాముల వనవాసం, పాండవుల అరణ్య వాసం, అజ్ఞాత వాసం, పురాణాల చరిత్రలో ఒక ప్రత్యేకతను సంతరించు కున్నాయి. సీతారాములు, అరణ్య వాసంలో అనేకమంది మహర్షుల నడుమ విజ్ఞానాత్మక, ఆద్యాత్మిక జీవితాన్ని గడిపారు. పాండవ మధ్యముడు అరణ్యవాస సమయంలోనే ముక్కంటిని ఎదిరించి విజయం సాధించాడు. 


 నేడు అరణ్యం, వనం అనగానే అదేదో కౄర మృగములు సంచరించే ప్రదేశం అని అనుకుంటాము. కానీ రామాయణ భారత కాలాలలో మునులు, ఋషులు, రాజర్షులు, మహర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు వనాలలోనే తమ పర్ణశాలలను నిర్మించుకునే వారు. అక్కడే ఘోర తపమును ఆచరించేవారు. మోక్ష పథమును పొందేవారు. అలాంటి పవిత్ర వనాలు నాడు భారత దేశాన అనేకం ఉండేవి. 


 అలాంటి వనాలలో ఆకు పచ్చని చెట్లతో కూడిన వనరాజమది.. ఆ వనంలో రంగు రంగుల పూల చెట్ల నడుమ ప్రశాంత మైన పర్ణశాలలు వందకు మించి ఉన్నాయి. ఆ పర్ణ శాలల పక్కనే నిర్మల సురగంగా ప్రవాహతరంగాలు వయ్యారంగా ప్రవహిస్తున్నాయి. ఆ ప్రవాహ తరంగాల నడుమన ఉన్న ఎత్తైన శిఖరాల మీద మునులు, మహర్షులు తపస్సు చేసుకుంటున్నారు. 


 గంగా నది ప్రక్కనే ఉన్న అందమైన చెట్ల మీద రెండు విధములైన నెమళ్ళ కేకలు వినసోంపుగా ఉన్నాయి. అక్కడే ఆనందంగా అటూ ఇటూ తిరుగుతున్న నెమళ్ళ, వానకోయిలల, మేకల, క్రౌంఛ పక్షుల, కోకి లల, కప్పల, ఏనుగుల కేకలు సప్త స్వరాలైన స, రి, గ, మ, ప, ద, ని, లను గుర్తు చేస్తున్నాయి. 


 పర్ణశాలల దగ్గర నీవార ధాన్య భాగాలను తిన్న ఆనందంతో చెంగు చెంగున లేడి పిల్లలు అటూ ఇటూ ఎగురుతున్నాయి. ఇంకా కుందేళ్ళు, యజ్ఞయాగాదులకు ఉపయోగ పడే పాలనిచ్చే కామ ధేనువుల్లాంటి ఆవులు, శ్వేతాంబర అశ్వాలు, పల్లకీలు, గుర్రపు బండ్లు, కూర్మ మత్స్యాది వివిధ ఆకారాల యజ్ఞయాగాది గుండాల నడుమ పర్ణశాలలు సిరి సంపదలతో, పవిత్ర ప్రశాంత తేజంతో ప్రకాశిస్తున్నాయి. ఆ పర్ణశాలలు నిగమాగమా లతో నిర్మితమైన దేవాలయాల్లా పవిత్రంగా తేజోవంతం గా దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. 


 ఆ పర్ణశాలల నడుమ ఓ బంగారు బావి ఉంది. ఆ బావి నీరు అమృత సదృశ్యంగా ఉంటాయి. అక్కడి మునులు ఆ బావిలోని మట్టిని తీసుకువచ్చి, దానిని శుద్ది చేసి, దానిలో గంధపు పొడిని కలిపి దేవతా ప్రతిమలను తయారు చేస్తారు. అక్కడి వారంత ఆ బావిలోని మట్టికి సురతేజం ఉందని భావిస్తారు. 


 ఆ పర్ణశాలల నడుమ అందమైన, ఆకర్షణీ యమైన, అద్భుతమైన ఒక పర్ణశాల ఉంది. ఆ పర్ణశాల లో అందాల సౌందర్య రాశి పులోమ అనే కన్య ఉంది. ఆ కన్య అందం చూసిన అప్సరసలే ఈ కన్య అందం ముందు మా అందం ఏపాటిది? అని అనుకుంటారు. పులోమ సౌందర్య తేజంలోని తేజో గుణం గురించి పలు విధాలుగా చర్చించుకుంటారు. కడకు పులోమ అందం ముందు దేవకాంతల అందం దిగతుడుపే అనుకుంటారు. 


 పులోమ తలిదండ్రులు పులోమకు అక్కడ ఉన్న అందరి మహర్షుల దగ్గర వేదవేదాంతాది విద్యలన్నిటిని నేర్పించారు. పులోమ మహర్షులందరి దగ్గర వారు బోధించిన విద్యలన్నిటిని శ్రద్దాసక్తులతో వినయం గా నేర్చుకుంది. కడకు తన తలిదండ్రుల వద్ద కూడా పులోమ చక్కగా విద్యలను నేర్చుకుంది. 


 పులోమ ఎల్లప్పుడూ సంతోష హృదయంతో ఉండేది. తన చుట్టూ ఉన్న వారందరిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించేది. 


 పులోమ అంటే సంతోషం అని అర్థం. పులోమది పేరుకు తగ్గ ప్రవర్తన, ప్రవర్తనకు తగ్గ పేరు. పులోమది కన్యా రాశి, హస్తా నక్షత్రం అని కొందరు మహర్షులు పులోమను చూచి అనుకునేవారు. ఆ ప్రాంతంలో ఉన్న మహర్షులు అందరూ పులోమ అంటే మహా యిష్ట పడేవారు. వేదాలలో గార్గి, మైత్రేయి, అపాల వంటి వారు చెప్పిన మంత్రాలను పులోమ తో మహర్షులు పఠింప చేసి ఆనందించే వారు. 


పులోమ గొంతులో వేద మంత్రాలు ఉదాత్తాను దాత్తాది స్వరాలతో చక్కగా ప్రకాశిస్తున్నాయి అని మహర్షులు అనుకునే వారు. 


ముని పుంగవులు బావిలో మట్టిని తీసుకువచ్చి పులోమతోనే దేవతా ప్రతిమలను తయారు చేయించే వారు. పులోమ ముని పుంగవులు కోరుకున్న విధంగా దేవతా ప్రతిమలను తయారు చేసేది. ఆ ప్రతిమలను అందమైన మండపములలో ఉంచి పాలతో సంస్కరించేది. నైవేద్యంగా "శివము"అనేది. 25 అంగుళాల పొడవు, 12 అంగుళాల వెడల్పు 15 అంగుళాల ఎత్తు ఉన్న చెక్క లేదా లోహ పాత్ర నిండా ఉన్న పరిశుద్ద ఆహారంను శివము అంటారని ముని పుంగవులకు తెలుసు.


 అందుకే వారు అలాగే అనేవారు. వాగర్థ సంబంధమైన శివ పార్వతుల జ్ఞాన స్వరూపం ఎంతటి మహత్తరమైనదో పులోమకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని మహర్షులందరూ అనుకునేవారు. 


 పులోమ సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాప జయాలను సమానంగ స్వీకరించేది. ఏదేమైనా తన కర్తవ్యాన్ని విస్మరించేది కాదు. అన్ని కాలాలో వేద పఠనం చేసేది. ఆరుకాలాల్లో ఎప్పుడు ఏ పని చెయ్యా లో అప్పుడు ఆ పనిని క్రమం తప్పకుండా చేసేది. సత్య సంపద నిమిత్తం మితంగా మాట్లాడేది. 

 ఒకనాడు పులోమ పర్ణశాలలకు దగ్గరగా ఉన్న సరోవరం దగ్గరకు వెళ్ళి, అక్కడ ఉన్న దర్భలను, పూలను కోసుకుని తన నివాసానికి వస్తుండగ పులోముడు అనే నవ యువక రాక్షసుడు పులోమను చూసాడు. తొలి చూపులోనే పులోమ, పులోముని మనసులో ముద్రపడి పోయింది. 


 పులోముడు కశ్యప ప్రజాపతి కుమారుడు. ముక్కోపి. ఆకలి వేస్తే ఆహారం తీసుకోవాలి అని అనుకోడు. ఎవరిని చంపైనా సరే ఆహారం తీసుకోవాలి అనుకుంటాడు. ఆడది మగవానికి సేవలు చేయడానికే పుట్టిందంటాడు. న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి అంటాడు. ఏ పనినైనా వెనుక ముందు ఆలోచించకుండా చేసేస్తాడు. అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తాడు.. 


 అలాంటి పులోముడు పులోమ తండ్రి దగ్గర కు వెళ్ళి "నీ కుమార్తె నాకు నచ్చింది. మీరు అనుమతిస్తే వివాహం చేసుకుంటాను. లేదంటే బలవంతంగా నా కోరిక తీర్చుకుంటాను" అని అన్నాడు. 


అప్పుడు పులోమ తండ్రి తన తపోశక్తి తో పులోముడి ముఖాన్ని గాడిద ముఖంగా మార్చాడు. పులోముడు తన ముఖాన్ని చూసుకుని భయపడి పులోమ తండ్రి కాళ్ళపై పడ్డాడు. పులోమ తండ్రి శాంతించి, "నువ్వు కశ్యప ప్రజాపతి కుమారుడు పులోముడివని నా తపోశక్తి తో గ్రహించాను. నీలో సురగుణాలు లేవు. మహర్షుల గుణాలు లేవు. మానవుల గుణాలు లేవు. రాక్షస గుణాలు మెండు గా ఉన్నాయి. 


నా కుమార్తె పులోమ మహర్షి వంశాన జన్మించింది. వేద పురాణేతిహాసాల మూలాలను అసాంతం అర్థం చేసుకుంది. ఆశువ్రీహి అనే ధాన్యాన్ని కనిపెట్టింది. తల్లి గర్భంలోని శిశువుకు ధ్యాన శక్తిని, జ్ఞానశక్తిని ఎలా నేర్పించాలో ప్రయోగ పూర్వకంగా నేర్చుకుంది. 


స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సూర్య సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రుద్ర సావర్ణి, ధర్మ సావర్ణి, , దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి అనే పదునాలుగు మనువుల మూలాలను తెలుసుకున్నది. 


స్వయంప్రభ గురించి పరిశోధన చేసింది. కొంత సుర తేజాన్ని వంట పట్టించుకుంది. అలాంటి నా కుమార్తెను నీకిచ్చి వివాహం చెయ్యను. కశ్యప ప్రజా పతి మీద ఉన్న గౌరవం తో నీ ముఖాన్ని నీకు ప్రసాదిస్తున్నాను " అని పులోమ తండ్రి పులోముని గాడిద ముఖం నుండి విముక్తుడిని చేసాడు. 


 "బతుకు జీవుడా" అనుకుంటూ పులోముడు అక్కడినుండి వెళ్ళిపోయాడు. కానీ అతని మనసుని పులోమ రూపం వదలలేదు. పులోమునికి పులోమ మీద ఉన్న వ్యామోహం క్షణ క్షణం పెరగసాగింది కానీ తరగలేదు. రాక్షసాంశ ఉన్న తన మిత్రులను కలిసి పులోముడు పులోమ గురించి చెప్పాడు. వారు అవకాశం కోసం ఎదురు చూడు అని అన్నారు. 

పులోమకు పులోముని గురించి, అతను చేసిన దౌర్జన్యకర పనుల గురించి అసలు తెలియదు. తన విద్యా సాధనలో తాను మునిగిపోయింది. 


పులోమ తండ్రి పులోమను భృగు మహర్షి కి యిచ్చి వివాహం చేయాలనుకున్నాడు. తన మనసు లోని మాటను ముందుగా కుమార్తె పులోమకు చెప్పా డు. అపుడు పులోమ "భృగు మహర్షి భూత దయ కల వాడు. అన్ని ప్రాణుల మేలు కోరేవాడు. సతతం సత్యమునే పలుకుతాడు. ధైర్యవంతుడు. ధర్మాత్ముడు. పర స్త్రీని తల్లిలా గౌరవిస్తాడు. కాబట్టి అతనిని వివాహమాడి తే నా బ్రతుకు ధన్యవుతుంది " అని అనుకుంది. 


తర్వాత పులోమ తండ్రి భృగు మహర్షి ని కలిసి తన మనసు

లోని మాటను చెప్పాడు. భృగు మహర్షి కూడా పులోమ లాగే ఆలోచించాడు. అలా ఇరువురు ఇష్టపడ్డారు. అంగ రంగ వైభవంగా పులోమ భృగు మహర్షి వివాహం జరిగింది. భృగు మహర్షి అప్పటికే తనకు కావ్యమాతతో వివాహం అయిన విషయం శుక్రాచార్యుడు పుట్టిన విషయం భార్య పులోమకు చెప్పాడు. 


 పులోమ భృగు మహర్షుల వైవాహిక జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా అన్యోన్యంగా సాగిపోయింది. వారి దాంపత్య జీవితాన్ని చూచి ప్రకృతి మాత పరవసించి పోయింది. వారి ఆదర్శమయ సంసారాన్ని చూచి అక్కడి ముని దంపతులందరూ వారిని అనుసరించారు. పులోమ ప్రతిరోజూ తన పతి దేవుడు భృగు మహర్షి చెప్పే పురాణ గాథలను విని తన జ్ఞానాన్ని, తన ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునేది. 


 ఒకనాడు భృగు మహర్షి తన భార్య పులోమ కు అతలలోకంలో ఉన్న 96 మాయల గురించి చెప్పా డు. అలాగే వితల లోకంలో ఉన్న హాటకీ నది గురించి, అందులో తయారయ్యే బంగారం గురించి, ఆ నదిలో విహరించే భవానీ హాటకేశ్వరుల గురించి చెప్పాడు. 


పార్వతీ పరమేశ్వరులు భవానీ హాటకేశ్వరుల గా మారిన వైనమంత భర్త భృగు మహర్షి చెప్పగా పులోమ విని బ్రహ్మానంద భరితురాలయ్యింది. ఆపై సుతల లోకం లో ఉన్న బలి చక్రవర్తి వైభవం గురించి, తలాతలం లోని మయుని గురించి, తలాతలాన్ని రక్షించే రుద్రుని గురించి, మహాతలంలోని కద్రువ సంతానం గురించి, రసాతలం లోని దైత్యుల గురించి, పాతళంలోని ఆది శేషుని గురించి భర్త ద్వారా తెలుసుకుంది. ఇలా పులోమ, భర్త భృగు మహర్షి అడుగుజాడలలో నడుస్తూ కాలం గడప సాగింది. కొంత కాలానికి పులోమ గర్భవతి అయ్యింది. 


పులోమ ప్రతిరోజూ తన తపో శక్తిని, తన తేజో శక్తిని గర్భం లో ఉన్న శిశువుకు ధారపోయ సాగింది. ఆమె గర్భంలోని శిశువు మహా తేజోవంతంగా పెరగసాగాడు. తన గర్భంలోని శిశు సంరక్షణ విషయంలో పులోమ తగిన వైద్య జాగ్రత్తలు అన్నీ తీసుకునేది. 


పులోమకు భృగు మహర్షి తో వివాహం అయ్యింది అని పులోమునికి తెలిసింది. పులోమ మీద ఉన్న కామం అతనిలోని రాక్షస ప్రవృత్తిని ద్విగుణీ కృతం, త్రిగుణీకృతం చేసింది. ఇంద్రుడు అహల్యను వంచించినట్లు పులోమను పులోముడు వంచించాలనుకున్నాడు. 


ఒకనాడు నిత్యకర్మానుష్టానానికి భృగు మహర్షి నదీ స్నానానికి వెళుతూ, పులోమకు తోడుండమని అగ్ని దేవునికి చెప్పి నదీ స్నానానికి వెళ్ళాడు. అది గమనించిన పులోముడు పులోమను చెరపట్టడానికి వచ్చాడు. 


పులోమునికి అగ్ని దేవుడు అడ్డు పడ్డాడు. భగ భగమండే అగ్నిని చూచిన పులోముడు, "అగ్ని దేవ! నేను చేసే పని తప్పుకాదు. ఈ పులోమను ముందుగా నేనే యిష్టపడ్డాను. కానీ ఈమె తండ్రి నన్ను కాదని పులోమను భృగు మహర్షి కి యిచ్చి వివాహం చేసాడు. మనసులో ఉన్న మగువను చెరబట్టడంలో తప్పేముంది?" అని అన్నాడు. 


అందుకు అగ్ని దేవుడు "పులోముడ! నీ ఆలోచనలు ఈ యుగానికి చెందినవి కావు. ఇవి కలియుగం లో చివరి పాదానికి చెందినవి. భృగు మహర్షి పులోమ ను వేద మంత్రాల మాటు అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్నాడు. కావున ఆమెను రక్షించాల్సిన బాధ్యత నా మీద ఉంది. పులోమ భృగు మహర్షి కి ధర్మ బద్ధమైన ధర్మపత్ని. పైగా పూర్ణ గర్భవతి. మహా తేజోవంతమైన శిశువును తన కడుపులో మోస్తుంది. ఈమెను కామ దృష్టితో చూడటం మహా పాపం. బలగర్వంతో అధర్మానికి పాల్పడితే అంతమైపోతావు. కావున నీ ఆలోచనలు మార్చుకో" అన్నా డు. 


పర్ణశాల లోపలినుండి అగ్నిదేవుని మాటలను విన్న పులోమ భయ భ్రాంత చిత్తంతో "దేవ దేవ! బ్రహ్మ దేవ! నా రూపం ఒక రాక్షసుని మనసులో ప్రవేశపెట్టావా? నా నామ ధేయం పులోమ అయితే ఆ రాక్షసుని నామ ధేయం పులోముడా !? ఇదెక్కడి తలరాత బ్రహ్మ దేవుడా?" అని దుఃఖించ సాగింది. 


కామోద్రేక చిత్తుడైన పులోమునకు అగ్ని దేవుని మాటలు రుచించలేదు. పర్ణశాల లోని నిండు గర్భిణి అయిన పులోమను చూడగానే పులోమునిలో రాక్షస కామం రంకెలు వేసింది. పులోముడిని చూచి పులోమ గజగజ వణికిపోయింది. ఆ వణుకుకు ఆమె శరీరంలోని నరాలన్నీ వేగంగా బిగుసుకు పోసాగాయి. తన వైద్య సామర్థ్యం తో ఆ బిగువును సడలించుకుంది. 


అప్పుడు పులోముడు, "మదీయ సుందరీ! నీ పరిణయం కాక ముందే నిన్ను నా మనసులో నిలుపుకున్నాను. అప్పటికీ ఇప్పటికీ నీలోని అందం చెక్కు చెదర లేదు. నీ ముఖారవిందాన్ని చూస్తుంటే నాలోని మన్మథ తాపం ఎలా ఎలా పెరిగిపోతుందంటే.. అబ్బా మాటల్లో చెప్పలేను. చేతల్లో చూపిస్తాను. " అని పులోముడు పులోమ ముందుకు వచ్చాడు. 


 "రాక్షసాధమ పులోముడ! నేను భృగు మహర్షి ధర్మపత్నిని. బ్రహ్మను సహితం శాసించగల సమర్థుడు భృగు మహర్షి. అలాంటి వాని ధర్మపత్ని నీకు తల్లితో సమాన మవుతుంది. అందునా నేను పూర్ణ గర్భవతిని" అని దుఃఖాన్ని ఆపుకుంటూ అంది పులోమ. 


"వావి వరసలు వలదు వనిత.. వావి వరుసలు వలదు. దేవతల వావి వరుసలు నాకు తెలియనివి కావు. బ్రహ్మ తన కుమార్తె సరస్వతీ దేవినే పెళ్ళాడాడని మీ మహర్షులే కొందరు చెబుతుంటారు. అదేమంటే ఆ సృష్టి ఈ సృష్టి అంటూ పరులను వంచించే ఆద్యాత్మిక మాటలు విపరీతంగా మాట్లాడతారు. పూర్ణ గర్భవతి ని పరిపూర్ణంగా అనుభవించినప్పుడు కలిగే మహదానందం మీ బ్రహ్మానందాన్ని మించి ఉంటుంది. " అని వెంటనే పులోముడు వరాహ రూపం ధరించాడు. 


పులోమ "నన్ను తాకవద్దు.. తాకవద్దు" అంటూ తన తపో శక్తి తో ధారాపాతంగా కన్నీరు కార్చింది. ఆ కన్నీరు నది లా ప్రవహించసాగింది. నదిలా ప్రవహిస్తున్న పులోమ కన్నీటిని చూచి క్షణ కాలం పాటు పులోముడు నిశ్చేష్టు డయ్యాడు. 


అప్పుడు పులోమ "ఓరి దుర్మారుడ పులోముడ! నీ పాపం పండే సమయం ఆసన్నమైంది. నీ తనువుకు భూమితో సంధానింపబడిన చక్రాల సంబంధం తెగిపోయే సమయం ఇహనో ఇప్పుడో అన్నట్లు ఉంది. నీ అరి కాళ్ళ పాదాలు చల్లబడే సమయం వచ్చేసింది. నీ ఆత్మ కు అనుసంధానించబడిన వెండితీగ తెగిపోనుంది" అని అంది.

 

 పులోమ కన్నీరు కార్చటం ఆపిన వెంటనే, "నాకు భూమి తో సంబంధం తెగిపోనుందా? అయితే ఆకాశం లోకి ఎగురుతాను" అని పూర్ణ గర్భవతి అయిన పులోమను ఎత్తుకుని పులోముడు ఆకాశంలోకి ఎగిరాడు. ఆ దృశ్యం భూమాతను హిరణ్యాక్షుడు చెరబట్టిన దాని కంటే భయంకరంగా ఉంది. అక్కడ భూమాత స్త్రీ అయితే ఇక్కడ పులోమ పూర్ణ గర్భవతి అయిన స్త్రీ. 


ఆ వేగానికి పులోమ గర్భంలో ఉన్న శిశువు జారి కింద పడ్డాడు. శిశువు తీక్షణంగా పులోముని చూసాడు. తల్లి ప్రసాదించిన మహాన్నత తేజోవంతమైన ఆ శిశువు కంటి కిరణాల వెలుగులో పడి పులోముడు కాలి బూడిదై నేల మీద పడ్డాడు. 


పులోమ తన బిడ్డను దగ్గరకు తీసుకుంది. తన బిడ్డను ఎత్తుకుని తన అవమానం గురించి చెప్పడానికి గోడు గోడున దుఃఖిస్తూ బ్రహ్మలోకం వెళ్ళింది. ఆమె కన్నీరు కాలువై నదిగా మారి ఆమె వెనుకనే రాసాగింది. 


పులోమ తనకు జరిగిన అవమానమంతా బహ్మ దేవునికి చెప్పుకుని "ఇదేం రాత బ్రహ్మ దేవుడా?" అని దుఃఖించింది. 


బ్రహ్మ దేవుడు పులోమను ఓదార్చి, " అమ్మా పులోమ! తలరాతను నరులే కాదు సుర రాక్షస యక్ష గంధర్వ కిన్నెరాదులు సహితం తప్పించుకోలేరు. లోకం పోకడ లో మంచితో పాటు చెడుకూడ పుడుతుంటుంది. దానిని భరించక తప్పదు. ఆశామోహాలతో జీవం చేసే ఖర్మ జన్మజన్మలను అంటే ఉంటుంది. దానిని ఎవరూ తప్పిం చుకోలేరు. 


జన్మజన్మల ఖర్మ ఫలంగా మహా పుణ్యాత్ములను ఖర్మ ఫలం వెంబడించినా, అది వారిని ఏం చేయ లేదు. కొంత కాలం ఇడుములను కలిగిస్తుంది. అంతే. అదే జన్మ జన్మల ఖర్మ ఫలం పాపాత్ములను ఒక్కసారి గా అందలం ఎక్కించి, అక్కడి నుంచి వారిని అధఃపాతా ళం లోకి పడేసి చంపేస్తుంది. 


మానవ లోకంలో, మనిషి బతుకుతెరువు చూపే విద్యను తన ఖర్మ సంబంధ మూ ల విద్యను అభ్యసించాలి. అభ్యాసించినదాని మూలా లెరిగి ప్రవర్తించాలి. అప్పుడు మనిషి మహనీయుడు అవుతాడు. 


నీ పేరు పులోమ అంటే సంతోషం. ముందుగా నువ్వు బతుకుతెరువు, ఖర్మ ఫలం కు సంబంధించిన విద్యలే అభ్యసించావు. వివాహం అయిన పిమ్మట కొంచెం సంసార వ్యామోహం లో పడి ఖర్మ ఫల విద్యకు దూరమయ్యావు. అందుకే నువ్విలా దుఃఖిస్తున్నావు. 


దుఃఖాన్ని వదులు. జగన్నాథ జగతిని చూడు. ఏదీ ఏమైనా మహా తేజోవంతుడైన బిడ్డకు తల్లివయ్యావు. నీ బిడ్డ నువ్వు ప్రసాదించిన యోగ బలంతో నీ ఉదరం నుంచి జారి ( చ్యుతమై) కింద పడ్డాడు. కావున నీ బిడ్డ చ్యుతుడనే పేర ప్రసిద్ది చెందుతాడు. నీ బిడ్డ భూమి మీ ద పడగానే పులోముని సంహరించి తల్లి ఋణం తీర్చు కున్నాడు. నీ కన్నీరు నదై నీ వెనుకనే ప్రవహిస్తుంది. నీ కన్నీటి నది "వధూసర" అనే పేర యిలలో యశమొందుతుంది " అని అన్నాడు. 


"నేను కార్చిన కన్నీటి నది పేరు వధూసరయా!?", అని అంది పులోమ. 


"అవును వధూసర. వధూసర అంటే వధువు కన్నీటి ప్రవాహం అని అర్థం. కలకంఠి కంట కన్నీరు ఒలికిన సిరి యింట ఉండదు. నీలాంటి పతివ్రత కంటి కన్నీరు నదైంది. ఆ నది పాపాత్ముల పాలిట ప్రళయకాల ఉప్పెన. " అన్నాడు బ్రహ్మ.

 

 భృగు మహర్షి జరిగినదంతా తెలుసుకుని భార్యా బిడ్డలను ఆశ్రమానికి తీసుకువచ్చాడు. ఆపై చ్యవనుని కి దోసికోండ వద్ద మహోన్నత విద్యలను నేర్పించాడు. జానపద వీరుడు మృకండ వలే చ్యవన మహర్షి మహోన్నత కీర్తి ప్రతిష్టలను ఆర్జించాడు. భృగు వంశంలో జన్మించిన వారే పరశురాముడు మొదలైనవారు. 


సర్వే జనాః సుఖినోభవంతు 


వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు







43 views0 comments

Kommentare


bottom of page