top of page
Writer's pictureNallabati Raghavendra Rao

వామ్మో.. వాళ్ళాయనకు బుద్ధొచ్చింది!

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)


'Vammo Vallayanaku Budhdhocchindi' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 18/04/2024 

'వామ్మో.. వాళ్ళాయనకు బుద్ధొచ్చింది!' తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



''ఐదు వందలు సార్లు రాయి. అలా రాస్తే నీ నోటి నాలికతో అనలేనిది.. బుర్రకు బాగా ఎక్కి అప్పుడు నాలికతో అనగలవు. '' 


''అమ్మో 500 సార్లు నేను రాయలేను మావయ్య, వందసార్లు రాస్తానే. '' ముఖం ముడుచుకుపోతు న్నట్టుగా పెట్టి అంది మందారం. 


'' కుదరదంటే కుదరదు. ఇదిగో నేను మధ్యాహ్నం ఆఫీస్ నుండి వచ్చేసరికి ఈ వైట్ పేపర్ మీద పూర్తిగా.. ‘ఏమండీ’ అన్న మూడు అక్షరాల పదం వరుసగా రాసి ఉంచు. నేను చూసి ఓకే అన్నాక అప్పుడు భోజనం చేయాలి అర్థమైందా'' అంటూ విసురుగా బయలుదేరిపోయాడు తన సూటుకేసు తో కృష్ణమూర్తి ఆఫీసుకి. 


మందారానికి కృష్ణమూర్తితో పెళ్లయి ఆరు నెలలే అయింది. సొంత మామయ్యనే పెళ్లాడిన ఆమెకు నాలుగు నెలల ఆనందం తర్వాత రెండు నెలల నుండి కొత్త రకం పరీక్ష మొదలైంది. చిన్నప్పటి నుండి మామయ్యతో కలిసి తిరిగిన ఆ మనసు ఇప్పుడు తన భర్త స్థానంలోకి వచ్చిన మావయ్యను నోరారా ''ఏమండీ'' అన్న మూడు అక్షరాలతో పిలవ లేకపోతుంది. రెండు నెలల నుండి భర్త ఎన్ని రకాలు గా చెప్పినా, బెదిరించినా ఆమె నోటినాలిక ఆ అక్ష రాలను అనలేకపోతుంది. 


కృష్ణమూర్తి మధ్యాహ్నం ఆఫీసు నుండి వచ్చాడు. తన భార్య అందించిన వైట్ పేపర్ అందుకొని చూడడం మొదలెట్టాడు. 


''మామయ్యా.. పేపర్ మీద నువ్వు చెప్పినట్టు రాశాను. నాకు బాగా ఆకలేస్తుంది, భోజనం చేయొచ్చా?'' అంటూ ప్రశ్నించింది మందారం. 


''అగు, లెక్కపెడుతున్నాగా.. ఇదిగో మొత్తం మీద 10 తక్కువ రాశావు. 490 సార్లు ఏమండీ అని రాశావు. మిగిలిన పదిసార్లు ఎవడు రాస్తాడు? అందుకని నీకు శిక్ష ఏమిటంటే మళ్లీ 500 సార్లు రాసి మా అమ్మానాన్నకు చూపించి అప్పుడు భోజనం చేయి. నేను భోజనం చేసి వెళ్ళిపోతాను. సాయంత్రం నేను వచ్చేసరికి ఆమ్లెట్ వేసి రెడీగా ఉంచు. '' అంటూ కృష్ణమూర్తి కిచెన్ లోకి వెళ్లి భోజనం చేసి వెంటనే ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. 


మందారం భర్త చెప్పినట్టుగా చేసి తన అత్తమామ లకు చూపించి నీరసపడి వెళ్లి భోజనం చేసింది మధ్యాహ్నం మూడు గంటల సమయానికి. 


సాయంత్రం భర్త కృష్ణమూర్తి రానే వచ్చాడు. 

'' ఇదిగో ఈ గడుల పుస్తకాలు అన్ని నీకోసమే కొని తెచ్చాను. రోజు రెండుమూడు వేల సార్లు అదే పని గా దృష్టి పెట్టుకొని రాస్తూ ఉంటే అలవాటై పోతుం దిలే. ఇది కంప్యూటర్ కోర్స్ కాదు కదా. చిన్నప్పుడు ఏదైనా రాకపోతే బడిలో మా మాస్టారు ఇలాగే రాయించేవారు. దెబ్బకు అలవాటైపోయేది. లేదంటే చింతజూకతో నాలుగు తగిలించేవారు. పోనీ అలా నిన్ను తగిలిందామంటే, చితకకొట్టి దారిలో పెడదా మంటే అక్క కూతురు అయిపోయావు. వెళ్లి జాగ్ర త్తగా ఇంట్లో పనులన్నీ అయ్యాక నేను చెప్పిన పని చెయ్. '' అంటూ ఆర్డర్ వేసి తను స్నానానికి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి. 


రాత్రి భోజనాలు అయ్యాక తన బెడ్రూమ్ లో డబల్ కాట్ మంచం మీద పడుకున్నాడు కృష్ణమూర్తి. అంతకు ముందే స్నానం చేసి భర్తకు ఇష్టమైన చీర కట్టుకొని తలనిండా పువ్వులు పెట్టుకొని టాయిలెట్ అయ్యి భర్త దగ్గరకు వచ్చింది మందారం. 


'' మామయ్యా.. మనిద్దరం వచ్చే ఆదివారం సినిమాకు వెళ్దామా?''


'' చూద్దాం ఇదిగో.. ముందు నువ్వు ‘ఏమండీ’ అని నన్ను నీ నోటి నాలుకతో పిలవడం పూర్తిగా అల వాటు కావాలి. మన ఇంటికి ఎవరైనా కొత్తవాళ్లు వస్తే వాళ్లను ఏవండీ అని చక్కగా పిలుస్తావు. నీ మొబైల్ కు ఎవరైనా కొత్త వాళ్లు ఫోన్ చేస్తే.. చాలా బాగా ఏవండి ఏవండీ అని పది సార్లు అంటావు. మార్కె ట్కు వెళ్ళినప్పుడు కూడా షాపు వాళ్లను ఏవండి అని గౌరవంగా, అందంగా పిలుస్తావు. మరి నన్ను కూడా అలా పిలవడానికి నీ నాలుక ఎందుకు వంగడం లేదే. సరే నాకు పని ఉంది నా పని నేను చూసుకుని పడుకుంటాను. నువ్వు నేను ఇచ్చిన గడులు పుస్తకాలలో మూడు వేలు సార్లు 'ఏవండీ' అన్న పదం రాసి అప్పుడు నన్ను లేపకుండా ఆ క్రింద చాప మీద పడుకో అర్ధరాత్రి ఒంటిగంట అయినా పర్వా లేదు. '' అంటూ హుకుం జారి చేసినట్టు చెప్పాడు కృష్ణమూర్తి. 


"అమ్మబాబోయ్ మూడువేల సార్లే. మామయ్య ఈ రాత్రికి వెయ్యిసార్లు రాసి మిగిలింది రేపు రాస్తానే. "

అందామనుకుంది మందారం.. కానీ భర్త ఒప్పుకోడని తెలిసి భర్త చెప్పిన పనిలో నిమగ్నమైంది. 


తెల్లవారింది.. ''లే మామయ్య తెల్లవారింది నీకు వేడి నీళ్లు పెట్టాను. నువ్వు ముఖం కడుక్కుని స్నానం చేయి. ఇదిగో నేను మూడువేల సార్లు రాసేశాను. '' 

భర్తను తట్టి లేపుతూ అంది మందారం. 


కృష్ణమూర్తి చిరాగ్గా లేచి మంచంమీద కూర్చుని.. 

''అలా పిలవకే బాబు. నా ఫ్రెండ్స్ పదిమందిలోకూడా ఇలాగే పిలిచేవనుకో నా పరువు పోతుంది నా చరిష్మా దెబ్బతింటుంది. నీ నాలికకు అలవాటు చేయలేక నా ప్రాణం పోతుంది.. ' ఏవండీ తెల్ల వారింది లేవండి. మీరు ముఖం కడుక్కుని స్నానం చేయండి. ' అంటూ గౌరవంగా ఏవండీ ఏవండీ అంటూ మాట్లాడుతూ లేపాలి.. ఛీ వెధవ పెళ్లి చేసు కున్నాను. '' చిరాకు పడుతూ బాత్రూంలోకి వెళ్లి పోయాడు కృష్ణమూర్తి. 


టిఫిన్ చేస్తూ కృష్ణమూర్తి తన తల్లితండ్రితో.. 

'' అమ్మానాన్న.. మీరిద్దరూ నా పెళ్లికి ముందు ఏమ న్నారో తెలుసా.. దగ్గర సంబంధం గౌరవంగా ఉండదు నేను పెళ్లి చేసుకోను అంటే ఏమన్నారు గుర్తు చేసు కోండి. సాంప్రదాయం అంటూ సెంటిమెంటుతో కొట్టి దీన్ని కట్టబెట్టారు. నయానా భయానా దారిలో పెట్టు కుని గౌరవం నేర్పుదాం రా అన్నారు. రెండు నెలల నుండి ఏ రూట్ లో ప్రయత్నం చేస్తున్నా నేను కానీ మీరు కానీ ఒక్కసారి దీనిచేత ఏమండీ అన్న మాట నాలికతో అనిపించగలిగామా. 


నాలికతో ఉప్పు చూసి సరిపోయిందో లేదో చెప్తుంది, కారం చూసి అమ్మబాబోయ్ ఎక్కువైపోయింది అంటూ అరు స్తుంది. అన్ని పనులు చేస్తున్న నాలిక నన్ను.. ఏమండీ అని ఎందుకు అనలేకపోతుందే. నాకు ఇదే దో నాటకంలా అనిపిస్తుంది. ఎందుకన్నా మంచిది ఒకసారి ఈ ఎన్ టి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి నాలిక ఏమైనా మడత పడిందేమో పరీక్షించమంటాను. మూడువేల సార్లు కాదు 30 వేల సార్లు రాయడాని కైనా సిద్ధంగా ఉంది కానీ ఒక్కసారి నాలికతో.. ఏవండీ అని పలకలేకపోతుంది. అవసరమైతే ఆపరేషన్ చేయిస్తాను నాలికకు. మీరెవరూ మాట్లాడ కండి. ఇదిగో మధ్యాహ్నం నేను ఇంటికి రాను. హోటల్ నుండి మీకు ముగ్గురికి క్యారేజీలు పంపిం చేస్తాను. దానిని మాత్రం ఆ గడుల పుస్తకాల దగ్గర నుండి పైకి లేపొద్దు'' అంటూ చాలా కోపంగా తన సూట్ కేస్ తో బయటకు వెళ్లిపోయాడు కృష్ణమూర్తి. 


. ****


ఆ సాయంత్రం కృష్ణమూర్తి తన కొలీగ్ పరమేశ్వరం తో కలిసి వచ్చాడు. 


వచ్చిన పరమేశ్వరం కృష్ణమూర్తి ఇల్లంతా తిరిగి పరిశీలించాడు.. 


'' ఎలా చూసినా మనందరి ఇళ్లల్లో ఎవరి ఇళ్ళు ఫంక్షను ఏర్పాటుకు పనికిరావు. ఇప్పుడు నీ ఇల్లు చూశాను కదా. ఇక్కడైతే ఫంక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. రేపు మన వాసుదేవరావుకి సెండ్ ఆఫ్ పార్టీ. మనవాళ్లు 50 మందికి భోజనాలు ఏర్పాటు మీ ఇంటి దగ్గర అయితేనే బాగుంటుంది. 


ఇదిగో ఈ పెద్ద హాలులో మనందరం కూర్చుని సర దాగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడే గ్రూప్ ఫోటో కూడా తీసుకోవచ్చు. అందరూ ఫ్యామిలీలతో వస్తానని మాటిచ్చారు. కొంచెం వివరంగా అన్ని విషయాలు మీ ఆవిడతో చెప్పి పగడ్బందీగా ఏర్పాట్లు అన్నీ చూడు ఇక నేను వెళ్తా. '' అంటూ ఆ వచ్చిన పరమే శ్వరం వెళ్ళిపోయాడు. 


ఆ మర్నాడు పార్టీ ఏర్పాట్లు ఘనంగానే జరుగు తున్నాయి. మొత్తం ఇరవై ఫ్యామిలీలు. సరదా కబుర్లు అయ్యాక భోజనాలు దగ్గర కూర్చున్నారు. 


కృష్ణమూర్తి చాలా జాగ్రత్త పడ్డాడు భార్యను పది మందిలోకి రానివ్వకుండా.. అయినా ఆవిడ ఏదో పనిమీద వచ్చి భర్తతో.. '' ఇదిగో అదిగో.. నువ్వు నువ్వు. '' అంటూ మాట్లాడేసింది. దానితో వచ్చిన వాళ్ళందరూ ఆమె వైపు చూసి ముకుమ్మడిగా పెద్ద గా నవ్వేశారు. కృష్ణమూర్తి భరించరాని అవమానం పొంది చిన్నబుచ్చుకున్నాడు. 


అందరూ వెళ్ళిపోయాక మందారాన్ని పిలిచి చీవా ట్లు పెట్టాడు. ఇలాగైతే పరిస్థితి విడాకుల వరకు వచ్చేస్తుందని హెచ్చరించాడు. '' పదిమందిలోనైనా కనీసం.. ఏవండీ.. అని ఒక్కసారి అంటే కనీసం.. నటిస్తే నీ బంగారపు నాలిక అందరికీ కనిపిస్తుందా.. నీ నాలికకు ఏదైనా పైత్యరోగమా? రేపటినుండి నీకు చేతిదెబ్బలతోనే పాఠం చెబుతాను. చేతి దెబ్బలు నువ్వు లెక్క చేయలేదు అనుకో కొరడా దెబ్బలు.. దానికి కూడా లొంగకపోతే కర్ర దెబ్బలరుచి చూపి స్తాను. భర్త అన్న గౌరవం, విలువ బొత్తిగా లేకుండా పోయింది. '' అంటూ విసురుగా బయటకెళ్ళి పోయా డు కృష్ణమూర్తి మందారం వాడిపోయి నట్లయి పో యింది. 


ఆమర్నాడు.. తెల్లవారగా కుడి చూపుడువేలు రక్తం కారుతుండగా బెడ్రూమ్ నుండి బయటకు వచ్చింది మందారం. '' ఏమ్మా మందారం.. ఏమైంది వేలుకి?'' ఆత్రుతగా అడిగింది అమ్మమ్మ. 


'' ఏం లేదమ్మమ్మ.. మంచం కోడి కింద వేలు పడింది. ''


'' కడిగేసి కొంచెం పౌడర్ వేసి కట్టు కట్టుకోవే. మధ్యా హ్నం ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు వాడిని రెండు బిళ్ళలు తెమ్మని చెబుతాలే. '' అమ్మమ్మ కొంచెం బాధపడుతూ అంది. 


గంట పోయాక బాత్రూంలో ఎడమ చేతితో వీపు రుద్దుతుంది భర్తకు మందారం.. 


''రాత్రి అంతా నీ కుడి చూపుడు వేలుతో గచ్చుమీద వెయ్యిసార్లు.. ఏమండీ.. అని రాయించానని కోపమా. మా అమ్మకు అనుమానం రాకుండా బాగానే చెప్పావు. అసలు నేనంటే నీకు కోపం ఎందుకు కోపం రావడం లేదే. ''అడిగాడు కృష్ణమూర్తి. 


'' నువ్వంటే నాకిష్టం మామయ్య.. అందుకనే కదా పెళ్లి చేసుకున్నాను. ''


'' అబ్బా, మళ్లీ నువ్వు నువ్వు.''.. మందారాన్ని బయటకు గెంటి బకెట్టుడు నీళ్లు నెత్తిమీద ఒక్కసారే

గుమ్మరించుకున్నాడు కృష్ణమూర్తి. 


**


వారం తర్వాత కృష్ణమూర్తి ఇంటికి మళ్లీ పరమే శ్వరం వచ్చాడు అప్పుడు కృష్ణమూర్తి పక్కగానే మందారం కూడా ఉంది. 


'' చెప్పాలంటే.. ఎలాగూ మీ జంట పోటీకి పనికి రారు. కానీ మీ వాళ్ళు ఎవరికైనా చెప్పు. ఎప్పుడూ లేనిది మన ఊర్లో వచ్చే పదిహేనవ తారీఖున ''వండర్ఫుల్ కపుల్''' పోటీలు పెడుతున్నారట. ఇప్పుడే నాకు సెల్ మెసేజ్ వచ్చింది. స్టేజ్ మీద ఏ జంట ఎంత ముచ్చటగా మాట్లాడుకుంటుందో దానిని బట్టి ఆ జంటకు లక్ష రూపాయలు క్యాష్ అట. '' అంటూ అసలు విషయం చెప్పి గబగబా వెళ్ళిపోయాడు. 


కృష్ణమూర్తి విషయం అంతా విని వెళ్లి తల్లి దగ్గర కూర్చున్నాడు. '' అమ్మా, దీనివల్ల లక్ష రూపాయలు లాసే. 15వ తారీఖు మన ఊర్లో వండర్ఫుల్ కపుల్ పోటీ అట. లక్ష రూపాయలు ప్రైస్. దీని నోటి నాలిక ఏవండి అన్న మాట అనలేకపోతుంది మరి మనకు ఎలా వస్తుందే ఆ లక్ష. '' అంటూ ఏడుపు ముఖం పెట్టాడు. 


'' ఏడవకురా పిచ్చి వెధవ ప్రయత్నించు టైముందిగా. బంగారు గాజులు చేయిస్తానని ఆశ పెట్టు, దానికి ఇష్టమైన బిందెడు బూరెలు వండించి పెడతానని అబద్ధం ఆడు, షికారుకు కొడైకెనాల్ తీసుకెళ్తానని మభ్యపెట్టు.. చేతకాని వాజమ్మకు దొరికావు. '' అంటూ తల్లి చిరాకుపడింది. 


''వాడు వాజమ్మ కాదే పెద్దదద్దమ్మ. పెళ్లయ్యి ఆరు నెలలు అయింది. పెళ్ళాం చేత.. ఏవండీ.. అన్న పదం దాని నాలికతో పలికించలేకపోతున్నాడు. ఇలాంటి వాడు పిల్లల్ని పుట్టించి మన చేతిలో పెడ తాడన్న ఆశ కూడా నాకు లేదు. '' అంటూ చుట్టనోట్లో పెట్టుకుంటూ చేతి కర్రతో నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి తండ్రి. 


ఒక నిర్ణయానికి వచ్చిన కృష్ణమూర్తి వారం రోజులు తన భార్యను బ్రతిమలాడాడు. లాలించాడు.. పాలిం చాడు.. ముద్దుమురిపాలు చేశాడు. పెరుగు మీద మీగడ మూతికి రాశాడు. పది మూరల మల్లె పూల దండ తెచ్చి తలలో కాకుండా ఒళ్ళంతా చుట్టేశాడు. 


''నువ్వు భయపడకు మావయ్య ఆ పోటీ గురించి నాకు బాగా అర్థమైంది కదా ఇక నేను చూసుకుం టాను. ఇంటిదగ్గర ఎలా మాట్లాడినా స్టేజ్ మీద ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి నీ పరువు నిలబెట్టి లక్ష రూపాయలు నీ చేతిలో పెడతాను. ''.. అంటూ మందారం భర్తకు భరోసా ఇవ్వడంతో కృష్ణమూర్తి నూట ఒక్కసారి ఆ ఊరి గుడిలో పొర్లదండాలు పెడతానని మొక్కేసుకున్నాడు. 


****


ఆరోజు రానే వచ్చింది.. వండర్ఫుల్ కపుల్ వేదిక మనోహరంగా తయారైంది. జంటలన్నీ నీటుగా నిగారింపుగా వచ్చి కూర్చున్నారు. కృష్ణమూర్తిజంట, పరమేశ్వరం జంట ముందు వరుసలో కూర్చున్నా రు. జడ్జిలు దూరంగా ప్రేక్షకులలో కలసిపోయి కూ ర్చుని జంటలను నిశితంగా పరిశీలించడం మొద లుపెట్టారు. 


ప్రధాన నిర్వహకుడు మైకు చేతపుచ్చుకొని మాట్లా డడం మొదలుపెట్టాడు.. ''మై డియర్ కపుల్స్.. మీకు అందరికీ ఆహ్వానం. ఈ పోటీ ప్రధాన ఉద్దేశం యువ జంటలను ఎంకరేజ్ చేయడమే. ఇది రమాకాంత్ ఫైనాన్స్ కంపెనీ వారు నిర్వహిస్తున్న పోటీ అని మీకు అందరికీ తెలుసు. పోటీలో పాల్గొనే యువ జంటలు ఒక్క విషయం ఆలోచించాలని సవినయంగా కోరు తున్నాను. అదేమిటంటే మనిషికి దేవుడు నోరు ఇచ్చాడు. కానీ మాట్లాడాలంటే నోరుతో మాట్లాడ లేము నాలిక అనే ప్రధాన అవయవము లేకపోతే మన నోటి నుంచి మాటలు రావు. మన నోటిలో నాలికనుండి వచ్చే అక్షరాలే మనల్ని సమాజంలో ఉన్నత స్థానంలో కూర్చోబెట్టవచ్చు లేదా పాతాళం లోనైనా తొక్కేయవచ్చు. 


నాలిక సృష్టించే మాటలకు అంత విలువ ఉన్నది. అందుకనే నాలిక దగ్గర పెట్టు కుని మాట్లాడు అన్న నానుడి కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇప్పుడు కూడా అదే పని చేయాలి నాలిక దగ్గర పెట్టుకుని మాట్లాడడం ద్వారా లక్ష రూపా యలు గిఫ్ట్ పట్టుకుని పోవచ్చు. ఈ పోటీకి ప్రత్యేక నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు. ఇక్కడ ఉన్న ముగ్గురు జడ్జిల మనసులను ఆనందింప చేసేలా మాట్లాడిన వారికి ఈ బహుమతి. '' అంటూ ముగించాడు. 


వెంటనే మిగిలిన నిర్వాహకులు ఒక్కో జంటని ఆహ్వానిస్తున్నారు స్టేజి మీదకు. అలా వచ్చిన వాళ్ళు వాళ్లకు కేటాయించిన ఐదు నిమిషాల టైం లో ఇష్టం వచ్చిన డైలాగులు మాట్లాడుకుని ప్రేక్షకులు, నిర్వ హకులు చప్పట్లు కొట్టగా కిందకు దిగి వాళ్ళ స్థానా ల్లో కూర్చుంటున్నారు. ముగ్గురు జడ్జిలు మార్కులు వేస్తుండడంతో అందరిలో టెన్షన్ పెరిగిపోయింది. 


'అన్ని జంటలు కన్నా మనజంట వంద రెట్లు బాగా ప్రజెంటేషన్ ఉండాలి. ' అంటూ కృష్ణమూర్తి తన పక్కనే కూర్చున్న మందారాన్ని ఉత్సాహపరిచాడు. ముఖ్యంగా ప్రతి వాక్యానికి చివరన ఏమండీ అన్న పదం ఉపయోగించడం మరువ వద్దని చుట్టూ ఎవరూ చూడకుండా మందారం నడుం మీద గిల్లి మరీ చెప్పాడు. 


తర్వాత పరమేశ్వరం పార్వతి జంట అవకాశం రావడంతో ఆ జంట స్టేజి మీదకు వెళ్లారు. 


కృష్ణమూర్తిజంట వాళ్ళిద్దరూ ఎలా పెర్ఫార్మన్స్ ఇస్తారో చూద్దాం అంటూ ఆత్రుతగా చూస్తూ కూర్చున్నారు. 


''పారూ.. నీ చీర చాలా అందంగా ఉంది''


'' ఏవండీ మీకు ఈ చీర అంటే చాలా ఇష్టం కదండీ. మిమ్మల్ని ఆనంద పరచడమే నాకిష్టమండి.. '


నిర్వాహకులు, ప్రేక్షకులు ఇంతవరకు వచ్చిన అన్ని జంటలకన్నా ఈజంట సూపర్ అన్న భావంతో కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఆత్రుతగా వింటున్నట్టు ఉంది అక్కడ వాతావరణం. 


'' నేను ఓ పది రోజులు ఆఫీసు పనిమీద బెంగు ళూరు వెళ్ళాలోయ్. ''


'' ఏవండీ ఏవండీ మీరు వెళ్తే నేను ఉండలేనండి. మీ కూడా నేను వస్తానండి. ''


'' చూద్దాం ప్రయత్నిస్తాను. ''


'' అలా అనకండి. మీరు లేకుండా నేను ఉండలే నండి. నాకు ఈ బంగారాలు, చీరలు వద్దండి మీరే కావాలండీ.. ''.. అంతే అలా పరమేశ్వరం భార్య పార్వతి అనడంతో ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. 


వాళ్లకు ఇచ్చిన టైం అయిపోయిన బెల్ వినబడడం తో ఆ జంట క్రిందకు దిగిపోయారు. ప్రైజ్ వాళ్ళకే కచ్చితంగా వస్తుంది అన్న అభిప్రాయంతో క్రిందకు దిగిన ఆ జంటకు కంగ్రాట్స్ చెప్పేశారు అందరూ. 


వెంటనే కృష్ణమూర్తి మందారం స్టేజ్ ఎక్కారు. స్టేజ్ ఎక్కుతూనే మందారం వైపు చూస్తూ కృష్ణమూర్తి వాళ్ళిద్దరికన్నా బ్రహ్మాండంగా మాట్లాడాలి నువ్వు.. 

అన్నట్టు సైగ చేశాడు. 


కృష్ణమూర్తి మందారంల షో మొదలైంది. 


''మందారం మనం ఎప్పుడు వెళ్దాం సినిమాకు. ''


'' నీ ఇష్టం నువ్వు చెప్పినప్పుడే. ''


''అదేమిటి నువ్వు నువ్వు అంటున్నావు. ఇంటిదగ్గర ప్రతి నిమిషం.. ఏమండీ ఏమండీ.. అంటూ పిలిచే దానివి కదా''


''అబద్ధాలు ఎందుకు ఆడతావ్ మామయ్య.. నిన్ను ఎప్పుడైనా నేను ఏమండీ అని పిలిచానా ? నిన్ను నువ్వు అని పిలవడమే నాకు ఇష్టం. నిన్ను మొగుడుగా భావించి భయపడుతూ.. ఏవండీ అని పిలవడం నాకు ఇష్టం లేదు బాబు. '' అంటూ గట్టిగా నవ్వేసింది మందారం.. కిలకిల మందారపువ్వులా. 


అంతే జనంలో కలకలం మొదలైంది. అందరికన్నా తక్కువ మార్కులు ఈ జంటకే వస్తాయి.. అన్నట్టు ఏ ఒక్కరూ చప్పట్లు కొట్టలేదు. 


''చి చి అంతా పాడు చేస్తున్నావ్ లక్ష రూపాయలు తగలడిపోయింది. '' సైగ చేస్తున్నట్టు నెమ్మదిగా అన్నాడు కృష్ణమూర్తి. 


''వద్దు మామయ్య నీకు మాట ఇచ్చాను కానీ అలా నటించలేకపోతున్నాను. నిన్ను నా మావయ్యగా నిన్ను నిన్ను.. అనడమే నాకు ఇష్టం. ఈ లక్ష రూపా యలు మనకు వద్దు ఇంటికి వెళ్లిపోదాం వచ్చేయ్. '' అంటూ ప్రేమగా భర్త చెయ్యి పట్టుకుని కిందకు దిగుతూ భర్తను కూడా లాగేసింది మందారం. 


కృష్ణమూర్తి సిగ్గు పడిపోయాడు. మందారంతో పాటు చెక్క మెట్లు దిగి స్టేజ్ వెనక్కు మందారాన్ని లాక్కుని వెళ్ళాడు. 


జనం ఈలలు.. గోల.. అరుపులు.. మరింత కుంచిం చుకుపోయాడు కృష్ణమూర్తి. భార్య దవడపై గట్టి గా కొట్టి కార్యక్రమం ఇంకా జరుగుతున్నా కూడా ఒక్క నిమిషం అక్కడ ఉండ బుద్ధి కాక.. మందారం తో సహా ఆటో ఎక్కి ఇంటికి వచ్చేసాడు కృష్ణమూర్తి. 


***


భార్య చేష్టలతో తలపోటు వచ్చిన కృష్ణమూర్తి కొంతసేపు పడుకుని తలపోటు అధికం కావడంతో బయటకు వెళ్లి టీ తాగాలి అన్న ఉద్దేశంతో వీధి మలుపు వరకు వచ్చాడు నడుచుకుంటూ.. అదే రోజు సాయంత్రం. 


"కృష్ణమూర్తి.. పోటీ ఇప్పుడే పూర్తయింది. మేమి ద్దరం మీ ఇంటికే వస్తున్నాo.. " కృష్ణమూర్తికి ఎదురు పడుతూ అన్నారు పరమేశ్వరం జంట. కృష్ణమూర్తి సిగ్గుగా ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు. 


" కృష్ణమూర్తి మీ జంటకే ప్రకటించారు ఫస్ట్ ప్రైజు లక్ష రూపాయలు. నీ భార్య అద్భుతంగా అమోఘంగా మాట్లాడినట్టు జడ్జిలు తెగ ఆనందించారు. కానీ ఆ అదృష్టం నీవల్లే చేజారిపోయింది. అవును ఆ నిర్వ హకుల రూల్స్ ప్రకారం కార్యక్రమం లాస్ట్ వరకు ఉండని వారికి ప్రైజ్ ఇవ్వరట. తర్వాతి అవకాశం మా జంటకు.. ఆ లక్ష రూపాయలు మాకు ఇచ్చేశారు ఇదిగో చెక్కు. ".. ఆనందంగా చూపించాడు పరమేశ్వరం. 


కృష్ణమూర్తికి పిచ్చెక్కినట్లు అయిపోయింది. తన తల వెనక్కు తిరిగినట్లు అనిపించింది. వాళ్లు చెప్పింది విన్నాక ఒక్క క్షణం అక్కడ ఉండలేకపో యాడు. పరుగు పరుగున ఇంటికొచ్చి భార్య ఉన్న గదిలోకి అడుగు పెట్టాడు. 


మందారం తన గదిలో తెల్లని సిమెంట్ గచ్చు మీద కూర్చుని ఎర్రని సిరాతో.. ఏమండీ ఏమండీ.. అన్న పదాలు రాస్తున్నట్టుగా అనిపించింది. ఏమండీ.. ఏమండీ అన్న ఆ పదాలు నిగనిగలాడుతూ తనను స్వాగతిస్తున్నట్టనిపించింది కృష్ణమూర్తికి. అయితే అది ఎర్ర సిరా మాత్రం కాదు మందారం చేతి వేలి లోంచి కారుతున్న ఎర్రని రక్తం.. అని కృష్ణమూర్తి గ్రహించ గలిగాడు. ఆమె చేతి వేలులోంచే కాదు.. ఆమె రెండు కళ్ళలోంచి ఎర్రనిజీరలు కారుతున్నట్లు కనిపించింది కృష్ణమూర్తికి. 


భర్త రాగానే భయపడి నిలబడింది మందారం. తనే దగ్గరకు వెళ్లి గుండెలకు ఆనించుకొని భార్య తల నిమిరాడు ఆప్యాయంగా కృష్ణమూర్తి. 


"సారీ.. మందారం ఇక ముందు నువ్వు నన్ను.. ఏమండీ.. అని పిలవద్దు. మునుపటిలాగే నువ్వు నువ్వు అనే పిలు. ఆ పిలుపులోనే నాకు ఆప్యాయ త, అనురాగం, అభిమానం వినిపిస్తున్నాయి. " ఆగకుండా పడుతున్న వర్షంలా ఏడుస్తూ ఆమె ఎర్రని అరచేయి పట్టుకొని చెలించిపోతూ అన్నాడు కృష్ణ మూర్తి. 


కృష్ణమూర్తి లో మార్పు వచ్చేసరికి మందారంలోనూ మార్పు వచ్చేసింది. 


" ఏవండీ ఏవండీ నా వల్ల కాదండి. మీ కోర్కె తీర్చ లేనండి. ఇక నా ఊపిరి ఉన్నంతవరకు మిమ్మల్ని

' ఏవండి ఏవండీ.. మీరు మీరు ' అనే పిలుస్తాను. నా నాలిక బాగా అలవాటు చేసేసుకుంది. ''.. ఖచ్చి తంగా చెప్పేసి భర్త పాదాలు పై నిసత్తువుగా పడి పోయిన మందారం నోట్లోంచి, నాలిక మడతలోంచి ‘వండీ ఏవండీ.. ఏవండీ..’ అన్న పదం ధారావాహికంగా ఇంకా అలా వస్తూనే ఉంది. 


******

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు




80 views0 comments

Commenti


bottom of page