top of page

వలపు వెల్లువ 

Writer's picture: Goparaju Venkata SuryanarayanaGoparaju Venkata Suryanarayana

#గోపరాజువెంకటసూర్యనారాయణ, #GoparajuVenkataSuryanarayana, #వలపువెల్లువ, #ValapuVelluva, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Valapu Velluva - New Telugu Story Written By Goparaju Venkata Suryanarayana

Published In manatelugukathalu.com On 14/11/2024

వలపు వెల్లువ - తెలుగు కథ

రచన: గోపరాజు వెంకట సూర్యనారాయణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



అది హైదరాబాదు లోని ఒక పేరున్న కార్పోరేట్ హస్పటల్ లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్. అందులో లావణ్య, తలకు తగిలిన దెబ్బ కారణంగా.. మూడు రోజులుగా స్పృహ లేకుండా పడిఉంది. జీవన్మరణ సమస్యగా పోరాటం సాగిస్తోంది. సుశిక్షితులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఆమె స్పృహలోకి ఎప్పుడు వస్తుందా అని ఆమె భర్త కార్తీక్ తో సహా.. బంధువులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. లావణ్యకు హస్పటల్ టెస్ట్ రిపోర్టులను బట్టి.. తలకు తగిలిన దెబ్బ వల్ల తప్ప, జరిగిన ప్రమాదం వల్ల ఆమెకు మరే ఇతర సమస్యలు, విపత్తులు లేవని తేలింది. 


భర్త కార్తీక్ ఆ హాస్పటల్లోనే జూనియర్ డాక్టరు గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నాలుగోరోజున, డ్యూటీ నర్సు లావణ్యలో చలనం గమనించి, డాక్టరుకు తెలియపరిస్తే, అందరూ పేషెంట్ చుట్టూ గుమిగూడారు ఆమె మెలుకువ క్షణాలకై నిరీక్షిస్తూ! స్పృహలోకి వచ్చిన లావణ్య నీరసంగా మూలుగుతూ కళ్ళు తెరచి చుట్టూ డాక్టర్లను పరికిస్తూ భారంగా.. ‘ నాకేమయింది డాక్టర్ ‘ అని పక్కనున్న కార్తీక్ ను ప్రశ్నించి.. మళ్ళీ మత్తులోకి జారుకుంది. ‘ డాక్టర్! ‘ అని తనను పిలవడంతో, తనను భర్తగా గుర్తించలేదని అర్ధమయింది కార్తిక్ కు. వెంటనే.. ప్రక్కనున్న స్పెషలిస్టు డాక్టరు మనోహర్ వైపు దీనంగా చూస్తూ విచారంగా, ‘ ఏమిటి సార్ తన పరిస్ధితి? ‘ అంటూ, దిగులుగా అడిగాడు కార్తీక్. 


‘ ఇప్పుడే.. ఏం చెప్పలేం కార్తీక్!.. పూర్తిగా ఆరోగ్యం కోలుకున్నాకే, భవిష్యత్ అంచనాతో ఆమె మానసిక పరిస్థితిని బట్టి చెయ్యవలసిన ట్రీట్మెంటు వ్యూహం గురించి, చేయవలసింది ఏమిటనేది నిర్ణయించాలి! ‘ అంటూ.. నిదానంగా అప్పటికి కొంత ధైర్యంచెప్పి కార్తీక్ ను సముదాయించాడా సీనియర్ డాక్టర్.


విశ్రాంతి గది కెళ్ళిన కార్తీక్.. తీరికగా ఆ రోజు జరిగిన సంఘటనలను, ప్రమాదం జరిగిన నేపధ్యాన్ని మరో మారు గుర్తు చేసు తెచ్చుకున్నాడు.


ఆరోజు రాత్రి… సాఫ్టువేర్ కంపెనీలో సెకండు షిఫ్టు చేస్తున్న భార్య లావణ్యను తన హాస్పటల్ డ్యూటీ అయిపోయిన తర్వాత వెళ్లి పికప్ చేసుకుని స్కూటర్ మీద ఇంటికి తిరుగు ప్రయాణం… హైటెక్ సిటీ గుండా, వెళ్తుండగా.. ఒక కుర్రకారు గేంగు, గోలగా పెద్దగా మ్యూజిక్ వింటూ, కేరింతల మధ్య మద్యం మత్తులో, అమిత వేగంగా కారు నడుపుతూ, అదుపు తప్పి తమను వెనకనుండి ఢీకొట్టడం.. లావణ్య తనూ, ఒక్కసారిగా ఎగిరి పడి పేవ్మెంటుకు గుద్దుకోవడం… సినిమా రీలులా కళ్ళముందు గుర్తుగా మరోసారి కదలాడింది. తను తలకు హెల్మెట్ ధరించడంతో, చేతులతో వెహికిల్ ను గట్టిగా పట్టుకొని ఉండడం వల్ల తనకైతే పెద్దగా గాయాలేమీ కాలేదు! కానీ.. క్రింద పడిపోయిన లావణ్యకు తలకు తగిలిన దెబ్బతో, వెంటనే స్పృహ కోల్పోయింది. తమను గుద్దిన పొగరుబోతులు అదే హుషారులో, కనీసం ఆపకుండా ముందుకు సాగిపోయారు! ఆ తర్వాత వెంటనే తాను ట్రాఫిక్ కానిస్టేబుల్ సాయంతో, 108 వాహనంలో తను పనిచేసే హాస్పటలుకే తీసికెళ్ళి, ఎమర్జన్సీ ఐసియు లో జాయిన్ చేసాడు భార్యను. ఆ తర్వాత అంతా మామూలే!.. తలకు స్కానింగూ, ఇతర అత్యవసర పరీక్షలు, నిపుణుల నిత్య పర్యవేక్షణలో వైద్యం జరుగుతున్నా, దీర్ఘ నిరీక్షణ అనంతరం, నేటికి 

నాలుగో రోజుకు స్పృహలోకొచ్చిన లావణ్య.. భర్తగా తనను సైతం గుర్తు పట్టలేదని అర్ధమవుతోంది! మరి ఈ పరిస్థితి చక్కబడి, తనను గుర్తుపట్టే దెప్పుడో!... తమ అన్యోన్య దాంపత్యం చక్కబడేదెన్నడో!! తెలియని కార్తీక్ వ్యాకులపడటమే కాకుండా, ఏమీ తోచక పూర్తిగా దిగాలు పడిపోతున్నాడు.


మరోవంక.. సిసి టీవీల సాయంతో, పోలీసులు ప్రమాదానికి కారణమైన కారును, అందులోని వ్యక్తులనైతే గుర్తించి పట్టుకున్నారు. కానీ.. వాళ్ళు చాలా మంచి పరపతి కలిగిన, బాగా ధనిక వర్గానికి చెందినవారి బిడ్డలని తేలింది. వారందరూ సిటీలోని ఒక పబ్బులో, మంచి జోష్ గా తాగి ఎంజాయ్ చేసి, మత్తుగా బయటకు వచ్చిన, వీర మందు బాబులని గుర్తించారు. కేసులో వ్యక్తులను మార్చడానికి, మరెవరో అమాయకుడిని డ్రయవరని మార్చి చూపడానికి, బేరసారాలు, ఒత్తిడిచేసే ప్రయత్నాలు కొనసాగాయి. చివరకు కార్తీక్ తో కూడా కేసు వాపసు తీసుకోడానికి డబ్బు ఆశ చూపడం, మరోవైపు బలవంతపు బెదిరింపులకు దిగుతూ వాళ్లు చేసే ప్రయత్నాలు, జోరుగా సాగుతూనే ఉన్నాయి. 


హస్పటల్లో లావణ్య నెమ్మదిగా శారీరకంగా పూర్తిగా కోలుకున్నా, మానసికంగా ప్రమాదం జరిగిన విషయం, అంతకు పూర్వం కొంతకాలంగా ఉన్న పరిచయాలను, గడిపిన జీవితాన్ని మరిచిపోయి, దరిమిలా.. తారసపడిన వ్యక్తుల గుర్తింపు విషయం లోనూ, విఫలమవుతూనే ఉంది! స్పెషలిస్టు డాక్టరు మనోహర్ కూడా, ఆ జ్ఞాపకాలు మెదడులో స్పందనలు కలిగి పునరుజ్జీవనం కావడానికి, ఇదమిద్ధంగా ఇంత కాలమని, ఎటూ చెప్పలేని పరిస్థితి అని… తేల్చి చెప్పేసాడు!


‘ మరి మా దాంపత్య జీవితం మాటేమిటి సార్?.. ‘ అంటూ, వ్యక్తిగతంగా తమ అన్యోన్య సంసారం పునరుద్ధరణ గురించిన సంశయం, అయోమయ పరిస్థితిని గురించి.. దిగులుగా అడిగాడు కార్తీక్, తనకు సీనియరు,చాలా ఆప్తుడు అయిన స్పెషలిస్ట్ డాక్టర్ మనోహర్ ను.


‘ ఆ!.. అవును నిజమే, నేను కూడా నీ ప్రేమ ఉదంతం లో ప్రత్యక్ష సాక్షినే కదా!.. నీ ప్రేమాయణం పెళ్ళిదాకా చేరేందుకు సహకరించిన సూత్రధారిని కూడా నేనే కదా!.. నాకూ, చాలా బాధగానే ఉంది. ఈ విపత్కర పరిస్థితిని బట్టి చూస్తే,.. నీవు లావణ్య ప్రేమ కోసం, ఆమె పొందు కోసం నువ్వు పడిన పాట్లు, అగచాట్లు చూడబోతే, మళ్ళీ మొదటి కొచ్చినట్లుగానే తోస్తోంది! ‘ అని నర్మగర్భంగా చెబుతూ, సూచన ప్రాయంగా, ‘మళ్ళీ నువ్వు నూతనంగా లావణ్య అభిమానం పొందటమే నీ ముందున్న ఏకైక తరుణోపాయం అనిపిస్తోంది! ‘ అని పరిస్థితిని వివరంగా తెలియజేసి, విషయాన్ని తేల్చి చెప్పేసాడా స్పెషలిస్టు డాక్టర్.


ఖిన్నుడైన కార్తీక్ విశ్రాంతి గది కెళ్ళి గడిచిన తన లోగడ జీవితాన్ని సింహావలోకనంగా జ్ఞప్తికి తెచ్చుకోసాగాడు.


అవి.. తను ఎంబిబియస్ పూర్తిచేసి, హౌస్ సర్జన్ గా కొత్తగా డాక్టర్ మనోహర్ దగ్గర అప్రెంటిస్ గా, వృత్తిలో కొత్తగా జాయిన్ అయిన మొదటి రోజులు…


ఒక రోజు తను నైట్ డ్యూటీలో ఉండగా, ఫుడ్ పాయిజన్ అయిందంటూ నిలబడలేని పరిస్థితిలో ఉన్న ఒక టీనేజ్ అమ్మాయి, మరో ఇద్దరు ఆడపిల్లలు కలసి తోడుగా హాస్పిటలకు తీసుకుని వచ్చారు. వాళ్ళంతా హైటెక్ సిటీలో, కొత్తగా సిటీకి వచ్చి చేరిన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులమని, అక్కడకు దగ్గరలోనే ఉన్న ఒక వర్కింగ్ ఉమెన్స్ వసతి గృహంలో వుంటున్నామని వివరాలు చెప్పి, ఆ రోజు అక్కడే తిన్న లంచ్ తో, ఆమెకీ అవస్థ దాపురించిందని ఆవేదనగా మొర పెట్టుకున్నారు. 

 

అవును.. అదే! ఆరోజే,.. తాను లావణ్యను మొట్టమొదటి సారిగా చూడ్డం! అంత అందమైన ఆకర్షణీయమైన అమ్మాయి అలా బాధతో మెలికలు తిరుగుతుంటే మనసులో కించెత్తు బాధ పడుతూ, వెంటనే ఆమెను బెడ్ మీదకు జేర్చి స్టమక్ వాష్ కు అన్ని ఏర్పాట్లు చేసి, ఉపశమనం విశ్రాంతి కలిగించాడు. సెలైన్ ఎక్కించి అన్ని వైద్య జాగర్తలు, సదుపాయాలు దగ్గరుండి తీసుకొని, పూర్తి స్వస్థత చేకూర్చాడు, మరో రెండు రోజులలో! 

 

డిశ్చార్జ్ సమయంలో డాక్టర్ గా తాను తీసుకున్న ప్రత్యేక శ్రద్దకు ధన్యవాదాలు చెపుతుంటే, అదే అదనుగా తాను కొంచెం చనువు తీసుకొని లావణ్య పూర్తి వివరాలు తెలుసుకుని, వసతిగృహం పరిస్థితి చూస్తానని చెప్పి తన బండి మీదే తీసికెళ్లి దిగబెట్టాడు. శుచి శుభ్రం లేని అలాంటి వాతావరణంలో, ఉండడం తినడం క్షేమం కాదని, వీలయినంత త్వరలో మరో మంచి చోటికి మారిపొమ్మని గట్టిగా నచ్చజెప్పాడు.

 

‘ డాక్టరు గారూ.. మీరు చెప్పింది నిజమే!.. కానీ ఇక్కడ బంధువులెవరూ లేని నాకు ఉండడానికి ఇంతకుమించి ఇతరత్రా మరో గత్యంతరమేముంది ఇలాంటి వసతి గృహాలే తప్ప! ‘ అంటూ బేల చూపులు చూస్తే, తనే పూనుకొని, తనకు బాగా పరిచయమున్న ఒక వృద్ధ దంపతుల ఇంట్లో, పేయింగ్ గెస్ట్ గా జేర్చాడు.


ఆ సహాయం కృతజ్ఞతాభావం లావణ్యకు, తనపట్ల గౌరవాభిమానాలు కలిగించి, తమ పరిచయం 

 వృద్ధి చెంది, తరచూ ఆత్మీయంగా కలుసుకోవడం, అభిప్రాయాలు కలబోసుకోవడంతో, తమ మధ్య ప్రేమ చిగురించి, అనతి కాలంలోనే, పెళ్లి ప్రస్థావన వరకూ దారి తీసింది. పెద్దల ప్రమేయం వచ్చేసరికి, తనవాళ్ళ నుంచి గట్టి ప్రతిఘటనే ఎదురయ్యింది. కులాల వ్యత్యాసం అడ్డు గోడగా నిలిచింది. అప్పుడే.. తనకు సీనియర్ డాక్టర్ మనోహర్ గారి మధ్యవర్తిత్వం అక్కరకు వచ్చింది! వృత్తిలో తనను అభిమానించే డాక్టర్ మనోహర్ కు తనకు మధ్య, వ్యక్తిగత విషయాలలో కూడా ఏ దాపరికమూ లేని ఆత్మీయ స్నేహం వుంది! నలుగురితో గౌరవింపబడే పెద్దమనిషిగా ఆయన కలగజేసుకొని, తమ పెళ్లి విషయంలో పెద్దలందరితో సంప్రదించి నచ్చజెప్పడంతో, ముభావంగానే అయినా.. పెద్దవాళ్ళ సమ్మతి అంగీకారాల తోనే.. తమ పెళ్లి అడ్డంకులు తొలగి జయప్రదంగా జరిగింది.


ఆ తర్వాత.. గడిచిన ఆరు నెలలుగా తమ సంసార జీవితం కూడా, ఎంతో అన్యోన్యంగా ఉత్సాహంగా, ఏ ఒడిదుడుకులు లేకుండా, సాఫీగానే సాగిపోతోంది! ఇదిగో.. ఇప్పుడే ఇలా, ఈ దుర్ఘటన కారణంగా... తనకీ పరిస్థితి దాపురించింది. తన లావణ్య తనని భర్తగా గుర్తెరిగేదెన్నడో, మళ్ళీ తమ సంసార జీవితం గాడిన పడేదెప్పుడో తెలియక, కింకర్తవ్యం? అని విచారంతో తలపట్టుకుని, దిగాలు పడ్డాడు కార్తీక్.


మరునాడు లావణ్య పరిస్థితిని సమీక్షించడానికి వచ్చిన డాక్టర్ మనోహర్ తో తన సమస్యకు పరిష్కారం ఏమిటని మళ్ళీ మొరపెట్టుకున్నాడు కార్తీక్.

సమాధానంగా డాక్టర్ మనోహర్.. 


‘ చూడు కార్తీక్! లావణ్యకు గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో, అసలు వస్తుందో రాదో! చెప్పడం కష్టం! లావణ్యలో మిగతా అన్ని విషయాలలో పూర్తి ఆరోగ్యం మెరుగుదల కనిపిస్తోంది కదా! త్వరలోనే తప్పక మామూలు స్థితికి వస్తుంది!! ‘ 


‘ ఇకపొతే.. లావణ్యతో నీ సంబంధం సమస్య చూస్తే.. నీవే స్వయంగా పునరుద్దరించు కోవాలనిపిస్తోంది!! ఎలాగూ నీవూ ఇక్కడ డ్యూటీ డాక్టరువే కాబట్టి, నువ్వే ఆమెకు ఫుల్ టైం డాక్టరుగా సేవలందించు! ఆమెతో సాహచర్యం చేసినవాడివే కాబట్టి ఆమె మనోభీష్టాలు, స్పందనలు తెలిసిన వాడిగా సులభంగానే, ఆమె మనసును ఆకర్షించే సౌలభ్యం నీకుంది! అయినా.. ఇంతకు ముందు ఒకసారి ఆమెతో ప్రేమలో పడి విజయం సాధించిన నీకు, మరోసారి ఈ పునః ప్రేమాయణ ప్రయత్నంలో, తప్పక సఫలం సిద్ధిస్తుందన్న నమ్మకం నాకుంది! ‘ అని.. డాక్టర్ మనోహర్ మానసిక వైద్యుడిగా తరుణోపాయ సందేశంగా, తన అభిప్రాయం చెప్పాడు. 


మానసికంగా ఉత్తేజపరుస్తూ, ఆమెను గతం నుంచి నెమ్మదిగా వర్తమానంలోకి తీసుకురావటం ఒక్కటే సాధన మార్గంగా తోస్తోంది! ‘ అంటూ, భరోసాగా భవిష్యత్ కార్యక్రమం బోధపరిచాడా స్పెషలిస్ట్ డాక్టర్ మనోహర్! 


మరునాటి నుంచే, కార్తీక్ లావణ్యను వ్యక్తిగతంగా ప్రత్యేక గదికి మార్చి, సంపూర్ణ శ్రద్ధ వహిస్తూ భార్య సపర్యలలో నిమగ్నమయ్యాడు. అది గమనించిన లావణ్య, కార్తీక్ తో.. 

 

‘ ఏమిటి డాక్టర్! నర్సులెవరి సహాయం తీసుకోకుండా.. మొత్తం మీరే నా పర్యవేక్షణ చూస్తున్నారు? మీకు.. వేరే పేషేంట్లను చూసే పనిలేదా? ‘ అని సందేహం వెలిబుచ్చింది.


దానికి.. తడుముకోకుండా కార్తీక్ 

‘ లావణ్య గారూ.. మీరున్న పరిస్థితిలో.. మీరు మా హాస్పిటల్ కు ప్రత్యేకం! మీకు ఈ మధ్య జరిగిన విషయాలేమీ గుర్తుకు రావటం లేదని మీకూ తెలుసు. మీకు తలకు ఎలా దెబ్బ తగిలిందో కూడా మీకు గుర్తు లేదు. ఇదో విచిత్రమైన మానసిక పరిస్థితి. దీన్ని మా హాస్పిటల్ వాళ్ళు, ఒక కేస్ స్టడీగా తీసుకున్నారు. నన్ను ప్రత్యేకం మీ చికిత్సకై నియోగించారు. అందుచేత మీరు నాకు చాలా ముఖ్యం, ప్రత్యేకం! నాతో మీకు ఏలాంటి ఇబ్బంది రాదు. నన్ను మీరు మీ ఆత్మీయుడుగానే భావించండి. ‘ అంటూ… కొంత నిజం, మరికొంత దాపరికం కలిపి, విషయం విశదీకరించాడు లావణ్యకు.


‘ అవును నిజమే డాక్టర్! నాకు ఎంత ప్రయత్నించినా, నాకీ ప్రమాదం ఎలా జరిగిందో, చదువయ్యాక నేనిక్కడకు ఎప్పుడు ఎలా చేరానో, అర్ధం కావటం లేదు.

అమ్మా నాన్నా అయితే, నేను ఉద్యోగం కోసమే హైదరాబాదు వచ్చానని, ఏదో ఉద్యోగినుల వసతి గృహంలో చేర్చామని చెపుతున్నారు. నాకేదీ గుర్తుకు రావటం లేదు. ‘


‘ అవును ఆ విషయాలు మా వాకబు లోనూ తెలిసాయి! మీరు బాగా కోలుకున్నాక ఆ విషయాలు ప్రదేశాలూ అన్నీ.. స్వయంగా వెళ్ళి పరిశీలిద్దాం! మీరైతే ప్రస్తుతానికి.. ఏ ఆలోచనలు లేకుండా, మీ మెదడుకు పూర్తి ప్రశాంతిని ఇవ్వండి!! మీకు పూర్తిగా స్వస్థత చేకూరే వరకు మీ బాధ్యత నాది! మీ బాగోగులు నేను పూర్తిగా చూసుకుంటాను! ఆ భరోసా మీవాళ్లకు కూడా నేనిచ్చాను!.. ఇక మీదట నన్ను నమ్మి.. మీరు పూర్తి నిశ్చింతగా ఉండండి!! ‘ అంటూ.. లావణ్యకు మానసిక ధైర్యం కలిగించి.. మద్దతుగా నిలబడతానని మాట ఇచ్చాడామెకు కార్తీక్.


లావణ్య పూర్తి బాధ్యతను తానే చూసుకుంటానని అత్తా మామలకు కూడా చెప్పి ఒప్పించి.. వారు ఊరికి తిరిగి వెళ్లేందుకు.. లావణ్యను కూడా ఒప్పించి సమాధానపరచి.. తనే లావణ్య పూర్తి బాధ్యత తీసుకునే సంరక్షకుడిగా మారాడు కార్తీక్.


రోజులు గడుస్తున్నాయ్! లావణ్య శారీరకంగా నెమ్మదిగా కోలుకుంటోంది! కానీ.. మఱచిన గతం ఏమాత్రం స్పృహలోకి వచ్చే సూచన మచ్చుకు కూడా కనిపించటం లేదు. కాకపోతే.. డాక్టరుగా కార్తీక్ తనపట్ల తీసుకుంటున్న శ్రద్దకు, కృతజ్ఞతా భావంతో అతనిపట్ల గౌరవం పెరిగి.. అతను చూపెడుతున్న ఆత్మీయత, మంచితనం ఆకట్టుకుని.. అతనిపట్ల ఆకర్షణ, చనువు పెరిగి.. సన్నిహితంగా మెలగటం అలవాటయ్యింది.


విరామం లేకుండా తనతోనే గడుపుతున్న కార్తీక్ ను చూసి.. ఒకరోజు ఉండబట్టలేక.. లావణ్య అడగనే అడిగింది.


‘ డాక్టర్!.. ఇంటిపట్టు వదిలి.. రాత్రి పగలు ఇక్కడే డ్యూటీలో వుండి పోతున్నారు.. మీ ఇంట్లో వాళ్ళతో ఏమీ ఇబ్బంది రాదా? ‘ అంటూ.


దానికి.. ‘ ఒంటరిగాణ్ణి.. ఎక్కడుంటే ఏమిటి?.. ఇప్పటికి నాకు.. మీ డ్యూటీయే ముఖ్యం!.. లావణ్యగారూ! ‘ అని… నర్మగర్భంగా బదులిచ్చాడు కార్తీక్.. నిదానంగా.. సాలోచనగా.. లావణ్య వైపు చూస్తూ.


ఆ సమాధానంతో సంశయం తీరిందనిపించిన లావణ్య సిగ్గుపడుతూ.. ‘ సరేగాని.. డాక్టర్ గారూ!.. మీరు ప్రతీసారీ.. లావణ్యగారూ.. గారూ.. అంటూ సంభోదించటం నాకు చాలా ఇబ్బందిగా వుంది. నేను మీ పేషెంట్ ని,.. పైగా మీ కంటే చిన్నదాన్ని.. లావణ్యా! అని పిలిస్తే చాలు ‘ అంటూ మనసులోని మాటను వ్యక్తపరిచింది కార్తీక్ తో.


అందుకు కార్తీక్..సాలోచనగా ‘ సరే ఆలాగే!., కానీ.. ఈ ఏకవచన సంబోధన రెండువైపుల నుంచయితే ఏ ఇబ్బందీ ఉండదుగా! లావణ్యా!.. మరి నువ్వు కూడా నన్ను కార్తీక్!.. అని పేరుతో పిలుస్తానంటే సరే.. నేనూ అలాగే చేస్తాను! ‘ అంటూ.. తన ఇష్టాన్ని తెలిపి సన్నిహిత్యాన్ని సున్నితంగా ప్రకటించాడు.



అలా ఏకవచన సంభోధనలతో మొదలైన వారి చనువు.. స్నేహాంగా.. మరికొంత కాలానికి అభిమానంగానూ మారుతూ వచ్చింది. ఆ అభిమానాన్ని అన్యోన్యంగా, ఆప్యాయతను, అనురాగంగానూ.. అనుబంధంగానూ మార్చుకోవాలనే ఆకాంక్ష లావణ్యలో ఆశగా చిగురించి.. మరుపు మరుగున మమత కొత్తగా మొగ్గ తొడగడం మొదలయ్యింది. ఆమె కనబరిచే అనుకూల సంకేతాలకు.. కార్తీక్ కూడా మనసులో ఆనంద పడుతూ, తదనుగుణంగానే స్పందిస్తూ.. మరింత చేరువ కావడానికి తనవంతు ముమ్మర యత్నాలన్నీ చేస్తూ, ఆమె మనసును చూరగొనేందుకై తగిన సాధనా కొనసాగిస్తూనే వచ్చాడు.


లావణ్య శారీరకంగా పూర్తిగా కోలుకున్నాక ఒకరోజు.. కార్తీక్ ఆమెను బయటకు తీసికెళ్ళడానికి సమాయత్తం చేసి.. ఆమె హైదరాబాద్ వచ్చిన కొత్తలో, కొన్నాళ్ళు గడపిన వసతి గృహానికి తీసికెళ్లి, అక్కడ తనతో తోడుగా గడపిన సహవాసులను పరిచయం చేసి.. అప్పటి రోజుల్ని, వాతావరణాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించాడు. కానీ.. ఏమీ లాభం లేకపోయింది. లావణ్యకు ఏమాత్రం గతం గుర్తుకు వచ్చింది లేదు.

మరోరోజు అలాగే.. తను స్వయంగా ఏర్పాటు చేసిన వసతి.. వృద్ధ దంపతుల ఇంటికి తీసికెళ్లినా.. ఎలాంటి ప్రయోజనం సమకూరలేదు.


ఈలోగా.. లావణ్యకు ఆఫీసు నుంచి వచ్చి వెంటనే డ్యూటీలో హాజరుకమ్మని తాకీదు వచ్చింది.


‘ లావణ్యా! నీ ఆరోగ్యం ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. వారం పది రోజుల్లోనే నీ డిశ్చార్జ్! ఈలోగా.. రేపే నువ్వు నీ ఆఫీసు పనికి కూడా వెళ్ళి జాయిన్ అవుదువుగాని.. ఇన్నాళ్ళ విరామం తర్వాత.. నీకూ పనిలో పడితే, తోచుబాటు కూడా అవుతుంది! సరేనా?.. ‘ అంటూ.. లావణ్యను తర్వాతి రోజున ఉద్యోగంలో చేరేందుకు కూడా తయారు జేసాడు.. సంరక్షకుడి బాధ్యతగానే కార్తీక్.


మరునాడు.. కార్తిక్ తనే స్వయంగా లావణ్యను ఆఫీసుకు తీసుకెళ్ళి దగ్గరుండి డ్యూటీలో జాయిన్ చేయించాడు. లావణ్యకు పాత ఆఫీసే అయినా.. అంతా కొత్తగా వుంది! కొత్తగా ఆరోజే పనిలో జేరినట్లుగా వుంది.

 

ఒక డాక్టరుగా.. ఆమె పరిస్థితి అంతా అందరికీ వివరించి, వారి అందరి సహాయ సహకారాలు లావణ్యకు అందించమని తోటి ఉద్యోగస్థులను అందరిని పేరుపేరునా అభ్యర్థించాడు.


లావణ్య కూడా.. తోటి ఉద్యోగుల గుసగుసల ద్వారా కర్ణాకర్ణిగా ‘ లావణ్యను భర్తే దగ్గరుండి అన్నీ చాలా జాగర్తగా చూసుకుంటున్నాడు! ‘ అని అనుకోవడం విన్నా, తనకు తోడుగా రావడంతోనే అలా.. ఊహిస్తున్నారని భావించి సంతోషపడింది.


సాయంత్రం ఆఫీసు నుంచి తిరుగు ప్రయాణంలో.. ఉండబట్టలేక ఆ విషయమే కార్తీక్ తో ప్రస్తావించింది లావణ్య.


‘ చూడండి కార్తీక్! మా ఆఫీసులోవాళ్ళు మన ఇద్దరినీ దంపతులుగా భావిస్తున్నారు.. తెలుసా? ‘ అని చెప్పి అతనేమంటాడోనని కార్తీక్ మొహం లోకి చూసింది.


‘ నువ్వేమైనా నొచ్చుకున్నావా? ‘ అంటూ.. లావణ్య ఏం జవాబు చెపుతుందా అని.. ఆత్రంగా ఎదురు చూసాడు కార్తీక్.


‘ లేదు కార్తీక్! మీరు కూడా ఊ అని సరేనంటే... అదే విషయం అమ్మా నాన్నలకు కూడా తెలియజేయాలని అనుకుంటున్నాను! అందుకు మీ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాను!! ‘ అంటూ.. కాస్త సిగ్గు పడుతూనే, తన మనసులోని మాటను బయట పెట్టింది.. కార్తిక్ వైపు పరీక్షగా చూస్తూ.


‘ నీ మనసు గెలుచుకోగలిగినందుకు చాలా సంతోషం.. లావణ్యా! ఈ క్షణం కోసమే.. నా నిరీక్షణ కూడా!!.. నేను కోరుకునేదీ అదే!.. నా కలల రాణివి.. నువ్వు నాకు దగ్గర కావటం కంటే, మించిన భాగ్యమేముంది నాకు ‘ అంటూ.. ఉద్వేగంగా చేతిలో చేయి కలిపాడు సంతోషంగా!


‘ ముందుగా.. మన ఈ నిర్ణయాన్ని నా శ్రేయోభిలాషి మిత్రులు, నీ కేసును ముందునించి పర్యవేక్షిస్తున్న స్పెషలిస్టు డాక్టర్ మనోహర్ గారికి చెప్పి, వారి ఆశీస్సులు అభినందనలతో ముందుకు సాగుదాం!.. లావణ్యా! ‘ అని ఆమెతో చెప్పి, వెంటనే.. ఆ శుభవార్తను పంచుకోవడానికి ఉద్వేగంతో డాక్టర్ మనోహర్ ఛాంబర్ కు పరుగుపెట్టాడు కార్తీక్.


కార్తీక్ ఉద్వేగాన్ని గమనించిన డాక్టర్ మనోహర్.. 

‘ ఏమిటి హడావుడి కార్తీక్!.. ఏమంటోంది నీ భార్య!! ‘ అంటూ.. వివరం అడిగాడు.


‘ అదే డాక్టర్! మీ వ్యూహం ఫలించింది!! నా లావణ్య నన్నిష్టపడుతోంది! నాకివాళ ప్రొపోజ్ కూడా చేసింది!! నేను తన భర్తనని గ్రహించకుండానే! ‘ అంటూ.. తన ఆనందాన్ని పంచుకున్నాడు.


‘ కంగ్రాట్స్!.. కార్తీక్! ఇప్పుడే.. మనం మరి కాస్త జాగర్తగా పరిస్థితిని.. సానుకూలంగా మార్చుకోవాలి! నేను వచ్చి లావణ్యతో మాట్లాడతాను!.. నువ్వేమీ తొందర పడకు! ఖంగారు పడకు నిదానంగా వుండు ‘ అని సూచించి ధైర్యం చెప్పి అభినందించి పంపాడు ఆ సీనియర్ డాక్టర్ మనోహర్.


మరునాడు విజిట్ కొచ్చిన డాక్టర్ మనోహర్.. 

‘ కంగ్రాట్స్!.. లావణ్యా!.. మీ ఇద్దరికీ!!.. మీరు తీసుకున్న మంచి నిర్ణయానికి. కార్తీక్ ఎప్రెంటిస్ గా నా దగ్గర చేరినప్పటి నుంచి అతడిని బాగా ఎరిగిన వాణ్ణి. అతడిని పెండ్లాడి, భర్తగా పొందడం నీ అదృష్టమనే చెప్తాను నేను. అయినా.. ప్రస్తుతం నీవున్న పరిస్థితిలో.. నీకు అతని గురించి మరింతగా తెలిస్తే మంచిదనిపిస్తోంది! ‘

 

‘ రేపు ఆదివారం మీ ఇద్దరిని.. ఈ సంధర్బంగా, మా ఇంట్లోనే, చిన్న ఆత్మీయ విందుకు ఆహ్వానిస్తున్నాను. అక్కడ మరింత వివరంగా, ఆత్మీయంగా నిదానంగా మాట్లాడుకుందాం! ‘ అంటూ.. విష్ చేసి హడావిడిగా వెళ్ళిపోయాడు డాక్టర్ మనోహర్.


ఆదివారం నాటికి,.. శుభ పరిణామ వివరాలు తెలియ చెప్పి, అత్తామామలను, తన తల్లిదండ్రులను కూడా తమ వద్దకు రప్పించాడు కార్తీక్.

 

ఆదివారం నాడు.. ఆహ్వానం మేరకు, విందుకు కార్తీక్ లావణ్యను, బంధువులనందరిని డాక్టర్ మనోహర్ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆత్మ్మీయ పలకరింపులు, సరదా సంభాషణలు, విందు భోజనాలు ముగిసాక ఇంటిని చూపించే నెపంతో, లావణ్యను లోపల తన ఆంతరంగిక గదిలోకి తీసికెళ్లి, తమ హాస్పిటల్ కు సంబందించిన ఇనాగరేషన్, పురోభివృద్థిలో పాలుపంచుకొని సహకరించిన స్టాఫ్, ఆత్మ్మీయ వ్యక్తులతో కూడిన ఫోటో ఆల్బమ్ ఒకటి లావణ్య చేతిలోపేట్టి చూస్తూవుండు ఇప్పుడే వస్తాను..’ అని చెప్పి, లావణ్యను ఏకాంతంగా వదిలిపెట్టి, బయటికొచ్చాడు డాక్టర్ మనోహర్.


లావణ్య.. ఆ ఆల్బమ్ లో, డాక్టర్ మనోహర్ తో, కార్తీక్ కు ఉన్న ఆత్మీయ స్నేహ సంబంధాలు వివరించే పలు ఫోటోలను ఆశ్చర్యపోతూ తిలకిస్తూ, చివరలో.. కార్తీక్ పెళ్ళి, రిసెప్షన్ ఫోటోలతో జోడీగా.. తనను చూసుకొని విస్తుపోయింది!


నివ్వెరపోయిన లావణ్య.. ఒక్క ఉదుటన లేచి, బయటకొచ్చి,.. డాక్టర్ మనోహర్ ను కలసి, పెళ్ళి ఫోటోలను చూపిస్తూ, గద్గద స్వరంతో.. ‘ డాక్టర్!.. ఇందులో వున్నది నేనేనా?.. చెప్పండి సార్!! ‘ అంటూ ఉద్వేగంగా అడిగింది!


‘ ఖంగారు పడకు లావణ్యా!.. అది ముమ్మాటికి నువ్వే! మీ ఇద్దరి పెళ్ళికి సాక్షిని, సూత్రధారిని కూడా నేనే! మీ ఇద్దరి పెద్దలను ఒప్పించి, మీ అప్పటి ప్రేమకు పెళ్లితో శుభం పలికిన ఆత్మీయ వ్యక్తిని కూడా నేనే!! ‘


‘ చక్కగా సాగుతున్న మీ జీవితంలో, ఈ ప్రమాద ఘటనతో ఇలా.. విరామం రావటం దురదృష్టం!.. నీవిలా గతం మరచి, తనను నువ్వు గుర్తుపట్టని పరిస్థితికి, కార్తీక్ పడిన వేదన వర్ణనాతీతం!! ఏమైనా మరలా నీవిలా,.. అతడినే మనసారా ఇష్టపడి కోరుకోవడం, మా అందరికీ ఎంతో సంతోషంగా వుంది! ఇప్పుడు.. ఇంక నీకు గతం ఎప్పుడు గుర్తుకు వచ్చినా బెంగలేదు!!’ 

 

‘ మీ ఇద్దరి సంసారబంధం నిలిచేందుకు మేమాసించిన శుభపరిణామం ఇదే! మీ అనుబంధం జన్మజన్మల బంధంగా ఋజువయ్యింది ఇలా!.. కంగ్రాట్స్!! ‘ అని శుభాకాంక్షలు తెలిపి.. లోగడ జరిగిన వారి.. ప్రేమ, పెళ్ళి విషయాలకు.. తానే ఒక సాక్షిగా.. ఫోటోలను సాక్ష్యాధారాలుగా చూపి.. వివరంగా తెలియజేసాడు లావణ్యకు.. ఆ స్పెషలిస్ట్ డాక్టర్ మనోహర్.


అంతా విన్న లావణ్య నిశ్చేస్టురాలై.. కొంతసేపటికి తేరుకొని.. హాస్పిటల్లో తనకు స్పృహ వచ్చిన తర్వాత రోజులు.. అప్పటి వరకు జరిగిన సంఘటనలు.. కార్తీక్ కు తనకు మధ్య జరిగిన సంభాషణలు.. అతని మృదుస్వభావం, శ్రద్దగా, ఓపికగా.. తనను చూసుకున్న తీరు ప్రవర్తన ఒక్కటొక్కటిగా గుర్తుకు వచ్చి, కార్తీక్ చూపిన ఓర్పుకు లావణ్య మనసు ఉప్పొంగింది! భర్తగా అతన్ని గుర్తు పట్టలేని తన మానసిక పరిస్థితికి అతనెంతగా వేదన అనుభవించి ఉంటాడో ఊహించి.. కలతచెంది దిగులు పడింది!! పెల్లుబికిన దుఃఖంతో పరుగున కార్తీక్ చెంతకు చేరి బావురుమంటూ తన అసక్తతకు క్షమాపణలు వేడుకుంది.

కార్తీక్ కూడా.. లావణ్యను ఓదారుస్తూ.. ‘ ఇందులో నీ తప్పేం లేదు! ఇప్పటివరకు జరిగింది.. మనకు మన ఇద్దరి మధ్య.. విధి విధించిన ఎడబాటుగా భావిద్దాం!.. చెరవీడి పులకించిన హృదయాలతో, మనం మళ్ళా ఏకమయ్యాం!!.. అంతేచాలు.. ఇప్పటినుంచి మనం.. ఏ ఒడిదుడుకులు లేకుండా, కొత్త జీవితాన్ని ఆనందంగా అన్యోన్యంగా సాగిద్దాం! ‘.. అంటూ.. లావణ్యను అక్కున జేర్చుకున్నాడు కార్తీక్. లావణ్య అతని కౌగిట్లో గువ్వలా ఒదిగిపోయింది ముచ్చటగా.


అలా.. తాము భార్యభర్తలమే అని.. తెలుసుకున్న లావణ్య.. బంధుమిత్రుల అందరి అభినందనలు అందుకొని ఉబ్బి తబ్బిబ్బయ్యింది!. అటుపిమ్మట సంతోషంగా దంపతులిద్దరూ, డాక్టర్ మనోహర్ ఇంటినుంచి, సరాసరి అటునుంచి అటే.. జంటగా పూర్వ నివాసానికి.. ఉల్లాసంగా ఉత్సాహంగా.. నూతనోత్తేజంతో తమ ఇంటికి చేరుకున్నారు.


 సమాప్తం


గోపరాజు వెంకట సూర్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

 ముందుగా మన తెలుగు కథలు.కామ్ నిర్వాహకులకు నమస్కారం, అభినందనలు. మీరు తెలుగు కథలను, కథకులను ప్రోత్సహిస్తున్న తీరు ఈ మధ్యనే తెలిసింది!

నా పేరు: గోపరాజు వెంకట సూర్యనారాయణ, తల్లిదండ్రులు: గోపరాజు కృష్ణమూర్తి, అనసూయ దంపతులు.నివాసం: కూకట్ పల్లి, హైదరాబాదు.

వృత్తి రీత్యా M.Tech. Machine design చదివిన నేను, HMT Hyd. లో, దాదాపు ముప్పై ఏళ్ళు పైన పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజరు స్థాయిలో వాలంటరీ పదవీ విరమణ చేసిన ఇంజనీరును.

ఆ తర్వాత పేరున్న విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్ గానూ, మరికొన్ని ఇంజనీరింగు సంస్థల్లో డిజైన్ కన్సల్టెంటు గానూ పనిచేసిన అనుభవం.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.స్వతహాగా సాహిత్యాభిమానిని, కళాభిమానిని. కథలంటే బాగా ఇష్టపడతాను.ఈ మధ్యనే, రిటైర్మెంట్ తర్వాత స్వీయరచనా వ్యాసాంగానికి, స్వీయ పెయింటింగ్సు వేయడానికి సాహసిస్తున్నాను. పలు అంతర్జాల సమూహలకు, సంకలనాలకు కవితలు, చిన్నగా కథలు రాస్తున్నాను, ప్రచురిస్తున్నారు, అభినందిస్తున్నారు! 




110 views2 comments

2件のコメント


Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
2024年11月30日

Sunanda Goparaju

19 minutes ago

Kadha chaala bagundi. Enjoyed it thoroughly 😊

いいね!

mk kumar
mk kumar
2024年11月14日

Bagundi Sir

いいね!
bottom of page