వనజ వంట ప్రహసనం - రామారావు అసహనం
- Maddala Bhanu
- Aug 10, 2023
- 4 min read

'Vanaja Vanta Prahasanam Ramarao asahanam - New Telugu Story Written By M. Bhanu
'వనజ వంట ప్రహసనం - రామారావు అసహనం' తెలుగు కథ
రచన: M. భాను
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
పలకరిస్తుంటే బిత్తర చూపులు చూస్తోంది వనజ. కళ్ళు నుండి నీళ్లు ధారాపాతం గా కారిపోతున్నాయి. డాక్టర్లకి కూడా అంతు పట్టడం లేదు వనజ బాధ ఏమిటో.
అప్పటికి వారం నుండి ఇలా సాగుతోంది. ఒకరోజు వనజ హఠాత్తుగా మంచం మీద కూర్చుని భయం భయంగా బిత్తర చూపులు చూస్తోంది, రామారావు ఆఫీస్ నుండి వచ్చేటప్పటికి.
“ఏమైంది వనజా..” అని దగ్గరికి వెళ్ళబోతే ఇంకా ముడుచుకుపోయింది. తలను మోకాళ్ళ మధ్య పెట్టుకుంది.
ఏమైందో తెలియక రామారావు కాసేపు మౌనంగా వనజనే చూస్తూ కూర్చున్నాడు. రామారావును చూస్తుంటే ఇంకా బెదిరిపోయి ముడుచుకుపోతోంది.
రామారావుకి ఏమీ అర్థం కావటం లేదు. రోజు చూసే నన్ను చూసి ఇలా అయిపోతుంది ఏమిటి అనుకున్నాడు.
బయటికి వచ్చి తన అత్తగారికి ఫోన్ చేశాడు. వాళ్లు ఉండేది మూడవ వీధిలో. వనజ పరిస్థితి వివరించి చెప్పాడు. ఇప్పుడే 10 నిమిషాల్లో వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. వనజ తల్లి సీతాయమ్మ పెద్ద కొడుకుని తీసుకుని రామారావు ఇంటికి వచ్చింది. రామారావు ని అడిగింది వనజ ఎక్కడ అని. బెడ్ రూమ్ వైపు చూపెట్టాడు రామారావు.
“సరే మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్తా”నని లోపలికి వెళ్ళింది సీతాయమ్మ.
“రండి బావ.. ఇలా కూర్చోండి” అని రామారావు చేయి పట్టి సోఫాలో కూర్చోబెట్టాడు సుందరం.
“ఏమిటో బావా, ఎప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి కాఫీ చేతిలో పెట్టేది. ఏమైనా తినడానికి ఇచ్చేది. లొడ లొడ మాట్లాడేది. ఇప్పుడు ఇలా! ? ఏమిటో నాకు అర్థం కావట్లేదు” అని కన్నీళ్ల పర్యంతం అయ్యాడు.
సుందరం, “ఊరుకో బావ! ఏమిటి కన్నీళ్లు, డాక్టర్ చూస్తున్నారుగా, ఏమీకాదు, ఏదో చూసి జడుసుకుని ఉంటుంది” అన్నాడు.
“ఏమో బావ! నన్ను చూస్తోనే ముడుచుకుపోతోంది.”
“బావ! ఏమీ అనుకోకు, ఒక విషయం అడుగుతాను, నిజాయితీ గా చెప్పు” అన్నాడు సుందరం.
“నీకు తెలియని విషయం ఏమీ లేదు, సరే అడుగు” అన్నాడు రామారావు.
“మీ మధ్య గొడవ ఏమైనా జరిగిందా? మా చెల్లిని కొట్టేవా? లేక ఏమైనా బెదిరించావా?” అన్నాడు సుందరం
“చ్ఛా! నేను కొట్టడం ఏమిటీ? ఆడవాళ్ళ మీద చెయ్యి చేసుకునెంత మూర్ఖుడిని కాదు. అయినా నా గురించి తెలిసీ ఇలా ఎలా బావా! ?” బేలగా అన్నాడు రామారావు.
“ఆది అంతలా భయపడుతోందని అడిగాను” అన్నాడు సుందరం.
“నీకు తెలుసు కదా! తినే కొంచెం తిండి అయినా శుభ్రం గా, రుచిగా తింటానని. కానీ వనజ కు అసలు వంట మీద శ్రద్ధ ఉండదు. ఆ విషయం తప్ప మా మధ్య గొడవలు ఏమీ ఉండవు”.
సుందరం : ఆ విషయమే ఆలోచిస్తున్నాను, దానికి పెళ్లి కాకముందు నుండీ కూడా వంట చేయటం ఇష్టం ఉండేది కాదు, మేము పెద్దగా ఎప్పుడూ పట్టించుకోలేదు. పెళ్లి తర్వాత అదే నేర్చుకుని చేస్తుంది అనుకున్నాము. ప్రతిరోజూ తిడతావా?” అని అడిగిన బావ వైపు చూస్తూ
రామారావు: నిజం చెప్పనా బావ! పెళ్లి తర్వాత నేను తృప్తిగా గా భోజనం చేసినట్టు గుర్తులేదు. రోజూ ఏదో లోపమే వంట లో. వంట విషయం లో నాకు చాలా కోపం వస్తుంది. ఏమి తిడతానో నాకే తెలియదు.
ఇంతలో సుబ్బాయమ్మ బయటకు వచ్చి అల్లుడిని ఎగాదిగా చూసి, “మా అమ్మాయి కొన్ని రోజులు మా ఇంట్లో ఉంటుంది అల్లుడు” అని చెప్పింది.
దానికి రామారావు “అసలు విషయం ఏమిటీ అత్తగారు” అని అడిగాడు.
సుబ్బాయమ్మ : దాని వంటలకి, నువ్వు తిట్టే తిట్లకి భయపడి చస్తోంది. నిన్ను తలుచుకుంటేనే దానికి వెన్నులో వణుకు పుడుతోంది. అయినా వంట రాకపోతే ఇంతలా బెదరకొట్టాలా! నెమ్మదిగా చెప్పి చేయించుకోవాలి. పోనీ నా కూతురికి రాకపోతే నువ్వు చేసి చూపించొచ్చు కదా! నెమ్మదిగా నేర్చుకుంటుంది. ఇప్పుడు నువ్వు అరిచిన అరుపులకి దానికి భయం పట్టుకుంది. జీవితం మీద విరక్తి వచ్చేసింది.
అయినా అందరికీ అన్నిపుట్టుకతోనే రావు కదా.. నెమ్మదిగా నేర్చుకుంటారు. నేను కూడా అంతే. నా పెళ్లయిన కొత్తలో ఏది సరిగా వండేదాన్ని కాదు. మీ మామ గారు నెమ్మదిగా ఒకటి ఒకటి అలవాటు చేశారు. అప్పుడప్పుడు మా అత్తగారు వచ్చి చెబుతూ ఉండేవారు. ఇప్పుడు మీకు పెళ్లి అయిన కొ. దానికి పనులు ఇంకా రావు, అంతగా అయితే మీ అమ్మగారిని వచ్చి కాస్త నేర్పించమను. ఇప్పుడు మాత్రం మా ఇంటికి తీసుకెళ్ళి ఒక నెల తర్వాత పంపుతాను” అని ఖరాఖండిగా చెబుతున్న అత్తగారు వైపు చూడలేక నేను చూపులు చూస్తున్నాడు రామారావు.
“నన్ను క్షమించండి. ఏదో జిహ్వచాపల్యం చేత మాటలన్నీ అన్నాను. దాన్ని మనసుని ఇంత గాయపరుస్తాయి అనుకోలేదు. దానికి వంట రాకపోయినా పర్వాలేదు, నన్ను చూసి భయపడొద్దు అని చెప్పండి.”
“సరే మేం బయలుదేరుతున్నాము, వనజ తో మాట్లాడి మా ఇంటి దగ్గర దిగపెట్టు” అని కొడుకుని తీసుకుని బయలుదేరింది సుబ్బాయమ్మ.
నెమ్మదిగా వనజ దగ్గరికి వెళ్ళాడు సుందరం, అతనిని చూడగానే మోకాళ్ళలో మొహం దాచుకుంది.
“వనజ.. నన్ను క్షమించు” అని తల మీద చేయి వేసి మృదువుగా నిమురుతూ “నా మాటలు నిన్ను ఇంత గాయపరుస్తాయి అనుకోలేదు. ఏదో తిండి మీద ప్రేమతో అలా ప్రవర్తించాను.
నువ్వు ఏమి మనసులో పెట్టుకోకుండా మీ అమ్మగారింటికి వెళ్లి నాలుగు రోజులు ఉండి రా, నువ్వు ఎలా వండినా పర్వాలేదు. అందరికీ అన్ని రావు కదా.. నెమ్మదిగా నేర్చుకుందుగానివి లే” అని చెబుతున్న భర్త మొహంలోకి కన్నీళ్ళతో చూసింది.
వనజకి వాళ్ళ ఇంట్లో మడి చేత వంటగదిలోకి రానివ్వకుండా చిన్నపిల్ల అని గారాబం చేత పెంచడంతో వంట తప్ప అన్ని పనులు వచ్చు. చక్కగా టైలరింగ్ చేస్తుంది బొమ్మలు వేస్తుంది, తోట పని చేస్తుంది, ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటుంది.
ఇంకా భర్త తిడతాడనే భయం చేత శ్రద్ధగా చేసినా ఎక్కడో ఒకచోట లోపంతో రోజు తిట్లు తినవలసి వచ్చేది. భర్త తిడతాడు అనే భయం ఆలోచనతో వంట చెడిపోయేది. అదే భర్త, వనజకి కాస్త ఓపికతో ఇవాళ పప్పులో ఉప్పు కాకుండా ఉప్పులో పప్పు ఎక్కువైనట్టుంది, కోపంగా ఉన్నావా కూరలో కాస్త కారం ఎక్కువైంది.. అనే సరదా మాటలతో మార్చుకోవాల్సింది.
అలా కాకుండా ‘నేను మగవాడిని, నాకు ఇలా వండి పెట్టు’ అని అహంకారంతో ప్రవర్తిస్తే సగటు ఇల్లాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది.
నెమ్మదిగా వనజని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ గారి ఇంట్లో దిగబెట్టి వచ్చాడు.
* అందరికీ అన్ని పుట్టుకతో రావు. కొంతమంది నెమ్మదిగా నేర్చుకుంటారు. అంత మాత్రం చేత వాళ్ళని పనికిమాలిన వాళ్ళని, ఏ పని సవ్యంగా చేతకాదని, శ్రద్ధగా చేయరని అనే మగవాళ్ళని చూస్తే జాలి వేస్తూ ఉంటుంది. *
- M. భాను
***
M. భాను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
నమస్తే అండి. నా పేరు భాను. నేను టీచర్ గా పని చేసి ఉన్నాను. కథలు వ్రాయాలి అని తపన. వ్రాస్తూ ఉంటాను. ప్రస్తుతం నేను మావారి ఉద్యోగరీత్యా రంపచోడవరం లో ఉంటాను.
ధన్యవాదములు 🙏
Comments