#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #VamanaRaoVimanaYanam, #వామనరావువిమానయానం, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు
'Vamana Rao - Vimana Yanam' - New Telugu Story Written By Veereswara Rao Moola
Published In manatelugukathalu.com On 17/10/2024
'వామన రావు - విమానయానం' తెలుగు కథ
రచన: వీరేశ్వర రావు మూల
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
చిన్నప్పుడు అందరిలా మా వామనరావు కి చదువు అబ్బ లేదు. బండి పదవతరగతి దగ్గరే ఆగి పోయింది.
ఏమవుతాడో అని తల్లితండ్రి బెంగ పెట్టుకున్నారు.
కాని వామనరావు మేనమామ వెంకట్రావు వామనరావు లో స్పార్క్ ని గమినించి "అక్కా! నువ్వు బెంగ పెట్టుకోకు. నేను వీడిని చాకులా తయారు చేస్తాగా" అని చెప్పి తనతో పాటు హైదరాబాద్ తీసుకుపోయాడు.
ఐదేళ్ళ వరకూ వామనరావు గురించి వివరాలు మనకు తెలియలేదు. వామనరావు తల్లి కి మాత్రం పిల్లాడు క్షేమమని సమాచారం వచ్చింది.
ఆరోజు పేపర్లో ప్రకటన వచ్చింది.
ప్రముఖ వాస్తు, జ్యోతిష్య విద్వాన్ వామనరావు గారు మీ పట్టణానికి విచ్చేయుచున్నారు. మీ వాస్తు సమస్యలు పరిష్కారానికి సంప్రదించు వేళలు: ఉదయం పది నుండి ఐదు వరకూ..
ఆ ప్రకటన చూసి వామనరావు తల్లీ, తండ్రీ సంతోషించారు కొడుకు ప్రయోజకత్వాన్ని చూసి.
*******
వామనరావు ఆందోళన గా ఉన్నాడు.
అర్జంటు గా వైజాగ్ వెళ్ళాలి. మంత్రి గారు కొన్న కొత్త ఇంటి వాస్తు చూడాలి. ఏం చెయ్యాలో తెలియక ఫ్రెండు కి ఫోన్ చేసాడు.
"ఇందులో వర్రీ అవడానికి ఏముంది ? విమానం ఎక్కు "
"విమానమా !" అన్నాడు సందేహం గా
"ఆరు నెలల గుడ్డు కూడా విమానం ఎక్కుతోంది. రేపు ఉదయం ఫ్లైట్ కి టిక్కెట్ పంపుతా. హేపి గా వెళ్ళండి. "
**********
వామన రావు విమానం లో కూర్చుని లిప్ స్టిక్, స్కర్ట్ పిల్ల ని పిలిచాడు బెల్ట్ పెట్టమని. నెమ్మది గా విమానం గాలి లోకి లేచింది. వామన రావు లో కవి నిద్ర లేచాడు.
చిన్నప్పటి కవిత నెమరువేసు కున్నాడు. చేపలు పట్టే ఆడ పిల్ల ని చూసి అశువు గా అల్లాడు.
"నీ చేతి లో కొరమీను
నల్లగా మెరిసింది నీ మేను "
వామనరావు కాస్సేపు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచే సరికి పానీ పూరి బండి లాంటి దాన్ని తోసుకు వచ్చి "స్నాక్స్ కావాలా ? " అడిగింది క్రూ మెంబర్.
"కాఫీ ? "
"టు హండ్రెండ్ "
"మా ఊళ్ళో ఇరవై మంది తాగుతారు " అని గ్లాసుడు నీళ్ళు తాగాడు.
కొంచెం సేపయ్యాక కెప్టెన్ ప్రకటన వినబడింది. మా విమానం ఎక్కినందుకు కృతజ్ఞతలు. మీరు హాయిగా గమ్య స్ధానం చేరతారు మా విమాన సర్వీసు తో..
పది నిమిషాల తర్వాత.. విమానం లో కలకలం..
పిస్తోలు పట్టు కున్న వ్యక్తి వచ్చి
"ఈ విమానం ను హైజాక్ చేసాను. ఇది ఇప్పడు పాకిస్థాన్ పోతోంది. గోల చెయ్య కుండా కూర్చోండి. మా డిమాండ్ జలీలూద్దీన్, ను ప్రభుత్వం విడిస్తే మీరు బయట పడతారు " అన్నాడు అబ్దుల్.
"మంత్రి గారిని అర్జంటు గా కలవాలంటే పాకిస్ధాన్ అంటాడేమిటి నా పిండాకూడు " అన్నాడు వామనరావు.
"వాడు చేసింది హైజాక్ తినే క్రాక్ జాక్ కాదు. మిమ్మల్ని తాపి గా వైజాగ్ లో దింపి, RK బీచ్ లో తిప్పి ఆ తరువాత కరాచి తీసుకెడతాడు. గోల చెయ్యకు " అన్నాడు పక్కనున్న ప్రయాణికుడు విసుగ్గా.
ఏం చెయ్యాలి ? ఏం చెయ్యాలి ఆలోచించగా వామనరావు మెదడు లో ఫ్లాష్..
కదిలేది కదిలించేది
పెను నిద్దర వదిలించేదయిన నా అక్షరాయుధం
కవిత్వం ఉండగా ఆ హైజాకర్ కి భయపడటమా ?
చూపిస్తా నా పెన్ పవర్..
అబ్దుల్ వామనరావు దగ్గరికి వచ్చి..
"ఏంటి గోల. " అన్నాడు.
వామనరావు లో కవితావేశం పొంగి పొర్లింది.
"ఇది కాదు గోల
ఆ జగన్నాధుడి లీల
కదిలే మృత్యు హేల
ఎగిసే అగ్ని కీల "
కొద్దిగా వామనరావు కవిత్వ ప్రభావం హైజాకర్ మీద
చూపిస్తోంది.
"నువ్వు అంటున్నది అర్ధం కావడం లేదు "
"అర్ధమయితే నా కవిత్వం తంతా
అస్వాదించరా నా చెంత
వీడరా నీ చింత
అదిగో దూరాన్న పాలపుంత
ఇది పొంతన లేని అతుకుల బొంత "
ఈ త కవిత్వం తో హైజాకర్ వణికిపోతున్నాడు. ఐనా ధైర్యం తెచ్ఛుకుని, "హు" అని పిస్తోలు చూపించి "గోల చెయ్యకండి "
"గురువు గారు మరొకటి వదలండి " అన్నాడొక ప్రయాణికుడు వామనరావుని చూసి.
వామనరావు లో ఉగాది కవిత మెరిసింది.
"ఇది ఉగాది
మామిడి పునాది
సమస్యల సమాధి
కోయిల పాట అనాది
తెస్తుంది క్రోది
అతను వస్తే అంతర్వేది
వచ్చింది త్రివేది
తెచ్చింది ఉగాది పచ్చడి
గచ్చ కాయల పుప్పొడి
వసంతాల పూబోడి
నాకు కాదు సరిజోడి "
---
ఇలా చెలరేగిపోయాడు వామనరావు. దెబ్బకి హైజాకర్ స్పృహ తప్పి పోయాడు. వెంటనే మిగిలిన వాళ్ళు ఎలర్టయి పిస్తోలు లాక్కుని, చేతులు కట్టేసి కెప్టెన్ తో ఎమర్జెన్సీ లాండింగ్ చేయించారు.
భారత ప్రభుత్వం వామనరావు కవితా శక్తి ని పొగిడి,
నగదు బహుమతి తో సత్కరించింది.
వామనరావుని సొంత ఊరిలో కూడా సన్మానించారు.
పాకిస్ధాన్, చైనా వాళ్ళ తో సరిహద్దు సమస్యలు వచ్చినప్పుడల్లా వామనరావు తన వంతు కవితా సేవలు అందిస్తున్నాడు. ఎవరన్నారు కవిత్వానికి సామాజిక ప్రయోజనం లేదనీ?
********
తరువాత వామన రావు పది వేల పేజీలలో కవిత్వాన్ని సృష్టించాడు. 20 పుస్తకాలలో వచ్చింది. పుస్తకాల జోలికి ఎవరూ వెళ్ళక పోవటం వామనరావు కవిత్వమంతా అటక మీదే ఉండి చెద పురుగులకు శాశ్వత ఆహార పధకం గా మారింది. చెద పురుగులు రాలి నప్పుడల్లా, భార్య నుండి తిట్లు తింటున్నాడు.
ఎదో ఒకటి చెయ్యాలని, చిన్న నాటి స్నేహితుడు అధికార భాషా సంఘ అధ్యక్షుడు గా ఉన్నాడని తెలుసుకుని, అతనికీ పులస ఇష్టమని ప్రత్యేకం గా వండించి పులస తో కలిసాడు. అంతే మరుసటీ నెలలోనే వామనరావు రచన "రుధిర సదనం" కి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చింది.
కొంతమంది పాఠకులు ఊరికే అవార్డ్ వస్తుందా? అందులో విషయం ఉండి ఉంటుంది అని ఎగబడి కొన్నారు. ఆ తరువాత ప్రభుత్వం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం నాన్ డిటెయిల్డ్ టెక్స్ట్ గా నిర్ణయించింది. అలా వామనరావు సాహిత్యానికి అటక నుండి విముక్తి లభించింది. ఇంటర్మీడియట్ విద్యార్ధులు రుధిర సదనం రాసిన రఛయిత మీద పగ పట్టారు.
******
ఎన్నికలు వచ్చి వామనరావు ఊరి వాడికే కేంద్ర మంత్రి పదవి దొరికింది. అదీ కూడా బొగ్గు లో. బొగ్గయితేనేం, నా జీవితం లో ముగ్గు గా మారదా అని బొగ్గు మంత్రిని కలిసాడు. తన పుస్తకం గురించి చెప్పాడు. మాటల సందర్భంలో చెప్పాడు బొగ్గు మంత్రి తను కూడా పులస బ్యాచ్ అని. దాంతో వామనరావు పని సులువయింది.
కేంద్ర సాహిత్య అకాడమీ లో అన్ని భాషల వాళ్ళు ఉన్నారు. గోవర్కర్ లు, సావార్కర్ లు, సాహు లు ఉన్నారు. తెలుగు లో పరమేశ్వర శాస్త్రి ఉన్నాడు. ఆయన కీ అర సున్న కనబడక పోతే పిచ్చెక్కి పోతుందీ. "అన్యంబొకండు", దవ్వు లాంటి పదాలు కనబడక పోతే తెలుగు భాష కి అన్యాయం జరిగినట్టు బాధపడతాడు. పరమేశ్వర శాస్త్రి అర సున్నలు కనబడలేదని వామనరావు పుస్తకాన్ని ఎంపిక చెయ్యలేదు.
బొగ్గు మంత్రి ఒత్తిడి తో చెయ్యక తప్ప లేదు. ఆ సంవత్సరం వామన రావు పుస్తకానికీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. కొంత మందీ పాఠకులు ఊరికే అవార్డ్ ఇస్తారా అని భ్రమ పడి కొనేసారు.
ప్రభుత్వం గ్రూపు 2 పరీక్షలకీ పాఠ్య గ్రంథం గా నిర్ణయించింది. తిట్టుకుంటూ చదివారు పోటీ పరీక్షల కీ వెళ్ళే వాళ్ళు.
కవి గాంచని చోట "పైరవి" గాంచున్ అని అర్ధమయ్యింది వామనరావు కి!
సమాప్తం
వీరేశ్వర రావు మూల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
కవి, రచయిత. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా పనిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో కథలు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వందకు పైగా కవితలు వివిధ వెబ్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది.
Comments