'Vamsa Gouravam' - New Telugu Story Written By D V D Prasad
Published In manatelugukathalu.com On 21/08/2024
'వంశ గౌరవం' తెలుగు కథ
రచన: డి వి డి ప్రసాద్
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
"పురుషోత్తంగారూ, మీ ఇద్దరబ్బాయిల జాతకాలు క్షుణ్ణంగా పరిశీలించాను. మీ పెద్దవాడికన్నా చిన్నవాడు మీకు, మీ వంశానికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెస్తాడు. అందరి గౌరవం, మన్ననలు పొందుతాడు. అలాంటి కొడుకును కన్నందుకు మీరు గర్విస్తారు. " అని చెప్పాడు మార్కండేయ శర్మ.
అతని మాటలకు విస్మయం చెందాడు పురుషోత్తం. అతని పెద్ద కొడుకు వెంకట్ బుద్ధిమంతుడు. చదువులో చాలా చురుకుగా ఉంటాడు. క్లాసులో అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకొని స్కూల్ టీచర్ల ప్రశంసలు అందుకున్నాడు. ఇకపోతే, రెండవవాడు రాఘవ చదువులో బాగా వెనకబడి ఉండటమేకాక, అనవసరమైన గొడవల్లో తలదూర్చి పురుషోత్తం పీకల మీదకి తెస్తూ ఉంటాడు. వెంకట్ విషయంలో ఎలాంటి బెంగాలేని పురుషోత్తం కి రాఘవ మాత్రం పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు. అందుకే తన స్నేహితుడి సలహా మేరకు మార్కండేయ శర్మకి తన పిల్లల జాతకాలు చూపించాడు రాఘవ విషయంలో అతను ఏవైనా పరిహారాలు సూచిస్తారేమోనని. అందుకే శర్మగారి మాటలు పురుషోత్తంకి అంతులేని ఆశ్చర్యాన్ని కలిగించాయి.
"నిజానికి మా పెద్ద అబ్బాయి వెంకట్ చదువులో ముందంజలో ఉన్నాడు. నా బెంగంతా చిన్నవాడైన రాఘవ గురించే! చదువులో శ్రద్ధ లేదు సరికదా, అన్ని తగువుల్లో తలదూరుస్తాడు. వాడెలా బాగుపడతాడో మీరేమైనా సలహా ఇవ్వగలరేమోనని ఆశతో వచ్చాను. " మార్కండేయ శర్మవైపు ఆశతో చూస్తూ అర్ధించాడు పురుషోత్తం.
అతని మాటలకి ఒక్కక్షణం ఆలోచించి మళ్ళీ ఇద్దరి జాతకాలు పునఃపరిశీలన గావించాడు మార్కండేయ శర్మ. అయిదు నిమిషాలపాటు ఏకగ్రతగా మళ్ళీ ఆ జాతకాలు పరిశీలించిన మార్కండేయ శర్మ పెదవులపై చిరునవ్వు విరిసింది. ఏం చెప్తాడోనని అలా అతని ముఖంవైపే చూస్తూ ఉండిపోయాడు పురుషోత్తం.
"మీ పెద్ద అబ్బాయి వెంకట్ ప్రయోజకుడవుతాడు, అందులో ఎలాంటి సందేహమూ లేదు! అయితే, మీకు మీ రెండవ కుమారుడైన రాఘవవల్ల ఎనలేని కీర్తి రానున్నది. సంఘంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ వంశ ప్రతిష్ఠ నిలబెడతాడు. అతని జాతకం అద్భుతంగా ఉంది. ఎలాంటి జాతక దోషాలు లేవు, పరిహారాల అవసరం అసలే లేదు. అతని భవిష్యత్తు గురించిన చింత విడనాడండి. నా మాట పొల్లుపోదు! నేను చెప్పినది నిజమై తీరుతుంది. " అని చెప్పాడతను.
అతనికి వినమ్రంగా నమస్కరించి పిల్లలిద్దరి జాతకాలు సంచీలో పెట్టుకొని ఇంటి ముఖం పట్టాడు పురుషోత్తం. జాతకాలు చెప్పడంలో ఉద్ధండుడైన మార్కండేయ శర్మ మాటలు నిజమవ్వాలని మనసులో కోరుకున్నాడు పురుషోత్తం. అయితే అతని మనసులో అనేక సందేహాలు మెదులుతున్నాయి. పెద్దవాడిలానే చిన్నవాడు కూడా ప్రయోజకుడైతే తనకు అంతకన్నా ఏమి కావాలి? శర్మగారి మాటలు పురుషోత్తంలో ఆశలు రేకెత్తిస్తున్నా అదెలా సాధ్యమో ఎంతమాత్రం బోధపడటంలేదు. చదువులో అంతంత మాత్రంగానే ఉన్నా, ఊళ్ళో ఎక్కడ గొడవ జరిగినా అందులో తల దూరుస్తూ ఉంటాడు. నెల రోజుల క్రితం రాఘవ తన తోటి విద్యార్థిని కొట్టాడని స్కూలు నుండి ఫిర్యాదు వస్తే తల దించుకొని అందరి మాటలు పడవలసి వచ్చింది. చివరికి స్కూలు ప్రిన్సిపాల్ కూడా తనని గట్టిగా హెచ్చరించాడు.
"ఇలాగైతే మీ వాడ్ని స్కూలు నుండి పంపించి వేయాల్సి ఉంటుంది. మీ పెద్దవాడికి వీడికి ఎంత తేడా! రాఘవని మీరు అదుపులో పెట్టుకోండి. " అని తీవ్రంగా హెచ్చరించాడు.
ఆ విషయంలో రాఘవని మందలిస్తే, "నేనేం తప్పు చెయ్యలేదు నాన్నా! అనీష్ చాలా అల్లరి అబ్బాయి. గోపాల్ ని కావాలని తోసాడు. పాపం గోపాల్ కి పోలియో వల్ల ఒక కాలు చచ్చుబడి పోయింది. నేను మందలించాను, అంతే! ముందు నేను కొట్టలేదు. వాడే నన్ను రెచ్చగొట్టడంతో బుద్ధి చెప్పవలసి వచ్చింది!" అన్నాడు.
ఏం చెప్పాలో ఒక్కక్షణం అర్ధం కాలేదు పురుషోత్తంకి.
"అయినా అనీష్ సర్పంచ్ గారి అబ్బాయి. పెద్దవాళ్ళతోగానీ, వాళ్ళ పిల్లలతోగాని తగువులు పెట్టుకోకూడదు. ఇక ముందు ఇలాంటి గొడవలు మాత్రం చెయ్యకు. " అన్నాడు.
"కళ్ళముందు అన్యాయం జరుగుతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను నాన్నా!" అన్నాడు రాఘవ. పెద్దవాళ్ళు చెప్పే నీతికి, నడవడికకి పొంతన లేదన్న భావం వాడి కళ్ళలో ప్రస్ఫుటంగా కనపడింది పురుషోత్తంకి.
రాఘవ మాటల్లో నిజం ఉన్నా, "ఈ తెలివితేటల్ని చదువులో ఉపయోగించు, బాగుపడతావు. అన్నని చూసి బుద్ధి తెచ్చుకో! అంతేకాని, మనకి సంబంధంలేని విషయాల్లో తలదూర్చకు. " అని మాత్రం అనగలిగాడు పురుషోత్తం. అయితే, ఆ తర్వాత కూడా చాలా సార్లు రాఘవ ప్రవర్తన వల్ల సంజాయిషీలు ఇచ్చుకోవలసి వచ్చింది అతనికి.
రేషన్ డిపో షాహుకారుతోనూ, వార్డ్ మెంబర్ మస్తాన్ రావుతోనూ, కంట్రాక్టర్ కనకారావుతోనూ మాటలు పడవలసి వచ్చింది పురుషోత్తంకి రాఘవ కారణంగా. లిక్కర్ షాప్ ఓనర్ ఓబులేసు అయితే చాలా అవమానకరంగా మాట్లాడాడు. ఎప్పుడే ఘనకార్యం చేసి కొంపమీదకు తెస్తాడో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. రాఘవ కారణంగా బంధువర్గంలో పలచనయ్యాడు, స్నేహితుల మధ్య కూడా పరువు పోయింది పురుషోత్తంకి. అలాంటి రాఘవ తనకి తలవంపులు కాక, తలెత్తుకొనేలా ఎలా చేస్తాడో ఏమాత్రం బోధపడలేదు పురుషోత్తంకి. మార్కండేయ శర్మగారి మాటలు ఎలా నిజమవుతాయో మరి! ఇలా ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాడు పురుషోత్తం.
******
వెంకట్ కి రాఘవకి వయసులో రెండేళ్ళు తేడా. వెంకట్ పదవ తరగతి మంచి మార్కులతో పాసై కాలేజీలో చేరాడు. ఆ తర్వాత ఎంసెట్ లో మంచి ర్యాంక్ సాధించి ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో చేరాడు. పురుషోత్తం భావించినట్లే సాగింది వెంకట్ చదువు. క్యాంపస్ సెలెక్షన్ లో ఆరంకెల జీతంతో మంచి ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. బెంగుళూరులో ఉద్యోగంలో చేరాడు వెంకట్. రెండేళ్ళ తర్వాత అమెరికా ఆఫర్ వస్తే వెళ్ళాడు. వెంకట్ ప్రయోజకుడైనందుకు చాలా మురిసిపోయాడు పురుషోత్తం. రాఘవ విషయంలో మాత్రం పురుషోత్తం చాలా అసంతృప్తిగా ఉన్నాడు. పదో తరగతి గట్టెక్కడానికి మూడేళ్ళు తీసుకున్నాడు. ఆ తర్వాత ఎలాగోలా కాలేజీలో చేరి డిగ్రీ అయిందనిపించాడు.
మార్కండేయ శర్మ మాటలు గుర్తుకు వచ్చాయి పురుషోత్తంకి. నిరాశగా నవ్వుకున్నాడు. ఏదో మాములు డిగ్రీ చదువుకున్నవాడికి ఎవాళారేపూ ఉద్యోగం ఎవరిస్తారు? రాఘవ భవిష్యత్తే కలవరపరచసాగింది పురుషోత్తంకి.
"వాడివన్నీ తాతపోలికలేరా! ఎక్కడ అన్యాయం జరిగినా సహించడు. వాడి మంచితనమే వాడిని కాపాడుతుంది. వాడిగురించి బెంగపెట్టుకోకు!" అని తల్లి శారదమ్మ చెప్పినా రాఘవ భవిష్యత్తుమీద బెంగ తగ్గలేదు పురుషోత్తంకి.
అలాంటి రాఘవ తనకి, తన వంశానికి కీర్తిప్రతిష్ఠలు ఎలా తెస్తాడు? కనీసం ఏదోలా బతికితే చాలు అని ఓ నిర్ణయానికి వచ్చాడు పురుషోత్తం. తనకి తెలిసిన బ్యాంక్ మానేజర్ ద్వారా లోన్ తీసుకొని ఏదో చిన్న బిజినెస్ పెట్టించాలని అనుకున్నాడు. అదే విషయం రాఘవతో చెప్పాడు.
"నాన్నా! నాకు బిజినెస్ చెయ్యడం ఇష్టం లేదు. నేను ఆర్మీలో చేరతాను! ఆర్మీ సెలెక్షన్ కి వెళతాను!" అని రాఘవ చెప్పేసరికి ఒక్కసారి మాన్పడిపోయాడు పురుషోత్తం.
రాఘవ ఆర్మీలో చేరాలన్న నిర్ణయం ఎప్పుడు తీసుకున్నాడో అర్ధం కాలేదు అతనికి.
"అర్మీలో చేరడమెందుకురా, హాయిగా ఇంటిపట్టునుండి ఓ దుకాణం పెట్టుకొని హాయిగా ఉండక! నాకు తెలిసిన బ్యాంక్ మానేజర్ కి చెప్పానులే, బిజినెస్ కోసం లోన్ అతనిప్పిస్తాడు. " అన్నాడు.
"ప్రతి యువకుడూ అలా అనుకుంటే, మన దేశనికి రక్షణేది నాన్నగారూ! సైనికుడు సరిహద్దుల్లో కాపలా కాస్తేనే కదా, దేశంలో శాంతి సౌఖ్యాలు వెల్లివిరిసేది! భరతమాతకు నా అవసరం చాలా ఉంది నాన్నగారూ!" అని రాఘవ అంటూంటే ఏమనాలో తోచలేదు పురుషోత్తంకి.
తనలాంటి పెద్దవాళ్ళు వల్లించే ఆదర్శాలకి, అచరణకి పొంతనలేదని మాత్రం అర్ధమైంది.
"చూడు రాఘవా! అన్న ఎలాగూ విదేశాలకెళ్ళిపోయాడు. కనీసం నువ్వైనా మా దగ్గర ఉండకపోతే, చివరి రోజుల్లో మమ్మల్నెవరు చూస్తారు?" చివరి అస్త్రం సంధించాడు పురుషోత్తం.
అయినా ఏ మాత్రం చలించలేదు రాఘవ. తన నిర్ణయం మార్చుకోలేదు. తల్లి అనసూయమ్మ కన్నీళ్ళు కూడా రాఘవ నిర్ణయాన్ని మార్చలేకపోయింది.
"అమ్మా! నాన్నా! మీలా అందరూ అనుకుంటే మన దేశాన్ని రక్షించేదెవరు? అందరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లవుదాం, పెద్ద ఉద్యోగాలు చేద్దాం అనుకుంటే సైన్యంలో చేరేదెవరు? మన దేశాన్ని శతృవులనుండి రక్షించేదెవరు? ముష్కరులు బారినుండి సైనికుడు రక్షించకపోతే మీలాంటి ఎంతో మంది గతి ఏమిటి? ఆలోచించండి! తాతగారు కూడా ఆర్మీలో ఉన్నప్పుడు యుద్ధంలో శత్రువులతో వీరోచితంగా పోరాడారుకదా! అతనే నా హీరో! అతని బాటలోనే నడవాలని నేను నిశ్చయించుకున్నాను. నన్ను ఆపవద్దు!" అన్నాడు.
శాంతమ్మ మనవడివైపు సజల నయనాలతో చూసింది.
"మీ తాత పేరు నిలబెట్టాలిరా మనవడా! మన భారతదేశం ముద్దుబిడ్డవి నువ్వు. " అని మనసారా దీవించిందామె.
రాఘవ ఒకప్పుడు చదువులో వెనకబడి ఉండినా, ఇప్పుడు మాత్రం ఆర్మీ టెస్టులో నెగ్గాడు. ఉద్యోగంలో జాయినయ్యాడు. ఆ తర్వాత రోజులు చకచకా గడిచిపోసాగాయి.
పొరుగుదేశాలతో ఉద్రిక్తలు చెలరేగినప్పుడల్లా పురుషోత్తం, అనసూయ దంపతుల గుండెల్లో గుబులు రేగుతూనే ఉంది ఎప్పుడు ఎలాంటి వార్త వినవలసి వస్తుందోనని.
వెంకట్ అమెరికా వెళ్ళిన కొత్తలో ఇంటికి డబ్బులు పంపించినా, రానురాను ఆ విషయమే మర్చిపోసాగాడు. అమెరికాలో కొడుకు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడని చెప్పుకోవడమేకాని, దానివలన పురుషోత్తంకి దక్కిన ప్రయోజనం శూన్యం! ఎలాగో వెంకట్ చదువుకైన అప్పు మాత్రం తీరింది. మరో రెండేళ్ళకి అక్కడే తనతో ఉద్యోగం చేస్తున్న బెంగాలీ అమ్మాయిని వివాహం కూడా చేసుకున్నాడు. వాళ్ళ పెళ్ళికి ఎవరూ వెళ్ళలేకపోయారు. ఇంటికి రావడానికి కూడా వీలులేనంత బిజీగా తయారయ్యారు వాళ్ళిద్దరూ. ఫోనులో మాటలు కూడా అంతంత మాత్రమే!
సరిగ్గా ఇదే సమయంలో మన శతృదేశంతో కార్గిల్ కార్చిచ్చు వ్యాపించింది. ఇరుదేశాల మధ్య యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడు ఏం వార్త వినవలసి వస్తుందోనని గుండెలు అరచేత్తో పట్టుకొని జీవిస్తున్నారు పురుషోత్తం దంపతులు. అయితే శారదమ్మ మాత్రం నిబ్బరంగా ఉంది. కొడుకు, కోడలకి ధైర్యం నూరిపోసేదామె. అయినా పురుషోత్తం దంపతుల మనసులో ఆందోళన తగ్గలేదు. క్షణమొక యుగంలా గడుపుతున్నారు.
చివరికి యుద్ధం ముగిసింది. రాఘవ సురక్షితంగా ఉన్నాడని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు ఆ దంపతులు. ఒకళ్ళ కన్నీళ్ళొకరు తుడుచుకున్నారు.
"చూసారా! నేను చెప్పలేదూ! రాఘవ వాళ్ళ తాతపేరు నిలబెట్టాడు. " అని శారదమ్మ కూడా కన్నీళ్లు ఒత్తుకుంది భర్తని తలచుకొని.
యుద్ధంలో చూపిన పరాక్రమానికి విశిష్ట పతకాలు అందుకొని, పై అధికారుల ప్రశంసలు, సన్మానాలు అందుకొని ఇంటికి తిరిగివచ్చాడు రాఘవ. ఆ రోజు ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. కళ్ళు చెమర్చగా కొడుకును గుండెలకు హత్తుకున్నాడు పురుషోత్తం. ఊళ్ళో అతనిపేరు మీద స్వాగత తోరణాలు ఏర్పడ్డాయి. ఏనోట విన్నా రాఘవ గురించిన మాటలే, ప్రశంసలే! ఆ ఊరి నుండి యుద్ధంలో పాల్గొని వీరోచితంగా పోరాడిన ఏకైక సైనికుడిగా రాఘవ అందరి మన్ననలు అందుకొన్నాడు. అందరూ అతని తాతగార్ని గుర్తు తెచ్చుకున్నారు. ఏ స్కూలు నుండి అయితే ప్రిన్సిపాల్ పంపించేస్తానని బెదిరించాడో, అదే స్కూల్లో రాఘవ సన్మానానికి ఏర్పాట్లు జరిగాయి. ప్రభుత్వం తరఫున జిల్లా కలక్టర్ రాఘవని ఘనంగా సన్మానించడం చూసిన పురుషోత్తం, అనసూయ దంపతుల కళ్ళు చెమర్చాయి. శారదమ్మ సంగతి చెప్పనే అక్కర్లేదు!
రాఘవని విమర్శించిన వాళ్ళే ఇప్పుడు ప్రశంసలు గుప్పించసాగారు. తిట్టిన వాళ్ళచేతే పొగడబడ్డాడు. పురుషోత్తం ఆనందానికి అంతేలేదు. రాఘవ తన వంశ గౌరవం, తాత కీర్తి ప్రతిష్ఠలు నిలబెట్టడం అతనికి గర్వ కారణమైంది. మార్కండేయ శర్మ చెప్పిన జ్యోస్యం నిజమైందని మనసులో అనుకొని చెమర్చిన కళ్ళు తుడుచుకున్నాడు పురుషోత్తం.
జై హింద్!
*************
దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
Comments